“ఇదివరకెవడో అనే ఉంటాడు. బహుశా ఆ అన్నదేదో నా కన్నా బాగానే అని ఉండొచ్చు”
— శ్రీశ్రీ
నేను చదివి అర్థం చేసుకున్నంత వరకూ ఉర్దూ కవిత్వం విషయం లో శ్రీశ్రీ మాటలు అక్షరసత్యాలు. మీర్, గాలిబ్ ల కాలం నుండీ నేటి వరకూ తరతరాలుగా కొనసాగుతున్న కవనపరంపరలో స్థూలంగా వస్తువైవిధ్యం తక్కువ. చాలా వరకూ చెప్పబడిన విషయాన్నే చెప్పుకొచ్చారు. ఒక తరగతిలో విద్యార్ధులంతా ఆవు మీద వ్యాసం వ్రాసినట్టు! కానీ ఆ చెప్పిన విధానంలో ఒక కొత్తదనం, అభివ్యక్తిలో ఒక నిర్దిష్టమైన, నాణ్యమైన శైలి, తమదైన ఒక ముద్ర కలిగి ఉన్న కవులు ప్రతి తరంలోనూ ఆదరింపబడ్డారు. ఇలా గుర్తించగలిగిన శైలిని ఉర్దూ లో ‘లెహెజా’ అన్నారు. అటువంటి అందమైన లెహెజాలో గజళ్ళతో అలరించి ‘ఆబ్రూ-ఏ-గజల్’, ‘షెహెన్శా-ఎ-గజల్’ అనే బిరుదులు పొందిన కవి ఖుమార్ బారాబంక్వీ!
ఖుమార్ అంటే మైకం. మధువు ప్రభావం తొలగిపోయినా అంతరంగంలో కదులుతూ ఉండిపోయే తేలికైన మత్తు మేఘం.
మహమ్మద్ హైదర్ ఖాన్, బహుశా తన రచనల్లో అటువంటి మైకం ఉందని సూచించడానికేమో ‘ఖుమార్’ అనే కలం పేరు ఎంచుకున్నారు. నాకు వ్యక్తిగతంగా అనుభవమైన మైకాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
***
ఉర్దూ గజళ్లలో ప్రేమకు సంబంధించిన రెండు పార్శ్వాలు విరివిగా కనిపిస్తుంటాయి. సంయోగం-వియోగం(విసాల్-ఫిరాక్). అందులోనూ వియోగానిదే పైచేయి. ఖుమార్ సాబ్ అభివ్యక్తిలో వియోగం ఎలా పండిందో చూద్దాం
భూలే హైఁ రఫ్తా రఫ్తా ఉన్హేఁ ము ద్దతో మేఁ హమ్
కిశ్తోఁ మే ఖుద్-కుషీ కా మజా హమ్ సే పూఛియే
మెలమెల్లగా తనని కొన్నేళ్లపాటు మరచిపోయాను
వాయిదాలలో ఆత్మహత్య ఎంత సౌఖ్యమో నన్నడగండి
కొన్నేళ్లపాటు మరచిపోవడమూ మరు వలేకపోడమూ ఒకటి కాదా! షేర్ లో మొదటి పంక్తిని మిస్రా-ఎ-ఊలా అంటారు. చాలావరకూ మిస్రా-ఎ-ఊలా ఒక సాధారణమైన వాక్యంలా ఉంటుంది. రెండవ వాక్యానికి రంగం సిద్ధం చేసినట్టు ఉంటుంది. అందుకే ముషాయిరాలలో కూడా మొదటి వాక్యాన్ని పలుమార్లు చదివి ఒక sense of anticipationని సృష్టిస్తారు. అపుడపుడూ అరుదుగా, ఈ షేర్ లో లాగా, మొదటి వాక్యంలోనే ఏదో పూర్ణత్వం కనిపిస్తుంది. రెండవ వాక్యాన్ని మిస్రా-ఎ-సానీ అంటారు. షేర్ లోని అందమంతా ఈ రెండవ పంక్తి ఏ మేరకు రక్తికడుతుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ షేర్ లో మిస్రా-ఎ-సానీ ని చూస్తే, తనని ఎంత మరచిపోయానో అంత నన్ను నేను చంపుకున్నాను అనడంలో మరచిపోవడంలోని కష్టాన్ని, ఆ రోజువారీ ఆత్మహత్య ఎంత సుఖప్రదమో నన్ను అడగండి అంటూ అది ఎంత బాధాకరమో ఐరానికల్ గా చెప్పడం వలన ఈ షేర్ రక్తి కట్టింది. అలా రససిద్ధి జరిగినప్పుడు ‘షేర్ బన్ గయా!’ అని అంటారు.
ఇదే ‘నిన్ను మరచిపోలేకపోతున్నాను’ అనే విషయాన్నే ఖుమార్ సాబ్ ఇంకో చోట ఎలా చమత్కరించి చెప్పారో చూద్దాం.
ఉన్హే భూల్నా యా ఉన్హే యాద్ రఖ్నా
వో బిఛ్-డే హై జబ్ సే యహీ మష్గలా హై
తనని మరచిపోవాలా లేక గుర్తుపెట్టుకోవాలా
తాను దూరమయ్యాక ఇదే వ్యాపకం అయ్యింది
తనని మరచిపోకుండా ఉండటానికి వెతికిన సాకు ఆ సంశయం.
మరి అవతలి వ్యక్తి మనల్ని మరచిపోతేనో!
సునా హై హమేఁ వో భులానే లగే హై
తో క్యా హమ్ ఉన్హేఁ యాద్ ఆనే లగే హై
తాను నన్ను మరచిపోసాగిందని విన్నాను
అంటే నేను తనకి గుర్తుకొస్తూ ఉన్నానా
***
ఉర్దూ కవిత్వంలో నన్ను అమితంగా ఆకట్టుకున్న లక్షణం క్లుప్తత. సూక్ష్మంలో మోక్షం! ఒక చిన్న పుస్తకంగా వ్రాయదగిన విషయాన్ని మథించి, రెం డు వాక్యాలలో కుదించి చెప్పడం ఒక కళ. ఒక పాటలో సిరివెన్నెల ‘ఇది కాదే తలరాత/అనుకోదే ఎదురీత’ అన్నట్టు. నాలుగు ముక్కల్లో ఎంత తత్త్వం చెప్పాడు! ఖుమార్ సాబ్ కూడా ఈ కళలో ఆరితేరినవాడు.
న హారా హై ఇష్క్ ఔర్ న దునియా థకీ హై
దియా జల్ రహా హై హవా చల్ రహీ హై
ప్రేమ ఓడిపోలేదు ప్రపంచం అలసిపోలేదు
దివ్వె వెలుగుతూనే ఉంది గాలి వీస్తూనే ఉంది
నన్ను ఏ అర్ధరాత్రో నిద్ర లేపి, తడుముకోకుండా ఒక ఐదు షేర్లు చెప్పమంటే బహుశా ఈ షేర్ తోనే మొదలెడతానేమో. ప్రపంచంలోని ప్రేమకథలన్నిటినీ encapsulate చేసినట్టు లేదూ!
బుఝ్ గయా దిల్ హయాత్ బాకీ హై
ఛుప్ గయా చాంద్ రాత్ బాకీ హై
హృదయదీపం ఆరిపోయింది ఇంకా జీవితం మిగిలుంది
చందమామ దాగిపోయింది ఇంకా రాత్రి మిగిలుంది
ఈ రెండు షేర్లను జాగ్రత్తగా గమనిస్తే మొదటి పంక్తిలో ఒక కఠినవాస్తవాన్ని పేర్కొని, రెండవ పంక్తిలో సరైన క్రమంలో ఉపమానాలు వాడి కవిత్వం సాధించబడింది. ఉదాహరణకి ‘దియా జల్ రహా హై హవా చల్ రహీ హై’ కాకుండా ‘ హవా చల్ రహీ హై దియా జల్ రహా హై’ అంటే అది భావం క్షీణించడమే కాకుండా రదీఫ్ కూడా భంగపడుతుంది.
ఇటువంటి రమ్యమైన వ్యక్తీకరణతో మనసుని మైకంలో ముం చే షేర్లు ఖుమార్ సాబ్ ఎన్నెన్నో వ్రాశారు.
***
ఇదివరలో చెప్పుకున్నట్టు ఉర్దూ కవులు బాధాప్రియులు. బాధలో లభించే సుఖానికే వాళ్ళు బానిసలు. గుల్జార్ మాటల్లో ‘అయ్ జిందగీ గలే లగాలే / హమ్ నే భీ తేరే హర్ ఎక్ గమ్ కో గలే సే లగాయా హై’. బాధని గట్టిగా కౌగిలించుకుని మైమరచిపోయే వాళ్ళు. ఖుమార్ సాబ్ రచనల్లో కూడా ఆ బాధాప్రియత్వం ప్రస్ఫుటమవుతుంది.
సుకూఁ హీ సుకూఁ హై ఖుషీ హీ ఖుషీ హై
తేరా గమ్ సలామత్ ముఝే క్యా కమీ హై
ఎంతో హాయిగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది
నీ బాధ నిండుగా ఉంది నాకేమి తక్కువయింది
ఇష్క్ హై తిష్ణగీ కా నామ్ తోడ్ దే గర్ మిలే జామ్
శిద్దత్-ఏ- తిష్ణగీ న దేఖ్ లజ్జత్-ఏ- తిష్ణగీ సమఝ్
ప్రేమ అంటే దాహమే మధువు దొరికినా దాన్ని తిరస్కరించు
దాహపు తీవ్రత చూడకు దాహంలో ఆనందాన్ని ఆస్వాదించు
అలాగే కవికి బాధల విషయంలో చిన్నా పెద్ద అనే వివక్ష లేదు.
కభీ హసేఁ కభీ ఆహేఁ భరీ కభీ రోయె
బ-కద్ర్-ఏ-మర్తబా హర్ గమ్ కా ఎహ్తిరాం కియా
ఒక్కోసారి నవ్వాను ఒక్కోసారి ని ట్టూర్చాను ఒక్కోసారి ఏడ్చాను
వాటి స్థాయికి తగినట్టు ప్రతి బాధకీ గౌరవమర్యాదలు చేసాను
***
ఖుమార్ సాబ్ ముషాయిరాలలో తన కవిత్వం చదవడంలో కూడా ఒక ప్రత్యేకమైన శైలిని సాధించారు. యూట్యూబ్ లో లభ్యమయ్యే వీడియోలు కొన్నే ఉన్నప్పటికీ, ఖుమార్ సాబ్ శ్రోతలను ఎంతగా అలరించారో వాటిలోనే అర్థమైపోతుంది. తను ఎంత పేరొందిన కవి అయినా తోటి కవుల కవిత్వాన్ని ఆస్వాదించడంలోనూ, అభినందించడంలోనూ ఖుమార్ సాబ్ ముందుంటాడు. క్రికెట్ లో All time Dream XI లాగా, నేను నాకిష్టమైన కవుల Dream team తో ఒక ముషాయిరా నిర్వహిస్తే అందులో ఖుమార్ సాబ్ పేరు మొదట ఉంటుంది.
రఫీ సాబ్ మొదలుకుని హరిహరన్ వరకూ ఎంతో మంది గజల్ గాయకులూ ఖుమార్ సాబ్ గజళ్ళను హృద్యంగా ఆలపించారు. ‘తస్వీర్ బనాతా హూ తస్వీర్ నహీ బన్తీ/ ఏక్ ఖ్వాబ్ స దేఖా హై తాబీర్ నహీ బన్తీ’ వంటి పాపులర్ సినిమా పాటలు కూడా వ్రాశారు.
ఖుమార్ సాబ్ కవిత్వం ఒక అనుభూతుల జడివాన. ఒకసారి తడిసి ముద్దైపోతే మన గుండెలవరకూ చేరే ఆ తడి అంత త్వరగా ఆరేది కాదు.
*
ఖుమర్ సాబ్ కవిత్వపు జడివాన లో,మీతో పాటు,మమ్మల్ని తడిపినందుకు, ..షూక్రియ💐👌సర్.మీకు మనః స్పూర్తిఅభివందనలు.. ఎన్నిసార్లు, చదువుకున్నానో,.. ఈ కవితలు ను!
ధన్యవాదాలు పద్మ గారు!
ఖుమార్ సాబ్ గజళ్ల పరిచయంతో అక్షరాలా ‘ఖుమార్’ కలిగించారు.. ధన్యవాదం రమాకాంత్ గారు.
బారాబంకీ షేర్లు చాలా బాగున్నాయి. మీ అనువాదం కూడా.
మొదట శ్రీశ్రీ ద్విపద తలచుకున్నారు.
సాహిర్ కూడా అన్నాడు కదా:
ముఝ సే పహలే కితనే షాయర్
ఆయ్ ఔర్ చలే గయే
Mujhse behatar kehne vaale tumse behatar sunane vale
Kal aur ayenge nagmo ki beeti kaliyaa chunane vale…..