నేను అక్కడొక
పిడికెడు చోటు కోసం చూస్తున్నాను
అతి సారవంతమైన నేల అది
అక్కడ నిద్రపోతున్న మట్టికణంలో
జీవసంగీతమేదో
లేత లేతగా గుండెలను తడుతుంది
ఎవరి ఏకాంతాలూ భగ్నం కాని
అతి విశాల నిశ్శబ్ద స్వర్గం
అక్కడే సంవేదన మేఘాలూ
కురిసిపోవు
ఇసుక రేణువులు
లయాత్మకంగా కదులుతూ
గాలిఉలితో శిల్పాలు చెక్కుతుంటాయి
ఆ నేల
పాస్పోర్టు లేదని అలగదు
వీసా ఏదని
చేతుల్లోకి జొరబడదు
నీదీ దేశం కాదు పో..
అనెవర్నీ వెనక్కి పంపేయదు
తిన్న మాంసం వాసన చూడ్డానికి
పేగుల్లోకి జొరబడదు
ఒకే రక్తసమూహాల మధ్య
లోహపు ఇటుకలతో గోడలు కట్టదు
నాకు అక్కడ ఆదిమ మానవుడి
సహచర్యం దొరుకుతుంది
ఆ ఆత్మీయ నిర్మల ఆలింగనంలో
పునీతమవుతాను
కనుమరుగైన పక్షుల
వెచ్చని ఊపిరులు సోకి
నాలో గడ్డకట్టిన స్వప్నాలు చిగురిస్తాయి
పిల్ల కాలువల అలికిడికి
ఉలిక్కిపడి నిద్రలోంచి లేచే
నదితల్లిలా మారిపోతాను
నా సమాధి మీద
అలలతో
నా ప్రజల కోసం
రోజుకో కవితను చెక్కుతాను.
*
Add comment