సీక్ర‘సీ’
“ఏం చేద్దాం?”
“ఏమయినా సరే చేసే తీరాలి!”
“కాని ‘వటా’వాళ్ళు పిల్ వేశారు, ఏప్రిల్ సెవెంత్ లోపల మనం కోర్టుకు రిపోర్ట్ యివ్వాలి కదా?”
“ఇద్దాం, యిప్పుడైతే టైం లేదు, ఆల్రెడీ సుప్రీమ్ కోర్టే ల్యాండ్ గవర్నమెంటుకు చెందుతుందని చెప్పింది!”
“ఇట్స్ ఓకే, బట్ 48ఎ సెక్షన్ కింద ‘వటా’ తరపున కేసు…?”
“ఎనీవే దిసీజ్ బెస్ట్ టైం, ఉగాదని రంజానని సెలవులని యూనివర్సిటీ క్లోజ్, స్టూడెంట్స్ యిళ్ళకు వెళ్ళారు!”
“బట్…”
“సాటర్‌డే సండే మండే కోర్టుకు కూడా సెలవులే, సో… యింకేంటి డౌట్?”
“ఊళ్ళకు పోకుండా హాస్టల్స్‌లో స్టూడెంట్స్ వుంటారు…”
“మనకు లేరా సైబరాబాదు పోలీసులు? డే అండ్ నైట్ వర్క్ జరగాలి!”
“ఎన్ని జేసీబీలు దొరికితే అన్నీ దింపుతాం…”
“గుడ్… అదీ యీ అర్ధరాత్రికే స్టార్ట్ అవ్వాలి!”
“ష్యూర్!!”
టెక్నిక(సి)ల్లీ!
“హెచ్సియ్యూ కాంపౌండ్‌లోని భూములు హెచ్సియ్యూకి చెందుతాయి కదా?”
“లేదు, హెచ్సియ్యూ భూములన్నీ మావి… ప్రభుత్వానివి!”
“అదికాదండీ…”
“ఆ భూమి హెచ్సియ్యూ పేరున లేదు, ప్రభుత్వ స్థలంగా రిజిస్ట్రేషనయ్యింది…”
“ప్రభుత్వ భూమంటే ప్రజలది, ప్రజల్లో భాగమైన విద్యార్థులది కాదన్నమాట!”
“కాదు!”
“మరి ప్రభుత్వమంటే ప్రజలు- ప్రజలంటే ప్రభుత్వం అనేది?”
“………………………………………………………………!”
ఎ సోలెమ్ డొనేషన్!
“మొత్తం భూమి యెంతనుకున్నారు?, రెండువేల మూడువందల యిరవైనాలుగు యెకరాలు!”
“ఇప్పుడు హెచ్సియ్యూకు మిగిలినదెంత?”
“పదిహేనువందల యెనభై యెకరాలు…”
“మిగతా భూమి?”
“ఆల్రెడీ యెనిమిదివందల పది యెకరాలు అన్ని ప్రభుత్వాలూ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేశాయ్…”
“ఎకడమిక్ పర్పజ్ తప్ప వాడకూడదేమో?!”
“ఎకడమిక్‌కూ యిచ్చాం, నాన్ ఎకడమిక్‌కూ యిచ్చాం… మేమేమీ యిప్పుడే కొత్తగా అలాట్మెంట్స్ మొదలుపెట్టలేదు…”
“…………………………………”
“మేం జెస్ట్ నాలుగువందల యెకరాలు కార్పోరేట్స్‌కు యిస్తున్నాం, దేనికీ… స్టేట్ వెల్త్ కోసం!”
“ఔనౌను స్టేట్‌లో మీరున్నారుగా?!”
గురుశిష్యులు!
“మొత్తానికి ఐఎమ్‌జీ భారత్ ప్రవేట్ లిమిటెడ్ నుండి హెచ్సియ్యూ భూముల్ని కాపాడుకున్నాం,”
“గ్రేట్!”
“పద్దెనిమిదేళ్ళు కోర్టులో పోరాడి గెలిచి తీసుకున్నాం భూమిని!”
“అంటే… ఆ భూమి మొదట ఐఎమ్‌జీ భారత్ ప్రవేట్ లిమిటెడ్‌దా?”
“కాదు కాదు… ప్రభుత్వానిదే, మన చంద్రబాబునాయుడుగారు నాలుగొందల యెకరాలు వాళ్ళకు యిస్తే, తర్వాత రాజశేఖర్రెడ్డిగారు రద్దు చేశారు, దాంతో వారు కోర్టుకు వెళ్ళారు!”
“ఆహా… శంకుస్థాపన చేసి పునాదిరాయి వేసింది బాబుగారేనన్నమాట!”
పితలాటకం!
“నాకొకటి అర్థం కాలేదు?”
“చెప్పు!”
“మొదట అది ప్రభుత్వ భూమే!”
“భూమే!”
“ఐఎమ్‌జీ భారత్‌కి యిచ్చి తిరిగి తీసుకున్నారు!”
“తీసుకున్నారు!”
“మళ్ళీ యెవరెవరికో యిస్తున్నారు!”
“ఔను, యిస్తున్నారు!”
“ఐఎమ్‌జీ భారత్‌కి యివ్వడం చెల్లదన్న కోర్టు- మళ్ళీ కార్పోరేట్లకు యివ్వడం చెల్లదని చెప్పవా?”
“చెప్పవు!”
“ఎందుకు?”
“ప్రభుత్వాలకు విధానాలకు అనుగుణంగానే కోర్టులూ నడుచుకోవడం అలవాటు చేసుకుంటున్నాయి! అంచేత యిస్తే గిస్తే ‘స్టే’ యిస్తాయి తప్పితే రద్దు చేయలేవు,”
“అంతేనంటారా?”
“అప్పుడే కదా అభివృద్ధీ ప్రజాస్వామ్యమూ పరిఢవిల్లుతాయీ?!?”
ఆలస్యం అమృతం!
“ఈ నాలుగొందల యెకరాల కేసు యింకొన్నాళ్ళు కోర్టులో నలిగినా బావుణ్ణు…”
“అదేంటి? పద్దెనిమిదేళ్ళు నడిచింది, చాల్లేదా?”
“లేదు, ఆ భూములు సేఫ్‌గా వుండాలంటే అదొక్కటే మార్గం!”
మర్యాదస్తులు!
“పచ్చని వ్యూ పాయింట్… హెచ్సియ్యూ ఫారెస్ట్ బావుంటుందని కదా యిక్కడ ప్లాట్స్ తీసుకున్నాం!”
“లేకపోతే అంత డబ్బులు పెట్టి యిక్కడెందుకు కొంటాం, దండగ?”
“నాకు సంధ్యాసమయాల్లో నెమళ్ళ అరుపులు వినడం యిష్టం!”
“కోయిల కూతలు యిష్టపడేవాళ్ళని చూశా కాని… నెమళ్ళ…”
“నీకు భావుకత లేదు, నెమళ్ళు పురివిప్పి ఆడితే భలేగుంటుంది, ప్చ్… అవన్నీ మిస్సవుతాం!”
“తప్పదు యేమి చేస్తాం?”
“మనమేం చేస్తాం?, చేస్తే గీస్తే యూనివర్సిటీ స్టూడెంట్సే చెయ్యాలి!”
“ఏం చేస్తారూ? పోలీసులు చితక్కొట్టి వేన్లమీద తీసుకుపోతుంటే?”
“పోనీ ఆమరణ నిరాహారదీక్షలు చెయ్యొచ్చు కదా?”
“స్టూడెంట్స్ చస్తే రిస్క్ కదా?”
“లేదు లేదు, అలాంటిది యేదో జరిగితేగాని యీ గవర్నమెంట్ చేస్తున్నపని ఆపదు!”
“అంతేగా… అంతేగా…!”
స్టేటజీ!
“జై శ్రీరామ్… మనం యూనివర్సిటీలో పట్టుకోల్పోయాం కదా?”
“అది నిన్నటిమాట, యిప్పుడు మనకి రెడ్ కార్పెట్ పడుతుంది, ‘హ్యాండ్’గాళ్ళకి థాంక్స్ చెప్పాలి!”
“ఫోర్ హండ్రెడ్ యాకర్స్ ఇష్యూని యింత పాజిటివ్‌గా చూస్తావనుకోలేదు బ్రో?!”
“హహ్హహ్హా… దేహాల్నే దేశాన్నీ కాదు, హెచ్సియ్యూ భూముల్నీ ముక్కలు కానివ్వం…”
“అంటే, మన సెంట్రల్ పవర్ చూపించి లీడర్లు యీ నాలుగొందల యెకరాలు అమ్మకుండా ఆపేస్తారా?”
“ఉన్న పవర్ వాడేసి సొల్యూషన్ తెచ్చేస్తే శేషం యేమీ మిగలదు బ్రో, సో సమ్మూ వుండాలి, సమప్పూ వుండాలి!”
“అర్థమయ్యింది… కత్తందుకో జానకీ!”
“యస్… పర్యా‘వర్ణం’ పరిరక్షించుకుందాం!”
ఏక తాను!
టీవీ లైవ్ డిబేట్‌లో కమర్షియల్ బ్రేక్ టైమది.
“అన్నా… ఆ బూములల్ల సెంటు నీకొచ్చేదా నాకొచ్చేదా, కార్పోరేట్లకు పొయ్యేదే కదా? మనం వొకప్పుడు కలిసి పనిచేసినం. నువ్వంటే నాకు గౌరవమే,” అన్నాడో ప్రతిపక్షి.
“అదంతా కాదు తమ్మీ, మీ గవర్నమెంటు వున్నప్పుడు కేసు గెలిచుంటే యీ నాలుగొందల యెకరాలు యేమి చేసేవారు, కార్పోరేట్లకు యిచ్చేవారా కాదా? మీరెప్పుడూ యివ్వలేదా? మేమే తొలిసారి జేసినమా? లైవ్‌ల లేంగాని జర నిజం చెప్పే?!” అన్నాడో పాలకపక్షి.
అంతవరకూ చర్చోపచర్చలూ వాదోపవాదాలూ చేసి అరుచుకున్న ఆ అక్కుపక్షులిద్దరూ టీ తాగుతూ బిస్కెట్లు తింటూ రిలాక్సవుతున్నారు.
తలదించుకొని “యిగో నీవు తెలివైనోనివి, నీతో మాటలకత్తానే?” నవ్వేసాడు ఆ తమ్మి కాని తమ్మి.
“మాటలురావా? నోటిల పల్లుకన్నా మాటలే యెక్కువ గదనే నీకు,” నవ్వాడు ఆ అన్నకాని అన్న.
“ఏదో నీలాంటి సీనియర్సుని సూసి నేర్సుకోవాలి గదనే,” అని ఆగి, “లోకమంతా తెలిసిన సత్తెం చెప్తున్నా, మీరు మై హోమోనికి చానామందికి భూములిచ్చిన్రు, అప్పుడు అధికారం మీ చేతిల వుంది, మేం ఎమ్జేసినం? సప్పుడు సెయ్యకుండా వూకున్నామా లేదా…” నవ్వుతూనే అన్నాడు ప్రతిపక్షి తమ్మి.
“మీరెక్కడ వూకున్నారే? గోలగోల చేసినారు కదనే?, తమ్మీ… ప్రభుత్వం అన్నాక భూములు ధారాదత్తం జెయ్యాలె, ప్రతిపక్షం అన్నాక విమర్శించాలె! యెవరి స్వతంత్రత వారికుండాలె! విమర్శించుకో పొండి…” నవ్వుతూ నవ్వులో నవ్వు కలిపాడు పాలకపక్షి అన్న.
“నీ నోట్ల సెక్కెర పొయ్య, మంచిగా జెప్పినవన్నా!” అని తమ్మి మెచ్చుకున్నాడు.
“రేపటికి జనంకి యేదీ యాదుండదు తమ్మీ…” అని అన్న భరోసాగా అన్నాడు.
ఇంతోలో డిబేట్‌కు సిద్ధమవుతున్నట్టు రీడరుయాంకరు దగ్గుతూ గొంతు సవరించుకుంది!.
తన పర ములు!
వాళ్ళిద్దరూ వొకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములే. చదువుకున్నోళ్ళే. ఉద్యోగాలు చేసుకుంటున్న భద్రజీవులే. వారసత్వ ఆస్తి పంపకాలతో అందరిలానే భాగహరులై ‘బాగార్లు’ అయ్యారు.
బెత్తెడు జాగా కలుపుకున్నాడని అన్న. నాదే జానెడు జాగా కలుపుకున్నాడని తమ్ముడు. కర్రలు పట్టుకున్నారు. కలహంతో ఆగలేదు, కురుక్షేత్రమే జరిగింది. తలలు పగలకొట్టుకున్నారు. తరాల తరబడి కేసులు పడ్డారు. ఆ అన్నదమ్ములిద్దరికీ కాలం అలాగే చెల్లిపోయింది. వైరాన్ని మోస్తూ పెరిగారు పిల్లలు. రగిలిన పగలతో ప్రతీకారాలతో కత్తులతో పొడుచుకున్నారు. చచ్చినవాడు బొందలపడ్డాడు. చచ్చి బతికినవాడు ఆస్పత్రినుండి వెళ్ళి జైళ్ళోపడ్డాడు. తాతని తిట్టుకుంటూ పిల్లల పిల్లలు బయల్దేరారు. వారి పిల్లలు యిప్పుడు హెచ్సియ్యూలో చదువుకుంటున్నారు. వాళ్ళకి యిళ్ళదగ్గరనుంచి ఫోన్లొచ్చాయి.
“ఒరేయ్… వింటున్నావా? ఆ భూముల గొడవలు నీకెందుకు? రెండేళ్ళో మూడేళ్ళో చదివి వచ్చేయడానికి వెళ్ళావని మర్చిపోకు, నీకు లాఠీదెబ్బలు తినాల్సిన కర్మేమిటి? కేసులు పడితే నీకు రేపు వుద్యోగం కూడా రాదు, గుర్తుంచుకో, నేను టీవీల్లో చూస్తున్నాను. ఇదంతా కాదు, నువ్వు యింటికి వచ్చేయ్, అమ్మకి వంట్లోబాలేదు కూడా…”
రూట్ మేప్స్!
“ఈ నాలుగొందల యెకరాల్లో వొక గుడివున్నా బాగుణ్ణు”
“నిజమే, మనం చెట్టూ చేమకి పసుపు రాసి బొట్లు పెడదామా?”
“పుట్టల దగ్గర ముగ్గులు గీద్దామా?”
“వన దేవతకి హారతి వెలిగిద్దాం!”
“ఫ్రిండ్షిప్ బ్యాండ్‌లా కడతారు కదా తాళ్ళు… అవి కడదాం!”
“పండుగరోజు మంత్రులకీ అధికారులకీ కట్టే రాఖీలన్నీ యిక చెట్లకే కడదాం!”
షార్ట్ రీల్!
“అవేమన్నా రాజదర్బారులా? యూనివర్సిటీలకు అన్ని వందల యెకరాల భూములెందుకు నాకు తెలీక అడుగుతాను?” అని అప్పటి పాలకపక్షం యిప్పటి ప్రతిపక్షం నాయకుడి మాటల్ని బ్రీఫ్‌గా కట్ చేశాడు వీడియో ఎడిటర్. “సుప్రీమ్ కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని అభివృద్ధిలో భాగంగా టిజిఐసికి కేటాయించి అక్కడ ఐటి పరిశ్రమలు అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి…” సియ్యమ్ము మాటల అవుట్‌పుట్‌ని యాడ్ చేశాడు.
“ఇప్పుడు- యే యూనివర్సిటీకి యెంత భూమి వుందో, ఆ వేల యెకరాల్ని లిస్టు చేసిన ఆ యూట్యూబ్ వీడియోలోంచి ఆ టేబుల్ క్లిప్ తీసుకో” కంటెంట్ రైటర్ చెప్పినట్టే చేశాడు.
ఆ తర్వాత రాత్రివేళ నెమళ్ళ హాహాకారాల సంగీత నేపథ్యంలో ప్రొక్లిన్లు చెట్లు కూల్చేస్తున్న దృశ్యమూ యింకా లేళ్ళు పరుగులు తీస్తున్న దృశ్యమూ ప్లే అవుతుంటే “మనం యిక్కడ వొక యూనివర్సిటీలో సక్సెస్‌ఫుల్‌గా భూములు లాక్కోగలిగితే, దేశమంతా లాక్కోవచ్చు! కార్పోరేట్స్‌కు వుచితంగా లేదా నామినల్ అమౌంటుకిచ్చి- పెట్టుబడులకు రాయితీ యిచ్చి- ఫ్రీ కరెంటు వాటర్ యిచ్చి- సహకరిస్తే…” వాయిస్ వోవర్ యిచ్చి, ఆ వెంటనే “యీ రోజు వొక అభివృద్ధి కోసము కాంక్రీట్ ప్రపోజల్‌తో ముందుకు వస్తే…” సియ్యమ్ము మాటలు యాడ్ చెయ్యడంతో వీడియో మేకింగ్ పూర్తయింది!
టెర్రర్ ఆఫ్ ఫాక్సెస్!
నక్కలన్నీ అత్యవసరంగా గుమికూడాయి!
“మా యింటి పేరు ‘గుంట’ కాదు,” అని హోరెత్తాయి. “గుంటనక్కలనడం అవమానించడమే,” అని నినదించాయి. ‘యిది వివక్ష’ని, ‘సకల జీవరాశుల ముందు మమ్మల్ని తక్కువ చెయ్యొద్దు’ అని ప్లే కార్డులు సయితం ప్రదర్శించాయి!
కొన్ని నక్కలయితే “మేం గుంట నక్కలమే, మా ఆవాసాల్లో బొక్కల్లో దూరుతున్న మీరు?” అని ఆవేశంగా వూళలేసి హోరేత్తించాయి!
ఆపై డెమోని కూడా ప్రదర్శించాయి!
“ఏదో రిజర్వ్ ఫారెస్ట్ వున్నట్టు రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యంత జీవరాసులున్నట్టు జింకలు పులులు సింహాలు ఆడనే వున్నయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష… చుట్టుముట్టుత కొన్ని గుంటనక్కలు చేరి యిట్ల వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటనక్కలకు గుణపాఠం చెప్తం అధ్యక్ష…” అని సియ్యమ్ము మాటల్ని రిపీట్ చేశాయి!
“పులులు సింహాలు జింకలు మాత్రమే జంతువులా? మేం కాదా?” నక్కలు ముక్త కంఠంతో ప్రశ్నించాయి!
“ఔను, మనుషుల్లో అంతేగా? కుడి చెయ్యకూ యెడమ చెయ్యకూ తేడా లేదా అనుకుంటారు, తప్పితే రెండూ చేతులే అనుకోరు. పెద్దకులపోళ్ళు చిన్నకులపోళ్ళని మనుషులుగానే చూడరు…” అని ఆ నక్కల సమావేశానికి హాజరైన వో మనిషి బోధపరిచాడు!
“అయితే ఆ మాట అన్నది మమ్మల్ని గురించి కాదా? మనుషుల గురించా?” అని పెద్దనక్కలు కొన్ని అర్థం చేసుకొని శాంతించమని తమ జాతికి చెప్పబోయాయి!
“మనుషులతో మన నక్కల్ని పోల్చడం మహా అవమానకరం!” అని నక్కలు వూళలు వేస్తూ హర్తాళ్ళని వుధృతం చేశాయి!
కొత్త తలనొప్పులు!
సమాచార హక్కు చట్టం కింద కొన్ని వేలమంది వొకే ఇన్ఫర్మేషన్ అడిగారు. ఒక్క సమాచార సమాధానమే అందరికీ సులువుగా పంపొచ్చు. కాని ఆ సమాధానం యివ్వడం కష్టమైంది ఆర్టీఐకి. ఆ ప్రశ్న యిది.
“అరవైరెండు జేసీబీలతో కంచ గచ్చిబౌలి ఫారెస్టులో ప్రభుత్వం యెన్ని చెట్లను కూల్చింది?”
చచ్చీచెడీ సమాధానం యివ్వక తప్పింది కాదు ఆర్టీఐకి.
ఆ సమాధానంతో పాటు సుప్రీమ్ కోర్టు “cutting large number of trees worse than killing human beings,” అన్న మాటల్ని కూడా గుర్తుచేస్తూ ‘చెట్టుకి లక్ష’ కట్టమని చెప్పిన మరో తీర్పు కాపీని జతచేస్తూ- ఆ జరిమానా సొమ్ముని కారకులైన వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లోంచి వసూలు చెయ్యాలని యిప్పుడు కోర్టుల్లో మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి?!
గుడి బడి!
రద్దీ రోడ్ల మధ్యలో యెన్నో గుడుల్లాగ అదో గుడి. దానికి యిప్పుడు కొత్తగా కాంపౌండ్ వాల్ కట్టారు. రోడ్డు యిరుకైంది. రాత్రిపూట కొందరు ఆ కాంపౌండ్ వాల్‌ని గుద్దుకు చచ్చారు.
అయ్యో అన్నారు కొందరు. కుయ్యో అన్నారు కొందరు. ‘దేవుని పాదాల చెంత పోవడం అందరికీ రాదు’ అంది ఆలయకమిటి.
ఆలయాన్ని పక్కకు తరలించాలని, ప్రాణనష్టం లేకుండా చూడాలని మరికొందరు ప్రభుత్వానికి యెప్పటిలాగే వినతిపత్రాలతో మొరపెట్టుకున్నారు.
“భాగ్యనగర్ ఆలయాల జోలికి వస్తే ఖబడ్దార్…” రాష్ట్రనాయకులకి తోడు కేంద్రనాయకులూ దిగబడిపోయారు. ప్రత్యేక పూజలూ నిర్వహించారు.
ఎప్పుడూ జరిగినట్టే అప్పుడూ యెవడో కాంపౌండ్ వాల్‌ని బలంగా గుద్దాడు. అన్నిసార్లలాగే తల పగిలినా యీసారి కాంపౌండ్ వాల్‌లోంచి వో యిటుక విరిగి జారి రోడ్డున పడింది.
శవం పక్కన పెట్టుకొని కూడా కొందరు కుట్రన్నారు. మన మతంమీద మనకు గౌరవం లేకపోవడమేనన్నారు.
ఆ యిటుకని గుద్దుకొని కొందరు బైకులమీంచి జారిపడ్డారు. రోజూ ఆ దారిన పోయిన దానయ్య చూసిందే చూడలేక ఆ యిటుకని తీసి పక్కన పెట్టబోయాడు…
అంతే, అతని తల పగిలింది. దేవుడు చూస్తూ వూరుకుంటాడా? పదిమందికి పది కర్రలిచ్చి పంపినట్టున్నాడు?!
అప్పుడు వో వీర భక్తుడు ముందుకువచ్చి వొక్క యిటుక ముట్టిన దానయ్య గుండెలమీద కాలేసి “యిది హెచ్సియ్యూలోని నాలుగొందల యెకరాలబూమి అనుకున్నావురా… కొడకా?” అన్నాడు!
ఇదంతా ఫోన్లో వీడియో తీసి అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అయ్యింది! ఆ వీడియో కింద బత్తాయిలు ఓంకార ఘీంకారాలు చేస్తూనేవున్నారు!
దట్సాల్!
“ఆ నాలుగొందల యెకరాలు అమ్మితే పదినుండి పదిహేను వేలకోట్లు వస్తాయట కదా?”
“లేదు, నలభై వేలకోట్లు వస్తాయని అంటున్నారు!”
“హార్ట్ ఆఫ్ ది సిటీ. హాట్ కేక్. కోకాపేట భూములమ్మిన రికార్డ్ బద్దలయిపోద్దయితే?!”
“బొక్కేం కాదూ… పావలాకీ పరక్కీ యిచ్చేస్తారు, యింతకు ముందు సినిమా స్టుడియోలకీ స్వామీజీలకీ బ్రహ్మకుమారీలకీ ఆశ్రమాలకీ…”
“కార్పోరేట్లూ ఐటీహబ్బులూ అంటున్నారు మరి?”
“అవయితే యింకా ప్రోత్సాహకాలుగా వుచితాలు కూడా కలిపి యివ్వాలి!”
“బియ్యం పప్పులూ వుప్పులూ పంచదారా కిరసనాయులూ యిస్తే… మా టాక్సుల్లోంచి యిచ్చేస్తున్నారని కొందరు గగ్గోలు పెడతారు కదా?, ఇలాంటివాటికి ల్యాండ్‌తో పాటు పవరూ వాటరూ అన్నీ వుచితంగా యిస్తే యేమీ అనరా?”
“ఉపాధి వుద్యోగాలు వస్తాయని చెప్తారు బ్రో…”
“మనకి వుద్యోగాలూ వుపాదులూ కల్పించి మనల్ని వుద్ధరించడానికి కార్పొరేట్లు కంపెనీలు పెడుతున్నారా? లేకపోతే వాళ్ళ లాభాల కోసం వ్యాపారాలు చేస్తున్నారా?”
“వ్యాపారం వాళ్ళది. పెట్టుబడి మనది!”
బ‘చావ్’!
అడవికి అగ్గంటుకుంది!
ఆ అపరాత్రి వేళ నెమళ్ళ రోదనతో అరుస్తున్నాయ్… లేళ్ళు చెదిరిపోతూ పరుగులు తీస్తున్నాయ్… పక్షులు గూళ్ళను వదిలి రెక్కలు కొట్టుకుంటూ యెగురుతున్నాయ్…
వో తల్లిలేడి రోడ్డెక్కింది. దాన్ని కుక్కలు కరిచేసినట్టున్నాయ్… అది ఆపకుండా పరుగులు పెట్టింది.
పిల్లలేడి దాన్ని అనుసరించి రోడ్డు దాటబోయింది… సడన్ బ్రేక్ వేసి ఆ లేడిపిల్లతో పాటు కింద పడ్డాడు టూవీలర్!
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అతనిమీద కేసు నమోదు చేశారు పోలీసులు!
దొంగే దొంగని అరిస్తే?
“హైదరబాదులోని చెరువులూ పార్కులూ లేఅవుట్‌లోని ఖాళీ స్థలాలూ ఆట స్థలాలూ నాలాలూ ఫుట్‌పాతులూ అన్ని ఆక్రమణ స్థలాలను ఆక్రమించిన వారిని తొలగించడం మా హైడ్రా పని” చెప్పారు ప్రభుత్వ అధికారులు.
“మరి హెచ్సియ్యూలో ప్రభుత్వమే నాలుగువందల యెకరాలు ఆక్రమిస్తే మీరేమీ చర్యలు తీసుకోలేరా?” అడిగారు విద్యార్థులు.
*
Add comment