పట్టమేలే రాజువైతే
పట్టు నన్నిపుడంచు కన్యక
చుట్టుముట్టిన మంట
లోనికి మట్టి తా చనియెన్
ఇది గురజాడ వారు రాసిన కన్యక కవిత లోని పతాక సన్నివేశం. నిర్భీతిగా, నిస్సిగ్గుగా తనను బలాత్కరించబోయిన రాజును కన్యక ఎదిరించిన విధానం ఇది. రాజు అంటే స్టేట్ అనీ, రాజ్యహింస ను ఆనాడు ఒక స్త్రీ వ్యతిరేకించిన, ఎదిరించిన విధానం అదీ అని పలుమార్లు చెప్పుకున్నాం.
కుటుంబంలో పితృస్వామ్య ఆధిపత్యం నుంచి వచ్చేహింసను కూడా పూర్ణమ్మ కథలో గురజాడ ఎలా వ్యతిరేకించేడో లేదా పూర్ణమ్మ ఎలా ఎదిరించిందో కూడా చదువుకున్నాం.
ఐతే ఇంత స్పష్టంగా పైకి కనపడని కుటుంబహింస గురించి కూడా మన రచయితలు గత ముప్పయి ఏళ్లుగా రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక సినీమా దర్శకుడు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. చెప్పదెబ్బ వెనక ఉన్న ఆధిపత్యభావజాలం కానీ దాని నుంచి ఏర్పడిన పెంపక విధానం గానీ ఇవాళ కొత్తగా ఒక సినిమా చూసే మనం గ్రహించనక్కరలేదు. ఐతే ఇంకా ఆశ్చర్యంగా వందేళ్లకిందటే టాగూర్ ఈ అంశం మీద రాసిన కథ నన్ను ఆశ్చర్యచకితను చేసింది
అందులో ఆయన ఒక యువతి కుటుంబం లేదా భర్త తన మీద చూపిన భయంకరమైన ఆధిపత్యాన్ని ఎంత కఠినంగా నిరసించిందో, వ్యతిరేకించిందో, ఎదిరించిందో చదువుతూంటే దిగ్భాంతే కలిగింది. ఈ పదం చాలా మంది అనేకమార్లు వాడుతూ ఉంటారు గానీ ఈ సందర్భానికి మాత్రం ఇదే తగిన పదం అనిపించి వాడేను. నిజం దిగ్భాంతే!
కథ పేరు ‘శిక్ష’.
1893 లో రాసిన కథ ఇది.
జమీందారీ లు నడుస్తున్న రోజుల్లో పేద ఇంటి అన్నదమ్ములు వారి భార్యల కథ. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసే ఉండేవారు. ఆ సమయంలో మగవాళ్లకి కూలి పనులు లేవు.డబ్బులు లేవు. ఆడవాళ్ల కి వంట చెయ్యడానికి ఇంట అన్నీ నిండుకున్నాయి.
తిరిగి తిరిగి ఏ పనీ దొరక్క ఆకలితో నీరసం తో ఇంటికి వచ్చిన భర్త తో పెద్దకోడలు స్వభావరీత్యా ఉన్న గయ్యాళీ తనంతో పెడసరంగా మాటాడుతుంది.
రోజంతా కష్టపడి, బయట తిట్లు తిన్నాక, అన్నం లేని, ఆనందం లేని చీకటి కొంపలో రగులుకుపోతున్న ఆకలిమంటలో భార్య కటువైన మాటలకు, కుత్సితమైన ఎత్తిపొడుపుకు దుస్సహంగా అనిపించి చేతిలోని కొడవలితో పెద్దవాడు భార్య నెత్తిన ఒక్కపెట్టు పెట్టాడు. ఆమె తన తోటికోడలు ఒడిలో పడిపోయింది. ప్రాణం పోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు.
రాధ పడిపోగానే తోటికోడలు చంద్ర ఒక్కకేక పెట్టింది. చిన్నవాడు చిదాం ఆమె నోరు మూసాడు.అన్న దుఖీరామ్ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని మతిపోయిన వాడిలా అక్కడ కూలపడ్డాడు. వాడి ఏడాదికొడుకు గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు
ఇదీ ఆకస్మికంగా జరిగిన దుర్ఘటన
ఇక అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.
వాళ్లు ఆ ఆకస్మిక దుస్సంఘటనకు మతులు పోయిఉండగా జమీందారు మనిషి తన పొలం కౌలు చేస్తున్న దుఖీరామ్ నుంచి మక్తా రాలేదని దాని వసూలు కోసం వచ్చాడు. దీపం లేని చీకటిల్లు అతన్ని సందేహంలో పడేసింది.
అతను ఏడుస్తున్న వాళ్ళని చూసి ఏం మళ్లీ వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారా అన్నాడు. అది మామూలే. తోటికోడళ్లు రోజూ చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూనే ఉంటారు.
ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో తోచని చిదాం అవును అన్నాడు
ఈ మాత్రానికే ఎందుకు ఏడ్వడం దుఖీ అంటూ అతను లోపలికి రాబోయే లోపు చిన్నవాడు చిదాం
“పోట్లాడి పోట్లాడి చిన్నకోడలు పెద్దకోడలి ని కొడవలి తీసుకుని నెత్తిన ఒక్కటి వేసింది” అన్నాడు. “రామరామ చచ్చిపోలేదు కదా” అని ఆ మనిషి అంటే “చచ్చిపోయింది ఇప్పుడు మీరే నా భార్యను కాపాడాలని” కాళ్లుపట్టుకున్నాడు
కానీ పెద్దమనిషి “మీ అన్నే చంపేడని చెప్పు. అప్పుడు ఆమె బయటపడుతుంది”. అంటే” పెళ్లాం పోతే మరొకతి వస్తుంది. అన్న రాడు కదా” అంటాడు. ఇక ముందున్న మాట మీద నిలబడడానికి ఏవో యుక్తులు పోగుచేసు కున్నాడు. అలా వచ్చిన మాటలే ఇవి.
అదే మాట ఊరంతా పాకిపోయింది. చంద్ర తోటికోడలిని కొడవలితో కొట్టి చంపిందని అందరూ నమ్మేలాగ.
చంద్ర కి నెత్తిమీద పిడుగుపడినట్టయింది. చిదాం ఆమెను ఒప్పుకోమని బతిమలాడు. ముందు ఒప్పుకుంటే తర్వాత ఎలాగైనా రక్షించుకుంటామని చెప్పేడు. ధైర్యం చెప్పబోయేడు గానీ గొంతు పొడారిపోయింది.
ఒక హఠాత్ సంఘటన లో చిదాం నోటివెంట అలాంటి అసత్యం ఎందుకు వచ్చింది. ఇది యాదృచ్చికం ఎలా అవుతుంది?
ఇక్కడ టాగూర్ పూర్వాపరాలు చెప్తాడు. చంద్ర ఎలాంటి పిల్లో ఇలా రాస్తాడు
“పదిహేడు పధ్ధెనిమిదేళ్ల కంటే ఎక్కువ ఉండవు. గట్టిశరీరం, మంచి ఆరోగ్యం, ప్రతి అవయవంలోనూ సౌష్టవం, కొత్తగా తయారుచేసిన నావలాంటిది ఆమె. ప్రపంచంలో అన్ని విషయాలమీదా ఆమెకొక ఆసక్తి కుతూహలం ఉన్నాయి. అందరితో కబుర్లు ఇష్టం. కడవ చంకనపెట్టుకుని రేవుకు వెడుతూ మొహం మీది కొంగు తప్పించి అంతటినీ పరికించడం ఇష్టం “
ఇలా ఆమె కు జీవితం మీద ప్రపంచం మీద ఉన్న ఇష్టాన్ని చెప్తాడు. స్వేచ్ఛ మీద ఆసక్తిని చెప్తాడు.
చిదాం కూడా ఉల్లాస పురుషుడు. అందాన్ని ఇష్టపడుతూ అందంగా ముస్తాబవుతూఉంటాడు. ఆడవాళ్లను ఆకర్షించాలనే కోరిక ఉన్నా అందమైన భార్య పట్ల మరింత ఆకర్షణ
కానీ కొంతకాలంగా పొరుగూళ్ల కు వెళ్లి ఎవరెవరి తోనో గడిపి డబ్బు ఖర్చుపెట్టుకుని ఖాళీ చేతులతో వస్తున్నాడు.
చంద్ర అతనితో ఈ విషయమై గొడవపడకుండా తనుకూడా ఎప్పుడంటే అప్పుడు రేవుకు వెళ్లడం అతిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.. మరో యువకుడి గురించి ఎక్కువగా మాట్టాడ్డం మొదలుపెట్టింది. అప్పుడు తన తప్పు తెలుసుకుంటాడని బహుశా భావించిఉంటుంది
కానీ అలా జరగలేదు. తను తిరగడం తన హక్కని ఆమె ప్రవర్తన తప్పని అతని ఉద్దేశం. సమాజం లెక్క కూడా అదే కదా. అందుకే తిట్టి, కొట్టేడు. ఇద్దరూ గొడవపడ్డారు. ఆమెను బలవంతంగా ఇంట్లో పెట్టి తాళం పెట్టి బయటికి పోయాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి తాళం లేని గది శూన్యంగా ఉంది.
ఆమె మూడు ఊళ్లు దాటుకుని మేనమామ ఊరు వెళ్లిపోయింది. విధి లేక ఎంతో బతిమాలుకొని తిరిగి ఆమెను తన ఇంటికి తెచ్చుకున్నాడు
కానీ ఆమె మీద అనుమానం. మళ్లీ అనురాగం. ఈ అశాంతి తట్టుకోలేక ఆమె చచ్చిపోతే నేను కాస్త నిశ్చింతుణ్ని అవుతానేమో అనుకునేవాడు. అప్పుడే కాస్త మనశ్శాంతి దొరుకుతుందేమో అనుకునేవాడు. మనిషికి మనిషి మీద ఉండేంత ఈర్ష్య యమునిమీద కూడా ఉండదు అంటాడు టాగూర్
ఇలాంటి సమయం లో ఈ సంఘటన వచ్చి పడింది.
చంద్రకు కూడా భర్తపట్ల అనురాగం ఉంది కనుక ఆమె కూడా ఇలా అనుకోవాలి కదా. ఆమెకూ ఆ నలుగుడు ఉంటుంది కదా
కానీ ద్వంద్వనీతి ఉన్న సమాజం గురించి రచయిత చెప్పకనే చెప్పేడు. అందుకే చంద్ర అణగిమణగి ఉండకపోవడం అన్నది భర్త చిదాం మనసులో ఆమె చావుదాకా పోవడం గురించి చెప్పడంలోనే ఉంది అది.
అందుకే అతనినోటివెంట ఆకస్మికంగా “చంద్ర తోటికోడలి నెత్తిన కొడవలితో ఒక్కపెట్టు పెట్టిందన్న” మాట వెలువడింది, చంపింది అన్నగారయినా.
చెంపదెబ్బ కొట్టడానికి ముందు లోపల గూడుకట్టుకున్న భావజాలాల గురించి హెచ్చరించిన కథ కంటే ఇది ఎన్నేళ్ల ముందు కథ??!!
చంద్ర ను రక్షించడానికి, ఆమెను తననేరం నుంచి బయట పడడానికి ఆమె ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అంతా ఒకటికి పదిసార్లు చెప్పాడు. తోటికోడలు కత్తిపీటతో తనను కొట్టబోతే తప్పించుకోవడానికి కొడవలి తీసానని అది ఆమెకు ఎలాగో తగిలిందనీ చెప్పమన్నాడు.
ఊరు ఊరంతా ఆమె చంపిందనే నమ్ముతున్నారు.అందరూ ఆమెను నేరస్తురాలిగానే చూస్తున్నారు. అది ఆమెకు తెలిసింది. ఇదంతా భర్త మాటాడిన మాట వల్లనే.
కానీ అన్నదమ్ములు కుదిర్చిన వకీలు ఆమెకు ఎంతో బోధించాడు. శిక్షనుంచి బయటపడడానికి ఎలా మాట్లాడాలో చెప్పేడు. ఆమె మౌనంగా వింది.
కానీ కోర్టు లో తానే చంపేనని చెప్పింది. తనకు తోటి కోడలు మీద కోపమని అందుకే చంపేననీ చెప్పింది.
మేజిస్ట్రేట్ చివరకు జడ్జి కూడా ఆమెను రక్షిద్దామని ప్రయత్నించినా ఆమె వినలేదు. ఆ మాట మీదే ఉండిపోయింది. భర్త, బావగారు ఎంత మొత్తుకున్నా ఆమె మొండి పట్టు వదలలేదు
చివరకు జడ్జి ఈ నేరానికి నీకు ఉరిశిక్ష పడుతుందని చెప్పినా ఆమె దానికి సిద్ధమైంది తప్ప మరో మాట మాటాడలేదు.
అన్నదమ్ములిద్దరూ ఆమెకు ఏ పాపమూ తెలియదని హత్య నేను చేసానంటే నేను చేశానని వచ్చి చెప్పినా కోర్టు నమ్మలేదు. ఆడకూతుర్ని రక్షించడం కోసం వాళ్లు అలా అంటున్నారనుకున్నారు.
అంతగా చంద్ర ఆ మాటనే పట్టుకుని ఉండిపోయింది. నేనే చంపేననీ నాకు తోటికోడలి మీద కక్ష అనీ గట్టిగా చెప్పింది.
ఆమెకు శిక్ష పడింది. చివరి కోరిక ఏమిటంటే తల్లిని చూడాలని ఉంది అడిగింది. భర్త వద్దు మృత్యువు కావాలంది.
ఇలా శిక్ష తాను తీసుకుంటూనే జీవితాంతం భర్తకి విధించింది. కథకు శిక్ష అని పేరు అందుకే పెట్టాడు టాగూర్.
ఆమె ద్వంద్వ నీతిని, ఆధిపత్యభావజాలాలను ప్రశ్నించింది. ప్రశ్నించినందుకు, ఎదురుతిరిగినందుకు కలిగిన పరిణామాలతో పోరాడింది..
ఈ కథలో ఆమె శిక్షను స్వీకరించిన ధోరణే నన్ను దిగ్భ్రాంతి కి గురిచేసింది. మరో దారి ఉన్నా ఆమె అంగీకరించకపోవడం లో గాయపడిన ఆమె ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నాయి. అవి ఆమె భర్తను ఎంతో భయానికి గురి చేశాయి.
ఆమె శిక్ష స్వీకరించినట్టే కనిపిస్తూ అతనికి తప్పించికోలేని శిక్ష వేసింది
ఏమి కథ ఇది. వందేళ్లకిందటే తిరుగుబాటు చేసిన స్త్రీ కథ. గురజాడ చెప్పిన కన్యక లాంటి కథ. మరేదారీ లేనప్పుడు లొంగిపోకుండా ఎదిరించడానికి ఆత్మాహుతి వైపు నడిచిన కథలు. ఇవీ స్త్రీల పోరాట కథలు.
ఇవాళ చదువులు, ఉద్యోగాలూ, ఆర్ధికభద్రతల మధ్య స్త్రీలు చేస్తున్న పోరాటాలను మనం కీర్తిస్తున్న సందర్భంలో ఈ పాత కథలను ఓ సారి గుర్తుచేసుకోవడం అవసరం కదా
ఐతే అన్యోన్యంగా ఉంటూ ఉన్నతంగా ముందుకు సాగిన జంటలు ఉండరా అంటే టాగూర్ వారి కథ కూడా రాశాడు. అది మళ్లీ నెల శేఫాలికలలో చెప్పుకుందాం.
*
గురజాడవారు రాసిన కన్యక లోని కవితతో ప్రారంభించి, పితృస్వామ్య సమాజం ,పూర్ణమ్మకథ, చాలా సంచలనం సృష్టించిన “తప్పడ్ “సినీమాలోకి తొంగిచూసి, వందేళ్ళకింద టాగూరు రాసిన “శిక్ష” కథకు వచ్చారు. చంద్ర అనుభవించిన శిక్షతో భర్తకు జీవితాంతం అనుభవించిన శిక్ష విధించటం!
“మరేదారీ లేనప్పుడు లొంగిపోకుండా ఎదిరించడానికి ఆత్మాహుతి వైపు నడిచిన కథ,” అంటూ !!! ఇలా ఒక కథనుంచి మరొక కథను తీగలా అల్లుకుంటూ వంతెన నిర్మించటంలో మీకు మీరె సాటి.!!!
థాంక్యూ సుశీల గారూ
భలే పట్టుకున్నారు తీగ
థప్పడ్ కు థప్పడ్ సమాధానం .వందేళ్ళక్రితమే టాగోర్ చెప్పిన కథ. తిరుగుబాటు కన్నా శిక్ష మరో పై మెట్టు.పూర్ణమ్మ తో మొదలు పెట్టటం బాగుంది.అయితే మీ నుంచి మల్లెల పరిమళాలు అలవాటయిన మాకు ఈసారి అగ్నిపూలు.
నిజమే కానీ ఒకోసారి తప్పదు మరి వసుధారాణి గారూ
లవ కుశులను శ్రీ రామునికి అప్పగించి భూమాత ఒడిలోకి వెళ్ళి పోయిన సీత లా.. శిక్ష.. కధ ఎంత బావుం దో..ఎంత చక్కగా విపులీకరించారొ కదా.. త ప్ప డ్ cinemaa సందర్భంగా…బహు బహు kritajnatalu లక్ష్మి గారూ..
తమని తాము శిక్షించుకొని అది తిరుగుబాటు అనుకోవాలా? ఇదే ఆలోచనతో ఎంతోమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టాగూరు, గురజాడ కాలానికి అది తిరుగుబాటేమో గాని, ఇప్పుడు ఈ పద్ధతిని గ్లోరిఫై చెయ్యకూడదనుకుంటా.
వారు కేవలం తమని తాము శిక్షించుకోవడమే ఐతే ఈ కాసిని కథలూ ఇంత కాలం నిలబడవు భవాని గారు. ఇవి ఇప్పుడు మనం చేస్తున్న వివిధాలైన పోరాటాలకు మూలకథలు అని నా అభిప్రాయం.అవి ఆత్మహత్యలు కావు. ఆనాటి పరిస్థితుల్లో లొంగిపోకుండా మరోదారి లేక ఎదురుతిరిగిన విధానాలవి. వాటి వెననున్న ఆత్మాభిమానాలను, ఆత్మగౌరవాలను వారు కాపాడుకోవడం నేను పైకి తీసి చూపించాను.
అద్భుతమైన కథ. అంతకన్న అద్భుతంగా వుంది మీ విశ్లేషణ.
తెలుగు సాహిత్యంతోనూ,ఆంగ్ల సాహిత్యంతోనూ కాస్తంత పరిచయం ఉంది గాని టాగోర్ కథల గురించి తెలియదు.
ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుంది.
కృతజ్ఞతాంజలి.
సత్యనారాయణ
తెనాలి