రెండు శరీరాల మధ్య రాపిడి

      బహుశా కొన్నేళ్ళలో అర్జున్ రెడ్డి చిత్రం మీద జరిగినంత చర్చ మరే చిత్రం మీదా జరగలేదనుకుంటా. ఆ సాంకేతికత ను దాటి కథ మీద, దృక్కోణాల మీద తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మెచ్చుకోవడమో, నిరసించడమో ఏది చేసినా చాలా తీవ్రంగా చేశారు. కథలో రెండు ముఖ్యమైన పార్శ్వాలున్నాయి. తన జూనియర్ విద్యార్థినిని అతి తీవ్రంగా ప్రేమించిన అర్జున్ రెడ్డి, ఆమె పెళ్ళి వేరే వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు చేస్తే వొక ఉన్మాదిగా మారిపోతాడు. అందగాడు, తెలివైనవాడు, డాక్టరు, తీవ్రంగా ప్రేమించేవాడు అయిన అర్జున్ రెడ్డికి ఆ తర్వాత దర్శనమిచ్చే అర్జున్ రెడ్డికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కంట పడ్డ అందమైన అమ్మాయి గురించీ ఆమె వస్తాదారా అన్నట్టు మాట్లాడటం, వో అమ్మాయి ఇంటికి రానిస్తుంది, కాని అనుకోకుండా ఆమె ప్రియుడు తలుపు తట్టిన ఆ క్షణాన కత్తి చూపించి విప్పుతావా లేదా అంటాడు. ఈ చిత్రం మీద నేను అప్పట్లో సమీక్ష వ్రాశాను. ఇప్పుడు మళ్ళీ గుర్తుకు రావడానికి కారణం మరో చిత్రం చూసిన తర్వాత కలిగిన ఆలోచనలే.
      పోయిన వారం సినెమా సమీక్ష వ్రాయడం కోసం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అయిన “జావూఁ కహాఁ బతా ఏయ్ దిల్” చూశాను. మొదటి ఇరవై నిముషాలు నాయికా నయకులు మరీన్ డ్రైవ్ పక్కన నడుస్తూ చర్చ నడుపుతుంటారు. ఇది సినెమా కాదు, సినెమా ముఖ్యంగా దృశ్య మాధ్యమం అని మనసులో గొణుక్కుంటున్నా. ఆ తర్వాత వాళ్ళు హోటల్ కి తినడానికి టాక్సీ లో వెళ్తారు. అక్కడ మళ్ళీ డ్రైవర్ తో చర్చ. మధ్యలో నాయకుడు నాయిక రొమ్ములు నలపడం మొదలు పెడతాడు. అక్కడితో ఆ సినెమా కట్టేసి మరో చిత్రమేదో చూసి సమీక్ష వ్రాశాను. మర్నాడు తీరిక దొరికితే ఆ సినెమా మిగతా భాగం చూశాను. సినెమా మంచిదేనా? కాకపోవచ్చు. సమీక్ష వ్రాయాలా? నేను వ్రాయలేను, అది వ్రాయడానికి కావలసిన వొక సమతుల్యత ప్రస్తుతం లేదు. మరి ఇంకేముంది అందులో, నేను వ్రాయడానికి? కొన్ని పచ్చి నిజాలున్నాయి. బూతుగా ధ్వనించవచ్చు కాని అవసరమైనవి. అది చెప్పడానికి బోల్డంత చర్చ, డ్రైవర్ లాంటి పాత్రలతో కూడా చర్చింపచెయ్యడం ఇలాంటివన్నీ సినెమా అన్న కళకి విరుధ్ధంగా ప్రయాణం చేస్తుంటాయి. కాని ఏ విషయాన్నైతే మరుగున పెట్టేసి సినెమాలు తీసేస్తుంటారో ఆ విషయాలనుంచి ఈ చిత్రం మొహం చాటు చేసుకోదు. ఆ విషయాలే ఈ వ్యాసం లో ముఖ్యం. ఇన్నాళ్ళూ ప్రేమ పేరితో, రొమాన్స్ పేరుతో, పాటల పంచన హీరో హీరోయిన్లను sexual haraassment చెహస్తుంటారు. అది వొక రకంగా ప్రజల్లో ఆమోదాన్ని పొందింది. బహుశా ఈ వాక్యం తప్పేమో. చాలా మంది ప్రజల ఆమోదాన్ని పొందింది అనాలేమో. అది కూడా మిగతా వాళ్ళు మౌనం దాల్చడం వల్ల. అర్జున్ రెడ్డిలో స్త్రీ వక్షస్థలం మీద కెమెరా ఆగలేదని అందరూ అంటారు. కాని ఆ వక్షం వెనకాల వున్న హృదయస్పందనల మీద కూడా కెమెరా ఆగలేదు. ఈ చిత్రంలో రెంటి మీదా ఫోకస్ వుంది.
      అతను వో ప్రైవేటు కంపెనీలో అకౌంటెంటు. ఆమె కూడా ఏదో ప్రైవేటు ఉద్యోగిని. ఇద్దరిదీ దిగువ మధ్యతరగతి జీవితం. గత రెండేళ్ళుగా “ప్రేమలో” వున్నారు. ఆ వారాంతం అతనికంటే ఆలస్యంగా వస్తుంది సంకేత స్థలంలో కలవడానికి ఆమె, బస్సులో మేకప్పును సరి చూసుకుంటూ. అతను సిగరెట్టు మీద సిగరెట్టు వూది పారేస్తుంటాడు. ఆమె ఆలస్యానికి చిరాకు పడతాడు. నన్ను ఇప్పుడే తిట్టెయ్యి, లేదంటే నాకు నువ్వు తెలుసుగా ఎక్కడి కోపమో ఇంక్కెక్కడో తీర్చుకుంటావు అంటుంది. (This establishes a certain familiarity) నా ఇష్టం ఎప్పుడెలా అనిపిస్తే అలా చేస్తానంటాడు. ఆ తర్వాత నడుస్తూ బోల్డంత చర్చ. నటుల గురించి, వాతావరణ కాలుష్యం గురించీ, రాజకీయాల గురించి, ప్రేమ అనబడే బ్రహ్మ పదార్థం గురించీ. ఆమె మాటిమాటికీ నువ్వు నన్ను ప్రేమించలేదనుకోవాలా అని అర్థం వచ్చేలా అడుగుతుంది. ఏదో అభద్రతా భావన ఆమె మాటల్లో. అతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటాడు. వో పెద్ద తాత్త్వికుడులా ఏవేవో అంటాడు. ఈ ప్రపంచం లో ప్రేమ లేదు, అవసరాలే. అన్ని బంధాలూ అవసరం తీరే వరకే. ఇలాంటివి. ఆ క్రమంలో ఆమె మనసు విరిగేలా కూడా మాట్లాడుతాడు. మళ్ళీ నేనింతే, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతాను; లోన వొకటి బయట వొకటీ నాకు చేతకాదు అంటాడు. ఆమె పెళ్ళి ప్రస్తావన తెచ్చినా మళ్ళీ ఇలాంటి లెక్చర్లే దంచుతాడు. కొంత సాగతీత వున్నా ఇక్కడ అతనిలోని “తత్త్విక పురుషుడిని”, ఆమెలోని అభద్ర స్త్రీని చూపించడం జరుగుతుంది. ఇద్దరికీ ఆకలేస్తుంది. లాడ్జికి వెళ్ళే ముందు వొక హోటల్లో ఏదన్నా తిందామని టాక్సీ ఎక్కుతారు. అతని చేతులు వూరుకోవు. మాటి మాటికీ ఆమె రొమ్ములను తడుముతాయి, ఆమె విదిలించుకున్నా. తర్వాత అతను ఆమె రహస్యాంగాలను తడుముతుంటే ఆమె అభ్యంతరం చెప్పకపోగా స్పందిస్తూ, సుఖిస్తూ భావప్రాప్తిని కూడా పొందుతుంది. ఆ తర్వాత డ్రైవర్ కూడా వాళ్ళ సంభాషణలో జోక్యం చేసుకుని “తాత్త్విక” లెక్చర్లు దంచుతాడు. ఇవన్నీ మాకు మామూలే సర్, ఇది nothing. మేము రాత్రిళ్ళు మా బండిని రెండు గంటల పాటు హోమోలకు, లెస్బియన్లకు వాడుకోనిస్తే మస్తు డబ్బులొస్తాయి. ఈ మధ్య పోలీసుల బెడద ఎక్కువై సొమ్ము రావట్లేదంటాడు. ఇదంతా దర్శకుడు అదనపు సమాచారాన్ని మనకందించడానికి ఎన్నుకున్న తేలిక మార్గం.
    హోటల్లో తింటూ ఆ చర్చ ను కొనసాగిస్తారు. ఆమె మనసు గాయపడేలా చాలా సార్లు అతను పేలుతాడు. మనసు నొచ్చినా సంబాళించుకుని, లేని నవ్వును తెచ్చుకుని ఆమె అతనితో కొనసాగుతుంది. మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెస్తుంది. నాకు ముప్పై యేళ్ళు. రెండేళ్ళయ్యింది మనం కలిసి. ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి పెళ్ళికి? మా ఇంట్లో చేసుకోమని వత్తిడి చేస్తున్నారు అంటుంది. అతను మళ్ళీ intellectual lectures దంచుతాడు.
    అక్కడి నుంచి ఇద్దరూ లాడ్జికి వెళ్తారు. ఇద్దరూ సమ ఉజ్జీలుగా సాగాల్సిన ప్రణయం కొంత, కొంత కాదు ఎక్కువే గాడి తప్పుతుంది. ఆమె వారిస్తున్నా మొబైల్ ఫోన్ లో విడియో రికార్డ్ అయ్యేలా అమర్చి శృంగారాన్ని ప్రారంభిస్తాడు. ఇది కేవలం సరదాకే, తర్వాత తొలగించేస్తానుగా అంటాడు. ఆమె శరీరమంతటా ముద్దులు పెడుతూ యోని దగ్గరికొచ్చేసరికి కొరుక్తాడు. ఆమె బాధతో కెవ్వున అరుస్తూ, అతన్ని తోసేస్తుంది. సారీ, పోర్న్ చూసి అలా చెయ్యాలనిపించింది; వొట్టు మళ్ళీ అలా చెయ్యనుగా అంటూ దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరూ సెక్స్ కబుర్లు చెప్పుకుంటూ రతి కొనసాగిస్తారు. అతను అన్ని లెక్కలు వేసుకునే వచ్చేప్పుడు వేసలిన్ కూడా తెచ్చుకుంటాడు. ఈ రోజు ఎలాగైనా ఏనల్ సెక్సు చెయ్యాల్సిందే అంటాడు. ముందే కొరికి నా ప్రాణాలు తీశావు, ఇప్పుడిక దానికి నేను వొప్పుకోను అంటుంది. సరే యీప్పటిలా కానిద్దామంటాడు. ముందు ఆ విడియో ఆపెయ్యి అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ సమంగా రతికార్యాన్ని ఆస్వాదిస్తారు. చివరికొచ్చేసరికి ఆమెను తను కోరుకున్న విధంగా అనుభవించాలని చూస్తాడు. ఆమె వొక్క తన్ను తన్నితే మంచం మీద నుంచి కింద పడతాడు. అప్పుడు వాళ్ళ సంభాషణ అసలు రంగును బయట పెడతాయి. ముప్పై అంటావు గాని ముప్పై ఐదు కంటే ఎక్కువే వుంటాయి. నీ దరిద్రమైన మొహం అద్దంలో ఎన్నడన్నా చూసుకున్నావా? తాగకుండా వుంటే నిన్ను ముట్టుకోవడం ఏం ఖర్మ చూడాలనిపించదు కూడా. వేరే ఎవరి ముఖాన్నో ఊహించుకుంటూ నెట్టుకోస్తున్నా. నువ్వా నాకు నీతులు చెప్పేది. నోరు మూసుకుని లొంగిపో. ఆమె కూడా అతన్ని నానా మాటలంటుంది. పురుషుడికి అతని అంగపరిమాణం మీద దెబ్బ వేస్తే తట్టుకోలేడు. పక్కనున్న బీరు బాటిల్ తో ఆమె నెత్తి మీద కొడతాడు. స్ప్రుహ తప్పి పడిపోయిన ఆమెను తనకు కావలసిన విధంగా అనుభవిస్తాడు. ఆ తర్వాత ఆమెకు మందు రాసి, కట్టు కట్టించి బస్సులో ఆమె హాస్టల్ వరకూ దించుతాడు. ఆమె లోపలికి వెళ్ళబోతూ వుంటే కన్నీళ్ళతో అంటాడు, నన్ను క్షమించేయి, నేను చెడ్డవాణ్ణి కాను; ఏదో ఆవేశంలో పిచ్చివాడినైపోయాను అంటాడు. ఆమె మౌనంగా లోపలి కెళ్ళి వో దిండుతో నాట్యమాడుతుంది.
