తమిళం: కి. రాజనారాయణన్
అనువాదం: గౌరీ కృపానందన్
కాలం మునుపటి లాగా లేదు. అయినా కూడా వృద్ధులకు మోజు తగ్గి పోయిందన్న విషయం పట్ల నాకు నమ్మకం లేదు.
వీళ్ళు ప్రవర్తించే విధానాన్ని అనుసరించే అన్నీ జరుగుతుంటాయి.
పొయ్యాళి నాయక్కర్ ఇప్పుడు కూడా గౌరవంగానే బ్రతుకుతూ ఉన్నారు, కొత్త తరానికి సవాలు చేస్తున్నట్లు.
“పాత్రని బట్టి బిచ్చం’ పెట్టడం తెలియక, ప్రాణాలకు సమమైన కవచ కుండలాలని ఇచ్చేసి, ఆ తరువాత లబో దిబో అని గగ్గోలు పెట్టి ఏడవడానికి కారణం వీళ్ల పేరాశనే. అందరి కన్నా తమ పిల్లలు, అన్నింటిలోనూ గొప్పవాళ్ళుగా చేసేయాలన్న తీరని దాహం, వీళ్ళకు ఆఖరు రోజుల్లో గుక్కెడు నీళ్ళు ఇవ్వడానికి కూడా మనిషి లేని స్థితికి దిగజారుస్తుంది.
కాకులు దూరని కారడవిలో, ఎలుగెత్తి ఏడిచిన విభాండక మునివర్యుల దీనస్వరం నిశితంగా వినేవాళ్ళ చెవులకి ఈ రోజు కూడా వినిపిస్తుంది.
“నన్ను వదిలేసి వెళ్లి పోయావు కదా పుత్రుడా! ఋష్యశృంగుడా! నిన్ను లాలించి బుజ్జగించి ఎంతో గారాబంగా పెంచాను కదా!”
విభాండక మహర్షికి పేరాశ అధికం. స్త్రీ వ్యామోహాన్ని విడిచి పెట్టడం తనకి కుదరలేదు. తన కొడుకుకైనా అది సిద్ధించనీ అని బాల్యం నుంచి ఋష్యశృంగుడిని స్త్రీ ముఖం కూడా చూపించకుండా కీకారణ్యంనికి తీసుకు వెళ్లి పెంచారు. పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఒక స్త్రీని చూసీ చూడగానే ఆమె వెనకాలే వెళ్లి పోయాడు!
తమ గొంతెమ్మ కోరికలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని పేరాశ పడే తల్లితండ్రులకు విభాండక మహర్షి ఆక్రందన ఒక గుణపాఠం.
ఆటలో ప్రణాళిక వేసుకుంటూ పావులను కదపడం లాంటిదే జీవితం కూడా.
ఒక ఆటలో ఓడిపోతే రెండవ ఆటలో గెలవవచ్చు. కానీ జీవితం అన్నది ఒక్క ఆట మాత్రమే. రెండవ ఆట దొరకడం అపూర్వం, వెళ్ళిపోయిన రైలును మళ్ళీ అందుకోలేనట్లుగా.
******
ఈ ప్రస్థానంలో నాకు గుర్తుకు వచ్చేదంతా కొప్పంపట్టి పోయ్యాళి నాయక్కర్ దంపతుల జీవన విధానం, వాళ్ళు అలవర్చుకున్న పద్దతులు.
నా చిన్న వయసులో ఒక రోజు…
పొయ్యాళి నాయక్కర్ వచ్చారు.
ఆయన వచ్చారు అంటే కుషీ కూడా వారితో వచ్చింది అని అర్ధం!
ఎవరికి కూడా ‘కుషీ’ ని పట్టుకుని తీసుకు రావడం కుదరదు. అది సులభంగా చేతికి చిక్కే విషయం కాదు. అయినా కూడా ఈ దంపతులకి దాని సూక్ష్మం ఎలాగో అందుబాటులోకి వచ్చింది.
“ఎప్పడు వచ్చావు తాతయ్యా?”
“నువ్వు చూస్తున్నప్పుడేరా.”
నన్ను లాగి వళ్ళో కూర్చో బెట్టుకున్నారు. ఆయన మెడ దగ్గర మేకపాల వాసన వచ్చింది.
“నీతో బామ్మ రాలేదా?”
“ఆమె లేకుండానా? పప్పు, బెల్లం లేకుండా పెళ్లి జరుగుతుందా?” అంటూ నవ్వారు, గారకట్టిన పళ్ళు కనబడేలా.
