కారు స్పీకర్‌లోంచి ఈ మధ్య బాగా పాపులర్ అయిన తెలుగు పాట వింటూ డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాల కూర్చున్న ముగ్గురూ కూడా గట్టిగట్టిగా పాటతో పాటు కలిపి పాడేస్తున్నారు..
“అబ్బా!” అంటూ చెవులు గట్టిగా మూసుకుంది స్వాతి
“హే! నేను అంత బ్యూటిఫుల్‌గా పాడుతుంటే వినకుండా ఫోన్ చూస్తోంది, చూడు ప్రవీణ్!” అని కంప్లైంట్ చేసింది రేష్మా. ఫోన్‌లోంచి స్వాతి చప్పున తలెత్తి,
వెనక్కి తిరిగి ఏదో అనబోయి తమాయించుకుని ‘హే, సారీ, నా సంగతి తెలుసు కదా, ప్లీజ్ ఏమీ అనుకోకు.”
“స్వాతీ…” ఇయర్‌పాడ్స్ తీస్తూ, “ఓకే, ఓకే… ప్రవీణ్, నీకు తెలుసు కదా, ఈ జాతర టైపు పాటలు, ఆ డప్పులు, డ్రమ్స్ శబ్దం అంటే చిరాకు,”
“ఇట్స్ ఓకే డార్లింగ్ !నాకు తెలుసు కదా, బై ది వే బాగా ఆకలేస్తోంది మంచి బ్రేక్ ఫాస్ట్ చెయ్యాలి రెస్టారెంట్స్ సెర్చ్ చెయ్యి”
“అవును, మాకు కూడా ఆకలేస్తోంది,” వెనకాల నుంచి ముగ్గురూ కోరస్‌గా అన్నారు.
“ఇదిగో, ఈ హోటల్‌లో చేద్దాము, రేటింగ్స్, రివ్యూస్ బాగున్నాయి, ముప్పై నిమిషాల దూరంలో ఉంది.” మ్యాప్ ముందు ప్రవీణ్‌కి, తరువాత వెనకకి తిరిగి చూపిస్తూ అంది.”
“ మ్యాప్ వైపు చూస్తూ “ఓహ్ అవును, బాగుంది. వెళదాం”
“హే స్వాతి, ఎక్సలెంట్ యార్! మొన్న నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఎంబీయన్స్, ఫుడ్ కూడా చాలా బాగుందని. ఎస్, డన్!” సమీర్ కూడా ప్రవీణ్‌తో ఏకీభవించాడు.”
“మేము కూడా అదే అనుకుంటున్నాం” రేష్మా, వంశీ ఒకే సారి అన్నారు
అర గంట లో హోటల్ కి చేరుకున్నారు.
మిగతావాళ్ళను ఉద్దేశిస్తూ “ఈ హోటల్ ఓనర్‌కి కాస్త సాహిత్యాభిలాష ఉన్నట్లుంది. కదా! లోపలి వస్తుంటే గమనించాను. చాల చోట్ల ఇంగ్లీష్ ,తెలుగు కొటేషన్స్ వాటికి తగ్గట్టుగా, పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదిగో ఇదైతే భలే నచ్చింది ఒక గడసాని, తాడు మీదనుంచి నడుస్తున్న చిత్రం. దాని కింద కొన్ని వాక్యాలు ఇలా రాసున్నాయి “దాని కింద కొన్ని వాక్యాలు ఇలా రాసున్నాయి: ‘ఒక స్వప్నంలోంచి మరో స్వప్నంలోకి ప్రయాణం. నిద్రలోకి జారుకోవడం వంటిది మరణం. నిద్రనుండి మెలుకువలోకి రావడం వంటిది జననం. మూడు తాడులతో పేని, ఆరడుగుల నేలలోకి నడక, ఈ వాక్యాలు రాసిన కవో,రచయితో తాత్వికుడై ఉంటాడు.” అంటున్న స్వాతి మాటలను మద్య లోనే అందుకుంటూ
“అమ్మో, పొద్దున్నే ఇంత ఫిలాసఫికల్ మాటలు మనకెందుకు తల్లీ! హాయిగా టిఫిన్స్ లాగిద్దాం,” అందరూ దండం పెట్టారు. ఆర్డర్ ఇచ్చినవన్నీ వచ్చాయి. అందరూ వాటి మీద దండయాత్ర మొదలుపెట్టారు. “కొంచెం తొందరగా తినండి. లంచ్‌కి కూడా ఆగాలి కదా? ఎక్కువ బ్రేక్స్ వద్దు, మనం సాయంత్రం కల్లా ఊరికి చేరుకోవాలి. ఈ రోజు రాత్రి పూర్తి విశ్రాంతి తీసుకుంటే, రేపటికి ఫ్రెష్ అయిపోతారు”.
ప్రవీణ్ మాటలకు ఓకే! అన్నట్లు మిగతా వాళ్ళు తలాడించారు
*
వీకెండ్ కదా అని ఫ్రెండ్స్ ఐదుగురు ప్రవీణ్ ఊరికి ట్రిప్ వేసుకున్నారు.
ఐదుగురు కాలేజీ డేస్ నుంచి చిక్కటి స్నేహితులు. ఉద్యోగాలు వచ్చాయి. వారంలో ఐదు రోజులు టార్గెట్స్, మేనేజర్ కోపతాపాలు, కమ్యూట్ కష్టాలతో గడిస్తే, వీకెండ్స్ మటుకు కొత్త కొత్త రెస్టారెంట్లు, బయటి ప్రదేశాలతో పాటు ఆఫీసు రాజకీయాల మీద నడుస్తాయి.
ఒక్కో సారి లాంగ్ ట్రిప్స్ కూడా వెళుతుంటారు. ఆ స్నేహబంధం, విభిన్న ధృవాలను కలిపే ఒక అదృశ్య శక్తి. అందులో ఏ ఒక్కళ్ళ కి ప్రాబ్లం వచ్చినా అందరూ కలిసి సాల్వ్ అయ్యేలా చూసుకుంటారు. అందులో ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కారమయ్యేలా చూసుకుంటారు. రేష్మకి పెళ్ళంటే ఇష్టం లేదు, స్వతంత్రంగా ఉండాలని అనుకుంది.”
“అందుకు ముందు ఇంట్లో ఒప్పుకోక పోవడం తో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారు. ఇక సమీర్ “గే” అని తెలిసినప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మిగతా నలుగురూ వాళ్ళకి దాని గురించి విడమరిచి చెప్పడంతో, వాళ్ళు కొడుకుతో ప్రేమగా, మామూలుగా ఉంటున్నారు. ఇక వంశీ అయితే బెంగుళూర్ లో ఉన్న తన కొలీగ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు.
తన వ్యక్తిత్వం తో పెద్దరికం చూపించే స్వాతి అంటే అందరి కి గౌరవం. ప్రవీణ్, స్వాతి ఒకరినొకరు ఇష్టపడి, ఇద్దరి కులాలు వేరైనా పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.”
“స్వాతి, కచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది.
తిన్న వెంటనే ఓ పది నిమిషాలు నడవడం అలవాటు. ఎక్కడైనా, ఎలాగో అలాగ వీలు చేసుకుంటుంది. పార్కింగ్ పక్కన పిల్లల కోసం పార్కు లాంటిది ఏర్పాటు చేశారు. అందులో ఓ చిన్న జలపాతంతో పాటు జారుడుబండ, ఉయ్యాల బల్లలున్నాయి. ఆమె చుట్టూరా రంగురంగుల సీతాకోకచిలుకలు తలలూపుతూ, ప్రకృతి నృత్యానికి ప్రాణం పోశాయి. నడుస్తూ అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొంది. దూరంగా పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి. చల్లటి గాలి వీస్తోంది.
మూత పడ్డ రెప్పలు కేవలం నిద్రకు దారి తీయలేదు, ఒక అపరిచిత అస్తిత్వపు ద్వారాలను తెరిచింది. ఆ సుషుప్తి లో ఎంత సేపు ఉందో తెలియదు.
*
ఆ ఊరి గ్రామదేవత అనుగ్రహం పొందడానికి భక్తులు మంగళ, శుక్ర, శని, ఆదివారాల్లో గుడికి వస్తారు.
ఈ ఆలయంలో నిత్య పూజలు, అర్చనలు, దీపారాధనలు జరుగుతాయి. ఆదివారం, మంగళవారాలు మరియు శుక్రవారాలు అమ్మవారికి పూజలు చేయడానికి పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు.
దగ్గరున్నవాళ్ళు అమ్మవారిని ఆరాధించడానికి ఈ జాతరకు వస్తారు. కొంతమంది వింత వింత మొక్కులు కూడా మొక్కుతారు. అయితే అక్కడ ఒక ప్రధాన ఆకర్షణ ఉంది ఆ జాతర లో, ఆడవాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని డాన్సులు చేస్తారు, వాళ్ళతో ఎకసెక్కాలు చేస్తూ, తాళం వేస్తూ డప్పు వాయిస్తూ మగవాళ్లు కూడా అనుగుణంగా చేస్తారు.
అది వాళ్ళ ఆచారం కొన్ని తరాలుగా వస్తోంది. కొంతమందికి పూనకాలు కూడా వచ్చేస్తాయి.
తను చూస్తున్న ప్రపంచం, ఆ మనుషులు… అన్నీ మారిపోయాయి. ఏదో జరిగింది, కానీ ఏమి జరిగిందో ఆమెకే అర్థం కాలేదు.
ఆమె అవన్నీ చూసుకుంటూ అమ్మ వారి గుడి దాటి ఇంటి వైపు మళ్ళింది.
రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఆమెను చూస్తూ ‘అరే, నువ్వా? నువ్వేనా?’ అంటూ సైకిల్ మీద అతను వెనక్కి తిరిగి చూస్తున్నాడు
ఆమె అలా ముందుకెళ్లేసరికి మరి కొంతమంది “చూడు! చూడు! చూడు!” అని మోచేతులతో పొడుచుకుంటున్నారు.
ఆమె మటుకు ఏమీ పట్టించుకోకుండా, ఎవరి వైపు చూడకుండా గబగబగా నడుచుకుంటూ ఒక సందులోకి వెళ్లి పాతగా ఉన్న పెంకుటింటిలోకి వెళ్ళింది. ఆ పాత పెంకుటిల్లు, ఎన్నో తరాల కథలను తన గోడల మధ్య దాచుకున్నట్లు నిశ్శబ్దంగా నిలబడి ఉంది. సూర్యకిరణాలు ఆ ఇంటి పెంకులపై నాట్యం చేస్తున్నా, లోపల చీకటి అలుముకుని ఉంది. తలుపులు చేరవేసి ఉన్నాయి. అవి తోసుకుంటూ సరాసరి వంటగదిలోకి వెళ్లి చెంబు ముంచుకుని మంచి నీళ్లు తాగింది. కొంతసేపు వంటగదిని కలయ చూస్తూ నిలబడిపోయింది.”
ఆ తరువాత అతి నెమ్మదిగా ఆ పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లి, అక్కడ శవంలా పడుకున్న మనిషి దగ్గరికి వెళ్లి, గోడకు చేరగిలబెట్టి, పక్క బట్టలు దులిపింది. వాలిపోతున్న మెడను నిలబెట్టి అతని మూతి నుంచి కారుతున్న చొంగను తుడిచి, ఒళ్లంతా పౌడర్ వేసింది. అతని వంటి మీద బట్టలు పక్కన గూడు లోంచి ఉతికినవి తొడిగింది.
ఆ మనిషిలో ఏ మాత్రం చలనం లేదు. కళ్ళైతే నమ్మలేనట్లు, ఆశ్చర్యంగా చూస్తున్నాయి.”.
కొంతసేపు మంచం కోడుని అనుకుని అలానే కూర్చొంది. డప్పులు మోత మరింత ఉదృతంగా వినిపిస్తోంది ప్రత్రి ఏడాది వచ్చే గ్రూప్ వచ్చారు. అందు లో ఇద్దరి గొంతుకలు చాల బాగుంటాయి. పాటకు అనుగుణంగా ఆమె పాదాలు తాళం వేస్తున్నాయి..
ఆ పాటలు చాలా ఇష్టం. దానితో పాటుగా వచ్చే డప్పుల వాయిద్యం అంటే మరీ మరీ ఇష్టం. అలాగే వింటూ ఉండిపోయింది. అప్పటి వరకు చిరాకు కలిగించిన ఆ డప్పుల శబ్దాలు, ఇప్పుడు ఆమె నరనరాల్లోకి ప్రవేశించి, ఒక తెలియని పరవశాన్ని నింపాయి.
తన వాస్తవిక అస్తిత్వాన్ని తాత్కాలికంగా కోల్పోయి, ఆమె ఆ కొత్త పాత్రలో పూర్తిగా లీనమైపోయింది.
ఆమె ప్రతి కదలికలో, ప్రతి చూపులో, ఎర్రొసంత యొక్క నిస్సహాయత, ఆమె అంకితభావం ప్రతిబింబించాయి.”
ఒక పది రోజులు ఊరంతా సందడిగా ఉంటుంది. మైకులు మార్మోగిపోతాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ చేరతారు
ఇంతలో తలుపు చప్పుడయింది, ఓ యువకుడు లోపలి వచ్చాడు విజిల్ వేసుకుంటూ, అతని గది లోకి వెళ్లి “బావ ఈ రోజు..” అంటూ జాతర విశేషాలు చెబుతున్నాడు. “బావా! ఇంకో సంగతి, అక్కడికి స్మైలీ పాప వస్తోంది. అదే ఆ మేళం వాళ్ళు. జాగ్రత్తగానే మేనేజ్ చేస్తారు. అబ్బా! తల్చుకుంటేనే…” అంటూ గుటకలు మింగాడు. “ఉండు బావ, నీళ్లు తాగొచ్చి మళ్ళీ చెబుతాను” అంటూ వంటగదిలోకి వచ్చి ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు.
అంతే, దెయ్యాన్ని చూసినట్లు రివ్వున పరిగెత్తి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ నది ఒడ్డున ఉన్న చెట్టు కింద కూర్చుని పేకాట ఆడుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. రొప్పుతూ, దమ్ము తీసుకుంటున్న అతన్ని చూస్తూ “ఏమిటిరా సూరిగా, ఏమయింది”.
“అదొచ్చింది తిరిగి”
“అదెవరు”
“ఎర్రొసంత(ఎఱ్ఱవసంత)”
“నదిలో పడి చచ్చింది అన్నారు కదురా? పైగా శవం కుళ్లిపోయిందని ఆనవాలు కూడా తెలియలేదన్నారు గా??”
“నా మాట నమ్మకపోతే రండి మా బావ ఇంటికి,” అంటూ అక్కడున్న అందరినీ బయల్దేరదీసాడు..
జెండాపై కపిరాజన్నట్లుగా అతను ముందు. ఆ వెనకాలే వాళ్ళందరూ గొడవ గొడవగా మాట్లాడుకుంటూ పోలోమని వెళుతున్నారు..
అలా వెళుతున్న వాళ్ళను చూసి మిగతావాళ్ళు విషయం ఏదీ తెలియకుండానే వాళ్లతో పాటు నడుస్తున్నారు.
అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఊరి పెద్దలు కూడా ఆ ఇంటి బాట పట్టారు
*
మాసిన పక్క బట్టలు, అతను వంటి నుంచి విడిచేసిన బట్టలు అన్నీ మూటగట్టి పెరట్లో ఉన్న నూతి దగ్గరకు తీసుకువెళ్లి, నాలుగు చేదలు తోడి, అక్కడున్న బకెట్టులో, సబ్బు పొడి వేసి నానబెట్టి, నూతి పళ్లెం, చీపురు తో తుడిచి, బట్టలు ఉతికి, శుభ్రంగా దులిపి అక్కడున్న తాళ్ళ మీద వేసింది. కొంతసేపు అలుపు తీర్చుకోవడానికి అక్కడే ఉన్న చిన్న రాయి మీద కూర్చుంది. వేప చెట్టు నుంచి వీస్తున్న గాలి, ఆమె అలసిన శరీరాన్ని నిమిరి, నిద్రలోకి జారుకుంది.
ఆ సుషుప్తిలో ఎంతసేపు ఉందో తెలియదు. ఆమె కళ్ళు తెరిచినా, చూస్తున్నది తన ప్రపంచం కాదు, ఒక తెలియని జ్ఞాపకాల సముద్రం.
గట్టిగట్టి గా మాటల తో పాటు అడుగులు చప్పుడు వినిపించి అటువైపుగా చూసింది. వచ్చిన వాళ్ళందరూ వింతగా ఆమెనే చూస్తున్నారు. “గోదాట్లో పడ్డది మళ్ళీ ఎలా బతికొచ్చిందో అంతుపట్టటం లేదు”.
“ఏమో కలికాలం అన్నీ ఇలాంటి చిత్రాలే జరుగుతున్నాయి” అని ఇంకొకళ్ళు
“అవునే అసలు అది ఎందుకు చచ్చింది”.
“ఏమీ లేదు. వాడికి మాట, కాళ్ళు, చేతులు పడిపోయాయి కదా, బతకడానికి ఏదో మార్గం. చిన్నప్పుడు ఏదో డాన్స్ వెలగబెట్టిందిట. వాడికి ఈ జబ్బు వచ్చాక రికార్డింగ్స్ డాన్స్ చేసి డబ్బు పట్టుకొచ్చేది. వయసులో ఉంది, పైగా అందగత్తె, ఏదో కక్కుర్తి పడింది అంటారు. కొంత మందేమో వాడు మంచం మీద ఉన్నా అనుమానం తో సాధించే వాడు, దానికి మనసు విరిగి చచ్చిందని చెప్పుకుంటారు” ..
“అసలు నిజం ఏమిటో ఆ పైన ఉన్న దేవుడికి, చచ్చిన దానికే తెలియాలి” అని తలో రకం మాటలు అనుకుంటున్నారు. ప్రతి గుసగుస, ఒక అగ్ని కణికలా వ్యాపించింది
ఎర్రొసంత అలా గే చేరబడి కూర్చుని, ఎదురుగా తలుపు లోంచి శవం లా మంచం మీద పడుకున్న అతని వైపే చూస్తోంది
**
హటాత్తుగా ప్రవీణ్‌కి గుర్తొచ్చింది. స్వాతి పార్క్ దగ్గర వాకింగ్ చేసింది. అక్కడ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అతనేమైనా చూసాడేమో అనుకుని అడిగాడు. ముందు తెలియదు అన్నాడు. కానీ, పది నిమిషాలు పోయాక “అవును, గుర్తొచ్చింది సార్! ఈ కాంపౌండ్ గోడ నానుకుని ఒక చిన్న దొంక దారి ఉంది. ఆ వెంబడి వెళితే ఒక ఊరు వస్తుంది. అక్కడ అమ్మవారి జాతర జరుగుతోంది. ఇందాక చాలా మంది వెళ్లడం చూసాను. వాళ్లతో ఏమైనా వెళ్ళారేమో చూడండి” అన్నాడు.”
అది విన్న ప్రవీణ్‌తో పాటు మిగతా వాళ్ళు కారు ఎక్కారు. సెక్యూరిటీ గార్డు చెప్పిన దారిలోనే వెళుతున్నారు. చాలా గతుకులున్నాయి. రెండు మూడు, మైళ్ళు, వెళ్ళాక అక్కడక్కడ ఇళ్ళు కనపడ సాగాయి, కొంచెం ముందుకు వెళ్లేసరికి స్పీకర్ లో పాటలు వినిపిస్తున్నాయి. అక్కడ హడావుడి గ ఉంది. “ఇక్కడ స్వాతి గురించి ఆచూకి ఏదైనా తెలుస్తుందేమో?అన్న ఆశతో ఓ పక్కగా ఆపుకుని దిగారు అక్కడ ఏదో ప్రోగ్రాం అవుతోంది చాలా మంది కుర్చీలలో కూర్చొన్నారు.
“ఇక్కడకి ఎవరైనా ఆడమనిషి వచ్చిందా”. తన పక్కనుంచి వెళుతున్న మనిషిని ఆపి అడిగాడు. మిగతావాళ్ళు, అతను ఏం చెబుతాడో అని ఆదుర్దాగా చూస్తున్నారు. అందరి మొహాల్లో స్పష్టంగా ఆందోళన కనిపిస్తోంది.
అతను ప్రవీణ్ ని ఓ సారి ఎగాదిగా చూసి “నువ్వు కూడా ఎఱ్ఱవసంత ను చూడటానికే వచ్చావా ? రా రా నేను కూడా అటే వెళుతున్నాను”.
“ఎఱ్ఱవసంత ఎవరూ?” అని ప్రశ్నించ బోయి, అతని వెనకాలే బయలుదేరాడు, ప్రవీణ్‌కి ఏమీ అర్థం కాలేదు, అయోమయంగా ఉంది.
మిగతా ముగ్గురూ అతన్ని అనుసరించారు. చిన్న చిన్న సందులు తిప్పుతూ ఓ ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు.
అక్కడ జనమంతా గుమిగూడి ఉన్నారు వాళ్ళను తోసుకుంటే ముందుకు వెళ్లి చూసారు చూశారు. అంతే, ఒక్క క్షణం మెదడు మొద్దు బారిపోయింది. అందరికీ ఏమి చేయాలో అర్థం కాలేదు. అక్కడ, జుట్టు రేగిపోయి, పాత ముతక చీర పైకి కట్టుకుని, చలనం లేకుండా పడుకున్న మనిషి కాళ్ళకి నూనె మర్దన చేస్తోంది.”
ఆమె దగ్గర గా వెళ్లి “స్వాతీ” అంటూ చేతిని పట్టుకోగానే, ఒక అపరిచిత స్పర్శ ఆమెను వెనక్కి నెట్టింది, అది తనది కానట్లు. ఓ సారి ప్రవీణ్ వైపు చూసి తల పక్కకు తిప్పేసింది. అతని కళ్ళలో బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది ఒక కలనా, ఒక భ్రమా, లేక ఒక అసాధారణ మానసిక స్థితా? ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న.
అక్కడకొచ్చిన అందరూ తలో మాట మాట్లాడుకుంటున్నారు. “నిజమే ఇది ఎర్రొసంత కాదు అదిగో వచ్చినాయన పెళ్ళాంట,” “టిప్ టాప్ గా ఉన్నారు, అవును గుర్తొచ్చింది ఊర్లోకి వస్తున్నప్పుడు, మంచి బట్టల్లో వచ్చింది. ఈ ముతక చీర తో కాదు” “అవును అప్పుడే అనుకున్నాను అది కాదని”
అన్ని వింటున్న ప్రవీణ్ నిట్టూర్చాడు . మిగతా ముగ్గురూ అతని దగ్గరగా వచ్చారు. ముందు స్వాతిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు.
“స్వాతి రా” ప్రవీణ్ ఆమె చెయ్యి పట్టి లేపాడు. ఆ చేతిని పట్టుకోగానే, ఒక అపరిచిత స్పర్శ ఆమెను వెనక్కి నెట్టింది, అది తనని కానట్లు ఆ చెయ్యి విదిలించుకుని మంచం కోడు పట్టుకుని కూర్చుండి పోయింది.
ఈ లోపల సమీర్, రేష్మా, ప్రవీణ్ చెవి లో “ప్రవీణ్, తను ఒక ఊహాలోకంలో ఉంది. తన నిజమైన గుర్తింపును, తనకు నచ్చని విషయాలను గుర్తు చేస్తేనే బయటపడుతుంది. ప్రస్తుతం మనం కొద్దిగా నిద్ర మాత్రలు కూల్ డ్రింక్ లో కలిపి ఇద్దాము, ఎఱ్ఱ వసంత అదంటే ఇష్టం అని. సూరి చెప్పాడు కదా, అతన్నే ఇమ్మని చెబుదాము.
అరగంట పోయాక సూరిగాడు కూల్ డ్రింక్స్ తెచ్చి “హే వసంతా, నీకు ఇష్టమని ఈ కూల్ డ్రింక్ తెచ్చాను, ఇదిగో తాగు” అంటూ ఇచ్చాడు. అంది అందుకుని తాగింది ఎఱ్ఱవసంత/స్వాతి .
వంశీ కారులో సిద్ధంగా కూర్చుని ఉన్నాడు.
*
అంత వరకు ఆ ఇంటి మీద ఉన్న కాకి ‘కావు కావు’ మంటూ ఎగిరి పోయింది. ఒక కలనుంచి మరో కలలోకి ప్రస్థానం…. మళ్ళి మళ్ళి అంకురించే జీవం లాంటిది ఈ పునరుత్తేజం. జీవితం… ఓ అసాధారణ స్వప్నం.
*
కారు స్పీకర్ లోంచి ఈ మథ్య బాగా పాపులర్ అయిన తెలుగు పాట వింటూ డ్రైవ్ చేస్తున్నాడు, మిగతా ముగ్గురూ కూడా గట్టి గట్టిగా పాటతో పాటూ కలిపి పాడేస్తున్నారు. స్నేహితుల మాటలు , తన పేరు, తన ప్రపంచం… ఇవన్నీ ఆమె మనసులో ఒక అదృశ్య తలుపును తెరిచాయి. ఆమె చెవులకు చిరాకు కలిగించిన ఆ పాట, తనను తన వాస్తవికతకు తిరిగి తీసుకువచ్చే ఒక గంటలా మోగింది.”
“అబ్బా” అంటూ చెవులు గట్టిగా మూసుకుంది స్వాతి
“మళ్ళీ పెట్టారా ఆ పాటలు, కాస్త హాయిగా పడుకోనివ్వండి” అని నిద్రాభంగం అయినందుకు విసుక్కుంది స్వాతి.
*
మణి వడ్లమాని
Add comment