     ఇంత ఎక్స్పొసింగ్, ఇన్ని బూతులు చూసేవాడి సెక్సును ఉద్రేక పరచవు. (కొందరు ఉంటారు ఎక్సెప్షన్స్). అసహ్యం పుట్టిస్తాయి. వో కీలకమైన విషయం చెప్పడానికి అవసరం కూడా అవుతాయి. చాతీ మీద కెమెరాను నిలవనియ్యలేదు అన్న ముసుగులో మానసికావరణాలని దాచెయ్యడానికీ లేదు. మగవాళ్ళు తమకు ఉద్రేకం వస్తే చేత కత్తి పట్టుకుని బెదిరించడమో, బీరు బాటిల్ తో తల పగలగొట్టి కోరిక తీర్చుకోవడం ఎలా చెయ్యగలుగుతున్నాడు? ఈ రకమైన ధైర్యం ఎలా వస్తుంది? దాని గురించి ఇంత బాహాటంగా మనం చూసి వుండం; కాని కొన్ని వార్తలను చదివితే ఈ మాత్రం మనం ఊహించగలము. అలాంటి వాళ్ళకి శిక్ష పడక పోవడం సామాజిక ఆమోదంగా భావించవచ్చా? అతను ఆమెతో రెండేళ్ళుగా తిరుగుతున్నాడు. నిజాయితీ(?)గానే ప్రేమ మీదా, వివాహం మీదా తన అభిప్రాయాలు చెప్పాడు. ఆమె సహకారం, అనుమతి లేకుండా ఏమీ చెయ్యలేదు. అతను హీరోనా?  ఇది ఇలా ఎందుకుంది? ఆమె మాత్రం లక్ష సార్లు మనసు పగిలి కూడా అతన్నే అంటిపెట్టుకుని ఎందుకున్నది? అవమానాలను దిగమింగుకుని వుండడం వెనుక ఎలాంటి vulnerability వుంది? అతను ఆమెను కురూపి అనడం, దయతలచి రతిసుఖాన్నిస్తున్నానని చెప్పడం, ఆమె అతని అంగపరిమాణం గురించి అహంకారం అంటుకునేలా అనడం తో తెరలు దిగి వో అంచుకొస్తుంది నాటకం. ఆమె దిండుతో డాన్స్ చెయ్యడంతో ముగించడం దర్శకుడు ఎన్నుకున్న ప్రతీకాత్మక నిర్ణయాన్ని, నిశ్చయాన్ని తెలిపే విధం. అతను చివర్న కన్నీళ్ళు పెట్టుకుని నేను చెడ్డవాణ్ణి కాను అనటం కూడా మగవాడిలో వున్న అహంకారం, vulnerability రెండూ చూపిస్తాయి.
          ఇప్పుడొక విషయం స్పర్శించి ముగిస్తా. తెర మీద శృంగారాన్ని చూపించడం per se వల్గర్ అనిపించుకోదు. బొడ్డు మీద పండ్లు వేసి నడుముని, తొడలనీ చూపించడం వల్గర్ అనిపిస్తుంది. తీవ్రమైన ప్రేమ ఇద్దరి మనస్సుల వరకే వుండదు. ఇద్దరి శరీరాలని కూడా అల్లుకుంటుంది. కొంత మంది వుంటారు, వాళ్ళ శారీరిక ప్రేమ తీవ్రత ఇద్దరిలోనూ సమానంగా పిచ్చి స్థాయిలో వుంటుంది. అలాంటి కథ చెప్పడానికి ఆ శృంగారాన్ని తెర మీద చెప్పకుండా వుండడం కుదరదు. నేను మాట్లాడేది In the realm of senses చిత్రం గురించి. సెక్స్ అన్న సహజాతం (basic instinct) అదుపు చేస్తే అదుపులోకొచ్చేది కాదు. అందుకే సన్యాస మార్గంలో వున్నా అతను ఆ దారంట ముందుకెళ్ళలేడు, “Samsara” చిత్రంలోలా. ఈ రెంటిలోనూ సెక్స్ పట్ల, మనిషి పట్ల, శరీరం పట్ల వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా చిత్రీకరణ వుంది. దొంగతనంగా చొప్పించినట్టు వుండదు. తెర మీద కనిపించే ఆ నగ్న దేహాలు కాదు, ఆ మనస్సులను నగ్నంగా మనముందు పెట్టడం చూసి ఆలోచించాల్సిన విషయం.
*

పరేశ్ దోశి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • very well written Paresh. Excellent analysis. it is not easy to write about this movie. it is a difficult movie… kudos to you

    • Thank you Narayana Swamy.
      This is what I wrote to Afsar while sending the article. “Chinna maaTa for today. This time it deals with sex and sexual personalities. I was hesitant. But then, I felt it needs to be told. Sorry, for delay.”

      Thank you.

  • Discussion on sex on sexual intercourse and visualisation in a most penetrative medium like cinematography need to take some caution and restraint. We think the same can be handled differently without succumbing to the level of vulgarity. Visual medium need much more restraint in depicting these human (or even of any being) inner sensibilities of the predicament. – Prof P C N Reddy

    • Prof P C N Reddy గారు.

      అవసరం లేకపోయినా సెక్సును జొప్పించి వ్రాసేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు. నేను వారిని సమర్థించను. అవసరమైన చోట వాడితే నాకు వ్యతిరేకతా లేదు. ఈ చిత్రంలో అవసరమే అనుకుంటున్నా.

      మీ స్పందన కు కృతజ్ఞతలు.

  • కత్తులు విసరడానికేముంది ఇందులో?

    సినిమా చాలా ధైర్యంగా కల్చరల్ టబూస్ ని బ్రేక్ చేసి తీసిన కల్ట్ లా అనిపిస్తోంది. వాస్తవ జీవితంలో జరిగే అన్నిటినీ మనం సాహిత్యంలోనూ, సినిమాలలోనూ అంగీకరించలేం. బెడ్ రూంస్ కి తలుపులు ఉండేది ఇదుకేనేమో

    కీలక సన్నివేశాలను సైతం విపులంగా రాశారు. సినిమా జానర్ ని పూర్తిగా అర్థం చేసుకోడానికి అది అవసరం కూడా.

    ఈ లెక్చర్లు దంచే తత్వ పురుషుల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది. “నేను అందరికంటే వేరు ” అనే భ్రమలో బతికే మామూలు మనుషులే వాళ్ళూనూ. వాళ్లను మించి చర్చను పీక్ కి తీసుకు పోయే వాళ్లు ఎదురయ్యారనుకోండి, మొండి గా ఒక పాయింట్ దగ్గర నిలబడి “నేనింతే! మారను. ఏదొచ్చినా మొహానే అంటాను” టైపు పిడివాదం చేస్తూ అక్కడే నిలబడతారు తప్ప చర్చను ముందుకు తీసుకెళ్ళే జ్ఞానమేదీ ఉండదక్కడ . అలాగే చెయ్యాల్సిన చెత్తంతా చేసి “నేను చెడ్డవాణ్ణి కాదు” అని కన్నీళ్ళు పెట్టుకోవడం ఆ వ్యక్తిని పరిశుద్ధుడి గా మార్చదు

    అలాటి వ్యక్తుల్ని కూడా స్త్రీలు ఎందుకు అంగీకరిస్తారంటే, ఎక్కడో లోలోపల ప్రేమను బలంగా ఏర్పరచుకుని ఉంటారు వీళ్ళు. అటువైపు కూడా అది ఉండే ఉంటుందని నమ్ముతూ, ఆ వ్యక్తి చేసే చెత్తనంతా భరిస్తూ ఉంటారు.

    మీ కంక్లూజన్ కూడా బావుంది. కథలో వాస్తవ దృశ్యాలు చూపించాలనుకున్నపుడు ఆ స్తాయి దృశ్యాలు అనివార్యం. అతని ఆలోచనల నగ్నత్వాన్ని అతని చర్యల ద్వారా సంగం చూపించేశాడు దర్శకుడు

    సినిమా సర్వజనులనూ ఒప్పించేది గా ఉండాలనేది ఇండియన్ సినిమా ప్రకారం నిర్వచనం ఒకప్పుడు. దాన్ని దాటి చాలా దూరం ప్రయాణించింది ఇండియన్ సినిమా

    దాని ప్రకారం ఇది డిఫరెంట్ సినిమాయే

    • Sujatha Velpuri గారు.
      మీ స్పందనకు కృతజ్ఞతలు. నిజమే మగవాడు చెప్పేది వేరు, ప్రవర్తన లో బయటపడే మనిషి వేరు.
      అతన్ని చూస్తే అసహ్యమే అనిపిస్తుంది తప్ప, చివర్న ఆమెను గాయాలు శుభ్రం చేసి,మందు రాసి,కట్టు కట్టి హాస్టల్ వరకూ దిగబెడతాడాని మెచ్చుకోము. కంట తడి పెట్టి నేను మంచివాడినే అన్నప్పుడు వస్తుంది ఆలోచన. అతనిలో స్త్రీల పట్ల అలాంటి attitude రావడానికి సామాజిక కారణాలు ఏమిటీ?

      అర్జున్ రెడ్డిలో at the point of knife అతను ఓ అమ్మాయిని లొంగదీసుకోవాలని చూస్తాడు. ఆ ముందు క్షణమే ఆమె మనసు మార్చుకుని no అంటుంది. లెక్క చెయ్యడు. దీన్ని చాలా మంది సమర్థించారు self destruction అని. తాగి ఆపరేషన్లు చెయ్యడం, ప్రేమ వద్దు, ఫిజికల్ హెల్ప్ చెయ్యమనడం రెండూ self destruction కాదు, depraved mind. అందుకే కత్తులూ వగైరా అన్నాను.

      ఇక ఇందులో దాపరికం లేదు. అతన్ని సమర్థించే వీలే లేదు. ఆమెకు చివర్న కనువిప్పు కలిగినట్లు, అతని ప్రేమ-బానిసత్వం నుంచి స్వేచ్చ పొందినట్లు ఆమె దిండుతో twist చేయడం నచ్చింది.

  • మీరు చాలా చక్కగా హ్యండిల్ చేశారు .ముందు ఏది వల్గర్ అనేది అర్థం చేసుకుంటే ఈ పాత్రల్ని అర్థం చేసుకుంటాం.మీరు వాడిన మాట vulnerability ,ఇద్దరికీ వర్తిస్తుంది .కొన్ని పచ్చి నిజాలు యువత తెలుసుకోవడం అవసరమేమో ,కనీసం సెక్స్ ని romanticize చేయరు .

    • Thank you Kalyani Neelarambham garu. Yes both are vulnerable. Sometimes men are victims of the attitudes that are thought appropriate in society and behave accordingly. Still what is unfair is unfair, and what is to be set right should be set right. And yes if the youth see this most of them can check their own mindset and a section however small may also misread the film.

  • After reading your review it seems to me that it is a very realistic and bold movie. Thanks for the review.

    • Thank you Rahul. The film, if you go by the grammar of cinema may even disappoint you. But still it should be seen and discussed because the director/writer carefully put together all the thoughts that concern man woman romantic relationship, sex and power structure. The exploitation, and subservience and much more. Yes it is bold and realistic.

  • ఇన్నాళ్ళూ ప్రేమ పేరితో, రొమాన్స్ పేరుతో, పాటల పంచన హీరో హీరోయిన్లను sexual haraassment చెహస్తుంటారు. అది వొక రకంగా ప్రజల్లో ఆమోదాన్ని పొందింది. బహుశా ఈ వాక్యం తప్పేమో. చాలా మంది ప్రజల ఆమోదాన్ని పొందింది అనాలేమో. అది కూడా మిగతా వాళ్ళు మౌనం దాల్చడం వల్ల. అర్జున్ రెడ్డిలో స్త్రీ వక్షస్థలం మీద కెమెరా ఆగలేదని అందరూ అంటారు. కాని ఆ వక్షం వెనకాల వున్న హృదయస్పందనల మీద కూడా కెమెరా ఆగలేదు. ఈ చిత్రంలో రెంటి మీదా ఫోకస్ వుంది.

    chala chala kastam ila rayatam. oka katti meeda prayaninchinatle sir
    తెర మీద కనిపించే ఆ నగ్న దేహాలు కాదు, ఆ మనస్సులను నగ్నంగా మనముందు పెట్టడం చూసి ఆలోచించాల్సిన విషయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు