నువ్వొక అద్భుతమైన వర్ణానివి
కలల్లోంచి నడిచొచ్చి కళ్ళముందు పరుచుకొన్న
ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సముద్రానివి
లోపలికి లాక్కెళుతున్న అలల్లోంచి
వెతుక్కోవాల్సిందేదో, పొగుచేసుకోవాల్సిందేదో
అప్పుడెప్పుడో మనసుపుటలను సుతారంగా తాకి
నన్ను నాలోంచి తీసి గాలిపటంగా చేసి ఎగరేసిన పిల్లగాలివి
వాన నీటితుంపర్లను మోసుకొచ్చి
నా మనసుమట్టిని దమ్ము చేసిన ఆషాఢ మేఘానివి
విచ్చుకుంటున్న మట్టివాసనల్ని
గాఢ సుషిప్తావస్తలోనూ
ముక్కుపుటాలకు అందించే పిల్లతెమ్మెరవి
పేరుకుపోయిన అక్షరాల్లోంచి
ఒక్కో అక్షరాన్ని పేర్చుకొని నీవైపు చూస్తానా
నువ్వేదో పుటలో దూరి అదృశ్యమైపోతావ్
అదృశ్యమైనదాన్ని వెతికే క్రమంలో
అక్షరాల అల్లికలో దాగొని
నువ్వు నాలోనే ఉన్నావనే విషయాన్ని మర్చిపోతాను
లోపలినుంచి ఓ వేడి శ్వాస
నిన్ను చుట్టేసుకుంటూ బయటకు వస్తుంది
ఓ జీవితకాలపు వాస్తవం గా నిన్ను అల్లుకుపోతాను
విద్వేషపు విచ్చుకత్తుల్ని
కళ్ళల్లోని దుఃఖసాగరాల్ని
మానవారణ్యాలలోని మాట్లాడే మృగాల్ని
అన్నింటిని లోబరుచుకుంటూనే
దూరాల్ని దగ్గర చేసుకుంటూ
జీవితం నీతోనే సాగుతూ ఉంటుంది.
*
చిత్రం: సృజన్ రాజ్
బావుంది.
మాధవన్న బహుశా ఊరి గురించి పలవరించి వుంటాడు.
కవిత చాలా బావుంది సర్💐💐💐