రెండేళ్ళు అలుపెరుగని ‘కలా పోసన’

నేను కాకినాడలో ఉన్న చిన్నప్పుడు ..అంటే ఇంజనీరింగ్ డిగ్రీ తెచ్చుకుని బొంబాయిలో అడుగుపెట్టే దాకా నా “కలా పోసన” అంతంత మాత్రమే అయినా దానికి చక్ర వడ్డీతో తో సహా కేవలం రెండేళ్ళ లో ..అంటే మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న 1966 నుంచి 1968 దాకా ‘కసి’ తీరేదాకా ఆస్వాదించాను అనే చెప్పాలి. దానికి దోహదం చేసిన వాళ్ళు…ఇంకెవరూ…..మా కిష్టప్ప అను పి. ఆర్. కె. రావు & బి. వై. మూర్తి. అయితే ఈ ‘కలా పోసన ‘లో మా కేంపస్ లో మేము నాటకాలాడడం, తతైక్కలాడడం, ఎలుగెత్తి పాడడం “ఎడారిలో ఆముదం వృక్షం’ లా ఒక ఎత్తు అయితే  బొంబాయిలో సయాన్ అనే ప్రాతంలో ఉన్న షణ్ముఖానంద వేదిక చుట్టూ తిరగడం మరొక ఎత్తు.

దీనికి నాందీ ప్రస్తావన ఎలా జరిగిందీ అంటీ..ఓ రోజు మా రావు వచ్చి నన్నూ, మూర్తినీ “రేపు శనివారం మనం షణ్ముఖానంద హాల్ లో కె.వి. మహదేవన్ నైట్ కి వెళ్తున్నాం ఓచ్” అన్నాడు. ‘సర్లే వెధవ జోకులూ నువ్వూను, ఆ ప్రోగ్రాం మూడు నెలలు ముందే హాలు నిండును. మనం ఇప్పుడు వెళ్తే గేటు బయట నుంచుని పాటలు వినాల్సిందే. ఆ మాత్రం దానికి అంత దూరం ఎవడు పోతాడు. కొలాబా పోదాం… ఈ మద్రాసీ కన్నా అక్కడ పార్సీ రంగు బావుంటుంది” అన్నాం నేనూ, మూర్తీనూ. అప్పుడు జేబు లోంచి మూడు టిక్కెట్లు తీశాడు రావు. ఒక్కొక్కటీ ఏకంగా 30 రూపాయలు. అంటే మొదటి వరస అనమాట. అసలు ఏం జరిగిందంటే ఆ కె.వి. మహాదేవన్ మ్యూజికల్ నైట్ లో ప్రధాన గాయని మన పి. సుశీల అంతకు ముందు రోజే బొంబాయి వచ్చి నప్పుడు ఆవిడ తమ్ముడైన మా రావు వెళ్లి ఆవిడ ఉన్న హోటల్ లో కలిశాడు. మమ్మల్నీ రమ్మన్నాడు కానీ మాకు కుదర లేదు. అప్పుడు ఆవిడ మా ముగ్గురికీ కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇచ్చారు. ఇంకేముందీ…ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకుని ముగ్గురం ఆ కార్యక్రమానికి వెళ్లాం. బొంబాయి షణ్ముఖానంద ఆడిటోరియం మొత్తం ఆసియా ఖండంలోనే అతి పెద్దది ఆ రోజుల్లో. పైగా తమిళ సోదరుల ఆధ్వర్యం అవడంతో ఇంచు మించు ప్రతీ వారం అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటి స్థాయి ని బట్టి నెలల ముందే అక్కడికి వెళ్లి టిక్కెట్లు కొనుక్కోవాలి. ఆ రోజుల్లో ఆన్-లైన్లు, ఫోన్ బుకింగులు, క్రెడిట్ కార్డులు, ఆఖరికి చెక్కులు కూడా జాంతా నై. ఏమైతేనేం మేము ముగ్గురం భయం భయం గా ముందు వరసలో కూచున్నాం. ఆ రోజుల్లో అటు లతా మంగేష్కర్ తో సుశీల సమాన స్థాయిలో ఉండేది. మేము ఆవిడ తాలూకు అతిధులం కాబట్టి కొంచెం కుర్రాళ్లమే అయినా భలే గౌరవంగా చూసుకున్నారు.

నా జన్మ లో సినీ నేపధ్య గాయనీ గాయకులు వేదిక మీద  పాడుతూ ఉండగా ప్రత్యక్షంగా విన్న మొట్టమొదటి సంగీత కార్యక్రమం అదే. వేదిక మీద మృదంగం, తబలా, వయోలిన్, గిటార్, హార్మోనియం, డప్పు, ఫ్లూట్..ఒకటేమిటి అనేక రకాల వాయిద్య నిపుణులు పాపం అలవాటు లేని ఎర్రటి బిగుతైన కోట్లు వేసుకుని, టై కట్టుకుని, చెమట్లు కక్కుకుంటూ  కూచున్నారు. పాపం హాయిగా గాలి తగులుతూ లుంగీ లతో ఉండే వాళ్ళకి ఈ పగటి వేషం వెయ్యడం తో ఇబ్బంది కదా! వాళ్ళ అవస్త  చూసి ‘ఇంకా నయం మనల్ని కూడా అలా వేసుకోమన లేదు అనుకున్నాం’ మేం ముగ్గురం. వాళ్ళందరివీ ఎర్ర కోట్లు అయితే కండక్టర్ హోదాలో ఉన్న పుహళేంది పసుపు రంగు కోటు వేసుకుని వేదిక మీద ఈ మూల నించి ఆ మూల దాకా హడావుడి గా తిరగడం చూసి మాకు భలే నవ్వొచ్చింది. మహదేవన్ గారు మటుకు హాయిగా లుంగీ కట్టుకుని, నుదిటి మీద విభూతి పెట్టుకుని ఎంతో వినయంగా ఒక పక్క కుర్చీలో ఆ రెండు గంటలూ కూచున్నారు. అంత సాత్వీకంగా, నిరాడంబరంగా ఉన్న ఆయన్ని చూస్తే అంత గొప్ప సంగీతం ఎలా సమకూర్చగలిగారా అని ఆశ్చర్యం వేసింది. ఆ రోజున పి. సుశీల, సౌందర రాజన్, శీర్ఖాళి గోవింద రాజన్…ఇంకా ఎవరెవరో అద్భుతంగా పాడారు. సుశీల అయితే చాలా గొప్ప స్థాయిలో ఉన్న రోజులు అవి. అన్నట్టు ఆ రోజుల్లో కీ బోర్డ్ లేదు. నాలుగైదు హార్మోమియాల తోటే ఈ కార్యక్రమాలు ఉండేవి. పైగా టీవీలు లేక పోవడం తో సినిమా తారలు కానీ, గాయనీ గాయకులు కానీ వ్యక్తులుగా మాములు జనాలకి కనపడే అవకాశాలు చాలా తక్కువ. కనపడినా పోలోమని ఫోటోలు తీసేసుకునే ప్రశ్నే లేదు. అందుకే అలనాటి ఫోటోలు అపురుపాలు. ఆ రోజుల్లో నేను ఎంతో మంది గొప్ప కళాకారులని కలిసినా అలాంటి అపురూపమైన ఫోటోలు నా హృదయ ఫలకం మీద తప్ప కాపీలు లేవు. అలాంటిదే ఆ నాటి కె.వి. మహదేవన్ నైట్ కూడా. పి. సుశీల తో నా ఫోటో మరో ముఫై ఏళ్ళు దాటాక మద్రాసు లో వాళ్ళింట్లో తీయించుకున్నదే.

