వచ్చెన్ – విట్టెన్ – విచ్చెన్

   నేను పుట్టింది విట్టుకి మూలవిరాట్టులు ఇంటింటా కొలువై వుండే కోనసీమ. గోదారి నీళ్లు తాగుతూ పెరిగిన నాకు భావ కవిత్వం, అప్రయత్న హాస్యం అభిమానవిషయాలు.   హాస్యం విషయానికొస్తే ఎప్పుడైనా సరే ప్రయాణాల్లో నాతో ఒక పుస్తకాల సంచీ – అందులో అప్పారావుని తెలుగు వారికి అప్పగింతలు పెట్టిన ముళ్లపూడి వెంకట రమణ, Jeeves ని సజీవమూర్తిగా నిలిపిన ఆంగ్ల రచయిత P. G. Wodehouse పుస్తకాలు వుండాల్సిందే.

అది 2006 నవంబర్ ముందు మాట.

అసలు కథ 2005 ఏప్రిల్లో మొదలైంది.

పాతికేళ్ల క్రితం భారతదేశం వదిలి ఉత్తర-అమెరికా వచ్చే దాకా నాకు తెలుగు అంటే ఎంత ఇష్టమో నాకే తెలీదు.

నాగ్గుర్తుండి 2005 ఏప్రిల్ నెలలో – అప్పటికి డాక్టర్ జంపాల చౌదరి గారి సంపాదకత్వంలో ప్రచురింపబడుతున్న అమెరికా తెలుగు పత్రిక “తెలుగునాడి” కి చందా కట్టాము. తర్వాత్తర్వాత చందా అయితే శాశ్వత చందా కట్టాము కానీ అది మాత్రమే శాశ్వతమైంది. “తెలుగు నాడి” ఆగిపోయింది.

సరిగ్గా ఏడాదిన్నర తర్వాత నవంబర్ 2006 లో 50 సంవత్సరాల స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రత్యేక సంచికగా తెలుగునాడి వెలువడింది. దానికి ముఖచిత్రమేమో ఒక చేత్తో కలశం, ఇంకో చేత్తో వరికంకులు పట్టుకుని బాపుగారి కుంచెలో ముస్తాబైన “తెలుగు తల్లి”.   నేను 2005 ఏప్రిల్లో మొదలుపెట్టి ప్రతినెలా తెలుగునాడి చదువుతున్నా ఈ నవంబర్  2006 సంచికకి ఒక ప్రత్యేకత వుంది.

అందులో ప్రచురించిన కథల పట్టికలో మొట్టమొదటి కథ పేరు “రెండో జులపాల కథ – వంగూరి చిట్టెన్ రాజు” – 14 వ పేజీలో.

కథకి పెట్టిన పేరూ, కథ రాసిపెట్టినవారి పేరూ చాలా తమాషాగా అనిపించాయి. చదువుతుంటే ఒకట్రొండు కన్నా ఎక్కువ చోట్లలోనే గట్టిగా నవ్వొచ్చింది.     అదీ వంగూరి వారి రచనలతో నా మొదటి పరిచయం. ఆ తర్వాత కిరణ్ ప్రభ గారి కౌముది అంతర్జాల పత్రికలో చిట్టెన్‌రాజు గారు రాసిన  అమెరికథలు బోల్డన్ని చదివాను.

*

చదవగా చదవగా వోడ్‌హౌస్, వంగూరిల మధ్య నాకెన్నో సామ్యాలు కనిపించాయి – Great minds think alike అంటారు కదా!     నాకు స్ఫురించిన ఆ తమాషా పోలికలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

వోడ్‌హౌస్, వంగూరి ఇంటిపేర్లు వ-కారాది పదాలు.

ఇద్దరూ స్వదేశం వదిలి అమెరికా వచ్చినవారే. రచనలు చేసి ప్రఖ్యాతి చెందినవారే!

వీరిద్దరి ఇంటిపేర్లలోనూ స్థలప్రాముఖ్యత వుంది. అదెలా అంటే వోడ్‌హౌస్ ఇంటిపేరులో ఇల్లు (హౌస్) వుంటే చిట్టెన్‌రాజు గారి ఇంటిపేరులో వూరే వుంది.

వోడ్‌హౌస్ పుస్తకాలు చదివాక నేనూ, నా పిల్లలూ ఎప్పుడూ ఎంతో అబ్బురపడుతూ వుంటాము – ఎప్పుడూ అదే వూస్టరూ-జీవ్స్ కథలు. అయినా ఎన్నిసార్లు చదివినా పరిసరాలు మర్చిపోయి గట్టిగా నవ్వేస్తూ వుంటాము. ఒక్కోసారి నవ్వాపుకోలేక ఇంట్లో నేల మీద దొర్లేస్తూ వుంటాము. అచ్చంగా ROFL అన్నమాట!

అల్లాగే వంగూరి వారి అనేకానేక అమెరికథల్లో అవే చిట్టెన్ రాజూ – క్వీన్ విక్టోరియా కబుర్లే. అయినా ఎప్పటికప్పుడు అప్పుడే చుట్టిన మతాబుల్లా నవ్వుల పువ్వులు రువ్వుతూనే వుంటాయి.

అన్నట్టు ఇక్కడొక విషయం చెప్పాలి. వూస్టర్ – జీవ్స్ కథల్లో ఎప్పుడూ జీవ్స్‌దే పైచేయి. వూస్టరే కథానాయకుడైనా అతను అడుసు తొక్కినప్పుడల్లా అందులోంచి బయటపడెయ్యడానికి జీవ్స్ రావల్సిందే.

అదే వరసలో చిట్టెన్రాజు గారు – క్వీన్ విక్టోరియా కబుర్లలో విక్టోరియాగారే రాణిస్తున్నట్టు రాస్తారు. దానికి నాకు చటుక్కున గుర్తొచ్చే ఒక మంచి ఉదాహరణ “అమెరికారుకూతలూ-కోతలూ” కబుర్లలో లెక్సస్ కార్ కొంటూ cash-back బ్రహ్మాస్త్రం వేసి కారులమ్మేవాడి చేతే డబ్బులిప్పించుకున్న ఇప్పించుకున్న మొట్టమొదటి తెలుగుమహిళగా అమెరికథల చరిత్ర పుటల్లోకి ఎక్కేసారు క్వీన్ విక్టోరియాగారు.

*

ఇకపోతే వోడ్‌హౌస్ పుస్తకాల శీర్షికల్లో “జీవ్స్” ఎక్కువ కనిపిస్తూ వుంటాడు. ఉదాహరణకి కొన్ని పేర్లు: ఇనిమిటబుల్ జీవ్స్, కేరీ ఆన్ జీవ్స్స్, వెరీ గుడ్ జీవ్స్, రైట్-హో జీవ్స్.

అలాగే చిట్టెన్‌రాజుగారి కథల పుస్తకాల పేర్లన్నిటిలో “అమెరికా-క-కి”లు వుంటాయి. “అమెరికట్టుకథలు, అమెరికాకమ్మ కథలు,  అమెరికాకరకాయ కథలు” అందులో మచ్చుక్కొన్ని.

వోడ్‌హౌస్ కథా-నాయకుడైన వూస్టర్ సంక్షిప్త పదాలు వాడుతుంటాడు – “eggs and b.” – అంటే “ఎగ్స్ ఎండ్ బేకన్” అనీ, “g. and t.” అంటే “జిన్ ఎండ్ టానిక్” అనిన్నీ.

చిట్టెన్‌రాజు గారు కూడా తన కథల్లో “ఏ. మొ” (ఏడుపు మొహం), “న. మొ.” (నవ్వు మొహం), “గె. ఎ. మా. యు” (గెడ్డం ఎక్కువ మాసిన యువకుడు) లాంటి బోల్డన్ని సంక్షిప్త పదాలు వాడారు.

ఒకసారి ఎవరో వోడ్‌హౌస్ రాసిన ఒక కొత్త నవలని విమర్శిస్తూ వోడ్‌హౌస్ ఎప్పుడూ అవే పాత్రలు వేరే పేర్లతో అదే సన్నివేశాలతో రాస్తారని అన్నారట.

దానికి వోడ్‌హౌస్ “నా విమర్శకుడి అసంబద్ధమైన వ్యాఖ్యలకు సమాధానంగా ఈసారి నా సమ్మర్ లైట్నింగ్ అనే పుస్తకంలో అన్నీ అవే పాత్రలూ, అవే పేర్లతో రాశాను” అని బదులిచ్చారట.

అచ్చు అలాగే చిట్టెన్‌రాజుగారు తన “అమెరికాకమ్మ కథలు” అనే పుస్తకంలో ఒక చోట “పాత సారా కొత్తగ్లాసులో పోసే అమెరికాకమ్మ కథలే పాఠకులకి నా న్యూ ఇయర్ గిఫ్ట్” అని రాస్తారు.

తన “అమెరికాకిగోల కథలూ-కమామీషులూ” అనే పుస్తకంలో రాసుకున్న ముందు మాటలో చిట్టెన్రాజుగారేమంటారంటే” నా రాతలు కాకిగోల లాగా వుంటాయి అని అమెరికాలో వున్న ‘ఉన్నత ప్రమాణాల బేచ్” సభ్యులు కొందరు అనుకోవడం నా చెవిని పడింది కాబట్టి, ఎలాగా కాకినాడ వాడినే కాబట్టి ఆ పేరు కూడా తగిలిస్తే మొత్తానికి ఈ అమెరి”‘కాకి గోల కథలూ, కమామీషులూ తయారు అయింది” – అని.

*

అమెరికులాసాగా తను రాసే కబుర్లకి “అమెరికట్టుకథలు, అమెరికాకమ్మ కథలు,  అమెరికాకరకాయ కథలు” అంటూ పేర్లు పెట్టి మంచి అమెరికాలక్షేపం చేయిస్తూ కూడా తన కథలని అమెరికాకిగోల అని తనే నిబ్బరంగా ప్రకటించుకోగలిగిన వంగూరి చిట్టెన్ రాజు గారి గురించి నన్ను అబ్బురపరిచే విషయం ఒకటుంది.

ఎవరికి వారికి తమ ఇంట్లో జరిగే ఒక వేడుకకే బంధుమిత్రులని కూడగట్టుకోవడం, ఏ అవాంతరాలూ, అభిప్రాయభేదాలూ లేకుండా ఆ వేడుకని గట్టెక్కించుకోవడం ఎంతో వ్యయప్రయాసల్తో కూడుకున్న పని.

ఇక్కడ చూస్తే వంగూరి వారి తెలుగు సదస్సుకి వచ్చేవారు ఒకరికొకరు అంతగా తెలియరు. ఎక్కడెక్కడి నుంచో రాజుగారి అత్మీయ-ఆహ్వానాన్ని అందుకుని కేవలం తెలుగు మీద ఇష్టంతో తెలుగు మాట్లాడేవారి మధ్య ఓ రెండ్రోజులు తెలుగుని చెవులారా విందామని వచ్చేస్తుంటారు.

ఇలా తెలుగు కోసం ఒక సదస్సు జరపడం, వచ్చినవారిని వియ్యలవారికి చేసినట్టు మర్యాదలు జరపడం, వెళ్లేటప్పుడు మనసు నింపి సాగనంపడం వంగూరి వారికి, వారి కార్యనిర్వాహక వర్గానికే చేతనైన మహేంద్రజాల విద్య. వారందరికీ నమోనమః!

ఇలాంటి సదస్సులు జరపాలంటే పూనిక వుంటే చాలదు, అడుగడుగునా తోడు నిలించి సంభాళించే ఊనిక కూడా కావాలి. చిట్టెన్ రాజుగారి పూనికకి ఊనికగా నిలిచే శాయి రాచకొండ గారికి నమోనమః!

ఇక్కడ అందరినీ కలిపి వుంచే ఒకే ఒక సూత్రం తెలుగు సాహిత్యం. ఇది ఒకరి ఇంటి పండగ కాదు. ప్రతి రెండేళ్లకి – అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకసారి, అంతర్జాతీయంగా ఒకసారి – జరిగే ఈ తెలుగు-సాహిత్య సమావేశోత్సవానికి చిట్టెన్‌రాజు గారే సూత్రధారి, దర్శకులు, దిశానిర్దేశకులు.

అందుకే ఆయన రాసేవి మామూలు “అమెరికాకి గోల” కావు.

“కావు, కావు” మన్న తెలుగు పలుకుని కావగా పలికిన అమెరి”కావు”కబుర్లు.

*

చిట్టెన్ రాజు గారి తెలుగు సాహిత్య సమావేశోత్సవోత్సాహం తలచుకున్నప్పుడల్లా నాకెంతో ఇష్టమైన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత వొకటి గుర్తుకొస్తుంది.

మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల?

పరుల దనియించుటకొ? తన బాగుకొఱకొ?

గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ?

చిట్టచివరిగా అలనాటి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ అన్నట్టు Veni – Vidi – Vici (I came – I saw – I conquered) చిట్టెన్‌రాజు గారి గురించి నావి మూడు మాటలు “వచ్చెన్ – విట్టెన్ – విచ్చెన్”

వంగూరి చిట్టెన్‌రాజు గారు

అమెరికా వచ్చెన్

శ్రీరంగం వారు కోరారని

విట్టు మీద విట్టుగా విట్టెన్

విట్టిన కబుర్లు మరింత విచ్చెన్

అవి చదివిన నా మనస్విచ్చెన్

*

లలిత టి. యస్.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు