మనుషుల్లో ఉండే భావోద్వేగాలే సాహిత్యం. మనం చదివే ప్రతి అక్షరం, ప్రతి కథ కూడా కొందరు మనుషుల జీవితాలే. ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని రష్యా లేదా అమెరికా ప్రజల జీవితం గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. కానీ ఆ ప్రాంత భాష మనకి వస్తేనే కానీ మనకి అక్కడి సాహిత్యం అర్ధం చేసుకోలేము. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అనువాదాలు చాలా వరకు ఉపయోగపడతాయి. అనువాదాలు వల్ల అక్కడి సంస్కృతులను అలానే వాళ్ళ దృక్కోణాలను తెలుసుకునేలా చేస్తూనే, మనం అంతా ఒక్కటే అనే భావనను కూడా కలుగజేస్తాయి. ఈ ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా అనువాదాలను చదువుతున్న నేను — ఎ.ముత్తులింగం గారు రాసి అవినేని భాస్కర్ అనువదించిన “ఐదు కాళ్ళ మనిషి- మరిన్ని కథలు” పుస్తకం గురించి నా నాలుగు మాటలు-
సాధారణంగా జంతువులు వనరుల కోసం వేరే జాతి మీద దాడి చేస్తాయి కానీ సిద్ధాంతాలు, భావజాలం కోసం యుద్దాలు చేసే ఒకేఒక్క జాతి మానవ జాతి. యుద్దాలు వాటి దుష్ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ యుద్దాల వల్ల నష్టపోయిన కుటుంబాల జీవితాలు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ప్రతినిధిగా ఎ.ముత్తులింగం గారు మనకి కనిపిస్తారు.
శ్రీలంక దేశం కూడా మన దేశంలానే ఎన్నో జాతుల సమూహం. అయితే ఈ జాతుల్లో ముఖ్యమైనవి సింహళ జాతి మరియు తమిళులు. కొన్ని రాజకీయ-సాంఘిక కారణాల వల్ల చాలా ఏళ్ల పాటు సింహళీలు- శ్రీలంక తమిళలు యుద్ధంలో ఉన్నారు.. ఆ యుద్ధ వాతావరణం నుంచి పుట్టుకొనివచ్చిన కథలే ఈ “ఐదు కాళ్ళ మనిషి మరిన్ని కథలు”పుస్తకంలో ఉన్నవి. అయితే కేవలం యుద్ధం ఆధారిత కథలు మాత్రమే కాకుండా యుద్ధం వల్ల విచ్ఛిన్నమైన కుటుంబం గురించి, యుద్ధం వల్ల వేరే దేశాలకు వలస వెళ్ళిపోయిన జీవితాల గురించి కూడా రచయత తన కథల్లో కథాంశంగా తీసుకున్నారు.
ఈ పుస్తకం 15 కథల సమాహారం. ప్రతి ఒక్క కథ నాటకీయతకు, కల్పిత ఉత్కంఠకు చాలా దూరంగా, నిజానికి దగ్గరగా వుంటుంది. అలాగే కథల్లో ఎంత వైవిద్యం ఉందొ, కథల పరిధి కూడా అంతే పెద్దగా ఉంది. శ్రీలంక, పాకిస్తాన్, అమెరికా,కెనడా ఇలా వివిధ దేశాల్లో ఉంటుంది. కానీ అన్ని కథల్లో మనం కనిపిస్తాము.
ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కథలను అనువాదం చేసిన అవినేని భాస్కర్ గారి గురించి. భాస్కర్ గారు ఈ కథలను అనువాదం చేశారు అనడం కన్నా అనుసృజన చేశారు అని చెప్పవచ్చు. కథలు చదువుతున్నప్పుడు అసలు ఇవి అనువాదం చేసిన కథలైనా అనేలా ఉన్నాయి.
ఈ కథల్లో నాకు బాగా నచ్చిన అంశం రేపటి మీద ఆశ, మనిషి మీద నమ్మకం.
ఈ కథలు అన్ని బాగా నచ్చినా … మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేలా ఉన్న కథలు మాత్రం “రేపు”, “టోరాబోరా వంటమనిషి”, “పది రోజులు“, “రైలు అమ్మాయి”. “ఐదు కాళ్ళ మనిషి”, “వెలుగు”.
ఇంత అద్భుతమైన కథలను తెలుగులో పరిచయం చేసిన అవినేని భాస్కర్ గారికి, ఈ కథలను పుస్తకంగా తీసుకొని వచ్చిన ఛాయా రిసోర్స్ సెంటర్ వాళ్ళకి ధన్యవాదాలు.
ఈ పుస్తకం amazon.in లో ఉంది. లేదా పుస్తకం కావాల్సిన వాళ్ళు 9848023384 నంబర్ కి ఫోన్ చేసి కొనుకోవచ్చు..
దయచేసి పుస్తకాలను కొని చదవండి.
బుక్ లింక్: https://amzn.to/48oXYku
మంచి విశ్లేషణ. బాగుంది.