“మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఏకైక చిరునామా ఏదైనా ఉంది అంటే అది గ్రంథాలయం,” అంటారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.
మానవ జీవితంలో పుస్తకాలు ఒక మహత్తరమైన పాత్రను పోషిస్తాయి. మనుషులు తమ మెదళ్లు చిలికి చిలికి తీసిన అనుభవాల సారం పుస్తకాలు. సుదీర్ఘ మానవ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, సృష్టి రహస్యాలు, తన కలలు, కన్నీళ్లు, కష్టాలు, కల్పనలు, ఊహలు, జయాలు పరాజయాలు అన్నింటినీ మనిషి పుస్తకాలలో భద్రంగా దాచుకున్నాడు. అవి సజీవ జ్ఞాన నదులు.
నానాటికి విలువలు తగ్గిపోతున్న నేటి సమాజంలో విజ్ఞాన భాండాగారాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఒకప్పుడు ప్రతి మండలంలో శాఖా గ్రంథాలయము, జిల్లాలో జిల్లా గ్రంథాలయము, పాఠశాలల్లో గ్రంథాలయము, కళాశాలల్లో కళాశాల గ్రంథాలయము, ఇంటింటికి తిరిగే సంచార గ్రంథాలయాలు తెలుగు ప్రజలను పాఠకులుగా సాహిత్యకారులుగా కథకులుగా కవులుగా విమర్శకులుగా పండితులుగా తీర్చిదిద్దాయి. గ్రంథాలయాలు మనుషులు ఆనందంగా ఉండడానికి సామాజిక దృష్టిని కలుగజేయడానికి ఉద్యమాలు నిర్మించడానికి కూడా దోహదం చేశాయి.
నేటి పరిస్థితి దయనీయంగా ఉంది. పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు గ్రంథాలయాలకు ప్రాముఖ్యత నివ్వడం మానేశాయి. భాషకు విలువ ఇవ్వడం మానేశాయి. ఫలితంగా పఠన సంస్కృతి దానంతట అదే మాయమవుతూ వస్తుంది. దాంతో విద్యార్థి దశలోనే అధ్యయనానికి బీజాలు పడాల్సిన పరిస్థితుల నుండి, కొత్త తరాన్ని అనామకులుగా సమాజంలోకి నెట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సెల్ ఫోన్ కి ఇంటర్నెట్ టెక్నాలజీ తోడవడంతో యువత మరింత అయోమయ స్థితిలోకి దిగజారి పోతున్నారు. సమాజంలో ఇంత విధ్వంసం జరుగుతున్నా పౌర సమాజం మిన్నకుండిపోయింది. ఇంటి నుండి మొదలు పెడితే ప్రతి ఇల్లు ఇవాళ ఒక గాడ్జెట్ల కర్మాగారమే. చదువుకున్న ఆలోచనాపరులు సైతం పిల్లల్ని పుస్తకాల ముందుకు తీసుకు రావడంలో విఫలమవుతున్నారు. పెద్దలు కూడా ఆ ప్రతి బంధకాల నుంచి బయటపడలేకపోతున్నారు. రచయితల సంఘాలు పండుగలకు పబ్బాలకు పండుగలు చేసుకోవడం సన్మానాలు సత్కారాలు అవార్డులు రివార్డులతోటే కాలం గడపడం ఎంతో శోచనీయం.
మాతృభాషాభిమానులు అవసరం వచ్చినప్పుడు నిద్ర లేవడం అవసరం తీరిన తర్వాత నిద్ర పోవడంగా మారిందే కానీ నిరంతరంగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయింది లేదు. పాఠశాలల్లో గ్రంథాలయాలు లేక తరగతి గదుల్లో చదవడం రాక పిల్లల్లో రోజురోజుకు పఠన సామర్థ్యం తగ్గిపోతుంది. యాభై శాతం మంది పిల్లలు మాతృభాష చదవలేని పరిస్థితి కనిపిస్తుంది. మాతృభాష పునాదిలేని చోట పరభాషను నేర్చుకోవడం ఎంత ఇబ్బందిగా మారుతుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలకు, పౌర సమాజానికి పుస్తకం అక్కరలేని వస్తువుగా మారిపోయింది.
ఎక్కడ మాతృభాష మాయమవుతుందో అక్కడ సాహిత్యం సంస్కృతి నాగరికత క్షీణదశకు వచ్చేస్తాయన్నది మనకు విదితమే. మనుషుల్లో మానవత్వం నశించి రాక్షసత్వం చోటు చేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాలలో కొంత మంది యువత వేస్తున్న వెర్రితలలే దీనికి నిదర్శనం. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్, వృత్తి విద్యా కోర్సులకు కూడా ప్రాధాన్యతనిస్తున్న పాఠశాలల్లో, కళాశాలల్లో గ్రంథాలయాల అభివృద్ధిని చేపట్టి అమలు పరచాలి. విద్యార్థులకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా భాషాభివృద్ధి సాహిత్య అభివృద్ధి ద్వారా మెరుగవుతాయి.
బట్టీ చదువుల విధానంలో ఆలోచన లేక నోట మాట రాని యువతకు మార్గ నిర్దేశకత్వం చూపేవి గ్రంథాలయాలే. గతంలో పాఠశాలల్లో గ్రంథాలయం పీరియడ్ టైం టేబుల్ లో ఉండేది. ఇప్పుడు రకరకాల పీరియడ్ల కోసం గ్రంథాలయం పీరియడ్ ని కూడా టైం టేబుల్ నుండి తొలగించారు. పాఠశాలల్లో లైబ్రరీ ఇన్స్ట్రక్టర్స్ లేరు. పాఠశాలల్లో గ్రంథాలయాలు బీరువాలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల భాషాభిమానులు కొందరు తమ గ్రామంలోని పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి పూనుకున్నప్పటికీ వారికి సరైన ప్రోత్సాహం ఉండడం లేదు. చదవడం రాని పిల్లలు కూడా పేజీలకు పేజీలు నోట్స్ రాయడం మన విద్యా విధానంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం.
పేలవమైన బోధనా విధానం వల్ల యాభై శాతం మంది విద్యార్థులు జీవితంలో విజయం సాధించలేక పోతున్నారు. విద్యా పరంగా ఎన్నో రకాల బాధ్యతలను నెరవేరుస్తున్న ప్రభుత్వాలు పిల్లల్లో మాతృభాషాభివృద్ధి, సాహిత్యాభివృద్ధి చేసి రెండు తెలుగు రాష్ట్రాలను అక్షరాస్యతా పథంలో ఆలోచనాత్మకంగా ముందుకు నడిపించే కృషి చేయాల్సి ఉంది. కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చేసింది.ఇప్పటికే జరగాల్సిన నష్టం ఎంతో జరిగిపోయింది.
యువత సోషల్ మీడియా టెక్నాలజీ మాయలో పడి మరింత నష్టం జరగకముందే తెలుగు రాష్ట్రాలు మేలుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల్లో మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మరో గ్రంథాలయ ఉద్యమ యాత్రను చేపట్టి గ్రంథాలయాల ఆవశ్యకతను, భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను వివరిస్తున్నాము. మాతృభాషపై అభిమానం పెంచడం, పాఠశాలల్లో విద్యా వికాసం, విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, యువతకు సెల్ఫోన్ సోషల్ మీడియా, టెక్నాలజీ సద్వినియోగంపై అవగాహన కలిగించడం, సాహిత్యాన్ని పరిచయం చేయడం, ఇంటింటికి గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం కోసం మరో గ్రంథాలయ ఉద్యమ యాత్రను గ్రామ గ్రామాన కొనసాగిస్తున్నాము. మరో గ్రంథాలయ ఉద్యమం మొదటి మహాసభ విజయవాడలో, రెండవ మహాసభ తెలంగాణలో నిర్వహించడం జరిగింది.
ఇటీవల తెలంగాణలో మరో గ్రంథాలయ ఉద్యమ యాత్ర లీడ్ లైబ్రరీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నుండి ప్రారంభమై పలుజిల్లాలలో గ్రంథాలయ ఉద్యమకారులను, గ్రంథాలయాలను సందర్శిస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలోని సాహిత్యకారులను, పుస్తక ప్రేమికులను, పత్రికల అధిపతులను, కళాకారులను కలుసుకొని మరో గ్రంథాలయ ఉద్యమానికి చేయూతని ఇవ్వవలసిందిగా కోరాము. మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగానే సెప్టెంబర్ 8, 2025 న హైదరాబాదులో ‘పుస్తకంతో నడక’ కార్యక్రమం, తదనంతరం సమావేశంలో ఆస్తి పన్నులో భాగంగా వసూలు చేస్తున్న 8% సెస్సు మొత్తాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి, పుస్తకాల కోసం వినియోగించవలసిందిగా ప్రభుత్వానికి విన్నవించనున్నాము.
ఉద్యమాభిలాష కలిగిన సంస్థలు, సాహితీ సమాజం, స్వచ్ఛంద గ్రంథాలయ నిర్వాహకులు, పుస్తక ప్రియులు అందరూ కలిసి మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే జ్ఞానవంతమైన కొత్త తరం పుట్టుకొస్తుంది. “పసిపిల్లల ఊహలకు రెక్కలనిచ్చే పుస్తకాల కోసం… వారిని నిజమైన జ్ఞానవంతులుగా చేసే గ్రంథాలయాల కోసం…” మనందరి మరో గ్రంథాలయ ఉద్యమం!
*
Add comment