నేను వృత్తిరీత్యా 2010 వరకు స్కూల్ అసిస్టంట్ (సోషల్ స్టడీస్) కావడం కారణంగా పాఠశాలల్లో సాఘికశాస్త్రాన్ని భోదిస్తూ ఉండేవాడిని. బై చాయిస్ కూడా నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని కావాలని కోరుకున్నవాడిని. అందుకు కారణం నా హైస్కూలు జీవితంలో మాకు సాంఘికశాస్త్రాన్ని అద్భుతంగా భోదించిన రొక్కం తాతారావు గారు. ఆయన ఏ పాఠం భోదించినా అద్భుతంగా ఉండేది. పాఠం చెప్పడం అంటే అలా చెప్పాలి అనుకొనేవాడిని. అదే నన్ను స్కూల్ అసిస్టంట్ సోషల్ స్టడీస్ గా చేసింది.
ఆ విధంగా సాంఘిక శాస్త్ర అధ్యయనంపైనా, భోదనపైనా అభిరుచి కలిగింది. ఆ అభిరుచి కార్, గార్డెన్ చైల్డ్, డి డి కోశాంబి, రొమిల్లా థాపర్ వంటి వారు వ్రాసిన చరిత్ర పుస్తకాలను విస్తృతంగా చదివేట్లు చేసింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి చరిత్రను, అర్థ శాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని , భూగోళ శాస్త్రాన్ని భోదిస్తూ ఉండడం వలన ఆయా శాస్త్రాలను క్షుణ్ణంగా చదువుకొనే అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాలకోసం నిర్వహించే dsc అభ్యర్థులకోసం నేను వ్రాసిన “సాంఘిక శాస్త్ర భోదనా పద్దతులు” దాదాపు లక్ష కాపీలు రెండు తెలుగు రాష్ట్రాలలో అమ్ముడు అయ్యాయి. ఈ అంశాలు అన్నీ కూడా నన్ను సాఘిక శాస్త్ర భోదన పట్ల , అధ్యయనం పట్ల మరింత ఆసక్తిని కలుగజేశాయి.
ఇటీవల కాలంలో ‘కాల చక్రం’ పేరుతొ అంధ్రప్రదేశ్ లో చారిత్రిక కథల రచన ఆవశ్యకతను తెలుపుతూ ఒక కార్య శాల జరిగింది. అందులో చారిత్రిక కాల్పనిక రచనలు రావలసిన అవసరాన్ని గుర్తించి విరివిగా రచయితలు అటువంటి కథలు వ్రాయవలసినదిగా వారు పిలుపును ఇచ్చారు. ఆలస్యంగా కథారచనలో ప్రవేశించిన నాకు సాంఘిక శాస్త్రాలపట్ల ఉన్న ఆసక్తి నన్ను స్పందించేట్లు చేసింది.
నేను రాయలసీమ అస్తిత్వ ఉద్యమంలో ప్రత్యక్షంగా , పరోక్షంగా పాల్గొంటున్న రాయలసీమ వాదిని. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగినపుడు రాజకీయ నాయకుల స్వార్థం వలన మనం బళ్ళారిని, హంపినీ కోల్పోపోయామని వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి వారు అభిప్రాయపడ్డారు. దీనివలన రాయలసీమకు చాలా నష్టం వాటిల్లిందని పెద్దలు చెబుతూ ఉంటారు. హంపీని ఆంద్రుల సాంస్కృతిక రాజధానిగా కొందరు వర్ణించారు. అందువలన నాకు హంపీతో ఒక ఉద్వేగవంతమైన బంధం ఏర్పడింది. దానితో పాటు మా అమ్మగారిది బళ్ళారి జిల్లా లోని బలకుంది గ్రామం పుట్టినిల్లు కావడం మూలానా, అమ్మ వైపు బందువులు అందరూ కర్నాటకలో ఉండడం మూలానా నేను తరచుగా బళ్ళారి జిల్లాకు వెళుతూ ఉంటాను. మా అమ్మ నాన్నల కర్మకాండలే కాకుండా మా అమ్మ వైపు బందువుల మరణాంతర క్రియలు హంపిలోనే చేస్తుండడం కారణంగా ఎక్కువరోజులు హంపీలో ఉండవలసి వస్తోంది. హంపీలో ఉన్నన్ని రోజులు చాలా ఉద్వేగానికి గురి అవుతుంటాను. హంపీలో బాడుగ సైకిలు తీసుకొని హంపీ అంతా తిరుగుతుంటాను. ఒకరోజు మా పిల్లలందరినీ సైకిళ్ళపై హంపీలో తిప్పాను. హంపీ మనది అనే భావన హృదయం నిండానింపుకున్న వాడిని. అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా హంపీ కు వెళ్ళిపోతూ ఉంటాను.
పైన పేర్కొన్న మూడు కారణాల మూలంగా విజయనగర సామ్రాజ్యం నేపధ్యంలో ఒక చారిత్రిక కాల్పనిక కథ వ్రాయాలనే కోరిక కలిగింది. అందు కారణంగా విజయనగర చరిత్రను అధ్యయనం చేయడం ప్రారంభించాను. దాదాపు ఒక సంవత్సర కాలం అధ్యయనం చేశాను. ఆధార గ్రంధాలు అన్నీ నవల చివరలో పేర్కొన్నాను. విజయనగర సామ్రాజ్యం అనగానే అందరి దృష్టి కృష్ణదేవరాయలి వైపు మళ్ళుతుంది. ఇప్పటికే ఆయన కేంద్రీకృతంగా అనేక రచనలు వచ్చాయి. నా పరిశీలనలో 1935 నుండి 1956 ల మధ్య పదుల సంఖ్యలో విజయనగర సామ్రాజ్యం గురించిన అనేక పుస్తకాలు వెలువడ్డాయి. అవన్నీ కూడా గుంటూరు , కృష్ణా జిల్లాల రచయితలనుండే కావడం నన్ను ఆశ్చర్య పరచింది. అందు కారణంగా కృష్ణదేవరాయల కాలం కాకుండా అళియ రామరాయలి కాలం తీసుకొన్నాను. ఈ నాటి యువతలో చాలా మందికి చరిత్ర అంశాల పట్ల ఆసక్తి లేకపోవడాన్ని గమనించి ఒక ప్రేమ కథ రూపంలో చారిత్రిక విషయాలను చెప్పవచ్చు అని భావించాను. ముఖ్యంగా సామాన్యుడి దృష్టి కోణంలో వ్రాయాలి అనుకొన్నాను. అందుకోసమే సంబజ్జ గౌడ అనే ఒక బహుజనుడిని నాయకుడిగా ఎన్నుకొన్నాను. సంస్కృతికి సంబందించిన విషయాలను అంతర్భాగం చేసేందుకు వీలుగా భామాకలాపం ప్రదర్శనలో నిష్ణాతులైన కుప్పాయి వంశానికి చెందిన ముద్దుకుప్పాయి ను నాయకిగా ఎంపిక చేసుకొన్నాను.
అరుంధతి రాయ్ గారు ఒక ఇంటర్వ్యూ లో భారతీయ సమాజం బహుముఖీయమైనదని చెబుతూ దాని పునాదుల్లోనే వివిధ వర్గాల మధ్య సామరస్యం అనేది అంతర్భాగంగా ఉందనీ, భారత సమాజంలోని సామరస్యానికి వచ్చిన ముప్పు ఏమీ లేదని పేర్కొన్నది. నేను విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేస్తున్నప్పుడు అది వాస్తవం అనిపించింది. అళియ రామరాయలు ముస్లింలను తన సైన్యంలో చేర్చుకొన్నాడు. గోవధకు వారికి అనుమతి ఇచ్చాడు. తురక వాడలు నిర్మించాడు.
ఇస్లాం పట్ల విశ్వాసం లేని వారికి ముస్లిం మతస్తులు అభివాదం చేయరని తెలుసుకొన్న అళియ రామరాయలు తన సింహాసనం ప్రక్కన బంగారుసింహాసనాన్ని ఉంచి దానిపై పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని ఉంచారు. దాయాదుల చేతుల్లో ప్రాణ భయం ఉన్న బాలుడైన బిజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్షాను చేరదీసి రక్షణ కల్పించాడు. ఆపద సమయాలలో గోల్కొండ నవాబుకు సాయం చేశాడు. అందుచేతనే తళ్ళికోట యుద్ద సమయంలో అలీ ఆదిల్ షా , గోల్కొండ నవాబులు మొదట యుద్దంలో అహమ్మద్ నగర్ పక్షాన చేరడానికి నిరాకరిస్తారు. అయితే బిజాపూర్ నవాబ్ ను భయపెట్టి తమ పక్షాన యుద్దంలో చేరేటట్లు చేస్తారు. అళియ రామరాయలను యుద్ధంలో బందించి అహమ్మద్ నగర్ సుల్తాన్ ఉన్న గుడారం దగ్గరకు తీసుక వచ్చినప్పడు అక్కడ ఉన్న వైద్యుడు ఒకరు అళియ రామరాయలను వెంటనే చంపివేయమని, గోల్కొండ, బిజాపూర్ నవాబులు వస్తే చంపడానికి ఒప్పుకోరనీ, చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుందని ఒత్తిడి చేస్తాడు. దాంతో అహమ్మద్ నగర్ నవాబు అళియ రామరాయలను చంపివేస్తాడు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు కొన్ని స్వార్థపర శక్తుల సృష్టి అని మనకు తెలుస్తోంది.
ఈ నవలలో కనకదాసర తత్వాన్ని సంబజ్జ గౌడ వాళ్ళ నాన్న పాత్ర ద్వారా చెప్పించాను. ఆ కాలం నాటకే కనకదాసరు దళిత బహుజనవాదాన్ని ప్రచారం చేసినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. నాటి సమాజంలోని వివిధ వృత్తులవారు ముప్పై ఆరురకాల పన్నులు కట్టడంలో ఏవిధంగా ఇబ్బందులు పడ్డది చెప్పే ప్రయత్నం చేశాను. వేశ్యల నుండి వసూలు చేసిన పన్నులు సైనికుల జీతాల చెల్లింపులకు వాడిన విషయం మనకు విజయనగర సామ్రాజ్యపు చీకటి కోణాలను తెలియపరుస్తోంది. యుద్ధ సమయాలలో వారి వేదనలు వర్ణనాతీతం. విజయనగర సంపాదకు ప్రధానంగా రెండు కారణాలు కనిపించాయి. ఒకటి ప్రజలనుండి వసూలు చేసిన పన్నులుకాగా రెండవ కారణం శత్రు రాజ్యాలను ఓడించి అక్కడినుండి కొల్లగొట్టి తెచ్చిన సంపద. ఒకవైపు విజయనగర వైభవం గురించి చెబుతూనే అప్పటి చీకటి కోణాలను కూడా చెప్పే ప్రయత్నం చేశాను. హంపీ నగరవాసుల కష్టాల గురించి చదివినపుడు R.S. రావు గారు ‘అభివృద్ధి వెలుగు నీడలు’ అనే పుస్తకంలో దీపపపు స్తంభంచుట్టూ కొంత నీడ ఉంటుందని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. విజయనగర సామాన్య ప్రజానీకం ఆ చీకటిలోనే ఉన్నారని అనిపించింది.
ఈ నవలలో ఆనాటి సాంఘిక విషయాలనే కాకుండా సాంస్కృతిక విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేశాను. వారి ఆహారపు అలవాట్లు, ధరించిన ఆభరణాలు, కట్టుకొన్న వస్త్రాలు, చేసికొన్న పండుగలు, వారి వినోదాలు, గృహ అలంకరణలు వంటి విషయాలను కథనంలో అంతర్భాగం చేశాను. మహార్నవమి దిబ్బ దగ్గర అట్టహాసంగా జరిగే దసరా వేడుకల వర్ణనతో నవల ప్రారంభం అవుతుంది.
గతకాలం నాటి విషయాలను వర్తమానంలో నిలబడి వ్యాఖ్యానించె ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో తళ్ళికోట యుద్దాన్ని వ్యాఖ్యానించాను. స్రీల, సామాన్యుల కష్టాల గురించి చదివినప్పుడు నా గుండె బరువెక్కింది. ముఖ్యంగా తిరుమలరాయలు హంపినగరంలోని ప్రజానీకాన్ని వారి మానాన వారిని వదలివేసి అపారసంపదతో పెనుగొండకు తరలి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల అగచాట్లు తలచుకొంటే కన్నీరు ఆగలేదు. సల్మా అహమ్మద్ ఫరూకీ పాత్ర ద్వారా సూఫీ తత్వాన్ని చెప్పించాను.
మనం కేవలం మతోన్మాదుల కారణంగా జరుగుతున్న చెడును గురించే కాకుండా అంతకు మించి కొన్ని వేల రెట్లుగా సమాజంలో అంతర్భాగంగా ఉన్న సామరస్యాన్ని సాహిత్యంలో భాగం చేయవలసిన అవసరం ఎంతో ఉందనిపిస్తోంది. చెప్పడానికి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ నేను మీకు చెప్పడం కన్నా మీరే “ప్రణయ హంపీ” నవలను చదివి తెలుసుకోవడం ఉత్తమం.
*
చారిత్రక కాల్పనిక కథను విభిన్నమైన శైలిలో రచించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది నవల. ఇటీవల కాలంలో వచ్చిన ఒక అరుదైన నవలగా దీనిని పెర్కొనవచ్చు. అనవసరమైన వాక్యం ఒక్కటి లేదు. సర్వకాలలో నిలచిఉండే వాక్యాలు అనేకం నవలలలో ఉన్నాయి. రచయితకు, ప్రకాశకులు చాయా వారికి అభినందనలు .
Thank you sir