లాటరీ బాక్స్‌

రాత్రంతా పడుకున్నట్టు నటించడం చాలా కష్టమనిపించింది. నేను నిద్రపోలేదని తెలిస్తే ఆయన కంగారుపడతారు. ఈ టైంలో నిద్ర ఎంత ముఖ్యమో నాక్కూడా తెలుసు. కానీ ఆలోచనలు సాలెగూడులా చుట్టేస్తే నేను మాత్రం ఏం చేయగలను? నాకీ ఆసుపత్రి కొత్త కాదు, ఈ మందుల వాసన కొత్త కాదు, నా పాదాలని నాకు కనపడనివ్వకుండా పైకి పొంగిన ఈ కడుపు కొత్త కాదు. కానీ కొత్తగా భయం, కొత్తగా కంగారు. ఇవాళో, రేపో అవ్వొచ్చు అని డాక్టర్ చెప్పింది. నేను బలహీనంగా ఉన్నానని, జాగ్రత్తగా ఉండాలని ఒకటికి రెండుసార్లు చెప్పింది.

అత్తమ్మ గంటకోసారి నిద్రలేచి నన్ను చూస్తోంది. ఆయన డబ్బులు సర్దే పనిలో నిన్న ఉదయమనగా వెళ్లారు. సర్దుబాటయ్యాయో లేదో? ఇంత హడావిడిలో ఆయన ఏమైనా తిన్నారో లేదో? మొండి మనిషి. మాట దురుసు. ఉన్నట్టుండి డీలా పడిపోతాడు. నేనున్నాగా అని భుజం తట్టబోతే నేను చూసుకుంటానన్నట్టు లేచి బయటకి వెళ్ళిపోతారు. మనసు భారం దింపుకోవడానికి స్నేహితుల మాట సాయం, లేదంటే మందు, సిగరెట్ల సాయం తీసుకుంటారు. నాతో ఓసారి చెప్పుకోవచ్చుగా అని ఎంతలా అనిపిస్తుందో! మామూలు సమయాల్లో అయితే ఎప్పటిలా బయటికి వెళ్తాడేమో అని, భోజనం చేసేప్పుడు మనసారా మాట్లాడదామంటే అత్తయ్య ‘వాడిని భోజనమైనా కాస్త ప్రశాంతంగా చేయనివ్వమంటూ’ మాట విసురుతుంది. నిజమే! ఆమె బిడ్డ కడుపు నిండటం ఆమెకు ముఖ్యం. నా భర్త మనసు తేలికపడటం నాకు ముఖ్యం. ఆవిడ కూడా ఒకరికి భార్య అయినా, తల్లి ప్రేమ భార్య ప్రేమని దాటేసింది.

కడుపులో కదలిక తెలుస్తోంది. చేత్తో కడుపుపై నిమురుకుంటుంటే పాదాల కదలిక అర్థమవుతోంది. నిన్న చిన్నది వచ్చినప్పుడు ఇలాగే కడుపుపై నిమురుతూ ‘‘అమ్మా.. అమ్మా.. తమ్ముడెప్పుడు బయటికొస్తాడు?’’ అంది. వచ్చేది తమ్ముడని దాని చిన్నిబుర్రలో ఆలోచనని బలంగా నాటిందెవరో నాకు తెలుసు. పెద్దదెందుకో ఈ మధ్య ముభావంగా ఉంటోంది. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. డెలివరీ అయ్యాక తనని ప్రేమగా దగ్గరకు తీసుకొని అన్నీ కనుక్కోవాలి. పాపం పిల్లలు! పెన్సిల్ ముక్క కావాలన్నా, నచ్చినది తినాలన్నా, ఏం కావాలన్నా ఆయనకీ పిల్లలకి మధ్య నేనే రాయబారిని. ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి, రోజూ కాసేపు పిల్లలతో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడమని. పనులు, టెన్షన్లు, విసుగు అంటారు. ‘అవన్నీ నాకు కుదరవు, నువ్వున్నావుగా’ అనేస్తారు.

ఆయనకి పిల్లలతో గడపాలని ఉంటుందని నాకు తెలుసు. కానీ ఉదయమనగా వెళ్తారు, సాయంత్రం వస్తారు. అప్పటికే అత్తమ్మ నా గురించి రెండు ఫిర్యాదులు, తన గురించి రెండు అవసరాలు సిద్ధం చేస్తుంది. మళ్లీ నేను, పిల్లలు మరో బరువు ఎందుకనిపిస్తుంది. అత్తమ్మ గయ్యాలా అంటే, కాదు. పెళ్లయిన కొత్తలో చాలా బాగా చూసుకుంది. ఒక్కగానొక్క కొడుకు కోసం వెతికి వెతికి నన్ను కట్టబెట్టింది. మొదటి అమ్మాయి పుట్టినప్పుడు కూడా బాగుంది. రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఏమైందో తెలియదు. అప్పట్నుండి నాపై ఊరికూరికే విసుగు, కోపం వచ్చేస్తుంది ఆమెకి.

ఎందుకో బాగా భయమేస్తోంది. గుండె వేగం తెలుస్తోంది. అప్పుడప్పుడూ పొత్తి కడుపులో చిన్నగా నొప్పి. రాత్రి తిన్న భోజనం గొంతులోకి వస్తున్నట్టు ఇబ్బంది. అసలే వేసవి. పైగా తొమ్మిదో నెల వచ్చినప్పటి నుండి ఎక్కడ కూర్చున్నా వెనుక సపోర్టుకి అనుకోవడం, ఈ నాలుగు రోజుల నుండి మంచం మీదే రెస్ట్ రెస్ట్ అంటూ పడుకోబెట్టడం.. దీనివల్ల చెప్పలేనంత అసహనం, ఒళ్ళు నొప్పులు. నా శరీరతత్వానికి తగ్గట్టు ధారలు కట్టే ఈ  చెమటతో వీపంతా చిరాకు, మంట. నా అంతట నేనేమీ చేయలేను. పక్కవారిని అంత సులువుగా సాయం అడగలేను. అబ్బా!

అటుఇటు ఏ కిటికీలోంచి చూసినా అంతా స్ట్రీట్ లైట్ వెలుతురే. బహుశా నాలుగవుతుందేమో టైం. 24 గంటలూ గది బయట హడావిడిలో ఏమాత్రం మార్పుండదు. ఈ రోజుల్లో భక్తితో గుడిలోనో, భయంతో ఆసుపత్రిలోనో జనాలు ఎక్కువగా ఉంటున్నారు. నైట్ డ్యూటీ నర్సు మధ్య మధ్య వచ్చి నన్ను చూసి నవ్వి వెళ్తోంది. ఆవిడ నాకు పరిచయమే! ఉదయం అత్తమ్మ టిఫిన్ కోసం వెళ్ళినప్పుడు నాతో ఉన్నది ఆ నర్సే.

‘‘అదేంటి మేడమ్! క్రితంసారి డెలివరీకి వచ్చినప్పుడే, ఆరోగ్యం బాలేదు, ఆపరేషన్ చేయించుకుంటా అన్నారు కదా! సంవత్సరంలోపే మళ్లీనా?’’ నేనేమంటానో అని అడగలేక అడగలేక అడిగింది. ఈ మధ్యే మాటల్లో చెప్పింది, తనకి పెళ్లి కుదిరిందని. ఎంత నర్సయినా తనూ ఆడదేగా! నా పరిస్థితి చూసి భయపడుతున్నట్టు ఉంది. అందుకే ‘‘అయినా ఈ రోజుల్లో పిల్లల్ని కనడం గురించి భయమెందుకు? ఏదో ఈ సినిమాల్లో, పుస్తకాల్లో సెంటిమెంట్ కోసం ప్రసవ వేదన, పురిటినొప్పులు అంటూ తెగ భయపెట్టేస్తారు. అయినా ఈ రోజుల్లో అన్నీ సిజేరియన్లే కదా! ఇప్పటి ఆడవాళ్ళలో ఎంతమందికి తెలుసని ఈ పురిటినొప్పుల బాధ?’’ అని ఏదో సర్దిచెప్పాను. తను అడిగిన ప్రశ్నకి సమధానం అది కాకపోయినా అదే నా సమాధానమైంది.

మరేం చెప్పాలి? ప్రస్తుతం నేనో లాటరీ బాక్స్‌ని. మా ఇంట్లోవాళ్ళనుకున్న నెంబర్ పడేదాకా ఈ డబ్బాని ఆడిస్తూనే ఉంటారని చెప్పగలనా? ఒకప్పుడు పదేసి మంది పిల్లల్ని కనేవారని గొప్పగా చెప్పేవాళ్ళకి ఈ కాలం ఆరోగ్యాల మీద ఏమాత్రం అవగాహన ఉంటుంది? నిన్న అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా బాధేసింది. జుట్టు పలచబడింది. ముఖం ఉబ్బింది. ఒళ్ళంతా నీరు పట్టినట్టు నాకే నేను కొత్తగా కనిపించాను. అమ్మాయి అందాన్ని వందల సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్ణించారు. పురిటినొప్పులపై కూడా పద్యాలు, కవితలు, కథలు రాశారు. మరి బిడ్డ పుట్టాక బాలింత ఒంట్లో మానసికంగా, శారీరకంగా జరిగే మార్పుల గురించి ఎంతమంది రాశారు? పోనీ ఎందరు ఆలోచిస్తున్నారు? భరించలేని వేదన గురించి చెప్పాలన్నా ‘ప్రసవ వేదన’ అనే పదం తెగ వాడేస్తుంటారు, అబ్బాయిలు కూడా. వాళ్లలో ఎంతమందికి ఈ ప్రసవ వేదన గురించి తెలుసు? అసలెలా తెలుస్తుంది?

అమ్మతనం స్త్రీకి సంపూర్ణత్వం ఇస్తుందని ఎప్పట్నుంచో వస్తున్న మాట. ఆ ముసుగులో అబ్బాయి పుడితేనే అమ్మతనం అనే ఆలోచన కూడా చాప కింద నీరులా పాకుతూ వస్తోంది. ఎవర్నేం అనగలం? ఇక్కడ వంశాలు, వారసత్వమంతా మగవాడితోనే కొనసాగాలి, ఆడది ఇక్కడ పుట్టినా ఎక్కడికో వెళ్లి అక్కడ మరో వారసత్వం కొనసాగడానికి మార్గం కావాలి. అంతే తప్ప తనకి మరే ప్రాముఖ్యం లేదని ఇలాంటి పచ్చి నిజాలని తేనె పూసి స్త్రీ, స్త్రీయే ఇంటికి దీపం, స్త్రీ వల్లే సృష్టి.. అని అంటుంటారు. కానీ మాలో నిండిపోతున్న చీకటి గురించి పట్టించుకున్నదెవరు? 

వెన్ను బాగా లాగుతోంది. అమ్మో! వెన్నంటే.. ఎంత ఓర్చుకున్నా సరే సిజేరియన్‌కి ముందు ఇచ్చే ఆ మత్తు ఇంజెక్షన్ నొప్పి ఈసారి తట్టుకోలేను. మొదటి పాప పుట్టినప్పుడు నార్మల్ డెలివరీనే. రెండోదాని విషయంలోనే ఆపరేషన్ తప్పలేదు. ఈసారి ఆ నొప్పిని ఎలా భరించాల్రా దేవుడా?

అత్తమ్మ లేచేసరికి పడుకున్నట్టు కళ్ళు మూసుకున్నాను. ఆవిడ బాత్రూమ్‌కి వెళ్ళిరావడం, నా పక్కనే కూర్చుని నా నుదుటికి చేయి తాకించడం తెలుస్తూనే ఉంది. కళ్ళు మూసుకున్నా లోపల కనుగుడ్లు అటూఇటూ కదలాడటం ఆమె కనిపెట్టేసిందేమో, ‘‘భయం లేదులే అమ్మాయ్! ఈసారి నిచ్చెన ఎక్కేస్తావ్’’ అని కాసేపు అలాగే కూర్చుని వెళ్లి పడుకుంది.

నిచ్చెన.. ఏ నిచ్చెన.. వారసత్వ నిచ్చెనా?

నేనున్నదే ఆఖరిమెట్టు.. ఇక ఇంతకు మించి నేను తట్టుకోలేను.

నాకు తెలుసు. ఇదే ఆఖరు.

ఇదంతా ఎవరితోనైనా పంచుకుందామంటే విని అర్థం చేసుకునేవారెందరు? నెల తప్పిందని తెలియగానే అభినందించడానికి క్యూ కట్టిన వారిలో ఎంతమంది నా కళ్లల్లో భయాన్ని చూడగలిగారు? ఇది 2024. కాలం మారింది. స్త్రీల జీవితం ముందులా లేదు, ఎంతో మారింది. టీవీలో, పేపర్లలో, పుస్తకాల్లో ఇదే వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. కానీ స్త్రీవాదుల్లో ఎవరైనా ఓ కొత్త నినాదం తెస్తే బాగుండు. హాస్పిటల్స్‌లో ఓ సర్వే చేస్తే బాగుండు!

ఇంతకుముందులా లేవు పరిస్థితులు. ఆడపిల్ల తనకి నచ్చిన చదువు చదువుతోంది. నచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. మంచిది. కానీ ఎంతమంది ఇష్టంగా, తన సమ్మతంతో పిల్లల్ని కంటున్నారు? మగపిల్లాడు పుట్టేదాకా హాస్పిటల్ మెట్లు, గుడి మెట్లు ఎక్కి దిగడంలో తన అభిప్రాయానికి ఉన్న ప్రాముఖ్యం ఎంత? ఇవి ఎవరైనా అడిగితే బాగుండు!

నా పిచ్చి.. నా పైత్యం.. ఏంటో ఈ ఆలోచనలు!

ఈ నెల తప్పే ముందు కలిసేటప్పుడు ఆయన చెప్పిందేంటి? ‘‘మన అమ్మాయిలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాం. వయసైపోయాక మనల్ని చూసుకోవడానికి ఓ కొడుకు ఉండాలిగా! అందుకే తప్పదు’’ అని తన కారణాన్ని చెబుతూ నన్ను ఒప్పించారు. అందుకప్పుడు నా దగ్గర బదులేమీ లేదు. కానీ ఇప్పుడనిపిస్తోంది, అసలు పెళ్లై అమ్మాయే ఎందుకు అత్తారింటికి వెళ్ళాలి? అత్తారింటికి వెళ్ళాక ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మానాన్నల మీద బాధ్యత పోయినట్టేనా? పెళ్ళయాక కూతురు కూడా తన కన్నవాళ్ళకి కేవలం చుట్టమేనా? కొడుకే కుటుంబ పోషకుడు, రక్షకుడా? ఇదంతా ఎవరు నిర్ణయించారు?

అమ్మా! కడుపులో కదలిక. ఉన్నట్టుండి ఆయాసం పెరిగింది. ఊపిరి కష్టంగా తీసుకోవాల్సి వస్తోంది. చేత్తో కడుపు తడుముకుంటుంటే పాదం చేతికి తాకుతోంది. నిచ్చెన ఆఖరిమెట్టుని ఎక్కే ఈ పాదం అమ్మాయిదా? అబ్బాయిదా? అనేది నా చుట్టూ ఉన్న వారందరి ఆలోచన. నా వరకూ ఇదే ఆఖరు. వంశం వారసత్వం పక్కన పెడితే ముందు ఈ ముగ్గురి పిల్లల్ని, ఇంట్లో వయసైన అత్తమ్మని, ఇంటి కోసం కష్టపడుతున్న ఆయన్ని.. ఈ కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటే ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి. నా ఆరోగ్యం మీద నాకే దృష్టి లేకపోతే ఎలా? ఇకపై నేను లాటరీ బాక్స్‌లా మారను. ఎవరేమన్నా సరే, ఇది నా నిర్ణయం.

నుదురు చెమటతో నిండిపోతోంది. నడుం కింద చీర కొద్దిగా తడవడం మొదలయ్యింది. ఉమ్మనీరు? కళ్ళు తెరచి చేయి చాచి తట్టగానే అత్తయ్య లేచింది. కాళ్ళ నొప్పులున్నా పరుగుతో ఎవరో ఒకర్ని పిలవాలని గది బయటికి వెళ్ళింది.

నా మనసులో ముందున్నంత కంగారు లేదిప్పుడు. జరగబోయేదేదైనా, ఆపై జరగాల్సింది నిర్ణయించేది మాత్రం నేనే. అంతే!

*

పట్టణ జీవితంపై మరో నవల రాయాలని వుంది 

  • హాయ్ కవనమాలి! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది నాగర్‌కర్నూలు పట్టణం. ఇప్పుడది జిల్లా కేంద్రం అయ్యింది. పదో తరగతి వరకు అక్కడే చదివి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. కొన్నాళ్ళు బెంగుళూరులో ఉద్యోగం చేసి, ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చేశాను. ప్రస్తుతం ఇక్కడ నెట్‌వర్క్ అడ్మిన్‌గా పని చేస్తున్నాను.

  • కవనమాలి’.. చాలా కొత్తగా ఉంది మీ పేరు. దాని అర్థం ఏమిటి?

నా అసలు పేరు మహేష్. గతంలో ఆ పేరుతోనే కొన్ని సినిమాలకు పాటలు రాశాను. ‘Art is greater than Artist’ అని నేను నమ్ముతాను. నా పేరు చూసి, నా కులం, మతం, ప్రాంతం అంచనా వేసి పాఠకులు నా రచనలు చదవకూడదని నా అభిప్రాయం. అందుకే 2018 నుంచి ‘కవనమాలి’ అనే కలం పేరుతో రాయడం మొదలుపెట్టాను. ‘వనమాలి’ అంటే తోటమాలి, తోటలోని ఆకులు, పూలను కలిపి మాలగా చేసుకుని వేసుకున్నవాడు అనే అర్థాలున్నాయి. ఆ పదానికి ముందు ‘క’ కలిపి ‘కవనమాలి’ అని పెట్టుకున్నాను. కవనం అంటే కవిత. కవనమాలి అంటే ‘కవితల తోటకు మాలి’ అని అర్థం.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

కథల కంటే ముందు నేను పాటలు రాశాను. నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు రెండు లైన్ల కవితలు రాస్తూ ఉండేవాణ్ని. అది చూసి మా ఫ్రెండ్స్ పాటలు రాయమని ప్రోత్సహించారు. సినిమా పాటల ట్యూన్లకు నేను సొంతంగా వేరే పదాలు వాడి పాట రాసేవాణ్ని. అలా ఒక్కో ఏడాదిలో సుమారు 350 పాటలు రాశాను. వేటూరి, సిరివెన్నెల రాసిన పాటల్ని శ్రద్ధగా విని, వాళ్లు ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడారో గమనించేవాణ్ని. అప్పటిదాకా నేను పుస్తకాలేమీ చదవలేదు. సినిమా పాటలే నాకు పుస్తకాలయ్యాయి. ఆ తర్వాత 40 షార్ట్ ఫిల్మ్స్‌కి పాటలు రాశాను. ఆ తర్వాత కవిత్వం రాశాను. ఆ తర్వాతే కథలు మొదలుపెట్టాను.

  • మొదటి కథ ఎప్పుడు రాశారు? ఆ సందర్భం గురించి చెప్పండి.

నన్ను నేను రచయితనని ఏ రోజూ అనుకోను. కథ రాసేంత వరకే నేను రచయితని, ఆ తర్వాత పాఠకుణ్ని. పాటలు, కవిత్వం తర్వాత కథలు రాయడం నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఏ అంశం మీద కథలు రాయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘నా ఊహల్లో, కల్పనలో ఒక సూపర్ హీరోను సృష్టించడం కంటే, రోడ్డు మీద రిక్షా నడుపుతూ రోజుకింత తిండి సంపాదించుకునేవాడినే నా కథలో హీరోగా చూపిస్తాను’ అని ఆయన అన్నారు. అలా నా చుట్టూ ఉన్న సామాన్యుల జీవితాలనే కథలుగా రాద్దామని అనుకున్నాను.

మా ఇంట్లో బట్టలు ఉతికేందుకు ఒకావిడ వచ్చేది. ఆమె జీవితం గురించి తెలుసుకొని, దానికి కొంత కల్పన జోడించి ‘ఉతకరాని బతుకులు’ అనే కథ రాశాను. అదే నా మొదటి కథ. ఆ తర్వాత నాలుగేళ్లకు బండారు అచ్చమాంబ రాసిన ‘ధనత్రయోదశి’ కథ చదివాను. నా కథకు, ఆ కథకు పోలికలు కనిపించాయి. ఒకే అంశాన్ని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కాలాల్లో ఆలోచించి కథ రాయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత మరో 14 కథలు రాశాను. మొత్తం 15 కథలు కలిపి ‘మనసు నేసిన కథలు’ పేరిట గోదావరి ప్రచురణ సంస్థ పుస్తకంగా ప్రచురించింది.

  • ఆ తర్వాత కవిత్వ సంపుటాలు కూడా వెలువరించారు కదా?

అవును! నా జీవితంలో ఒకానొక సమయంలో చాలా డైలమాలో ఉన్నాను. ఆ పరిస్థితిని ఎవరికి ఎలా వివరించాలో అర్థం కాలేదు. మింగలేక, కక్కలేక అంటారే అలా ఉన్నాను. ఆ సమయంలో నా బాధించిన ప్రతి సందర్భాన్ని కవితగా మలిచి 90 కవితలు రాశాను. కవిత్వం అంటే గంభీరమైన భాష, మాటలు ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ ఎంత మహా కావ్యమైనా పాఠకుడికి అర్థమయ్యేలా ఉండాలని నేను భావిస్తాను. అలా సులభతరమైన భాషలో కవిత్వం రాసి ‘గరళకంఠుని గానం విను’ అనే కవితా సంపుటి వెలువరించాను.

ఆ తర్వాత స్త్రీల సమస్యల గురించి స్త్రీలే స్వగతంగా చెప్పుకుంటున్నట్లు 41 కవితలు రాశాను. వాటిని ‘అపరాజిత’ పేరిట సంపుటిగా తీసుకొచ్చాను. నేను నా పుస్తకాలకెప్పుడూ ముందుమాటలు రాయించలేదు. ‘అపరాజిత’ పుస్తకం ప్రచురణకు ముందు దాన్ని వివిధ రంగాల్లోని ఐదుగురు మహిళలకు పంపించాను. అది చదివి అభిప్రాయం రాసి పంపమన్నాను. ఆ ఐదుగురి అభిప్రాయలనూ నా పుస్తకంలో చేర్చాను. ఈ రెండు పుస్తకాలూ ఒకేసారి విడుదల కావడం విశేషం. ‘అపరాజిత’కు చాలా మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది నాకు ఫోన్ చేసి తమ అనుభవాలు పంచుకున్నారు.

  • మీ మొదటి కథాసంపుటి 2020లో వచ్చింది. రెండో కథాసంపుటి ‘వైతరణీ ఒడ్డున’ 2024లో వచ్చింది. మధ్యలో కథలేవీ రాయలేదెందుకు?

నిజమే! 2019 నుంచి 2022 దాకా మూడేళ్ల పాటు కథలేమీ రాయలేదు. ఆ తర్వాత ఒకసారి కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘రాక్షస కృత్యాలు’ అనే కథ చదివి షాకయ్యాను. అది నా మీద ప్రభావం చూపించింది. ఆ కథ గురించి నా మిత్రుడు, చిత్రకారుడు రాహుల్‌తో చర్చించాను. పడుకున్న పాఠకుణ్ని నిటారుగా నిలబడేలా చేసే కథలు రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అదో కొత్త ప్రయోగం అనిపించింది. అలా మొదట ‘సంభాషణ’ అనే కథ రాశాను. ఆ తర్వాత ఒక్కో కథ రాయడం మొదలుపెట్టాను. ఒకటి జానపద కథ, మరొకటి ప్రేమకథ, ఇంకోటి హర్రర్.. ఇలా రకరకాల అంశాలతో 11 కథలు రాశాను. ప్రతి కథలోనూ నాకు తెలియకుండానే చావు అనే అంశం వచ్చింది. దాంతో పుస్తకానికి ‘వైతరణీ ఒడ్డున’ అనే పేరు పెట్టాను. నా పుస్తకాలకు నా మిత్రుడు రాహులే బొమ్మలు వేస్తాడు. వైతరణి రక్తమాంసాలు నిండిన నది అయినా ఆ ఒడ్డున ఒక పచ్చని చెట్టు ఉన్నట్టు పుస్తకానికి మాంగా స్టైల్లో కవర్ పేజీ గీశాడు. చావు చుట్టూ ముడిపడ్డ జీవితాలే ఆ పుస్తకంలో ఉంటాయి.

  • మీకు నచ్చిన పుస్తకాలు, రచయితలు?

ముందే చెప్పాను కదా, ‘Art is greater than Artist’ అని. అలా చాలామంది రచయితల కథలు చదివాను. రాజేందర్ జింబో ‘మా వేములవాడ కథలు’, భూషణం కథలు, తిలక్ కథలు, పెద్దిభొట్ల సుబ్బారామయ్య కథలు, పి.సత్యవతి కథలు, గీతాంజలి ‘హస్బెండ్ స్టిచ్’ కథలు చాలా ఇష్టం. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు చాలా నచ్చుతాయి. 

నన్ను అత్యంత ప్రభావితం చేసిన రచయిత రావూరి భరద్వాజ. ఆయన రాసిన ‘జీవనసమరం’ నాకు ఆల్‌టైం ఫేవరేట్ పుస్తకం. ఆ పుస్తకం నా సాహిత్య ధోరణిని మార్చేసింది. కథను ఆకాశం మీద కాదు, నేల మీద నడిపించాలని ఆయన రచనలు చదివి నేర్చుకున్నాను. ఇవాళ్టికీ ఆయన్ని భక్తితో తలుచుకుంటాను.

  • ఇంకా ఏమేం రాయాలన్న ఆలోచనతో ఉన్నారు‌?

‘నృకేసరి’ నవల మొదటి భాగం విడుదలై పాఠకుల ఆదరణ పొందింది. రెండో భాగం పూర్తి చేస్తున్నాను. అలాగే ఒక బాలల నవల, పట్టణ జీవితంపై మరో నవల రాసే ఆలోచనతో ఉన్నాను. 

*

కవనమాలి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘లాటరీ బాక్స్’ కథ నన్ను యాబై ఏళ్ల వెనక్కి తీసుకువెళ్ళింది. మా ఇరుగు పొరుగులో ఉండే ఇద్దరు స్త్రీలలో ఒకామెకు ఐదుగురు మగపిల్లలు, రెండవ స్త్రీకి ఆరుగురు ఆడపిల్లలు. ఆ సారి ఇద్దరూ మళ్ళీ గర్బ్జంతో ఉన్నారు. నెలలు నిండుతున్న కొద్దీ ఆడపిల్లల తల్లి ముఖంలో కనబడుతున్న ఆందోళన, దిగులు చూస్తూ ఉంటే ఎంత బాధగా అనిపించిందో! మగపిల్లల తల్లి అయితే ధీమాగా మళ్ళీ వంశోడ్డారకుడు పుట్టబోతున్నట్లు వెలిగి పోతున్న ముఖంతో ఉండేది. ఇప్పటిలాగా స్కానింగులూ వగైరాలు లేని కాలం. దేవుడంటూ ఒకడు ఉంటే ఆడపిల్లల తల్లికి మగపిల్లవాడు పుట్టాలని ప్రార్ధించుకున్నాను. దేవుడు ఉన్నాడు!
    రచయిత కవనమాలిగారికి అభినందనలు.

  • నాకు కొంచెం త్వరగా పెళ్లయింది. ఇంట్లో అమ్మ నన్ను గారంగా చూసేది. అందుకో మరెందుకో నేను కడుపుతో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ప్రసవ వేదన పడకుండా సీజేరియన్లు చేయించింది. ఆ నడుం నొప్పి ఇప్పటికీ వెంటాడుతుంది. మా అత్తగారు కూడా మనవడు పుట్టాలని తెగ ఆరాటం పడింది. పుట్టారు కాబట్టి నన్ను ఇలాగన్నా చూస్తున్నారు. లేకుంటే వీళ్లసలు కోడల్ని సరిగ్గానే చూడరు. కానీ, నాకు ఇద్దరూ కొడుకులై పోయారు. ఒక కూతురైన ఉంటే బాగుండునని ఎంతగా అనిపిస్తుందో…..:(
    మూడో సారి ఉంచుకుంటానని నేనే అన్నాను. కానీ, ఇద్దరు కొడుకులు పుడితే ఎవరికైనా సంతోషమే కదా అందుకే ఇంట్లో వాళ్ళు నా మాట నెగ్గనీయలేదు.

    ఇప్పుడు కవనమాలి గారి కథ నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోయింది. చాలా చక్కగా రాసారండి….. 🙏

  • వనమాలి- కవనమాలిగా మారిన తీరు బాగుంది. కథ ఇంకా బాగుంది…
    థాంక్ యు సాయి వంశీ. కంగ్రాట్స్ కవనమాలి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు