వర్షం గుర్తు

నువ్వుంటే ఆ పరదానంతా పక్కకు తప్పించి, నీ భుజమ్మీద చెయ్యేసి నీకు ఆ దృశ్యం చూపించి ఉండేవాడ్ని.

రిగ్గా ఈ సమయానికి నేనలా బయటికెళ్లి చూస్తే, ఈ బాల్కనీ మీదినుంచి చల్లగాలి తాకెళ్లిపోతోంది. నువ్వేమైనా వచ్చావేమోనన్న ఆశతో, ఆ సందు చివర, ఇటు సందు చివర మలుపు.. అన్ని దిక్కులా చూశా.

నువ్వు లేవు.

వచ్చి కూర్చొని నీకిది రాస్తున్నా.

సాయంత్రం నేనేదో పన్లో ఉన్నా. అంతసేపున్న వెలుతురు ఒక్కసారే మాయమైంది. చిమ్మ చీకటి. ఒక పావుగంటకు మళ్లీ వెలుగు. మళ్లీ చీకటి. అంతా ఒక ఆటలా సాగుతోంది. లేచొచ్చి, మా ఫ్లోర్ గ్లాస్ గోడకున్న పరదా కొంచెం పక్కకి తప్పించి చూశా. చీకటి. అప్పటికే కింద పెద్ద ట్రాఫిక్ జామ్. లైట్లు వెలిగిపోతున్నాయి. ఆకాశం.. నేన్నిన్ను దగ్గరికి లాక్కున్నప్పుడు నువ్వు చూసే కైపు చూపులు చూస్తోంది.

నువ్వుంటే ఆ పరదానంతా పక్కకు తప్పించి, నీ భుజమ్మీద చెయ్యేసి నీకు ఆ దృశ్యం చూపించి ఉండేవాడ్ని.

నువ్వు నాతో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. నేను నీ కళ్లలోకి చూస్తూ ఆ మాటలు వింటూ ఉంటా. కాసేపటికి ఇద్దరం ఖాళీ అయ్యే రోడ్డును చూస్తూ ఉంటాం . వర్షం పడుతూ ఉంటుంది. ఒక్కో చినుకు.. ఒక్కో చినుకు.. చిన్న వర్షం.

నువ్వులేవని తెలుస్తుంది. నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేయాలి అనిపిస్తుంది, ఎగురుకుంటూ.. ఎగురుకుంటూ.

ముందు ఈ గ్లాస్ డోర్ మీది నుంచి రోడ్డు మీదికి, అలాగే ఆ స్థంభాలకు, ఆ మెట్రో పిల్లర్‌లకు, ఆ రైలు మీదకి, ఆ షాపుల మీదినుంచి ఇళ్లకు.. చివరికి నీ హాస్టల్ గేటు ముందుకు ఎగురుకుంటూ వచ్చి ఆగినప్పుడు.. నువ్వు ఆశ్చర్యంగా చూస్తూ, “ఎగురుకుంటూ వచ్చావా?” అనడుగు.

నవ్వి తలూపుతా.

“ఒక కథ చెప్పు” అనడుగు.

నేనొక కథ చెప్తా.

ఆరోజు ఆకాశం ఇలాగే ఉంది. మబ్బులన్నీ కప్పేశాయి దాన్ని. చుట్టంతా చిమ్మ చీకటి. ఎదురింగింట్లో ఉన్న కొబ్బరి చెట్లు ఊగిపోతున్నాయి. నేను ఆరింటికి లేచి చూశా. మెల్లిగా తలుపు తీసి బయటికొచ్చి చూశా.

“ఇవ్వాళ స్కూలుకి పోయే పన్లేదు.” నాకు నేనే చెప్పుకొని సంబరపడతా.

వర్షం మొదలైపోతుంది. ఇల్లంతా ఒకటే చప్పుడు. ఆ రేకుల మీద వర్షం చినుకులు పడే శబ్దం స్థాయిని బట్టి అదెంత వర్షమో ఊహించొచ్చు. అయినా ఒకసారి తలుపు తీసి చూస్తా. వర్షం పడుతూ ఉంటుంది.

“స్కూల్‍కి పోయే పన్లేదు.”

ఇల్లు అక్కడక్కడా కురుస్తూంటుంది. సర్వలన్నీ అక్కడక్కడ పెట్టొచ్చి అనుకుంటా – ‘బడి ఉండదు ఇంక’.

కానీ చాలాకాలం ఇలాగే గడిచిపోయాక, ఒకానొక రోజు ఆ బడిలో నాతో పాటు నువ్వూ ఉన్నావని తెలుస్తుంది నాకు.

ఆ రోజూ ఇలాంటి వర్షమే కురుస్తూ ఉంటుంది.

ఆ రోజు ఇలాగే తలుపులు తీస్తూ వర్షాన్ని చూస్తా – “ఆగిపోతే బాగుండు. స్కూల్‍కి పోవచ్చు” అని.

“ఆ రోజు వర్షం ఆగిందా?” అని నువ్వు నన్నడుగు.

నీకోసం ఎగురుకుంటూ వచ్చి, నీ ఎదురుగా నిలబడి, వర్షంలో తడుస్తూ, నీకు కథ చెప్తున్న నేను, “ఆపనా?” అనడుగుతా.

“వర్షాన్నా?” అనడుగు నువ్వు వెంటనే.

ఆ వెంటనే, నేనేం చెప్పకముందే, నేను నిజంగానే ఆపేస్తానన్న భయంతో “వద్దు.. వద్దు..” అను.

బేబీ! వర్షం తగ్గేవరకూ కబుర్లు చెప్పుకుందాం.

*

 

 

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు