రెక్కలకు బలమొచ్చింది!

9

పదేళ్లుగా ఉన్న ఇంటిని, పరిసరాలను, జన్మభూమిని వదిలేసి ఏదీ తెలియని ఖండానికి ఎగిరి వెళ్లిపోవడమంటే మాటలు కాదు. అలవాటైన మనుషులు, రొటీన్, స్నేహితులు, బంధువులు – అందరినీ వదిలి వెళ్లాలంటే బెంగగా ఉండేది. ఇంట్లోని వస్తువుల్లో ఏది వదిలెయ్యాలో, వేటిని తీసుకెళ్లాలో, అక్కడ ఏమేం అవసరముంటాయో తెలియక మేం తికమకపడ్డాం. ఢిల్లీ వచ్చింది మొదలు ఒక్కోటిగా పోగుచేసుకుని, శ్రద్ధగా వాడుకుంటున్నవి మరి. ఆంధ్రా నుంచి నా మరదలు, తోడల్లుడు (మా రమ చెల్లెలు, ఆమె భర్త), మా స్నేహితులు కొందరు ఢిల్లీకి వచ్చి ఆ పనిలో మాకు సాయం చేశారు. కొన్ని తీసుకెళ్లేందుకు, కొన్ని వదిలేసేందుకు, మరికొన్నింటిని మా అత్తగారు, మావగారుండే పల్లెటూరుకు తరలించేందుకు సిద్ధం చేశాం. మరోవైపు మాకు వీడ్కోలు చెప్పేందుకు ప్రతిరోజూ స్నేహితులు వస్తూ ఉండేవారు.

ప్రయాణ ఏర్పాట్లు మాకు కష్టం కాలేదు. మా చేతిలో నాలుగు ఫస్ట్ క్లాస్ టికెట్లున్నాయన్నది ఒకటి, రెండోది నేను ఐ.ఎమ్.ఎఫ్.కు వెళుతున్నాను గనక ఆ సంస్థ పట్ల మర్యాదతో ఎయిర్ లైన్ ప్రతినిధులు మాకు అన్ని విధాల సహకరించారు. యూరప్ కు వెళ్లే అన్ని విమానాలు ఢిల్లీలో అర్థరాత్రి లేదంటే తెల్లవారకముందు మూడు గంటలకు బయల్దేరేవి. అవి ఎంచుకుంటే మనకు, మనల్ని సాగనంపడానికి ఎయిర్ పోర్టుకు వచ్చినవారికి అందరికీ రాత్రి నిద్ర గోవిందానే.

ఆ కష్టం వద్దనుకుని మేం ఎయిర్ ఇండియా ఫ్లైటునెంచుకున్నాం. అది ఉదయం ఎనిమిదింటికి ఢిల్లీలో బయల్దేరి మాస్కోలో కొద్దిసేపు ఆగి లండన్ కు చేరుకుంటుంది. మేం లండన్ లో రెండు రోజులుండి తర్వాత వాషింగ్టన్ కు వెళ్లాలని అనుకున్నాం. అప్పటికి వాషింగ్టన్ కు యూరప్ దేశాల రాజధానులకు మధ్య నడిచే విమానాలు తక్కువ ఉండేవి. న్యూయార్క్ కు విమానాలు ఎక్కువ.

మేం ఎక్కిన ఎయిరిండియా విమానం పేరు గౌరీశంకర్. అది మాస్కో చేరేవరకూ మా ఆవిడ ఆపకుండా ఏడుస్తూనే ఉన్నది. ఆమె ఎందుకలా ఏడుస్తోందో తెలియక విమానం స్టాఫ్ తికమకపడ్డారు. మాకు ప్రత్యేకమైన శాకాహార భోజనం దొరికింది. మాతృభూమిని వదిలి వెళుతున్నామనే దు:ఖంలో రమ కాస్తయినా ముట్టుకోలేదు. ఎటువంటి దు:ఖాన్నైనా మాన్పే మందు కాలమొక్కటే. మాస్కోకు చేరాక ఆవిడ ఏడుపు కాస్త తగ్గింది. మాస్కోలో వసంతకాలం మొదలైనా ఇంకా మంచు పడుతూనే ఉంది. ఆ తర్వాత ప్రయాణం కష్టం కాలేదు. మేం లండన్ లో రెండు రోజులు గడిపి తర్వాత వాషింగ్టన్ చేరుకున్నాం. మా స్నేహితుడు మూర్తి ఎయిర్పోర్టుకు వచ్చి మమ్మల్ని అల్బన్ టవర్స్ లో దించి వెళ్లాడు. మాకు కొత్త ఇల్లు దొరికేవరకూ అక్కడే ఉన్నాం.

* * * * * *

వసంతకాలంలో వాషింగ్టన్ నగరం అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి వీధిలోనూ రంగురంగుల పువ్వులు పలకరిస్తుంటాయి. అప్పటివరకూ మంచు తప్ప మరేదీ ఉండని శీతకాలం అంతమై వసంతంలో పచ్చదనం మొలకెత్తి కొత్త జీవితానికి స్వాగతం చెబుతున్నట్టుంటుంది.

ఢిల్లీ, వాషింగ్టన్ రెండు నగరాలూ అధికారానికి ఆవాసాలు. వాటి ప్రధాన వృత్తి రాజకీయాలే. రెండింటికీ సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ ఢిల్లీది శతాబ్దాల గతం. వాషింగ్టన్ వయసు 200 ఏళ్లకు కాస్త అటూఇటూగా ఉంటుంది. రెండు నగరాలూ బాగా విస్తరించి ఉంటాయి, ఇతర రాజధానులతో పోలిస్తే జనాభా తక్కువ. ఆ జనాభాలో ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పనులతో సంబంధాలున్నవారు. రెండుచోట్లా సాయంత్రం ఆరు తర్వాత బయట జనసంచారం తక్కువ. పగలంతా ప్రభుత్వ కార్య నిర్వహణ చేసీచేసీ సాయంత్రానికల్లా జనాలు ఇళ్లకు చేరి విశ్రాంతి తీసుకుంటారు. (ఇది అప్పటి సంగతి. ఇప్పుడు ‘నైట్ లైఫ్’ అన్నిచోట్లా పెరిగింది) వాషింగ్టన్ నగరమే అయినా మేరీలాండ్ కొండలతో ఒక పల్లెటూరి కళ కనిపిస్తుంది. నగరం నుంచి ఎవరైనా కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే గ్రామీణ వాతావరణంలోకి వెళ్లిపోవచ్చు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భవనం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు మూడు బ్లాకుల అవతల 19 స్ట్రీట్ లో ఉండేది. అది ముందున్న భవనం సరిపోక, దాన్ని ప్రపంచ బ్యాంకుకు విక్రయించేసి, దాని ఎదురుగా మరో పెద్ద భవనాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టింది. ఇవిగాక మిగిలిన ఇళ్లలో చాలామటుకు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆస్తులే. మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రపంచ బ్యాంకు, ఐ.ఎమ్.ఎఫ్.ల ఉద్యోగులంతా వైట్ హౌస్ చుట్టుపక్కల వీధుల్లో సందడిగా కనిపించేవారు. ప్రముఖ వ్యక్తులు, పాత్రికేయులు, సెనేటర్లు… ఒకరేమిటి దేశంలో ప్రముఖులు ఎవరైనా – ఐ.ఎమ్.ఎఫ్.కు ఓ వీధి అవతల ఉన్న ఎఫ్ స్ట్రీట్ క్లబ్ లో ఎదురుకావొచ్చు.

హెన్రీ కిసింజర్ వంటి రాజకీయ నాయకుడు సైతం అక్కడి ఫ్రెంచి రెస్టరంట్లో కనిపించేవారు. ఆయన్ని సీక్రెట్ సర్వీస్ వ్యక్తులు అనుసరిస్తూ కనిపెట్టుకుని ఉండేవారు. ఆ సర్వీసు వ్యక్తులు ఎవరికీ తెలియకూడదు. కాని వీళ్లు త్రీ పీస్ సూట్లు, నల్ల కళ్లద్దాలు, చెవులకు ఇయర్ ఫోన్లు, నడుముకు గన్ పెట్టుకుని అందరూ తిరిగి చూసేలా సంచరించేవారు. వారి కార్ల ఇంజిన్లు పార్కింగులో కూడా ఆపేవారే కాదు.

ఇదంతా జోకుగా అనుకోవడానికే. ఏ క్షణాన ఏమవుతుందో తెలియని ఒక ఉద్రిక్తత కూడా వాషింగ్టన్ వీధుల్లో నిత్యం ఉండేది. వియత్నామ్ యుద్ధాన్ని తగ్గించేస్తామని కొత్త అధ్యక్షుడు నిక్సన్ ప్రకటించినప్పటికీ అది తగ్గలేదు సరికదా, పెరిగింది. ఎక్కువ సంఖ్యలో సైనికుల్ని ఆగ్నేయాసియాకు పంపేవారు. అప్పట్లో హైస్కూళ్లు, కాలేజీల్లో ఉన్న యువకులను సైన్యంలోకి తీసుకునేవారు. వారికి కొంత శిక్షణనిచ్చి భయంకరమైన యుద్ధభూమికి పంపేసేవారు. అక్కడ ఎంతోమంది హతులైపోయేవారు.

రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు యువకులు ఆర్మీ పిలుపును తప్పించుకోగలిగేవారు. వారు విదేశాలకు పీస్ కార్ప్స్ వలంటీర్లుగా వెళ్లిపోయేవారు. మరికొందరు కెనడా పారిపోయేవారు. ఇంకొందరు హిప్పీలుగా మారిపోయేవారు. ఆ రకంగా ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఉండేది, కొన్ని వర్గాల్లో అమెరికా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా అది గట్టి రూపు తీసుకోలేదు. మేం వచ్చిన నెలలోపే, మే లో అనుకుంటాను, అనుకోకుండా ఆ రోజు మంచు పడింది, ఒక నిశ్శబ్ద నిరసన ప్రదర్శన జరిగింది. వైట్ హౌస్ చుట్టుపక్కల ఉండే కాపిటల్, లింకన్ మెమోరియల్, పెన్సిల్వేనియా అవెన్యూ భవనాలన్నీ నిరసన తెలిపే యువతతో నిండిపోయాయి. అబద్ధాలతో, అరకొర సమాచారంతో తమను దేశం మభ్యపెడుతోందన్న ఆగ్రహం దాదాపు ప్రతి ఒక్క ముఖంలోనూ కనిపించింది. ప్రభుత్వాల పట్ల, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం పట్ల పౌరుల్లో నమ్మకం పోవడానికి అదే తొలిమెట్టు.

దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఫండ్ పని మీద నేను వియత్నామ్ వెళ్లే అవకాశం వచ్చింది. అప్పటికి వియత్నామ్ ఉత్తర – దక్షిణాలుగా లేదు. రెండూ కలిసిపోయి ఒకే దేశంగా ఏర్పడింది. రాజధాని సైగోన్ సిటీ పేరు హోచిమిన్ సిటీగా మారింది. అప్పటికి మూడు దశాబ్దాల కాలంలో మూడు పెద్ద దేశాలను – ఫ్రాన్స్, అమెరికా, చైనాలను ఓడించిన దేశం కేవలం వియత్నామే. హనోయ్ విమానాశ్రయంలో దిగగానే పచ్చని వరిచేలు, అటూఇటూ తిరిగే గేదెలు కనిపిస్తే, నాకు ఒకటే ఆశ్చర్యం – ఈ వ్యవసాయ దేశంలో అమెరికాను యుద్ధానికి ఉసిగొలిపేంత శక్తి ఏముంది అని? ఆ యుద్ధంలో సుమారు యాభై ఎనిమిది వేల మంది పౌరులు చనిపోయారు. ఇరు పక్షాలవారూ, ఆడ, మగ, పిల్ల, పెద్ద ఎందరో మరణించారు. కాని ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు.

కేవలం రాజకీయాలు, ప్రభుత్వ పనులు, కార్యక్రమాలే కాదు, వాషింగ్టన్ లో ఎన్నో వింతలు, విశేషాలుండేవి. అప్పటికి కాలుష్యం అన్నది అంతగా వినిపించే మాట కాదు. పెద్ద ఆకారాలతో భారీగా ఉండే అమెరికన్ కార్లు పరుగులు తీసేవి. అవి చౌక కూడా. ఒక గ్యాలన్ గాసొలిన్ (ఇంధనం )కేవలం 32 సెంట్లు. ట్యాంకు నింపేటప్పుడు కార్ల అద్దాల్ని తుడిచేవారు, అలాగే ఉచితంగా చిన్నచిన్న బహుమతులిచ్చేవారు కూడా.

మేం ఇంకా హోటల్లోనే ఉన్నాం, కారు లేదు గనక, నడిచి వెళ్లి రాగలిగే దూరంలోని ప్రదేశాలనే చూసొస్తూ ఉండేవాళ్లం. మా కిటికీ ఎదురుగా బ్రైస్ పార్క్ ఉండేది. అది అమెరికాలో బ్రిటిష్ రాయబారి లార్డ్ బ్రైస్ పేరు మీద ఏర్పడింది. ఆయన ‘మోడర్న్ డెమోక్రసీస్’ అనే పరిశోధక రచన వెలువరించాడు. ఈ పార్కుకు కాస్త దూరంగా నేషనల్ కేథడ్రెల్ కనిపించేది. మేం పార్కు బెంచీల మీద కూర్చుని కార్లు వేగంగా దూసుకుపోవడం చూస్తూ ఉండేవాళ్లం. అప్పట్లో నగరాన్ని చుట్టి ఉండే బెల్ వే (మన ఔటర్ రింగ్ రోడ్ వంటిది) మీద స్పీడ్ లిమిట్లు ఉండేవి కాదు. దాంతో ఇక తమకు ఎదురులేదన్నట్టుగా జనాలు రయ్యిమంటూ దూసుకుపోయేవారు. అప్పటికి మూడేళ్ల తర్వాత అంటే 1973 చివర్లో అనుకుంటా, స్పీడ్ లిమిట్లను నిర్ణయించారు. (ఒ.పి.ఇ.సి.) నిర్ణయం వల్ల ఇంధనం ధరలు పెరిగాయి, కొరత ఏర్పడింది. ఇందనం వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది.

మేం అపార్ట్ మెంట్ వెతుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి ఫండ్ లోని నా సహోద్యోగులు సాయం చేశారు. మేం హోటల్నుంచి ఇంటికి మారకముందే నేను ఆఫీసు పని మీద వేరే దేశానికి వెళ్లవలసి వచ్చింది. నేను లేకపోయినా, స్నేహితులు సాయం చెయ్యడంతో మా ఆవిడ, ఇద్దరు పిల్లలు అందులోకి మారిపోయారు.

* * * * * *

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ – ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ లో నేను చేరకముందు ఆ సంస్థ గురించి నాకేమీ తెలియదు. భారత ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు కూడా ఫండ్ కార్యక్రమాలతో నాకెటువంటి సంబంధం ఉండేది కాదు. ఫండ్ లో చేరాకే దాని గురించి ఆమూలాగ్రం తెలుసుకునే వీలు కలిగింది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సమావేశం బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అని చరిత్రలో నిలిచిపోయింది. అందులో జరిగిన చర్చల ఫలితంగా 1945లో 29 దేశాలు సభ్యులుగా ఐ.ఎమ్.ఎఫ్. ఏర్పడింది. ప్రస్తుతం 189 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆయా దేశాల్లో ఆర్థికపరిస్థితులను మెరుగుపరచడమే ఐ.ఎమ్.ఎఫ్. లక్ష్యం.

నేను వాషింగ్టన్ బయల్దేరేముందు ఫోర్డ్ ఫౌండేషన్ లో నా సహోద్యోగి ఒకరు గ్రాహమ్ గ్రీన్ రాసిన ‘ద హార్ట్ ఆఫ్ ద మేటర్’ నవల చదవమన్నారు. అమెరికా స్థితిగతులు తెలుసుకోవడానికి ఆ రచన ఉపయోగపడుతుందని చెప్పారు. నేను చదివాను. అదొక పోలీసాఫీసరు సందిగ్ధాల గురించి వర్ణిస్తుంది. ఎంత చదివినా, ఎంత సన్నద్ధులమై ఉన్నా, ఫీల్డ్ లో తలెత్తే సాంస్కృతిక, సంస్థాగతమైన సమస్యలను ఎదుర్కోవడానికి అది సరిపోదు.

ఐ.ఎమ్.ఎఫ్.లోని ఫిస్కల్ అఫైర్స్ (ఆర్థిక వ్యవహారాలు) డిపార్ట్ మెంట్లో చేరాను. ఆయా దేశాల, ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించాలి. ఫండ్ లేదా ఫీల్డ్ లో పని ఒకేరకంగా ఉంటుంది. ఉద్యోగికి ఒక అంశాన్ని కేటాయిస్తారు, దానిమీద పరిశోధించాలి, ఫీల్డ్ లో సమాచారం సేకరించాలి, విశ్లేషించాలి, ఏం కనుక్కున్నామో దాన్నొక నివేదిక రూపంలో మిషన్ చీఫ్ కు ఇవ్వాలి. తర్వాత దాన్ని ఆ దేశ అధికారులతో చర్చించాలి. ఫండ్ తరఫున ఒక దేశానికి వెళ్లే అధ్యయన బృందాన్ని మిషన్ అంటారు. దానిలో చీఫ్ గాక, ముగ్గురు సభ్యులుంటారు. ఫండ్ లో చేరిన కొత్తవారిని ఏదో ఒక మిషన్ లో వేసి, విదేశాలకు పంపి, వారి పనితీరును గమనిస్తుంది సంస్థ. అది ఎలాంటిదంటే – ఒకణ్ని నేరుగా నదిలోకి తోసేసి వాడు తేలుతాడా, ఈదుతాడా, ఏదో ఓ గట్టు చేరుతాడా లేదా మునిగిపోతాడా అని గమనించడం లాంటిది.

చేరగానే నన్ను పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ అనే దేశానికి పంపారు. మేం ఆఫ్రికా చేరిన వెంటనే, మా బృందంలో కీలకమైన సీనియర్ అధికారి అనారోగ్యం పాలయ్యారు, కదల్లేని పరిస్థితికి చేరుకున్నారు. నాలుగో సభ్యుడు సౌత్ కొరియన్. ఆయనకు ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం రాదు. (ఆ కారణం వల్ల అతను తర్వాత ఫండ్ ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోయారు). ఇక మిగిలింది నేను, మా చీఫ్. పనిభారమంతా మా ఇద్దరి మీదే పడింది. నేనేమో పూర్తి కొత్తవాణ్ని. అయినా నేను ధైర్యం చేశాను. చీఫ్ తో మాట్లాడాను. ఏం చెయ్యాలో ఆయన చెప్పేలా, నేను చేసేలా ఒక ఒప్పందానికి వచ్చాం. ఆయన ఇంగ్లిష్ వ్యక్తి, ఎక్స్ ఛేంజ్ అండ్ ట్రేడ్ రెగ్యులేషన్స్ లో పనిచేసిన అనుభవశాలి. ఆయన నాతో ఓపిగ్గా ఉండేవారు, పని చాలా బాగా నేర్పించారు.

సియెర్రా లియోన్ దేశ రాజధాని ఫ్రీటౌన్. అక్కడి మెయిన్ స్ట్రీట్ లో నడుస్తూ ఉంటే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో లేడీ హిక్స్ చెప్పిన కథ గుర్తుకువచ్చింది. ఆ దేశ ప్రజలకు వజ్రాల అమ్మకం ద్వారా బోలెడంత డబ్బు వచ్చేది. వాళ్లు నేరుగా మెర్సిడీజ్ బెంజ్ డీలర్ దగ్గరకు వచ్చి కార్లు కొనుక్కునేవారు ఆ డబ్బుతో. కాని కార్లు నడపడం రాక పైనుంచి సముద్రంలోకి పడిపోయేవారు. ఆ లెక్కన ఆ అంచు నుంచి చూస్తే చాలా కార్లు కనిపించాలి. కాని శిఖరం నుంచి అవి కనిపించవు.

వీరికి డబ్బు వజ్రాల ఎగుమతి ద్వారా వస్తుంది. ఎక్స్ పోర్ట్ కార్పొరేషన్ సుప్రసిద్ధ డి బీర్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అక్కడ రుటైల్ అనే ఖనిజం లభిస్తుంది. అది విమానాల ఫ్రేముల తయారీలో ఉపయోగపడుతుంది. సోవియెట్ యూనియన్ తర్వాత ఆ ఖనిజాన్ని ఎగుమతి చేసే మరో దేశం సియెర్రా లియోన్ మాత్రమే. ఆ దేశానికి మంచి పంట భూములుండేవిగాని, అక్కడివారికి పద్ధతిగా వ్యవసాయం చెయ్యడం రాదు. ఊరికే విత్తనాల్ని విసిరెయ్యడం, ఎంత పంట వస్తే అంత కోసుకోవడం – అంతే తెలుసు వారికి. దానివల్ల ఎంతో పంట నష్టపోయేవారు.

మేం అక్కడికి ఋతుపవనాల సమయంలో వెళ్లాం. వర్షం అంత భారీగా కురుస్తుందని ఎవరైనా చెబితే నమ్మలేం. గొడుగు, రెయిన్ కోటు వంటివి ఏవీ ఆ వర్షంలో పనిచెయ్యవు. ఇళ్లకు రేకు కప్పులుండేవి. దాంతో వర్షం హోరుకు తోడు దబదబమని చప్పుడు రెండింతలయ్యేది. మెరుపులు, పిడుగుల శబ్దాలు దీనికి అదనం. ఆ ఊరు ఒక కొండకొమ్మున ఉంటుందిగనక, ఎంత వాన పడినా, నీరంతా సముద్రంలోకి జారిపోయేది, త్వరగా ఆరిపోయేది.

దేశాన్ని సుభిక్షంగా ఉంచే వనరులు ఎన్నో ఉన్నాయి. కాని ఒక పద్ధతి లేదు. బ్రిటిష్ వారు వెళ్లిపోయేక, పాలనా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి అక్కడివారు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. రాజకీయం, పాలన – రెండూ అవినీతితో భ్రష్టు పట్టినవే. ప్రభుత్వంలో పలుకబడి ఉన్నవారు అడ్డదారుల్లో బోలెడు సంపాదించుకునేవారు. ఇది తెలుసుకోవడానికి నాలాంటి కొత్తవారికి కూడా పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. వారి సెంట్రల్ జైలు నగరం నడిబొడ్డున ఉంటుంది. దానికి రాత్రిపూట విద్యుత్ కంచె కూడా ఉంటుంది. కొందరు మాజీ మంత్రులు అందులో ఖైదీలుగా ఉంటారుగనక వాహనాల ట్రాఫిక్ ను ఆ ప్రదేశంలో నియంత్రిస్తారు. మిలిటరీ కుట్రలు, రాజకీయ ఉద్యమాలు ఎప్పుడు తలెత్తినా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటారు.

ప్రభుత్వ ఆర్థిక సమాచారం సేకరించడం నా పని. అది చాలా కష్టం అయ్యేది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్, ఆర్థికశాఖ ఎవరిదగ్గరా సరైన లెక్కల్లేవు. అకౌంటెంట్ జనరల్ దగ్గర కూర్చుని నెలవారీ గెజెట్లు తెప్పించుకున్నాం. వాటిలో ఉన్నది ప్రాథమికమైన సమాచారం. దాన్నంతా క్రోడీకరించుకోవడం ఒక శ్రమ. అప్పటికి కంప్యూటర్ల వాడకం ఎక్కడా లేదు. ఉన్నదంతా భారీ ఎన్.సి.ఆర్. మిషన్లు. వాటిని నొక్కినప్పుడంతా టైపు రైటర్లలాగా చుకుచుకుమంటూ శబ్దం చేసేవి. ఉన్న వనరులతోనే మేం పనిచేశాం. ఆర్థిక విశ్లేషణలను సిద్ధం చేశాను. కాని ఫలితాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు.

సమాచారమంతా అధికారులిచ్చినదే. అయినా వారికి మాత్రం దేశ పరిస్థితి, అందులో తీవ్రత తెలియరాలేదు. అన్ని విభాగాల సమాచారాన్ని క్రోడీకరించి, విహంగవీక్షణం చేసి చెబితేగాని అర్థం కాలేదు వారికి. మేం కనుగొన్న విషయాలను ముందుగా ఆ దేశ ఆర్థికమంత్రికి తెలియజేశాం. అతను యువకుడు, దంతవైద్యంలో పట్టభద్రుడు. ఆర్థిక విషయాల్లో పెద్దగా పట్టు లేనప్పటికీ మేం చెప్పిన విషయాలపట్ల సానుకూలంగా స్పందించాడు.

ఆ తర్వాత మేం దేశాధ్యక్షుణ్ని కలుసుకున్నాం. అప్పుడు అక్కడున్న రాజకీయ – అడ్మినిస్ట్రేటివ్ అధికారాల అంతరం ఎంతో ఇట్టే తెలిసిపోయింది. వారిద్దరిమధ్యా అంతరాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆర్థికమంత్రి మారిపోయే అవకాశాలున్నాయని ఫండుకు సమర్పించిన నా నివేదికలో రాశాను. కొద్ది కాలంలో అదే నిజమైంది, మేం వాషింగ్టన్ వచ్చిన నెలలోపే అతడు అరెస్టయి, సెంట్రల్ జైలుకు వెళ్లాడు. కాని అతనిమీద విచారణ త్వరగా జరిగింది, రాజద్రోహం ఋజువై ఉరిశిక్షపడింది, అది తొందరగా అమలు కూడా అయింది!

తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించి వాస్తవ పరిస్థితిని విశదీకరించడమే ఐ.ఎమ్.ఎఫ్. కీలక బలం. కొత్తవాడినైనా ఈ అంశాన్ని అర్థం చేసుకున్నందుకు, అమలు చేసినందుకు హెడ్ క్వార్టర్ లో మా మిషన్ కు (బృందానికి) ప్రశంసలు లభించాయి. ప్రశంసలను మించి, ఈ మిషన్ నాకు మంచి పునాది వేసే శిక్షణలాగా ఉపయోగపడింది. ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ప్రయోజనం లేదు, నీటిలో దూకి ఈదితేనే వస్తుంది. నన్ను మొదట్లోనే నీళ్లలోకి తోసేసినందుకు ఫండుకు కృతజ్ఞుడినై ఉంటాను.

* * * * * *

మిషన్ నుంచి తిరిగొస్తూనే నేను ఇంటి పనులు కొన్ని చక్కబెట్టుకున్నాను. మేరీలాండ్ లోని అపార్ట్ మెంటుకు మారాక నేను డ్రైవింగ్ నేర్చుకోవడం, పిల్లలను స్కూళ్లలో వెయ్యడం, ఇంటికి కావలసినవి కొనుక్కోవడం వంటివి చేశాం. మా చుట్టుపక్కల ఉండే భారతీయ కుటుంబాలు మాకు బోలెడంత సాయం చేశారు. ఇండియన్ సప్లై మిషన్ లో పనిచేసే సుందరం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఛోనా, మోహన్ కంబాట్కోనే, భగవత్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన బి. ఎస్. మిన్హాస్ వంటి వారంతా మాకు దగ్గర్లోనే ఉండేవారు. ఆఫీసులు దగ్గరే కావడంతో మేమంతా కలిసి ఒకే కారులో వెళ్లి వచ్చేవాళ్లం. మిన్హాస్ విద్యార్థి దశ నుంచి అమెరికాలో ఉండటం వల్ల ఆయనకు, ఆయన భార్య రాజ్ కు అక్కడ జీవనశైలి బాగా తెలుసు. వారు మాకు బాగా సాయం చేశారు.

గ్రేటర్ మెట్రోపాలిటన్ ఏరియా ఆఫ్ వాషింగ్టన్ లో ఎంబసీ వాళ్లు తప్పిస్తే, 1970ల్లో ఇండియన్ కుటుంబాలు చాలా తక్కువ. అందునా తెలుగువారు ఇంకా తక్కువ. ఓ ఇరవై కుటుంబాలుంటాయేమో. మేమంతా డిన్నర్లంటూ తరచూ కలిసేవాళ్లం. ​కాని ఇండియాలోని ఇళ్ల నుంచి వార్తలు తెలియడం కష్టంగానే ఉండేది. ఉత్తరాలు రాస్తే రెండు వారాలు పట్టేది. అవి తప్ప మరో సాధనం ఏమీ ఉండేది కాదు. అందరూ వాటినే వాడేవారు. టెలిఫోన్ కాల్స్ చేయడం అనేది ఎప్పుడో గాని జరిగేది కాదు. వాటిని ముందుగా బుక్ చేయాలి, తర్వాత లైన్లో నిల్చోవాలి, ఒకసారి టెలిఫోన్ లైన్ దొరికాక గట్టిగా అరిచి మాట్లాడవలసి వచ్చేది. మూడు నిమిషాల పాటు మాట్లాడితే గొంతంతా మండిపోయేది. అలాగే భారతీయ కూరగాయలు పచ్చి మిరప, బెండ, కాకర వంటివి దొరకడం చాలా కష్టం గా ఉండేది. వాటి కోసం స్పానిష్ మార్కెట్లకు వెళ్ళవలసి వచ్చేది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మిషన్ వారు ఒక చిన్న బజారులో పెట్టే వాళ్ళు. వాళ్లలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు, మహారాష్ట్రలోని పూణే నుంచి వచ్చినవారే నగరంలో ఎవరికీ ఐ.ఎం.ఎఫ్. అంటే తెలిసేది కాదు. ఎవరైనా ఎక్కడ పనిచేస్తున్నారని అడిగితే మేం ‘ప్రపంచ బ్యాంకులో’ అని చెప్పేసేవాళ్లం. అది కొంతమందికి బాగానే తెలుసు.

నేను ఇంట్లోనూ ఆఫీసులోనూ కొంత స్థిమిత పడ్డాను. అప్పుడు ఇండియా నుంచి ఆర్టికల్స్ కావాలని పత్రికలవారు అడిగేవారు. కాని ఇండియా న్యూస్ పేపర్లేవీ వాషింగ్టన్ లో వెంటవెంటనే దొరికేవి కాదు. ఇక్కడి పత్రికల్లో ఇండియా పరిణామాల గురించి చాలా తక్కువ వార్తలు ఉండేవి. అందువల్ల నేను అక్కడి ఆర్థిక పరిణామాల మీద ఎటువంటి వ్యాఖ్యానాలు సకాలంలో చేయలేను అనిపించింది. దాంతో నాకెంతో ఇష్టమైన జర్నలిజం నుంచి నేను తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో మాతృదేశం మీద బెంగ ఇంకా ఎక్కువ అయిపోయింది. అక్కడి వార్తలు, ఆర్థిక అంశాలు ఏమీ తెలియవు, ఏ చర్చల్లోనూ పాల్గొనలేం అనేది నన్ను చాలా బాధపెట్టింది. నా దేశానికి నేను అపరిచితుడిగా అయిపోతున్నాననే బాధ ఎక్కువయ్యేది.

విచిత్రమేమంటే అటు అమెరికా సమాజంలో కూడా మేము అపరిచితులుగానే మిగిలిపోయాం. మామూలుగా పైకి ఒకటే సమాజంలో నివసిస్తున్నట్లు అనిపించినా, భాష, విద్య, న్యాయ సదుపాయాలు అన్నీ ఒకటే లాగా ఉన్నా ప్రతి వలస బృందానికి తనదైన ఒక సంస్కృతి ఉంటుంది. స్పానిష్ వ్యక్తులు అందరూ పిల్లలతో కేవలం తమ భాష మాత్రమే మాట్లాడేవారు. పిల్లలకు అదే అలవాటు చేసేవారు. అలాగే జర్మనీ నుంచి వలస వచ్చినవారు తమదైన ఒక దినపత్రికను ప్రచురించుకునేవారు. పైకి కనిపించే ఒక పద్ధతి కింద ఇటువంటి విషయాలు చాపకింద నీరులాగా ఉండేవి.

ఫండ్ ఉద్యోగులకు ఆ దేశంలో ఏ హక్కులు ఉండవు. మాకు ఒక ప్రత్యేకమైన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇచ్చేవారు. ఈ పరిస్థితి 1980 వరకు కొనసాగింది. ఆ తర్వాత యూస్ సెనేట్ కు చెందిన సిమ్సన్, కాంగ్రెస్కు చెందిన Mazzoli అనే వ్యక్తుల కృషి వలన ఇమిగ్రేషన్ లో కొన్ని సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాతనే మేము మా పిల్లలకు గ్రీన్ కార్డులకు దరఖాస్తు చెయ్యగలిగాం, ఇల్లు కొనుక్కోగలిగాం. అంతకుమించి మరే హక్కులు మాకు రాలేదు. అంతర్జాతీయ సంస్థలో పని చేస్తున్నామన్న మాట తప్పితే అక్కడి పౌరజీవితంలో ఏరకంగానూ భాగం కాలేకపోయేవాళ్లం. ఈ లోపాలు పెద్దవేగాని, అవి అమెరికాలో జీవించడానికి మాకేరకంగానూ ఆటంకపరచలేదు. మాతృదేశానికి వెళ్లి వచ్చేందుకు కుటుంబానికి రెండేళ్లకోసారి సదుపాయం కల్పించేది ఐ.ఎమ్.ఎఫ్. దానికోసం అందరూ ఆత్రుతగా వేచి చూసేవారు. మా ఇంట్లో మరీ ఎక్కువగా వేచి చూసేవారు.

******

 

ఫండ్ లో చేరిన ఉద్యోగస్తుల మొదటి పని ఏమిటంటే ఐఎన్ఎస్ పనితీరు గురించి సంస్థ గురించి కూలంకషంగా తెలుసుకోవడం. ఒక ఉద్యోగి ఎంత పైకి ఎదుగుతాడు అనేది అతను ఫండ్ అవసరాలకు తనను తాను ఎలా తీర్చిదిద్దుకున్నాడు, తన పనిని ఎంత విజయవంతంగా పూర్తి చేస్తాడు, అతని ప్రతిభ ఏమిటి, సామర్థ్యం ఎంత – వీటిమీద ఆధారపడి ఉంటుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రపంచ వాణిజ్యానికి సాయపడటం.

అప్పటికి అది ఇంకా ఆలోచన స్థాయిలోనే ఉండేది. ఫండ్ అనేది కాలానుగుణంగా తనకు తాను ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ సర్దుబాట్లు చేసుకుంటూ వచ్చింది. అప్పటికి ఫండ్ లో ఉన్న సభ్యదేశాలు వందకు లోపే. సోవియట్ రష్యా దేశాలు, క్యూబా, తూర్పు యూరప్ దేశాలు ఇందులో ఉండేవి కాదు. వాటిలో ప్రతి ఏడాది ఆర్థిక సర్వే చేయడం, అభివృద్ధిని కొలవడం అనేది ఫండ్ ప్రాథమికమైన బాధ్యత. దానివల్ల విదేశీ మారక ద్రవ్యం లో విలువలో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి రెగ్యులేట్ చేయడానికి వీలుంటుంది అని భావించేవారు. అప్పటికి ఫిక్స్డ్ రేట్ విధానం ఉండేది, ఆ రేటు మార్చాలంటే ఫండ్ అనుమతి ఉండాలి.

 

ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ పనులను క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇలా ఉండేవి.

ఒకటి – సభ్యదేశాలతో వార్షిక సమావేశాలు జరపడం. రాజకీయ అనిశ్చితి, యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు ఉంటే తప్ప అవి తప్పక జరిగి తీరుతాయి. రెండోది – విదేశీ మారక ద్రవ్య రేటును స్థిరంగా ఉంచడం. అది మారాలంటే ఫండ్ అనుమతి తప్పనిసరి. ఇది చాలా పెద్ద పని, వివాదాస్పదమైనది. ఈ పని వివిధ దేశాల్లో రాజకీయ ఆందోళనలకు దారి తీసింది. ‘ఫండ్ అంటేనే ద్రవ్య విలువను తగ్గించే సంస్థ’ అన్నంత అపఖ్యాతిని మూటగట్టుకుంది. లాటిన్ అమెరికాలోని అనేక దేశాల్లో ఫండ్ అంటే ఇష్టం ఉండేది కాదు. కాని అవి పెద్ద సమస్యలు సృష్టించుకుని ఆర్థిక సాయం కోసం ఫండ్ వైపే చూసేవి. ఫండ్ వాటిని ఆదుకోవడమూ జరిగేది. ఈ అపఖ్యాతికి మూలకారణమైన ‘ఫిక్స్ డ్ ఎక్స్ ఛేంజ్ రేటు’ 1973లో అంతమైపోయింది. ఇప్పుడెవరూ ‘డీవాల్యుయేషన్’ అని మాట్లాడటం లేదు. ‘ఎక్స్ ఛేంజ్ రేట్ అప్రిసియేషన్’ అంటున్నారు. ఇప్పుడిది మార్కెట్లో రొటీన్ వ్యవహారం అయిపోయింది.

మూడోది – మాక్రో ఎకనామిక్ పాలసీలను సరిగా అమలు చేసేందుకు సభ్య దేశాలకు అవసరమైన టెక్నికల్ అసిస్టెన్స్ అందించడం. 1960కే ఇటు ఫండ్ కూ అటు సభ్య దేశాలకూ అర్థమైంది. చాలాకాలం బ్రిటిష్ వారి వలస పాలనలో ఉండిపోయి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల్లో సెంట్రల్ బ్యాంక్ కార్యకలాపాలను ఒక గాడిన పెట్టడానికి, ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేసే విధానాల రూపకల్పనకు ఆయా దేశాల ఆర్థిక శాఖలకూ కొంత గైడెన్స్ అవసరమయ్యేది.

టెక్నికల్ అసిస్టెన్స్ అందించడానికి ఫండ్ మూడు విభాగాలను ఏర్పాటు చేసింది. సెంట్రల్ బ్యాంకింగ్, ఫిస్కల్ అఫైర్స్ కు రెండు, ఫైనాన్షియల్ ప్రోగ్రామింగ్, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ వంటి అంశాల్లో ఉన్నతాధికారులకు శిక్షణనివ్వడానికి ఒక విభాగం – మొత్తం మూడు ఏర్పడ్డాయి. ఈ శిక్షణ 1990ల నాటికి ఫండ్ ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా అవతరించింది, క్రమంగా దాని పరిధి కూడా విస్తరించింది. పారదర్శకత, అవినీతి నిరోధం వంటి ఎన్నో అంశాలు వచ్చి చేరాయి.

90ల వరకూ ఉన్న పత్రాలను తిరగేసి చూస్తే అవినీతి అన్నమాట ఎక్కడా కనిపించదు. నేను ఫండ్ కు సమర్పించిన ఒక డాక్యుమెంట్ లో ఆ పదాన్ని వాడినప్పుడు ఫుట్ నోట్ ఇచ్చాను ప్రత్యేకంగా. అయినా సరే, ఫండ్ సెక్రటరీ ఆ పదాన్ని తీసెయ్యమని నాకు ప్రత్యేకంగా చెప్పారు. నేను ఆయన మాట మన్నించి, వాస్తవాలను తెలియజెప్పేందుకు వేరే పదాన్ని వాడాను. కాని ఇప్పుడు అవినీతి అనేది విశ్వవ్యాప్తమయింది, విశ్వరూపం చూపిస్తోంది.

కొత్త విభాగాల్లోకి కొత్త నిపుణులు కావలసి వచ్చారు. 1980ల్లో సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కు, మాక్రో ఎకానమిస్టుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. సంస్థలో అదొక వర్ణవ్యవస్థలాగా ఏర్పడిపోయింది, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది. ఈ పనుల్లో ఒక హైరార్కీ ఉన్నప్పటికీ, అవి ఒకదానికొకటి పూరకాలు. దైనందిన జీవితంలో కలిసి పనిచెయ్యాల్సిన విభాగాలు.

ఎగ్జిక్యూటివ్ బోర్డ్, మేనేజ్ మెంట్, స్టాఫ్ అనే మూడు అంచెల్లో ఫండ్ నిర్మాణం ఉంటుంది. పాలసీ మేకింగ్ బోర్డు పరిధిలో ఉంటుంది. ప్రతి దేశం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. సాధారణంగా అన్ని కొత్త ప్రతిపాదనలు మేనేజ్ మెంట్, స్టాఫ్ నుంచే వచ్చేవి. వాటిని పరిశీలించి బోర్డ్ అనుమతిస్తుంది. బోర్డ్ తిరస్కరించిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేవు.

స్టాఫ్ అంతా ‘ఏరియా డిపార్ట్ మెంట్స్’లో ఉంటారు. రీసెర్చ్, ఎక్స్ ఛేంజ్ అండ్ ట్రేడ్ రిలేషన్స్, ఫిస్కల్ అఫైర్స్ వంటివి ఏరియా డిపార్ట్ మెంట్స్. కొన్నికొన్ని దేశాలను కలిపి ఒక బృందంగా పరిగణిస్తారు. స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది. అది ఒక ప్రత్యేక అంశంలో చేపట్టే పనిని మిషన్ అంటారు. అందులో నలుగురు సభ్యులుంటారు. ఇవి ఆర్నెల్లకోసారి వెళ్లేలా ప్లాన్ చేస్తారు. చాలా సూక్ష్మస్థాయి ప్రణాళికతో వెళుతుంది మిషన్. ఒక దేశం వెళితే దానిగురించిన సమస్తమైన సమాచారం వచ్చేసేలా పనిచేస్తుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, పరిష్కారాలు అన్నీ బోర్డుకు నివేదిక ఇస్తుంది. ఆ రకంగా ఫండ్ లో బోర్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. సమయానుగుణమైన విశ్లేషణ, సూచనలు ముఖ్యమని బోర్డ్ భావిస్తుంది.

మాకియవెల్లీ రాశాడు – ‘ఏదైనా రోగాన్ని తొలిదశలో కనిపెట్టడం కష్టం, కనిపెడితే తగ్గించడం సులువు. ముదిరిపోతే కనిపెట్టడం సులువైపోతుంది, కాని తగ్గించడం కష్టం. దేశాల ఆర్థిక వ్యవహారాలూ అంతే’ అని. ఐ.ఎమ్.ఎఫ్. కూడా ఈ సూత్రాన్నే విశ్వసిస్తుంది. ఫండ్ సభ్య దేశాలకు ఇదే పెద్ద వరం. కాని మిషన్ పని చాలా ఒత్తిడిగా ఉంటుంది. తక్కువ సమయంలో ఒక దేశ ఆర్థికవ్యవస్థను మదింపు వెయ్యడం గొప్ప ఒత్తిడి. దాన్ని తట్టుకోలేక సంస్థను వదిలి వెళ్లిపోతారు కొందరు. ఎంత బాగా చేసినా అన్నిసార్లు మిషన్లు విజయవంతమవుతాయనేం లేదు. ఆయా దేశాలు పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోయినా సఫలం కావు. దానికి 1990ల్లో కొరియా, ఇండొనేసియా, థాయిలాండ్ ఉదాహరణలు.

ఒక్కో డిపార్ట్ మెంట్ లో వివిధ పనులకు వివిధ డివిజన్లుంటాయి. వీటిని డైరెక్టర్ నేరుగా పర్యవేక్షిస్తారు, డిపార్టుమెంటుల్లోని సీనియర్ అధికారులు డైరెక్టర్ కు సహకరిస్తారు.

అధికారం మారిపోయినప్పుడల్లా ఉన్నతాధికారులు మారిపోవడం ఎక్కడైనా సర్వసాధారణం. కాని ఫండ్ లో అలా జరగదు. అంతా డైరెక్టర్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. స్టాఫ్ ఆయన ప్రణాళికలను అమల్లోకి తీసుకురావాలి. గ్రేడ్లను బట్టి జీతాలు ఉంటాయి. బాగా పని చేస్తే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు త్వరగా వస్తాయి. నేను చేరినప్పుడు ఫండ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులుండేవారు కాదు. అందరూ రెగ్యులర్ ఉద్యోగులే. ప్రతిభ చూపనివారు, అసమర్థులు ఎలాగోలా కొనసాగడం కుదరదు. కొందరు తమ ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవలసి వస్తుంది. వారు బయట అవకాశాలు పోగొట్టుకోకుండా రాజీనామా వెళ్లవలసిందిగా అడుగుతారు. పనిలోంచి తొలగించడం ఎప్పుడోగాని జరగదు.

పనుల్లో, ఉద్యోగుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నా ఫండుకు తనదైన ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంది. అది చేపట్టే మిషన్లు, సమర్పించే నివేదికల్లో అవి ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఫండ్ ప్రభావం, పనితనం ఆయా దేశాలు మిషన్లకు ఎలా స్పందిస్తాయన్నదానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒప్పందాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆయా దేశాలు ఆ ప్రోగ్రాములను ఎంత సమర్థంగా నడిపించాయన్నదీ కీలకమే. అది ఎలా నడిపించాలో ఫండ్ స్టాఫ్ మొదట్లో చెబుతారు, కాని వాటినుంచి దూరం జరిగిపోతే కష్టమే. అలాగని దేశాల తప్పొప్పులకు ఫండ్ ఎవరినీ శిక్షించదుగాని కొత్త ఒప్పందాలు చెయ్యదు, కొత్త నిధులు ఇవ్వదు.

ఫండ్ సంస్థాగతమైన ఏర్పాటు గురించి ఎంత చెప్పినా, ఫండ్ పని తీరును అది పూర్తిగా వివరించదు.

అన్ని సంస్థల్లో ఉన్నట్టే ఇక్కడా కొందరు పవర్ సెంటర్స్ గా ఉంటారు. అసలు బాసుల కన్న వాళ్లే ఎక్కువ అధికారం చెలాయిస్తుంటారు. పారిశ్రామిక దేశాల స్టాఫ్ కొందరు కలిసి ఇటువంటి సెంటర్స్ గా రూపొందుతారు. పాలసీ రూపకల్పన మొదలు ఉద్యోగాల భర్తీ వరకు అన్నిటా తమదైన పెత్తనం నడిపిస్తారు. నిజమైన మేనేజ్ మెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కన్నా తమ ప్రణాళికలను అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు.

ఉదాహరణకు ఒకసారి ఎమ్.డి. ఒక నిర్ణయం తీసుకున్నారు, అదేమంటే, ఆర్థికశాఖ, సెంట్రల్ బ్యాంకుల్లో అనుభవమున్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని. కాని ఈ పవర్ సెంటర్స్ ప్రభావంతో అది నామమాత్రంగా జరిగింది, ఎక్కువమందిని అకడమిక్ రంగాల నుంచే తీసుకున్నారు.

ఏదిఏమైనా, ఫండ్ పనితీరు బయట ఎవరికీ పెద్దగా తెలియదు, దాని ప్రభావం మాత్రమే తెలుస్తుంది.

ఐ.ఎమ్.ఎఫ్. సంస్థ చిన్నది, పిరమిడ్ తరహా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది. ఉన్నత స్థానాలకు చేరాలంటే తీవ్రమైన పోటీ ఉంటుంది. పైకి ఎదగాలంటే రెండు మార్గాలున్నాయని చెప్పుకుంటారు. ఒకటి మనల్ని మనం పొగుడుకోవడం, రెండు సాటివారిని విమర్శించడం. దీనిలో భాగంగా భయంకరమైన వదంతులు పుడుతుంటాయి, సత్యం గాయపడుతుంది. ఇటువంటివాటి జోలికి పోకుండా తమ పనేదో తాము చేసుకుంటూ పోతామనేవారికి పైకి వెళ్లే అవకాశాలు తక్కువ. రంగు, రూపు, జాతీయత, విద్యార్హతలు – అన్నీ ఎదుగుదలలోనూ, సంస్థాగత రాజకీయాల్లోనూ ఎంతోకొంత పాత్ర పోషిస్తాయి.

భేదాభిప్రాయాలను మన్నిస్తామని అంటారుగాని, వాస్తవానికి ఏది వ్యతిరేకించినా అక్కడ మనుగడ ఉండదు. వారిని వెలేసినట్టు చూసి, తమంతతాము రాజీనామా చేసి వెళ్లిపోయేటట్టు చేస్తారు. ‘ఎదురుగా వచ్చి నిన్ను పొడిచేవాణ్ని స్నేహితుడిగానే భావించు’ అని ఆస్కార్ వైల్డ్ వ్యంగ్యంగా అన్నాడుగాని ఇక్కడ తాము ఎదగడానికి ఎదుటివారిని వెన్నుపోటు పొడవడానికి వెనకాడేవారు తక్కువ. శవాల మీద నుంచి నడుచుకుంటూ పైకి ఎదిగేవారు అనేకమంది.

వాషింగ్టన్ లో ఒక సామెత ఉంది – ‘నీకు స్నేహితులు కావాలంటే కుక్కను పెంచుకో’ అని. అది నాకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఉద్యోగ భద్రత అనేది ఒక తరహా నిర్లక్షానికి, రొటీన్ కీ దారి తీస్తే ఉద్యోగంలో అభద్రత అనేది అవిధేయత, కౄరత్వం, నమ్మకద్రోహం, నిరంకుశత్వం, దగా వంటి అన్ని అల్పగుణాలకూ తావిస్తుందని ఫ్రెంచ్ తత్వవేత్త Montaigne అంటాడు. అది నిజమని అర్థమయింది.

* * * * * *

 

పార్టిసిపేటరీ ఫిస్కల్ ఎకానమిస్టుగా నా సేవలను వాడుకోవాలన్న గూడే నిర్ణయానికి మరింత ప్రేరణ – యూరోపియన్ డిపార్టుమెంటు నుంచి బదిలీ అయి వచ్చిన బిల్ బెవరిడ్జ్ రూపంలో దొరికింది. బిల్ ఆస్ట్రేలియన్ దేశస్థుడు. ఆర్థికవేత్త, పూర్వం బ్రిటిష్ కామన్వెల్త్ డివిజన్ లో పనిచేసేవారు. ఏరియా డిపార్ట్ మెంట్ తమకు ఉపయోగపడతారనుకున్నవారిని కలిసి పనిచెయ్యడానికి ఆహ్వానించేది. అలా వారితో కలిసి పనిచేసేవారు. ఈ నేపథ్యంలో శ్రీలంక కేసు వచ్చింది.

అది 1970. శ్రీలంకలో ఎన్నికలు జరిగి శ్రీమతి సిరిమావో బండారనాయకే ప్రధానమంత్రి అయ్యారు. ఆ ప్రభుత్వంలోని ఆర్థికమంత్రి పెరియెరా ట్రాట్ స్కీ పంథావారు. ఆయన ఫండ్ ను విమర్శించేవారు. అతని మొదటి బడ్జెట్ ప్రసంగం అంతా ఫండ్ ను, పూర్వ ప్రభుత్వాలను దుమ్మెత్తి పొయ్యడానికే కేటాయించాడు. కాని వాళ్లకెంత నచ్చకపోయినా ఆ దేశానికి, ఆ సమయానికి ఫండ్ సాయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఫండ్ ఆసియా డిపార్ట్ మెంట్ ఒక మిషన్ను కొలంబో పంపాలనుకుంది. ఒక బ్రీఫింగ్ పేపర్ తయారుచేసి దాన్ని ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంటుకు కూడా పంపింది.

ఫండుకు సరైన సమాచారం (ఇన్ పుట్స్) ఉండాలని బిల్ బెవరిడ్జ్ ఆశించారు. ఆయన కోరిక మేరకు శ్రీలంక సమస్యలు, ఇబ్బందులు వాటికి పరిష్కారాలను వివరిస్తూ నేనొక మెమొరాండం తయారు చేశాను. అడ్వాన్స్ అకౌంట్స్ అక్కడ పెద్ద విషయం. కొన్ని ట్రేడింగ్ అకౌంట్ల లెక్కాజమా తెలియకపోవడం, పైకి కనిపించకుండా ఉన్న అప్పులు ఇవన్నీ సమస్యలు. నేను నా కామెంట్లన్నిటినీ వివరంగా రాసేసి, అక్కడితో నా పని అయిపోయిందనుకున్నాను. కాని రెండు రోజుల్లో నన్ను మిషన్లో చేరమని, శ్రీలంకకు బయల్దేరమని సందేశం వచ్చింది.

ప్రశాంతత, కనిపించినంతమేరా పచ్చదనం, తీరంలో కొబ్బరితోటలు, కొండవాలుల్లో టీ ప్లాంటేషన్లు – శ్రీలంకను సందర్శించే విదేశీయుల మనసు దోచుకునేవి ఇవే. ఇంత సుందర దృశ్యం వెనుక, ప్రభుత్వాల పనితీరు పట్ల పేరుకుపోయిన నిరాశ ఉండేది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారం రెండు కుటుంబాల మధ్యే మారుతూ వచ్చింది. నిరుద్యోగ యువతలో అశాంతి పెరిగింది. క్యూబా తరహా విప్లవం ఒకటి చేద్దామనుకుని, దానికి మొదటి మెట్టుగా ఆ కుటుంబాలకు చెందని సిరిమావోను ప్రధానిగా చేశారు. ఆమె ఎన్నికల హామీలు నెరవేర్చని పక్షంలో పెద్ద ప్రతిఘటనే చేద్దామని సమాయత్తం అవుతున్నారు. కాని ప్రభుత్వానికెన్నో పరిమితులు. ఆర్థికమంత్రి పెరియెరా వయోవృద్ధుడేగాని అతని ధోరణిపట్ల సొంత ప్రభుత్వంలోనే నమ్మకం లేదు. మాజీ ఆర్థికమంత్రి ఫెలిక్స్ బండారనాయకే ప్రధానికి దగ్గర. వాళ్లంతా పెరియెరా ఫండుతో తొలి కార్యాన్ని ఎలా చక్కబెడతాడో చూద్దామని వేచి కూర్చున్నారు.

బడ్జెట్ ఎస్టిమేట్లను భారీగా రివిజన్ చెయ్యాల్సిన పని పడింది మిషన్ కి. వాస్తవానికి ఇది ఫండ్ స్టాఫ్ మాత్రమే చెయ్యాలి. అదే సంప్రదాయం కూడా. కాని నేను రివిజన్ ప్రతి దశలోనూ శ్రీలంక ట్రెజరీ అధికారులుండాలని పట్టుపట్టాను. దానికోసం వాళ్లూ నేనూ కలిసి పనిచేసేవాళ్లం. దాంతో క్రమేణా వారికి నమ్మకం పాదుకుంది నాపట్ల. మిషన్ సవరించిన బడ్జెట్ ఎస్టిమేట్లు ఇచ్చే సమయానికి ఇరు పక్షాల మధ్య పూర్తి అంగీకారం కుదిరింది. ఒకప్పుడు శత్రుభావమూ, అపనమ్మకమూ ఉన్నచోట ఇప్పుడొక నిర్మాణాత్మకమైన సహకారం సాధ్యమైంది. దానికి మంత్రి కూడా మద్దతిచ్చారు. దాంతో ఆ సంబంధం మెరుగయింది. అదంతా నా ప్రయత్నం వల్లనే అని నేను ఇరువైపులవారూ నన్ను ఇష్టపడ్డారు. ఆపై ఫండ్ శ్రీలంకకు పంపే అన్ని మిషన్లలోనూ నేను తప్పనిసరి సభ్యుణ్ణయ్యాను.

తర్వాత శ్రీలంకలో ఒక రాజకీయ అసంతృప్తి రాజుకుంది. ఒక ఏడాదిలోపే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవం జరిగింది. రాజధాని కొలంబో సరిహద్దుల వరకు విస్తరించింది. ఇండియా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి లభించిన సైనిక సాయంతో ఆ ప్రభుత్వం దాన్ని అణిచేసిందిగాని చాలా ప్రాణనష్టం జరిగింది. ఇరువైపులా వేలమంది చనిపోయారు. నేను ఆ దేశానికి వెళ్లినప్పుడు భారత, పాకిస్తానీ బలగాలు ఎయిర్ పోర్టు రన్ వేకు అటూఇటూ ఉండటం కనిపించింది. కాని ఆ దృశ్యం త్వరగా మారిపోయింది. శ్రీలంకలో కాస్త శాంతి నెలకొనే సమయానికి బంగ్లాదేశ్ లో యుద్ధం మొదలైపోయింది. పాకిస్తానీ దళాలు పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్లడానికి మధ్యలో స్థావరంగా శ్రీలంక ఉపయోగపడింది.

అలాగ శ్రీలంకలో శాంతి స్వల్పకాలికమైనదే అయింది. తమిళుల పట్ల సింహళీయులు చూపిన వివక్ష అంతర్యుద్ధానికి దారితీసింది. పదేళ్లపాటు దేశాన్ని అతలాకుతలం చేసింది, మానవ నష్టం అంతాఇంతా కాదు.

నేను ఫండ్ నుంచి రిటైరయిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సిలోన్ వారు తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్లో కొన్ని ప్రసంగాలు చేసేందుకు నన్ను ఆహ్వానించారు. అప్పటికి ఆ దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి నా కళ్లకు కట్టింది. ఆకాశ హర్మ్యాలు కనిపించాయి. కాని ఆ రెండు జాతుల మధ్య విద్వేషం, అపనమ్మకం పూర్తిగా అంతరించిపోలేదని కూడా స్పష్టంగానే తెలుస్తూ ఉండేది.

శ్రీలంక మిషన్ లో పని విజయవంతంగా చేశానుగనక తర్వాత నుంచి ఫండ్ నన్ను ఇతర ఆసియా దేశాల మిషన్లలో భాగం చేస్తూ ఉండేది. ఆ రకంగా ఆసియా దేశాలు, ఫండ్ లోని ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ మధ్య ఒక దీర్ఘకాలిక, నిర్మాణాత్మక బంధం ఏర్పడింది. దానికి సరైన పునాది వేసినందుకు నాకు సంతృప్తిగా ఉంటుంది.

* * * * * *

మేం అమెరికా వచ్చి ఏడాది పూర్తి కావొచ్చింది. మా స్నేహ పరివారం విస్తరించింది. పాత స్నేహితులు కొందరు అక్కణ్నుంచి భారత్ కు వెళ్ళిపోయారు. మిన్హాస్ మరికొంత కాలం ప్రపంచ బ్యాంకులో ఉండేవారేగాని ఆయనకు ప్లానింగ్ కమిషన్ లో సభ్యుడిగా చేరే అవకాశం వచ్చింది. ఆయనకా సూచన రాగానే నాతో చర్చించారు. నేనూ, మరో స్నేహితుడు వినోద్ దూబే తప్పక చేరమంటూ ప్రోత్సహించాం. దాంతో ఆయన కుటుంబం ఇండియాకు వెళ్లిపోయింది. మాకు బాగా దగ్గరైన మరో కుటుంబం సుందరం వాళ్లది. ఇండియన్ సప్లై మిషన్ లో ఆయన మూడేళ్ల వ్యవధి పూర్తయిపోయింది. వాళ్లూ వెళ్లిపోయారు. మేం వాషింగ్టన్ లో కుదురుకోవడానికి సహకరించిన రెండు కుటుంబాలూ వెళ్లిపోవడంతో మాక్కొంత బాధ కలిగింది. కాని ఆ స్నేహాలు నేటికీ నిలిచి ఉన్నాయి.

విచారకరమైన విషయం ఏమిటంటే మిన్హాస్ ప్లానింగ్ కమిషన్ లో సభ్యుడిగా ఎక్కువ కాలం కొనసాగలేదు. రాజీనామా చేశారు. ఆయనకు రాజకీయ సంబంధాలు, స్నేహాలు నెరపడం రాదు. అందుకే తర్వాత ఆయన అకడమిక్ రంగంలో – ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో కొనసాగారు.

ఎక్కువ మిషన్లలో పాల్గొంటున్న కొద్దీ – ప్రభుత్వాల ఆర్థిక సమాచారం (డేటా) విశ్లేషణ పూర్తిగా కొత్త తరహాలో సాగాలన్న విషయం నాకు స్పష్టమవుతూ వచ్చింది. సమాచార నాణ్యతను పెంచడానికి ఇంకాస్త ప్రయత్నం అవసరం అనీ బోధపడింది.

ఆ సమయంలో ఫండ్ లోని జపాన్ మిషన్ చీఫ్ నన్ను పిలిచి జపనీస్ ప్రభుత్వ లెక్కలను పరిశీలించి, ఏయే మార్పులు అవసరమో చెప్పమన్నారు. అప్పటికి జపాన్ లో కొన్ని ఆధునిక మార్పులు జరిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ సంప్రదాయంగానే ఉండేది. ఫిస్కల్ ఇన్వెస్ట మెంట్ లోన్ ప్రోగ్రామ్ అనేది జనరల్ అకౌంట్ లేదా మెయిన్ బడ్జెట్ కు ఆవల ఉండేది. ఇదిగాక వేర్వేరు ప్రయోజనాలకు వేర్వేరు స్పెషల్ అకౌంట్లు ఉండేవి. వాటన్నిటినీ కలిపి పరిగణిస్తే తప్ప జపాన్ ఆర్థిక వ్యవస్థను మదింపు వెయ్యడం కుదరదు. కేవలం జనరల్ అకౌంటును మాత్రమే పరిగణించి చేసే ఏ లెక్కా సరి అయిన ఫలితాలనివ్వదు.

ఈ విషయాన్ని నేను జపాన్ ప్రభుత్వానికి తెలియజేశాను. ఒక కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ తయారుచెయ్యడానికి ఏక-వ్యక్తి మిషన్ ఉంటే మంచిదని మేం సూచించాం. ఆ సమయంలో ఫండులోని ఆసియా డిపార్ట్ మెంటు వారి జపాన్ డెస్కులో ఆ దేశ ఆర్థిక శాఖ నుంచి వచ్చిన వ్యక్తులు పనిచేసేవారు. వారికీ, జపాన్ ఆర్థికశాఖకూ కూడా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి విచారణ చెయ్యడం రుచించలేదు. ఫండ్ మేనేజ్ మెంట్ పెద్దగా ఒత్తిడి పెట్టాక, వాళ్లు ఒప్పుకున్నారు. కాని ఏరకమైన ఉత్సాహమూ చూపలేదు. అంతకుముందు ఏడాది లెక్కలు ఇవ్వడానికీ వాళ్లకు కష్టమైంది. దాంతో గవర్నమెంట్ ఫైనాన్స్ డేటా సేకరించడంలో మరింత పద్ధతి అవసరమని మాకు మరోసారి విశదమైంది.

అప్పుడు ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడింది. దానిలో ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్, బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి నేను ప్రతినిధులుగా ఉంటాం. ఆర్థిక సమాచారం సంపాదించడానికి అవసరమైన విధివిధానాలు నేను రాశాను. తర్వాత కొరియా, థాయిలాండ్ మిషన్ లను కూడా ఈ పద్ధతుల్లో అవలంబించి చూశాను.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఒ.ఇ.సి.డి)లో 23 దేశాలు సభ్యులు. ఆ సంస్థ ముఖ్య కార్యాలయం పారిస్ లో ఉంటుంది. వారి కోరిక మీద డ్రాఫ్ట్ మాన్యువల్ ఆఫ్ రెవెన్యూ స్టాటిస్టిక్స్ రాసిచ్చాను. ఈ క్రమంలో నాకు అనుభవం, ఆత్మవిశ్వాసం పెరిగాయి. గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్స్ స్టాటిస్టిక్స్ మీద తొలి మాన్యువల్ రాశాను. తర్వాత దాని విస్తరణ జరిగింది. ఫండ్ సభ్య దేశాల నుంచి ఏడాదికోసారి ప్రభుత్వ ఫైనాన్స్ డేటా సేకరణకు ఆ విధంగా పునాది పడింది. అదే 1972లో బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లో వేరే డివిజన్ స్థాపనకూ దారి తీసింది. రిచర్డ్ గూడే దానికి సహకరించారు. బ్యూరో డైరెక్టర్ ఎర్ల్ హిక్స్. ఆ డివిజన్ తరఫున కొత్త పనులు చేపట్టడానికి తగినంతమంది నిపుణులు లేనందువల్ల నన్ను తీసుకోవాలని హిక్స్ అనుకున్నారు. ఆయన గూడే వద్ద ప్రస్తావిస్తే ఆయన నాకు చెప్పారు. అయితే అప్పటికి నన్ను సీనియర్ ఎకానమిస్టుగా ప్రమోట్ చెయ్యాలన్న నిర్ణయం గూడే తీసుకున్నారు. ఆఫర్ గా చూస్తే – డివిజన్ కి అసిస్టెంట్ చీఫ్ గా చెయ్యాలని అనుకున్నారు హిక్స్. అది మంచి ఆఫరే. కాని డేటా కలెక్షన్ లో నాకెలాంటి ఆసక్తి లేదు. అందువల్ల నేను ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంటులోనే సీనియర్ ఎకానమిస్టుగా కొనసాగాలనుకున్నాను.

* * * * * *

తర్వాత కాలంలో అంటే ముఖ్యంగా 1972 – 77 మధ్యన నామీద పనిభారం బాగా పెరిగింది. పనిలో మేధోపరమైన సవాళ్లుండేవి, అలాగే స్ఫూర్తిదాయకంగా ఉండేది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నతాధికారులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్, ఐ.ఎమ్.ఎఫ్. ఇనిస్టిట్యూట్ కలిసి పదివారాల కోర్సు నడిపేది. ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పబ్లిక్ ఫైనాన్స్ వారికి బోధించాలి. అది మా అకడమిక్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చాలా సాయపడింది. వివిధ దేశాల్లో అధికారులకు ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడింది. ఫండ్ భవనాల్లో ఏసీ గదుల్లో కూర్చుని ఎక్కడో వేల మైళ్ల ఆవల ఉన్న దేశాల కోసం ప్రణాళికలు, వ్యూహాలు రచించడం సులువు. కాని వాస్తవంలో అవి విజయవంతం కావాలంటే, ఆచరణయోగ్యం కావాలంటే అక్కడి పరిస్థితులు తెలియాలి. ఆ రకమైన అవగాహనకు ఆ ప్రోగ్రామ్ ఇరుపక్షాలకూ మేలు చేసింది. ఫండ్ స్టాఫ్ సభ్య దేశాల గురించి నేర్చుకున్నారు, దేశాల అధికారులేమో ఫండ్ పనితీరును అర్థం చేసుకున్నారు.

1973లో ఈ కోర్సుకు కోర్డినేటర్ గా ఉండమని రిచర్డ్ గూడే నన్ను అడిగారు.

అప్పట్లో ఆ ప్రోగ్రామ్ టాక్స్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టేది. గవర్నమెంట్ బడ్జెటింగ్ మీద కొద్దిగా చెప్పినా, పబ్లిక్ ఎక్స్ పెండిచర్ మీద ఒక్క క్లాసు కూడా ఉండేది కాదు. నేను కోర్డినేటర్ గా ఉంటానని అంగీకరిస్తున్నప్పుడే కోర్సు డిజైన్ కొద్దిగా మారాలని గూడేతో చెప్పాను. దాన్ని ఆయన పూర్తిగా వ్యక్తిగతంగా చేశారని, ఆయనకు ఆ డిజైన్ అంటే అభిమానమని నాకప్పుడు తెలియదు. కాని ఆయన కూడా నాతో ఏమీ అనలేదు. ఆయన స్పందన ముభావంగా ఉండటం చూసి ఎక్కువ మార్పులు చెయ్యడం కుదరదని నాకు అర్థమైంది.

భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేసి నేను నేర్చుకున్న విషయం ఒకటి ఉంది. సీనియర్ అధికారులకు ఏదైనా చెప్పాలంటే దాన్ని మౌఖికంగా చర్చించకూడదు. రాతపూర్వక ప్రతిపాదనగా వెళ్లాలి. అలాగయితేనే, ఒకవేళ వాళ్లు దాన్ని తిరస్కరించాలన్నా, కారణం చెప్పవలసి వస్తుంది.

కోర్సు మార్పుచేర్పుల కోసం నేనిదే పద్ధతిని ఎంచుకున్నాను. మాక్రో ఎకనామిక్స్, పబ్లిక్ ఎక్స్ పెండిచర్ బడ్జెట్స్, టాక్స్ పాలసీ, టాక్స్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులను చేరుస్తూ నేను రూపొందించిన అవుట్ లైన్ ఒకటి ఆయనకు రాతపూర్వకంగా సమర్పించాను. అందులో కొన్ని మంచి విషయాలున్నాయని ఆయన గ్రహించారు. ఇంకాస్త వివరంగా కావాలని అడిగితే, అన్నిటికీ సారాంశాలు రాసి తీసుకెళ్లి చూపించాను. అప్పుడాయన అంగీకరించారు. ఇంత చిన్న అడుగు, తర్వాత కాలంలో ఐ.ఎమ్.ఎఫ్. పబ్లిక్ ఎక్స్ పెండిచర్ స్టడీలో నిమగ్నం కావడానికి తొలిమెట్టుగా పనిచేసింది.

కొత్త తరహా కోర్స్ బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఆ పై ఏడాదికి దరఖాస్తుదారులు మూడింతలయ్యారు! అది గమనించిన గూడే మళ్లా నన్నే కోర్డినేటర్ గా ఉండమన్నారు.

మేం చేస్తున్న పరిశోధనల ఫలితాలను సరిచూసుకోవడానికి ఈ కోర్సులు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వివిధ దేశాల కోసం మేం ప్రణాళికలు వేసేటప్పుడు అవి వాస్తవికంగా, సహేతుకంగా ఉండేట్టు మాకో మార్గ నిర్దేశనం చేశాయి. నా పరిశోధనలో తేలిన అంశాలను కోర్సులో పాల్గొంటున్న అభ్యర్థులకు ఇచ్చేవాణ్ని. వారి కామెంట్లకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసిన తర్వాతే ప్రచురణకు పంపేవాణ్ని. ఫండ్ లోని సహోద్యోగుల్లాగా కాకుండా వారు నిష్పాక్షికంగా, నిర్మాణాత్మకంగా సూచనలిచ్చేవారు. ఫండ్ వారు మొహమాటానికో, మరేదో ఉద్దేశాలతోనో సూటిగా చెప్పేవారు కాదు.

బడ్జెటింగ్ (పబ్లిక్ ఎక్స్ పెండిచర్) గురించి ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంటులో చర్చిస్తే చాలదు, జనబాహుళ్యంలోకి వెళ్లాలి, నాన్- టెక్నికల్ వారు కూడా చదివి అర్థం చేసుకోవాలి అన్నది నా అభిప్రాయం. ఆర్థికశాఖల్లో, సెంట్రల్ బ్యాంకుల్లో పనిచేస్తున్నవారి కోసం

రాయాలనుకున్నాను. అప్పట్లో ‘ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్’ అనే ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో వచ్చేది. అందువల్ల క్లుప్తంగా రాయాల్సి వచ్చేది. దానికి రాయమని నా స్నేహితుడు దీనా ఖట్కటే అప్పటికి కొంతకాలంగా పోరుతున్నాడు. అతని సలహాపై నేను ఆ జర్నల్ ఎడిటర్ స్కాట్ ను సంప్రదించాను. ఆయన వెంటనే స్పందించి రాయమన్నారు. నేనెంత త్వరగా రాసిచ్చానో, అంతకన్నా త్వరగా ఆయన చదివేశారు, పబ్లిష్ చేశారు. అలా వారితో నా అనుబంధం మొదలైంది. పాఠకులు తమ అభిప్రాయాలను ఎడిటరుకు ఉత్తరాల రూపంలో అందజేసేవారు. ఇది ముఖ్యమైన అంశమని అందరికీ క్రమంగా తెలిసి వచ్చింది.

1974లో ఒక టెక్నికల్ అసిస్టెన్స్ మిషన్ చెయ్యవలసి వచ్చింది. ఒక దేశం స్పందనను అనుసరించి ఎక్స్ పర్ట్ ను పంపడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఫీల్డ్ లో తలెత్తే సమస్యలను ఆయన పరిష్కరిస్తాడు. (ఈ ఎక్స్ పర్ట్ అనే పదాన్ని ఫండ్ వాడేది. స్టాఫ్ కన్న అతన్ని విడిగా చూసే గౌరవ వాచకం అది. ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకోవాలనుకునేవారు చాలామంది ఉండేవారు. వారిలో అందరికీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ క్రతువు తెలుసు. దాని ప్రాముఖ్యత, అర్థం తెలిసింది కొందరికే) నేను ఫండ్ లోకి వచ్చింది మొదలు, డయాగ్నస్టిక్ స్టడీ ఉండాలని పదేపదే చెబుతూ వచ్చేవాణ్ని. దేశం దాన్ని అంగీకరిస్తే తర్వాత మరొకరిని పంపవచ్చని నా ఆలోచన. ఈ తరహా పని ఎక్స్ పర్టుకు ఒక ఫ్రేమ్ వర్కునిస్తుంది, ఫండ్ కూ, దేశానికీ ఒక స్పష్టతనిస్తుంది. ఎంత పురోగమించామో లెక్కేసుకోవడానికి పనికొస్తుంది. అడగ్గాఅడగ్గా గూడే దీనికి అంగీకరించారు.

ప్రయోగాత్మకంగా ఏక వ్యక్తి మిషన్ గా నన్ను పంపారు. తూర్పు కరీబియన్ దీవుల్లో ఒకటైన బార్బడోస్ కు.

బార్బడోస్ చాలా చిన్న దేశం. ఎంత చిన్న దేశమంటే – ఎన్నో మునిసిపాలిటీల కన్నా చిన్నదేమో. 21 మైళ్ల పొడవు, 14 మైళ్ల వెడల్పు. ఒకరోజులో కాలినడకన ఆ దేశాన్ని చుట్టిరావొచ్చు. పంచదార, పర్యాటకం ఇవి ఆ దేశ ప్రధాన వనరులు. పర్యాటకమంతా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తర అమెరికాలో చలి విజృంభిస్తే ఈ దీవికి పర్యాటకులు పెరుగుతారు. అక్కడ చలిగనక అంత లేకపోతే ఇక్కడి పరిశ్రమ మూతపడినట్టే.

ఈ దేశం బ్రిటిష్ రాజ కుటుంబానికి శీతకాలపు విడిది. మరో ప్రసిద్ధి కూడా ఉంది. గ్యారీ సోబర్స్, ఫ్రాంక్ వోరెల్, ఎవర్టన్ వీక్స్ వంటి ప్రఖ్యాత క్రికెటర్లు అక్కడ పుట్టినవారే. క్రికెట్ అక్కడ చాలా ప్రసిద్ధి. జనాలకు అదంటే పిచ్చి. బీచుల్లో కూడా ఆడతారు. ప్రజలు ఆహ్లాదంగా, సరళంగా ఉంటారు, శాంతి కాముకులు. జమైకాలాగా కాకుండా ఇక్కడ క్రైమ్ రేటు చాలా తక్కువ.

నేనక్కడికి వెళ్లినప్పుడు ప్రధానమంత్రే ఆర్థికమంత్రి కూడా. మొదటి సమావేశంలోనే ఆయన తమ సమస్యలేమిటో, ఫండ్ సాయం ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పేశారు. మాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. దాంతో మేం పని ప్రారంభించాం. ఆ క్రమంలో మాకు అర్థమైనదేమంటే అక్కడున్నది ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన వ్యవస్థ. అది 1930లకు తగినది. తర్వాత మార్పులకు నోచుకోలేదు. దాంతో బడ్జెట్ రూపకల్పన, అమలు అంతా లోపభూయిష్టంగా నడిచేది. పెద్ద ఖర్చు ఏదంటే జీతాలే. సివిల్ సర్వీస్ అసోసియేషన్ తో చర్చించి ఏడాదికోసారి ఖరారు చేస్తుంది ప్రభుత్వం. అదొక శక్తిమంతమైన ట్రేడ్ యూనియన్. అవినీతి తక్కువేగాని వృధా ఖర్చు, వనరుల వృధా ఎక్కువ. అవినీతి గురించి అక్కడి కాబినెట్ సెక్రటరీ మాట్లాడింది నాకిప్పటికీ గుర్తుంది. ‘మా దేశం ఎంత చిన్నదంటే ఎవరైనా అధికారిగాని, భార్యగాని వారి తాహతుకు మించిన దుస్తులు వేసుకుని ఆదివారం చర్చికి ప్రార్థనకు వస్తే చాలు, అది నాకు తెలిసిపోతుంది..’ అన్నాడాయన. అక్కడి సాంఘిక వాతావరణం ఎలాంటిదో, ‘ఐలాండ్ మెంటాలిటీ’ ఏమిటో నాకిట్టే అర్థమైపోయింది.

నా పర్యటన చివర్లో నేను నా నివేదికను సిద్ధం చేశాను, అధికారులకు అందజేసి మా ముఖ్య కార్యాలయానికి తిరిగి వచ్చేశాను. దాన్ని వాళ్లు సంతోషంగా ఆమోదించారు, ఫండ్ మేనేజింగ్ డైరెక్టరుకు ఒక ఉత్తరం రాశారు. తక్కువ సమయంలో సర్వే పూర్తి చేసి ఒక బ్లూప్రింట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ ఉదాహరణతో డయాగ్నస్టిక్ స్టడీ ఆవశ్యకత గురించి ఫండ్ అర్థం చేసుకుంది. తర్వాత ఎంత పెద్ద మిషన్లు వెళ్లినా, వెళ్లేముందు ఈ స్టడీ తప్పనిసరి అయ్యింది. అటుపైన డిపార్ట్ మెంట్ దృక్కోణం మారింది. దేశాల ఆర్థికస్థితిగతులను మార్చడంలో అది కీలకపాత్ర పోషించడం మొదలుపెట్టింది. పబ్లిక్ ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంటులో సంస్థలను అభివృద్ధి చెయ్యడం ఎంత ముఖ్యమో అది గుర్తించింది. సభ్య దేశాల ఎకనామిక్ మేనేజ్ మెంటు మారేందుకు దోహదం చేసింది.

(సశేషం)

 

అరిగపూడి ప్రేమ్ చంద్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చదివాక “వాహ్” అనుకోదగిన ఆర్టికల్. ఇది తెలుగులోనే రాయబడినది అయితే ఆశ్చర్య పోవాలి. అనువాదం అయితే అత్యత్భుతం. చాలా ఆసక్తికరమైన డాక్యుమెంటేషన్. సంజయ్ బారు లా కాకుండా తెలుగు పాఠకుల కోసమే రాయాలని ప్రేమ్ చంద్ గారు అనుకుంటే అది మన అదృష్టం.

  • ఈ ఆర్టికల్ చదివే వరకు నాకు ఐ ఎం ఎఫ్ ఏంచేస్తుందో తెలియదు. మీ అనువాదానికి నిజంగా హ్యాట్సాఫ్ . చాలా బాగుంది. నాకు ఆయన ఉద్యోగ బాధ్యతలు గురించి ఏమి తెలియకపోయినా , ఒక కుగ్రామం నుండి మొదలయిన ఆయన ప్రస్థానం చదువుతుంటే ఎదో తెలియని ఆనందం, ఆశ్చర్యం. ఇలాంటి మంచి పుస్తకాన్ని / జీవితాన్ని మా ముందుకు తీసుకుని వచ్చ్చిన మీకు అభినందనలు .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు