రోజువారి వాక్యాల లోతైన అందాలు “నిశ్శబ్ద”

గాయపడ్డ జీవితాలకు మలాం పూసే పని చేశాడు సూఫీ!

నిశ్శబ్దమంటే శబ్దం లేకపోవడం కాదు. నిశ్శబ్దమంటే కావల్సిన శబ్దం కోసం తపన పడే ఒకానొక పరిస్థితి. శబ్దాలు వృధా కావొచ్చు నిశ్శబ్దంలో అదుండదు. నిశ్శబ్దంలో పశ్చాత్తాపం వుంటది. నిజాయితీ వుంటది. లేని ప్రేమ కోసం కలవరింత వుంటది. వాస్తవాలన్నీ తలపోతలౌతుంటాయి. ఇదంతా మలినాలుగా,చేదుగాయాలుగా శబ్దాలుగా మిగిలే చోటల్లా నిశ్శబ్దాన్ని పోగేసుకునీ ఆర్భాటం లేని అక్షరాలుగా మలిచి లోకానికి అందించడం కూడా కళాత్మక చర్య. ఆ సార్వజనీన,సార్వకాలిక ప్రయోజనకరమైన చర్యకు పూనుకున్న కవి నరేష్కుమార్ సూఫీ.
కవి పేరు వెనుక సూఫీ ఆసక్తి కలుగుతుంది. ఆధునిక సంక్లిష్ట జీవితాన్ని అంగుళమంగుళం దర్శిస్తూ, ఒక పవిత్రమనే ఆత్శదర్శనం వైపు కదలడం చాలా కష్టం. నిజాల భూమిక మీద మొలిచే ప్రశ్నల మీద నిఘా పెరిగిన కాలం నిజాలనిగ్గు తేల్చి చూపడం సాహసమే. ఆ సాహసాన్ని సులభ సాధనతో కలవాలం చేయగలిగిన సూఫీతనం “నిశ్శబ్ద”లో కనబడుతోంది. ఇంకా ఈ తత్వంలో “నేను” “నీవు” సంభాషణ పద్ధతి విరివిగా మెరుస్తుంది. సంపుటి మొదట్లో కవి చెప్పిన మాటలే వాటికి రుజువు.
“ఈ నిశ్శబ్ద కూడా నా సొంత గొడవ, ప్రతి అక్షరమూ నాకోసం, నాలోంచి వచ్చిందే తప్ప “సమాజ ఉద్ధరణ” అన్న కారణం ఏ మాత్రమూ లేదు. అట్లాగనీ ఈ అక్షరాలన్నింటికీ నేను సొంతదారుణ్ణి కాదు.నేను రాయడానికీ,నేను బతకడానికీ కారణమైన ప్రతి మనిషికీ,నా చుట్టూ వున్న ఈ ప్రకృతికీ ఈ రాతల మీద హక్కు వుంది, అధికారమూ వుంది”

ఆనాడు కాళోజీ “నా గొడవ” అన్నా అది జనం గొడవ. ఈ కవి నా సొంత గొడవ అన్నా ఆ గొడవలున్న జనులందరికీ అది చెందుతుంది. “నిశ్శబ్దం”గా మొదలైన అక్షరాలు..
“పంజరాల్లోని పక్షులను విడిచిపెట్టి/తోటలోని పువ్వులను అడవికి చేర్చి/నీ కోసం నా దేహాన్ని అలంకరిస్తాను/దుస్తులనీ జ్ఞానాన్నీ తోరణాలుగా కట్టి/నీ ముందు మోకరిల్లుతాను/ఏ మిత్రునికీ వీడ్కోలు వాక్యం మిగల్చకనే/నిన్ను అనుసరిస్తాను”.
పై వాక్యాలలో ఎటువంటి ఆర్భటి లేదు. స్వేచ్ఛ ధ్వనించింది. అడవికి చేరిన పూలు చేరడంలో మూలాలు పలికాయి. జ్ఞానాన్ని తోరణాలుగా కట్టి, మోకరిల్లడం, ఎవరికీ చెప్పకుండానే, తనంత తను “నిన్ను అనుసరిస్తాను” అనడంలో “నిశ్శబ్ద” లోని అన్వేషణ తేటతెల్లమైంది. అనుసరించాల్సింది దైవాన్నీ, జ్ఞానాన్నీ, స్వేచ్ఛనీ, నిజాన్ని. అందుకే అనగలిగాడు.

“నీ సమస్త దుఃఖాలనీ,ఆనందాలనీ ఇక్కడ వదిలెయ్యి /నీ పాదాలనీ శుభ్రపరుచుకునీ పయనానికి సిద్ధమవ్వు” అనీ..! కవి సమస్త ప్రపంచం నిదురించే సమయాన భిక్షాపాత్ర మోసే ఫకీరులా,ఖాళీ మధుపాత్రను మళ్లీ మళ్లీ వెతికే సాధువులా నేలమీది “దివ్యత్వాన్ని” పసిగట్టగలిగాడు.
ఇప్పటిదంతా వెలుగు పేరు తగిలించుకున్న చీకటికాలం. చేదుకాలం. చేతన పేరు పెట్టుకున్న అచేతన కాలం. కవులు ముందు కళ్లు తెరుస్తారు కాదు, కళ్లు తెరిసాకే అది కవిత్వం. వైయక్తిక ఎజెండాగా చెప్పుకున్నా, కవిలో కలిగిన ఎరుకత లోకానిదే. ఈ నరేష్కుమార్ సూఫీ తన అక్షరాల్లో జీవితంలోంచీ ఏది తప్పిపోతే అది జీవితం కాకుండా పోతుందో, నేను లోంచీ ఎది లోపిస్తే నేను కాకుండా అవుతుందో, సమాజం లోంచీ ఏది కానరాకపోతే సమాజగమనం తారుమారో స్పష్టంగా,ఇష్టంగా చెబుతున్నాడు.
“తిరిగి చూసుకో ఓ సారి /నిన్న నువ్వు నడచిన దారింకా అట్లనే వుందా అనీ…” ఇదొక గమనింపు… లేదని తెలిసాక యథార్థం వెక్కిరిస్తుంది.దోషిగా నిలబెడుతుంది.
“ఏడికేడూ ఏడికేడికో పయనించీ/నీ నుంచి నీవే వెళ్లిపోయినట్టున్నావ్ /అందుకే నీ బతుకిప్పుడు నీసువాసన కొడ్తంది”. చేయాల్సిన ప్రయాణంలో తకరారు జరిగితే బతుకుపరిమళానికి ఆస్కారం లేదంటాడు.

1. “నీ లోపటి నిన్ను నీవే ఎనుకులాడుకుంట/బతుకంతా తవ్విపోసుకుంట పోతనే వుంటవ్ ”
2.”ఎవ్వని బతుకెంత విషాద పద సమూహమో/మరి తెల్వకనే /పచ్చిరక్తపుస్పర్శ కోసం తపిస్తావ్ ..తాపసివవుతవ్
3.”జనన మరణ రహస్యాలని శోధిస్తూ బతకటమ్మరచి/జీవితమంటే మరణ నిరీక్షణమనీ సిద్ధాంతీకరించీ/చీకటి వీలునామాపత్రంపై నిదురిస్తావు నీవు”
ఇలా సాగే సూఫీ కవిత్వభాషలో కాసేపు కలియ తిరుగుతాం. ఆలోచనలో పడతాం.లోపలి జాగానూ, బతుకు జాగాను ప్రక్షాళనం చేసే మార్గమేదో ఆ వైపుకి వంగుతాం. వంగి వంగీ ఆత్మవెలుగుకై “నిశ్శబ్దం”లో పడతాం. నిశ్శబ్దంలోంచే విలువైన ధ్వనులిలానే పుడతాయి గదా.!
కవులకు మాయలుండవు.కవులు మాయతనాల చీకటిని పోగొట్టే వెలుగుసూర్యుళ్లు. భ్రమల్ని పటాపంచలు చేసే అలతి అలతి మాటల్ని ఈ “నిశ్శబ్ద”లో చాలా చదవొచ్చు.
“నువ్వూ నేనూ అనేవి నిజానికి లేనేలేవు/దేహాలు ప్రేమ వాహకాలంతే”
“ముత్యపుచిప్పలో పడ్డ చినుకు నువ్వై/ఏ సత్యమూ చూడలేక/ముత్యమా! నీ విలువ నీకెపుడు తెలుస్తుందీ”
“మళ్లీ మళ్లీ తెలిసిందాన్నే తెలియపరచడం/నాటకం అవదా/నటన కాదా!?”

కవిత్వమంటే  ఇమేజరీలు,మెటాఫర్లు వగైరాలుండాల్సిందే అని తీర్మానాలు చేసే వాళ్లున్నారు. ఈ మాట ఈ కవికి పట్టదు. రోజువారి వాక్యాలను కవితామయం ఎలా చేయాలో ఇతగాడికి బాగా తెలుసు. మన చుట్టూతా వున్న సాధారణ విషయాలను, ప్రకృతినీ, దైనందిన లోకాన్ని తన పదాల్లోకి ఒంపుకుని, మానసిక ఆవరణాన్ని తేటగా మలిచే ఒడుపు ఈయనలో మెండు.జీవితానికి ఏది కావాలో, జనానికి హక్కుగా ఏది చెందాలో దానిమీదే తన తపనకి కేంద్రస్థానం. మచ్చుకి కొన్ని…
“నువ్వూ నేనూ ఎవ్వరో కంటున్న కలలో తలదాచుకుంటాం/ వాడి మెలకువ మన మరణం”

“అమ్మ జోలపాటకి నిద్రిస్తాం దేవుడూ నేనూ హాయిగా/గుమ్మానికవతల ప్రవక్తల గోల, అమ్మ తలుపు మూస్తుంది” ఇలా వుంటుంది.. ఇతడి కవిత్వభాష. సాదాసీదాగా.. అయినా మెలకువకన్నులు తెరుచుకున్నాయి గదా..!
కాలానికేది కావాలో నికార్సయిన కవులకే తెలుసు. అల్లకల్లోలమైన కాలం.శబ్దాల అస్తవ్యస్థ కాలం. మాట్లాడాల్సిన మాటలకంతటా అవమానమే. కానీ అవమానాల్ని దాటి, తాత్విక పరిణితి వైపు ఈ జగత్తుని నడిపించాలనే ప్రయత్నిస్తారు.

“పువ్వులు వాడిపోతాయ్ అద్దాలు ముక్కలవుతాయ్ /ఓయ్ తెలుసునా నీకు/నువ్వు చచ్చిపోతావ్ ఒకనాటికి /అయితే/భూమిని ప్రేమించినవాళ్లు,నరకాన్ని ద్వేషించిన వాళ్లు/ఒక నాటికి చెట్లయి మొలుస్తారు”

కవితలనిండా కావాల్సిన స్వరమే.. గుండెనిక్కడ పాతిపోవడం,మనిషిని ప్రేమతో హత్తుకోవడం, ఆకలిపాటను వినిపించుకోవడం,బతికే ఆకలి,బతుకై ఆకలి,బతుకులాకలి, మనిషితో యుద్ధం, మనిషిలో యుద్ధం అన్నీ ఇవాల్టి అవసరాలే. నరేష్కుమార్ సూఫీ వీటివెంట పాఠకుల్ని పదే పదే తిప్పుకున్నాడు.
వర్షాకాలం గోదారి బురదగా,ఎర్రగా పొంగులెత్తుతుంది. శీతాకాలం తేటగా నిదానమై సారవంతమౌతుంది. కవులు మొదట వర్షాకాలం పోకడ పోయాక, సారవంతమై శబ్దప్రపంచాన్ని అమూల్యం చేస్తారు. నిశ్శబ్ద లోని కవిత్వం అమూల్యమైనది. సూఫీ గాయపడ్డ జీవితాలకు మలాం పూసే పని చేశాడు. కవి శబ్దాలన్నీ నిశ్శబ్ద మథనాలే. కవి మాటల్లోనే నిశ్శబ్దమంటే..

“పక్కగదిలో ఒక పద్యాన్ని చదువుతున్న/పిల్లవాని స్వరాన్ని విన్నప్పుడు/నిశ్శబ్దమంటే శబ్దం ఉండకపోవడం కాదు/శబ్దాన్ని వినలేకపోవడం అనిపిస్తుందీ”.
“a good poem is a contribution to reality. a good poem helps to change the shape of the universe, helps to extend everyone’s knowledge of himself and the world around him”.అని డిలాన్ థామస్ అభిప్రాయం. “నిశ్శబ్ద” ఆ రకంగా వాస్తవాధీన రేఖపై ప్రపంచానికి అనేకానేక జ్ఞానకిరణాల్ని ప్రసరించిన కవిత్వం.

ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తోన్న పద్యాలను  కమనీయంగా రాసి,సమాజ ప్రయాజకంగా (కవి కాదన్నా) తనను వెంటాడిన నిశ్శబ్దాన్ని శబ్దాలుగా కూర్చినందుకు నరేష్కుమార్ కి నిండుగా అభినందనలు.

*

మెట్టా నాగేశ్వరరావు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజానికి ఇక్కడ నిశ్శబ్దనీ, సూఫీనీ ఇద్దరినీ అనాలసిస్ చేసేసాడు మెట్టానాగేశ్వరరావు రవి
    నేను రాసుకున్నవి అన్నీ… ఇట్లా ఒకసారి కలిపి చెప్పాడు. లవ్యూ బ్రో. నిన్న Afsar Mohammed సాబ్ “నిన్ను తిట్టుకుంటూ ఓ వ్యాసం వచ్చింది సారంగలో వేస్తున్నా” అని మెసేజ్ చేస్తే ఆ చూద్దాం లే అనుకున్న 🙂 ఊహించిన దానికన్నా ఎక్కువగా తిట్టాడు మా మెట్ట 😉

  • కవితలనిండా కావాల్సిన స్వరమే.. గుండెనిక్కడ పాతిపోవడం,మనిషిని ప్రేమతో హత్తుకోవడం, ఆకలిపాటను వినిపించుకోవడం,బతికే ఆకలి,బతుకై ఆకలి,బతుకులాకలి, మనిషితో యుద్ధం, మనిషిలో యుద్ధం అన్నీ ఇవాల్టి అవసరాలే అంటూ సాగిన సాహితీ పరామర్శ బాగుంది..కవికి, విమర్శకుడికి అభినందనలు

  • a good poem is a contribution to reality… fact
    nageshwer rao garu good analysis…cheysaru

  • సూఫీతత్త్వాన్ని,కవిత్వాన్ని కలిపి తాగినట్టుంంది…హ్యాంంగోవర్ మాత్రంం లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు