ఇప్పటి తరం వారికి ఆకాశవాణి పాత రోజుల గురించి తెలిసే అవకాశం లేదు కానీ, ఇప్పుడు యాభైలు,అరవైల్లో ఉన్నవారికి రేడియో అంటే కార్ రేడియో కాదు, మొబైల్ యాప్ ద్వారా వినటం కాదు. అచ్చంగా రేడియో సెట్ మనతో కబుర్లు చెబుతూ మోగుతున్నట్టు ఉండేది.
నిజానికి రేడియోది ఎప్పుడూ కనిపించని ప్రభావం..సంగీత సాహితీ దిగ్గజాలు కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, స్థానం నరసింహారావు, బాలమురళి దాశరథి,పింగళి లక్ష్మీకాంతం, పాలగుమ్మి విశ్వనాథం కందుకూరి రామభద్రరావు, మునిమాణిక్యం,లత , వింజమూరి సీతాదేవి గోపిచంద్, రావూరి భరద్వాజ వంటి వారెందరో రేడియోలో పనిచేసిన సమయమది.. బాలమురళి కృష్ణ తొలి లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్..నిలయ కళాకారులు హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో కొలువుతీరి ఒక వైభవానికి నిదర్శనమై నిలిచారు వీరంతా.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహింప చేసేందుకు రేడియో పోషించిన పాత్ర ఎక్కడా నమోదు కాలేదు కానీ పత్రికలతో సమానంగా రేడియో తన ప్రభావాన్ని చూపింది.. భాషను నేర్పింది..కళల పట్ల గౌరవాన్ని చూపింది. ఒక్కమాటలో చెప్పాలంటే రేడియో ఆ కాలంలో దీపధారిగా నిలిచింది.అందుకే ఆ తరం వారందరిలోను సంగీత సాహిత్యాలు సమలంకృతమై భాసిల్లాయి. విజయవాడ భక్తిరంజనికి ప్రసిద్ధి. రజనీ స్వరపరచిన శ్రీ సూర్యనారాయణ మేలుకో అన్న సూర్యస్తుతి కోసం ఇప్పటికీ చెవికోసుకునేవారెందరో ఉన్నారు.
హైదరాబాద్ కేంద్రం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జానపద కళారూపాల రికార్డింగ్ నుంచి శాస్త్రీయ,లలిత సంగీతం వరకు వారధిగా నిలిచింది. భాగ్యనగరం సాహిత్యకారులకు కేంద్ర స్థానమై విలసిల్లింది.
ఆ తరానికి చెందినవాడిగా ఆలిండియా రేడియోలో చేరతానని ఎప్పుడూ అనుకోలేదు. నేను చదివిన ఎమ్మెస్సీ కెమిస్ట్రీకి, రేడియో ఉద్యోగానికి సంబంధం లేదు కానీ రేడియో వినటం అనే అర్హత అయితే ఉండేది. మేం బందరులో ఉన్నప్పుడు కరెంట్ రేడియో లో వినేవాళ్ళం. ఇది అరవై , డెబ్భై దశకాల నాటి కాలం.
కొత్త కరెంట్ రేడియో ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి, బొట్టు పెట్టిన జ్ఞాపకం. అప్పుడు నా వయసు ఆరేడేళ్ళు ఉండొచ్చు. ఏరియల్ ఇంట్లోనే దండెంలా పైన వేలాడదీసేవారు. అప్పట్లో లైసెన్స్ ఫీజు కడుతుండేవాళ్ళం.
బెజవాడ రేడియోలో వినిపించే నండూరి సుబ్బారావు,సుత్తి వీరభద్రరావు,వి.బి.కనకదుర్గ,కోకా సంజీవరావు,ఏ.బి.ఆనంద్, నాగరత్నమ్మ ల గొంతులు విని మురిసిపోతూ ఉండేవాళ్ళం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు excursion నిమిత్తం బెజవాడ రేడియో స్టేషన్ చూడటానికి వచ్చాం. అప్పుడు పాత బిల్డింగ్ లో ఉండేది రేడియో స్టేషన్..అదే స్టేషన్ లో పదకొండేళ్ళు పనిచేస్తానని ఊహించానా?!
ఇంకొంచెం ముందుకి వెళితే 1978-81 సంవత్సరాల మధ్యకాలంలో హైదరాబాద్ లో డిగ్రీ చదువుతుంటే చిన్నక్క, ఏకాంబరం, రాంబాబు స్టాక్ కేరక్టర్లై కార్మికుల కార్యక్రమం లో పలకరిస్తుడేవారు..ఆ ముగ్గురు రతన్ ప్రసాద్,వి.సత్యనారాయణ, న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య అని తెలిసింది తర్వాత.. కొన్నాళ్ళు జీడిగుంట రామచంద్ర మూర్తి బాలయ్యగా రాంబాబు పాత్ర నిభాయించారు. రవివర్మ,శారదా శ్రీనివాసన్, ఇలియాస్ జ్యోత్స్న నాటకాలు వింటుంటే ఒళ్ళు పులకరించేది.
సుధామ,ఎం.జీ.శ్యామలాదేవి, పుట్టపర్తి నాగపద్మినిల ఉదయతరంగిణిలో సంభాషణలు ఇంటిల్లిపాదిని రంజింప చేస్తూ ఉండేవి. ఇక తురగా జానకీ రాణి గారి బాలానందం పిల్లలను తీర్చిదిద్దుతూ ఉండేది. యువవాణి ఇంగ్లీష్ కార్యక్రమాలు మాలాంటి నూనూగు మీసాల వయసు వారికి ఆశ్చర్యం గాను,అబ్బురంగానూ ఉండేవి.
ఇందిరా బెనర్జీ, రాజగోపాల్,మట్టపల్లి రావు, ఇలియాస్ వివిధభారతిలో చమక్కు తారలై మణిమాల ప్రోగ్రాం లో మెరుస్తూ ఉండేవారు. వీరంతా ఎవరో తెలియకపోయినా ఒక గాఢానుబంధం రేడియోతో ఏర్పడింది. దాంతోటి రేడియో స్టేషన్ చూస్తే బావుంటుంది.వీరందరితో మాట్లాడితే బావుండు అన్న కోరికుండేది.
కొంచెం వెనక్కి వెళతాను.
మా నాన్నగారి ఉద్యోగరీత్యా కరీంనగర్ లో చదివే అవకాశం కలిగింది.
కరీంనగర్ లో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అంటే 1977 ప్రాంతంలో బెజవాడ బంధువులింటికి వెళ్ళినప్పుడు-
ఆ బంధువులు సత్యనారాయణపురం లో ఉన్నప్పుడు అక్కడే సుత్తి వీరభద్రరావు గారు ఉంటారని తెలిసినప్పుడు లబ్ డబ్ అంటున్న గుండెతో భయం భయంగా కలవటానికి వెళ్ళటం మర్చిపోలేని ముద్ర నాపై వేసింది.
ఇలా నా చిన్నతనం నుండి రేడియోది చెరగని ముద్ర. ఆకాలంలో ఇంచుమించు అందరిదీ అదే అనుభూతి. కానీ రేడియోలో వినిపించే గొంతులు తప్ప వారు చేసే ఉద్యోగాలు ఎలా ఉంటాయో కూడా తెలియని నాకు 1986లో రేడియో లో ట్రాన్స్మిషన్ ఎక్సిక్యూటివ్ పోస్ట్ లకు “ఎంప్లాయిమెంట్ న్యూస్” లో వచ్చిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన చూసి ఇదేదో God sent opportunity అనుకుని అప్లై చేసి, పరీక్ష రాసి ఇంటర్వూ కు వెళ్లి సెలెక్ట్ అయ్యి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరాక కాస్త భయం కలిగింది.
అదెందుకంటే –
ఆ కథ వచ్చే సంచికలో!
*
భవిష్యత్ లో మరింతగా చిక్కని చక్కని జ్ఞాపకాలు అందిం చాలని కోరుకుంటున్నా.
మీ చిన్నతనం నుండి రేడియో జ్ఞాపకాలు చాలా బాగా విశ్లేషించారు రేడియోలో పనిచేసిన కళాకారులతో సహా రాంబాబు గారు
ఇది రేడియో- రాంబాబు కధ వివరంగా..