పొయ్యాళి తాతయ్య దగ్గర నాకు చనువు ఎక్కువ. ఇష్టం వచినట్లు ఏదైనా ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడిని. విసుక్కోకుండా జవాబులు వస్తూనే ఉంటాయి. ఒకసారి ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు నేను కాస్త పెద్దవాడిని అవుతున్న పరువం.
“కొప్పంపట్టి అని మీ ఊరుకు ఎందుకు పేరు వచ్చింది తాతయ్యా?”
“అలా అడగరా!” అంటూ మొదలు పెట్టారు. “కొప్పంపట్టికి ముందు ఆలంపట్టి గురించి చెప్పాలి” అన్నారు.
“ఎందుకూ?” అన్నాను. “కొప్పంపట్టి గురించి అడిగితే ఆలంపట్టి గురించి చెబితే ఎలాగా?”
“ఓరినీ! మనం ఆలంపట్టికి వెళ్ళిన తరువాతే కదా కొప్పంపట్టికి వెళ్తాం” అని అన్నారు.
‘ఈ తుంటరితనం మిమ్మలిని వదిలి వెళ్ళడంలేదు” అంటూ బామ్మ మాతో ఏకీభవించింది.
నాన్నగారు కూడా మాతో వచ్చి కూర్చుంటూ “చెప్పండి పెద్దమ్మా! మేము కూడా తెలుసుకుంటాం” అన్నారు.
“చెట్టుకు ఉండే కొప్పు నీకు తెలుసు కదా?” అని నన్ను అడిగి, “గడ్డం కొప్పు అంటే ఏమిటి?” అని అడిగారు తాతయ్య.
“క్రింది శాఖ” అని జవాబు ఇచ్చాను.
“స్కూలు భాషలో చెప్పాలంటే, మర్రిచెట్టు గడ్డం కొప్పులో గడ్డం మొలుస్తుంది చూసావా?”
మాకు నవ్వు వచ్చినా, ఆయన చెప్పింది, సన్నని మొలకల లాగా తెల్లగా మొట్ట మొదటగా దిగే ఊడలని అర్ధం చేసుకున్నాము.
“మనుషుల వల్ల ఇబ్బంది లేకుండా ఉంటే అది వేగంగా క్రిందికి దిగి, తన లేత చేతులను భూమి మీద మోపి అడుగు పెట్టి, ఆ కొప్పుకు మద్దతునిస్తూ ఊతకర్ర లాగా ఉంటూ, స్థంభంలాగా మారుతుంది.”
తాతయ్య ఆ ముచ్చట చెబుతున్నప్పుడు, పురాతనమైన మర్రిచెట్టు ఊతకర్రను పట్టుకుని నిలబడి ఉన్నట్లు కళ్ళ ముందు కదలాడింది.
“ఆ చెట్టు ఊతకర్రను పట్టుకుని మెల్లిగా నడుస్తుంది కూడా, తెలుసా?” అని అడిగారు.
‘అదేలాగు?’ అన్నట్లు ఒకరినొకరు చూసుకుంటూ ఆయన వైపు చూశాము. చెబుతాను అన్నట్లుగా తల పంకించి. “మర్రిచెట్టు నడుస్తున్నప్పుడు ఎవరూ చూసింది లేదు. కానీ అంది నడుస్తుంది.” కన్ను గీటుతూ ఆయన చెప్పినప్పుడు వినడానికి బాగానే ఉండింది.
“అలా అది నడిచి వస్తున్నపుడు ఊడ భూమ్మీద పాతుకుని నిలబడిన చోటే కొప్పంపట్టి.”
బామ్మ, తాతయ్యలతో మేం కూడా నవ్వాము.
ఆ తరువాత నేను చాలా సార్లు ఆ మర్రిచెట్టును అబ్బురంగా చూసేవాడిని. దాని వయసును అందరూ అతిశయోక్తిగా చెప్పుకునే వాళ్లు, వెయ్యేళ్ళు అని. దాని తొలి కాండం ఏదన్నది ఎవరికీ తెలియదు, వెయ్యి స్తంభాల మండపం లాగా.
ఆ చెట్టు పలురకాలైన పక్షులకు పుట్టిల్లుగా ఆవాసమైయ్యింది.
వేసవి కాలం వెన్నెల రోజుల్లో మేము మా ఊళ్ళో ఆరు బైట ప్రాంగణంలో నులక మంచాలు వేసుకుని పడుకోవడం వల్ల ఆ మర్రిచెట్టు వైపు గబ్బిలాలు ఎగురుకుంటూ వెళ్ళడం కనబడుతుంది.
