’కిచ్.. కిచ్.. కిచ్..’ అని చిన్న పురుగులు చేసే చప్పుడు, ఫ్యాన్ ఆగి ఆగి వదిలేస్తున్న గాలి చప్పుడు మధ్యలో, దూరం నుంచి ఇందాకే టేకాఫ్‌కు రెడీ అయిన విమానం గాల్లోకి ఎగిరి, ఆ తర్వాత వెళ్లిపోతుంటే, దాంతో పాటే నీ దగ్గరికి రావాలనిపించింది.
నువ్వు ఆ విమానం దార్లో ఉండవని తెలిసినా, అదెక్కితే కచ్చితంగా నీ దగ్గరికే వస్తానని నాకనిపిస్తూ ఉంటుంది.
ఒకానొక సముద్రం ఒడ్డున, కొన్ని వందల సంవత్సరాల క్రితం, చేపలు పడుతూ కూర్చున్న ఒక పెద్దాయన, గంట, రెండు గంటలకు ఆ చేపలన్నీ కుప్ప పోసుకొని ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తున్నాడు.
ఇందాక నీ చెయ్యిని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాను చూడు, సరిగ్గా ఆ చేతిని పట్టుకొని, ఆ ఇసుకలో, సూర్యుడు దిగిపోతున్న సమయానికి ఆ పెద్దాయనకు దగ్గరగా పోతుంటాం మనం.
“నీకేం కావాలి?” అని అడుగుతాను.
“ఇవే కావాలి!” అంటావు నువ్వు.
ఆ పెద్దాయన కుప్పలోంచి చేపల్ని ఏరుతూ నీకు ఒక్కొక్క తీరువి చూపిస్తూ ఉంటాడు. అలలు ఎగిసిపడుతూ ఉంటాయి.
ఆ నీళ్లొచ్చి నీ ముఖం మీద పడగానే, నీ ముఖమంతా తుడుచుకొని పక్కకి తిరిగి నువ్వు నా వైపు చూస్తుంటావు. నేను నీ చేతికి ఒక గ్రీన్ టీ ఇచ్చి, కనుబొమ్మలెగరేస్తాను.
కొన్నివందల సంవత్సరాల క్రితం నిన్ను మొత్తం తడిపేసిన అలలా, అంతకుముందు రాత్రి నిన్ను తాకిందని, ఆ సిగ్గునంతా కళ్లతో చెప్తూ గ్రీన్ టీ తీసుకుని పారిపోతావు.
నేను నిన్ను వెంబడిస్తూ ఉంటే, దట్టమైన అడవిలో, ఒక్కో దారి వెతుక్కుంటూ పారిపోతుంటావు.
అలిసిపోయి ఒక దగ్గర ఆగిపోతావు.
“ఎన్నాళ్లని నన్నిలా వెంబడిస్తావు?” అనడుగుతావు.
నేను నిన్ను నా రెండు చేతులతో గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంటాను. అడవంతా సన్నగా వర్షం పడుతూ ఉంటుంది.
“రాత్రి వదల్లేదు. పొద్దునా వదలవా?” అనడుగుతావు.
నన్ను విడిపించుకొని పరిగెడుతూనే ఉంటావు.
ట్యాంక్‌బండ్ మీద వారం రోజుల్లో రాలిపోయిన లేత గులాబీ రంగున్న ఒకరకం జాతి పూలను చూసి, అవి ఎక్కడినుంచి ఇక్కడికొచ్చాయో చూసుకొని, ఆ కాలంలోనే, అక్కడి కాలంలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయట. మన కాలంతో వాటికి సంబంధం లేదట.
నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంకా పూలు నిండుగా ఉన్న రోజునే, దాని చుట్టూ తిరిగి ఆగిపోతావు.
అందులోంచి ఒక పువ్వును తెంపి నీకిస్తాను.
అది చేతుల్లోకి తీసుకుని, దాని గాలి పీల్చి, కళ్లు మూసుకుని, తెరిచి చూస్తావు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ పువ్వులున్న వంద ఎకరాల భూ భాగంలో నన్నెదురుగా పెట్టుకొని, అలిసిపోయి ఊపిరి గట్టిగా పీల్చి, వదులుతూ ఆయాస పడుతుంటావు.
అక్కడ కూర్చోబెట్టి నీకు కొన్ని కథలు చెప్తాను నేను. కొన్ని వందల ఏళ్లకు ఈ పువ్వులన్నీ పోయి, వీటి చెట్లు ఏ కొన్నో మిగుల్తాయని చెప్తా.
అందులోంచి చిన్న మొక్కలు కొన్ని తీసుకొని, “ఇవే కావాలి!” అని నువ్వు చేపలు అడిగిన చోటుకు కొద్దిదూరంలో పాతుతా.
ఇంకొన్ని వందల సంవత్సరాలు ముందుకొస్తూ, వస్తూ, ఒక్కొక్క కథలో ఆ మొక్కలు పాతుతూ వస్తా.
గ్రీన్ టీ తాగి, బ్రేక్‌ఫాస్ట్ చేసి, రాత్రి జరిగినదంతా పొద్దునా రిపీట్ చేసి, సాయంత్రానికి, “బయటికెళ్దాం” అంటావుగా, అప్పుడు, ఇంకా రాలని ఆ చెట్లున్న ట్యాంక్‌బండ్ దగ్గరికి తీసుకెళ్తా.
“నువ్వు ఏ కథలోంచి వచ్చావు నాకోసం?” అనడుగు.
నిన్ను వెతుక్కుంటూ, కాపాడుకుంటూ, కనిపెట్టుకుంటూ, ఈ వేల ఏళ్లలో దాటొచ్చిన కథలన్నీ చెప్పి, నువ్వడిగిన ఆ పువ్వు కోసిస్తా.
గట్టిగా వాసన పీల్చి కళ్లు మూసుకో.
ఏదో ఒక కథలో ఎప్పుడైనా ఆగిపోయి, అక్కడే ఉండిపోదాం.
*
Add comment