“నాకింత కవిత్వం పెట్టండి బాబూ
అక్షరాలతో పొట్టనింపుకుంటాను
కవిత్వం కోసం గుండె వాచినవాణ్ణి
కవుల కలాల ముందు కళ్ళు చాచినవాణ్ణి”
అంటూ దివికేగిన సాహితీ శిఖరం ఆచార్య ఎండ్లూరి సుధాకర్. 2023 జనవరి 21న అరవై నాలుగవ జయంతి. ఆయన మన మధ్య నుండి దూరమై అప్పుడే సంవత్సరం కావస్తోంది. వీరి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన సహచరి, రచయిత్రి స్వర్గీయ డా.పుట్ల హేమలత గారు స్థాపించిన “మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య వేదిక” ద్వారా వారి కుమార్తెలు మానస మనోజ్ఞ, కోర్ మెంబర్స్ డా. ఎ. లక్ష్మణ్, డా. తాళ్ళపల్లి యాకమ్మ, నేను కలిసి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ప్రతిభా పురస్కారం ఇక నుండి ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాలలో తెలుగు సాహిత్య పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఒక పరిశోధక విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయల నగదును మెమెంటో, సర్టిఫికెట్ తో కలిపి అందించనున్నారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జయంతి సభ 21.01.2023 శనివారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. డా.పెనుమాకూల భాస్కరరావుకి ఈ సభలో ప్రతిభా పురస్కారం అందించడం జరుగుతుంది. అలాగే ఎండ్లూరి సుధాకర్ రచించిన కవితా సంపుటి ‘ నల్లద్రాక్ష పందిరి ‘ ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించిన రుబాయిలను ‘ నజరానా ‘ పుస్తకాల ఆవిష్కరణ కూడా జరుగుతుంది.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ని స్మరిస్తూ…
“రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచిరానా
నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడచిరానా
ఏడేడు సాగరాలు దాటిరానా” అంటూ తారాన్వేషణలో పయనమైపోయిన నెలరాజతడు. వాడ పదాలకు, వాడని పదాలకు
మెరుగులద్దిన సాహితీ సూర్యుడతడు.
షాయిరీలను నక్షత్రమాలగా చేసి,”సరస్వతిని శాశ్వతంగా మా వాడ కోడలి”ని చేసిన కవిరాజు అతడు. వెయ్యేళ్ళ ప్రబంధ నాయిక సరసన, వెండి కడియాల నల్లసుందరిని ఓ నా చండాలికా…! నా కావ్యానికి కావ్యనాయకను చేస్తున్నానంటూ సింహాసనమెక్కించిన ధీరుడతడు. వీధి బడి నుండి విశ్వవిద్యాలయం దాకా ఎదిగిన సాహితీ శిఖరమతడు. నూరుమందికి పైగా పరిశోధకుల్ని తెలుగు సాహితీ ప్రపంచానికి అందించిన సాహితీ కృషీవలుడు, నిత్య నూతన పరిశోధనాన్వేషి అతడు. నేటితరం దళిత కవిత్వానికి దళనాయకుడతడు. స్వాతంత్ర్యం సిద్ధించినా “నేనింకా నిషిద్ధ మానవుణ్ణే”అంటూ నలుగురిలో నా జాతిని గుర్తించమంటూ “వర్తమానం” తో దండోరా వేసి సమాజాన్ని మేల్కొలిపి రాజమహేంద్రి నడిబొడ్డున నిలబడి, భాగ్యనగర పుర వీధులవైపు “కొత్త గబ్బిలాన్ని” ఎగరేసిన నవయువ కవితా చక్రవర్తి వారసుడతడు. ఇలా ఎంత చెప్పుకున్నా తరగని జ్ఞాపకాల దొంతర అతడు. వీధి బడి నుండి విశ్వవిద్యాలయం దాకా ఎదిగిన సాహితీ శిఖరం ఆచార్య ఎండ్లూరి.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారిని పుస్తకాల్లో చడవడమే గాని వారిని చాలా కాలం వరకు ప్రత్యక్షంగా నేను చూసింది లేదు. మొదటిసారిగా రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి ప్రవేశ పరీక్షలో చూశా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్యపీఠం, రాజమండ్రిలో ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు గారు 2018లో నన్ను, శ్రీమతి కె.కళ్యాణి, శ్రీమతి టి.సుజాత గార్లను తమ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులుగా మా పర్యవేక్షణ బాధ్యతను స్వీకరించారు. మా ముగ్గురిలో లఘు సిద్ధాంత వ్యాస సమర్పణ చేసిన చివరి విద్యారిని నేనే. సుధాకర్ గారి పర్యవేక్షణలో డా.వూటుకూరి వరప్రసాద్ గారు రాసిన “తెలుగు పరిమళం”దీర్ఘకావ్యం పై సిద్ధాంత వ్యాస సమర్పణ చేసిన అదృష్టవంతుణ్ణి. సుధాకర్ గారి జీవిత భాగస్వామి స్వర్గీయ డా.పుట్ల హేమలత గారు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. కవిత్వం రాయమంటూ ప్రోత్సహిస్తూ, సుధాకర్ సార్ రాసిన కవిత్వ పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పేవారు. సుధాకర్ గారి స్పూర్తితోనే నేను కూడా చిన్న చిన్న కవితలు రాయడం, వ్యాసాలు రాయడం నేర్చుకున్నా. హేమలత గారి సాహిత్య సాన్నిహిత్యంలో సాహితీ మెళుకువలు నేర్చుకున్నా.
28-1-2022 తెల్లవారు జామున ఒక విషాదకరమైనవార్త వినవలసివచ్చింది. నాన్న మనందరినీ విడిచి అమ్మ దగ్గరికి వెళ్లిపోయారని సోదరి మానస ఫోన్ చేసి చెప్పారు. మేమంతా నిశ్చేష్టులయ్యాము.
ఆయన ఒక విజ్ఞానపు గని, సందర్భాన్ని బట్టి ఛలోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. పరిశోధకులను ముందుండి నడిపించడం, వారి లోటుపాట్లు ఎత్తి చూపి సాహిత్యం లో సరైన దిశానిర్దేశం చేయడం, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిస్తూ గొప్ప పరిశోధకులుగా తీర్చి దిద్దారు. సుధాకర్ గారు పర్యవేక్షక బాధ్యతలో శతకం పూర్తి చేశారని చెప్పవచ్చు. సుమారు నూట ఎనిమిది మందికి పైగా విద్యార్థులకు పర్యవేక్షక బాధ్యత వహించారు. వీరందరూ తెలుగు సాహిత్యంలో కవులుగా, రచయితలుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారు.
“మనిషి కోసం కవిత్వం
మంచి కోసం కవిత్వం”అని ఆయన ఎప్పుడూ అటుంటారు. సుధాకర్ గారికి తెలుగుతో పాటు ఆంగ్లం , హిందీ, ఉర్ధూ, మరాఠీ భాషలపై మంచి పట్టు ఉంది. ప్రముఖ మరాఠీ కవి “శరవణ్ కుమార్ లింబాలే” గారి రచనలు తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగు సాహిత్యంలో వాడ పదాలకు, వాడని పదాలను అందల మెక్కించారు. వచన కవిత్వాన్ని సరళమైన రీతిలో అన్వయిస్తూ గొప్పగా కవిత్వం చెప్పారు.
“ఈ సమాజం నన్ను కవిని చేసింది. ఈ సమాజానికి నువ్వేమిచ్చావు అని అడిగితే ఇదిగో ఈ కావ్యాత్రయాన్ని కానుకగా ఇస్తున్నానంటాను. వీరి నోటి వెంట కవిత్వం వింటూ ఉంటే సమయమే తెలియదు. ఆ గొంతులో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది. పదాల విరుపు చాలా బావుంటుంది. గొంతు చదివే పదాలని బట్టి మారిపోతుంది, సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు హాస్యోక్తులు, ఛలోక్తులు విసురుతూ సభా ప్రాంగణాన్ని నవ్వించగల సమర్ధుడైన కవి ఎండ్లూరి.
“వర్తమానం” ఆయన తొలి కవితా సంపుటి. పరిశోధకుడిగా జాషువా ‘నాకథ’ఎం.ఫిల్ పరిశోధన, జాషువా సాహిత్యం-దృక్పథం-పరిణామం పిహెచ్ డి సిద్ధాంత గ్రంథం ప్రచురించారు. ప్రసిద్ధ దీర్ఘకావ్యం కొత్త గబ్బిలం, మల్లెమొగ్గల గొడుగు(మాదిగల ఆత్మగౌరవ కథలు), నా పుస్తకమే నా ఆయుధం(డా.శరవణ్ కుమార్ లింబాలే మరాఠీ దళిత ఆత్మకథకు సంక్షిప్త తెలుగు అనువాదం), నల్ల ద్రాక్ష పందిరి-డార్కీ(ఉభయ భాషా కవిత్వం), వర్గీకరణీయం, ‘ఆటా’ జనికాంచె, పుష్కర కవితలు, ‘గోసంగి’ దీర్ఘ కావ్యం, నవ యువ కవితా చక్రవర్తి జాషువా, కథానాయకుడు జాషువా వంటి రచనలు చేశారు. సుధాకర్ అనేక సాహిత్య వ్యాసాలు రాసారు. దేశ విదేశాల్లో అనేక అవార్డులు అందుకున్నారు. ఆచార్య కాత్యాయని విద్మహే సుధాకర్ గారి కవిత్వం గురించి చెప్తూ…”కవిత్వానికి కొత్తవస్తువును, పదజాలాన్ని, ఉపమా ప్రపంచాన్నిమొత్తంగా కొత్త దృష్టిని ఇచ్చాడు ఎండ్లూరి సుధాకర్. నెత్తుటి ప్రశ్న (1985-92 )నుండి నీలిక ( 1996) మీదుగా నిమ్నలిపి ( 2000) వరకు ఆయన చేసిన కవితా ప్రయాణం , పరిణామం అర్ధవంతమైనది. ‘నేనింకా నిషిద్ధ మానవుడ్నే’ అన్న స్వస్వరూప జ్ఞానం కలిగిన మనిషి కోరుకొనేది విముక్తినే. సంప్రదాయాలను ధిక్కరించటం, హద్దులను అధిగమించటం, సామాజిక బందిఖానాలను బద్దలు కొట్టటం అనివార్యంగా జరగవలసినవే. వాటికి రకరకాల వ్యక్తీకరణలు ఆయన రాసిన కవితలు. విముక్తి కోరే మానవులు తమదైన సిద్ధాంతాన్ని, కార్యక్రమాన్ని నిర్మించుకోవాలి. ఆ దిశగా ఎండ్లూరి కవిత్వాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి” అని ఎండ్లూరి తన కవితలతో మార్గాన్ని మనకి నిర్దేశం చేశారు.
*
Add comment