పక్షులకు విందు పెడుతూ ఉండే ఆ చెట్ల క్రింద, ఆ పక్షులు వేసే రెట్టలు రైతుల నారుమళ్లకి మంచి ఎరువు,
బ్రహ్మాండమైన ఒక ఉమ్మడి కుటుంబంలోని పెద్దాయన లాగా ఆ చెట్టు విరాజిల్లింది. ఆ చెట్టు నుంచి ఎన్నో శాఖలను నరికి కొత్త శాఖలు పుట్టుకు వచ్చేటట్లు చేశారు. పక్షులు ఆ పళ్ళను తిని విత్తనాలను తీసుకు వెళ్లి పలుచోట్లలో విసర్జించి వృక్షాలుగా మారాయి.
ఆ మర్రిచెట్టుకూ ఆ పొయ్యాళి దంపతులకూ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అయినా కూడా చెట్టు మనిషిగా అవుతుందా? రెండింటినీ కలిపి సామెతలు చెబుతారు. ‘ వృక్షం ముదిరితే వజ్రం. మనిషి ముదిరితే బుద్ది’ అని.
పొయ్యాళి నాయక్కర్ తో నేను ముఖాముఖి జరిపింది లేదు. కానీ జీవన విధానం గురించి పలు కోణాలలో ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాను. పుదుచ్చేరికి బైలు దేరే ముందు ఆఖరిసారిగా మేము ఆయన్ని చూడడానికి వెళ్లినప్పుడు, ఆయన కనురెప్పలు కూడా నెరిసి పోయాయి.
నా భార్యతో అన్నాను. “కనురెప్ప వెంట్రుకలు నెరిసే దాకా మనం బ్రతికి ఉండకూడదు. చచ్చిపోవాలి.”
“దానిదేముంది. అలాగే చేసేద్దాం” అంది తమాషాగా. ఆమె ఊళ్ళో ఆయనకు, ‘పెంకుటిల్లు నాయక్కర్’ అని పేరు. పెంకుటిళ్ళు అన్నీ మిద్దె ఇళ్లుగా మారిన తరువాత కూడా ఈయన ఇల్లు మాత్రం ధృఢమైన పైకప్పును కలిగి ఉంది. పన్నెండేళ్లకు ఒకసారి కప్పు మారిస్తే చాలు. తాటాకులు, తడికెలు వీటితో చేసిన పై కప్పులకు అగ్ని భయం ఉంది. సీగై కలపతో వేసిన కప్పుకు నిప్పు అంటుకోదు.
*****
ఈ దంపతులకు తొమ్మండుగురు పిల్లలు, ఆడా. మగా అంతా కలిపి. ఒక్కొక్కరికీ పెళ్లి అవగానే విడి కాపురం పెట్టుకోమని చెప్పి పంపించేసేవారు.
“రెక్కలు మొలిచిన తరువాత ఎగురుకుంటూ వెళ్లి పోవాలి. సొంతకాళ్ళ మీద నిలబడాలి” అని అనేవారు.
మొత్తం ఆస్తినంతా పది భాగాలు చేసి తమకంటూ ఒక భాగం ఉంచుకుని మిగిలిన తొమ్మిదింటినీ పిల్లలకు ఇచ్చేశారు.
విడిగా ఉన్న ఆ యింటిని ఆశ్రమం అని కూడా చెప్పవచ్చు. ఇంత వయసైన తరువాత ఎవరైనా ఒక కొడుకుతో ఉండాలి. లేదా వాళ్ళని తీసుకువచ్చి తోడుగా ఉంచుకోవాల్సింది అని అంటే…
“మేము ఏమైనా అధ్వాన్నపు అడవిలో ఉంటున్నామా?” అని నవ్వుతారు.
“తలనొప్పి, జ్వరం వస్తే ఎవరు వచ్చి చూస్తారు?”
“పిల్లలు ఉండేది ఆస్తికి వారసుల కోసమే, ప్రేమకు కాదు” అని అనేవారు. “పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ మనకి కావాల్సిన వాళ్ళే” అని చెబుతారు.
అదెలాగ అని అడిగితే, “మాతో వచ్చి రెండు రోజులు ఉండి చూడు” అని అంటారు. “ఆప్యాయతతో కూడిన సంబంధం అనేది వేరు లాగా క్రింది వైపు వెళ్తూ ఉంటుంది. తీగలాగా పైకి ఎగబాక్కుంటూ వెళ్ళదు.”
ఆయన చెప్పింది నాకు కొత్తగా అనిపించింది. “కొంచం అర్ధం అయ్యేలా చెప్పండి.”
“నువ్వు నీ కొడుకుతో ప్రేమగా ఉంటావు. అదే విధంగా వాళ్ళు తమ పిల్లల పట్ల ప్రేమగా ఉంటారు. ఆ ప్రేమ నీ వైపు రాదు. ఇదే సత్యం. దీనిని తెలుసుకోలేని వాళ్ళు, తమ పిల్లలు తమ పట్ల ప్రేమగా ఉండటం లేదని తలచి బాధ పడుతూ ఉంటారు.”
“సింధు అనే కొడుకు తన తల్లి తండ్రులను కావడిలో పెట్టుకుని భుజం మీద మోసుకుంటూ, వాళ్ళ కోరికను తీర్చడం కోసం తీర్ధయాత్రకు వెళ్ళాడు కదా?”
“అతగాడికి పెళ్లి అయ్యిందా? పిల్లా పీచు ఉన్నారా?” అని ఎదురు ప్రశ్న వేసేవారు. “దయ్యపు బతుకు బతికిన నిమ్మాండు నాయక్కర్ కధ నీకు తెలుసు కదా” అని గుర్తు చేస్తారు.
“తెలుసు” అంటూ తల క్రిందికి దించుకుంటాను.
“రామేశ్వరం గుడి ముందు హాయిగా బిచ్చం ఎత్తుకుంటూ బతుకుతున్న వాళ్ళని, అక్కడికి వెళ్ళి ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఊరికి తీసుకు వచ్చారు కదా? ఏమయ్యింది?”
“ఊరికి వచ్చిన తరువాత మనసుకు స్థిమితం లేకుండా పాతబడిన బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు ఆ ముసలి దంపతులు.”
మా ఊరి పెద్దవాళ్లందరూ వీళ్ల గురించి చెప్పి చెప్పి నవ్వుకునేవాళ్ళు. “ వీళ్లకి రాతి మనసు. పిల్లలందరూ అమ్మా నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వస్తారే గానీ, వీళ్ళు మాత్రం వాళ్ళను చూడడానికి వెళ్లరు.”
“తాతయ్యని, బామ్మని చూడాలని అనిపించిందా, వచ్చి చూసి వెళ్ళండి. ఈ వయసు మళ్ళిన కాలంలో మేము అక్కడికి రావడం కుదరదు” అని అంటారు పొయ్యాళి దంపతులు.
వాళ్ళ దగ్గర దీని గురించి అడిగినప్పుడు…
“పిల్లలని మరీ గారాబం చేసి ముద్దు చేయకూడదు చూసుకో. తేనె అయినా నీళ్ళు అయినా ఒకేలాగా ఉండాలి ఈ ఆస్తి అంతా నీకే, ఈ ఇల్లు కూడా నీకే అని ఏ తల్లితండ్రులు పిల్లల దగ్గర చెబుతారో, ఆ తల్లినీ తండ్రినీ తప్పకుండా ఆ ఇంటి నుంచి తరిమెయ్యకుండా ఉండరు. నేను ఎంత కష్టపడి ఈ ఇంటిని కట్టానో, మేం ఎంత శ్రమలకు ఓర్చి ఆస్తిని కూడబెట్టామో, అలాగే మీరు కూడా ఇల్లూ వాకిలీ ఏర్పరచుకోండి అని చెప్పాలి. ఇలా చెప్పిన తల్లి తండ్రులను పిల్లలు గౌరవిస్తారు” అని అన్నారు.
“కష్టాలని చెప్పి పిల్లల్ని పెంచాలి. ‘నేను ఉండగా నీకేం తక్కువ?’ అంటూ పిల్లలని పెంచే తల్లీ తండ్రీ, ఆఖరు రోజుల్లో నిమ్మాండు నాయక్కర్ , ఆయన భార్యా బిచ్చం ఎత్తుకుంటూ చచ్చిపోయిన చందాన చావాల్సి వస్తుంది.”
“తల్లి ఇంటికి వెళ్ళినా నిన్ను నువ్వే చూసుకోవాలి’ అన్న సామెత పెద్దలు చెప్పిందే కదా” అంటూ నాణమ్మాళ్ కూడా ఆయనకు వంత పాడుతుంది.
ఎప్పుడు వీళ్ళింటికి వెళ్ళినా వీళ్ల ఇంట్లో రెండు మేకలు నిలబడి ఉంటాయి. “పేదల పాలిటి ఆవు” అంటారు వీటిని. ఆవు దగ్గర రెండు సార్లు మాత్రమే పాలు పితుక్కోవచ్చ్చు. చూలింత మేక దగ్గర తలచుకున్నప్పుడల్లా పాలు పితుక్కోవచ్చు.
ఒక మధ్యాహ్నం వేళ వాళ్ళింటికి వెళ్లాను. తాటి బెల్లం వేసి అప్పుడే తీసిన పాలతో అధ్బుతమైన టీ తయారు చేసి ఇచ్చారు నాణమ్మ.
“ఈ వేళప్పుడు తాజా పాలు ఎక్కడివి?” రుచి చూసి, గుటక మింగుతూ అడిగాను. జావా కొబ్బరి బొండాం లాంటి పొదుగుతో నిలబడి ఉన్న మేకను చూపించారు సంతోషంగా.
పెద్ద నాయక్కర్ ని (పోయ్యాళి నాయక్కర్) తొంగి చూశాను.
“కాస్త ఉండు. ఇప్పుడే వచ్చి కాస్త పడుకున్నారు. చిన్న సవ్వడి వినిపించినా లేచేస్తారు” అంటూ లోగొంతుకతో నన్ను హెచ్చరించారు.
పై కప్పు వేసిన ఆ మట్టి ఇల్లు ఎండాకాలానికి తగిన వాసస్థలంగా, ఆమోదయోగ్యంగా ఉండింది.
ఇంటి వాతావరణాన్ని పరిశీలించాను. వేపచెట్టు నీడ. నునుపుగా చదును చేసిన చెక్క పీటలు. లేచి ఇంటి చుట్టూ తిరిగి చూసాను. ఆడంబరంగా ఏమీ లేదు. ఏవి కావాలో అవి మాత్రం ఉన్నాయి. అరటి, కొబ్బరి, మునగ, విషపు విరుగుడు చెట్టు, కంచెలో అల్లుకున్న కొండావు చింత తీగ, ఆకుకూరలు, పెంచుతున్న తేనెపట్టు, కరివేపాకు చెట్టు.
“వీటిని అన్నింటినీ ఎవరు చూసుకుంటున్నారు?”
“మేమే మరి.”
మునగ చెట్టు మీద పొటమరించిన గోందు (పిశిను) భిన్నంగా అనిపించింది. కాస్త తీసి నొక్కి చూసినప్పుడు, నాణమ్మ “దాన్ని ముట్టుకోకు. ఆయన ప్రాణం” అంది.
“ఎలా?” అని అడిగినందుకు, “పిసరంత మునగ గోందును వేసుకుని కలకండ కలిపి మేకపాలు త్రాగుతారు.” అని అంది.
ఈ వృద్దాప్యంలోనూ వాళ్ళ ఆరోగ్య రహస్యం అర్ధం అయినట్లు అనిపించింది నాకు.
ఆ ఇంట్లో పగటిపూట ఒక రోజు గడిపితే చాలు, చుట్టూ ఉన్న ఊరి జనం వాళ్ళతో ఎంత ఆప్యాయంగా, దగ్గరితనంతో ఉన్నారన్నది అర్ధం అవుతుంది.
చంకన బిడ్డను వేసుకుని వెతుక్కుంటూ వచ్చే తల్లులకు చిట్కా వైద్యం చెప్పడం, పిల్లలకు అన్నాలు పెట్టడం, మనసు ఉడిగి పోయి వచ్చే వాళ్ల కన్నీటిని తుడిచి స్వాంతన చెప్పడం… అన్నింటినీ చూసిన నాకు “అన్నపూర్ణీ విశాలాక్షీ” అన్న సామ రాగం కీర్తన మొదటి పంక్తి గుర్తుకు వచ్చ్చింది.
వీళ్ళ జీవితమే ఒక సందేశం!
‘సరుగుడు కట్టెలను పోగు చేయడానికే సమయం ఉంది, చలి కాచుకోవడానికి సమయం లేదు’ అన్న చందాన మారిపోయిన ఈ నాటి వయోవృద్ధులకి ఈ కధ సమర్పణం.
సీగై చెట్టు = నిప్పు అంటుకోని చెట్టు
*
కథ చాలా బాగుంది గౌరీ కృపానందం గారికి ధన్యవాదాలు ముఖ్యంగా వృద్ధులు ఈ కథ నుండి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఆసక్తికరంగా రాశారు