అలా మొదలయిన నా షణ్ముఖానంద ప్రస్థానంలో నేను నా మిత్రులతో కలిసి ఆనందించిన కార్యక్రమాలు, కళా కారులు, విద్వాంసులలో ఇప్పుడు జ్ఞాపకం ఉన్న కొన్ని కర్నాటక సంగీత విద్వాంసుల పేర్లు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, బాల మురళి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, ఎం.ఎల్. వసంత కుమారి, డి,కె. పట్టమ్మాళ్, కె. బాలచందర్, ఈమని శంకర శాస్త్రి, చిట్టి బాబు, ద్వారం వెంకట స్వామి నాయుడు, నేదునూరి మొదలైన వారు.

ఒక సారి బాల చందర్ వీణ కార్యక్రమం లో ఆయన వీణ శృతి చేసుకోడానికి చాలా సమయం తీసుకుంటూ ఉంటే ప్రేక్షకులలోంచి ఎవరో “ఇంకా ఎంత సేపు.మొదలెట్టు” లాంటి అరుపేదో అరిచారు. అంతే!. ఆయన ఠకీ మని లేచి వెళ్ళిపోయాడు. ఆయన్ని బతిమాలి మళ్ళీ వేదిక మీదకి తీసుకు రావడానికి నిర్వాహకులు నానా అవస్తా పడ్డారు. ఆ తరువాత మా కరువు తీరేలా అద్భుతంగా వీణ కచేరీ చేశారు బాలచందర్. ఇంకో సారి మన్నాడే మైకు ముందు నుంచుని పాడుతున్న వాడు ఎందుకో కోపం వచ్చి చేతిలో పుస్తకం తబలా వాడి మీద విసిరేసి వెళ్లి పోయాడు. ఆ రోజుల్లో కారియోకీ యవ్వారం లేనే లేదు. అంతా పూర్తి ఆర్కెస్త్రాతో పాడాల్సిందే. ఏ ఒక్క వాయిద్యం సరి అయిన శృతి లో లేక పోయినా పాడే వాళ్ళు గంగవెర్రుత్తి పోయే వారు. అలాంటి వాళ్ళలో మన్నాడే ఒకడు. గొప్ప కళా కారుల ఇలాంటి ఆవేశకావేశాలు ఎన్ని చూశానో అంత కన్నా గొప్ప ప్రదర్శనలు కూడా అన్నే చూసే అదృష్టం నాదే ఉదాహరణకి చెంబై వైద్యనాథ భాగవతార్ గారికి అప్పటికే ఎనభై ఏళ్ళు దాటాయి. ఇద్దరు మనుషులు ఆయన్ని ఇంచుమించు మోసుకుని వచ్చి మైక్ ముందు కూచోబెట్టారు. అంతే!. ఆయన గొంతు సవరించి పై స్థాయిలో రెండు గంటలు నూటికి నూరు పాళ్ళు తమిళ ఫక్కీలో కీర్తనలు పాడగా వినడం అపూర్వమైన అనుభూతి.    

నేను విని ఆస్వాదించిన ఉత్తరాది వారిలో బిస్మిల్లా ఖాన్, భీమసేన్ జోషి, రవి శంకర్, అంజదుల్లా ఖాన్, మన విజయ రాఘవ రావు గారు మొదలైన వారు. ఇక సినిమా వాళ్ళ కార్యక్రమాల కొస్తే అన్నింటికన్నా మిన్న కిషోర్ కుమార్ షో. ఈ నాడు భారత దేశంలో ఏ భాషలో సినీ సంగీత కార్యక్రమం జరిగినా వాటికి ఆద్యుడు, కొత్త వరవడి సృష్టించిన వాడూ కిషోర్ కుమారే. అతను వేదిక మీద చిన్న చిన్న స్టెప్పులు లయ బద్దంగా వేస్తూ ఏ పాట పాడుతున్నా ప్రేక్షకులు ఉర్రూతలూగి పోయేవారు. అలా అని ఈ నాటి లాటి వారిలా, హాలీవుడ్ వారిలా గెంతులు వేసేవాడు కాదు. తప్పట్లు కొట్టండి బాబోయ్ అని ప్రేక్షకులని బతిమాలే వాడు కాదు. అతని మేజిక్ అటువంటిది. ఆ పాటలు అటువంటివి. అతని పద్దతికి భిన్నంగా మహమ్మద్ రఫీ, మన్నాడే, లతా మంగేష్కర్, ఆఖరికి ఆశా భోన్ల్సే కార్యక్రమాలు సంగీత పరంగా అద్భుతంగానే ఉండేవి కానీ …అందరూ మైక్ ముందు నంచునే పాడేవారు. కిషోర్ కుమార్ కి ఉన్నంత హుషారు ఉండేది కాదు. ఇక మేము చూసిన కూచిపూడి, భరత నాట్యాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే నాటకాలు. నాకు బాగా జ్ఞాపకం ఉన్నది “ఎక్ ఘర్, దోహీ పావ్ ణార్” లాంటి పేరు ఉన్న ఒక మాంచి మరాఠీ డ్రామా. అందులో బొంబాయిలో ఇళ్ళ కొరత కాబట్టి ఒక ఫ్లాట్ యజమాని అతి తెలివి కి పోయి ఒకే ఫ్లాట్ ని రాత్రి ఒక జంట కీ, పగలు ఇంకో జంటకీ అద్దె కిస్తాడు. దాంతో విపరీతమైన హాస్యం సృష్టిస్తాడు రచయిత. రెండు గంటల డ్రామా రెండు నిముషాలలో అయిపోయిన భావన కలిగింది. అలాంటిదే పి.సి. సర్కార్ మేజిక్ షో. పరమాద్భుతం.

ఆ రోజుల్లోనే మా కేంపస్ లో చందూ గాడికి మంచి స్నేహితుడైన షేక్ మహమ్మద్ (పేరు మరీ అంత సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ..అలాంటిదే)…విపరీతమైన శాస్త్రీయ సంగీతాభిమానంతో “స్వరాంజలి” అనే గ్రూప్ ప్రారంభించాడు. అతనికి కూడా స్పూర్తి క్రిందటి వ్యాసంలో నేను ప్రస్తావించిన ఆ నలుగురు అమ్మాయిలే…అరుణ గోఖలే, స్వాతి దత్తా ..వగైరా. అతను మరాఠీ వాడు. అంచేత కేవలం హిందుస్తానీ సంగీతం, మరాఠీ శాస్త్రీయ సంగీతాలు, మహా అయితే బెంగాలీ “రోబీంద్ర షోంగీత్”, లేదా గుజరాతీ భజన సంగీతం తప్ప దక్షిణాది సంగీతం గురించి అవగాహన లేక పోగా చిన్న చూపు కూడా ఉండేది. కానీ కేంపస్ లోనే కర్నాటక సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళు తగిన సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ల లో నాగ రాజ మణీ నటరాజన్ అనే ఆవిడ చాలా అందంగా ఉండేది. తరువాత తమిళం అయినా మాకంటే బాగా తెలుగులో మాట్లాడడమే కాకుండా సాహిత్యం కూడా బాగా చదువుకున్నది. కర్నాటక సంగీతంలో అత్యత్తమ స్థాయికి చేరుకొని హైదరాబాద్, మద్రాసు రేడియో కేంద్రాలకి గ్రేడ్ 1 ఆరిస్ట్ గా అనుభవం ఉన్న విద్వాంసురాలు. అలాగే విశ్వనాథన్ అనే ఆయన కూడా తమిళుడే అయినా తెలుగు వాడే. కాకినాడలో చిట్టి బాబుతో సహధ్యాయిగా ఈమని శంకర శాస్త్రి గారి దగ్గర వీణ నేర్చుకుని అంత బాగానూ వాయించేవాడు. ఇక మా కస్తూరి (సి.యస్. రావు భార్య), సర్వ మంగళ…ఇలా కనీసం పది మంది కర్నాటక సంగీతం బాగా తెలిసిన వారు ఉండగా విని ఆనందించే నా లాంటి శ్రోతలు చాలా మందే ఉన్నారు. అందు చేత “స్వరాంజలి” లో ఒక కర్నాటక సంగీతం కార్యక్రమం పెట్టించమంటే ఆ షేక్ గాడు చస్తే ఒప్పుకో లేదు. పైగా కావాలంటే దక్షిణాది వాళ్ళు వేరే సంగీతం గ్రూప్ పెట్టుకో మన్నాడు. ఈ వివాదం I I T డైరెక్టర్ S. K. బోస్ గారి దాకా వెళ్ళింది. ఆయన బెంగాలీ వాడు. అయితే ఇలా విడి పోవడం ఆయనకి ఇష్టం లేదు.

సరిగ్గా ఆ సమయంలో మన మంగళంపల్లి బాల మురళి గారు షణ్మఖానంద హాల్ లో కచేరీ చెయ్యడానికి బొంబాయి వచ్చారు. అంచేత కేంపస్ లో మొట్టమొదటి కర్నాటక సంగీత కార్యక్రమం బాల మురళి గారిది పెట్టాలని బలవంతం చేయగా ఆ స్వరాంజలి వాళ్ళు ఒప్పుకున్నారు. ఐ ఐ టి విద్యార్ధులు అనగానే బాల మురళి గారు కూడా సరదా పడ్డారు. ఆయన కార్యక్రమం మామూలుగా ఆడిటోరియం లో సాయంత్రం కాకుండా మా మెయిన్ బిల్డింగ్ లో మూడో అంతస్తులో ఒక పెద్ద హాలు లో ఏర్పాటు చేశారు. అక్కడ వేదిక ఉండదు. హిందుస్తానీ వాళ్ళ  ముషాయిరా పద్దతిలో ఒక పెద్ద పరుపు నే వేదికగా చేశారు. శ్రోతలందరం నేల మీద చాపలు వేసుకుని కూచున్నాం.  అంటే ఒక ఛాంబర్ కాన్సెర్ట్ అన మాట. రాత్రి అందరూ భోజనాలు చేశాక తొమ్మిదింటికి బాల మురళి గారి కచేరే మొదలయింది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ అన్నవరపు రామస్వామి గారు వయోలిన్. దండమూడి రామ్మోహన రావు గారు మృదంగం. ఆ రోజు బాల మురళి గారు అద్భుతమైన మూడ్ లో ఉన్నారు. వినడానికి వచ్చిన సుమారు రెండు వందల మందిలో చాలా మంది కుర్రాళ్ళమే. అదే అనుకుంటాను ఆయన ఉత్తేజానికి కారణం. రాత్రి 9 గంటలకి ప్రారంభం అయిన కచేరీ తెల్లారగట్ట రెండు దాకా బాల మురళి గానామృతం తో సాగిందీ అంటే నమ్మలేం. నా జీవితంలో నేను బాల మురళి గారి కచేరీలు కనీసం పాతిక సార్లు విన్నాను. కానీ 1967 లో (మార్చ్ నెల అని జ్ఞాపకం) ఆయన చేసిన ఆనాటి కచేరీ అన్నింటి కన్నా తలమానికం.    

మొత్తానికి ఒక పక్క సాంస్కృతిక సంస్కారం అలవాటు చేసుకుంటూనే చదువు పాడు చేసుకోకుండా 1968 జూన్ నాటికి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను.

ఆ తరువాత ఏమిటీ అనే ప్రశ్న కి జవాబు తరువాత సంచికలో….

*

వంగూరి చిట్టెన్ రాజు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ మరుపు రాని జ్ఞాపకాలు బాగున్నాయి రాజు గారు.

  • మీకొక కధ
    కాదుకాదు ఒక చరిత్ర ఉందండీ…
    ఆహా! మధురం
    మనోహరం
    బహు కళా సంపన్నం…
    మీకు, సారంగకు వేవేల నమస్సులు…

    • మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు, శైలజ గారూ

  • పైన విజయ రాఘవ రావు గారి ఫోటో చూడగానే ….అమెరికాలో ఆయన తో మరచిపోలేని అనుబంధం గుర్తుకు వస్తోంది. మేము వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మొదలు పెట్టినప్పుడు ఆయన ఎంతో దయతో అభినందనలు పంపించారు. అంత కన్నా ఆనందం మా ఉగాది పోటీలకి ఆయన కవితలు, కథలు కూడా పంపించే వారు. అయితే ఒకటి రెండు సార్లు ఆయన్ని వేదిక మీద చూడడం తప్ప ఆ మహానుభావుడిని కలుసుకునే అదృష్టం నాకు కలగలేదు.
    అయితే ఈ వ్యాసం లో నేను ప్రస్తావించిన కొంత మంది గొప్ప కళాకారుల తో మంచి పరిచయమే ఉండడం నా అదృష్టం.

    • ఏదో తంటాలు పడుతున్నాను కదా! అందుకూ…ఎందుకో గానీ ఏదీ రాయకుండా ఉంటే అలుపు వస్తుంది మరి! ఏం చేస్తాం? ఏదో ఒహటి రాస్తూనే ఉంటాం.

  • చెట్టెన్ రాజుగోరండి, ” వ్యాసం లో మీరు ప్రస్తావించిన గొప్ప కళాకారులతో మంచి పరిచయమే ఉండడం మీ అదృష్టం ” మే కాదు పూర్వ జన్మ సుకృతం కూడా.

    1995 లో బాల మురళికృష్ణ గారు బందరు వచ్చి తమ గానామృతం మాకూ పంచారు.

    సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్, ఎమ్మెస్ అమ్మ, మహమ్మద్ రఫీ సాబ్ ల గురించి … నైటింగేల్ ఆఫ్ బాలివుడ్, గాన కోకిల భారతరత్న లతా మంగేష్కర్ గురించి; మధురగాయని, గానకోకిల పి.సుశీల గురించి మరింతగా రాస్తే బాగుండేది.

    ” కొలాబా పోదాం… ఈ మద్రాసీ కన్నా అక్కడ పార్సీ రంగు బావుంటుంది”. హమ్మో హమ్మో మీ కలాపోసన!! నర్గీస్, నూతన్, మధుబాల, మీనాకుమారి, వైజయంతిమాల, హేమామాలిని, చెంబూరులో రాజ్ కపూర్ స్టుడియో గురించి ఎప్పుడు చెపుతారు.

    I.I.T. పవై కి B.A.R.C, ట్రాంబే దగ్గరే గందా మీరు అక్కడికెళ్లి చాచా నెహ్రూ, హోమీ భాభాలకి చేదోడువాదోడుగా ఉండి దేశసేవ చెయ్యకుండా ఒఘాయిత్యంగా అమిరికా ఎందుకెళ్లారు ? ఆ క్లారిటీ కూడా కావాలి

    • భలే వారే…ఏకంగా అంత భారం ఎలా మొయ్య గలను? ఒక్క సుశీల గారు తప్ప మిగతా గొప్ప కళాకారులని వినడమే కానీ వ్యక్తిగత పరిచయం లేదు మరి. ఇక బొంబాయి లో సినిమా స్టూడియోలు కానీ, సినిమా తారలని కానీ కూడా చూసే అవకాశమే రాలేదు. ఒక సారి రణ ధీర్ కపూర్ సినిమా మా కేంపస్ లో షూటింగ్ చేసినప్పటి అనుభవం త్వరలోనే వ్రాస్తాను.

      ఇక B. A. R. C అంటారా , వెళ్ళ కేం , చాలా సార్లే వెళ్ళాను. కానీ అంత కంటే ఎక్కువగా వెళ్ళడమే కాకుండా అక్కడి కంప్యూటర్లని కూడా బాగా వాడుకున్నది Tata Institute of Fundamental Research – T.I. F.R. … అది కూడా హోమీ భాభా మొదలు పెట్టిన మహత్తరమైన ప్రదేశం..కొలాబాలో….కొలాబా వెళ్ళగానే పుణ్యమూ, పురుషార్ధమూ కలిసి వచ్చేవి మరి!

      మీ స్పందనకి, ఆసక్తికి ధన్య వాదాలు…నో వాదోపవాదాలు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు