లైక్ రియల్ పీపుల్ డూ

                     1
–చిరు చెమటలతో చల్లబడి వున్న నా చేతులలోని   మొబైల్ లో, ఎమెరాల్డ్ ఇన్స్టాగ్రామ్   స్టోరీ మళ్ళీ  మళ్ళీ ప్లే అవుతూ వుంది. స్టోరీ లోని ఫోటోలో  ఎమరాల్డ్, తన ఫ్లాట్ లో నేల మీద పడుకుని  వుంది. ఆమె పడుకున్న నేల, ముదురాకుపచ్చ రంగు టైల్డ్ ఫ్లోర్. అక్కడక్కడ తెల్లటి చిప్స్ అతికించి చేసిన ఫ్లోర్ డిజైన్. ఎమరాల్డ్ పడుకున్న ప్రదేశానికి ఒక కోణంగా ఆమె పక్కన క్రిస్మస్ ట్రీ వుంది, ఆ చెట్టంతా కొమ్మలపై మంచు పడినట్లు తెల్లగా దూదితో, కొమ్మ కొమ్మకూ రకరకాల బొమ్మలతో, చెట్టంతా ఫెయిరీ లైట్స్ తో అలంకరించి వుంది. క్రిస్మస్ ట్రీకి పక్కగా నేల మీద చందనం రంగు స్వెటర్, వైట్ కలర్ మఫ్లర్ వేసుకుని, తెల్లటి పర్షియన్ పిల్లిని ఛాతీ మీద పెట్టుకుని పడుకుని వుంది ఎమెరాల్డ్. ఆమెవి ఆకు పచ్చ రంగు కళ్ళు. ప్రపంచంలోనే, కేవలం రెండు శాతం మందికి మాత్రమే వుండే కనుపాప రంగు అది. అందుకే ఆమె పేరు ఎమెరాల్డ్. ”నీకు భలే సరయిన పేరు పెట్టారు మీ అమ్మ వాళ్లు”అంటే ”నా తల్లిదండ్రులు కాదు, మా పెద్దన్న పెట్టాడు” అని చెప్పింది. ఎమెరాల్డ్ కంటే పదేళ్లు పెద్దవాడైన ఆ పిల్ల అన్న, కొత్తగా పుట్టి, హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన పుచ్చ పువ్వులాంటి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి విచ్చుకున్న మరకతాల వంటి స్వచ్ఛమైన కనుపాపలని   ఆశ్చర్యపడి చూస్తూ, రెప్పవేయడం కూడా మరచి పోయి ”ఎమరాల్డ్ ” అన్నాడట.
ఇన్స్టాగ్రామ్ స్టోరీ తిరిగి తిరిగి ప్లే అవుతూ వుంది నా మొబైల్ లో.”గివ్ మీ హోప్ ఇన్ సైలెన్స్/ఇట్స్ ఈసియర్ /ఇట్స్ కైండర్ /టెల్ మి నాట్ ఆఫ్ హార్ట్ బ్రేక్ /ఇట్ ప్లేగ్స్ మై సోల్; ఇట్ ప్లేగ్స్ మై సోల్ [Give me hope in silence, /It’s easier, it’s kinder, /Tell me not of heartbreak, /It plagues my soul, it plagues my soul.’‘] అంతే. పదిహేను క్షణాల, ఆ నాలుగు చిన్ని వాక్యాలు, అనంతం లా పదే పదే నా హృదయంలో సుడులు తిరుగుతూ వున్నాయి. పన్నాకి తెలుసు ఆ పాట నా హృదయాన్ని మెలిపెడుతుందని. ‘మమ్ ఫోర్డ్ అండ్ సన్స్’బ్యాండ్ పాడిన పాట, ”ది ఎనిమీ”అది. ఉదరింగ్ హైట్స్ సినిమా చూస్తున్నపుడు తెలిసిన పాట అది, నాకు. మొబైల్ నుండి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ నాలుగు వాక్యాల తర్వాత వచ్చే ప్రతి పదమూ నాకు తెలుసు, ఆ ప్రతి వాక్యమూ అమూర్తమైన చుర కత్తిలా మారి నా హృదయాన్ని చీలుస్తూ వుంది. ”పన్నా, పన్నా! ఈ దుక్ఖాన్ని భరించేంత శక్తి నాకు లేదురా! ఈ యుద్ధాన్ని నేను చేయలేను రా పన్నా! ” పైకి వినపడకూడదనుకుని నొక్కి పట్టిన దుఃఖం వల్ల, గుండెలో ఏదో మూల తీగలా సన్నటి నొప్పి బయల్దేరింది.
ఎమెరాల్డ్ కి నేను పెట్టుకున్న ముద్దు పేరు ” పన్నా ‘‘. ”చిన్నా” లాగా ముద్దుగా, చిన్నగా, ఆ అమ్మాయి పేరుకే ఇంకో భాషా నామం, అంతే! ఆ పిల్లకి ఆ పేరు ఎంతో నచ్చింది. తనకి ఇండియా అంటే ఎంతో ఇష్టం. ”ఎందుకు అంత ఇష్టం?” అని అడిగితే,”తెలీదు! కచ్చితంగా చెప్పలేను, బహుశా ఇక్కడ క్రితం జన్మలలో ఎప్పుడో నా హృదయం తప్పిపోయింది, అందుకని వెదుక్కుంటూ వచ్చేసా” అంటుంది అడిగిన వాళ్ళతో. అచ్చం ఆ అమ్మాయి కళ్ల లాగే, తన మాటలు కూడా, స్పటికంలా   స్వచ్ఛంగా ఉంటాయి, కానీ ఆమె మాటలు అరుదు గా మాత్రమే వినిపిస్తాయి, అరుదయిన మరకతాలలా. ఎమరాల్డ్ చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఆఫీస్లో తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంది. ఇండియా అమ్మాయిలు, జీన్సులలో, మరీ కాదంటే చుడిదార్ లో శరీరాన్ని పడేసి, హాయిగా సుఖంగా జీవితాన్ని లాగిస్తుంటే, ఎమరాల్డ్ చీరలు కట్టుకుంటుంది, అదీ నేత చీరలు, ఆ నేత చీరల మీదకు చిన్న ఝుంకీలు పెట్టి, చేతులకు మట్టి గాజులు వేసి, ఆ పచ్చటి కనుపాపలున్న తెల్లటి కళ్ళకి కాటుక పెట్టుకుంటుంది. ఇండియాకి రాకముందే ఎమరాల్డ్కి కొంచెం తెలుగు వచ్చు. సినిమాలు చూసి కొంచెం, ఆన్లైన్ క్లాసులు పెట్టించుకుని నేర్చుకోవడం వల్ల కొంచెం. ఆఫీస్ ఆఫీసంతా తెలుగు మాట్లాడే ఎమరాల్డ్ వెనక పడతుంటారు   పెళ్లికాని అబ్బాయిలు గంపెడు ఆశతో వెనకపడితే, మిగిలిన వాళ్ళు ఆరాధనతో వెనకపడుతారు. ఎందుకంటే, ఎమరాల్డ్ సుగుణాల రాశి. తను పాట పాడితే మాణిక్య వీణ మ్రోగినట్లు ఉంటుంది. చెలో వాయిస్తే   అదేదో దేవరాగాన్ని ఆమె చేతి వేళ్లతో నాజూకుగా నేత నేస్తున్నట్లు ఉంటుంది.
మా ఆఫీస్ లో చేరిన అన్నిరోజులలో, ఎప్పుడూ సరిగా నా కళ్ళ ఎదుటకు కూడా రాని ఎమరాల్డ్, ఒకరోజు మధ్యాహ్నం, హఠాత్తుగా నా ఛాంబర్లోకి వచ్చి ”ఈ రోజు నా పుట్టిన రోజు, చిన్న పార్టీ, తియ్య పొంగలి వండి పెడతాను, నా ఇంటికి వస్తారా” అన్నది, తియ్య పొంగలి అని నొక్కి చెబుతూ. ఆ నొక్కిన యాసకు నవ్వి, టైం చూసుకుని, మనసులో లెక్కలు వేసుకుని ”వస్తాను కానీ, ఒక్క పది నిమిషాలే ఉండగలను ఎమరాల్డ్, ఫర్వాలేదు కదా” అంటే, చిన్న పిల్లలాగా ఆనందపడిపోయింది. ”అలాగే, సంతోషం, సంతోషం”అని నవ్వుతూ వెళ్లిపోయింది.
ఆ సాయంత్రం ఆఫీసులో చాలా ఆలస్యమైపోయింది, పార్టీకి ఆలస్యమైపోతుందేమోనని హడావిడిపడుతూ వెళ్లి చూస్తే, ఎమరాల్డ్ ఇంట్లో ఎవరూ లేరు. ఆ పార్టీ కి ఏకైక అతిధి నేనే.  నన్ను మాత్రమే ఎందుకు పార్టీకి పిలిచినట్లు, అడుగుదామని నోటి వరకు వచ్చి, అలా అడగడం సంస్కారం కాదేమో అనుకుని, నావ ఆకారంలో చేసిన ఆకుల అల్లిక లో పొదిగిన తెల్ల గులాబీల బొకే తో పాటు   ”బీటీఎస్ బ్యాండ్ ”రికార్డు ఒకటి మొహమాట పడుతూ తన చేతికి ఇస్తే, తీసుకుని బోలెడు సంతోష పడిపోయింది.”మీకెలా తెలుసు నాకు bts అంటే ఇష్టమని ”అన్నది. నేను నవ్వి ”చిన్న పిల్లవి కదా, అందుకని తెలుసు ” అంటే, మూతిని అచ్చం గుండు సున్నాలా, ముద్దుగా చుట్టి, కాటుక కళ్ళని పెద్దవి చేస్తూ ”నేను చిన్న పిల్లనేం కాదు తెలుసా ” అని,” మీ కొరకు ఒక పాట ప్లే చేస్తాను వింటూ వుండండి. అంత లోపల నేను తియ్య పొంగలి తెచ్చేస్తాను ”అన్నది తలని కొంచెంగా అటూ ఇటూ చిన్న పిల్లలా ఊపుతూ. ఆ రోజు తను ప్లే చేసిన పాట, లానా డెల్ రే,”బ్రూక్లిన్ బేబీ’‘. నేను తనని చిన్న పిల్లవి అన్నానని, నేను అనుకుంటున్నట్లు తానేమీ చిన్న పిల్ల కాదనీ, ఒక్క క్షణంలో ఒక పాటతో నాకు ఆ అమ్మాయి సమాధానం ఇచ్చిందని అర్థమై చిన్నగా నవ్వొచ్చింది. కానీ, వస్తున్న దారిలో, ఒక్క క్షణం కూడా తీసుకోకుండా, ఒక పాటతో తన భావాన్ని ఆ అమ్మాయి అలా చెప్పగలగటం గుర్తు తెచ్చుకున్నప్పుడు, అలా చెప్పడానికి ఆ అమ్మాయికి ఎన్ని పాటలు, సంగీతము తెలిసి ఉండాలోనని ఆలోచిస్తే ఆశ్చర్యమూ కలిగింది. కానీ ”దే  సే అయామ్ టూ యంగ్ టు లవ్ యు / ఐ డోంట్ నో వాట్ ఐ నీడ్ /దే థింక్ ఐ డోంట్ అండర్ స్టాండ్  /ది ఫ్రీడంలాండ్  ఆఫ్  సెవంటీస్  [ ”They say I’m too young to love you/I don’t know what I need/ They think I don’t understand/The freedom land of the seventies  ] అంటూ సాగే ఆ పాట పల్లవితో ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను తనతో చేయబోయే ఒకానొక సంభాషణా పదబంధానికి తన పుట్టిన రోజు నాడే సమాధానం  ఇచ్చి,నన్ను ఒప్పించడానికి  సిద్ధమై  ఉందని  అప్పుడు  నాకు తెలీదు .
పాట వింటూ నేను తన గదిని చుట్టి చూస్తూ వున్నాను. ఒక మూల పుస్తకాల అర, ఇంకో వైపు గోడకి వున్న షెల్ఫులో, ఒక్కో అరలో, ఒక్కో ఆకారంలో వున్న కుండీలలో రకరకాల బుజ్జి బుజ్జి సకులెంట్ మొక్కలు వున్నాయి. సోఫా, కుర్చీలు లేకుండా నేల మీద చిన్న పరుపు వేసి వుంది, ఆ పరుపుకి ఒక మూల చిన్న మూడంచెల స్టాండు మీద తలాడించే కొండపల్లి నర్తకుల బొమ్మలు అనేకం, రకరకాల రంగుల్లో పెట్టి వున్నాయి. గోడకు ఇంకోవైపు రవివర్మది హాయిగా ఉయ్యాలలూగుతున్న మోహిని పెయింటింగ్, లోపల ఎక్కడి నుండో సోయగంగా తేలివస్తూ దివ్యంగా మనసు వరకు అల్లుకు పోతున్న దేశీయ సామ్రాణి పరిమళం, మొత్తం ఆ గది అంతా చిత్రవిచిత్రంగా కలైడోస్కోప్ లో చూస్తున్న వర్ణ విభ్రాంతిలా తోస్తుంటే, లోపలికి వెళ్లే తలుపు కుడి వైపు గోడకి తగిలించి వున్న, మైఖేలాంజెలో ‘‘లేడ అండ్ ది స్వాన్”దగ్గర ఆగి, ఆ వర్ణోద్రేక బీభత్సాన్ని చూస్తుంటే అప్పుడు వచ్చింది ఆ పిల్ల తియ్య పొంగలి పట్టుకుని. ఇద్దరం పరుపు మీద కూర్చోబోతూ ఉంటే చెయ్యి తగిలి తన చిన్న కొండపల్లి నర్తకి బొమ్మ పరుపు మీద పడింది. పడటం పడటం నర్తకి తల వేరుగా మిగిలిన శరీరం వేరుగా పడింది. నేను కంగారు పడుతూ ఉంటే తను నా మీదుగా వంగి ”పర్లేదు”అంటూ బొమ్మని చేతిలోకి తీసుకుని తిరిగి ఆ తలని సరిగా పెడుతూ వుంది. నేను తన నాజూకు చేతి వేళ్ళని చూస్తూ,”నీ గది ఆర్ట్ గేలరీ లా వుంది, చాలా అందంగా, అచ్చు నీ లాగ‘’ అన్నాను. తను నా వంక చూసి ,నవ్వు ముఖంతో   ”తినండి ,మీరు  ఇచ్చిన పది నిమిషాలు ,ఇంకో మూడు నిమిషాలలో ముగిసి పోతాయి” అంది కళ్ళు దించుకుని,కొండపల్లి బొమ్మ తలను సర్దుతూ.నేను తల ఊపి  ఆ ”లేడ అండ్ ది స్వాన్” నేను వెబ్లో మాత్రమే చూసాను ,కళ్ళతో కాపీని ఎప్పుడూ చూడలేదు అందుకే ఆర్ట్ గేలరీ అన్నాను”అని పొంగలి చేతిలోకి తీసుకంటూ ఉంటే, ఎమరాల్డ్ తన చీరని చక్కగా సర్దుకుని ,పాదాలు రెండూ మడిచి పొందికగా  ఎడం వైపుకు పెట్టుకుని,తన చేతిలో వున్న బొమ్మనే  చూస్తూ ”యాన్ ఆర్ట్ గ్యాలరీ కుడ్ నెవర్ బి యాస్ యునీక్ యాస్  యూ”  [an art gallery could never be as unique as you’]అనే పాట పాడింది. .
వీడ్కోలిచ్చి వచ్చేస్తుంటే తను నా మీదుగా వంగి తన చెంపని నా చెంపకి తాకించి, ముద్దు శబ్దం చేసి ”ఈ పుట్టిన రోజు, నా ఇరవై రెండేళ్ల జీవితంలో నేను జరుపుకున్న మొట్ట మొదటి అద్భుతమైన పుట్టిన రోజు అనుకుంటున్నాను. థాంక్స్   ఫర్ కమింగ్” అంది. తను అలా ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు. బహుశా తన కంపెనీ బాస్ తన పుట్టిన రోజుకి రావడం గురించా, లేకపోతే వాళ్ళ దేశంలో మర్యాద కోసం అలా అంటారా? ఏమో? కానీ ఆ అద్భుతానికి కారణం ఏంటో విడమరచి చెప్పమని తనని అడగాలనిపించలేదు. కానీ వస్తూ వున్నప్పుడు నాకంటే ముందు వెళ్లి మెట్లు దగ్గర అడ్డంగా వాలి వున్న కొబ్బరి మట్టను దారినుండి తొలగిస్తూ ఉంటే, తన వెనుక ఆగి తనతో అన్నాను ‘’ఎమెరాల్డ్! నీకు తెలుసా, హిందీలో ఎమెరాల్డ్ ను ‘పన్నా’ అంటారు, నువ్వు నీ ఇండియన్ పేరును ముద్దుగా ‘పన్నా’ అని పెట్టుకోవచ్చు” అని. వీధి లైటు వెలుతురు కొబ్బరాకుల మీద పడి ఆ పచ్చదనం, కాంతీ   కలిసి భలే మెరుస్తున్నాయి, ఆ అమ్మాయి కూడా అలా మెరుస్తున్న కళ్ళతో,”మీరు పిలవండి నన్ను ఆ పేరుతో, మీరొక్కరే”అని నా చేతిని తన రెండు చేతుల మద్య పట్టుకుని ఊపేసింది, ఏదో అంతు తెలియని ఉద్రేకంతో.
ఎమెరాల్డ్ దగ్గరనుండి వచ్చి కారులో కూర్చున్న తరువాత కారు లోపల నిశ్శబ్దం, పొద్దుటనుండి విరామమెరుగక పనిచేసిన అలసటను జ్ఞాపకం చేసింది. తలను వెనక్కివాల్చి ఆలోచిస్తూ ఉంటే, ఎందుకో సాంబ్రాణి పరిమళం నా శరీరం నుండి ఉత్పన్నమవుతూ కారంతా అలుముకుంటున్నట్లు అనిపించింది. ఆ గంధాన్ని ఆఘ్రాణిస్తూ చిన్నగా మొబైల్ తీసుకుని యూట్యూబ్ లో ఆ అమ్మాయి చివరిగా పాడిన పాటని వెదికి పట్టుకున్నాను, ఎవరో ”mrld ”అనే గాయని, తన ఆండ్రోజెనిస్ వాయిస్ తో పాడుతుంది. కార్ లోని బ్లూ టూత్ తో కనెక్టై ఇందాకటి సాంబ్రాణి పరిమళంలా, మృదువుగానే అయినా చాలా ధీమాగా కారుని, నా హృదయాన్ని ఆక్రమించుకున్నది ఆ పాట. నిజానికి mrld కంఠంతో ఆ పాట వినడం, ఎమరాల్డ్ పాడినప్పుడు వినడం కంటే బాగుంది. కానీ నా హృదయం ”సో డార్లింగ్ డార్లింగ్ ,డోంట్ బి స్కేర్డ్ / కాస్ ఈవెన్ ఇఫ్  ఐ లుక్ ఎవిరీవేర్ /యువర్ కలర్స్ కాట్ మై ఐ /అండ్ యు ఆర్ మై ఫేవరెట్ సైట్ టు సీ ”[  ”So darling, darling, don’t be scared/’ Cause even if I look everywhere/  Your colors caught my eye/And you’re my favorite sight to see”] అన్న చరణాల దగ్గర చిక్కుకుని పోయింది . చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళింట్లో బావిలో దేని కోసమో గాలం వేస్తే, అది కాకుండా ఎప్పటిదో నీళ్లలో నాని చిలుము పట్టిపోయిన పాత దీపం ఒకటి గాలానికి చిక్కింది, ఆ చిన్న వయసులో అది అల్లావుద్దీన్ అద్భుత దీపమేమోనని నాకొక ప్రగాఢమైన నమ్మకముండేది. కార్ మొత్తం ఆవరించుకుని గుండెలోకి చొచ్చుకుపోతున్న ఆ పాట వింటున్నప్పుడు కూడా అలాంటి ఒక భ్రాంతి ఏదో ఆ రోజు నాకు కలిగింది.
మొబైల్ల్ నుండి ఇన్స్టాగ్రామ్ అలెర్ట్ వినిపించింది. నా మొబైల్ లో ఒక్క ఎమెరాల్డ్ ఇంస్టాగ్రామ్కి మాత్రమే అలర్ట్స్ యాక్టీ వేట్ అయి వుంది. ఎమరాల్డ్ మళ్ళీ కొత్త స్టోరీ పోస్ట్ చేసింది. ఈ సారి ఇంకో కొత్త పాట, కొత్త ఫోటో. ఈ ఫోటో లో ఎమెరాల్డ్ తన కిటికీ అరుగు మీద కూర్చుని వుంది. బయట వర్షం కురుస్తూ వుంది. ఎమెరాల్డ్ ముఖం మోకాళ్ళ మీద పెట్టుకుని వుంది. ఆమె పాదాల దగ్గర ”ది సాంగ్ ఆఫ్ అఖిలిస్” పుస్తకం, చదువుతూ, మధ్యలో ఆపినట్లు బోర్లా పెట్టి వుంది. పుస్తకం, బయటి వాతావరణం, మొత్తం వెలుతురుగా, ఎమెరాల్డ్ మాత్రం నీడలతో గీసిన ఛాయాచిత్రం లా కనిపిస్తూ వుంది. చార్లీ బర్గ్ పాట, ఒక్కటే ఒక్క వాక్యం, పదిహేను సెకన్లు ”న్నో, ఐ డోంట్ వాఁన్న బి ఒకే వితౌట్ యూ ‘’ [No, I don’t wanna be okay without you] అంతే. నేను పాట లింక్ పట్టుకుని పూర్తి పాట వినడానికి వెళ్లాను. పన్నా కి తెలుసు, నేను అలా వింటానని. అది మా ఇద్దరి మధ్య మాటలు కరువయిన కాలాల్లో జరిగే సంభాషణ. ఒకరి మనసుని ఒకరం ఎందుకో గాయ పరచుకొని, సంభాషణ వాకిళ్ళను మూసి వేసుకున్నప్పుడు, పన్నా మొదటి సారి ఇలా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ వాకిళ్ళను తెరిచింది. అలా, అప్పటి నుండీ సంగీతం మా ఇద్దరికీ మధ్య వారధి అయింది. మాటలు కరువయినపుడు ప్రేమ ఇంకా పొంగి పొరలేది. నా పన్నా, దివ్య కాంతుల గరుడ పచ్చ పూస. రూపము, హృదయము రెండూ. కానీ ఇవాళ ఏడుపొస్తుంది, తను అలా నిక్కచ్చిగా No, I don’t wanna be okay without you అనేస్తుంటే, ఏం చేయాలో అర్థం కాక ఏడుపొస్తుంది.
                               2
కుముదక్క, కుముద! కుముద! ఏం చేసింది అప్పుడు, ఎక్కడ వుండి ఉంటుంది ఇప్పుడు? ఎక్కడ ఉండి ఉండొచ్చో ఎవరిని అడిగితే తెలుస్తుంది. కుముదక్క మా ఇంటి గల వాళ్ళ అమ్మాయి, మా ఇల్లు నాలుగు గదుల చిన్న ఇల్లు అప్పుడు. మాతో కలిపి మూడు పొర్షన్లు ఒకే కాంపౌండ్ లో ఉండేవి, మూడింటికి కలిపే స్నానాల గదులూ అవీ ఉండేవి, వీధి వాకిలి నుండి రాగానే ఇల్లుగల వాళ్ళ పోర్షన్ ఉండేది. కుముదక్క ఇల్లు గల వాళ్ల ఒకే ఒక్క కూతురు. ఏడవ తరగతిలో హైస్కూల్కి దగ్గరగా ఉంటుందని ఆ ఇంటికి మకాం మార్చాడు నాన్న. కుముదక్క వాళ్ళు తమిళులు. ఎప్పుడో కుముదక్క వాళ్ళ తాతగారి  కాలములో  ఆంధ్రాకి వ్యాపారం చేయడానికి వచ్చి ఆంధ్రలో స్థిరపడిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ ఇంటి వెనుక కట్టిన మూడు వాటాలను వాళ్ళు ఎప్పుడూ తమిళులకే అద్దెకి ఇచ్చే వాళ్ళు. ఆ సారి ఇల్లు ఖాళీ ఉండటం, పిల్లల చదువుకోసమని నాన్న ప్రాధేయపడటంతో వాళ్ళు నాన్నకి అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కుముద నాకంటే మూడేళ్లు పెద్దది.నేను ఆ ఇంటికి వచ్చేసరికి తాను పదవ తరగతిలో వుంది. కుముద వాళ్ళ పోర్షను ముందు పెద్ద వేప చెట్టు ఒకటి ఉండేది. తను చాలా సార్లు అక్కడ మంచం మీద కూర్చుని చదువుకుంటూ ఉండేది. వాళ్ళ అమ్మ కాఫీలు, సాయంత్రం పూట బజ్జీలు, పకోడీలు ఇంకా యేవో చేసి ఆ చెట్టు కిందకే తెచ్చి ఇస్తూ ఉండేది. దోమలు లేని కాలాల్లో ఆ చెట్టు మీద నుండి లాగిన లైటు కింద కుముద చదువుకునేది. ఆ చెట్టు కింద ఇంద్ర ధనుస్సు రంగుల్లో వున్న గుడ్డతో చేసిన వాలు కుర్చీ ఒకటి ఉండేది. చాలాసార్లు తను చదువుకునేటప్పుడు, కుముద అమ్మ గాని, నాన్న గాని ఆ వాలు కుర్చీలో ఆమెకి తోడుగా కూర్చుని వుండేవారు. ఆ సమయంలో వాళ్ళు యేవో తమిళ సినిమా పత్రికలు చదువుతూ ఉండేవారు. ఆ పత్రికల మీద అనేక మెలికలు తిరిగి వున్న తమిళ అక్షరాలను చూస్తే నాకు చాలా భయం వేసేది. మనుషులు ఎవరైనా వాటిని ఎలా చదవగలరు అని సందేహం వచ్చేది.
కుముదక్క వాళ్ళు బాగా సంపన్నులు. ఈ ఇల్లు కాక వాళ్ళకి ఇంకా ఏవేవో ఆస్తులు ఉన్నాయని మా అమ్మ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. మేము ఉన్న ఇల్లు కంటే మంచి ఇల్లు ఇంకొకటి వాళ్ళకి వున్నా ఇది కుముదక్క స్కూల్ కి దగ్గరగా ఉందని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారట. కుముదక్క తప్ప వాళ్లకి మరో ప్రపంచం లేదట. కుముదక్క కూడా అంతేనట. ఇల్లూ చదువు తప్ప ఆమెకు మరో ప్రపంచం లేదట. ఇలా మాట్లాడుకునే వాళ్ళు అద్దెకున్న వాళ్ళు ఇంటి గలవారి గురించి.
చూస్తూ చూస్తూ ఉండగానే కుముదక్క ఎంసెట్ రాసి మంచి రాంక్ తో మా ఊరిలోనే వున్న మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ జాయిన్ అయింది. నేను పదవ తరగతిలోకి వచ్చి పడ్డాను, నేను మొదటి నుండి మా అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘అలవిగాని రకాన్ని’ ఎంత సమయం వీలైతే అంత సమయం బయట ఉండి, ఆలస్యంగా ఇంటికి రావడం, వీలయినంత మందిని నా సైకిల్ మీద ఇళ్ల వరకు దిగబెట్టి, సమాజ సేవ చేయడం నా నిత్య కృత్యాలు. నా తమ్ముడు నాకంటే పన్నెండ్లు సంవత్సరాలు చిన్నవాడు. అమ్మ వాడి పనులతో ఇంటి పనులతో సతమతమవుతూ నన్ను పట్టించుకునేది కాదు. క్షణం తీరిక లేని నాన్నకేమో క్లాస్ లో అందరికంటే నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకునే నేనంటే యెనలేని ముద్దు. అలా నేను ఏది కావాలనుకుంటే అది చేయగలిగే స్వేచ్ఛ నాకు ఉండేది.
ఒకరోజు ఆదివారం సాయంత్రం, అలాగే ఎక్కడో చక్కర్లు కొట్టి కొట్టి ఇంటికి వస్తూ ఉంటే వేపచెట్టు కింద వున్న మంచం మీద రజనీకాంత్ బొమ్మ వున్న తమిళ సినిమా మేగజైన్ కనిపించింది. సైకిల్ పార్క్ చేసి వచ్చి, మంచమెక్కి కవర్ పేజీ మీద ఉన్న రజినీకాంత్ ని చాలా సేపు చూసి పుస్తకం తిప్పుకుంటూ, ఆ మెలికల ముగ్గులులాటి అక్షరాలను ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నాకు తెలియకుండా ఆ మంచం మీద పడి నిద్రపోయాను. మెలుకువ వచ్చేసరికి కుముదక్క నా పక్కన కూర్చుని వుంది. నేను సరిగ్గా, దగ్గరిగా ఆమెని చూడటం అదే ప్రథమం. కుముద అంటే కమలం అని అర్థమట. కమలం గులాబీ రంగులో సోయగంగా ఉంటుంది కదా, కుముద అలా ఉండదు. తను ‘నీలోత్పలం’.  నీలోత్పలం అంటే నల్ల కలువ. కుముదక్క నల్లటి నలుపు. కుముదక్క వాళ్ళ నాన్న చాలా నలుపు. అందుకని ఆయన వెదికి వెదికి, కానీ కట్నం లేకుండా బంగారు రంగులో వుండే కుముదక్క వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడట. కానీ కుముదక్క మాత్రం అచ్చు గుద్దినట్లు వాళ్ళ నాన్న పోలికలతో పుట్టింది. ఎంత పోలిక అంటే ఆయనను చూసి కుముదక్కని చూస్తే, రెండోసారి మళ్ళీ ఆయన్నే చూస్తున్నామని భ్రమ కలుగుతుంది, అంత పోలిక. ఆయన, గుండ్రటి ముఖంతో, పెన్సిల్ పెట్టి గీసినట్లు వుండే కనులతో, నిగారించే చర్మంతో, ఎర్రటి పెదాలతో, నుదుటిపై ఎర్రటి నామంతో ఎప్పుడు చూసినా, ఇప్పుడే స్నానం చేసి బయటకు వస్తున్నాడన్నంత పరిశుభ్రంగా, పరిమళభరితంగా ఉంటాడు. నేను దగ్గరగా మొదటిసారి చూసిన ఆ రోజు, కుముదక్క కూడా తలస్నానం చేసి జుట్టు వదులుగా జడ వేసుకుని, జడలో కాసిని కదంబం పూలు తురుముకుని, నుదుటిన వున్న తిలకం బొట్టు పైన, కుంకుమతో మరో చిన్ని అడ్డనామం పెట్టుకుని, వేప చెట్టు గాలికి, నుదుటి మీద పొట్టి జుట్టురింగులు తిరిగి ఎగురుతూ ఉంటే, చేతులు మోకాళ్ళ చుట్టూ చుట్టుకుని నన్నే దీర్ఘంగా చూస్తూ వుంది. ఆమె పక్కన తెరిచి వున్న పుస్తకంలోని కాగితాలు, గాలికి ఎగురుతూ టపటపమని శబ్దం చేస్తున్నాయి. అంత దగ్గరగా అలా తనని చూసేసరికి నాకు శరీరంలో ఏదో ఒకలాటి భావం కలిగింది. అదేంటో అప్పుడు నాకు తెలీలేదు, ఆ భావంవలనో నిద్ర మైకం వలనో నేను పడుకున్న చోట నుండి కదలకుండా తననే చూస్తూ వున్నాను. కాసేపటికి తను ”నా వల్ల నిద్ర పాడయిందా, నేను లోపలికెళ్ళేదా” అన్నది. నేను తల అడ్డంగా ఊపి, ఒక్క ఊపుతో లేచి కూర్చుని అదే ఊపుతో ఆ మంచానికి ఒక అడుగు అవతల ఫెన్సింగ్ లా వున్న మూడడుగుల క్రోటన్ చెట్ల మీదనుండి గెంతి పరిగెత్తి ఇంటికి వచ్చేసాను.
ఆ తర్వాత నాలుగురోజులకి అనుకుంటా, అమ్మ నన్ను పిలిచి,”మన ఇంటి గల వాళ్ళు, వాళ్ళ బంధువుల పెళ్ళికి తమిళనాడు లో ఏదో వూరికి వెళుతున్నారంట. నాలుగయిదు రోజులు రాలేరంట. వాళ్ళమ్మాయికి యేవో ప్రాక్టికల్స్ అని వెళ్లలేక పోతుందట, నిన్ను రాత్రుళ్ళు కుముదకు తోడుగా పడుకోవడానికి పంపమన్నారు, వెళతావా?”అంది. మొదట నాకు అవాల్టి కుముద రూపం కళ్ళ ముందు మెదిలి తెలియని బిడియమేదో కలిగింది. కానీ ఆ మరుక్షణమే భుజాలు ఎగరేసి సరే అన్నట్లు నా స్వభావ సిద్ధంగా తల ఊపాను. అలా మొదలయింది నాకు కుముదక్కతో స్నేహం. మా మధ్యనున్న వయసు వ్యత్యాసం, మా చనువును   ఆటంక పరచలేకపోయింది. నా దుడుకుతనం, కుముదక్క లో వుండే సున్నితత్వం ఒకదానితో ఒకటి సమతౌల్యంలోకి వెళ్ళేవి. నా తొందరపాటుని  కుముదక్క నోరు తెరుచుకుని, మనుష్యులు ఇలాక్కూడా వుంటారా అన్నట్లు చూసేది. ఆ చూడటంలో ఏహ్యతనో, కోపమో ఉండేది కాదు, ఒకలాటి ఆరాధన ఉండేది. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా కుముదక్క పెద్ద పెద్ద కళ్ళల్లో కడవల కొద్దీ నీళ్ళు నిండిపోవడం నన్ను ఆశ్చర్యపరిచేది. దేనికొరకు పోట్లాడటం కానీ, చాడీలు చెప్పడం కానీ ఆమెకు చాతనయ్యేది కాదు. ఆమె మాట్లాడటం, శరీర కదలికలు అన్నీ మహా నాజూకుగా, అతి కోమలంగా ఉండేవి. ఆ మృదువైన పలకరింపు కోసం ఆమె ఎక్కడున్నా సరే ఆమె కోసం రోగులు తప్పకుండా బారులు తీరుతూ వుండి వుంటారు. ఎక్కడున్నాఈ పాటికి ఆమె ప్రముఖ డాక్టరై ఉంటుంది.
నేను పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ లోకి వచ్చేటప్పటికి నాకూ, కుముదక్కకి మధ్య ఒక బలమైన స్నేహం ఏర్పడిపోయింది. కాలక్రమాన ఇంట్లో అందరూ వున్నా, మేమిద్దరం కుముదక్క గదిలో తలుపు వేసుకుని చదువుకునే వాళ్ళం. ప్రతి విషయం చెప్పుకునే వాళ్ళం. ఎక్కడికయినా వెళ్లేప్పుడు తన ఖరీదయిన బట్టల్ని వేసుకెళ్ళమని కుముదక్క నన్ను ప్రోద్బలం చేసేది. అలాంటి రోజుల్లో ఒకరోజు నేను కుముదక్క బట్టలు వేసుకుని మా బావతో సినిమాకి వెళ్లాను. వెంట మా అత్తయ్య మామయ్య కూడా వున్నారు. వచ్చేదారిలో ఐస్ క్రీం తిని, దారిలో మనోరంజనం పూవులు అమ్ముతుంటే కుముదక్కకి ఇష్టం కదా అని కొని తెచ్చాను. అందరం భోజనాలు చేసిన తరువాత పువ్వులు తీసుకుని కుముదక్క వాళ్ళ ఇంటికి వెళ్లాను. కుముదక్క గది తలుపు లోపలి నుండి గడియ పెట్టి వుంది. తలుపు కొట్టి పిలిచినా తను తియ్యలేదు, వాళ్ళమ్మ ‘పడుకున్నదేమో అమ్మా’ అన్నది. ‘ అక్కకి పువ్వులు ఇవ్వండి ‘ అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటే కుముదక్క కిటికీ తలుపు ఓరగా తెరిచి, లైట్ వేసి ఉండటం కనిపించింది  వెళ్లి కిటికీ తలుపు రెక్క తోసి చూసాను. కుముదక్క పడుకోలేదు, చదువుకోవడమూలేదు. ఊరికే మంచానికి ఆనుకుని కూర్చుని వుంది. నేను చిన్నగా ‘కుముదక్కా! నీకు మనోరంజనం పువ్వులు తెచ్చా, తలుపు తియ్యి’ అని పిలిచా. కానీ, తను నా వంక కూడా చూడలేదు. కాలేజ్ లో ఏమైనా మనసు బాధపడే సంఘటన జరిగిందేమో అనుకుని నేను మా ఇంటికి వెళ్లి పడుకుని నిద్రపోయాను. కానీ మరుసటి రోజు కూడా కుముదక్క నాతో మాట్లాడలేదు. నేనేం తప్పు చేశానని ఎంత అడిగినా తనేం చెప్పలేదు. నాకు చాలా కోపం వచ్చింది. అసలు నాకిలా ఒక్కరితోనే చేసే ఒంటికాయ శొంఠి కొమ్ము స్నేహాలు అలవాటే లేదు. తనే నన్ను పట్టి బంధించి ఉంచింది, ఇప్పుడు తనే నన్ను కారణం లేకుండా దూరం పెడుతుంది. నాకు కోపం వచ్చింది. నా సైకిల్ తీసుకుని బలాదూర్ తిరగడం మొదలు పెట్టాను. మేమిద్దరం మాట్లాడుకోవడం లేదని మా ఇళ్లలో వాళ్ళు కూడా కనుక్కున్నారు, మా అమ్మా వాళ్ళు కారణం అడిగారు. కారణం నాకు తెలిస్తే కదా వాళ్లకు చెప్పడానికి!
అలా కొన్ని రోజులు గడిచాయి, ఎంత వద్దనుకుని తిరిగినా, కుముదక్క మాట్లాడకపోవడం నాకు పిచ్చెక్కిచ్చింది. దాంతో ఒకరోజు కుముదక్క కాలేజీ నుండి వస్తున్న సమయం చూసి, కాపు కాసి తన వెనకాలే ఇంటికి వచ్చి, తన వెనకాలే తన గదిలోకి వెళ్లి తలుపు మూసి గడియ పెట్టాను. కుముదక్క నన్ను చూసి కలవర పడలేదు, చాలా మామూలుగా పుస్తకాలు సర్దుకోవడం మొదలు పెట్టింది, నేను తనను విసురుగా నా వైపుకు లాగి, అడిగాను ” నేనేం తప్పు చేసాను, చెప్తే అర్థమవుతుంది, తప్పుచేస్తే కావాలంటే కొట్టు. కానీ ఏమీ చెప్పకుండా ఏమిటిది?” అన్నాను. అలా అంటూ ఉండగానే నా గొంతు వణికింది. ఏడుపొచ్చేసింది, ఇంతకుముందు ఏ ఫ్రెండ్ తోనూ నాకిలాటి అనుభవం లేదు. కళ్ళలో నీళ్లు ఉబికి వస్తుంటే మోచేతిని తీసికెళ్ళి కళ్ళకి అడ్డం పెట్టుకున్నాను. అయినా ఎక్కిళ్ల వల్ల నేను ఎంతగా ఏడుస్తున్నానో తెలిసి పోతూనే వుంది. అయినా కుముద మాట్లాడలేదు. నేనే కాసేపటికి ఎక్కిళ్లని అదుపులో పెట్టుకుని ”నాతో స్నేహం వద్దనుకుంటే అదేదో నేరుగానే చెప్పొచ్చు”అని తలుపు వైపు కదలబోతూ వున్నాను. అప్పుడు వెనక నుండి తను అంది ”నేను కాదు నువ్వే అనుకుంటున్నావు నా స్నేహం వద్దని, నీకు అయ్యాయి స్నేహాలు ఎక్కువ, కొత్తగా బావలు, మగ స్నేహాలు”అని. ఆ మాట వినగానే నేను వెనక్కి తిరిగి చూసాను. ”బావనా? తనతో స్నేహమేంటి? తను వున్నది ఒక్కరోజే కదా! పల్లెటూరి నుంచి వచ్చారు కదా అని, మర్యాద కోసం అమ్మ, వాళ్ళతో సినిమాకి వెళ్ళమన్నది, తమ్ముడు చిన్నవాడు, నాన్న కి తీరిక లేదు కదా, అందుకని, అప్పుడు కూడా వస్తూ వస్తూ నీకు మనోరంజనం పువ్వులు తెచ్చాను కదా”‘ అన్నాను. తన అలకకు కారణం తెలిసాక, ఆ కారణం ఎంత చిన్నదో తెలిసాక నవ్వొచ్చింది. తన దగ్గరికెళ్లి ”నీకేమయినా పిచ్చా” అన్నాను, నవ్వు ముఖంతో. కానీ తన కళ్ళ నిండా నీళ్లు. ఆ దొన్నెల్లాటి పెద్ద పెద్ద కళ్ళల్లో కన్నీళ్లను చూడగానే నాకే తెలీకుండా నాలో ఏదో భావోద్రేకం కలిగింది. అంతే ఆ వుద్వేగంలో ఒక్క ఉదుటున తనని దగ్గరికి లాక్కుని ముఖమంతా ముద్దులు పెట్టాను. నా చివరి ముద్దును కుముదక్క తన పెదవుల వైపుగా లాక్కెళ్లి మంచం మీదుగా ఒరిగి పోయింది. ఇద్దరం అలానే పడుకున్నాము. తన తల నుండి, వాడిన పొద్దుటి ఎర్ర జాజులు ఘాటు పరిమళం మా ఇద్దరినీ కలిపి కావలించుకుంటూ వుంది. తనపై అలా పడుకోవడం నాకు గమ్మత్తుగా, సుఖంగా అనిపించింది. ఇన్ని రోజుల నుండి పడిన బాధకు రూపమేమిటో తెలిసినట్లు అనిపించింది. కాసేపటికి  తన మీద నుంచి లేవబోతుంటే తను లేవనీయలేదు. రెండు చేతులతో నా నడుముని బంధించి పట్టుకున్నది. నేను చిన్నగా, తన చెవి దగ్గర ‘’బరువు కాదా నీకు”అంటే, తను అంతే చిన్నగా ”బాగుంది” అంది. ఆ తర్వాత ఎప్పటికో మేమిద్దరం ఆ కౌగిలి నుండి లేచాం. ఒకరినొకరం చూసి నవ్వుకున్నాం. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్లి పోయాను.
ఆ మరుసటి రోజు ఉదయం నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు నాకో ఉత్తరం ఇచ్చింది కుముదక్క. దాన్లో నేను తనకి ఏమవుతానో వివరంగా రాసింది. తనని ఇకపై ఏమని పిలవాలో కూడా రాసింది. ఆ ఉత్తరం చదవగానే నిజానికి నాకు చాలా భయం వేసింది. నిన్న ఆవేశంలో చేసిన పనిని కుముదక్క ఒక బంధంగా మార్చి, సంకెళ్లు వేయడం నాకేమీ నచ్చలేదు. ఆ ఉత్తరాన్ని అక్కడే చించి కాలువలో పడేసి, కాలువ నల్లని నీళ్లు అందులోని అక్షరాలని తడిపి, కరిగించేసి, తమలో కలిపేసుకునేదాకా నిలబడి చూసి అక్కడ నుండి వచ్చేసాను.
ఈ సారి కుముదక్కకి నేను కనిపించలేదు. ఎందుకంటే ఇదంతా తప్పు! కుముదక్క అంటే నాకు ఇష్టం! చాలా ఇష్టం! కానీ ఇలా కాదు. ఆ విషయం కుముదక్కకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకని ఈ సారి అదే వీధిలో వుండే మా క్లాస్ అబ్బాయి రమేష్ తో స్నేహం మొదలు పెట్టాను. కుముదక్క కోసం నా దగ్గర సమయం లేదు. ఆమెతో కనులు కలిపేందుకు క్షణం తీరిక కూడా లేదు. చదువుకోవడం, తినడం, తిరగడం, అది కూడా రమేష్ తో తిరగడం. క్లాస్ లో లాస్ట్ బెంచ్ రమేష్, ఫస్ట్ రాంక్ స్టూడెంట్ తనతో స్నేహం చేస్తుంది అనేసరికి అతనికి పూనకం వచ్చేసింది, అదీ కాక నేను అందగత్తెను  కూడా, రమేష్ కి నేను కోతికి కొబ్బరి చిప్ప లాగా. ఇక నేను కాలితో చెబితే రమేష్ ఆ పని చేతులతో చేసే వాడు. అటువంటి రోజుల్లో ఒక సారి ఆత్మ విశ్వాసం పెరిగిపోయి, ఎవరూ లేనప్పుడు తన ఇంటికి పిలిచి ముద్దుపెట్టుకున్నాడు. నాకు  రమేష్ అలా ముద్దు పెట్టుకోవడం పట్ల అభ్యంతరం లేదు కానీ, ఆశ్చర్యం గా అతను ముద్దు పెట్టాక పెదవులపై జెర్రులు పాకినట్లు అనిపించింది. ముఖ్యంగా ఆ రోజు కుముదక్కతో కలిగిన భావాలు   ఏమి కలగలేదు. అంతే రమేష్ ని వదిలించుకొన్నాను.
కొన్నిరోజులకి ఎండాకాలం సెలవలు వచ్చాయి. బావ ఊరి నుండి వచ్చాడు. కుముదక్క నాతో చూసి అసూయ పడిన బావ. ఈ సారి బావని తేరిపారా చూసాను. నిజమే కుముదక్క అసూయపడటంలో అర్థముంది, బావ నిజంగానే అందంగా వున్నాడు. ఆరడుగులు, తెలుపు రంగు, నవ్వితే ఎవరో సినిమా హీరోలా వున్నాడు. అన్నిటి కన్నా మించి అతను పెద్ద మాటకారి, అంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయాడు. ఇప్పుడు ఐఐటీ లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ లో తన క్లాస్ లో టాప్ అయ్యాడు. అన్నింటి కంటే మించి ఎందుకనో అతను నా  మీద ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు కావాలని బావ దగ్గర తారాడి, రెచ్చగొట్టి ముద్దు పెట్టేటట్లు చేసాను. ఆశ్చర్యంగా ఇప్పుడూ అంతే ఏదో అసౌకర్యంగా అనిపించింది, మట్టిలో అన్నం తింటున్నట్లు. ఆబగా అల్లుకుంటున్న బావను తోసేసాను. ఇంకొంత కాలం గడిచింది ఇంజినీరింగ్ సీట్ వచ్చింది, వుండే వూర్లోని కాలేజ్ లోనే చేరమన్నాడు నాన్న. చేరాను . అక్కడ కూడా ప్రయోగాలు చేసాను. ఆ తరువాత రూఢీ చేసుకున్నాను ఎందుకని నా మనసులో కుముదక్క ముద్దు అలా ఉండిపోయిందో. ఎందుకని ముందు నేనే కుముదక్క మీదపడి ఆమెకి ముద్దు పెట్టానో. నేను స్వలింగ ప్రేమికురాలిని. నేను కుముదను ప్రేమించగలను. కుముదను మాత్రమే ప్రేమించగలను. అబ్బాయిల్ని ప్రేమించలేను. అలా రూఢీ చేసుకున్నాక అంత కాలానికి కుముదకి ఉత్తరం రాసాను. రాసిన ఉత్తరమంతా రక్తంతో రాసాను . ఆ ఉత్తరం చూసి కుముద రాత్రికి తన గదికి రమ్మని బదులిచ్చింది. ఆ రాత్రి, తీవ్రమైన ఆత్మ శోధన చేసుకున్న రెండు లేత దేహాలు మొదటి సారి ప్రేమతో పెనవేసుకుని పోయాయి. కుముద, సరయు అని పరస్పరం ఇరువురిపేర్లు పలవరించుకుని పరవశించాయి.
జీవితం హాయిగా సాగిపోతున్నపుడు, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన బావ సరయు ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని, పెళ్లి చేసుకుని వెంటనే అమెరికా కి తీసికెళతానని సంప్రదింపులు మొదలు పెట్టాడు. కుముద నేను కావలించుకుని ఏడ్చాము. కుముద చెప్పింది,”సరయు నువ్వు పెళ్లి ఇష్టం లేదని   ఉత్తరం రాసి పెట్టి, కనిపించకుండా ఎక్కడికయినా దూరంగా వెళ్లిపో, కొంత కాలం. ఆ తర్వాత వచ్చి నీ సర్టిఫికెట్లు తీసుకుందువు గాని. ఆ లోపల నేను US లో జాబ్ కోసం చూస్తాను, మనిద్దరం అక్కడికి వెళ్లి, కలిసి బ్రతుకుదాం” అంది.
కుముద చెప్పింది మొదట చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత ఆలోచిస్తే భయం వేసింది. ప్రపంచమంతా నన్ను ‘దుడుకు పిల్ల ‘ అంటూ ఉంటుంది. కానీ నేను పైకి కనిపించేటట్లు దుడుకు దానిని కాదని ఈ సంఘటనతో అర్థమయింది నాకు. ఇప్పుడే ఎదుగుతున్న తమ్ముడు, మేము తప్పించి మరో వ్యాపకం లేని అమ్మ, నాన్న ని వదిలేసి వెళ్లి పోవాలి అనుకున్నప్పుడు చాలా దిగులేసింది. నా అమ్మ, నాన్నే కాదు, కుముద తల్లిదండ్రుల గురించి కూడా బాధ కలిగింది. వాళ్లకయితే కుముద తప్పించి మరో సంతానమూ లేదు, మరో ఆశా లేదు. కుముదను చూసుకుని ఆమె నాన్న ఎంత గర్వ పడుతూ ఉంటాడో, అదంతా ఆ కాంపౌండ్లో కాపురముంటున్న వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఆయన తల మీద అదృశ్యంగా వెలుగులు చిమ్ముతూ అమరి వుండే కిరీటం కుముద. అందుకే ఆ రాత్రి కుముదకు చెప్పేశాను నేను మా బావని పెళ్లి చేసుకుంటానని. కుముద ఏడ్చింది, నన్ను జుట్టు పీకి, కొరికి, కొట్టింది. తను ఎంత చేసినా నేను నిర్ణయం మార్చుకోలేదు. బావని పెళ్లి చేసుకున్నాను.
 బావ నా శరీరాన్ని తాకడానికి వచ్చినప్పుడు నాకు భయమేసింది. మా మూడు గదుల ఇంట్లో, మేమందరం పడుకునే పడక గదిని, నా శోభనం కోసం అలంకరించారు. అమ్మా వాళ్ళందరూ పక్క పోర్షన్ల వాళ్ళ దగ్గర సర్దుకున్నారు. గదిలో నేను, బావ మాత్రమే అనగానే, కుముదకు ముందు నేను అబ్బాయిలతో చేసిన అన్ని ప్రయోగాలూ గుర్తొచ్చాయి. నాకు నేనేమిటో తెలుసు. ఏడుపు గుండెల్లో సుడులు తిరుగుతూ ఉండగా, బిర్ర బిగుసుకుని కూర్చున్నాను. బావ కామోష్ణం తో కాగిపోతూ నా మీద పడ్డాడు. నేను, బావ నా మీద పడ్డ వేగం కంటే వంద రెట్లు వేగంతో లేసి, మా పడక మూలగా ఆనించి వున్న రోకలిని నా చేతిలోకి తీసుకుని ”నువ్వు నన్ను తాకావంటే ఈ రోకలితో తల పగల కొట్టుకుని చచ్చిపోతా” అన్నాను. బావ ఆశ్చర్య పడ్డాడు. ఆ తర్వాత సారీ చెప్పాడు. ”సారీ రా మరదలు పిల్లా [నన్ను తను పిలిచే ముద్దు పేరు అది] ఒకే వయసు వాళ్ళం కదా, నీకూ నాలాగే ఉంటుందనుకున్నాను” అన్నాడు. నాలాగే అంటే బహుశా తన ఉద్దేశం శరీరోద్రేకమని కావచ్చును. నేనేమీ మాట్లాడలేదు. కానీ హటాత్తుగా నాకు మనిషి లైంగిక ప్రక్రియ గుర్తుకు వచ్చింది. ఒక మగవాడు స్త్రీని ఏమయినా చేస్తే, మొదటి సారి అయితే కన్యత్వం కోల్పోయిందని, భర్తతో కాకుండా పరపురుషుడితో పాల్గొంటే శీలం కోల్పోయిందని అంటారు కదా, మరి నేను కుముదతో ఇన్ని రోజుల నుండి చేస్తున్న శారీరక కార్యం ఏ లెక్క క్రిందికి వస్తుంది? మానవ పరిభాషలో నేను కన్యత్వం కోల్పోయినట్లా, కుముద నా భర్త కాదు, పర పురుషుడూ కాదు కనుక నేను శీలం కోల్పోయినట్లా, కోల్పోనట్లా? అలా ఆలొచిస్తూ రోకలి చేతిలోనే పట్టుకుని కూర్చుని ఉంటే బావ మెల్లగా నా దగ్గరికి వచ్చి, నా పక్కనే నేల మీద కూర్చుని ”ఇవంతా ఏం వద్దులే మరదలు పిల్లా, చిన్నగానే వెళదాం, స్లో అండ్ స్టడీ విన్ ది రేస్, సరేనా? రా!  వచ్చి మంచం మీద పడుకో” అన్నాడు. అలసిపోయి ఉండడం వల్ల అనుకుంటా, గోడకి అవతలే వున్న కుముద ఏం చేస్తుందో, ఎంత బాధ పడుతుందో అని మనసు తొలిచేస్తూ వున్నా, పడుకోగానే నిదర పట్టింది. ఉదయాన కళ్ళు తెరవగానే నా పక్కనే వున్న బావని చూసాక మళ్ళీ రాత్రి అవుతుందనే విషయం జ్ఞాపకం వచ్చి నీరసం వచ్చింది. మంచం దిగ బుద్ధి కాలేదు. వెంటనే వెళ్లి కుముదను చూడాలనిపించింది. కానీ భయం వేసింది, కుముద ఏం చేస్తుందో, కొడుతుందేమో, అందరికీ చెప్పేస్తుందేమో, ముఖం మీద ఉమ్మేస్తుందేమోనని!
 పెళ్ళైన వెంటనే బావ నన్ను తనతో పాటు అమెరికాకు తీసుకుని వెళ్ళడానికి ముందే అన్నీ సిద్ధపరచి పెట్టేసాడు. మేము వెళ్ళవలసిన రోజు వచ్చేసింది.
చెప్పి వద్దామని బావతో కలిసి కుముద వాళ్ళింటికి వెళితే, కుముద వాళ్ళమ్మ పసుపు కుంకుమలిచ్చి బట్టలు పెట్టింది. ఆ తతంగమంతా తన దిగులు నిండిన పెద్ద కళ్ళతో చూస్తూ ఒక వైపుగా నిలబడి వుంది కుముద. కుముద వాళ్ళ నాన్న, బావతో ”నీ స్నేహితులలో మా కులం వాళ్ళు, తమిళులు అయుండి, ఎవరయినా డాక్టరు ఉంటే మా కుముదకు చూడు బాబు, మా అమ్మాయిని చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలనుకో” అన్నాడు. బావ ‘సరే’ అన్నట్లు తల ఊపాడు. వచ్చేప్పుడు చెబుదామని  కుముద కోసం చూస్తే తను లేదు. తన గదిలోకి వెళ్ళిపోయింది. నేను భయపడుతూనే లోపలి వెళ్లాను. తను ఏడుస్తూ కూర్చుని వుంది. నేను గొంతు పెగల్చుకుని ”వెళ్ళొస్తాను కుముదా”అన్నాను. తను నా వైపు చూడటానికి కళ్ళెత్తగానే, కళ్ళ నుండి పెద్ద పెద్ద కన్నీటి బిందువులు టపటపా రాలాయి. నాక్కూడా ఏడుపు వచ్చింది. కుముదను కావలించుకోవాలనిపించింది. నిస్సహాయంగా అలా చూస్తూ ఉంటే తను నన్ను చూసి ముఖమంతా కఠినంగా పెట్టి ”యు అర్ ఏ క్రూయల్ చీటింగ్ బిచ్, ఐ హేట్ యు!” అంది. నాకు నిస్సహాయతతో శరీరం వణికింది. కళ్ళుతిరిగినట్లు అనిపించింది. కుముద పుస్తకాల బల్లను పట్టుకుని నిలదొక్కుకుని, నేను తనకి ఇవ్వడానికి తెచ్చిన ముత్యపు ఉంగరాన్ని ఆ బల్లపై పెట్టి అక్కడి నుండి గబగబా వచ్చేసాను.
                               3
ఎమెరాల్డ్ ఇంకో స్టోరీ పోస్ట్ చేసింది. అది చూడగానే ఒక్కసారిగా గుండెల్లో వణుకు మొదలయింది. కారులో, ఎంతో సేపటి నుండి ఆగకుండా ఏసీ పనిచేస్తున్న ఆ చిన్న చోటులో, నాకు వళ్లంతా చెమట పట్టేసింది. కళ్ళు తిరిగిపోతున్నట్లు అనిపించింది. డ్రైవర్ ని ఏసీ పెంచమని అరిచాను. నీళ్ల బాటిల్ తీసుకుని గడగడా తాగేసాను. మొబైల్ తీసి మళ్ళీ ఎమెరాల్డ్ స్టోరీ చూసాను. ఈ సారి తను నా ఫోటో పెట్టింది. కేవలం నా వెనక భాగం మాత్రమే కనిపిస్తున్న ఫోటో. ఎక్కడో, ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు వెనక నుండి తీసిన ఫోటో, ఫోటో చాలా స్పష్టంగా వున్నా, ఆడియెన్స్ వున్న ప్రాంతాన్ని కొంచెం అస్పష్టం చేస్తూ, మ్యాచ్ ని హైలెట్ చేసిన ఫోటో, నన్నుఅంత సులభంగా ఎవరూ గుర్తుపట్టక పోవచ్చు. కానీ, బాగా తెలిసిన వాళ్ళు వెనకనుండి కూడా గుర్తుపట్టగలరు. దానికి ఎమరాల్డ్ పెట్టిన పెదిహేను సెకన్ల పాట  ”యు ఆర్ జస్ట్ లైక్ మై ఫేవరేట్ సాంగ్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ మై హెడ్ / లైక్ మై ఫేవరేట్ సాంగ్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ మై హెడ్” [ ‘’You’re just like my favorite song going ’round and ’round my head / Like my favorite song going ’round and ’round my head”]. ఆ వత్తిడి, దుక్ఖం మధ్య కూడా నాకు ఆ పాట చాలా నచ్చింది. ఎంత మంచి వాక్యం. మీరు సంగీతాన్ని ప్రేమించే వాళ్లయితే మీకు ఇది పరిచయమయే ఉంటుంది, హఠాత్తుగా ఒక తియ్యటి పాటనో, లేకుంటే ఒకే ఒక్క గమ్మత్తైన పల్లవో, లేకపోతో ఎక్కడినుండో గాలిలో తేలుతూ వచ్చి మిమ్మల్ని పలకరించి తన వైపుకు లాక్కున్న పేరు తెలియని మధురరాగమో, మీ మనసులోకి చేరి వేయి ఊడల మర్రిలా మీ మనసంతా విస్తరించుకుని పోవడం మీకు పరిచయమయే ఉంటుంది. అలా మనకి ఇష్టమయిన పాటలా ఒక వ్యక్తి మన మనసులో తీయని ప్రకంపనలు కలిగిస్తూ, అదే పనిగా మన మనసులో తిరుగుతూ ఉండటం అంటే ఆ వ్యక్తి పట్ల మనకి ప్రగాఢమైన ప్రేమో, వ్యామోహమో, ఆకర్షణో వుండి తీరాలి. పన్నా, నేను తన మనసులో అదే పనిగా ప్రతిధ్వనించే ప్రియమైన పాటలాంటి దానినని చెప్తుంది. కానీ నాకు మాత్రం ఆ పాటలో మాధుర్యం కంటే అంతర్లీనంగా తను షేర్ చేసిన ఫోటో వెనుక ఒక బెదిరింపు కనిపించింది. ‘నువ్వు బదులివ్వకపోతే నేను బయటపెడతాను’ అనే బెదిరింపు. పన్నా మొబైల్ లో తమ ఇద్దరి ఇంటిమేట్ ఫోటోలు ఎన్నో వున్నాయ్. తను వాటితో ఏమయినా చెయ్యొచ్చు. నా భుజం మీద తల పెట్టి పన్నా నగ్నంగా నిదరపోతున్న ఫోటో, ఇద్దరి మెడ దిగువ భాగం వరకూ వున్న సెల్ఫీ తనే తీసింది. పన్నా ఆ ఫోటో చూసి అడిగింది ”పర్లేదా, ఈ ఫోటో ఉంచేదా, అర్ యు కంఫట్బుల్ టు లీవ్ దిస్ ఫోటో విత్ మీ?” అని. తను చాలా ధీమాగా ‘’నీలాటి దేవకన్య ఒక్క క్షణం పాటైనా నా భుజంపై తలపెట్టి పడుకున్నది అనడానికి అది ఒక రుజువు పన్నా! ఏమో రేపటి రోజు ఇదంతా కల అని, నేనేంటి, నాకు నీ లాటి దేవకన్య పరిచయం దొరకడమనే సుకృతమేంటి అని మరచి పోకుండా ఉండటానికి ఈ ఫోటో సాక్ష్యం. మనిద్దరికే తెలిసేట్లు ఒక మెయిల్ క్రియేట్ చేసి అందులో వుంచు, ఇద్దరం చూసుకోవచ్చు” అని అన్నాను అప్పుడు. మా ఇద్దరి ఫోటోలు ప్రియంగా, అతి ప్రియంగా, కళాకృతులులా అనేక భంగిమలలో, నగ్నంగా, అర్థ నగ్నంగా తీసుకున్నవి బోలెడు వున్నాయి. పన్నా అవి బయటపెడితేనో? గుండెని ఎవరో నొక్కేసినట్లు అనిపిస్తుంది. అసలు ఎలా ఈ పన్నాతో తనకు ఈ ప్రణయం ఇంత దాకా వచ్చింది. కుముదతో ఆగిన ప్రణయం, ప్రేమ, యదఝల్లుమనే భావోద్వేగ ప్రకంపనలు ఎలా పన్నాతో తనకు సాధ్యమయింది? దానికి కారణం బావ.
                   4
తెల్లగా కనిపించేవన్నీ పాలే అంటాడు బావ. అలాగే తనను చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. నేను అందరు ఆడపిల్లల్లాగే మామూలు ఆడపిల్లనని సలక్షణంగా పెద్దవాళ్ళ చేత అడిగించి, ఒప్పించి పెళ్లి చేసేసుకున్నాడు. మొదటి రాత్రి నేను తనతో శృంగారానికి ఒప్పుకోకపోవడాన్ని ముగ్దత్వం అనుకున్నాడు. భార్య తనతో మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొంటుందా లేదా అనే విషయం పట్ల బావకి పెద్ద పట్టింపు ఉండేది కాదు. ఇద్దరం ఇండియాకి వచ్చి స్వంత కంపెనీ పెట్టి, కంపెనీ వృద్ధికోసం, ఆ తర్వాత కంపెనీ పనులకోసం, ఒక్కొక్క చోట తిరుగుతూ వున్నా బావ శృంగారం గురించి కానీ, కలిసి సాగించాల్సిన సంసారాన్ని గురించి కానీ పెద్దగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. పైగా తనని చూస్తే బావకి గర్వం. తెలివయిన దాన్ననీ, కష్టపడతాననీ, అందమయినదాన్ననీ. అతని పార్టీలలో బావకి నేనొక ప్రదర్శనా వస్తువు. ఇద్దరు పిల్లలు. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న డబ్బు. చీకు చింతా లేదు. ఎవరికయినా ఇంకేం కావాలి? నాకు కూడా ఏమీ అవసరం అనిపించలేదు. కుముద గుర్తచ్చేది కానీ, దాని కంటే బాగా చదువుకున్న తమ్ముడు, తమని చూసుకుని గర్వపడే అమ్మ నాన్నలు, బంధువులు, స్నేహితులలో బోలెడు గౌరవం. వీటి అన్నింటి ముందు ఈ ప్రేమలు, శృంగారాలు పెద్ద ఆకర్షణీయంగా అనిపించేవి కావు. ఎప్పుడూ అనిపించి ఉండేవి కూడా కావు, బావ ఆ పని చేసి ఉండకపోతే!
ఎప్పుడూ అమాయకంగా, పనే ప్రపంచంగా వుండే బావ హఠాత్తుగా షోకులరాయిడు అయిపోయాడు. ఎప్పుడూ లేనిది అతని మొబైల్ ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ ఉండేది. ఎప్పుడు చూసినా వాట్సాప్ ఆన్లైన్ లో కనిపించేవాడు. ఆశ్చర్యం వేసింది. ఏం జరుగుతుంది.నాకు అతని పట్ల ప్రగాఢమైన ప్రేమ ఏనాడూ లేదు. కుముద పట్ల వుండిన ప్రేమోన్మత్తత, లోకంలో భార్య భర్తల ఇరువురి మధ్య వుండే ”నాది” అనే పరస్పర స్వాధీనత, బాంధవ్య భావన అది  అతని మీద ఎప్పుడూ లేదు. కానీ అతని పట్ల స్నేహం వుంది, అతని బాగోగుల పట్ల నా  బిడ్డల తండ్రిగా అక్కర వుంది. బహుశా ఆ అక్కరే కావచ్చు అతని విపరీత పోకడలపై మండి పడేలా చేసింది. మొదటి నుండీ వున్న దృఢ వైఖరి అతనిపై నిఘా కోసం ప్రయివేట్ డిటెక్టివ్ లను ఏర్పాటు చేసేలా చేసింది. నిజానికి అతను పెరుగుతూపోతున్న డబ్బును కొంత తన శృంగారానికి వాడుకుంటూ వుండి ఉంటే తనకే బాధాలేకపోవును. పైపెచ్చు హృదయమున్న దానిగా అతను ఇంత కాలానికి నిజమయిన స్త్రీ పొందును పొందగలుగుతున్నాడని సంతోషం కలిగి ఉండేదేమో కూడా. కానీ, అతనలా చేయలేదు. మొత్తంగా ఆ పర స్త్రీ వ్యవహారాన్ని అతను దైవ కార్యం అన్నంత ఆరాధనతో, తపస్సులా చేస్తున్నాడు. ఏ సమాజం, కుటుంబం, ఏ తల్లితండ్రుల గౌరవం కోసం  ఈ పెళ్లి అనే పంజరంలో చిక్కుకుని, ఆ పంజరాన్ని వజ్రాల పువ్వులతో, స్వర్ణలతలతో ముస్తాబు చేసుకుని మురిసిపోతున్నానో   ఆ పంజరాన్ని అతను చిన్నాభిన్నం చెయ్యడానికి పూనుకున్నాడు.
బావని చూస్తున్నా, మాట్లాడుతున్నా నాకు, నా హృదయాన్ని ఎవరో కాల్చుతున్నట్లు, నా గుండె మంటల్లో పడి, కమురుకుని నామరూపాలు లేకుండా కాలిపోతున్నట్లు అనిపించసాగింది. ఎవరికోసమని నేను  ఈ మగవాడిని పెళ్లి చేసుకున్నట్లు? అదిగో అలాటి ఘర్షణలో నేను నలిగిపోతున్నప్పుడు తుఫానులా నా జీవితంలోకి దూసుకుని వచ్చింది ఎమరాల్డ్. తన లైంగిక గుర్తింపు మీద ఆ అమ్మాయికి ఏ పట్టింపు ఉన్నట్లు కనిపించేది కాదు. చూడటానికి ఎంతో సౌకుమార్యంగా వున్నా మానసికంగా విపరీతమయిన దృఢత్వం ఉంటుంది ఎమరాల్డ్ కు. ఆ దృడత్వంతోనే, సరిగ్గా సమయానికి నా  హృదయంలోకి దూసుకుని వచ్చింది. ”నీకంటే ఇంత పెద్ద దానిని, నేను ఎందుకు నచ్చాను పన్నా నీకు?” అని అడిగితే, ”నిజముగా తెలియలేదా అండీ మీకు ,మీరు ఎ  వుమన్ అఫ్ సబ్ స్టాన్స్  అని చెప్పి నచ్చారు” అని,కళ్ళు గుండ్రంగా పెద్దవిచేసి  ”woman of substance is one of the greatest compliments one can give a woman నాకు ఇంతకంటే చెప్పేంత తెలుగు రాదు ఎలా చెప్పండీ ?”అన్నది మూతి, ముఖం ముద్దుగా పెట్టి.మళ్ళీ ” మీరు ఒక కంపెనీ గురించి ఎంత శ్రద్ద చూపించగలరో ,అదిగో ఆ పెయింటింగ్ ‘లేడ అండ్ ది స్వాన్ గురించి కూడా అలాగే శ్రద్ద పెట్ట కలరు,మీ అస్థిత్వాన్ని అంతా మరచిపోయి మ్యూజిక్ ని ప్రేమిస్తారు.అన్నింటికంటే బాగా, ప్రతిక్షణం మీ పిల్లలు గురించి ఆలోచించగలరు” అని ఆపి ”సరయూ! నాకు అచ్చు మీలా వుండే పాప కావాలి అన్నాననుకోండి, ఇస్తారా మీరు? ఐ వాంట్ టు క్యారీ యు హియర్”అని తన పలుచని పొట్టను చూపించింది. ఆ భావం నాకు పూర్తిగా కొత్త. ఎమెరాల్డ్ కొత్త కాలపు పిల్ల. కుముద, తను వెనుకటి తరం. అందుకే నేను కుముదతో కనీసం కలిసి జీవించడాన్ని కూడా ఊహించలేకపోయింది. ఈ పిల్ల ఇప్పటి పిల్ల. తను, నా రూపానికి తన రక్త మాంసాలను ఇచ్చి తన గర్భంలో మోయాలనుకుంటుంది. ఆ రోజు ఆ అమ్మాయి కలిగించిన ఆ భావన నా వెన్నులో మొదట వణుకును పుట్టించింది, ఆ తర్వాత ఆ వూహ ఇంతకంతా పెరిగి నా హృదయంలో తియ్యటి ప్రకంపనలు కలిగించడం మొదలు పెట్టింది. పన్నాకి నేను తన మనసులో నిత్యం తిరిగే ఫెవరెట్ సాంగ్ అని నాకు తెలుసు కానీ, నా హృదయంలో, బాల్యం తరువాత ఇంత కాలానికి, ప్రేమ అనే భావనను తిరిగి చిగురింపచేసిన, మోహరాగం తానేనని ఎమరాల్డ్ కి తెలీదు. పన్నాకి ఇంకో విషయం కూడా తెలియదు. నేను విమెన్ అఫ్ సబ్స్టాన్స్ ని కాదనీ, ఒక పిరికి పందననీ, నా వ్యక్తిత్వాన్ని, గుర్తింపుని రహస్యంగా దాచి దొంగలాగ తిరిగే ఒక దొంగ పెద్దమనిషినని పన్నాకి తెలీదు. నన్ను నేనే శాయశక్తులా నిరంతరం అసహ్యించుకుంటూ, నా అంతరాత్మను లేవనీయకుండా దొంగదెబ్బ తీస్తూ ఉప్పు పాతర వేస్తున్న వ్యక్తిని నేనని పన్నాకి తెలీదు.
        5
పన్నా మళ్ళీ ఇంకో స్టోరీ పెట్టింది. ఈ సారి స్క్రీన్ పై కేవలం లిరిక్స్ ‘’అఖిలిస్, అఖిలిస్ జస్ట్ ఫుట్ డౌన్ ది బాటిల్ /డోంట్ లిసన్ టు వాట్ యూ హేవ్ కన్స్యూమ్డ్ /ఇట్స్ కేయాస్, కన్ఫ్యూషన్ అండ్ హోల్లీ అన్వర్తీ /అఫ్ ఫీడింగ్ అండ్ ఇట్స్ హొల్లి అన్ట్రూ. [Achilles, Achilles, just put down the bottle/Don’t listen to what you’ve consumed/It’s chaos, confusion and wholly unworthy/Of feeding and it’s wholly untrue.’]. అఖిలిస్, పెట్రాకులస్ గ్రీక్ పురాణ నాయకులు, ఒకరంటే ఒకరికి ప్రాణం. స్వలింగ ప్రేమికులని సాహిత్యలోకంలో చర్చ. దానిని నవల చేసింది మేడలిన్ మిల్లర్, ఒకసారి పెట్రాకులస్ అడుగుతాడు అఖిలిస్ ని ”సంతోషంగా వున్న ఒక్క నాయకుడిని చెప్పగలవా అఖిలిస్”అని. అతను పెట్రాకులస్ తో అంటాడు ”చరిత్రలో ఎవరూ ఇంతవరకు లేకపోవువచ్చు కానీ, నేను సంతోషంగా వుంటాను, అలా వుండే మొదటి వాడిని నేనే అవుతాను. ఎందుకంటె సంతోషంగా ఉండటానికి నాకు నువ్వు వున్నావు పెట్రాకులస్” అని. విషాదం ఏమిటంటే అకిలెస్, పెట్రాకులస్ ఇద్దరూ హృదయాల నిండుగా విషాదాన్ని నింపుకుని, అర్థాంతరంగా జీవితాలను ముగించారు. ఎమరాల్డ్ అవీ ఇవీ పనులు చేస్తుంటే తన వెంట తిరుగుతూ నేను చదివి వినిపించిన పుస్తకమది. కానీ ఇప్పుడు నేను  పన్నాని వద్దనుకున్నాను.బావతో  కొట్లాడి కాపురాన్ని చక్కపెట్టేసుకోవాలని నిర్ణయించుకొని, పన్నాని వద్దనేసుకుని  ”నువ్వు నాకిక వద్దు, ఈ రిలేషన్ వద్దు, లెట్స్ ఎండ్ ఇట్ హియర్” అని చెప్పేసింది. పన్నాకి అర్థం కాలేదు ”సరయూ మీరు నాతో ఏ సంబంధంలోనూ బంధించబడి లేరు, ఐ నో దట్ యు డోంట్ వాంట్ టు కం అవుట్, అండ్ ఐ యామ్ నాట్ ఫోర్సింగ్ యు ఐదెర్, కానీ మీరు నాకు ఈ ప్రేమని కూడా ఎందుకు ఇవ్వను అంటున్నారు?” అని సూటిగా అడిగేసింది.”అసలు చెప్పమంటే, నాకు మీరు మొత్తంగా  కావాలి,పొద్దున్న లేవంగానే నేను మిమ్ములను చూడాలి,ఐ వాంట్ టు  హగ్ యు అండ్ కిస్ యు,పళ్ళు తోముకోకుండా  ఫ్రెంచ్ ముద్దు పెడితే మీకు కోపం కదా,అలా ముద్దు పెట్టి మిమ్మల్ని అల్లరి చెయ్యాలి,హాయిగా మీ భుజంపై తల పెట్టుకుని దిగులులేకుండా పడుకోవాలి రాత్రి అంతా,ట్వంటీ ఫోర్ అవర్స్, కానీ నేను అడిగానా ఎప్పుడయినా?మీరు ఇచ్చిన టైం లోనే,మీరు ఎంత కనిపిస్తే అంత అనుకున్నాను,బికాస్ ఐ ఫౌండ్ నో వన్ యాస్  అట్రాక్టీవ్ యాస్ యు,మనిద్దరం ఒక సోల్ అనిపిస్తుంది నాకు,మోర్  దెన్ దిస్ బాడీస్  అనిపిస్తుంది,మీకోసమే వెదుక్కుంటూ నా మిస్సింగ్ సోల్ కోసం ఇండియాకి  వచ్చానని అనిపిస్తుంది” అన్నది.
నేను ఏం బదులు చెప్పలేదు పన్నాకి. అప్పటి నుండి ఇప్పటి వరకు, ఇన్నిరోజులూ. ఇవాళ నాకు హెడ్ ఆఫిస్ విసిట్ ఉందని పన్నాకి తెలుసు. విసిట్ చేసి తనని తప్పించుకుని వెళిపోతాననీ తెలుసు. అందుకే  ఈ పాటల యుద్ధం మొదలు పెట్టింది. తల పగిలిపోతుంది. ఎలా చెప్పాలి ఆ పిల్లకు, నేను ఒట్టి పిరికి గొడ్డునని ఎలా చెప్పాలి. అవును! పన్నాకి అర్థం కావాలంటే నేను కూడా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చెయ్యాలి. పన్నాకు నోటితో చెప్పే శక్తి నాకు  లేదు, చెప్పడానికి ప్రయత్నించి అలిసిపోయాను . పన్నా, కుముద తమ తొలిప్రేమలను నాలాటి పిరికిపందల దగ్గర పారబోసి బూడిదలో పోసిన పన్నీరులా చేసుకున్నారని పన్నాకు ఎలా చెప్పాలి? అప్పుడెప్పుడో పన్నాకి, నాకు ఒకరితో ఒకరికి మాటలు లేని కాలాలలో, ఇలానే పాటలు పోస్ట్ చేస్తూ ఉంటే ఆఫీస్ లో క్లోజ్ గా వుండే ఎంప్లాయ్ అడిగింది ”ఏంటి బాస్? నువ్వూ ఆ తెల్ల పిల్లా, ప్లే లిస్ట్ షేర్ చేసుకుంటారా ఏంటి?” అని. ఇద్దరు బిడ్డల తల్లిని అంత సులభంగా ఎవరూ ఈ దేశంలో మరో రకంగా అనుమానించలేరు కదా, అందుకని ఆ రోజు బయటపడిపోయాను. కానీ, అప్పటి నుండి పన్నా పాటలు పోస్ట్ చేసినా పబ్లిక్ గా రెస్పాండ్ అవడం మానేసాను. కానీ ఇప్పుడవ్వాలి! ఎందుకంటె, ఐ వాంట్ ఇట్ టు బి లైక్ దట్, అందుకని, ఎందుకంటె నేను కూడా మనిషిని కాబట్టి, ఎంత దొంగ ముసుగు వేసుకుని తిరుగుతున్నా నాకూ మనసు వుంది కాబట్టి. మొబైల్ బయటకు తీసి నా సెల్ఫ్ కన్ఫెషన్ ను షేర్ చేసాను, వాడి పోయి, అలిసిపోయి, దుఃఖంతో బరువెక్కిన కనురెప్పలతో వాలిపోయిన కన్నులున్న నా ముఖాన్ని వీడియో మోడ్ లో పెట్టి కారు ఊపులకి ముఖం అటూ ఇటూ నిలకడ లేకుండా కదులుతూ ఉంటే దానికి ‘ది గ్రేట్ ప్రిటెండర్’ పాటని ఫ్రెడ్డీ మెర్క్యూరీ వెర్షన్ ని పెట్టి స్టోరీని అప్లోడ్ చేసాను. ”ఓహ్ యెస్ , అయామ్ ది గ్రేట్  ప్రిటెండర్ ఎస్ ,ప్రిటెండింగ్ దట్ అయామ్ డూయింగ్ వెల్ / ఎస్ ,మై నీడ్ ఈస్ సచ్ , ఐ ప్రిటెండ్ (ప్రిటెండ్ ) టూ మచ్ (టూ మచ్) / అయామ్ లోన్లీ బట్ నో వన్ కెన్ టెల్    [”Oh yes, (oh yes) I’m the great (the great) pretenderYes, pretending that I’m doing well / Yes, my need (my need) is such (is such) I pretend (I pretend) too much (too much)/I’m lonely but no one can tell (no one can tell). తన సమాధానం కోసం చూస్తూ కూర్చున్నాను.
ఈ సారి తన పాత స్టోరీలన్నీ డిలీట్ చేసి ఒక వీడియో పోస్ట్ చేసింది పన్నా. వీడియోలో తను, మంచం మీద పడుకుని వుంది, ఉంగరాల జుట్టు చెల్లా చెదురుగా వుంది. ఇంస్టాగ్రామ్ కెమెరాలో ఏదో ఎఫక్ట్ వుపయోగించి, హృదయంలో దుః ఖాన్ని ఒడిసి పట్టే రంగులలోకి తనని తాను మార్చింది, వెనుక పాటపాడింది ”ది వీకెండర్”    గర్ల్, వై కాంట్ యూ వెయిట్ టిల్ ఐ ఫాల్ అవుట్ ఆఫ్ లవ్? వోంట్ యూ కాల్ అవుట్ మై నేమ్? [Girl, why can’t you wait ’til I fall out of love? Won’t you call out my name? (Call out my name)’ ‘] పాట వింటూ తన ముఖంలోకి చూస్తూ ఉంటే నిజంగానే వీకెండర్ గొంతులోని నిస్పృహ పన్నా ముఖంలో కనిపించింది నాకు. ఏడుపొచ్చింది. ఈ కుముద, పన్నా, బావ అందరూ ఎంత స్పష్టంగా వున్నారు. వీళ్లంత స్పష్టంగా నేనెందుకులేను. తలనొప్పి! తల పగిలి పోతున్నంత నొప్పి! భరించలేక డ్రైవర్ ని కారు ఆపించి, తల నొప్పి మాత్ర ఒకటి కొని, ఎక్కడో గుండెలో, మనసులో నొప్పి కలిగితే ఈ తల ఎందుకు భారమయ్యిందో అర్థం కాక, మాత్ర గొంతులోకి నెట్టి తల సీటు మీదకి వాల్చగానే, మళ్ళీ ఇంస్టాగ్రామ్ అలెర్ట్. ఈ సారి ఎమెరాల్డ్ ఇంకో స్టోరీ ఏ ఫోటో లేకుండా వట్టి లిరిక్స్ మాత్రమే టైపు చేసి పోస్ట్ చేసింది, బోనీ రైట్ పాడిన పాట ‘’అండ్ ఐ విల్ గివ్ అప్ దిస్ ఫైట్ / కాస్ ఐ కాంట్ మేక్ యు లవ్ మి ఇఫ్ యు డోంట్
” [”And I will give up this fight / ‘Cause I can’t make you love me if you don’t”]. అంటే ఏంటి పన్నా ఉద్దేశం? తల పగిలి పోతుంది. వెంటనే వెళ్లి పన్నాని చూడాలనిపిస్తుంది.
               6
సరయు దుడుకు పిల్ల అంటారు అందరూ, మాట దుడుకు, పని దుడుకు అని. నేను నాలోపల, లోపల మడతలు వేసి, వేసి హృదయపు అడుగు, అడుగున భద్రపరచిన నా రహస్యం వెనుకాల, దుడుకుతనం లేదు, నన్ను నేను అణిచివేసుకున్నతనం వుంది. ఈ రోజు బావ తనకి కావలసినది తాను చేస్తూ ఉంటే చూసీ చూడనట్టు వుండాలని సమాజం, కుటుంబం నాకు సలహా ఇచ్చింది. సమాజంలోని ఎవ్వరూ పక్కమనిషికి అన్యాయం జరుగుతుందీ అంటే వచ్చి వాళ్ళ తరపున మాట్లాడరు. కోట్ల మందిలో ఎప్పుడో ఒక్కరు మాత్రమే అలా ముందుకొచ్చి మాట్లాడితే, ఆ ఒక్కరు రావలసిన మార్పులకు కారణం అవుతున్నారు. ఏం? నేనెందుకు కోటిలో ఆ ఒక్క దాన్ని కాకూడదు? ఈ ఆలోచన ఆవేశంతో చేస్తున్నది కాదు, సమాజం కోసం చేస్తున్నది కూడా కాదు. నా కోసం, నా పన్నా కోసం, నాలా ముడుచుకు పోయి, నటిస్తూ బ్రతికే వాళ్ళ కోసం, సంవత్సరాలుగా చీకటిలో మగ్గిపోయిన నా అసలు లైంగికతకు స్వేచ్ఛనివ్వడం కోసం నేనెందుకు బయటకు రాకూడదు?
కనుచీకట్లు కమ్ముకుంటున్నాయి, ఆకాశం నారింజ ఎరుపులో వుంది. మలిసంజెని మెత్తగా కోసుకుంటూ కారు హైవే నుండి కొంచెం పక్కకి దిగి గతుకుల రోడ్లో వెళుతుంది. నేను కారుని ఒక చిన్న టీ బంకు ముందు ఆపించాను. తాటాకుల పాక. ఒక పెద్దావిడ టీ ఫ్లాస్క్ లో పోసి పెట్టుకుని కూర్చున్నది. పాక ముందు రెండు బల్లలు వేసి వున్నాయి. డ్రైవర్ ని పిలిచి నా ఎదురు బల్ల మీద కూర్చో మన్నాను. ఆయన పేరు దైవసహాయం. నా దగ్గర పదేళ్లుగా పనిచేస్తున్నాడు. నా కుటుంబం గురించి దగ్గరగా తెలిసిన వ్యక్తి. అతడిని కూర్చోపెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాను, నేనెవరిని? నాకు ఎందుకని కుముదపై ప్రేమ కలిగింది? ఎందుకని ఇప్పుడు పన్నాని విడిచి బ్రతకలేనని అనుకుంటున్నానో చెప్పాను. నా ఇద్దరి పిల్లలికి నిజాయితీగా నేనెవరినో చెప్తానని చెప్పాను. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉంటానని చెప్పాను. అంతా వివరంగా చెప్పి, ” అన్నా! ఇప్పుడు చెప్పు, నేను చేసేది దుడుకు పని కాదు కదా, కరెక్టే కదా?”అన్నాను. అందుకు దైవ సహాయం ”అయ్యో! అమ్మా! దుడుకుతనం ఎన్నటికీ కాదు.దుడుకుతనమైతే పదిహేనేళ్ళు ఆగేదానివా, చదువుకున్న బిడ్డవు,మంచేదో, చెడు ఏదో  నీకు  బాగా తెలుసు,నీకు చెప్పగలిగే వాడిని కాదమ్మా,నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి,లోకులు పలుగాకులు,వచ్చేప్పుడు మనతో రాలేదు,పొయ్యేప్పుడు మనతో రారు” అన్నాడు.
నేను అంగడి అవ్వ దగ్గర సీసాలో మిగిలి వున్న సాల్ట్ బిస్కెట్లు మొత్తం కొని కాయితంలో కట్టించుకున్నాను. ఆ బిస్కెట్లంటే పన్నాకు చాలా ఇష్టం. హృదయంలో పొంగుతున్న సంతోషాన్ని ఏంచేసుకోవాలో తెలీక ”థాంక్ యు అవ్వ” అని అవ్వ చెయ్యి ఊపి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చాను. వచ్చి కార్లో కూర్చుని ఇంస్టాగ్రామ్ తెరిచి గ్రేట్ గాట్స్ బి నుండి, ”విల్ యు స్టిల్ లవ్ మీ వెన్ ఐ ఆమ్ నో లాంగర్ యంగ్ అండ్ బ్యూటిఫుల్? / విల్ యు స్టిల్ లవ్ మీ వెన్ ఐ గాట్ నథింగ్ బట్ మై ఏకింగ్ సోల్?” [Will you still love me when I’m no longer young and beautiful? /Will you still love me when I got nothing but my aching soul? / ‘‘] అనే ‘లానా డెల్ రే ‘ పాటను పోస్ట్ చేసాను. కాసేపటికి అటువైపు నుండి బదులు పాటను నా మొబైల్ పాడటం మొదలు పెట్టింది. ఊదా రంగు చీరలో, మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని హాయిగా నవ్వుతూ వున్న ఫోటోకి పాట లిరిక్స్ జత చేసింది పన్నా. హనీ జస్ట్ పుట్ యువర్ స్వీట్ లిప్స్ ఆన్ మై లిప్స్ / వి షుడ్ జస్ట్ కిస్ లైక్ రియల్ పీపుల్ డూ”[ Honey just put your sweet lips on my lips / We should just kiss like real people do.] హోజియర్ బారిటోన్తో ప్లే అవుతున్న లిరిక్స్ మృదువుగాను దృఢంగానూ హృదయాన్ని కావలించుకుంటూ వున్నాయి, అతని కంఠంలోనుండి స్వభావసిద్ధంగా జాలువారుతున్న అనిర్వచనీయమైన మాధుర్యపు మగతను తాదాత్మ్యంతో అనుభవిస్తూ గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాను ”కుముద, ఐ యామ్ నాటే చీటర్ బిచ్ యాస్ యు సెడ్” అనుకుని, డ్రైవర్ తో ”సహాయం అన్నా! కారు ఎమరాల్డ్ ఇంటి వైపుకు తిప్పు ” అన్నాను.
*

సామాన్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు