“ఏటి సెయ్యడం సిన్నప్పా!? మనుసులు సాల్నారుగారు…” అనుకుంటూ తెల్లారేసరికి వచ్చింది అప్పలనరమ్మ పిన్ని.
అప్పటికి మాఅమ్మ సెరుకుసోరు పొయ్యిల పెడుతూ పొయ్యిదగ్గర కూచుంది. పొద్దుటిపూట వంట వండుతోంది. అప్పలనరమ్మ పిన్ని వీధివైపు వెనక గుమ్మం తలుపుతీసి వుంటే సరాసరి పొయ్యిదగ్గరికే వచ్చి పొయ్యికి రెండోవైపు కూచుంది.
“ఎంతమంది సాల్లేదు” అడిగింది మాఅమ్మ
“నలుగురప్పా” అంది కాంతం పిన్ని
“అదేమే కొల్లోలు, ఈదుబిల్లోలు అందరూ వస్తన్నారన్నావు గదా!..మరెందుకు సాల్లేదు!?” సందేహంగా అడిగింది మాఅమ్మ.
“నిన్న అలగే అన్నారు సిన్నప్పా! రాత్రి ముగ్గురు ఆరుముడి చేసేరు. తిండి తినేసాక ఈదుబిల్లి ముగడమ్మ. వొచ్చి చేప్పేసింది.
“వొదినా మరేటనుకోకు గాని, ముగడల మాయన్నకు ఒంట్లో బాగునేదట. రేపు నేనూ మా సిమాసెలమూ యిద్దరమూ యెల్లాల,ఎల్లక వొల్లగాదు. నాకు యిప్పుడే గంట కితమే తెలిసింది. ముందేతెలిస్తే మేం రాలేమని ముందే సెప్పేద్దును సుమీ.. రేపొక్కపొద్దుకి మెల్లగ గయబుచ్చుకోవాల.” అని ప్రాదేయ పడింది.
కష్టమంటే, కాదని ఎలా అనగల్ను చెప్పూ!.. సరేన్నే అనేశాను”.
“మరింకిద్దరెవులు.. అడిగింది మాఅమ్మ”
“పోలీదోలు. ఒకమ్మకి ఒంట్లో బాగునేదట. ఇంకొకమ్మకి ఆలమ్మికి సమందమొస్తందట పిల్లని సూడ్డానికొత్తామని సుట్టాలు కవురెట్టారట. ఎవుల్లీ ఏమన్నేని పరిస్థితి. ఏమి సేయడమో తెలీకుంతంది.
అటుసూస్తే యివాల పోల అమ్మడమ్మ పని. ఆయమ్మ సర్దుకు పోయే మనిషిగాదు. నోరు పెద్దది. ఏ యిసయమూ లెక్కలేసి ఎక్కదీస్తాది. అదే బయ్యం గుంది” అంది.
మాఅమ్మ కాసేపు ఆలోసించి అన్నాది
“అయితే మా కుష్ణున్నాడు తీసికొద్దునా!” అని. అప్పుడు నేను వంటింట్లోనే కూర్చున్నాను.
“ఎంది బడినేదా!” అడిగింది
“ఇవాళ ఆదోరం గదే”
“ముసిల్దేటంతాదో!.. సిన్నపిల్లల్లి తీసుకొచ్చావంటాదేటో!” అనుమానంగా అంది పిన్ని.
“ఆడింకేటి సిన్నోడే ఎనిమిజ్జదువుతుండు. అయినా సిన్నసేతుల్తోటి ఆలే సిటుకు సిటుకున తెంపేత్తారు. అమ్మమ్మ కాదనకు.ఓపూట కూలి కలిసొచ్చినా కలిసొచ్చింది.” బతిమిలాడింది అమ్మ.
ఆరోజు పని, పిల్లి పెసరసేనులో బొట్టలేరడం.
అప్పలనరమ్మ పిన్ని పొలంపనులకు ఆడకూలీలను తీసుకువెళ్లే మేస్త్రి. రోజూ కూలీలను తనతో పనికి తీసుకుపోతుంది. అలాగే ఆవిడతో నిత్యం పనిలోకెళ్లే వాళ్లు కూడా ఉన్నారు. సర్వ సాధారణంగా ఎవ్వరూ ‘రాము’ అని గాని,‘రాలేము’ అని గాని అనరు.
అప్పలనరమ్మతో పనంటే చాల మంది ఎగబడతారు. ఎందుకంటే తనదగ్గర నిత్యం పని ఉంటాదని. కానీ ప్రస్తుతస్థితి వేరు. అప్పటికప్పుడు ఆటంకమయింది. కనుక మనుషులు కావాల్సి వచ్చేరు.
“సరే.. మనుసులు సాల్లేదుగదా!..అందుకే తీసుకొచ్చానని సెప్తాను. తీసికురా.. బేగి బయలెల్లి ఎలిపారాండి.” అని కూచున్నదగ్గర్నుంచి లేచి పోయింది.
“మరి నేనురాను సిన్నప్పా!..ఇటుకాసి అందర్నినువ్వు కేకెసుకొచ్చేత్తే, నేను ఆయీది అందర్ని పిలుసుకొని వచ్చేత్తాను. వూరవతల ఈదల కోనెరు గట్టుకాడ కలుసు కుందామయితే.” అని చెప్పేసి వెళిపోయింది. ”దూరాభారం..సేరీ కన్నా దూరం బొబ్బిలోడి పొలానికెల్లాల” అనుకుంటూ మరోమారు హెచ్చరించింది వెళ్తు..వెళ్తూ.
“లెగురా నాయనా బేగి తాన్నం సేసి, సల్లంది తినేత్తే ఎలిపోడమే, నావంట అయిపోయింది. ఉడుకునీలు పోసుకుంతే అయిపోయినట్టే”
“ఏం పనమ్మా” అని మాఅమ్మను అడిగాను ఏమీ తెలీనట్టు
“పిల్లిపెసర చేనులో బొట్టలేరడమే…”అంది
నేను అప్పుడప్పుడు పనిలోకెల్లడం మామూలే, అయినా అది మాపనికే ఎల్లాను. కూలిపనికి ఎల్లడం యిదే తొలిసారి. మా అమ్మతో ఎక్కడికైనా ఎల్లడం నాకిష్టమే.
పొలాల గట్లమీంచి సుమారు రెండుమైళ్లు నడిచి, మేం వెళ్లవలసిన చోటికి చేరాం. ఆ పొలము గొల్లపిల్లి దరిదాపుల్లో ఉంది. అప్పటికే అక్కడకొచ్చి కూచుంది పోలోలి అమ్మడమ్మ. ఆయమ్మే ఆ పొలానికి యజమానురాలట.
తెల్లటికోక కట్టుకుంది. తలకూడా తెల్లగా పండిపోయి వుంది. తలవెనక పెద్దమెట్ట ముడిసింది. మెడలో నాను, పట్టెడ మెరుస్తున్నాయి. చేతికి గాజులు లేవు, బంగారం మురుగులున్నాయి. ఆయమ్మ ముఖం చూశాను. మొకానా బొట్టులేదు. ఆయమ్మకు బర్తలేడని నాకు తెలిసిపోయింది. దూరంనుంచి చూస్తే తెల్లగా, పొడూగ్గా ‘నువ్వుపువ్వు’ నాగ కనపడతంది. కూచుంతే పగిలిన పత్తికాయలాగ అవుపడతంది. చీరకట్టు మాఅమ్మాల లాగే వెనక్కుచ్చిల్లు పెట్టింది కానీ, మైజారుదిద్దింది.మాఅమ్మ, పిన్ని మాటల్లో ఆయమ్మకినోరు పెద్దదని విన్నాను. మనిషిని చూస్తే అలాగ అనిపించలేదు.
“ఎందేకాంతం..ఎంతేలయ్యిందే!? సుట్టాల్లాగ తీరుబడిగ వత్తారే!?..అడిగింది.
“మరేది పిన్నమ్మా! అందర్ని ఉల్లగించుకొచ్చేసరికి యియ్యేలయ్యింది. దూరం గదా! .నడొద్దా.” అనీసి తిరిగి ఆయమ్మ యేమాటా అనడానికి అవకాశమివ్వకుండా
“నెండమ్మా..నెండి.. గబగబా మడిలో దిగండి” అంది పిన్ని
మడినిండా పెసరసేని కనపడతంది.మొక్కల్లోంచి పోడుగాటి కాడలు పైకి లేచి చివరన గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయి.అవి బొట్టలుగా పండిపోయి ఉన్నాయి.
అందరూ సీరలు సిలకట్టేసి మడిలోదిగుతుంటే ఒక్కొక్కల్ని పిలిచి అమ్మడమ్మ ఒక్కో బుట్ట చేతికిచ్చింది. బుట్టలందుకున్నోలందరూ పనిలోకిదిగారు. నావంతొచ్చింది. నేను బుట్ట అందుకోవాలని ఎల్లాను.
“ఈ గుంటడెవులే!? సంటి పిల్లల్లి గూడా తీసుకోస్తావేమే నంజా!” అంది
“ఆడు మావోడే పిన్నమ్మా! మనుసులు సాల్లేదనీ కాంతం అంతేను.. తీసుకొచ్చాను.” అంది మా అమ్మ.
అమ్మ అలా అంటున్నప్డు అమ్మ కళ్లల్లో బెదురు కనబడింది. ఎక్కడ వద్దనేస్తాదేమో నని.
“అమ్మీ సిన్నా! నానంతే అన్నానంతారు గానీ యింత సిన్నపిల్లడేంపని సేస్తాడే!? అంది.మా అమ్మ అడ్డంగా తలాడించింది.
“అలాగనీకు పిన్నమ్మా! సిన్నపిల్లలే గబగబా సేస్తారు.ఈ పనికి పిల్లలే మేలు.. సూత్తావు గదా!” అని ఒప్పించింది.
మనసులో ఏమనుకుందో ఏమో గానీ బుట్ట నాచేతిలో పెట్టింది.
“పదనాయనా! గబగబా పెసరబొట్టలు ఏరి బుట్టనింపేసి అమ్మమ్మకి సూపించాలి నువ్వు” అని నన్ను తొందరపెట్టింది.
ఆయమ్మ యింకేటంతాదేటో అని ఆయమ్మ కాసే ఒక సెవ్వుంచాను. మమ్మల్నేటన్నేదు. కాంతం మీద కేకలేసింది.
“యింకా రెండు బుట్టలుండిపోనాయి, ఎందర్నితెచ్చావే పనిలోకి!?”నిలదీసింది.
“ఏటిసెయ్యడం పిన్నమ్మా! ముగ్గురు మనుసులు యిప్పుడు తెల్లారినెగిసి ఆరుముడి సేసీసినారు. ఆకాడికి వూరంతా తిరిగాను, ఎవులూ దొరకనేదు” మిక్కిలి వినయ పూర్వకంగా సెప్పింది పిన్ని.
“అన్నీ పద్దుకు మాలినపన్లే చేస్తావే..నంజకనా..” అని తిట్టింది. కానీ ఆతిట్లలో కోపంలేదు. కొంత అభిమానమే కనపడింది.
“ఈవేళ రేపుట్లోగా, ఈ నాలుగు మళ్ళూ ఏరీయ్యాలనిసెప్పానా! అవతల మాతమ్ముడు ఎర్రెత్తి పోతున్నాడు. బేగి దమ్ముబట్టి ఉడుఫుడిసెయ్యాలని. నువ్వు సూస్తే యిలాగ సేస్తన్నావు. ఎల్లుండు దున్నిదమ్ము బడితే మళ్ళీఅవతల నాలుగైదురోజులైతేగాని ఈసేని కుల్లదు ఉడుపవ్వదు” అంది.
అందరం కూర్చొని మునువు కట్టి, ముందు బుట్టలు పెట్టుకొని పెసర బొట్టలు తెంపి బుట్టల్లో ఏస్తున్నాం. నేను మాఅమ్మ పక్కనే వున్నాను. కాయలు గబగబా తెంపుతూనే వున్నాం. మాఅమ్మ నాకంటె గబగబా తెంపి నా బుట్టలోకూడ ఏసేసేది.మొదటసారి అలా ఏసినప్పుడు
“అమ్మా..నీబుట్ట అదీ” అని అమ్మబుట్టవైపు చూపించేను. పొరపాటున నా బుట్టలో వేసిందేమో అనుకొని.
“ష్”..అని నోటికడ్డంగా వేలుపెట్టి మాట్లాడవద్దన్నది. అలా ఎందుకేసేసేదో నాకు తెలిసేది కాదు. మాఅమ్మ బుట్టకన్నా నాబుట్టలో ఎక్కువయ్యాయి బొట్టలు.
గంట గంటన్నర అవుతుంది.అమ్మడమ్మ అరవడం మొదలు పెట్టింది.
“ఏమే.. ఎవత్తీ తేదేమే.. యింతబుట్ట నిండడానికెంతసేపే” అని, పెద్ద వందకేజీల బియ్యం బస్తా లాంటి గోనెతీసి పట్టుకుంది. ఏరి తెచ్చిన బొట్టలు అందులో పొయ్యడానికి.
అప్పటికెవరి బుట్టలు నిండినట్టులేదు. ఎవరూ లేవలేదు.
నాబుట్ట యించుమించుగా నిండిపోయింది.”పట్టుకెల్లాలా!..” అని అమ్మకాసి చూసేను. ఒద్దన్నట్టు తలవూపింది. గబగబా మరికొంచెం బొట్టలు ఏరి పడేసాం, అమ్మా నేను కలిపి. బుట్ట నిండా నిండింది. అయినా ఆగమంది.
“ఏమే గైరమ్మా!.. అవునే పార్వతి తెండే” అని పేరుపేరునా పిలుస్తోంది. కాసేపటికి ఆ చివరనున్న పచ్చకోకమ్మ పట్టుకొని లెగిసింది. అదిచూసి అమ్మ నన్ను పట్టుకెల్ల మంది. ముసలమ్మకు చూపించి పొయ్యమంది. నావెనుక ఒక్కొక్కలుగా ఐదారుగురు తెచ్చారు. నేను అమ్మడమ్మకి చూపించేసరికి అమ్మడమ్మ మిగతావాళ్ల మీద అగ్గిఫైరయ్యింది.
“సిగ్గుల్లేవే..సిన్నపిల్లడుతెచ్చినాడే.”
“మీరు మనుసులుకారే! మడిలో కూకొని కునుకుతున్నారేటే”
వరస పెట్టేసరికి మువ్వలోలి ఎల్లమ్మకి కోపమొచ్చింది.
“ఏటమ్మాకేకలు! మేం పనిసేత్తన్నాముగాని పడుకున్నామేటి!? నేదు పనిమానేసి ఎక్కడకైనా ఎల్లామా!” దీర్ఘంతీసింది.
దాంతో అమ్మడమ్మకి రాయబారం అంటుకుంది.
“ఒలేటే నీ నీలుగు. ఏ నీమొగుడు దాసినసొమ్ముందే, కూలిచ్చేత్తారనుకున్నావే!?పని కనపడదు కానీ పౌరుషాలకు లోటులేదే.” అంది
“బుట్లేటి సిన్నవేటమ్మా! తాప్మానిల్లాగున్నయి ఒక్కొక్కటి” అంది దాసరోలి ఎంకటమ్మ.
ఒకరికి యిద్దరయ్యేసరికి ముసలమ్మకి కోపం నషాలానికెక్కిపోయింది.
“ఏటే ఒక్కొక్కర్తికి నోరులెగుత్తంది. సిగ్గుల్లేవే మరొకసిటానికి పన్నెండుగంటల బస్సొచ్చేత్తాదె, యిప్పుడికొక బుట్టకి ఏరనేప్పోనారుగాని..మాట్లాడుతున్నారు మళ్లీ. ఏవి ఒక్కొక్కర్తి ఏపాటి ఏర్నారు సూపించడి” అనుకొని వాళ్లదగ్గరికెల్లింది ఒక్కొక్కల్ని ఎదోఒకటి అంటూనే వుంది.
అంతవరకూ బెదురు బెదురుగా ఉన్నమా అమ్మఅదే సమయమనుకున్నట్టుంది. చాటు గా తనబుట్టతీసుకుని తిన్నగా ఎల్లిబస్తాలో బొమ్మల్లించి, అప్పుడుకేకేసింది.
“అయ్యో! పిన్నమ్మా మరిసిపోయి ఒంపీసినాను..నువు సూత్తావుగావల..” అని.
వెనెక్కి తిరిగిచూసిన అమ్మడమ్మ అదేందే అలాగ, నాకు సూపించకుండా ఏలొంపీసి నావ్.” అని సాగదీసింది.
“నువ్వటుకాసి మాట్లాడుతున్నావుగదా!..అని మరిసిపోయి వొంపీసినాను. బుట్టనిండి పోయింది. నేప్పోతే యింతసేపేల!?.. కావాలంతే అప్పలనరమ్మ నడుగు నాపక్కనే ఉంది”. అంది.
“పిన్నమ్మా! నేను సూసాను. నిండిపోయింది,” అనీసి మరోమాటకి చోటివ్వకుండా,
“యిదిగో నాబుట్టా నిండి పోయింది సూడూ!..” అని చూపించి తన బుట్టలో బొట్టలు బస్తాలో వొంపేసింది.
అమ్మడమ్మ ఏమనుకుందో ఏమో! అందర్ని తిట్టుకుంటూ మళ్లీ బస్తాదగ్గిరికి వచ్చింది. ఆయమ్మ వెనకాలే ఎల్లమ్మ,పద్మ,మిగతా మరోయిద్దరు బుట్టలనిండుగా బొట్టలుఏరి తీసుకువచ్చారు.
“ఆయమ్మ ఎందుకలాగ వొత్తొత్తినే కేకకేస్తాది.” మా అమ్మనడిగాను.
“ఎందుకేటి నాయనా! లచ్చిమీ కలిగితే లచ్చనాలు కలుగుతాయి, సునబగాయి బరువు గున్నపుడు ( డబ్బులున్నప్పుడు ) ఎవులికైనా మనసు సురసుర లాడుతాది” అంది.
ఎండ గట్టిగ కాస్తోంది.సెమటకి అందరికి ఒళ్లు చిరచిరలాడుతోంది. అమ్మడమ్మ నెత్తిమీద చీరకొంగు వేసుకునే బస్తాలో బొట్టలు అడుస్తోంది. అదిచూసి పిన్ని అంది.
“పిన్నమ్మా! నీకెందుకీ అగ్గిల పడిసావు, సుబ్బరంగా ఆ సెట్టుకింద కూకోరాదూ!.. నేన్సూసు కొంతాను గదా!..”అని
“నేను దగ్గిరనేప్పోతే ఈనంజలు వొళ్లొంచుతారే” అంది అమ్మడమ్మ.
“నీకేలావూసు అంబల్లేలకి ఈమడి అవ్వగొట్టిస్తాను గదా!.” హామీ యిచ్చింది.
గట్టు యింకా రెండుబార్ల దూరంగా ఉంది. ఇది అయ్యేటప్పటికి గంట పడతాది. అనుకున్నాను.
ఏమనుకుందో అమ్మడమ్మ వెళ్లి దూరంగా ఉన్న చెట్టుకింద కూర్చుంది. అందరం ఎదురుగా కనపడుతున్నామేమో, అక్కడనుంచే కేకలేసేది. మేము అమ్మడమ్మకు వెను తిరిగి ఉన్నాము.
మరికొంత సేపటికి మా అమ్మ తన బుట్టలోవి కొన్ని మళ్లీ నాబుట్టలో వొంపేసింది.తిరిగి నాబుట్ట నిండిపోయింది. బుట్టపట్టుకొని గోనే దగ్గరకు వొంపడానికి వెళ్లేను.
అమ్మడమ్మ చూసింది.
“సెబాస్ రా మనవడా!..” అని మెచ్చుకుంది.
పన్నెండు గంటల బస్సు ఊర్లోకెళ్లి తిరిగొచ్చేసింది. అంతే ఒంటిగంట అయిపోయినట్టే. అందరికీ అదే గుర్తు. ఒక్కొక్కల్లు పనిలోంచి లెగిసిపోడానికి సిద్దమయ్యారు. కాంతం పిన్ని అందర్ని బతిమలాడుతోంది.
“అమ్మమ్మా!…తల్తల్లి… అది నన్ను మరి బతకనీయదు. ఈయింత అయిపోతే నెగిసిపోదుము. మరి బద్దకించీకండి” అంది.
“అదేటొదినా! ఈమరకయ్యేసరికి రెండయిపోదా!..మాకాకల్లు గావా!..పొద్దున్ననగా తాగిన గంజినీలు” అన్నాది దాసరోలి పైడితల్లి.
“మరెందుకునేర్రా!ఈ యింతైపోతే మజ్జానం ఆమడి మగతాకి తీసుకుందుము గాని” అని అందరికి చెప్పి, పిన్నికాసి చూసి అంది మాఅమ్మ.
“అప్పలనరసమ్మా! నువ్వడుగే ఆయెనక నేనొత్తాను.” అని మాట కదపమంది.
చెట్టునీడ తూర్పుకు రెండు బారలపొడుగు సాగింది. అందరూ నీడలో కూర్చొని తెచ్చుకున్న అంబళ్లు తపేలాలు తీసారు. అమ్మడమ్మ కేరేజీ యిప్పింది.
“దీనమ్మ కడుపుగాల ఎంతకట్టిందే!.. అని తనకేరేజి కట్టిన మరదల్ని తిట్టింది. నేనింత తినేస్తానే..దండుగ సేస్తాదీ నంజ” అని తనలో తనే మాట్లాడుకొని,
“ఒలే అప్పలనరస …రాయే. మీయప్పసూడు ఎంతకట్టిందో యిద్దరు మనుసుల కేరేజి కట్టింది, కాసింత తిందువురాయే” పిలిచింది.
అమ్మడమ్మ తమ్ముడింట్లొ ఉంటోందట. ఆయమ్మనేవూరో యిస్తే ఒక కొడుకు పుట్టనిచ్చి ఆలాయన సచ్చిపోనాడాట. దాంతో ఆవిడ అక్కడున్న భూములు జాగాలు అమ్మేసి కొడుకుని తీసుకొని కన్నవారింటి కొచ్చేసి, ఆ డబ్బుతో యిక్కడ భూములుకొని పండించు కొంటోందట.
తనపొలము తమ్ముడిపొలం అంతా ఈయమ్మే దగ్గరుండి పనులు చేయిస్తాదట. తమ్ముడు, ఈ అక్క ఏది కావాలంటే అది, ఏమి తేవాలంటే అవి తెచ్చి యివ్వడ మే, ఈయమ్మే అన్నీ చూసుకుంటాదట. ఏ పొలాన ఏపంటేయాలి,ఎన్ని ఏలు పుయ్యాలి, ఎందరు మనుషులు కావాలి, అంతా ఈయమ్మ బాధ్యతపడి చూసు కుంటాదట. మరదలు ఎంతసేపు వండి వడ్డించడమేనట పెద్దరికమంతా తమ్ముడిదీ ఈయమ్మదేనట.
భోజనాల దగ్గర అమ్మలక్కల మాటలవల్ల ఈ విషయాలు నాకు తెలిసాయి.
అమ్మ, పిన్నికాసి చూసి తామనుకున్న విషయం కదపమని కన్నుసైగచేసింది. పిన్ని మాటాడ్డానికి జంకుతోంది. అదిచూసి మాఅమ్మే మొదలబెట్టింది.
“పిన్నమ్మా! నాకు తెలియకడుగుతున్నాను గానీ, ఈపిల్లిపెసలు ఏటిచేస్తారూ.! పప్పుకు మీకు పచ్చపెసలు నల్లపెసలు బోలెడుంటాయికాదా! యింత చిన్నగింజలు యివిదేనికి పనికొత్తాయి!?” ఏమి ఎరగనట్టు అడిగింది.
“అదేమే అలాగనీసినావు.ఇవెంత రేటను కుంతన్నావు. కిందటేడాది బోలెడు రేటెట్టి కొన్నాను. పొలం సత్తువకి ఈచేలేసి దున్నేత్తారు. ఈ పెసరచేను దున్నీసి మడికి నీరు గట్టీసి మూడూ.. నాలుగు రోజులుంతే కుల్లిపోయి మడికి సత్తువచేస్తాది. అందుకే ఈ యిత నాలకి డిమాండు. ఈటికి నీరుండాలి పండాలంటే. అన్ని దగ్గిర్లా పండీవు. మా బోరింగు ఉండబట్టి, ఆరారగా బూమి తడపబట్టి, ఇది కాపుకొచ్చింది.నేప్పోతే మొక్కలు మొలిసి పెరక్కుండా అలాగే గిడసబారిపోతాయి. యిన్ని కూల్లిచ్చి ఏరిస్తన్నానంటే ఒత్తినను కున్నావా! అనీసి
పెద్దనోరుతో అందరిని కేకేసింది.
“నెగండమ్మ..నెగండి..ఎంతసేపు తింతారు.” అంది.
అదే అదుననుకొని మాఅమ్మ మళ్లీ అంది.
“పిన్నమ్మా ఎంతాని అరుత్తావు ఈలతోటి,మజ్జానమా ఎదురెండ! ముఖానికి కొడతాది. పనిజరగదు. నసిలెత్తారు.
“అలగెలగవుతాదే, కూలి ఒత్తిని గానొత్తాదేటే” అంది.
“అందుకే నువ్వేటన్నంతే సిన్నమాటంతాను” జంకుతూనే అంది.
“ఏటది సెప్పు..”
“మరేటినేదు. పొద్దున్న ఏరితే ఒకమడి అయ్యింది.ఈ ఉన్నది కూడా అంతే మడికదా! అందుకని ఏ ఏలైతే ఆయేలవుద్ది.ఆ మడీ ఏరీసి ఎలిపోతాము,ఈఫూటకూల్లిచ్చి. నువ్వు పొద్దు గురించి సూడక, పనిగురించి ఆలోసించు..నువ్వలగ్గాని ఒప్పుకొంతే ఆలందర్ని మేం ఒప్పించుతాం. అందరము ఏలమీద యింటికెలిపోవచ్చు” అంది.
“అలగెలగే.. బేగెలిపోవచ్చని,మీరు ఎలిపోడానికి తొందరపడి, యింక ఎవర్తి సరిగా బొట్టలేరకుండా అయిపోయిందనిపించేత్తే!? అలాక్కుదరదు” అనేసింది.
మాఅమ్మ ఉత్సాహం ఒక్కసారిగ నీరుగారిపోయింది. మరేమి మాట్లాడలేక పోయింది.
“కావాలంతే ఉదయం నింపినట్టు మరో ముప్పందుం గోనికి యిప్పుడు నింపేత్తే శాన అలగైతె సూడు” అన్నాది అమ్మడమ్మ.
“అదీమాటే, సరే నువ్వన్నట్టే కానీ,” అనేసి అందరికి సెప్పింది.
మాఅమ్మ మనసిప్పుడు ప్రశాంతంగా వుంది.
సాయంత్రం వేళమీదే, అనుకున్నట్టు పని పూర్తయింది. అమ్మడమ్మ మనిసి మనిసిని పిలిసి ఎవరి కూలి వాళ్లకిచ్చింది. మాఅమ్మకి డబ్బులిస్తూ..
”ఏమే కూలికాశపడి ఆడి సదువు సెడగొడతావా యేటి,ఆడ్నిపొలాల్లంట తిప్పకు. సదువుకోని. ఏతిప్పలైనా నువ్వేపడు..” అంది.
“నేదు పిన్నమ్మ! .ఆదోరమని ఈఫూట తీసుకొచ్చాన” అంది మా అమ్మ.
అందరికి ఆరోజు కూలి రూపాయి అందితే మా అమ్మకి రెండురూపాయిలు అందేయి.
అమ్మ ఆనందానికి అంతులేకుండా పోయింది.అమ్మముఖం పుచ్చపువ్వు పూసినట్టు పూసింది.
తిరిగొస్తున్నప్పుడు దారిలో మా అమ్మనడిగేను.
“మజ్జానం మగతాకని ఎందుకన్నావ్!? మామ్మూలిగా కూలికే చెయ్యొచ్చుగదా” అని.
మా అమ్మ నవ్వి.. అంది.
“కూలికే అయితే ఆయమ్మ ఎవులు ఎన్ని బుట్టలేరుతున్నారో సూస్తాది. అసలే నామీద పొద్దున్న అనుమానపడింది. మజ్జానం సూసిందనుకో నీకూలి ఎగ్గొట్టేత్తాది. నువ్వు గబగబా ఏర్నేప్పోతన్నావు గదా! మజ్జానం మరిదాని కళ్ళు గప్పనేం. అందుకని యిలాగ అన్నాను.” అంది.
“మరి ఆలందర్ని ఎలాగొప్పించావ్” అడిగేను.
“కూలికే అయితే ఆయమ్మ ఊపిరి తియ్యకుండా కేకలేస్తాది.సేసేపని ఎలాగు సేస్తాము. ఆయమ్మచేత మాట అనిపించుకోవడమేల,కసింత గబగబా ఏరిత్తే గబాల్ల యింటికెలి పోవచ్చుగదా! అన్నాను” అంది.
అమ్మో!! మా అమ్మ చాలా గడుసయిందే అనుకున్నాను.
*
Add comment