ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా చేసి విరాళాలను పోగు చేశారు. అటువంటి టెంకాయచిప్ప మీద శతకం రాసారు వావిలికొలను సుబ్బారావు.
‘ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు/
వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో/
దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి/
కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప!’
లాంటి పద్యాలు రాసుకుంటే సరదాగా చదువుకొని నవ్వుకోవచ్చు. సమాజానికి సుద్దులు చప్పే బాధ్యతను భుజాన వేసుకొని ముందుకు వచ్చిన సుమతీ శతకం వంటి శతకాలకు మీద ఆ రకమైన సరదా కుదరదు.
కవి బద్దెన సుమారు క్రీ.శ.1260 ల్లో రాసినట్లు చెప్పుకునే తెలుగు నీతి కంద పద్యాలు సుమారు వందకు పైన. మకుటం ‘సుమతీ’ అన్న మాటను బట్టి లోకానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని కవి భావించినట్లు అనుకోవాలి.
స్థల, కాలాదులను అనుసరించి నీతులు, జీవన రీతులు మారుతుంటాయి. వర్తమాన కాలరంగం నడుమ నిలబడి గతానికి సంబంధించిన విలువలను బేరీజు వేయడం సరయిన అనుశీలనా విధానమా, అంటే ‘కాదు’ అనే సమాధానం చెప్పుకోవాలి. కానీ ఈ కాలంలో వాటిని నీతులుగా చదువుకొంటున్నాం. అందులో చెప్పే భావాలని సూక్తులుగా భావించి జీవితంలో ఆచరించాలన్న లక్ష్యంతో పిల్లల పాఠ్యగ్రంథాలలో సైతం చేర్చుకుంటున్నాం . కనక ఏ కాలానికైనా పాటించదగ్గ జీవిత సూత్రాలేనా ఆ సుమతీ శతకంలో ఉన్నాయని మనం చెప్పుకుంటున్నవి- అని తరచి చూడడంలో తప్పేమీ లేదు. ఆ కోణంలో చూస్తే సుమతీ శతకంలోని కొన్ని సూక్తులు సార్వజనీననతకు కట్టుబడి లేవనే ఒప్పుకోవాలి.
ఉదాహరణకు
‘ఆకలి యడడుగని కడుపును/ వేకటియగు లంజ కడుపు విడువని బ్రతుకున్/
బ్రాకొన్న నూతియుదకము/
మేకల పాడియును మేదిని సుమతీ’ జీవితానికి ఎమేమి రోత కలిగించేవో వివరిస్తూ శతకకర్త ‘గర్భం ధరించిన వెలయాలి వ్యభిచారాన్ని’ ఆకలి తీరని అన్నంతో కలగలిపి చెప్పేడు. పాచి పట్టిన బావి నీటిని మేకల పాడికి జత కలిపాడు. నిజానికి మేక పాలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. గాంధీగారు మేకపాలనే నియమంగా తాగేవారు. పిల్లలకు బుద్ధులు నేర్పించే శతకపద్యాల మధ్య ‘లంజల కడుపు.. వ్యభిచార జీవనం’ వంటి దురాచారాల ప్రస్తావన ఉంటే నేర్పించే గురువులకు ఇబ్బందే కాదు.. నేర్చుకొనే వయసులో గల పిల్లల మీదా ఎంతో దుష్ప్రభావం చూపిస్తుంది.
సుమతీ శతకకర్తకు కరణాల మీద ఏ కారణం చేతో అపరిమితమైన కినుక ఉన్నట్లుంది. వ్యక్తిగతమైన కవి కోపతాపాలను సుద్దుల రూపంలో నూరిపోయడం వల్ల అకారణంగా పిల్లల మనసుల్లో ద్వేషభావం నింపినట్లు అవుతుంది కదా! నిజానికి
‘కరణము సాదై యున్నను/
గరి మద ముడింగినను బాము గరవకయున్నన్/
ధర దేలు మీటకున్నను/
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!’
(కరణం మంచివాడైనా, ఏనుగు మదం ఉడిగినదైనా, పాము కరవకపోయినా, తేలు కుట్టకపోయినా జనం లెక్కచేయరు)ఇలాంటి సూక్తులు నేర్పితే పిల్లలకు జీవితంలో జీవసాహచర్యం పాటించకూడదని, సాటి మనుషుల పట్ల వృత్తి రీత్యా ద్వేషం పెంచుకోవాలని నూరిపోస్తున్నట్లవదా! జీవ వైవిధ్యం పట్ల సదవగాహన, తోటివారి పట్ల సుహృద్భావం అలవరుచుకోవలసిన బాల్యదశలో ఈ చెడ్డమాటల వల్ల కలిగే ప్రయోజనం సున్నా! మరో పద్యంలో కూడా సుమతీ శతకకర్త ‘..లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ!’ అని నూరిపోస్తాడు. ఆడవారికి ప్రేమించడం బొత్తిగా తెలియదు’ అంటూ రుజువు కాని ఒక లైంగిక విద్వేషభావాన్ని బోధించడం పసిమనసులకు మేలు చేస్తుందా?
‘కొక్కోకమెల్ల జదివిన/
జక్కనివాడైన రాజ చంద్రుడైనన్/
మిక్కిలి రొక్కంబీయక/
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ’ అనే పద్యం వల్లించినప్పుడు ‘కొక్కోకశాస్త్రం’ అంటే ‘ఏంట’ని ఏ పసిజిజ్ఞాసికైనా అనుమానం వస్తుంది. సహజం. ‘వారకాంతలంటే ఎవరు? వాళ్లకు డబ్బిచ్చి దక్కించుకునేది ఏమిటి?’ అని మరో పసిదానికి డౌటొస్తుంది. ఏం చెబుతారు తరగతి గదిలో గురువులు?!
‘చేతులకు దొడవు దానము/ భూతలనాథులకు దొడవు బొంకమి దరలో/
నీతియే దొడవెవ్వారికి/
నాతికి మానంబు దొడవు నయముగ సుమతీ’
చేతులకు దానం, పాలకులకు సత్యసంధత వరకు సరే.. స్త్రీలకు శీలం అనడంలో సమంజసత ఉందా? లైంగిక వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించే బట్టీయం వేసే పిల్లలు ఎదిగిన తరువాత ఎన్ని రకాల వెర్రివేషాలకు తెగబడతారో వేరే చెప్పనక్కర్లేదు. ‘నీతిబద్ధమైన జీవితం అందరికీ అలంకారం’ అని అనివుంటే సుమతీ శతకం తన సూక్తినిబద్ధతను నిలబెట్టుకున్నట్లయేది.
‘తన కోపమె తన శత్రువు/
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/
తన సంతోషమె స్వర్గము/
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’
అన్నాడూ.. ఎంతో బావుంది. పిల్లలు ముందు ముందు తమ బతుకులు చల్లంగా దిద్దుకునేందుకు అక్కరకొచ్చే గొప్ప అచ్చమైన సూక్తులు అవుతాయట్లాంటి మంచి మాటలు!
‘తనవారు, జగడము, జనం, అనుమానం.. ఉన్న చోట ఉండవద్దని హెచ్చరించాడు మరో మంచి పద్యంలో
‘దగ్గర కొండెము సెప్పెడు/
ప్రగ్గడ పలుకులకు రాజు ప్రియుండై మరి తా/
నెగ్గుం బ్రజకాచరించుట/
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!’
-చెడ్డమంత్రులు చెప్పే చాడీలు నమ్మి ప్రజలకు కీడు తలపెట్టడం బొగ్గుల కోసం కోరికలు తీర్చే కల్పతరువును నరుక్కున్నంత వెర్రితనం అని హితవు చెప్పడం.. అన్ని కాలాలలో అందరు పాలకులూ ప్రజల పట్ల నడుచుకోదగ్గ మంచి మార్గం. ఈ తరహా పద్యాలే నిజమైన ‘సుమతీ’ సూక్తువులవుతాయి. ఈ తరహా మంచి పలుకులు మనసుకు పట్టించుకుని ఎదిగే పిల్లలే భావి జీవితంలో
‘వినదగు నెవ్వరు చెప్పిన/
వినినంతనె వేగపడక వివరింపదగున్/
గని కల్ల నిజము దెలిసిన/
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!’ అని సుమతీ శతకం సూక్తుల అంతరార్థం అర్థం చేసుకునేది.
ఎవరేం చెప్పినా ఓపికగా వినడం విన్న విషయాన్ని వెంటనే తొందరపడి ఆమలు చేయకుండా… అందులోని నిజా నిజాలను తరచిచూసే బుద్ధిని పెంచితే అంతకన్నా బిడ్డలకు ఏ శతకమైనా నేర్పే మంచి నీతి మరేముంటుంది?
ఆ ముఖ్యమైన విషయం మరచి తరచి చూసుకోకుండా ‘సుమతీ’ అన్న మకుటం ఉన్న ప్రతి పద్యాన్ని పిల్లలకు సూక్తుల పేరుతో నూరిపోస్తేనే పెను ప్రమాదం.
*
Add comment