రెక్వియమ్ ఫర్ ఏ డ్రీం

లివ్ ఇన్ ది మొమెంట్. ఇప్పుడు ఇక్కడున్న ఈ క్షణం మాత్రమే నిజం. గతం గడిచిపోయింది. భవిషత్తు ఉందో లేదో తెలియని ఒక మిస్టరీ – ఇలా అని చెప్పుకుంటూ మనసుని సమాధానపరుచుకోవడం ఒక్కోసారి సాధ్యమవుతుంది. కానీ మనలోని కొంత భాగం ఎప్పుడూ భవిష్యత్తులోకి ప్రయాణిస్తూ, ముందున్న మన జీవితం ఎలా ఉండబోతుందో అనే ఆలోచనని మనలో రూపుదిద్దుతూ ఉంటుంది. కానీ అలాంటి ఆలోచన హఠాత్తుగా ఆగిపోతే మనలోని ఆ భాగం శూన్యమైపోతుంది.

నాలోని ఒక భాగం శూన్యమైపోయినరోజు ఇది.

కన్నా!! ఇదంతా ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది. కానీ ఇదంతా విని అర్థం చేసుకునే ప్రపంచం ఇంకా సృష్టించబడలేదు. అందుకే ఈ కథ నీకే చెప్తున్నారా!

మేము మొత్తం ప్లాన్ చేసుకున్నాం.

నీకేం పేరు పెట్టాలి?

అమ్మాయైతే జగతి. అబ్బాయైతే భువన్.

అంతకంటే మంచిపేర్లు ఉండవనే మా నమ్మకం. అనిర్వచనీయమైన మా అనుభూతిని, ఈ విశ్వమంత సంతోషాన్ని ఆ పేర్లే కరెక్ట్ గా సూచిస్తాయని మాకనిపించింది.

నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చెయ్యాలి?

బాధ్యతలు ఇద్దరి మధ్యా పంచుకున్నాం. ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి కాబట్టి ఈ పంచుకోవడం తప్పదు. అలా కాకపోయినా ఈక్వల్ పార్టనర్షిప్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ – ఇదే మా జీవితభాగస్వామ్యంలో మొదటి సూత్రం.

’పిల్లల పెంపకంలో మెళకువలు’ పుస్తకం కూడా కొన్నాం.

కానీ ఇప్పుడిలా జరుగుతుందంటే నమ్మకం కలగడం లేదు.

హరీష్ చాలా ఎక్కువ హోప్స్ పెట్టేసుకున్నాడు. వాళ్ల ఇంట్లో వాళ్లకి కూడా చెప్పేశాడు.

అందరూ ఏమనుకున్నా ఫర్వాలేదు రా! నాకు ఒక మనవడు కావాలి అనేవాడు హరీష్ వాళ్ల నాన్న.

అంకుల్, మనవడని గ్యారెంటీగా చెప్పలేము. మనవరాలు కూడా అవ్వొచ్చేమో! కానీ మీ కోరిక మాత్రం త్వరలో తీరుస్తాం అని నేనే చాలా సార్లు చెప్పాను.

ఈ మధ్య హరీష్ అడుగుతూనే ఉన్నాడు – మన బుడ్డోడి గురించి కొత్త అప్ డేట్స్ ఏమీ లేవా? రోజూ తెగ చెప్పేస్తుంటావుగా- అది చేద్దాం ఇది చేద్దాం అని.

ఎందుకు బుడ్డోడు అంటావు. బుడ్డది కూడా అయ్యుండొచ్చు, లేదంటే…,

ఆపు ఇంక. నీతో మాట్లాడ్డం కష్టం, అన్నింటిలో పొలిటికల్ యాంగిల్ చూస్తావు నువ్వు అనేవాడు హరీష్.

మన సంగతి తెలిసికూడా నువ్విలా మాట్లాడకూడదు హరీష్ అని కోపం తెచ్చుకున్నట్టు నేను గట్టిగా మాట్లాడితే, సారీ సారీ యాక్టివిస్ట్ గారూ! నా సంగతి తెలుసు కదా! నీలాగా ప్రపంచం తెలిసిన వాడ్ని కాదు. క్షమించు అని నన్ను ఐస్ చేసేస్తాడు.

హరీష్ కి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక, ఆలోచించి తల వేడెక్కిపోయింది.

హరీష్ గురించే కాదు నా బాధ. ప్రత్యూష గురించి కూడా!

ప్రత్యూష ఈ బాధంతా ఎలా భరిస్తుందో?

నాకింకా నమ్మకం ఉంది. ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ మినిట్ అంటుంటే పదహారేళ్ల ఆ పిల్ల ఎంతో పెద్దదానిలా కనిపించింది. కానీ మనమంతా ఎంత పోరాడినా, పోరాడాల్సిన వాళ్లు ఇంకెవరో ఉన్నారు. మన చేతుల్లో ఏం లేదు ప్రత్యూషా అని చెప్దామనిపించింది. కానీ డాక్టర్ సింధు కూడా ఒక వన్ వీక్ టైం ఇచ్చి చూద్దాం అన్నారు.

సింధు చెప్పిన ఆ మాట లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టనెల్ లాగా అనిపించినా నాకెందుకో చుట్టూ చీకటి ముసురుకుంటున్న ఫీలింగ్!

సింధు! ఏంటి పరిస్థితి? అని అడిగాను, వారం రోజుల తర్వాత ప్రత్యూషని చెకప్ కి తీసుకొచ్చినప్పుడు.

కొంచెం వెయిట్ చెయ్యాలి. కొన్ని టెస్ట్స్ చేస్తున్నాను అంది సింధు.

నేను దేవుడ్ని ఎప్పుడూ పెద్దగా నమ్మలేదు – చాలామందిలాగే అత్యవసరం అయినప్పుడూ తప్పితే! ఏ తప్పూ చెయ్యనప్పటికీ మనుషుల్ని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టిన దేవుడి మీద కోపమొస్తుంది. మా తప్పేం లేదు. ఇదంతా నువ్వే చేస్తున్నావని గట్టిగా తిట్టాలనిపిస్తుంది. కానీ దేవుడు ఏమనుకుంటాడో, ఇంకా ఎక్కువ కష్టాల్లోకి తోస్తాడేమోనని భయం. అందుకే మనసులోనే, దేవుడా దయచేసి ఇదొక్క అపాయాన్నుంచి బయటపడెయ్యి అని వేడుకుంటున్నాను.

నమ్మకంలేని భక్తి!

నిజమైన నమ్మకం ఉన్నవాళ్లకైనా కనీసం సహాయం చేస్తున్నాడా ఈ దేవుడు. ఏమో నిజమైన నమ్మకం ఉన్నవాళ్లనడిగితే కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. నిజానికి మనసులో అందరూ నాలాగే నమ్మీ నమ్మని భక్తి కలవాళ్లేమో! అందుకే దేవుడు మనుషులందరికీ ఈ పరీక్షలు పెడ్తున్నాడేమో!

హరీష్ నాలాగా కాదు.

వాడికి దేవుడంటే చాలా నమ్మకం. వాళ్లింట్లో వాళ్లు చిన్నప్పట్నుంచీ నేర్పించిన భక్తి. మనిద్దరం కలిసుండాలంటే నువ్వు నాతోపాటు ప్రతి గురువారం గుడికి రావాలని హరీష్ కండిషన్. నేను నీతో కలిసుండాలంటే ఇంట్లో దేవుడు బొమ్మలుండకూడదని నా కండిషన్. ఇద్దరం ఒప్పుకున్నాం. కానీ అప్పుడప్పుడూ పండగరోజుల్లోనో, వర్షాకాలంలో గుడికి వెళ్లలేనప్పుడో పర్స్ లోపలెక్కడో దాచిపెట్టుకున్న దేవుడి బొమ్మ తీసి పూజ చేస్తాడు హరీష్.

రూల్స్ కి వ్యతిరేకమైనా ఒక్కోసారి తప్పదు.

ఇప్పుడు నాలాగా!

దేవుడా అని గట్టిగా అరవాలనుంది.

ఎన్ని కలలు కన్నాం!

ఇదొక్కసారికి అంతా మంచే జరిగేలా చూడు. నేను, హరీష్ తిరుపతికొచ్చి గుండుకొట్టించుకుంటాం.

కళ్లు మూసుకుని నిజాయితీగానే మొక్కుకున్నాను. అలా కళ్లు మూసుకుని ఎంతసేపున్నానో కూడా తెలియదు.

భరత్! భరత్!

కలలో ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది. కళ్లు తెరవాలనే ఉంది. కానీ రెప్పలు విడివడటం లేదు.

ఐ యాం సారీ భరత్ అంది సింధు.

కష్టంగా లేచి నిలబడ్డాను.

ఇంక వేరే దారిలేదు. వియ్ హావ్ టు అబార్ట్! ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. అల్ట్రాసౌండ్ చేశాం. ఫీట్, హ్యాండ్స్, హార్ట్ ఆన్నీ బానే ఫార్మ్ అయ్యాయి. బట్ ది బ్రెయిన్. ఇట్స్ మిస్సింగ్. ఇది అంత కామన్ ప్రాబ్లం కాదు. బట్ ఇలాంటి కేసెస్ నేను ఇంతకుముందు కొన్ని చూశాను. అందుకే నేను ఈసారి తప్పకుండా చెప్పగలుగుతున్నాను.

బట్ వై సింధూ! నీకు తెలుసు ఇది మాకు ఎంత ఇంపార్టెంటో!

ఐ నో భరత్. కానీ మనం చెయ్యగలిగింది ఏం లేదు. ఈ రకమైన న్యూరల్ ట్యూబ్ లోపాలు చాలా రేర్. కానీ మరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని కూడా చెప్పలేం. వెయ్యిలో ఒకటి ఇలాంటి కేసెస్ వస్తుంటాయి. మాకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. న్యూరల్ ట్యూబ్ సరిగ్గా క్లోజ్ అవదు. అది క్లోజ్ అవ్వకపోతే తలవెనుక భాగం సరిగ్గా ఏర్పడదు. లాస్ట్ వీకే నాకు డౌట్ గా అనిపించింది. కానీ మీ కండిషన్ తెలుసుకాబట్టి ఐ వాంటెడ్ టు టేక్ ఏ ఛాన్స్.

నో, అని గట్టిగా అరవాలనిపించింది.

హరీష్ ఇక్కడ ఉండుంటే వాడు ఏడ్చి గోల చేసి పెద్ద డ్రామా చేసుండేవాడు.

ఐ యాం సారీ భరత్ అంది సింధు.

ఇట్స్ ఓకే సింధు, నువ్వేం చేయగలవు? కానీ హరీష్ కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. అదే నాకు పెద్ద వర్రీ!

నాకు తెలుసు. స్కూల్ లో కూడా ప్రతి దానికీ ఏడ్చేసేవాడు. అందరం వాడిని క్రై బేబీ అని ఏడిపించేవాళ్లం. కానీ వాడు ఎంత సెన్సిటివో నాకు స్కూల్లో ఉన్నప్పుడు తెలియదు. మొన్న ప్రత్యూషని హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు వాడు ఏడుస్తూనే ఉన్నాడు. హాస్పిటల్లో స్టాఫ్ అంతా హరీష్ ని ప్రత్యూష అన్నయ్యేమో అనుకున్నారు. తర్వాత అసలు వాళ్లిద్దరికీ ఏ సంబంధం లేదని తెలిసి ఆశ్చర్యపోయారు. బట్ ఈ టైంలో నువ్వే వాడికి ధైర్యం చెప్పాలి. వాడికి ఆల్రెడీ డౌట్ వచ్చింది. నాకు టూ థ్రీ టైమ్స్ ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాను. కావాలంటే నేను కూడా వస్తాను. ఎలాగో వాడికి స్మూత్ గా ఈ విషయం చెప్పాలి, టైం చూసుకుంటూ అంది సింధు.

సరే మనం ప్లాన్ చేసి చెప్దాం అన్నాను.

ఒకే భరత్ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, నేను నీకు ఫోన్ చేస్తాను అని అక్కడ్నుంచి వెళ్లిపోయింది సింధు.

సింధూ అని పిలిచాను.వెళ్తున్న ఆమె ఆగి వెనక్కి తిరిగింది.

నేను ప్రత్యూషని చూడొచ్చా? అడిగాను.

వెళ్ళొచ్చు. వాళ్ల పేరెంట్స్ కూడా ఉన్నారు. తను కూడా షాక్ లో ఉంది. నువ్వే కన్సోల్ చెయ్యాలి.

మీ అమ్మని చూడ్డానికి నేను లోపలకి నడిచాను.

మా జీవితంలోకి వెలుగులా వచ్చింది మీ అమ్మ.

ప్రత్యూష!

ఆ పేరులోనే వెలుగు ఉంది. కానీ ఆమె కళ్లనిండా చీకటి నింపుకుని ఉంది అప్పటికే!

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. క్లాస్ మేట్ తో లవ్ ఎఫైర్.

తను గర్భవతి అని తెలియడానికి కొంత సమయం పట్టింది. కానీ ఆ విషయం ఇంకెవరికైనా చెప్పుకోడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టింది.

ఒక వైపు భయం. మరో వైపు బాధ.

బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది. అతనిక్కూడా ఏం చెయ్యాలో తెలియలేదు. ఏడ్చేశాడు. ఎవరికీ చెప్పొద్దు అని ఇంకొన్ని రోజులు సాగదీశాడు.

ఈ విషయంలో వాళ్ళని తప్పుబట్టి ప్రయోజనం లేదు. మన వ్యవస్థ అలా ఉంది. సెక్స్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, వయసులో కలిగే లైంగిక ఆకర్షణలు గురించి కానీ పిల్లలతో మాట్లాడ్డం ఇంకా పెద్ద తప్పుగానే చూస్తుంది సమాజం. అందుకే పిల్లలకి అదేదో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి తప్పులు జరుగుతుంటాయి.

మీ అమ్మ విషయంలో కూడా అదే జరిగింది. తెలియనితనంతో చేసిన తప్పు తనకి ఒక సమస్యగా మారింది. అవగాహన లేకపోవడంతో ఎవరితో చెప్పాలో కూడా తెలియక సతమయింది. పోని ఇంట్లో చెప్పాలన్నా, తనది మామూలు మధ్యతరగతి కుటుంబం. ఇలాంటి విషయాలు చెప్తే అర్థం చేసుకుంటారో లేదో ప్రత్యూషకి తెలియదు. అందుకే ఐదో నెల వచ్చినా కూడా ఎవరికీ చెప్పకుండానే దాస్తూ వచ్చింది.చివరికి ఏం చెయ్యాలో తెలియక తన క్లాస్ మేట్ ఒకమ్మాయికి చెప్పుకుంది.

తనుండే ఏరియాలోనే ఉండడం వల్ల ఆ ఆమ్మాయి రోజూచదువుకోడానికి  ప్రత్యూష ఇంటికి వచ్చేది. వాళ్లిద్దరూ చదువుకోవడం తక్కువ, గుసగుసలాడుకోవడం ఎక్కువ అయింది. అది గమనించిన ప్రత్యూష తల్లికి ఏదో జరుగుతోందన్న విషయం అర్థమై ప్రత్యూష ను నిలదీసింది.

ప్రత్యూషకి చెప్పక తప్పలేదు. ఆమె ఊహించినట్టుగానే ఇంట్లో పెద్ద గొడవే జరిగింది.అందరిలాగే అబార్షన్ చేపిద్దామని అనుకున్నారు.హాస్పిటల్ కి తీసుకొచ్చారు. గైనకాలజిస్ట్ సింధుని కలిశారు.

ప్రత్యూష తల్లిదండ్రులు చెప్పిందంతా విని సింధు కూడా అబార్షన్ చేయిందుకోవడం మంచిదేమో అనుకుంది.పదహారేళ్ల పిల్ల అప్పుడే తల్లైపోయి జీవితభారాన్ని మొయ్యాలా? అనుకుంది. ఐదో నెలలో ఉంది. లీగల్ గా ట్రబుల్స్ ఉండకపోవచ్చు. కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు అందుకే సింధు కి ఎందుకో మనసొప్పలేదు. ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చింది.

నన్నూ, హరీష్ ని కూర్చోబెట్టి జరిగిన విషయమంతా చెప్పింది.

భరత్, ఇది మీకు సంబంధం లేని విషయం. కానీ మీకు ఇది ఒక అవకాశం. నీకూ, హరీష్ కి పిల్లలు పుట్టే అవకాశం ఎలాగూ లేదు. కానీ మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ప్రత్యూష అని ఒక అమ్మాయి మా హాస్పిటల్ లో అడ్మిట్అయ్యింది. అబార్షన్ కోసం. కానీ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అందుకే నాకొక ఐడియా వచ్చింది. మీరు ప్రత్యూషకి పుట్టే బిడ్డను అడాప్ట్ చేసుకుంటానంటే నేను వాళ్లకి అర్థమయ్యేలా చెప్పగలను. అంత ఈజీ కాదు కన్విన్స్ చెయ్యడం. లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కానీ మీకు ఓకే అనుకుంటే మనం లాయర్ ని కూడా కన్సల్ట్ చెయ్యొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను అబార్షన్ చెయ్యనంటే ఇంకొక దగ్గరకెళ్లి చేపించుకుంటారు. కానీ అది ప్రత్యూషకి మంచిది కాదు. సో… మీరు ఈ విషయంలో ఏదో ఒకటి ఆలోచించుకుని చెప్తే మనం ప్రత్యూష పేరెంట్స్ తో కూర్చుని మాట్లాడొచ్చు, చెప్పింది సింధు.

ఈ విషయం వినగానే నాకంటే హరీష్ చాలా ఎక్సైట్ అయ్యాడు.

నాకూ పిల్లలు కావాలని ఉంది. కానీ నన్నూ, హరీష్ నే లోకం ఇంకా ఒక జంటగా ఒప్పుకోలేదు. మేము గే కపుల్ అని తెలిసిన వెంటనే ఎదుటివాళ్ల మొహంలో మొదట కనిపించే ఫీలింగ్ చూస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సుప్రీం కోర్ట్ గే రిలేషన్ షిప్ నేరం కాదని చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు లేరు.

మాలాంటి వాళ్లంటే లోకానికి చిన్నచూపు. అసహ్యం.

నీకో విషయం చెప్పనా?

శతాబ్దాలుగా మాపై కురిపించిన ద్వేషంతో కప్పబడి రహస్యంగా సాగుతున్న మా జీవితాలు ఇప్పుడే కొత్త వెలుగు చూస్తున్నాయి.కానీ అది గుడ్డి దీపపు వెలుగే.

ఆ గుడ్డి దీపపు కాంతికూడా మాకు మిగలనివ్వకుండా ఎప్పుడూ ఏదో ఒక్క వెక్కిరింతలతో ఈ లోకం మమ్మల్ని చీకట్లోకి నెట్టేస్తుంది.

ఇప్పుడు ఈ విషయం హరీష్ కి చెప్తే వాడు కుప్పకూలిపోతాడు. అయినా తప్పదు. ఇది వాడికి తెలిసి తీరాల్సిన విషయమే!

ఫోన్ చేశాను. మేము మొదటిసారి కలిసిన పార్క్ కి రమ్మని ఫోన్ చేశాను.

___

ఇప్పుడు సమయం సాయంత్రం నాలుగున్నరవుతోంది.

ఇది హైదరాబాద్ అనే మహానగరం.

ఇక్కడ అందరూ నాగరికులు.

హరీష్ చేతిలో చెయ్యేసి నేను నడుస్తున్నాను.

కన్నా ఇదంతా వాడికి చెప్పడం అంత తేలిక కాదని నాకు తెలుసు కానీ చెప్పక తప్పలేదు.

చెప్పేశాను.

నువ్వు ఇంక రావని తెలిసి తట్టుకోలేకపోయాడు. చంటి పిల్లాడిలా గుక్క పెట్టి ఏడ్చేసాడు. తనని దగ్గరకి తీసుకుని ఓదార్చడం కంటే నేనేం చెయ్యగలను.

మేమిద్దరం మగవాళ్లం. కానీ మేము జీవిత భాగస్వాములం.

అలా కౌగలించుకుని కూర్చున్నంతసేపు జనాల వింత చూపులు మమ్మల్ని కాల్చేస్తునే ఉన్నాయి. మా వైఖరిని ఆక్షేపిస్తూ వందల కళ్ళు మా వైపే చూస్తున్నాయి. కొన్ని చూపులు మా వైపు చూస్తూ సవాళ్లు విస్తుర్తున్నాయి. కొన్ని జుగుప్సతో నిండిన చూపులు. ఈ చూపులన్నింటి మధ్య దయతో నిండిన ఒక్క చూపు కనిపియ్యదు.

తుపాకీలు ఎక్కుపెట్టిన సైన్యానికి ఎదురుగా నిల్చున్న చివరికి సైనికుల్లా మేము ముందుకు నడుస్తున్నాం.

అక్కడున్న ఆ పెద్దమనిషి మా వైపు కోపంగా చూస్తున్నాడు. అతను భార్యని జీవితాంతం హింసిస్తూనే ఉన్నాడు. అతనికి ఈ సమాజంలో ఒప్పుకోలు ఉంది.

షార్ట్ హెయిర్ తో వేగంగా నడుస్తూ, పక్కనున్నావిడకి మమ్మల్ని చూపించి చీదరింపుగా వెళ్లిపోతుందే, ఆవిడ కోడల్ని కట్నం కోసం హింసించి చంపేసింది. ఆమెతో ఈ సమాజానికి ఏ సమస్యాలేదు.

మెడలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని స్టైల్ గా జాగింగ్ చేస్తున్నాడే! వాడు రోజూ అమ్మాయిలను న్యూడ్ ఫోటోస్ పంపించమని వేధిస్తూ ఉంటాడు.

అక్కడ యోగా చేస్తూ ప్రశాంతంగా కూర్చున్న ఆమెను చూశావా? టీచర్! క్లాస్ లో స్టూడెంట్ ఆమె కులం కాకపోతే మార్కులు తక్కువేస్తుంది.

ఆ తప్పులు ఎవరికీ తెలియవు. తెలిసినా అలాంటి వాళ్ల గురించి సమాజానికి ఏ సమస్యా లేదు.

వీళ్ళందరినీ గమనించాడో లేదో తెలీదు కానీ ఏడుస్తున్న వాడల్లా లేచి తల ఎత్తి అందరినీ చూసాడు హరీష్.

మన బంధమే ప్రశ్నార్థకంగా మారిన ఈ సమాజంలోకి ఆ బిడ్డ రాకపోవడమే మంచిదిలే!! అని కళ్ళు తుడుచుకున్నాడు.

వాడి మాటల్లో అర్థం ఉంది. చుట్టూ ఎటు చూసినా అన్ని రకాల పాపాలు, మోసాలు చేస్తున్నవాళ్లే! కానీ వీళ్లందరికీ మా స్వలింగసంపర్కం అతి పెద్ద నేరం.

ఈ హిపోక్రసీని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు కన్నా!

బహుశా అందుకే నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఉండవు. నువ్వే వచ్చుంటే మా జీవితంలో చెప్పలేనంత కాంతి నిండుండేది. నువ్వు లేకపోయినా మా జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక భాగమే. అందుకే కన్నా, భగ్నమైన మా కలకు నేను రాసుకుంటున్న గీతం ఇది.

చిక్కని చీకటిలో తళుకుమంటూ మెరిసిన మాయే అయినప్పటికీ

మాకీ అందమైన స్వప్నాన్ని చూపించినందుకు నీకు ధన్యవాదాలు

అసాధ్యమనుకున్నది సాధ్యమని కళ్లముందు కాసేపైనా నిజం చేసినందుకు

మాకీ మధురమైన స్వప్నాన్ని చూపించినందుకు నీకు ధన్యవాదాలు

ఇప్పుడు ఇది నిజం కానప్పటికీ ఇక ముందు కాకుండా పోదని

మాకీ సంతోషకరమైన స్వప్నాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

లక్ష్మీ ప్రియాంక

మాది సత్తుపల్లి . ఎం.టెక్ చేసి TCS లో కొంతకాలం పనిచేసి రిజైన్ చేశాను. చిన్నతనం నుండి తెలుగు భాష మీద ఉన్న ఇష్టం కొద్దీ చదవటం మొదలుపెట్టిన నేను ప్రస్తుతం సినిమాలకు పాటలు రాస్తున్నాను. ఏ భావాన్నైనా కళల రూపంలో నలుగురికి అర్ధమయ్యేలా చెప్పటం సులువని నమ్ముతూ నా ఆలోచనలను అటు కధల రూపంలో, ఇటు బొమ్మల రూపంలో (డూడుల్స్) మలిచే ప్రయత్నం చేస్తున్నాను.
నన్ను , నా ఇష్టాలను గౌరవించే తల్లిదండ్రులు , ఎల్లప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు దొరకటం నా అదృష్టం.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావుంది కథ. కొత్తగా కూడా ఉంది. రెండో సారి చదివినపుడు ఇంకా నచ్చింది. మీరు రాసిన ఇంకో కథ కూడా చదివాను. కంగ్రాట్స్ అండీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు