పిల్లలూ దేవుడూ చల్లని వారే అన్నది ఒక నానుడి, లేదా పిల్లల దినోత్సవం రోజున వినబడె ఒక సూపర్ హిట్ సాంగ్.. వాళ్ళ మాటల్లో కల్లా కపటం ఉండదు. వాళ్ళని మనం అర్ధం చేసుకోవడం లోనే ఉంటుంది విషయం అంతా, మనని వాళ్ళు అసలు అర్ధం చేసుకోరు అని అనుకుంటూ ఉంటాం. మనుషులకు అది చిన్నవాళ్లయినా పెద్ద వాళ్ళయినా వాళ్ళకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ వాళ్ళ వయసును బట్టి లేదా ఆలోచన పరిధిని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.ఒక్కోసారి చిన్న పిల్లల మాటల లోతుని మనం అర్ధం చేసుకోలేక పోవచ్చు కూడా అది ముమ్మాటికీ మన తప్పే.మనకి సమయం లేదు, ఆలోచన పరిధి లేదు.
తల్లిదండ్రులు ఉన్న పిల్లల ది ఒకదారి. తండ్రి లేని పిల్లలకు అమ్మ దారిచూపితే ఉండే పరిస్థితులు వేరు. లిఖిత్ కుమార్ మన అందరి ముందు పెరుగుతున్న పిల్లవాడు.
కవిత్వాన్ని ఇష్టపడుతూ, కవిత్వంతో జీవిస్తూ, అందుకు అవసరమైన వాతావరణాన్ని తన చుట్టూ పరుచుకుంటున్న వాడు. ఇంతమంది కవుల మాటల్ని, వాళ్ళ అక్షరాలని అందంగా పేర్చి పెడుతూ తాను కవిత్వం వైపు మళ్ళకుండా ఎలాఉంటాడు.. అందుకే తాను కూడా కవిత్వాన్ని ప్రేమిస్తున్నాడు. తనగుండెలో రగులుతున్న భావాలకు ఒక రూపం ఇచ్చే పని చేసాడు.. సఫలం చెందాడు. ఈ కవిత రాసే సమయానికి లిఖిత్ వయసు కేవలం పదిహేడు..
మీరూ చదవండి ఎక్కడైనా మీరో, మీకు తెల్సిన వ్యక్తుల జీవితాలో లేదా.. మనకి కావాల్సిన వాళ్ళ జీవితాలో మన కళ్లముందే మెదుల్తాయి. అక్కడక్కడ కొన్ని వాక్యాలు కంటి చివరతడి చేస్తాయి.
కుట్టు_ఎవుసం
-లిఖిత్ కుమార్ గోదా
నా ఏడో ఏటా,
మా నాన్నకి మధుమేహం వచ్చి
మహా వృక్షం లాంటి నాన్న శరీరం తరుగుతున్నప్పుడు,
అమ్మ మా బతుకు మొక్కలను
తన భుజాల పెరట్లో పెంచుకోవడం మొదలెట్టింది.
మా బతుకు మొక్కలను పరమాన్నాలతో పండించడానికి,
అమ్మ కుట్టు మిషన్ తో దోస్తీ కట్టింది.
అప్పటి నుంచి
మా ఇంట్లో
అమ్మ నాన్నై బరువు మోయడం,
నాన్న అమ్మై ఇంటిని కాయడం,
మా ఇద్దరి జీవితాలు
కొత్త అవతారంతో వెలిగాయి..
అందరి బాధ్యతాయుత తల్లిలాగే
అమ్మకి కూడా సూర్యోదయం కంటే ముందే
కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి..
తలంటు స్నానం చేసుకొని
తులసమ్మని పూజించడం అమ్మ రోజు విధి.
దర్జీ అయిన అమ్మకి,
కత్తెర, సూది, దారం ,కొలతలు టేపు
దేహంలో అవయవాలు.
కుట్టు మిషనూ శరీరం..
నాట్లు వేసేటప్పుడు భూదేవిని
మొక్కుకునే హాలికునిలాగా,
పొద్దున్నే కుట్టు మిషన్ ఎక్కగానే,
“మాకు అన్నం పెట్టే తల్లి..
నీకు వందనాలు” అంటూ
కుట్టు మిషన్ ని ఆరాధ్యదైవంగా,
పంట పండించుకునే పైరులా భావిస్తుంటే,
అమ్మ నుంచి
“పని గౌరవం” మా గుండెల్లో మొలుస్తుంది.
డీజు ముక్కల సహాయం తీసుకోదసలు,
అమ్మకి తన కుడిచేతి బొటనవేలి గోరే,
తన మార్కర్…
ఉలి శిల్పి చేతిలో ఎలా ప్రేమతో ఒదిగి పోతుందో,
అమ్మ చేతిలో కత్తెర కూడా అంతే..
చేతి కత్తిర అమ్మకు గాజుబొమ్మ లాంటిది.
కింద పడిపోకుండా ఎంత జాగ్రత్త పడుతుందో..
ఎప్పుడూ మొండివైఖరిగా వ్యవహరించే
మా అన్నదమ్ముల్లాంటి సూది దారాలను చూసినా,
అమ్మకు విసుగసలు రాదు ఎందుకో..?
తనకు మేమంటే ఎంత లాలనో,
తన కుట్టు మిషనన్నా, సూది దారాలన్నా అంతే..
అమ్మ సహనం సూది దారాల గొడవ
సద్దుమణిగేలా చేసినప్పుడే
నాకు బోధపడుతుంది…
హెడ్ చక్రానికి, స్టాండ్ చక్రానికి
తాడు నాగలి తొడిగి,
దుస్తులను సాగుచేస్తూ
అమ్మ “కుట్టు ఎవుసం” చేస్తుంది..
కొలతల అంశం తీసుకోకుండా
ప్రేమతో సూదికి దారానికి స్నేహం కలిపి
మోడల్ డ్రెస్సులను, జాకెట్లను కుట్టేసి
అందంగా ఒంటిని కప్పేస్తుంది.
పొద్దున్నుంచి సాయంత్రం వరకు
కూర్చొని పనిచేసే అమ్మని చూస్తే,
తపస్సులా అనిపిస్తుంది
అమ్మ పని తీరు..
రాత్రి పూటే,
అన్నం మెతుకులు, మంచినీళ్లు
అమ్మ ముఖాన్ని చూసేది..
పొద్దంతా బట్టలోళ్ళు అమ్మను
తినేస్తూ, తాగేస్తారు కదా..
శుభకార్యాలప్పుడు
బ్లౌజుల సదనానికి
రాత్రి ఆకాశంలో నుండి
రంగు రంగుల చంకీలు కోసుకొచ్చి,
లైటింగ్ అమర్చుతుంది.
అప్పుడప్పుడు అమ్మ వెంట
నేను,తమ్ముడు చంకీలను అమర్చే వాళ్ళం..
ఎప్పుడూ
అది మా జీవితాలలో
మిగిలిపోయే ఆత్మీయ అనుభూతి..
ఎండాకాలంలో
విరగ కాసిన మామిడి పళ్ళలా
మా ఇళ్లు చెట్టు నిండా,
గదుల కొమ్మలకి,
బట్టల మామిడి పళ్ళు ఉంటుంటాయి..
మా జీవితాలు విరగపండి,
పువ్వులా విరబూసేది కూడా అప్పుడే మరి..
పండుగైన, పబ్బమైనా
పెళ్లిళ్లైనా, పేరంటాలైనా
ఊరంతా అమ్మ కుట్టిన హరివిల్లులు ధరించి,
మురిసిపోతుంది.
కానీ అమ్మకి,
మా బ్రతుకు మొక్కల బాధ్యత యాదొచ్చి
ముక్క చీరలను ముత్యాలుగా చే(చూ)సుకుంటుంది..
మేము ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని,
నలుగురిలో గొప్పగా నవ్వుతూ ఉండాలని,
వాళ్లని వీళ్ళని చూసి,
వాళ్లు వీళ్లు చెప్పింది ఆలకించి,
అమ్మ తన కుట్టు ఎవుసాన్ని,
రాత్రి కూడా పండించడం మొదలెట్టింది.
అప్పుడు నాకు పదేళ్లు..
ఒకో రాత్రి అలసటొస్తే,
కుట్టు మిషనే అమ్మ నిద్రించే
నవ్వారు మంచం అవుతుంటుంది..
కొన్ని కళ్లకు అమ్మ కాయకష్టం,
అత్యాశ లాగా అర్థమవుతుంది కానీ,
ఆ అత్యాశ లో ఎంత గొప్ప బాధ్యత దాగుందో
అది మా ముగ్గురికే ఎరుక..
నిన్నటి వరకు అమ్మ మాకోసం “కేవలం దర్జీ”,
ఈరోజు,
టైలరింగ్ మాస్టర్ అయ్యింది.
మాకు
అమ్మ, అమ్మ మాత్రమే కాదు
బాధ్యతలు చూసే
నాన్న కూడా..
•••
“అందరి బాధ్యతాయుత తల్లిలాగే
అమ్మకి కూడా సూర్యోదయం కంటే ముందే
కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి”
పుట్టిన దగ్గరనుంచి అమ్మని చూడడం వేరు, అమ్మ ప్రేమని పొందడం వేరు,అమ్మతో హాయిగా జీవించడం వేరు.ఇవన్నీ బాల్య స్మృతులుగా మనం రాసుకున్న కవితల్లో ఉండొచ్చు. పై వాక్యాల్లో నాకు లిఖిత్ ఈ కవిత ఎందుకు రాయాలి అనుకున్నాడో అర్ధం అయింది. అమ్మకుండే బాధ్యత ని గుర్తుచేసుకుంటున్నాడు. సూర్యోదయం కంటే ముందుగా అమ్మ కనురెప్పలు తెరుచుకుంటాయి అని ఒక వాస్తవంగా జరిగిన వాస్తవాన్ని మనకి చెప్పే ప్రయత్నం లో నిజాయితీ ఉంది. అక్కడే ఈ కవి విజయం సాధించాడు.ఎక్కడ లేని పోలికలు కోసం పాకులాడలేదు.తెచ్చిపెట్టుకున్న పదబంధాలో లేక, అభూతకల్పనలో రాయలేదు.తాను ఏ జీవితాన్ని చూశాడో, అనుభవించాడో దాన్నే అక్షరం అక్షరం నింపాడు. ఇదే అతన్ని భవిష్యత్ లో మంచి కవిగా నిలబెట్టే లక్షణం అనుకుంటాను.
ఏడేళ్ల వయసులో నాన్న కరిగిపోయిన్నప్పటి బాధ అమ్మ తన జీవితాన్ని తీర్చి దిద్దుతున్న సంగతి చెబుతూ ఆమె కష్టాన్ని చాలా గొప్పచేసి మాట్లాడతాడు. ఆమె చేసే కుట్టుపనిని వ్యవసాయంతో పోల్చాడు. ఎవరూ సృష్టించకుండా కొత్త పోలికలు ఎలా వస్తాయి. ఈ కింది వాక్యాలు చూడండి
“అప్పుడు నాకు పదేళ్లు..
ఒకో రాత్రి అలసటొస్తే,
కుట్టు మిషనే అమ్మ నిద్రించే
నవ్వారు మంచం అవుతుంటుంది..”
ఆమె పనిలో ఎంత నిమగ్నం అయి ఉంటుంది అన్న విషయాన్ని ఎక్కడా దారి తప్పకుండా పోలికల్తో చెప్పే ప్రయత్నం చేస్తాడు లిఖిత్… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కవితలో ప్రతీ వాక్యాన్ని కోట్ చేయాలి.
సాహిత్యాన్ని ఎక్కువగా చదివితే మంచి వస్తువును మేలిమి కవితగా మలచగలిగిన శక్తి ఇతనికి ఉంది. కవిత్వానికి అకవిత్వానికి తేడా తెల్సుకున్నప్పుడు లిఖిత్ ఇంకా గొప్ప అభివ్యక్తిని రాయగలడు. భరోసా ఉంచదగిన యువకుడిగా లిఖిత్ కనబడుతున్నాడు. అతను తెలుగు నేల గర్వించదగ్గ కవుల్లో ఒక కవిగా పరిణితి చెందుతాడని ఆశిద్దాం.
*
మనసునుండి వచ్చే దేదైనా గొప్ప గా ఉంటుంది కవికి శుభాశీస్సులు
బాగా రాసావు అనిల్ …లిఖిత్ కుమార్ ఇంకా విరివిగా రాయాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్యూ వెరీ మచ్ టు అనిల్ డ్యాని అన్న అండ్ సారంగ టీం… ఈ అవకాశం ఇచ్చినందుకు…
లిఖిత్ కుమారు కదిలించేలా రాశాడు అమ్మ గురించి. అంత మంచి కవితని పరిచయం చేసినందుకు అనిల్ డ్యాని కి థాంక్స్