2025 వ సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతి లాస్లో క్రాస్నాహోర్కై కి ప్రకటించారు. László Krasznahorkai నిజంగా 2025 సాహిత్య నోబెల్ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడనే చెప్పవచ్చు! స్వీడిష్ అకాడమీ కూడా అతని రచనలు “అపోకలిప్టిక్ భయం మధ్య కళా శక్తిని పునరుద్ధరించే దూరదృష్టితో కూడిన రచనలు” అని ప్రశంసించింది. అతని ప్రత్యేకమైన “Breathless” శైలి—దీర్ఘమైన, పేజీల తరబడి సాగే వాక్యాలు, మానవ జీవన గందరగోళం అస్తిత్వ బాధను చిత్రించే డిస్టోపియన్ థీమ్స్—అతన్ని సాహిత్య ప్రపంచంలో అసామాన్యుడిగా నిలిపాయి.
ఆంగ్లం లో లభ్యమవుతున్న అతడి పుస్తకాలు Satantango, The Melancholy of Resistance, సమాజం, అధికారం, మానవ స్వభావంపై లోతైన ప్రశ్నలు లేవనెత్తుతాయి. అతని రచనలు చదివేటప్పుడు ఒక రకమైన తాత్విక, ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది, అది పాఠకుడిని ఆలోచనలో ముంచెత్తుతుంది. అతడి రచన చదవడం ఆపలేని, ఆలోచన ఆగని అనుభూతి. László Krasznahorkai రచించిన Satantango (హంగేరియన్‌లో Sátántangó, 1985లో ప్రచురితమైనది ) అతని అత్యంత ప్రసిద్ధ నవలలలో ఒకటి అతని “Literature of Breathlessness” శైలికి పరిపూర్ణ ఉదాహరణ. ఈ నవల హంగేరియన్ సాహిత్యంలో ఒక మైలురాయి. 2012లో ఇంగ్లీష్‌లో జార్జ్ స్జిర్టెస్ అనువాదంలో విడుదలైంది.
ఈ కథ ఒక శిథిలమైన హంగేరియన్ గ్రామంలో జరుగుతుంది. సామూహిక వ్యవసాయం కుప్పకూలిన తర్వాత ఆ గ్రామ ప్రజలు నిరాశలో, నిస్పృహలో మునిగిపోయి ఉంటారు. వర్షం, బురద, తో సహా నిరంతర శిథిలావస్థలో ఉన్న ఈ గ్రామంలో ప్రజలు తమ జీవితాల్లో అర్థం కోసం పరితపిస్తారు.కథలో ఇర్మాస్కీ అనే ఒక రహస్యమైన, ఆకర్షణీయమైన వ్యక్తి పాత్ర కీలకం. అతను గతంలో గ్రామాన్ని విడిచిపెట్టినవాడు, కానీ తిరిగి వస్తాడని పుకార్లు వస్తాయి. అతని రాకడ గ్రామస్తులలో ఆశలను, అనుమానాలను రేకెత్తిస్తుంది. అతను రక్షకుడా, మోసగాడా అనే ప్రశ్న కథను నడిపిస్తుంది.కథలో అధికారం, మోసం, నమ్మకం, మానవ స్వభావంలోని లోపాలు లోతుగా చిత్రీకరిస్తాడు లాస్లో క్రాస్నాహోర్కై . ఇది ఒక రకంగా అపోకలిప్టిక్ (అపోకలిప్టిక్ అంటే సార్వత్రిక విధ్వంసం లేదా అంతిమ సంఘటనల గురించి తెలియజేసే , అంచనా వేసే సందర్భంలో ఉపయోగించే బైబిల్ పదం). వాతావరణంలో సామాజిక, రాజకీయ వ్యవస్థల కుప్పకూలటాన్ని ఈ నవల ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తుంది
Satantango పేరు హంగేరియన్ నృత్యం “టాంగో” నుండి వచ్చింది. నవల 12 అధ్యాయాలుగా విభజించబడి 6 అధ్యాయాలు “ముందుకు” (1-6) 6 అధ్యాయాలు “వెనుకకు” (6-1) అనే రీతిలో రూపొందించబడింది, టాంగో నృత్యంలోని అడుగుల లాంటి రిథమ్‌ను నవలా రచన అనుకరిస్తుంది. లాస్లో క్రాస్నాహోర్కై సిగ్నేచర్ శైలి—దీర్ఘమైన, పేరాగ్రాఫ్‌ల తరబడి సాగే వాక్యాలు పాఠకుడిని ఒక రకమైన సమ్మోహనంలోకి తీసుకెళ్తాయి. నవలనిండా పరచుకునే వర్ణనలు పాఠకుడికి ఒక దృశ్యమాన, భావోద్వేగ అనుభవాన్ని అందిస్తాయి
Satantango మానవ జీవనంలోని నిరాశ, అస్తిత్వ సంక్షోభం, అధికార రాజకీయాలను పరిశీలిస్తుంది. ఇర్మాస్కీ ఒక మెస్సీయా లాంటి వ్యక్తిగా కనిపిస్తాడు, కానీ అతని ఉద్దేశాలు అనిశ్చితంగా ఉంటాయి . ఇది అధికార నాయకత్వం పై ప్రశ్నలను లేవనెత్తుతుంది.
కమ్యూనిజం కుప్పకూలిన తర్వాత హంగరీలోని సామాజిక, ఆర్థిక శిథిలావస్థను ఈ నవల సూచనాత్మకంగా చిత్రిస్తుంది. గ్రామస్తుల జీవితాలు ఒక రకమైన అస్తిత్వ శూన్యతలో చిక్కుకున్నట్టు చూపిస్తుంది. మోసం, ఆశ, నిరీక్షణ మధ్య సంఘర్షణ కథలో కేంద్ర బిందువు.
Satantango నవల ఆధారంగా హంగేరియన్ దర్శకుడు బెలా తార్ 1994లో 7 గంటల నిడివిగల సినిమాను అదే పేరుతో తీశాడు. ఈ సినిమా కూడా సాహిత్యం లాగే దీర్ఘమైన, నెమ్మదిగా కదిలే షాట్‌లతో,ప్రేక్షకుడిని విభ్రాంతికి గురిచేస్తుంది .
లాస్లో క్రాస్నాహోర్కై మరో నవల ది మెలాంకలీ ఆఫ్ రెసిస్టన్స్ (The Melancholy of Resistance) ఒక రకంగా satantango కి రెండో రూపం అనవచ్చు. నవల ఒక అనామక హంగేరియన్ పట్టణంలో జరుగుతుంది, ఇక్కడ సామాజిక, రాజకీయ క్రమం కుప్పకూలుతున్న ఒక అస్తవ్యస్త వాతావరణం ఉంటుంది. కథలో ఒక రహస్యమైన సర్కస్ బృందం పట్టణానికి వస్తుంది, వారితో ఒక భారీ తిమింగలం శవాన్ని ప్రదర్శనగా తీసుకొస్తారు, దీనిని “The Prince” అనే నిగూఢ వ్యక్తి నడిపిస్తాడు.ఈ సర్కస్ రాకడ పట్టణంలో అలజడి, భయం, హింసను రేకెత్తిస్తుంది.
పాత్రలు ముఖ్యంగా వాలుస్కా (Valuska) అనే ఒక ఆదర్శవాద యువకుడు మరియు శ్రీమతి ఎస్టర్ (Mrs. Eszter) అనే సంగీత ఉపాధ్యాయురాలు ఈ అస్తవ్యస్తత మధ్యలో చిక్కుకుంటాయి. కథ అధికారం, అరాచకం, మానవ స్వభావంలోని బలహీనతలను పరిశీలిస్తూ, సమాజం ఎలా క్రమబద్ధత నుండి అస్తవ్యస్తత వైపు జారుకుంటుందో చిత్రీకరిస్తుంది.నవలలోని “The Prince” అనే పాత్ర ఒక కరిస్మాటిక్, కానీ విధ్వంసకర శక్తిగా కనిపిస్తాడు, అతను పట్టణంలో అలజడిని రేకెత్తిస్తాడు. ఇది నాయకత్వం గుండెల్లో భయాన్ని రేకెత్తించే అధికార డైనమిక్స్‌పై ప్రశ్నలను లేవనెత్తుతుంది.ఈ నవల ఆధారంగా హంగేరియన్ దర్శకుడు బెలా తార్ 2000లో Werckmeister Harmonies (హంగేరియన్‌లో Werckmeister harmóniák) అనే సినిమాను తీశాడు. ఈ సినిమా నవల సారాంశాన్ని దృశ్యాత్మకంగా, నెమ్మదిగా కదిలే, లోతైన షాట్‌లతో చిత్రీకరించింది. ఈ సినిమా కూడా కల్ట్ క్లాసిక్‌స్థాయిని అందుకున్నది
ఈ రెండు నవలలు కాక మరో నాలుగయిదు నవలలు ఆంగ్లం లో లభ్యం అవుతున్నాయి. László Krasznahorkai జనవరి 5, 1954న తూర్పు హంగరీ లోని గ్యులా లో ఒక మధ్యతరగతి జ్యూయిష్ కుటుంబం లో జన్మించారు. తండ్రి György Krasznahorkai ఒక లాయరు. తల్లి Júlia Pálinkás, ఒక సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్.
“There’s no sense or meaning in anything. It’s nothing but a network of dependency under enormous fluctuating pressures. It’s only our imaginations, not our senses, that continually confront us with failure and the false belief that we can raise ourselves by our own bootstraps from the miserable pulp of delay. There’s no escaping that, stupid.” అని బలంగా చెప్పే Laszlo Krasznahorkai అంత తొందరగా కొరుకుడు పడడు కానీ అతడి రచన ఒకసారి చదివితే ఆ మోహం లో పడకుండా ఉండలేము. నా వెనుక వున్నది ఏదో ఇంకా నాముందు మిగిలే ఉన్నది లాంటి వాక్యాలతో Laszlo Krasznahorkai పాఠకుడిని మెస్మరైజ్ చేస్తాడు.
*
మీ వివరణ ఎంతో అర్థవంతంగాను,అద్భుతంగాను వుంది.🙏