వాళ్ళు నృత్యాలు చేస్తారు

వాళ్ళు నాట్యం చేస్తారు
గుంపులు గుంపులుగా కదులుతూ
లయబద్ధం లేకుండా ఊగుతూ
చేతుల్లో తుపాకులు గాల్లో ఊపుతూ
చెవులు బద్ధలయ్యే శబ్దాలతో మ్యూజిక్ లు పెట్టుకొని
వాళ్ళు నృత్యాలు చేస్తారు
మద్యాన్ని సేవిస్తూ
మాంసాహారాన్ని పీక్కుతింటూ
పెద్ద పెద్దగా గొంతులెత్తి అరుస్తూ
పాటలు పాడుతూ
వేసుకున్న చొక్కాలు విప్పి గాల్లో గిరగిరా తిప్పుతూ
వాళ్ళు నృత్యాలు చేస్తారు
వాళ్ళ ముఖాల్లో
కౄరమైన ఆనందం తొనకిసలాడుతుంది
వారి అరుపుల్లో
భయంకరమైన ఉన్మాదం ఉట్టిపడుతుంది
చూసే వారికి బుగులు పుట్టేటట్లు
అప్పుడప్పుడు గాల్లోకి ఎగురుతూ
ఒళ్ళు మరిచిన ఆనందంలో
వాళ్ళు నృత్యాలు చేస్తారు
క్రొన్నెత్తురంటిన వాళ్ళ చేతులు
రక్త హోలీ ఆడటానికి
ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి
పుడమి మేనుపై
తమ ఉక్కు పాదాలతో గాయాలు చేయడానికి
వాళ్ళ కాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి
ఆకు చప్పుడైనా అడుగు అలికిడైనా అణిచివేయడానికి
వాళ్ళ తుపాకులెప్పుడూ లోడ్ చేయబడి సిద్ధంగా ఉంటాయి
ఆదేశాలు రావడమే ఆలస్యం
ఎవ్వరినైనా చుట్టుముట్టి మట్టుపెట్టడానికి
ట్రిగ్గర్ పై వేళ్ళుంచి
వాళ్ళెప్పుడూ సిద్ధంగా ఉంటారు
న్యాయాన్యాయాలతో పనిలేదు వాళ్ళకు
కీ ఇస్తే కదిలే మర మనుషులుగా ఉంటారు వాళ్ళు
వాళ్ళ చరిత్రంతా మారణహోమాల చరిత్ర
వాళ్ళ చరిత్రంతా నెత్తుటి కూడు కుడిసే చరిత్ర
వాళ్ళ చరిత్రంతా ప్రజలను అణిచివేసే చరిత్ర
వాళ్ళ చరిత్రంతా పాలకవర్గాలకు ఊడిగం చేసే చరిత్ర
శతృదేశంపైన విజయం సాధించినందుకు కాదు వాళ్ళ ఆనందం
ఆపదలో చిక్కుకున్న ప్రజలను రక్షించినందుకు కాదు వాళ్ళ ఆనందం
చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి పొందినందుకు కాదు వాళ్ళ ఆనందం
ప్రజల మనుషులను చంపినందుకు వాళ్ళ ఆనందం
ప్రజాయుద్ధ వీరులను చంపినందుకు వాళ్ళ ఆనందం
వాళ్ళు నృత్యాలు చేస్తారు
చొక్కాలు విప్పి గాల్లో ఊపుతూ
మద్యం సేవిస్తూ
మంసాహారాన్ని పీక్కుతింటూ
ఒళ్ళు మరిచిన మైకంలో ఊగుతూ
నెత్తురంటిన చేతులను అటూ ఇటూ తిప్పుతూ
పైశాచిక ఆనందంతో
వాళ్ళు నృత్యాలు చేస్తారు.
*

వెంకట్ నాగిళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు