వాంగ్ వీ కవితలు మూడు

1
దేవాలయాన్ని దాటుతూ

దేవళానికి దారి తెలియలేదు.

మేఘావృతమైన శిఖరాల మధ్య

మైళ్ళ కొద్దీ నడిచాను.

ఒక మార్గం లేని

ఒక పాదముద్ర కూడా లేని

పురాతన అడవుల గుండా నడిచాను.

 పర్వత అంతర్భాగాలలోంచి

 నాకో గంట వినిపించింది…

 అది ఎక్కడ్నుంచి వచ్చింది?

అప్పుడొక చిన్న ప్రవాహం

భారీ రాళ్ల మధ్య

పరవళ్ళు పెడుతోంది.

పచ్చని నీలి పైన్ వృక్షాల గుండా

సూర్యరశ్మి రంగు కూడా

శోభాయమానంగా కనిపిస్తుంది.

సంధ్యా సమయంలో

ఒక చిన్న నిర్జన సరస్సు పక్కన

మోకరిల్లాను.

భావోద్వేగాల విషపుడ్రాగన్‌ను

తరిమికొట్టడానికి

ధ్యానం చేస్తున్నాను.

2

నా కుటీరానికి తిరిగి వస్తూ

దూరంగా ఒక గంట..

లోయలో నుంచి

ధ్వని వలయాలుగా తేలుతుంది.

 ఒకరి తర్వాత ఒకరు

 చెక్కలు కొట్టేవారు,జాలరులు

 పనిని ఆపి, ఇంటి ముఖం పడతారు.

చీకట్లోకి

పర్వతాలు మునిగిపోతాయి.

ఒంటరిగా, నేను

ఇంటికి తిరిగి వెళుతుంటే

దిగంతం నుండి

మేఘాల దొంతరలు

మూగగా పిలుస్తాయి.

లేత తీగలను తెమ్మర కదిలిస్తుంది.

నీటి ఛాతీపప్పు చిగురు పెడుతుంది.

కేట్కిన్ పూలరజను రాలి

వేగిరంగా గాలిలో సాగిపోతుంది.

తూరుపున చిత్తడినేలలో

కొత్తగా చిగురు పెరిగి

వన్నెలద్దుకుంది.

గుడిసెలోకి నడిచి

తలుపు మూసుకోవడం..

ఎంత బాధాకరం..

3

చిత్తడినేల మీద తేలుతూ

శరత్కాలం.

ఆకాశం బ్రహ్మాండంగా, నిర్మలంగా వుంది.

పొలాల నుండి, ఇళ్ల నుండి

ఈ బురదనీటి నేల మైళ్ల దూరంలో ఉంది.

ఇసుక తిన్నె చుట్టూ నిలబడి

కొంగల కోలాహలానికి అవధుల్లేవు.

దూరంగా మేఘాల పైన నిలబడి పర్వతాలు.

సంధ్యా సమయంలో

ఈ నీళ్ళు

పూర్తిగా నిశ్చలంగా..

తల పైన

తెల్లగా చందమామ.

నేను ఈ రాత్రికి

నా పడవను యదేచ్ఛగా నడిపించాను.

నేను ఇక ఇంటికి వెళ్ళలేను.

( వాంగ్ వీ (  ? –  761  )ఒక చైనీస్ సంగీతకారుడు, చిత్రకారుడు, కవి, మధ్య తంగ్ రాజవంశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను తన కాలంలో కళలలోనూ మరియు కవిత్వంలో అత్యంత విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతని దాదాపు 400 కవితలు లభ్యమవుతున్నాయి. వాటిలో 29 కవితలు 18వ శతాబ్దపు సంకలనం ‘త్రీ హండ్రెడ్ టాంగ్ పోయమ్స్‌’లో చేర్చబడ్డాయి)

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయాన్ని తేలిక చేస్తున్న ఈ వాంగ్ వీ కవిత్వం సరళమై,సంపన్నమై, దిగంతాల వరకు నన్ను నడిపించింది.
    ఈవేళ నా ఊపిరి కొత్త సరాగాల్ని అలపిస్తోంది.కొంగల బారు మీదుగా తెలిపోతూ రేపటికి నేనూ తెల్లని చందమామనవుతాను.

    డియర్ గౌడ్ ఎలా తీర్చుకోవాలి తెలుగు సాహితీ ప్రపంచం ఈ నీ రుణాన్ని..నీ కేంద్రిత స్వప్నాలను పద జల్లులుగా ఇలా నాపై ,మాపై ఎప్పటికీ కుడుస్తూ ఉండు..

    లవ్ యూ..❤️

  • హృదయాన్ని తేలిక చేస్తున్న ఈ వాంగ్వి కవిత్వం సరళమై,సంపన్నమై దిగంతాల వరకూ నన్ను నడిపించింది. ఈవేళ నా ఊపిరి కొత్త సరాగాలని ఆలపిస్తోంది. కొంగల బారు మీదుగా తేలిపోతూ రేపటికి నేనూ తెల్లని చందమామనవుతాను.

    డియర్ గౌడ్!
    ఎలా తీర్చుకోవాలి తెలుగు సాహితీ ప్రపంచం నీ ఈరుణాన్ని.ఈ నీకేంద్రిత స్వప్నాలను పద జల్లులుగా మాపై,నాపై ఎప్పటికీ ఇలానే కురుస్తూ ఉండు.
    లవ్యూ…❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు