ఇతిహాసం చెప్పే అనేక భ్రమల్లో ఒకటి
మహమ్మద్ గజనీ మళ్లీ వచ్చాడని
అతడు తిరిగి రాలేదు
ఇక్కడే ఉన్నాడు
ఎన్నో ఏళ్ల తర్వాత అతడు
ప్రత్యక్షమయ్యాడు అయోధ్యలో
సోమనాథ్ లో అతడు
అల్లా పని పట్టాడు
ఈ సారి అతడి నినాదం జై శ్రీరామ్!
(డిసెంబర్ 6, నరేష్ సక్సేనా)
ఎన్నికల పర్యటనల్లో నేను ఏ ఊరుకు వెళ్లినా సాద్యమైనంత మేరకు అక్కడ కవుల్ని, రచయితల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను. ఈ సారి పర్యటనల్లో నేను కలుసుకున్న వారిలో ముఖ్యమైన లక్నోకు చెందిన కవి నరేశ్ సక్సేనా.
‘తమకు తాము యోగులనుకనేవారిని, స్వాములనుకునే వారిని ముఖ్యమంత్రి పదవిలో నియమిస్తే ఏమవుతుంది రావు సాబ్, వారు మఠాల్లో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడే వారికి ప్రజల నిజసమస్యలు తెలియవని మనకు అర్థమవుతుంది .’. అన్నారు నరేశ్ సక్సేనా నాతో ఉత్తర ప్రదేశ్ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ..
గుండెమండినప్పుడల్లా కవిత్వం రాసే నరేశ్ సక్సేనా దేశ రాజకీయాల్నీ, సమాజాన్నీ నిశితంగా పరిశీలిస్తుంటారని నాకు ఆయన కవిత్వం చదివినప్పటి కన్నా, ఆయనను కలిసినప్పుడు ఎక్కువ అర్థమైంది. మౌత్ ఆర్గన్, వేణువు అద్భుతంగా వాయించే ఆయన తన కవిత్వంలో సమాజంలో బిన్న స్వరాల్ని అంతే అద్భుతంగా పలికిస్తుంటారు.
ఆయన కవితల్లో అద్భుతమైన విశేషణాలుండవు. దేన్నో వర్ణించి ఆ వర్ణనల మధ్య వాస్తవాన్ని అందంగా పొదిగే ప్రయత్నం ఆయన ఏమాత్రం చేయరు. ఉక్కబోసినప్పుడు ఒక పిల్ల తెమ్మెర లాగా, మనసు కల్లోలంగా ఉన్నప్పుడు మన గుండె ను ఫిడేలుగా మార్చి పలికించే రాగంలాగా ఆయన కవితలు మనను కదిలిస్తాయి.
కొందరు పిల్లలు మంచివారు
వారు బంతులు, గాలిబుడగలు
కావాలని మారాం చేయరు
మిఠాయి కావాలనీ అడగరు
అల్లరి కూడా చేయరు
వారు పెద్దలు చెప్పింది వింటారు
చిన్నవాళ్లు చెప్పిందీ వింటారు
అంత మంచివాళ్లు వారు
అంత మంచి పిల్లలకోసమే
మనం వెతుకుంటాం
వారు దొరకగానే
ఇంటికి తీసుకువస్తాం
నెలకు ముప్పై రూపాయిలిచ్చి
తిండిపెట్టే షరతుపై..
(అచ్చే బచ్చే)
ఇళ్లలో పనిచేసే బాలకార్మికులపై ఇంతకంటే సహజంగా ఏవరైనా ఏమి రాయగలరు?
‘మొత్తం రాత్రి సగం చంద్రుడిని కోరుకుంటుంది..’ అన్న కవితలో ఆయన ఇలా రాశారు
మొత్తం రాత్రికోసం
ఎగిసిపడుతుంది సముద్రం
సగం చంద్రుడికి దొరుకుతుంది మొత్తం రాత్రి
సగం పృథ్వికి చెందిన మొత్తం రాత్రి
సగం పృథ్వికి వాటాలో వస్తాడు
మొత్తం సూర్యుడు
సగం కన్నా ఎక్కువగా
ఎంతో ఎక్కువగా నా ప్రపంచంలో
కోట్లాది మంది తమ శరీరాల్ని
సగం వస్త్రంతో కప్పుకుంటారు
సగం దుప్పటిలో విస్తరిస్తాయి మొత్తం కాళ్లు
సగం భోజనంతో ఈడుస్తుంది మొత్తం శక్తి
సగం వాంఛలతో జీవిస్తుంది మొత్తం జీవితం
సగం చికిత్సకోసం చెల్లిస్తారు మొత్తం ఫీజు
పూర్తి మృత్యువు లభిస్తుంది
సగం వయస్సులో
సగం వయస్సు గడిచింది
సగం వయస్సుకు
మిగిలింది మొత్తం భోజనం
మొత్తం రుచి
మొత్తం మందులు
మొత్తం నిద్ర
మొత్తం విశ్రాంతి
మొత్తం జీవితం
మొత్తం జీవితానికి
మొత్తం లెక్కలు మాకు కావాలి
మాకు సముద్రం వద్దు, వెన్నెలా వద్దు
సూర్యుడూ వద్దు
మనుష్యులం మేం.
నాల్గవ వంతులో సగమో
ఎనిమిదవ వంతో
పూర్తి కావాలనే కాంక్ష
నిండిన మనుష్యులం మేం
నరేశ్ సక్సేనా నేరుగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే కవి. ‘నా నేల ఎవరికోసమైతే వెళ్లిందో వర్షం కూడా వారికోసం వెళ్లింది..నేల ఎవరికి లేదో ఆకాశం కూడా వారికి లేదు..’ అంటారు ఆయన ఒక కవితలో.
‘పక్షులు ఎగిరినప్పుడు చెట్టు వెంట ఉన్నట్లే కష్టాల్లో ఏ కవితలు మన వెంట ఉంటాయి? సంఘర్షించేందుకు లేచే చేతుల్లో ఏ శబ్దాలు వెంట ఉంటాయి?’ అని ప్రశ్నిస్తారు ఆయన మరో కవితలో.
‘వస్తువులు క్రిందపడేందుకు నియమాలుంటాయి. మనుషులు పతనమయ్యేందుకు ఎలాంటి నియమాలుండవు..వస్తువులు ఏమీ నిర్ణయించలేవు. కాని మనుషులు నిర్ణయించగలుగుతారు.
నీవు క్రిందపడేందుకు సరైన కారణం వెదుక్కో.. పడితే నీ శత్రువుపై పడు..ఉల్కలా పడు, పిడుగులా పడు..’ అని ఆయన విలువైన పతనాన్ని కోరుకుంటారు.
ఆయన కవితలన్నీ నేరుగా ఉంటాయని చెప్పలేం. ‘ఆకలి’ అన్న కవితను చూడండి
ఆకలి అన్నిటికన్నా ముందు
మెదడును తింటుంది
ఆ తర్వాత కళ్లను.
క్రమంగా శరీరంలో మిగిలిన అంగాలను..
ఆకలి దేన్నీవదలదు
అది బంధాలను తింటుంది
అమ్మనయినా, చెల్లెనయినా, పిల్లల్నయినా సరే
పిల్లలంటే ఆకలికి ఎంతో ఇష్టం.
అన్నిటికన్నా ముందు
వేగంగా పిల్లల్ని తింటుంది.
పిల్లల తర్వాత మిగిలేది ఏముంటుంది?
గుజరాత్ కల్లోలాలపై ఆయన రాసిన కవిత మనసును పిండేస్తుంది.
నేను పేపర్లన్నీ తెప్పించడం మానేశాను
టీవీల్నీ కట్టేశాను
రేడియోనూ ఆపేశాను
కాని ఎక్కడినుంచో మాంసం కాలిన వాసన వస్తోంది
ఇవాళ మా ఇంటికి ఒక ముస్లిం బంధువు వస్తున్నాడు
ఆయన నుంచి ఈ వాసన ఎలా దాచను?
అని ఆయన ప్రశ్నిస్తారు.
ఎమర్జెన్సీ కాలంలోనూ ఆయన ప్రశ్నించడం ఆపలేదు.
రాత్రి భయంకరంగా ఉంటుంది
కుక్కలు ఏడ్చినప్పుడు
కాని అంతకంటే భయానకంగా మారుతుంది రాత్రి
కుక్కలు నవ్వినప్పుడు
విను నేకేది వినిపిస్తున్నదో
ఎవరిదో నవ్వుతున్న స్వరం
‘ప్రవహించే చెమటలో నీరు ఎండిపోతుంది కాని అందులో కొంత ఉప్పు కూడా ఉంటుంది. అది మిగిలిపోతుంది. రాలుతున్న నెత్తురులో నీరు ఎండిపోతుంది. కాని అందులో ఉన్న లోహం మిగిలిపోతుంది. ప్రపంచంలో ఉన్న ఉప్పు, లోహం మనలో భాగమే. మరి ప్రపంచంలో ప్రవహిస్తున్న నెత్తురు, చెమటలో మనకు కూడా భాగం కావాలి.’. అని అంటారు. ఆయన మరి కవితలో.
‘నాకు మెట్లు కావాలి. గోడపై ఎక్కేందుకు కాదు, పునాదుల్లో దిగేందుకు. నాకు కోటల్ని గెలవాలని లేదు. వాటిని ధ్వంసం చేయడం కావాలి.. ‘అని నరేష్ సక్సేనా స్పష్టంగా చెబుతారు.
‘మొత్తం ఆకాశపు చీకటిని కనురెప్పలపై సహించాలి.. అని చెప్పే ఈ కవి తన పెదవులపై వేర్వేరుగా చీలిపోతున్న మౌనానికి దిశ కావాలి..’ అని ఆశిస్తారు..
ఉత్తర ప్రదేశ్ జలవనరుల శాఖలో పనిచేసి అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో నిపుణుడిగా పనిచేసి పదవీవిరమణ చేసిన నరేష్ సక్సేనా, కవి నరేష్ సక్సేనా ఒకరేనని చాలా మందికి తెలియదు. ఎన్నో లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి ఆయన జాతీయ అవార్డు పొందారన్న విషయమూ చాలామందికి తెలియదు. ‘ఆద్మీకా ఆ’ పేరుతో ఆయన రాసిన నాటిక ఎన్నో భారతీయ భాషల్లో ప్రదర్శితమైంది. ఆయన కవితలు ఎన్నో యూనివర్సిటీల పుస్తకాల్లో పాఠ్యాంశాలయ్యాయి. సముద్ర పర్ హో రహీ పై బారిష్, సునో చారుషీలా, చంబల్ ఏక్ నదీ కా నామ్.. మొదలైన పేర్లతో ఆయన కవితా సంపుటాలు వెలువడ్డాయి.
రాజకీయం లేనిది కవిత్వం లేదంటారు నరేష్ సక్సేనా. మోదీని మహానటుడని, ఆ విషయం ప్రజలు గుర్తించడం మొదలు పెట్టారని ఆయన చెప్పారు.
ఆయనేమిటో ఈ కవిత ఇంకా స్పష్టంగా చెబుతుంది
పొద్దున్నే లేచి ఆకాశం వైపు చూస్తే
ఎర్రగా, పచ్చగా, సింధూరం, గోధుమ రంగులు అలముకున్నట్లున్నాయి
ఎంతో ఆనందం వేసింది
ఆకాశం హిందువు అయింది
అని పక్కింటి వాడు అరిచాడు
నేను అరిచి చెప్పాను
ఇంకా ఆనందం వేస్తుంది చూడు
వర్షం రాగానే
మొత్తం నేల ముసల్మాన్ అవుతుంది.. అని!
ఇలాంటి వాళ్లను కలుసుకోవడంకైనా ఎన్నికలు రావాలని ఊళ్లు తిరగాలని నేను కోరుకుంటాను.
*
❤.. పిల్లల కవిత చాలా నచ్చింది- దాని సరళత వల్ల.
నరేశ్ సక్సేనా గారి పరిచయం చాలా బావుంది.
Thank you so much for introducing such a powerful poet!