ఊర్నుంచి తిరిగొస్తూ బస్సెక్కే ముందు కొన్న బాటిల్ వాటర్ మొత్తం తాగి, ఆ బాటిల్‌కు అంటుకున్న చివరి డ్రాప్స్ అన్నీ చూస్తా. పిడికిలికి సపోర్ట్ ఇచ్చే దగ్గర బాటిల్‌కు ఉండే ఒక ప్యారబోలా షేప్ చుట్టూ ఒక్క చుక్కను మాత్రం.. వచ్చే దారంతా తిప్పుతూ ఉంటాను. ఆ చుక్క ప్యారబోలా చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ చుక్కను నేనని, ఈ ప్యారబోలా నీ దేహమని అనిపిస్తుంది. అంతా తిరిగి అలిసిపోయి మొదటికొచ్చి అక్కణ్నుంచి చుక్కను మళ్లీ తిప్పుతాను.
ఆ తర్వాత ఆ బాటిల్‌కు ఉన్న చుక్కలన్నీ చూస్తాను. ఇదంతా ఒక ప్లానెట్ సిస్టమ్ అనిపిస్తుంది. మొత్తం ప్లానెట్ సిస్టమ్‌లో నేనొక గ్రహాన్ని అనిపిస్తుంది. నీ చుట్టూ తిరగడం బాగుంటుంది నాకు. మనం తిరిగొచ్చిన ప్రతీ ప్రదేశాన్నీ గుర్తుపెట్టుకొని అన్ని చోట్లా నన్ను నేను వదిలేసుకొని వచ్చేస్తాను.
అలా వదిలేసుకొని వచ్చిన చోటల్లా నువ్వుంటావు. నేనుంటాను. ఇంకెప్పుడైనా ఈ దార్లలో మళ్లీ వెళ్లినప్పుడు మనిద్దరినీ చూసుకొని మురిసిపోతాను.
ఇంకొక రెండు నెలల్లో శిశిరం వస్తుంది. ఆకులు రాలే కాలంలో ఈ సందుల్లో ఏ చెట్టు చూసినా నువ్వే గుర్తొస్తావు. ఇందాక బస్సులో వస్తున్నప్పుడు దార్లో రోడ్డు పక్కన ఉన్న పూలన్నీ రంగు మార్చుకున్నాయి. పెద్ద పెద్ద చెట్లకు ఉన్న ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి రాలేందుకు సిద్ధమవుతున్నాయి. “మా అపార్ట్‌మెంట్ ముందు రాలే ఆకులు లెక్కబెట్టి నీకు ఆ లెక్క చెప్తాను” అని చెప్పినరోజు గుర్తొచ్చి, నువ్వు నా పక్కన లేవంటే బాధవుతుంది. నీకది చెప్పి నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలని ఉంటుంది. అన్నింటికంటే ముందే రాలిపోయే ఆకులు ఇంతకుముందు నేను చూసిన చెట్లవేనా అనుకుంటా. లేదూ ఇవ్వాళ పచ్చగా ఉన్న చెట్లే అకస్మాత్తుగా రాలిపోయేవా అనుకుంటా. బస్సు అక్కడే దిగిపోవాలనిపిస్తుంది.
నిన్నిక్కడికి పిలిచి, నీతో పాటు ఒక్కో చెట్టూ తిరిగి, ఆ చెట్లతో ఇదే మాట్లాడాలనిపిస్తుంది. అలా ఒక పగలు, ఒక రాత్రి, ఇంకో పగలు.. ఒక్కో చెట్టుతో మాట్లాడుతూ వెళ్తామా మనం..
ఒక చెట్టు “హేయ్! నేన్నిన్ను ఇంతకుముందే చూశా” అంటుంది నిన్ను. “నిన్ను కూడా..” అంటుంది నన్ను చూసి.
ఒకరోజు ఇదే దార్లో మనం వెళ్తున్నప్పుడు నేను నీ చెయ్యిని గట్టిగా పట్టుకొని ముద్దు పెడుతున్నప్పుడు, నీ మెడ మీద ముద్దు పెడుతున్నప్పుడు, నువ్వు నవ్వి, “అటు చూడు..” అని చూపించావు గుర్తుందా! వరుసగా పేర్చినట్లున్న చెట్లను చూపించావు.
అప్పుడు మనల్ని మనం ఇక్కడే వదిలేసుకున్నామని, ఆ చెట్టే నిన్నివాళ గుర్తు పట్టిందని చెప్తా. మనిద్దరం సిగ్గుపడ్డట్టు నటిద్దాం. నేన్నిన్ను దగ్గరికి లాక్కొని నీ మెడ మీద ఒక ముద్దు పెడతా. ఈసారి ఆ చెట్టు కళ్లు మూసుకుంటుంది మనల్ని చూసి.
కాలాన్ని బ్రేక్ చేసి, మనకోసం ఆ సాయంత్రమే మన ఒంటిమీద ఆకులు రాలుస్తుంది.
ఇంకోసారి ఆ చెట్టును ఎప్పుడైనా చూడగలమా మళ్లీ అన్నట్టు చూసి పోదాం. నువ్వు నా నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్లిపోతున్న రోజుల్లో, నేను సరిగ్గా ఆ చెట్టులా ఉండేవాడిని. ఆ చెట్టు ఏ రోజైనా ఏడ్వగలదా అని ఆలోచిస్తా. వచ్చే దారిలో ఒక దాబా ఉంటుంది. ఆ దాబాలో చికెన్ వింగ్స్ కొని, పక్కనే ఐస్‌క్రీమ్ తిన్నాం మనం.. గుర్తుందా?
ఆ దారంతా మనకోసమే ఎవరో వేసి వెళ్లిపోయినట్టు, నేను ఇటువైపు వచ్చినప్పుడంతా ఈ దారంతా నిన్ను వెతికి తెచ్చుకుంటున్నట్టు అనుకుంటా. ఆ తర్వాత ఒక్కో చోట ఆగుతూ, మధ్యలో ఆ చికెన్ వింగ్స్ తింటూ మనం వెళ్లిన ఈ దారంతా నిన్ను వెతుక్కుంటూనే వస్తా. నువ్వెందుకో దొరకవు అన్నప్పుడు బాధేస్తుంది.
మనిద్దరం తిరిగిన ఇలాంటి దార్లన్నీ వెతకడమే పనిగా పెట్టుకొని పోతా. ఏదో ఒక దార్లో నేన్నిన్ను వెతికి పట్టుకుంటే, అప్పటికి నా రూపురేఖలన్నీ మారిపోయినా కూడా, నన్ను గుర్తుపట్టి, “నువ్వేనా?” అని అడగకుండా, “ఇందాకా వచ్చావా?” అని కూడా అడగకుండా, “ఒక ముద్దివ్వా,” అనడుగు.
“మెడ మీదనా?” అని అడగకుండా మెడ మీదనే ఇస్తానొక ముద్దు.
*
Add comment