వారధి

అర్చన ఫైన్ఆర్ట్స్ అకాడెమి (హ్యూస్టన్), శ్రీశారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో  – కథలపోటీ – 2019 మొదటి బహుమతి విజేత

అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి.

నల్లరేగడినేలలో వేళ్ళూనిన మొలక పెకలించబడి ఎర్ర  జేగురురంగు భూమిలో నాటబడింది. ప్రకృతిమాత ఒడిలో ఎన్ని రంగుల పూవుల పలకరింతలో!

పచ్చగా మెడలో పడిన మెరిసిపోతున్న మంగళసూత్రాలని కొత్తగా చూసుకుంటోంది అన్నపూర్ణ.

“మీ అన్నయ్యేవిటీ అలా మాట్లాడతాడూ మర్యాదా మన్ననా లేకుండా..”

అప్పుడే మెడలో మంగళసూత్రంకట్టి భర్త హోదాకి వచ్చిన ప్రకాశం అన్నపూర్ణతో పెళ్ళయాక మాట్లాడిన మొట్టమొదటి మాటలవి. బిత్తరపోయింది అన్నపూర్ణ. ఏమన్నాడని ఎదురు అడగలేకపోయింది. తనే మర్యాదా మన్ననా లేకుండా మాట్లాడి తప్పు చేసినట్టు తల వంచుకుంది.

పెళ్ళిభోజనాలవుతున్నాయి. మహా సందడిగా ఉంది పందిరంతా. హోమం చెయ్యడానికి వధూవరులిద్దరినీ లోపలికి తీసికెళ్ళాడు పురోహితుడు. కాసేపటికే అన్నయ్య వచ్చి నెమ్మదిగా చెవిలో అన్నాడు, “వీళ్ళెక్కడి పెళ్ళివారేబాబూ. అస్సలు సంస్కారం లేదు..” అంటూ.

మరీ బిత్తరపోయింది అన్నపూర్ణ. ఆ సంస్కార హీనురాలు తనే అయినట్లు తల ఇంకాస్త వంచేసుకుంది.

మొట్టమొదటిసారి తల్లి కాబోతున్న సీమంతంవేడుక  వేడుకగా అనిపించనేలేదు అన్నపూర్ణకి. ప్రతి నిమిషం అత్తింటివారూ, పుట్టింటివారూ ఆనవాయితీలంటూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకోకుండా చూసుకోవడంతోనే ఆమెకి సరిపోయింది.

“మీ అమ్మ సీమంతం సారె ఇలాగే ఇవ్వాలని చెప్పిందా!” అన్న అత్తగారి మాటలకి తలకూడా ఎత్తకుండా నెమ్మదిగా, “లేదండీ, నేనే అలా అనుకున్నాను.” అంటూ నెపం తనమీద వేసుకుని తల్లి మర్యాద నిలబెట్టింది.

“మీ అత్తగారికి మరీ అంత భేషజం ఏవిటే!” అన్న తల్లి దగ్గర, “లేదమ్మా, ఆవిడ మాట అలా ఉంటుంది కానీ మనిషి చాలా మంచావిడ. నేనంటే చాలా ఇష్టం..” అంటూ అత్తగారి గౌరవాన్ని కాపాడింది.

“బావగారేవిటే, ఇంత పిసినిగొట్టూ..” అని వెక్కిరిస్తున్న అన్నయ్యతో, “పిసినిగొట్టు కాదన్నయ్యా, ఆయనకి ముందుజాగ్రత్త అంతే..” అంటూ అన్న దగ్గర  మొగుణ్ణి వెనకేసుకొచ్చింది.

“మీ అన్నయ్యేవిటీ. పెద్ద అన్నీ తెలిసున్నట్టు మాట్లాడతాడూ.. అతని కసలేవీ తెలీనే తెలీదూ..” అని భర్త తన అన్నగారిని అంటుంటే “ఏదో, బావగారని హాస్యంగా అన్నాడేమో..” అంటూ తోడబుట్టినవాణ్ణి వెనకేసుకొచ్చింది.

పిల్లలు కాస్త పెద్దయాక మేనమామని ఆక్షేపిస్తుంటే గుడ్లనీరు కుక్కుకుంటూ, “మీకన్న పెద్దవాళ్ళు మీ క్షేమంకోసం అలాగే మాట్లాడతారు..” అంటూ వాళ్ళదగ్గర కూడా అన్నగారి పెద్దరికం నిలబెట్టింది.

“మీ పిల్లలేవిటే, బొత్తిగా లోకజ్ఞానంలేకుండా ఉన్నారూ!” అని అన్నయ్యంటే “ఏదోరా, ఇంకా నా దగ్గిరే ఉన్నారుగా. బైట ప్రపంచంలోకెళితే వాళ్ళే నేర్చుకుంటారు..” అని మేనమామకి పిల్లలమీద ప్రేమ తగ్గకూడదని వాళ్ళని వెనకేసుకొచ్చేది.

ఒకరన్నమాట మరొకరి చెవిని పడి కక్ష్యలూ, కార్పణ్యాలూ పెంచుకోకుండా సగం గొంతులోనే దిగమింగేసి, మిగిలినదానిని నవ్వులాటగా తేల్చేసి రెండిళ్ళమధ్యా సంయమనం నిలబెట్టడానికి అన్నపూర్ణ పడ్డ అవస్థ వర్ణనాతీతం.

ఇది జరిగి ముఫ్ఫై యేళ్ళయింది. పుట్టినింటికీ, మెట్టినింటికీ ఆచారాలూ, ఆనవాయితీలలో తేడా ఉన్నందువల్ల అన్నపూర్ణ అప్పట్నించీ  ఆ రెండిళ్ళ మధ్యా నలిగిపోతూనే ఉంది. పుట్టినప్పుడు వేళ్ళకంటుకున్న నల్లరేగడిని దులిపేయలేకపోయింది. అలాగే వేళ్ళూనుకుని మూడుపూవులూ ఆరుకాయలూగా విలసిల్లుతున్న మెట్టినింటినీడనూ కాదనుకోలేకపోయింది.

ఇప్పుడు అన్నపూర్ణ కూతురు సుమ పెళ్ళి జరగబోతోంది. ఆ రోజు పొద్దున్నే అన్నపూర్ణ అన్నయ్య రాజారావు ఫోన్ చేసాడు.

“బావగారూ, మా మేనకోడలి పెళ్ళండీ. బ్రహ్మాండంగా చెయ్యాలి. ఏదైనా తక్కువ పడితే చెప్పండి. మేనమావని నేనున్నాను..” అన్నాడు ప్రకాశంతో.

“ఆ మాటన్నావు చాలయ్యా. నువ్వు దగ్గరుండి అన్నీ చూసుకుంటే చాలు. ఇంకేవక్కర్లేదు..” అన్నాడు ఇట్నించి ప్రకాశం నవ్వుతూ.

“అంతకన్నానాండీ. పదిరోజులముందే అక్కడుంటాం..” అంటూ ఫోన్ పెట్టేసాడు రాజారావు.

బావా, బావమరదు లిద్దరూ అంత చనువుగా మాట్లాడుకుంటున్న ఆ సంభాషణ విన్న సుమ ఆశ్చర్యపోయింది. సుమకి పదేళ్ళున్నప్పుడు ప్రకాశం చెల్లెలు పద్మ పెళ్ళైంది. ఆ రోజుల్లో ప్రకాశం కాస్త డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకని పెళ్ళికి పదివేలవరకూ సర్దుబాటు చెయ్యమని భార్య అన్నపూర్ణని బావమరిది దగ్గరికి పంపించాడు.

అప్పుడు తల్లితో పాటు సుమ కూడా మావయ్య దగ్గరికి వెళ్ళింది. అన్నపూర్ణ అడిగినదానికి రాజారావు సుమని చూపిస్తూ, “ఇదిగో, నా మేనకోడలు. దీని పెళ్ళికని అడుగు. తల తాకట్టు పెట్టయినా ఎక్కడైనా అప్పు తెచ్చి ఇస్తాను. కానీ బావగారి చెల్లెలి పెళ్ళికి డబ్బు సర్దడం, ఆ తర్వాత ఆయన ఎప్పుడిస్తారా, అసలు ఇస్తారా ఇవ్వరా అని బాధపడడం ఏం న్యాయం చెప్పు! పెళ్ళికి శుభలేఖ వేస్తే నలుగురిలో నిండు పర్చుకుందుకు వచ్చి ఆశీర్వదిస్తాను. అంతే.” అన్నాడు.

కానీ అన్నపూర్ణ ఇంటికి వచ్చి ప్రకాశంతో రాజారావు అన్న మాటలేమీ చెప్పలేదు.

“అమ్మ వైద్యంకోసం మొన్ననే వాడు చాలా అప్పులు చేసేట్టండీ. డబ్బు సర్దలేకపోయినందుకు మిమ్మల్నేమీ అనుకోవద్దని చెప్పేడు.” అని మాత్రం అంది. సుమకి తల్లి అబధ్ధం ఎందుకు చెప్పిందో అర్ధంకాలేదు.

కానీ ఈ రోజు సుమ అడగనే అడిగింది, “ అప్పుడు అత్తయ్య పెళ్ళికి నాన్నకి సాయం చెయ్యలేదు. మొన్నామధ్య మీ నాన్న నీకేం పెళ్ళి చెయ్యగలడే అన్నాడమ్మా మావయ్య. అల్లాంటి మావయ్యని నా పెళ్ళికి ఎందుకు పిలవడం!” అంటూ.

ఎందుకు పిలవాలో కూతురికి చెప్పవలసిన సమయం వచ్చిందనుకుంది అన్నపూర్ణ.

“చూడు సుమా, ఇన్నాళ్ళూ నువ్వు అమ్మా నాన్నల వెనక ఉన్నావు. ఇక్కడ నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా దాని బాధ్యత మాదౌతుంది. కానీ ఇప్పుడు నువ్వు నీకు పూర్తిగా పరిచయంలేని ఇంటికి వెడుతున్నావు. మన ఆచారాలకీ  వాళ్ల ఆచారాలకీ చాలా తేడాలుంటాయి. ఆచారాలేకాదు, మాటతీరు, నిలబడే విధానం, ప్రవర్తన అన్నీ వేరుగానే ఉంటాయి. నువ్విక్కడ పుట్టి పెరిగేవు. ఈ వాసనలు నిన్ను వదలవు. నీకు వదులుకోవాలని కూడా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక యువరాణీలా ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగేవు. అటువంటి పుట్టింటిమీద అభిమానం నీకు జీవితాంతం ఉంటుంది. అది సహజం. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళే చోటుకి ఈ వేళ్ళు పెకలించుకుని వెళ్ళాలి. ఈ వేళ్ళు అక్కడి భూమిలో నాటుకుని మహా వృక్షమై మూడు పూవులూ ఆరు కాయలుగా విలసిల్లాలి. అందుకని ఆ మెట్టినిల్లు కూడా నీకు అంతే ముఖ్యం. ఈ రెండిళ్ళ మధ్యా సమన్వయం ఉంటేనే నీకు రెండిళ్లమధ్యా రాకపోకలకు వీలుంటుంది. ఏదైనా తేడా వస్తే చూపులకు కూడా నోచుకోలేవు. అందుకే ఈ రెండిళ్ళమధ్యా సమన్వయం నిలబెట్టవలసింది నువ్వే. “

“అంటే..” అంది సుమ.

“ఇప్పుడు నువ్వన్నావు చూడూ, మావయ్య  అత్తయ్య పెళ్ళికి డబ్బు సాయం చెయ్యలేదనీ, మీ నాన్నని తప్పు పడుతూ నిన్నేదో అన్నాడనీ. అలాంటి సంబంధాలు చెడిపొయే మాటలు మనం అక్కడి విక్కడ ఇక్కడి వక్కడ చెప్పకూడదు. తల్లీ తోడునీ వదులుకోకూడదు. పరిస్థితుల వల్ల అందరూ కాస్త అటూ ఇటూ  మాట్లాడినా దానిని అక్కడే వదిలేసి, ఇద్దరూ సమన్వయంగా ఉండేలా మాట్లాడాలి తప్పితే వాళ్ల మధ్య గొడవలు పెట్టకూడదు.”

“ఏంటో అమ్మా, నువ్వేదో చెప్తున్నావు. నాకర్ధం కావటంలేదు. మావయ్య అన్నాడా లేదా!”

“అన్నాడు. కాదనటం లేదు. కానీ అదేమాట నేను వచ్చి మీ నాన్నకి చెపితే నాకు పుట్టింటితో సంబంధం ఉంటుందా చెప్పు! పుట్టినిల్లూ, మెట్టినిల్లూ కూడా ఆడదానికి చాలా కావల్సినవి. తూర్పూ పడమరలాగా అవి రెండూ ఒక కాలవకి రెండువైపులా ఉన్నట్టుంటాయి. ఆడపిల్ల ఆ రెండిళ్ళ మధ్యా ఒక వారధిలా ఉండాలి. మనకి కావలసినవాళ్ళందరితో కలిసి ఉండాలి తప్పితే మధ్యలో కాలవలో పడి ములిగిపోకూడదు.”

“నాన్నని వెక్కిరించేవాళ్ళు కావల్సినవాళ్ళెలా అవుతారూ!” అన్న సుమ ప్రశ్నకి సమాధానంగా అన్నపూర్ణ ఇలా అంది.

“జీవితంలో డబ్బుతోపాటు దేన్నైనా, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ మన అనుకున్న మనుషులని మనకి కాకుండా చేసుకుంటే కష్టానికీ, సుఖానికీ పంచుకునేవాళ్లంటూ ఇంకెవరూ ఉండరు. ఆడపిల్ల అటు పుట్టినింటి ఆప్యాయతనూ వదులుకోలేదు, ఇటు మెట్టినింటి సౌభాగ్యాన్నీ కాదనుకోలేదు. ఆమెకి రెండూ ముఖ్యమే. అందుకే ఆ రెండిళ్ళ మధ్యా ఆడపిల్ల ఒక వారధిలా ఉండాలి తప్పితే రెండిళ్ళని విడగొట్టకూడదు. అందరి సంతోషం కోరి అలా వారధిలా ఉండడం కోసం ఇలాంటి చిన్న చిన్న మాటలు కల్పించి చెప్పినా తప్పులేదు. దీనివల్ల కుటుంబాలు హయిగా ఉంటాయి తప్పితే ఎక్కడా నష్టం జరగదు. అందుకే నీకిప్పుడు చెపుతున్నాను. రేప్పొద్దున్న నువ్వు కూడా పుట్టినింటికీ మెట్టినింటికీ మధ్య ఒక వారధిలా ఉండి, రెండుకుటుంబాల మధ్యన సమన్వయం ఉండేలా చూడాలి.”

“అలా ఎలా అమ్మా!” అనడిగిన సుమతో అన్నపూర్ణ,

“అదంత సులభమేమీకాదు. కానీ నువ్వెప్పుడైతే ఇద్దరూ నాకు కావల్సినవాళ్ళే అనుకున్నావో అప్పుడే అదెలాగో నీకు తెలుస్తుంది. “ అంది నవ్వుతూ .

 

*

 

జి.యస్.లక్ష్మి

మా అమ్మగారు శ్రీమతి పద్మావతిగారు, మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగార్లు నాకు సంగీత, సాహిత్యాలమీద అభిరుచి కలిగించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో సోషియాలజీ ప్రొఫెసర్ గా చేసిన మావారు గరిమెళ్ళ విశ్వనాథంగారు నేను రచనలు చేసేందుకు ప్రోత్సహించారు. ఇప్పటివరకూ నాలుగు కథా సంపుటాలూ, ఒక నవల పుస్తకాలుగా వచ్చాయి.

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నపూర్ణ పాత్ర బాగుంది. మీ కథలన్నీ నిజ జీవితంలో జరిగే సంఘటనలతో రాస్తారు. అందుకే మన కథేనేమో అనిపించేట్లు రియాలిటీ గా వుంటాయి. కథ బాగుంది. అభినందనలు.

  • చక్కని కధ. ఈ కాలం పిల్లలకు అవసరమైన కధ. వాళ్ళు తప్పక చదవాల్సిన కధ.

    • కథ నచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మిగారూ.

  • చాల బాగుంది లక్ష్మి గారు.. కథ ఆడపిల్ల పుట్టినిల్లు మెట్టినిల్లు వారధిగా వుండి జీవితాంతం లౌక్యంతో సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవాలనే మంచి కథ ఈ తరం పిల్లలకు .. అభినందనలు మరోమారు

    • కథ నచ్చినందుకు ధన్యవాదాలండీ విజయలక్ష్మిగారూ..

  • తెలిసిన జీవితాన్నే కొత్తగా ఆవిష్కరించారు! మంచి శైలి మీది.
    చాలా బావుంది కథ. ఎక్కడో లోపల చివుక్కుమంది…అలా ఎందుకుంటారో మనుషులు అనిపించి.

    • కథ నచ్చినందుకు ధన్యవాదాలు నాగలక్ష్మిగారూ..

      • రోజు అనుకునే మాటలు గాల్లో కలిసిపోతాయి . కథలాగా రాస్తే నిలిచి ఉంటుంది.
        మీ ఈ ప్రయత్నం చాలా బాగుంది.
        మీ కథనం ఎప్పుడు సందేశాత్మక మే కదా!

        శుభాకాంక్షలు జి ఎస్🌷
        KB Lakshmi 🌿

  • అద్భుతంగా రాసావు శుభా కొంచెం ఆలస్యం అయ్యింది.ఇది పెళ్ళితీసుకోబోయే ఆడపిల్లందరూ చదవాల్సిన కథ

  • నల్లరేగడినేల నుంచి ఎర్రమట్టి నేలలోకి మారిన మొక్కతో పోల్చి ఆడపిల్ల జీవితంలో పుట్టింటి-అత్తారింటి మధ్య వారధిలా ఉండాలని ఎంత చక్కని సందేశం ఇచ్చారు లక్ష్మిగారూ! బహుమతికి అన్నివిధాలా అర్హతున్న కధా, కధనం. అభినందనలు మీకు!

  • జి . యస్ . లక్ష్మి గారి వారధి అద్భుతమైన కథ..అక్షరం అక్షరం పెళ్ళయిన ప్రతి ఇల్లాలి మనోవ్యధ..కళ్లకు కట్టినట్టు చూపించింది.. ఎన్ని సర్దుబాట్లు, సంఘర్షణల మధ్య ఆడది సంసారం సాగిస్తుందనేది అద్దంలో చూపిన కథ.. సహనం లేని చోట గొడవలు..సహనం ఉన్న చోట వారధి..సూపర్ లక్ష్మి గారు..అభినందనలు .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు