I
ఇవి చినుకులు కాదు
తుంపర
మబ్బుల్లోని చివరి తడి బొట్లు
తాకితేనే
అంటుకుని అంతుచిక్కేవి
ఈ క్యాంపస్పై తేలాడే మబ్బులు
కురిసీ కురిసీ కాసింత సేపు విరమించి
కురిసిన ధారంతా ఈ బఫెలో లేక్ లో.
నీ పేరు సంస్కృతంలో వర్ష
నిన్ను వాన అని పిలవడమే నాకు నిన్ను ఏడిపించే పనుల్లో ఒకటి
జీవితంలో కావాలనుకుని
కలలు కన్న మోనిసావి నువ్వు
మోనిసా అంటే ప్రాణస్నేహితురాలు
వాన పడితే తడిగా పచ్చగా మారుతుంది కదా నేల
అలానే ఉంది మనిద్దరి చుట్టూ
నీళ్ళలో తేలుతున్నట్టుగా కనిపించే
ఈ గరుకురాయిపై కూర్చుని
ఇక మొదలెట్టాను నేను మాటలని
తుంపరలాంటి జల్లుల్లాంటి చినుకుల్లాంటి మాటలని
నువ్వేమో
ఈ సరస్సులాగే నా చినుకుల్లాంటి మాటలను నోరు మెదపుకుండా వింటూ
నా జ్ఞాపకాలని నీలోకి పోసుకుంటూ
ఇదిగో
ఆ చిట్టి పొదగట్టు ఆవల
నేనూ నా మలయాళీ కూట్టుగారన్లూ* కలిసి
ఈ వేసవి సెలవుల్లో
సాయంత్రాలకు చేపలకూ గాలం వేసేవాళ్ళం
నల్లరేగడి నేలను తవ్వి
రాళ్ళను లేపి ఎరలను లేపేవాళ్ళం
కొక్కానికి ఎరలను
మా అమ్మ సైకిల్ చువ్వకి నాడాబొందును గుచ్చినట్లు గుచ్చేవాళ్ళం
మబ్బులు చెరిగిపోతున్నట్లు
మా రిషి సిగరెట్ తాగేవాడు
వాడికి
తుమ్మెదలు, చేపలని వేటాడే నీటి పక్షులు
దూరంగా ఎగిరిపోయేవి
నాలాగే
నింగి నుండి చినుకుల బుడుంగ్
ఈ నీళ్ళనుండి చిట్టి చేపలు వెక్కిరిస్తూ బుడుంగ్
ఆ చప్పుడు నువ్వచ్చం ఊఁ కొడుతున్నట్టుగానే
రిషి, తమీజ్ జానెడు బురదమట్టల్ని పట్టారని
పంతానికి పోయి
పాముని పట్టాను తెలుసా అని ముగించాక
ఈ సరస్సులో నీళ్ళు
శబ్దం చేస్తూ పారుతున్నట్లు
నీ నిర్మలమైన నవ్వు.
ఆ నవ్వు తర్వాత మబ్బులు వీడి
మనిమిక నీటి ప్రతిబింబాలలో మిగిలి.
*కూట్టుగారన్- మలయాళంలో సావాసగాళ్ళన్న అర్థం వచ్చే పదం
II
నీ ముఖమెందుకో అస్పష్టంగా ఉంది నాకు
నిన్ను నేను గుర్తుచేసుకోవాలనుకున్నప్పుడు
నువ్వెళ్ళిపోయాక గుర్తున్నదల్లా
కొన్ని స్పష్టమైన మన మధ్య జ్ఞాపకాలు
•
ప్రత్యేకంగా నీ చేతులు గురించే రాస్తున్నాను— నీ పక్కనున్నప్పుడు నీ చేతులే సుడులు తిరిగి లతల్లా అల్లుకున్న నా వెంట్రుకలను నిమిరినది. ఆ వేళ్ళ తాలూకా చెట్టునో స్పర్శనో నా తలపై నాటినట్టు. భయపడతాను నాకు నేనే చారలు పడి మొటిమలు పగిలి, నల్లటి గుర్తులతో ధ్వంసమైన నా చెంపలని చూసి, నూనూగు గడ్డపు వెంట్రుకలు ఆ చర్మ ధ్వంసాన్ని కప్పుతున్నట్లుండే చెంపలను చూసి. అయినా ఆ చేతివేళ్ళు, ముద్దొచ్చి పసివాడి చెంపలని లాగుతున్నట్లు, బిడ్డను కనకుండానే నీలో మాతృత్వం అలవరినట్లు నా చెంపలని నిమురుతాయి మృదువుగా. వలలాగా మారిపోతుంది ఒకోసారి నీ కుడి చేయి— నీకు మాత్రమే కనబడే నా దిగులునో చింతనో ఇంకేదో చీకటిలాంటి విస్మయాన్నో, నిశ్శబ్దంగా నవ్వుతూ మంత్రాలు తెలియని మంత్రగత్తెలాగా నీ అరచేతితో నా ముఖాన్ని కప్పి లాగేస్తావు వాటిని. మూసుకున్న నీ చేతిని ఒంటెలానో, పడగ ముడుచుకునే పాములాగానో పోల్చుకుంటాను, వెనుకగా వాటి నీడలను కూడా- పిల్లలు చీకటిగదిలో కొవ్వొత్తి వెలుగులో ఆడుకున్నట్లు. ఇప్పటికీ నీ చేతిస్పర్శ ముఖంపై పులకరింత, పరిమళమేదో నిన్ను నాకు గుర్తు చేస్తూ. అప్పుడు కూడా ప్రయత్నిస్తాను నీ ముఖం ఎలా ఉంటుందోనని! మసక. రాళ్ళపై పడి నీ ఒళ్ళు రక్తాలపాలైనట్లు భయపడే నిన్ను నీ చేతులు పట్టుకునే కొన్ని సంధ్యావేళలు High Rocks మీదకీ Mushroom Rocks మీదకీ ఎక్కిస్తూ తీసుకెళ్ళినప్పుడు నీ చేతుల్లో ఇంకా నేనిచ్చిన ధైర్యం. నీ కళ్ళలో ఆ ప్రాంతాల్లో వీచిన గాలిలాంటి ప్రశాంతత. పిల్లవాణ్ణి తల్లి కౌగిలించుకున్నట్లే ఉంటుంది నువ్వు నన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు. అప్పుడు కూడా నీ చేతులే చెబుతాయి స్పర్శతో
— Please know that you’ll be loved.
(వర్షకి)
బావున్నాయి కవితలు