రెండు వైరుధ్యాల మధ్య కవిత్వం

క పుస్తకం తెరిస్తే చుట్టూ మంచు కప్పినప్పుడు చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి అన్న వాక్యం ఆకర్షిస్తుంది.  యోగ నిద్ర, ధ్యానం, అమ్మ నేల, పాత పద్యం, అలౌకిక ఆనందం, పోగొట్టుకున్న రోజులు, పసిపాపల కాగితపు పడవులు, సంశయాత్మక కాంతి బిందువు, నిన్న మోసిన అడుగు జాడలు, పురా జ్ఞాపకం, రాలిన ముత్యాలు అక్షరాల నిండా పరుచుకుని మనను నిన్నటి అగాధంలోకి తీసుకుపోతాయి. ఆ అగాధంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం. ఆ ఆనందం ఒక సుషుప్తి. ఒక మంచులో తడిసిన అనుభూతి కలిగించిన ఈ కవి  విన్నకోట రవిశంకర్. ఒక లోకం నుంచి మరో లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగిస్తుంది ఈయన కవిత్వం. అదొక రంగురంగుల చేతులతో మనను లోపలికి ఆహ్వానించే పెయింటింగ్.

మరో పుస్తకం తెరిస్తే రాత్రి కురిసిన మేఘాలను ఆరేసుకున్న ఆకాశమూ కనపడుతుంది.చెట్టు నిండా ఉత్తరాలు మనను ఆకర్షిస్తాయి. వర్షాకాలంలో నల్లమేఘాలు కుట్టిన  పైట కప్పుకున్న ఆకాశం, రాత్రి డ్యూటీ దిగి పగలు చుక్కలై మెరిసే చుక్కలు, కెరటాల రెక్కలతో ఎగిరిపోవాలనుకునే సముద్రం, చెమర్చిన రెప్పల్లో దాచుకున్న వెన్నెల, రగిలిన రాత్రుల అరమోడ్పు కన్నులూ, స్వప్నలేఖలూ  ఈ కవి వాక్యాల్లో వెన్నెల్లో పచ్చిక బయలుపై నడుస్తున్న అనుభూతి కలిగిస్తాయి. కాని ఈయన మనను సుషుప్తిలోకి వెళ్లనివ్వరు. నిద్రాభంగం చేసి తగులబడుతున్న పూదోటలోకి నెట్టెస్తారు. కొన ఊపిరిలో అంచుల్లో వేలాడుతున్న అశ్రు దృశ్యాల మధ్య మనను ప్రవేశపెడతారు. ఈ కవి ‘నిజం’ పేరుతో రాసే శ్రీరామమూర్తి. ఆయన కవిత్వం మనను నేల మీదకు జార్చే నెత్తురోడే పెయింటింగ్.

ఢిల్లీని ‘భ్రాతృహంతకుల నగరం’ అన్నాడు ఆలూరి బైరాగి.  కరచాలనాలు, చిరునవ్వులూ ఎవరివని పసిగట్టగలం?మనం నడిచిన పచ్చిక బయళ్ల క్రిందే ఎన్ని సమాధులున్నాయో ఎవరికి తెలుసు? ‘ఇండియా గేట్’ పై  విరిసే పున్నమి వెన్నెల ఐస్ క్రీం తినే యువ దంపతులను చూసి ఆనందిస్తుందో, లేక నార్త్ బ్లాక్ కిటికీలోంచి ప్రసరించి ఫైళ్లపై జరుగుతున్న ద్రోహాలను చూసి బాధపడుతుందో చెప్పగలమా?

ఒక రోజు రాత్రి రహస్యాల్ని అన్వేషిస్తున్న వేళ విన్నకోట రవిశంకర్ రాసిన ‘మంచు కరిగాక’ కవితాసంపుటి ఈ ప్రశ్నలు మరిపించే సంగీతంలా  ఎన్నో స్మృతుల్లోకి తీసుకువెళ్లింది. ఆయన కవిత్వం ‘దిక్కుతోచని కొత్త ఊళ్లో బాల్య మిత్రుడు ఎదురైనట్లుగా’ అనిపించింది. ‘మంచు వెళ్లే మార్గంలో ఎప్పుడో కాని తగిలే మా ఊరు’ విన్నకోట రవిశంకర్. ‘సుతిమెత్తని రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుకను చూసి పాటను పరిత్యజించిన పక్షి’ భావతరంగాలు రవి శంకర్ కవితలు. కొంత పగలు, కొంత నిశ, కొంత మెలకువ, కొంత నిషా ల మధ్య మనను నిద్రాణం లోకీ, నిర్వాణం లోకీ తీసుకుని వెళ్లే పురాతత్వ యోగి  రవిశంకర్.

రవిశంకర్ కవిత్వంతో యోగనిద్రలోకి వెళ్లిన నాకు తపోభంగం చేసిన కవి ‘నిజం’. ఆయన రాసిన నాలుగోపాదం, నివురు, అలలు కవితా సంపుటాలు మంచి నిద్రలో ఉన్న తల్లిని శిశువు ఏడుపు లా అప్రమత్తం చేస్తాయి. కౌగలించుకున్న పాములను పరిమళింప చేయగల మొగలి పొదల్లా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. గోడమీద పిడకలపై హస్తముద్రల్లో అమ్మ జ్ఞాపకాలు ఎదురవుతాయి. భూమే ఊరితాడై మన గొంతుకు చుట్టుకున్న భీభత్స అనుభూతి కలుగుతుంది.  కళ్ల గగనాల్లోంచి సూర్యోదయాలనూ, కళ్లను పీకేస్తున్న వ్యవస్థ ఉన్మాదాన్నీ చిత్రించి సమాజ స్వభావమూ తేటతెల్లమవుతుంది.

‘నిజం’, రవిశంకర్ ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న వారే. ఇద్దరి ఆలోచనల్లో వైరుధ్యాలు ఉన్నాయి. రవిశంకర్ సమాజ వైరుధ్యాలను కవిత్వంలో చెప్పనవసరం లేదనుకుంటారు. స్వప్నంలోకి వెళ్లి  నిజ జీవితపు లోతుల్ని స్పశిస్తారు. ‘నిజం’  భగ్నమైన స్వప్నాలను, నీలి మేఘాల మధ్య మండుతున్న వెన్నెలనూ వాక్యాల్లోకి నడిపిస్తారు.

నాకు ఇద్దరి వాక్యాల్లోనూ  మెరిసే  కవిత్వం ఇష్టం. చరాచరాల మధ్య, శూన్యానికీ, ప్రకంపనానికీ మధ్య,  ధ్యానానికీ, కల్లోలానికీ మధ్య రాయని వాక్యాలతో సంచరిస్తున్న వాడిని.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు