ఖాళీలను పూరించడం కష్టమైనపని.
ఎంతో క్లిష్టమైన పని కూడా.
అసమానతలు పెరిగి పోయి, అవి పూడ్చలేని అగాథంగా మారినప్పుడు ఆ పని మరింత సంక్లిష్టం అవుతుంది.
ఇంతకీ ఈ ఖాళీలు ఎందుకు ఏర్పడతాయి? అందుకు కారణాలు ఏమిటి? కారకులు ఎవ్వరు? అన్న ప్రశ్నలు రామా చంద్రమౌళి గారు రాసిన ‘లోపలి ఖాళీ’ అన్న కథాసంపుటి చదువుతున్నపుడు మనకు తప్పకుండా ఎదురవుతాయి ! ఈ ‘లోపలిఖాళీ’ బయటి సమాజపు పోకడలకు ప్రతిబింబం .
ఇందులో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి . ఈ కథా సంపుటి నిండా అవినీతి, స్వార్థం, నిజాయితీలేమి, నైతిక విలువల పతనం, రాజకీయ వ్యభిచారం వంటి విషయాలను రచయిత సాహిత్యీకరిస్తూ పోయారు. చరిత్ర నుండి, వర్తమానం నుండి ఆయన అనేక దృష్టాంతాలను చూపిస్తూ వచ్చారు. రైతాంగ సాయుధ పోరాటం మొదలు, రాష్ట్ర ఏర్పాటు జరిగి, స్వయం పాలన సాగుతున్న ప్రస్తుత దశ వరకూ, ఆయన విభిన్న సంఘటనలను ఇందులోని ఇతివృత్తాలలో పొందుపరుస్తూ వచ్చారు.
ఎక్కడైనా స్వయంపాలన జరుగుతున్నదీ అంటే అప్పటిదాకా ఆ ప్రాంతం పైన కొనసాగిన ఆధిపత్యం, అణచివేతల నుండి తమకు విముక్తి కలుగుతుందనీ, శాంతి ,సౌఖ్యాలు చేకూరుతాయని అక్కడి ప్రజలు ఆశపడడం సహజం. కానీ స్వయం పాలనలో కూడా పరాయి పాలనలోలాగే ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ గతంలోలాగే ఉన్నప్పుడు, వాటిలో ఏ మాత్రం కూడా తేడా కనిపించనప్పుడు, అది ఏ రకమైన మార్పు అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది? ‘ఒక నది – రెండు తీరాలు’, ‘అజ్ఞాతం’ అనే కథలను పరిశీలించినప్పుడు మనకు ఈ సందేహమే వస్తుంది. మొదటి కథ లోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లయ్య, రెండవ కథలోని విప్లవకారిణి నిర్మల ఇద్దరు కూడా ప్రజలను పీడించిన వాళ్ళు కాదు, ప్రభుత్వ ఖజానాను లూటీ చేసి, ఆ సొమ్ముతో విదేశాలలో కులుకుతున్న వాళ్లు కూడా కాదు. వాళ్లు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన వాళ్ళు. ప్రజలలో చైతన్యం రగిలించిన వాళ్ళు. ప్రజా సమస్యల పరిష్కారానికి తపించిన వాళ్లు. ఈ ఇద్దరి విషయంలో ఆయా ప్రభుత్వాలు వ్యవహరించిన విధానంలో తేడా ఏమీ కనిపించదు. అమలు చేసిన శిక్షల విషయంలో కూడా ఎలాంటి మార్పూ కనిపించదు.
మల్లయ్య పాల్గొన్నది రైతాంగ సాయుధ పోరాటంలో. ఆయన చిత్రహింసలు అనుభవించింది నైజాం రాజ్యంలో భాగమైన దొరలు దేశముఖ్ లు, రజాకార్లు, యూనియన్ సైన్యాల చేతులలో. ఊరి నడిమధ్యన అతడి రెక్కలు విరిచి కట్టి, నాలుకను సూదులతో కుట్టి, తన చితిని తనే పేర్చుకోవడానికి ఆ పరిసరాలలోని ప్రతి ఇంటి యజమాని ఒక్కొక్కరిని ఒక కట్టె అడుక్కొని వచ్చి తన భార్య సహాయంతో తనకు తానే చితి పేర్చుకునే సన్నివేశాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారు. మనసున్న ఏ మనిషినయినా చలింపజేసే హృదయ విదారక సంఘటన ఇది. దీనిని దృశ్యమానం చేయడంలో రచయిత కృతకృత్యుడయ్యాడు.
ఇక ‘అజ్ఞాతం’ కథాకాలం ఇటీవలిదే. ఈ కథలోని ప్రధాన పాత్ర నిర్మలను పెట్టిన చిత్రహింసలు ఒకప్పటి దేశముఖ్ రజాకార్ల సైన్యాలు పెట్టిన చిత్రహింసలకు ఏమాత్రం తీసిపోనివి. రెండు వేరు వేరు తరాలకు చెందిన పాలకులు అయినప్పటికీ, పాలనా విధానం, అణచివేతల అమలులో తేడా ఏమీ కనిపించకపోవడం ఈ రెండింటికీ మధ్య సారూప్యత. కౄరత్వాన్ని అమలు చేసే విషయంలో ఇక్కడ ఎవరూ ఎవరికీ తీసిపోరు. రాజ్యం అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసే కథలివి. పై రెండూ ఉద్యమం లేదా పోరాట నేపథ్యంలో సాగిన కథలనుకున్నా, ‘సిద్దయ్య మఠం’ అనే కథ వర్తమాన రాజకీయ నాయకులు వ్యవహరించే తీరుకు సంబంధించిoది. తమకు ఓట్లేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజల బాగోగులను చూడడం మాట అటుంచి, గ్రామాలను ఎంతోకాలంగా కాపాడుతూ వస్తున్న రక్షణ కవచాల లాంటి గుట్టలను తవ్వుకుపోయే ప్రయత్నం చేస్తూ ఆచరణలో ఈ నాయకులు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తున్నారు. వీరిని రచయిత కంచెలతో పోల్చాడు. అయితే ఇక్కడ కంచే లేదు. అలాగే చేను అసలే లేదు. రాజకీయ నాయకులు కంచెను తీసేశారు. చేనును మేసేశారు. వాళ్లకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకే ప్రజల సంపదపై విరుచుకుపడ్డారు. వీళ్ల దురాగతాల మూలంగా ‘ఈ గుట్టలు కుడుకను గీక్కు తినగా మిగిలిన కొబ్బరి చిప్పలలాగా అయిపోయాయి అంటాడు రచయిత.
రాజకీయ నాయకులకు గుట్టలు కావాలి. గుట్టలు గుట్టలుగా తమ ఇంట్లో పేర్చుకోవడానికి నోట్ల కట్టలు కావాలి తప్ప, ప్రజలు అక్కర్లేదు. వారి సమస్యలు అక్కర్లేదు. వాళ్లకు కావలసినవల్లా ప్రకృతి వనరులు. గుట్టల దోచుకోవాలి. గుట్టలు కాకపోతే ఇసుక, ఇతర ఖనిజ వనరులు ఇతరేతర ప్రజల సంపదలు వీళ్ళకి కావాలి. అవసరమైతే ప్రజలను నిర్వాసితులను చేసైనా సరే, ఈ సంపదలను చేజిక్కించుకోవాలి. అంతే తప్ప ప్రజాప్రయోజనం అనే మాట ప్రస్తుత నేతల దృష్టిలో విలువలేనిది అయిపోయింది. ఇలాంటి స్థితిలో ప్రజలు అనివార్యంగా ఆందోళన బాటపడతారని రచయిత ఈ కథ ద్వారా చెబుతాడు. వందమంది నేరస్తులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ఉన్నత న్యాయ సూత్రాన్ని మన రాజకీయ నాయకులు పూర్తిగా తమ దోపిడీకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. నేరాల నుండి తప్పించుకొని వారు నిర్దోషులను దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు . వారి అవినీతికి అడ్డుగా ఉన్న వారిని తుదముట్టించేందుకు కూడా తెగబడుతున్నారు. వాళ్ళ అకృత్యాలలో ఉన్నతోద్యోగులను కూడా భాగస్వాములను చేస్తున్నారు అంటారు రచయిత. ‘ఈ దేశానికి ఎప్పటినుండో ఇక్కడి ఉన్నత విద్యావంతుల నుండే ఎక్కువ ప్రమాదం ముంచుకొస్తున్నది. నిజానికి వాళ్లే దేశద్రోహులు’ అని ఆగ్రహిస్తాడీయన. ఇక్కడ వర్తమాన రాజకీయ వస్తువును అత్యంత సహజంగా సాహితీకరించే ప్రయత్నం చేశారు రచయిత. మిగతా కథలలోని పాత్రల వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు ఎక్కువ వాటిలో విలువలలేమి, నైతిక పతనం, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోవడం లాంటివి కనిపిస్తాయి. ‘అగ్నిచికిత్స’ అన్ని విధాలా అవినీతిలో కూరుకుపోయిన ఉన్నత ఉద్యోగులైన తల్లిదండ్రుల కథ. ఇలాంటి వారిపై వాళ్ళ కూతురు ఎలాంటి వైఖరి తీసుకుందన్నది కథకు కొసమెరుపు.
ఇక ఆయన ఇతర కథలలో ఎక్కువ పాత్రలు తాము పొందిన వైఫల్యాలను స్ఫూర్తిగా తీసుకొని అత్యున్నత శిఖరాలకు ఎదిగే ప్రయత్నం చేసినవే. ‘మృత్యువు యొక్క మృత్యువు’ లో ‘నీల’, ‘బ్రహ్మపీఠం’ లో నిర్మల ‘ఆత్మవిముక్తి’ లో వాసంతి ఇలాంటి వాళ్లే. ఈ పాత్రలన్నీ కూడా తమ ప్రతిభతో పట్టుదలతో తమకు ఎదురైన అడ్డంకులను అధిగమించి ఎలా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారో చెబుతాయి కానీ ఎంతో కష్టపడి ఊహించనంత ఉన్నత స్థానాలకు చేరుకున్నాక కూడా ఇక్కడి వ్యవస్థ ఇంకా ఇలాగే ఎందుకు ఉన్నది అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. వ్యక్తుల వ్యక్తిగత ప్రతిభ మాత్రమే సమాజాన్ని మార్చలేదనే సత్యం కాస్త ఆలస్యంగానైనా వీరికి బోధపడాల్సిన అవసరం వుంది. బహుశా ఆ పని లోపలిఖాళీ అనే కథ సూచనప్రాయంగా చెబుతుంది. ఆ కథలో శంకరనారాయణ అనే వ్యక్తి మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను అంటూ సైకియాట్రిస్ట్ డాక్టర్ను సంప్రదిస్తాడు. ఆ డాక్టర్ వద్ద ఇతని ప్రశ్నకు సమాధానమే ఉండదు. నాలుగు సార్లు వెళ్లి వచ్చిన తర్వాత శంకరనారాయణ తాను మనుషుల్ని ప్రేమించలేకపోవడానికి తన హృదయంలో నిండి ఉన్న మాలిన్యమే కారణం అని గ్రహిస్తాడు. అందుకు కారకులు ఎవరో కూడా గ్రహిస్తాడు. ఆ విషయాన్నే డాక్టర్ కి చెప్పి వెళ్లిపోతాడతడు. ప్రేమరాహిత్యం పై పెటిల్లున చరిచిన ఒక చరుపు ఈ ‘లోపలిఖాలీ’ కథ. కథ ముగిసిన తరువాత ప్రేమరాహిత్యపు నిజమైన మూలాలు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్న ఆ డాక్టర్ తో పాటుగా పాఠకులకు కూడా కలుగుతుంది. లోతైన అంశాలను కథలుగా మలచడంలో రచయిత యొక్క పరిణతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇతివృత్తాల ఎంపికా, పాత్రల ప్రవేశమూ, వాటి మనస్తత్వ చిత్రణా సన్నివేశ కల్పన వంటి విషయాలలో రామా చంద్రమౌళి గారిది ఒక ప్రత్యేకమైన బాణీ. ‘ భరిణె ‘ అనే కథా వస్తువును సగటు పాఠకుడు అసలు ఊహించడమే కష్టం. విశ్వాసపు విశ్వరూపానికి ప్రతీక అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ కథలో ఒదిగిన తీరు పాఠకునిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మానవ మనస్తత్వానికి సంబంధించిన భిన్న పార్శ్వాలను చిత్రించిన కథ ‘ధృవధర్మాలు’. ఇతివృత్తాలకు తగిన పాత్రలు, పాత్రలకు తగిన సన్నివేశాలు, పాత్రోచిత సంభాషణలు వంటివి ప్రతి కథలోనూ అనేక చోట్ల పాఠకుడికి తారసపడతుంటాయి.. అలరిస్తాయి కూడా. అవి పాఠకుడు ఈ కథలను ఆసక్తితో చదివేటట్లు చేస్తాయి. ఇక కవితాత్మక వాక్యాలు అయితే అడుగడుగునా దర్శనమిస్తాయి. కవితాత్మక వచనం ఈ కథలకు అదనపు ఆకర్షణ. బహుశా ఈ లక్షణమే కథకుడిని మిగతా రచయితలో భిన్నమైన సృజనకారునిగా నిలబెడుతున్నది. ‘తుఫాను తర్వాతి దృశ్యం’ అనే కథ పూర్తిగా చారిత్రక ఘటన. తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన వాస్తవ సంఘటన. దానిని రచయిత ఉన్నది ఉన్నట్టుగా ఉటంకించి కథ అని పేరుపెట్టారు. చరిత్రను సాహిత్యీకరించేటప్పడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. అలాగే
‘ సూర్యుడు ఉదయించనే ఉదయించడనుకోవడం నిరాశ
ఉదయించిన సూర్యుడు అస్తమించడనుకోవడం దురాశ ‘ కాళోజీ అన్న మాటలను ‘ధృవధర్మాలు’ కథ ముగింపులో ఉటంకించారు రచయిత.. కానీ నిజానికి కాళోజీ మాటలు అవి కావు.
‘ ఉదయం కానే కాదనుకోవడం నిరాశ/ ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ ‘
ఇవీ అసలైన పాదాలు. ఎంతో అనుభవజ్ఞుడైన ఈ రచయిత ఇలాంటి విషయాలు పుస్తకంలో చోటుచేసుకోకుండా చూసుకునివుంటే బాగుండేది.
మొత్తంమీద రామా చంద్రమౌళి గారి ఈ ‘ లోపలి ఖాళీ ‘ సంపుటిలోని కథలన్నీ పాఠకుణ్ణి కొంత కాలం వెంటాడ్తూ జ్ఞాపకముండే కథలే.
*
చక్కని సమీక్ష. అర్థవంతంగా.. ఆలోచన దిశలో పయనించింది.
శ్రీనివాస్ గారికి అభినందనలు.. 👋👋👋👌👌👌💐💐💐🙏
ధన్యవాదాలు సార్
బాగుంది. ఇరువురికీ శుభాకాంక్షలు. శ్రీనివాస్ మరియు రామాచంద్రమౌళి గార్ల నుండి సహజంగా రచనలు జాలువారుతాయి
ధన్యవాదాలు సార్
బాగుంది…గుండెబోయిన తన సహజమైన వ్యక్తీకరణ మరోసారి చూడటమైంది. “సిద్దయ్య మఠం” లోపలికి ఇంకా వెళ్ళొస్తే బాగుండేది.. ఇరువురికి జమిలిగా అభినందనలు……
“ఎలమంద”
అవును. మీరన్నట్టు లోపలికి వెళ్లివస్తే ఇంకా బాగుండేది. ధన్యవాదాలు సార్