రెక్కలు మొలవక ముందు మా కథ

చీకటంటే నాకు భయం. చీకటి రాత్రంటే ఒళ్ళంతా పాములు పాకుతున్న కంపరం. సాయంకాలం సంధ్య వాలిపోయి, ఆకాశం చీకటి పరదా చుట్టుకున్నప్పుడు నా మనసు కూడా దిగులుతో కూడిన భయంతో లుంగలు చుట్టుకుపోతుంది. అంబరాన చుక్కలు మిలమిలమన్నా, వెన్నెల పిండారబోసినా నాకేమీ పట్టకుండా పోయింది. నేను కోరుకునేదల్లా నేనీ చీకటిరాత్రి ఇక్కడ మాయమైపోయి, మళ్ళా ఉదయానికి ప్రత్యక్షమవాలి లేదా ఎవరైనా ఏదైనా చేసి ఈ రాత్రిని మాయం చేసి ఎప్పుడూ చీకటి లేని పగలే వుండేలా చేయాలి. రాత్రంటే నాకు కేవలం పేద్ద కొండచిలువ నోటిలోని భయంకర చీకటి కుహరం..అవును.. ఊపిరాడకుండా చుట్టేసుకొని నా మనసుని, నా ఒంటి ఎముకలని నుజ్జునుజ్జు చేసే కొండచిలువే..ఆ కొండచిలువ పేరు నరసింహారావు..నాకు బలవంతాన అయిన మొగుడు..

అతను..ఆ నరసింహారావు బయట ఎక్కువగా ఎవరితో మాట్లాడడు. చూడడానికి బలే మెత్తటి పాములా వుంటాడు.ఇంటి బయట సైకిల్ రిపేర్ షాపులో కూర్చుని, ఎప్పుడు చూసినా ఏదొక రిపేరు చేస్తా కనిపిస్తాడు. గ్రీసు మరకలున్న ఫ్యాంటు, చెమట వాసనతో నలిగిన చొక్కా, సన్నటి రివట లాంటి చామనచాయ శరీరం, చేతుల మీద పైకి తేలిన నరాలు, ముదురు మొకం, బుర్రమీసాల కింద దాగున్న పెదాల మధ్యలో నిప్పు ఆరని సిగరెట్టు, పెద్ద పెద్ద మొటిమలు వచ్చి తగ్గిపోయి, గుంటలు పడి లోపలికి పీల్చుకుపోయిన బుగ్గలు, నూనె పెట్టి పైకి దువ్వి నిగుడుకున్న నలుపు తెలుపు జుట్టు, మెడ వెనుక జారే చెమట జిడ్డుచారికలు.. ముఖ్యంగా ఎర్రటి నిప్పుల్లా వుండే జీవం లేని అతని కళ్ళు..అతన్ని ఒకసారి చూసినవారు మర్చిపోరు.అతనికి బయట స్నేహితులు ఎవరూ లేరు.లేదా అతనికి స్నేహితులుగా ఎవరూ వుండలేరు. అతని బంధువులు కూడా ఎవరూ ఇంటికి పెద్దగా రారు. వచ్చినా ఎక్కువ సేపు ఉండరు. మా బంధువులూ ఎవరూ రారు. వచ్చినా అతను పట్టించుకోడు. మాట్లాడడు. కానీ ఎప్పుడు వెళతారా అని ఈయన కాచుకుని కూర్చున్నాడా అన్న భావన వాళ్ళకి కల్పిస్తాడు. అతని తల్లికి ఇది మినహాయింపు. కానీ ఆవిడ ఈ ఇంటికి రాదు. అతనే వాళ్ళమ్మ ఇంటికి వెళతాడు.

అతని అమ్మ మా నాన్నకి దూరపు చుట్టం. వరసకి అక్క అవుతుంది. ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు చలాకీగా లేడిపిల్లలా అటూఇటూ తిరుగుతున్న నన్ను చూసి కళ్ళల్లో వేసుకుందంట. కొడుకు నరసింహారావుకి కట్టబెడితే బావుంటందని అనేసుకుందంట. ఇంకేముంది..వెంటనే మా నాన్నకొచ్చి చెపితే నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అన్నాడంట.

ఈ పెళ్ళి నాకిష్టం లేదన్నాను. ఎందుకనని అడిగితే నాకిష్టమైన రాఘవ గురించి చెప్పాను. మా ప్రేమ గురించి చెప్పాను.“ ప్రేమంట ప్రేమ..ఇంటర్మీడియట్ చదివే పిల్లకి ప్రేమేందే ? ఒళ్ళు బలుపు కాకపోతే..” అనేసాడు నాన్న.”కట్నకానుకలు వద్దనే అయినోళ్ళ సంబంధాలు కాలదన్నుకుంటామా..”అని పాయింటు తీసాడు.”అయినా ఆ అబ్బాయిది మన కులం కాదని” నా అంగీకారాన్ని అదార్టీగా కొట్టేశాడు. ఎంతగా చెప్పి చూసినా నా ఆక్రోశం వాళ్ళని తాకనేలేదు. నా కన్నీళ్ళు వాళ్ళని కరిగించలేదు. నన్ను ‘బాగా చూసుకునే’ ఒక అయ్య చేతిలో పెడుతున్నామన్నారు. ‘పిల్ల ముండవి..నీకేం తెలుసే’ అన్నారు. నా వేదనలు రోదనల మధ్య, నవ్వుతూ నన్ను బలవంతంగా, విజయవంతంగా నరసింహారావుకు కట్టేశారు.

“అంతలా ఏం నచ్చిందే వాడిలో నీకు..” అమ్మ దీర్ఘం తీసి అడుగుతుంది. ఎందుకు నచ్చాడంటే ఏం చెప్పాలి ? ఏం చెబితే..ఎలా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది ?

‘అతని సమక్షంలో నేను నాలా వుంటాను. ఏ బాదరబందీ లేకుండా వుంటాను.అతని దగ్గర నుంచి తీగలు సాగే ఒక నిశ్శబ్ద మధుర సంగీతం వినిపిస్తూ వుంటుంది. అప్పుడు నేనొక సీతాకోకలా రెక్కలు విప్పి ఎగురుతాను. తుమ్మెదలా ప్రతి పువ్వు మీదా వాలతాను. నెమలిలాగా పింఛం విప్పి హాయిగా విహరిస్తాను. లేగదూడలా చెంగుచెంగున గంతులేస్తాను. తూనీగలా ఇంతింత కళ్ళేసుకొని లోకాన్నంతా కళ్ళల్లో వేలాడదీసుకుంటాను. పికిలి పిట్టలా చెట్టు మీద కూర్చొని గొంతెత్తి పాడతాను. రాయంచలా అలా హొయలు పోతూ చెరువులో ఈదుతాను. అతను కళ్ళు విప్పార్చి ఆరాధనగా, ఆశ్చర్యంగా నన్ను ఒళ్ళు మరిచి చూస్తూ ఉండిపోవడం నాకు బాగుంటుంది. అతనేమీ అనకపోయినా అతని మొకమంతా నిండిపోయి వెలుగుతున్న ప్రేమభావం నన్ను వల వేసి అతని వైపు లాక్కుంటుందని చెపితే వాళ్ళకు అర్థమవుతుందా? ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఆ ఇద్దరి జీవితాలను చివరికంటా నిలబెడుతుందని చెపితే వాళ్ళకు అర్థమవుతుందా?’

ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అంతా అయిపోయింది.ఊహించుకున్న ఊహల సౌధాలు కూలిపోయాయి. కల్పించుకున్న కమ్మని కలలు కాలి బూడిదయ్యాయి. రాఘవ రమ్మన్నప్పుడు వెళ్ళిపోయినా బాగుండు.ఎగిరిపోయినా బాగుండు. అమ్మ నుంచి సంక్రమించిన పిరికి జన్యువులు నన్ను కదలనీయలేదు. అందుకే..నాకు శిక్ష పడింది. జీవితకాల శిక్ష..

****    ****    ****   ****    ****

మొదటి రాత్రే నాకు చీకటి రాత్రయింది. నా శరీరాన్ని అతను చీలికలు పేలికలు చేసిన.. చీకటంటే నేను నిలువెల్లా చీదరించుకునేలా చేసిన రాత్రయింది. ఒళ్ళంతా జలదరించేలా చేసిన రాత్రయింది. నాలో నన్ను ముడుచుకు పోయేలా చేసిన రాత్రయింది. ఆ తర్వాత ఏం చేయలేక, ఎదిరించలేక చీకటి రాత్రుల ముళ్ళకు నా శరీరాన్ని వేలాడదీసేసాను. జీవం లేని నా ఒంటిని చీకటి చేసే అత్యాచారానికి అప్పగించేసాను.

నా ప్రమేయం లేకుండానే నేను సుమతికి జన్మనిచ్చాను. అప్పటినుండి చీకటిరాత్రుల నరకహింసల నుండి నాకు ఒక ఓదార్పువెలుగు సుమతి. సుమతి వచ్చాక చీకటి రాత్రుల అత్యాచారం కాస్త తెరిపి ఇచ్చింది. ఆ పిల్ల ఆలనాపాలనతో, చిరునవ్వులతో రోజులు కాసింత హాయిగా గడుస్తున్నాయి. పిల్ల అందంగా పెరుగుతున్నా, ఇంట్లో వున్న వాతావరణంలో ఆరోగ్యంగా పెరుగుతుందా లేదా అంటే అనుమానమే..ఎందుకంటే –

పాతపాటలు ఇష్టమని టీవిలో చూస్తున్నామనుకోండి. మౌనంగా వచ్చి టీవీ బద్దలు కొట్టేస్తాడు. ఆ పాతపాటలు చిదులు ప్రదులై కళ్ళల్లో క్రమంగా ప్రాణాలు పోగొట్టుకుంటాయి. రేడియోలో ఏవైనా విన్నామనుకోండి..ఏం మాట్టాడకుండా రేడియోని కుండ పెంకులు పగలగొట్టినట్టు పగలగొడతాడు. ఒక్కో పెంకుముక్కా గొంతు చాచి ఆదుకోమని అడిగి అడిగి మూగబోతుంది. అద్దంలో పొరపాటున రెండ్నిమిషాలు చూసుకున్నామనుకోండి.. అద్దం బద్దలు బద్దలయి వెయ్యి మ్రాన్పడిపోయిన ముఖాల్ని చూపుతుంది.. పుట్టింటి నుండి ఇష్టంగా తెచ్చుకున్న కృష్ణుడి అందమైన మట్టి విగ్రహం.. చిరునవ్వు తప్ప మిగతా పప్పుపప్పు అవుతుంది..వంట సామానులన్నీ సొట్టలుపడో, వంకర్లు పోయో బెదురుతూ చూస్తూ వుంటాయి. ఇంట్లో మూతీ ముక్కు చక్కంగా వున్న ఒక్క వస్తువూ వుండదు..నాతో సహా.

అది టీవీనో,రేడియోనో,వస్తువులో పగలగొట్టడం కాదనిపిస్తుంది నాకు.

మన చిన్నచిన్న ఇష్టాలు..

చిన్నచిన్న కోరికలు..

చిన్నచిన్న జ్ఞాపకాలు..

చిన్నచిన్న కలలు..

ఊహించుకున్న చిన్నపాటి రంగులీనే జీవితం..

..ధ్వంసం చేయడం..అన్నింటినీ ధ్వంసం చేయడం..మనలో మనం మిగలకుండా ముక్కలుముక్కలు చేయడం..నోరెత్తకుండా, తలెత్తకుండా వుండడం అలవాటు చేయడం..ఒక వ్యక్తిత్వం లేని వస్తువుగా మనల్ని మిగల్చడం..మనలోన రసస్పందనలన్నీ రాక్షసంగా నలిపేయడం..

అకారణంగా ఎందుకిలా చేస్తాడంటే..సమాధానం తెలీదు. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఆ రోజు ఇంటో ఏదొకటి పగిలి పోతుంది. నన్ను ఏవీ అనడు. కానీ మనసు నుజ్జునుజ్జుగా పగలిపోతుంది. ఇన్ని విధ్వంసాల మధ్య సుమతి పసి మనసు గాయపడకుండా వుంటుందా, ఎంత సుమతి స్కూలుకెళ్ళినప్పుడు ఇళ్ళు ధ్వంసం చేసినా ఆ పిల్ల గమనించకుండా వుంటుందా..? పిల్ల అందంగా పుట్టడం చూసి నాకు పుట్టిందేనా అని అతని అనుమానాలు.. అతను అనడు.వాళ్ళమ్మ చేత అనిపిస్తాడు. ఇంట్లో జరిపే విధ్వంసానికి అమ్మ చేత అంగీకార పత్రం చెప్పించి, సమాజానికి చూపెడతాడు. అతని ధోరణి అది. అంతే. ఎవరి సంతోషాన్నీ సహించలేని ధోరణి. తనలో వున్న అసహనపు చీకటిని ఎదుటవారి మీద రుద్దే ధోరణి..తనని తానే భరించలేని సరణి..

****    ****    ****   ****    ****

చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు రాఘవ వచ్చాడు ఇంటికి.ఒక అనువైన మాటకి, ఆప్యాయతకి, కాసింత ప్రేమకి ఎంత కరువు వాచిపోయానో అప్పుడు తెలిసింది నాకు. మనసు చేసే మూగ రోదనల మూలుగుల భాష అప్పుడే అర్థమయ్యింది నాకు. కాసింత తేమ తాకితే చాలనే ఒక ఎండిన మోడులా బతుకుతున్నానని అర్థమయ్యిందీ అప్పుడే. ’సత్యా రాఘవం’ అని ఎప్పుడో చెట్టు మీద చెక్కిన పేరుని గుర్తు చేసుకొని, సంబరపడిందీ అప్పుడే. ఒకరి చేతి స్పర్శ లోంచి ప్రవహించే సాంత్వన ఎంత అపురూపంగా వుంటుందో గ్రహింపుకి వచ్చిందీ అప్పుడే..స్పర్శ కొత్త కాకపోయినా ఇప్పుడు ఇస్తున్న స్పర్శానుభవం కొత్తది. ఒకరి చేతులకు ఒకరి చేతులు ఇస్తున్న అనునయం అపురూపమైనది.

ఎప్పుడొచ్చాడో అతను..గట్టిగా దగ్గాడు. పిడుగు పడ్డట్టుగా ఒకరి చేతుల్లోంచి ఒకరం అదిరిపడి విడివడ్డాం. రాఘవని ఏమైనా అంటాడేమో..చేస్తాడేమోనని గుండె దడదడా కొట్టుకుంది. ఒళ్ళు చచ్చుపడి చల్లబడిపోయింది. కానీ అతను రాఘవని ఏమీ అనలేదు.. ఒక్క మాట కూడా మాట్లాడలా.. మౌనంగా ఉండిపోయాడు..కాసేపటికి రాఘవ మెల్లిగా లేచి వెళ్ళిపోయాడు. కానీ నాకు తెలుసు..ఇది తుఫాను ముందర ప్రశాంతతని నాకు తెలుసు.. తర్వాత ఎదురయే అనుభవం ఎంత తీవ్రంగా ఉంటుందో..ఉరిశక్ష పడ్డ ఖైదీ చావు కోసం భయపడుతూ ఎదురుచూసినట్టు నేను రాత్రి ఎప్పుడు అవుతుందానని చావూబతుకు కాని స్థితిలో ఎదురుచూడాలని నాకు తెలుసు.

మామూలు రాత్రులప్పుడు నాతో నిమిత్తం లేకుండా, నా స్పందనలు పట్టించుకోకుండా నా శరీరాన్ని ఛిన్నాభిన్నం చేసి, తన పశువాంఛ చల్లార్చుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇటువంటప్పుడు అతను ప్రతీకారం తీర్చుకునే పద్దతి వేరుగా వుంటుంది.అలాంటప్పుడు నేను అతని కింద ప్రాణం వున్న పాషాణంలా మారిపోతాను. అతను నన్ను పెళ్ళగించి, పెళ్ళగించి వేడి చల్లార్చుకొని అట్టాగే మీద పడుకుండిపోతాడు, ఒక మనిషాకారపు గొంగళి పురుగులా.. లేవడు. లేస్తాడని చూస్తాను.లేవడు. రాఘవ వచ్చి వెళ్ళాడుగా.. దానికి కచ్చ..ప్రతీకారం.. అందుకని కావాలని లేవడం లేదని అర్థమయినాక కొంతసేపటికి ఒళ్ళంతా అసహ్యంతో, జుగుప్సతో జలదరిస్తూ వుంటుంది. అతని మీద నుంచి వచ్చే చెమటవాసన..అదో రకపు మదపు జంతు వాసన..కడుపంతా ఆ వాసనే.. కడుపులో దేవుతుంది. తొడల మధ్య చీదర..అతడు లేవడు. ఒళ్ళు బరువంతా మీదేసి అలా చచ్చిన శవంలా మీదే పడుకొని వుంటాడు. బరువు తాళలేక కదిలితే జంతు బలంతో మరింత పట్టు బిగిస్తాడు. నా చేతులు పైకి లాగి తన చేతుల్తో బిగించి పెట్టి, వక్షోజాల ముచ్చికల్ని రక్తం వచ్చేలా కొరుకుతాడు. ఎంత గింజుకులాడినా వదలడు. అప్పుడు అతను కోరలు,కొమ్ములు మొలిచిన మగమృగంలా రొప్పుతూ వుంటాడు. ఆహారం మెడ చిక్కిచ్చుకున్న అడవి జంతువులా కదులుతూ వుంటాడు. పెదాలకంటిన రక్తాన్ని నాలుకతో తుడుచుకుంటాడు. చచ్చినట్టు పడుంటే ఎప్పటికో వదుల్తాడు. గుబురు మీసాల మాటున గెలిచినట్టు నవ్వుకొని ఆ రోజుకి వదులుతాడు.

****    ****    ****   ****    ****

ఒకరోజు నన్ను వెతుక్కుంటా పద్మ ఒక్కతే ఇంటికి వచ్చింది. పద్మ మా బంధువుల అమ్మాయి.పద్దీ అని పిలుస్తాము. పద్దీ బొద్దుగా వుంటుంది. ఒళ్ళు పెరిగింది గానీ బుద్ధి పూర్తిగా పెరగలా..వెర్రిబాగుల్ది. చిన్నపిల్లల అమాయకపు మనస్తత్వం. ఊర్లో దీని పిల్లచేష్టలు చూసి ఎవరూ సంబంధానికి రావడం లేదు.

ఎందుకో ఆ పిల్ల రావడం నాకు ఇష్టం అనిపించలా..దాన్ని చూస్తే వెళ్ళిపొమ్మనీ చెప్పాలనిపించలా.. ఆ రోజంతా పద్ది నాతోనూ, సుమతి తోనూ పిచ్చి ఆటలన్నీ ఆడింది. రాత్రి నా దగ్గరే పడుకోబెట్టుకున్నా.. బహుశా ఈ రాత్రికి నా చెర తప్పుద్దేమోనని అనుకుంటా నిద్ర పోయాను.

ఎవరో లేపినట్టు అర్థరాత్రి మెలకువొచ్చింది. చీకట్లో ఏదో పెనుగులాడుతున్న చప్పుడు..చీకటిని చీల్చుకొని వస్తున్న చప్పుడు..పద్ది పడుకున్న వైపు నుంచే..చీకటిలో చూడడానికి కళ్ళు అలవాటు పడడానికి కొద్ది సమయం పట్టింది. సరిగా చూస్తే.. చీకటి పరదాల మాటున పాము లాగ పద్దిని చుట్టుకొని వున్నాడు అతను. అది ‘వూ..వూ..’ గింజుకుంటన్నా వినిపించుకోకుండా దాని మీద ఉన్మాదంగా ఊగుతూ వున్నాడు.

“ఏయ్..ఏందిది..ఎవరాడ ?” అరిచా భయంతో, రోతతో ఒళ్ళు వణికిపోతుండగా

అతను అదిరిపడి పక్కకు దొర్లాడు. గబక్కన లుంగీ కట్టుకున్నాడు. నింపాదిగా పైకి లేచి, ఏ మాత్రం బెరుకు, భయం లేనట్టు నా పక్క నుంచే పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ రచ్చకి కళ్ళు నులుముకుంటా సుమతి లేచింది. దానికి ఈ గోల తెలియకుండా ,అదురుతున్న గుండెలతోనే నా మంచం మీద పడుకోబెట్టి, పద్దిని పక్కకు లాక్కెళ్ళా.

“ ఏందే పద్దీ..ఏందిది..ఏమయ్యిందే..?” నా గొంతులో పీల నాకే తెలుస్తుంది.

“అక్కా..” పద్ది గొంతులో దిగమింగుకున్న దుఃఖం బద్దలయింది.

“ అక్కా..నా గొంతు కాడ కత్తి పెట్టేడే బావ. అరిస్తే చంపేస్తానని భయపెట్టాడు. చెప్పింది చేయకపోతే పీక కోస్తానన్నాడు. ఇట్టనే అంతకు ముందు ఎవరో అరవబోతే పీక కోసేసేడంటగా..నాకు బలే భయమేసిందక్కా..ఉచ్చ పడిపోయింది..నువ్వు చూస్తే నిద్ర పోతున్నావు..నీకు తెలిస్తే చంపేస్తానని బావ..బావ నా నోరు మూసి నన్ను ఆగం ఆగం చేసాడక్కా..” కళ్ళల్లో నీళ్ళు కక్కుకొని పద్ది ఏడుపుజీరతో చెపుతుంటే నా కడుపు తరుక్కుపోయింది. భూమి బద్దలై అందులో నేను పడిపోతే బాగుణ్ణు..

“అక్కా..రక్తం ఆగడం లేదక్కా..లోన పచ్చి పుండులా వుందక్కా..” తొడల మధ్య చేయి పెట్టుకొని పద్దీ చెబుతుంటే నాకు దుఃఖం కట్టలు తెగింది. పద్దీని గట్టిగా కావులించుకొని ‘అయ్యో…’అని బావురమని ఏడ్చాను.అది కూడా భయపడిపోయి బెక్కిబెక్కి ఏడ్చింది.

పొద్దునే తెలిసిన ఆరెంపీ డాక్టర్ దగ్గర పద్దీకి చికిత్స చేయించా. మందులు ఇప్పించా. కానీ దాని చిన్నారి మనసుకు అయిన గాయానికి మందేది ? ఈ నమ్మరాని క్రూర లోకమ్మీద అది పెట్టుకున్న భయానికి మందేది ? దాని హృదయంలో ఇక ఒక మగాడికి స్థానమేది? గడ్డకట్టిన ఆలోచనలతో..గడ్డకట్టిన కన్నీళ్లతో దానిని బస్టాండులో దాని ఊరికి భారంగా సాగనంపి వచ్చానే గానీ..

కడుపుని ఎవరో ఖండఖండాలుగా చీల్చుతున్న బాధ..

హృదయాన్ని ఎవరో గుప్పిట పట్టి నలుపుతున్న బాధ..సలుపుతున్న బాధ..

చెప్పలేని.. సహించలేని అసహనంతో శరీరం బద్దలవుతుందా అన్నట్టుంది..

****    ****    ****   ****    ****

ఆ రాత్రి కూడా చీకటి జడలు విప్పింది. అతనిలో ఎప్పటిలాగే కామం పడగలు విప్పింది. పక్క మీదకొచ్చి మీద పడబోతే విదిలించి కొట్టా..నమ్మలేనట్టు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి..కోపంతో పళ్ళు బిగించి మళ్ళీ మీద పడ్డాడు. శక్తినంతా కూడదీసి, రెండు కాళ్ళు మడిచి అతని డొక్కలో లాగించి తన్నాను. ఎగిరెళ్ళి గోడకు గుద్దుకున్నాడు. చివ్వున లేచి అతని జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టాను. ఊహించని ఈ హఠాత్‌పరిణామానికి అతను దిమ్మరపోయాడు. ఏం చేయాలో తెలియనట్టు బిగుసుకుపోయాడు. దెయ్యాన్ని చూస్తున్నట్టు నన్ను భయపడిపోయి చూస్తున్నాడు. బేల కళ్ళు వేసుకొని, ఇంత మొకం చేసుకొని, తోక ముడిచిన కుక్కలా, కుక్కిన పేనులా

కూర్చున్నాడు. నన్ను నేను పెకలించుకొని, సకల భయాలను అదిమిపెట్టి, సకల శక్తులతో నాలో నుంచి మరో నేను బయటకొచ్చాను.

****    ****    ****   ****    ****

నాలుగు రోజులు పస్తులున్న గుంటనక్కలా రాత్రుళ్ళు మీద పడదామని చూసాడు.

కానీ ఎందుకో జంకుతున్నాడు. ఏదో పన్నాగం పన్నుతున్నాడు. పిట్టల గుడ్లు మింగే అవకాశం కానరాని పాములా కదులుతున్నాడు.

ఒకరోజు రాత్రి..కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి..అతను పాములా కిందకి జారాడు. జరజరా పాకుతా నిశ్శబ్దానికి కూడా వినపడకుండా బయటకు వెళ్ళాడు. నిమిషం తర్వాత అతన్ని వెంబడించాను. హాలులో కనపడలేదు. చుట్టూ చూసి, సుమతి గదిలోకి చూసి శిలాప్రతిమలా వుండిపోయాను. చూస్తున్న దృశ్యాన్ని చూసి శరీరం చచ్చుపడిపోయింది..

అతను..మెల్లగా సుమతి పక్కలో పడుకొని, దుప్పటి తొలగిస్తున్నాడు..సుమతిని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు..ఏం చూస్తున్నానో..ఏం చేస్తున్నానో..తల దిమ్మెక్కింది. ‘రేయ్..’ హృదయం ఆర్తనాదం చేసింది. అసహ్యంతో మొకం, మనసు కొంకర్లు పోయింది.. వీడు పామని తెలుసు..పిల్లల్ని కూడా మింగే పామని తెలీదు..ఇంత మదమెక్కిన మృగమని తెలీదు..

తలలో నరాలు తెగుతున్నాయా..నరాలు పిగిలి రక్తం చిమ్ముతుందా..థూ..వీడెమ్మ..

రక్తం పంచుకు పుట్టిన కూతురి మీద కూడా ఈడి రక్తం జివ్వున లాగిందా..నా రక్తం భగభగ సలసలా మరిగిపోయింది.నాలో ఏదో బద్దలయింది. నాకేదో అవుతోంది. నాలోంచి ఏవో మొలుస్తున్నాయి. నా మొకం లోంచి కోరలు పొడుచుకొస్తున్నాయి. పూనకం వచ్చినదానిలా ఊగుతున్నాను. నా తల క్రోధంతో వక్కలవుతోంది. చేతుల్లోకి వేయి ఏనుగుల శక్తి వచ్చినట్టుంది. కళ్ళు అగ్నిగోళాలై మంటలు చిమ్ముతున్నాయి.

చేతికి అందిన కత్తిపీటతో అతని అంగాన్ని పరపరా కోసేసాను. రక్తం ధార జివ్వున పిచికారీ కొట్టింది..తల తిరుగుతోందో..గది తిరుగుతోందో..గుండ్రంగా తిరుగుతున్న గది గోడల నిండా రక్తం..చేతు నిండా రక్తం..చేతిలో అతని అంగం చీదరగా కిందపడేసా..రక్తంలో తడిసిన మొల పట్టుకొని అతను కీచుగా,బాధ భరించలేనట్టు అరుస్తున్నాడు. గిర్రున తిరుగుతున్న గదిలో అతను పొర్లిగింతలు పెడుతున్నాడు. నన్ను కళ్ళు పెద్దపెద్దయ్యి చేసి చూస్తా, వగరుస్తా, పండ్లు గిట్టకరచి, లేద్దమని చూస్తా లేవలేక పోతున్నాడు. గజగజా వణికిపోతున్నాడు. రక్తంలో ఈదుతున్నాడు..గది గిర్రున తిరుగుతోంది. నా బుర్ర కూడా గిర్రున తిరుగుతోంది. కంగారుగా కింద పడ్డ అంగాన్ని తీసుకొని ఒక గుడ్డలో చుట్టా. నిమిషంలో ఆ గుడ్డ రక్తంతో తడిచిపోయింది. ఉన్నట్టుండి గది తిరగడం ఆగిపోయింది. నా ఊగ్రరూపం కూడా మెల్లగా తగ్గిపోయింది. రొప్పుతూనే ఏదో గుర్తొచ్చినట్టు గబగబా చేతికందిన చీరలు సంచీలో సర్దా. అందిన కాడకి డబ్బు, నగలు తీసుకున్నా. సొయిలో లేని అతని వంక కొయ్యబారిపోయి చూస్తున్న సుమతి చెయ్యి పట్టుకు లాక్కుని నాలుగంగల్లో ఇంటి బయట రోడ్డు మీదకొచ్చి పడ్డా. ఎదురుగా కనపడిన సందులో దూరి, నాలుగు గొందులు తిరిగి,ఇంకో రోడ్డు మీదకొచ్చాం. అక్కడ శబ్దం చేసుకుంటా పారుతున్న డ్రైనేజీ సైడు కాలువలో అంగం చుట్టిన గుడ్డను విసిరేసా. అది ఆ మురుగునీళ్ళల్లో పడి, చటుక్కున చీకట్లో మాయమైంది.

అంతా క్షణంలో కలలా, మాయలా జరిగిపోయింది.

****    ****    ****   ****    ****

తెల్లవారుఝాము గాలి చల్లగా వీస్తా వుంది. మనసు, శరీరం తేలికగా వుంది. ఇప్పటి దాక తలలో  మోసిన భయాలు, ఇరుకులు,బెరుకులు, అడ్డంకులు, అడ్డుగోడలు, పరువుల సంకెళ్ళు, మర్యాదల గుదిబండలు అన్నీ వదిలిపోయాయి. బరువులన్నీ దిగి పోయాయి.

సుమతి నన్ను అతుక్కుపోయి వుంది. సుమతి పొదివి పట్టుకొని నుంచున్నాను..దాని తల నిమురుతూ అనుకున్నాను..ఇకపై ఇంకా ధృఢంగా నుంచోవాలి. బలంగా నిలబడాలి.

సుమతికి ఇంతదాకా తెలియని ప్రపంచం చూపించాలి. మనుషుల మీద నమ్మకం వుండే ప్రపంచం..మనుషుల మధ్య ప్రేమ వుండే ప్రపంచం..ఈ ప్రపంచం మీద మనకి ప్రేమ పుట్టే ప్రపంచం..విశాల ప్రపంచం..

నడుస్తున్నాను. ఒక ప్రపంచాన్ని నా మనసులో ప్రతిష్టించుకొని, ఆ ప్రపంచం వైపు నడుస్తున్నాను. కొంతసేపటికి నడక తేలికయింది. నాలో ఏదో తెలియని ఒక ఆశ..కొత్త శక్తి.. అది నన్ను ముందుకు తోస్తోంది. నేను కోల్పోయిన ప్రపంచం నన్ను పిలుస్తోంది..సుమతి కూడా నాతో పాటు.. గాలి తగులుతోంది. ఉక్క వదులుతోంది. నాకు నేను కొత్తగా వున్నాను..కొత్తగా నాలో ఏదో మొలుస్తున్నాయి..కొత్త ఊహలు..మొలిచిన ఊహల రెక్కలు..రెక్కలతో ఎగరుతున్నాము..కుదురుగా ఎగురుతున్నాము..ఎదురుగా మబ్బు పింజలు విడిపోతూ..కళ్ళలోంచి దుఃఖం దూదిపింజలా గాలికి ఎగిరిపోతూ..

కళ్ళ ముందు.. విశాలంగా విస్తారంగా పరుచుకున్న ప్రపంచం..నేను కోరుకున్న పచ్చని కలల ప్రపంచం..సుమతికి బాధ్యతగా బహుకరించాల్సిన ప్రపంచం..

ముందుకు పోతున్న కొద్దీ రెక్కలు ఇంకా బలంగా, ధృఢంగా తయారవుతున్నాయి..

తూరుపున విచ్చుకుంటున్న లేలేత ఉదయ కిరణ కాంతులలో రెక్కలు మిలమిల మెరిసిపోతున్నాయి.

ధైర్యంగా ఎగిరి ముందుకు పోతా వుంటే దారి దానికదే విచ్చుకుంటా వుంది.

*

చిత్రం: సృజన్ రాజ్ 

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు