రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) సంఘానికి వందేళ్లు నిండిన సందర్భంగా మహారాష్ట్ర లోని అమరావతిలో నిర్వహించనున్న సభకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని ప్రధాన వక్తగా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రంలో ఆమె పేరు కూడా వేశారు. ఆహ్వాన పత్రంలో ఆమె పేరు అడిగివేశారో లేదో గానీ విషయం తెలుసుకున్న ఆవిడ సదరు సభకు తాను రాలేను అని నిర్వాహకులకు ఉత్తరం రాశారు.
తన కుటుంబం కొన్ని విలువలతో దశాబ్దాలుగా అంబేద్కర్ ఆలోచనల భావజాలంతో పనిచేస్తున్నాం అంటూ.. తన భావజాలానికి భిన్నమైన ఆ వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదు, అని ఆమె చేసిన స్వాభిమాన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
తరాలుగా తమ కుటుంబం కాపాడుకున్న పరంపరకు విరుద్దమైన పని అని ఆ ఆహ్వానాన్నీ తృణీకరించి తన స్వాభిమాన ధిక్కార ప్రకటన మనువాదులను గంగవెర్రి ఎత్తేలా చేసింది. ఆమె మరెవరో కాదు ప్రముఖ అంబేడ్కరైట్, స్వయంగా అంబేద్కర్ తో కలిసి పనిచేసిన దళిత నాయకుడు గొప్ప రాజనీతిజ్ఞడు, రామకృష్ణ సూర్యభన గవాయ్ సహచరి, చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లి కళామతి థాయి . ఆ ఘటన మూలంగా నిర్వాహకులు అవమానంగా భావించి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో తన కొడుకు అయిన చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద దాడి జరిగింది.
అంత పెద్ద ఉన్నత పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుల దాడి ఎందుకు జరిగింది ?
ప్రసిద్ద ఖజురహో పర్యాటక ప్రాంతంలో ‘ పదో పన్నెండో శతాబ్దానికి చెందిన ప్రాచీన విష్ణు మూర్తి విగ్రహానికి మరమ్మత్తులు జరిపించేలా కోర్టు ఆర్డర్ ఇవ్వాలి’ అని రాకేశ్ కిశోర్ అనే న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. సదరు విగ్రహం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉండడం మూలంగా దాని మీద కోర్టుల జోక్యం కుదరదు అని చీఫ్ జస్టీస్ గవాయ్ అన్నారు . సదరు పిటిషన్ వేసిన న్యాయవాదికి ఆ విషయం తెలియంది కాదు. వాస్తవానికి అది కోర్టు పరిధిలోలేని అంశం. తెలిసి కూడా పదే పదే వాదన చేస్తున్న అతనిని ఉద్దేశించి వెళ్ళి ఆ దేవుడినే అడుగుపో అన్నాడు. ఆ మాటను అవమానంగా భావించిన రాకేశ్ కిశోర్ చీఫ్ జస్టిస్ మీద చెప్పుతో దాడి చేశాడు. పైగా సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా అదే రీతిలో దాడి చేయడానికి కూడా వెనకాడను అని కనీస పశ్చాత్తాపం ప్రకటించకుండా ప్రకటన చేశాడు.
సనాతన వాదానికి యే చిన్న ప్రశ్న ఎదురైనా దాడులు భౌతికంగా నిర్మూలన చేయడం ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవాలకు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని వక్తగా పిలిచినట్టే…
సరిగ్గా ఎనభై తొమ్మిదేళ్ల కింద ఆర్ఎస్ఎస్ కన్నా ముందే ఏర్పడిన “జాత్ పాక్ తోడక్ మండల్ ” అనే సంఘం తమ వార్షిక ఉత్సవానికి అంబేద్కర్ ను ముఖ్యవక్తగా లాహోర్ ఆహ్వానించారు. కుల అసమానతలు తొలగించే లక్ష్యంతో ఏర్పాటు అయిన ఆ సంఘ బాధ్యులు మీటింగ్ జరగడానికి ముందే బాబా సాహెబ్ ను తన ప్రసంగ పాఠాన్ని పంపించాల్సిందిగా కోరారు. ఆ ప్రసంగ పాఠాన్ని ముందే చదివిన నిర్వాహకులు అందులో ఉన్న అంశాలపట్ల అంగీకారం లేదని మీటింగ్ నే రద్దు చేసుకున్నారు. ఆనాడు అంబేద్కర్ కుల నిర్మూలన పట్ల తనకు ఉన్న మేధస్సును జోడించి రాసుకున్న ఆ ప్రసంగ పాఠమే “కుల నిర్మూలన”. నేడు లక్షలాది కాపీలు అమ్ముడు పోయిన విషయం జగత్ విదితమే.
ఆనాడు అంబేద్కర్ కు జరిగిన అవమానం, నేడు గవాయ్ కుటుంబానికి జరిగిన అవమానం రెండూ నాటి నేటి వివక్షతా మూలాలకు ఉన్న ప్రాచీన జాడ్యంను చూపెడుతున్నాయి. ఈ తొంబై ఏళ్లలో ఎన్నో స్వాభిమాన ఉద్యమాలు వచ్చాయి. కుల నిర్మూలన పేరుతో దేశం మొత్తం అంబేద్కర్ చూపిన అడుగు జాడల్లో నడిచారు.
ఈ దేశంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, మత సంబంధిత సంఘాలు అయిన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వేదికలు హిందూ ఐక్యత గురించి, సనాతన ధర్మం గురించి బాహాటంగా మతపరమైన రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఎన్నో చేసారు. ఈ దేశంలో మెజారిటీ పేరుతో దేశరక్షణ పేరుతో జాతీయత పేరుతో ఎన్ని విద్వేష ప్రకటనలను అయినా సహించ గలదు కానీ, ఒక దళిత మహిళ తనకు ఇష్టం లేని రాజకీయ వేదికలను పంచుకోవాలా లేదా అని నిర్ణయించుకునే హక్కు కూడా లేదు..
అదే క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో జరిగిన చర్చలో ఒక చిన్న కామెంట్ చేసే హక్కు లేదు. పైగా ఒక న్యాయవాది చెప్పుతో దాడి చేయడానికి కూడా వెనకాడలేదు. సదరు ఘటన వెనక సనాతనవాద ఉనికినీ ఔన్నత్యాన్ని ప్రశ్నించడమే కారణం. ఎనభై తొమ్మిదేళ్ల కింద అంబేద్కర్ ప్రసంగ పాఠాన్ని తిరస్కరించడం, వందేళ్ల తర్వాత అంబేద్కర్ వాదులను మీటింగ్ కి పిలవడం మధ్య అంతులేని రక్త పాతం జరిగింది. అది కారంచేడుతో మొదలు కాలేదు ఖైర్లాంజీ, ఉనా, హత్రాస్ తో ముగిసిపోలేదు. అది ఆరని చితిమంట.. ఆ చితుల్లో అభాగ్యులే మాడిమసి అయిపోతారు. యుగాలు మారినా ధర్మందారి తప్పినప్పుడు బదిరుల తలలే తెగి పడ్డవి. శంభూకుని తెగిపడ్డ శిరస్సు మొదలు ఏకలవ్యుని బొటనవేలు, శూర్పణఖ ముక్కు, బర్బరీక హత్య దాకా వర్తమానంలో ఎందరో ఏకలవ్యులు..
ఎక్కడ ఉన్నాయి ఈ మూలాలు ? వర్ణాశ్రమ ధర్మాలను ధిక్కరించి శూద్రుడు యజ్ఞ యాగాదులు చేయడం, అకాల మరణాలు లేని, ధర్మం నాలుగు పాదాల మీద నడవబడుతున్నది అని చెప్పబడిన శ్రీరాముని పాలనలో ఒక వృద్ద బ్రాహ్మణుడు అకాల మృత్యువు బారినపడ్డప్పుడు ఆ దేహాన్ని మోసుకుని వచ్చి శ్రీరామునికి చూపించి నీ పాలనలో ఏదో అధర్మం జరిగింది కాబట్టే, నా కొడుకు నాకు దూరం అయ్యాడు… జరిగిన అధర్మాన్ని నిర్మూలిస్తే చనిపోయిన నా కుమారుడు తిరిగి వస్తాడు అన్నాడు.
అంతిమంగా నాటి యుగ ధర్మాన్ని ధిక్కరించి శంభూకుడు అనే శూద్రుడు, ఆర్యేతరుడు తపస్సు చేయడం శంబూకుని మీద మోపబడ్డ అభియోగం. ఆ అనర్ధానికి కారణం ద్రావిడజాతి వాడు అయిన శంభూకుడు వేదాధ్యయనం చేయడం దాని మూలంగా ఆ బాలుడు చనిపోయాడు అని నిర్ధారణ చేస్తారు.
‘యశ్య రాష్ట్రే నృపాలష్య తురీ యశ్చ తపోదన! తత్ర తధ్యం భవత్యేన విప్ర బాలస్య మారణమ్’ “ఏ రాజు రాష్ట్రము నందు శూద్రుడు తపస్సు జేయుచున్నాడో యచ్చటనే యకాలముగా విప్రబాలురకు మరణము సంభవించు తీరును” అని స్మృతి వాక్యము చెప్పుచున్నది. ధర్మం దారి తప్పడం అంటే మరేదో కాదు జన్మాతహా నీకు సంక్రమించిన కుల విద్యను ధిక్కరించి ప్రత్యామ్నాయాన్ని అనుసరిస్తావో అక్కడ నీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.. నిన్ను భౌతికంగా నిర్మూలించడానికి మార్గం సుముగం అవుద్దీ అన్నమాట. గుడికీ బడికీ నాగరిక సమాజానికి ఆవల వెలివేయబడ్డ సమూహాల నుండి, పొలిమేరలకు తరిమి వేయబడ్డ అస్తిత్వాలు తమ పూర్వీకుల ఆనవాళ్లను ఆత్మగౌరవంతో వెలికి తీసి పరాజిత చరిత్రను ప్రాణం పోస్తున్నారు.
బ్రతుకంతా దశబ్ధాల పాటు అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన సీనియర్ గవాయ్ సహచరి ఆర్ఎస్ఎస్ మీటింగ్ కు దూరంగా ఉండడం కుట్ర కాదు అది స్వాభిమాన ప్రకటన. వందల ఏళ్లకింద ధ్వంసం చేయబడిన విష్ణుమూర్తి తలను పునర్నిర్మాణం చేయించే పని కోర్టు పరిధిలో లేదని, అది ఆర్కియాలజీ వాళ్ళ పరిధిలో ఉన్న అంశం కనుక మేము జోక్యం చేసుకోలేము అని హేతుబద్దంగా అన్న సర్వోన్నత న్యాయాధికారి మీద ఒక న్యాయవాది చెప్పులు విసిరి అవమాన పరచగల తెంపరితనం కేవలం సనాతన ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న ఈ దేశం లోనే సాధ్యం.
ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో అలాంటి అత్యున్నత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన రెండో దళితుడు, మొదటి బుద్దిస్ట్ జూనియర్ గవాయ్. ఆ స్థానాన్ని న్యాయ బద్దంగా, ధర్మ బద్దంగా నిలబెట్టాలి అనే తపన మూలంగానే అతని మీద దాడి జరిగింది. దానికి కారణం అతని వాదనా పటిమ, తీర్పులు ఇవ్వడంలో ఎటువంటి జంకు లేదు. ఈ క్రమం లోనే ఆయన ఇచ్చిన ఒక చారిత్రక తీర్పు మూలంగా సనాతన వాదం ఆయన మీద మరింత కోపం తో ఉంది ఉత్తర ప్రదేశ్ బుల్డోజర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమం లో ఆయన ఈ విదంగా తీర్పు ఇచ్చాడు
‘ప్రతి జీవికీ స్వంత ఇల్లు పెరడు కలిగి ఉండాలి, అనే కల ప్రతి హృదయంలో ఉంటుంది. సొంత ఇంటి కల ఎప్పటికీ చెదిరి పోకూడదు.ఆ ఆకాంక్ష ఎన్నటికీ మసక బారదు. న్యాయస్థానాలు ఇవ్వాల్సిన న్యాయానికి రాజకీయ నాయకులే తీర్పరులుగా మారితే న్యాయవ్యవస్థ ఉన్నది ఎందుకు’ అంటూ యోగి ప్రభుత్వ బుల్డోజర్ న్యాయ దమననీతిని సరిగ్గా యేడాది కిందనే చీఫ్ జస్టిస్ గవాయ్ తీర్పు ఇవ్వడం కూడా సనాతన ధర్మానికి మైలపడ్డది. అలా తీర్పు ఇవ్వడం కూడా అతని పట్ల పాలకులు ఆగ్రహంతో ఉన్నారు అనేది దాచేస్తే దాగని సత్యం. సనాతన ధర్మ పరిరక్షకుడిగా భావించుకుంటున్న యోగి ఆదిత్య నాథ్ చేస్తున్న బుల్డోజర్ న్యాయాన్ని ప్రశ్నించిన చైతన్యం అతనిది. అతను తన పూర్వీకుల నుండి స్వాభిమాన పోరాటాల సారాన్ని నరనరాన నింపుకున్నాడు కాబట్టే, అటువంటి తీర్పులు ఇవ్వగలిగాడు.
ఈ దేశంలో ఒక దళితుడిగా పుట్టి రాజ్యాంగంలో అత్యున్నత పదవిలో ఉన్నా నువ్వు రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్నా, నీకు సభలను నియంత్రణ చేసే శక్తి ఉన్నా, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి స్వాభావికంగా నీ బలం, బలహీనత నిర్ణయించేది అంతిమంగా నీ యుక్తి కాదు, కేవలం కులం మాత్రమే. కులం నిన్ను వెంటాడి వేధిస్తూనే ఉంటది అనడానికి గవాయ్ మీద దాడి ఒక సాక్ష్యం .నీ శక్తి యుక్తులతో నువ్వు చదివిన చదువు, నువ్వు పొందిన పదవి , నీ ఉనికిని అస్తిత్వాన్ని, నీ పరిధిని ఏ మేరకు నియంత్రణ చేయాలో ఏ మేరకు అనుమతి ఇవ్వాలో కులమే నిర్ణయిస్తది అనడానికి ఈ ఉదంతం చాలు.
ప్రసిద్ద కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ బరోడా సంస్థానంలో తాను చేస్తున్న విద్యా సంస్థలో తాగే నీళ్ళను కూడా అంటుకోనివ్వలేదు తన కింద పనిచేస్తున్న కింది స్థాయి సహాచర స్టాఫ్ కూడా అవమానించిన ఉదంతం మన కళ్ళ ముందే ఉంది. ఇన్నేళ్ల స్వతంత్ర పాలనలో ఎన్నో స్వాభిమాన పోరాటాల ద్వారా దళితుల ఉనికి అస్తిత్వం ప్రమాదంలో పడింది.
జూనియర్ గవాయ్ తండ్రి అరవయ్యో దశకంలోనే మహారాష్ట్ర కేంద్రంగా రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక సమితి నాగపూర్ ప్రెసిడెంట్ గా నాడు అంబేద్కర్ తన చివరి రోజుల్లో వేలాది మందితో పాటు నాగపూర్ లో దమ్మదీక్ష తీసుకున్నప్పుడు అతని వయసు పాతికేళ్లు. తనకొడుకు చిన్నతనంలో ఉండగానే నువ్వు భవిష్యత్తులో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అవ్వాలి అయ్యాక అభాగ్యుల ఆత్మగౌరవ గొంతుకగా మిగలాలి అని ఆశించాడు.
ఆనాడు ఇదే ఆర్ఎస్ఎస్ డా. బి ఆర్ అంబేడ్కర్ ను తమ సభలకు పిలిచి అవమాన పరిచారు. ఈనాడు అదే సంఘం సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ తల్లిని పిలిస్తే తానురాలేను అన్నందుకు అవమానించారు. ఇది బుల్డోజర్ నీతి. ఎందుకంటే బుల్డోజర్ నీతి చెల్లదు అని తీర్పు ఇచ్చాడు కాబట్టే, ఈ సమూహాలను మెయిన్ స్ట్రీమ్ నుంచి తరిమేస్తున్నారు, భౌతికంగా నిర్మూలిస్తున్నారు.
నిన్న గాక మొన్న హర్యానా క్యాడర్ కు చెందిన అడిషనల్ డీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య మరొక అమానవీయ ఘటన .
హైదరాబాద్ నగరానికి చెందిన పూరణ్ కుమార్ వెలివాడ నుంచి వచ్చాడు. తన తండ్రి విజయ్ కుమార్ ఒక ఇంజనీర్, తన ఇద్దరు కొడుకులు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ లో చదువుకుని ఒకరు హర్యానా కేడర్ ఐపిఎస్, ఇంకొకరు బాంబేలో ఉన్నత ఉద్యోగిగా సెటిల్ అయ్యారు. ఇంకో ఐదారు ఏళ్లలో అతను అత్యున్నత డీజీపీ అయ్యేవాడు. అత్యంత పిన్న వయస్సు లోనే ప్రెసిడెంట్ మెడల్ పొందాడు. రా లో కొంతకాలం పనిచేశాడు. అటువంటి వ్యక్తిని సర్వీస్ మాన్యువల్ కి విరుద్ధంగా తక్కువ పోస్ట్ లోకి పంపి, న్యాయంగా దక్కాల్సిన ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ తృణీకరించి అనేక రకాలుగా ఆయనను కులం పేరుతో అవమానించి వేధించి బలవన్మరణం దిశగా నడిపారు తన పై స్థాయి అధికారులు.
ఆయన సహచరి అంనీత్ కౌర్ కుమార్ ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని. పంజాబ్ కి చెందిన ఆమె కుటుంబంలో ఎంతోమంది ఫ్రీడం ఫైటర్స్ ఉన్నారు. ఆమె అన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆ కుటుంబంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. సాక్షాత్తు ఆ రాష్ట్ర డీజీపీ వెంటాడి వేటాడి అవమాన పరిచి తన మీద లేనిపోని అభియోగాలు మోపి,తన వ్యక్తిగత భద్రతను బహిరంగ పరిచి,కులం పేరుతో వేధిస్తే ..తన ఇంట్లో ఎనిమిది పేజీల ‘డైయింగ్ డిక్లరేషన్’ రాసి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు.ఈ ఘటన జరిగి నేటికి 9 రోజులు, అతని శవం న్యాయం కోసం ఇంకా మార్చురీలో ఎదురు చూస్తోంది. 85 ఏళ్ల కన్నతల్లి తన కొడుకు అంతిమ సంస్కారాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను రెండు చేతులు జోడించి న్యాయం చెయ్యమని అర్ధిస్తోంది.
యుగాలు మారినా దమన నీతి మారలేదు, వేదాలు నేర్చుకున్నాడు అని త్రేతాయుగంలో శంభూకుని తల నరికిన వారసులే వర్తమానంలో అమానవీయ కులవ్యవస్థకు మనువాదమే దన్నుగా ఉన్నది అని ప్రశ్నించిన అంబేద్కర్ ను జా త్ పాక్ తొడక్ మండల్ సభ కు పిలిచి అవమాన పరిచింది. నిన్న గాక మొన్న ఆర్ఎస్ఎస్ సభకు రాలేను అన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తల్లి కళామతి థాయి నీ అవమాన పరిచారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే సాక్షాత్తు సుప్రీంకోర్ట్ లో పట్టపగలు దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాన న్యాయాధిపతిని మై లార్డ్ అని సంబోధించడం ఇష్టం లేకనే చెప్పుల దాడి జరిగింది.దానికి కారణం నాగరిక సమాజానికి బుల్డోజర్ పేరుతో చేస్తున్న అన్యాయాన్ని, విగ్రహ పునరుద్దరణ తన పరిధిలో లేదు అన్నందుకే అనేది దాచేస్తే దాగాని సత్యం. ఒక సీనియర్ అడిషనల్ డిజిపి స్థాయి అధికారి తనకు తాను కాల్చుకుని చనిపోయేలా చేసిన దమన నీతి ఏ యుగపు అమానవీయ అవశేషం ? ఇది మానవాళికి మచ్చ… వ్యవస్థకు పట్టిన చెదలు.. వాళ్ళు ఈ యుగపు ప్రశ్నగా చరిత్రలో మిగిలే ఉంటారు.
*
Add comment