1
కవిత్వోదయం
కవిత్వం లాంటి ఉదయాలు
ఉదయం లాంటి పద్యాలు
ఎంత బావుంటాయని
అప్పుడే విచ్చుకుంటున్న
మందారపు పువ్వులా ఉంటాయి
బుడిబుడి అడుగుల
బాల్యంలా ఉంటాయి
తల్లి ప్రేమగా నాకుతుంటే
తాదాత్మ్యం చెందే
లేగ దూడలా ఉంటాయి
కవిత్వోదయాల్లో
బ్రహ్మాండమైన ఉత్తేజం ఉంటుంది
నిగూఢమైన శక్తి ఉంటుంది
నివురు గప్పిన నిప్పు ఉంటుంది
నిద్రలేని రాత్రుళ్ళను
జోల పాడగలవ్
తడిసిన తలగడను
ఎండార పెట్టగలవ్
ఎండిన కన్నీటి చారికలను తుడిచి
కదన రంగంలోకి ఉరికించగలవ్
పద్యంలోంచి పొడుచుకొచ్చే
వాక్యోదయాలు
ఎంత బావుంటాయని !!
2
ఇవాళ … రేపు…
నిన్నా…మొన్నా…
ఇవాళా అవదు… రేపూ అవదు
నిన్నటి రోజు
దోసెట్లో నుంచి జారిపోయిన
చేప పిల్ల లాంటిది
రెక్కలు కొట్టుకుంటూ
ఎగిరిపోయిన పిట్టలాంటిది
గతం అమ్మ కొంగుచాటు నుంచి
తొంగి చూసే బాల్యం లాంటిది
గతించిన కాలానికి
కొలబద్దలతో పనేం ఉంటుంది??
కరిగిపోయిన మైనాన్ని
కొలుస్తూ కూర్చుంటే
కాలం తిరిగి వస్తుందా??
ఎండిన మోడులో నుంచి
కవిత్వంలా ఓ ఆకు పొడుచుకుని వస్తుంది
రేపు మహావృక్షమై
ప్రపంచమంతా పరుచుకుంటుంది!!
Add comment