ఐదు వందల సంవత్సరాల క్రితం మనకు మిరపగాయ ఏమిటో తెలియదు. పోర్చుగీసు వ్యాపారులు దాన్ని పరిచయం చేసిన తరవాత అది మన రుచుల మీద పూర్తి కబ్జా సాధించింది. అందుకే గతించిన చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరంగా, మనోహరంగా ఉంటుంది. మనలో కుతూహలాన్ని, ఆశ్చర్యాన్ని నింపుతుంది. మనం నడిచొచ్చిన దారుల రహస్యాలను, అద్భుతాలను తెలుసుకోవాలనే కోరికతో సాగే అన్వేషణే చారిత్రక రచన. రెండు ఖండాల చారిత్రక సంఘటనలను, సామాజిక స్థితిగతులను మేళవించి వసుధేంద్ర గారు రచించిన ‘తేజో తుంగభద్ర’ ఒక ఆసక్తికరమైన చారిత్రిక నవల.
ఇది పదిహేనవ శతాబ్దపు చివరి అంకంతో మొదలయ్యి పదహారవ శతాబ్దం మొదటి దశాబ్దం తో ముగుస్తుంది. భారత ఉపఖండంలో లభించే సుగంధ ద్రవ్యాలకు యూరప్ లోమంచి గిరాకీ ఉండే కాలం అది. సముద్ర మార్గంలో యూరప్ నుండి భారత ఉపఖండానికి వాస్కో డి గామా అనే పోర్చుగల్ నావికుడు కొత్త మార్గాన్ని కనిపెట్టి 1498 లో మొట్టమొదట అక్కడికి చేరాడు. అక్కడనుండి పోర్చుగల్ భరతఖండ రాజ్యాలను లొంగదీసుకోవడానికి దండయాత్రలు చేపట్టి వాళ్ళ సంపదను కొల్లగొట్టడం మొదలుపెడుతుంది. అనేక రేవు పట్టణాల్లో వాణిజ్యాన్ని చేపట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. తుదికి గోవా రాజ్యాన్ని గెలిచి అక్కడ తమ పరిపాలనను నెలకొల్పుతుంది. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. కానీ చరిత్రంటే కేవలం నౌకాయానాలు, యుద్ధాలు, వాణిజ్యాలు, రాజ్యాలు – రాజులు మాత్రమేనా? చరిత్రంటే మనుషుల కథలు కద. వారి జీవనం, వారి విశ్వాసాలు, సంస్కృతి, కళలు, అలవాట్లు అన్నీ కలిస్తేనే అది వారి చరిత్ర అవుతుంది.
నదులు మానవ నాగరికతకూ, సంస్కృతికీ ప్రతీకలుగా నిలిచాయి. అందుకేనేమో తేజో, తుంగభద్ర అనే రెండు నదుల చుట్టూ ఈ కథనం సాగుతుంది. ఈ కథంతా పోర్చుగల్ దేశంలో తేజో నది ఒడ్డున ఉన్న లిస్బన్ వాసి గేబ్రియెల్, దక్షిణ భారతం లో తుంగభద్ర ఒడ్డున తెంబకపురానికి చెందిన హంపమ్మ చుట్టూ సాగుతుంది.
పదిహేనవ శతాబ్దపు చివరికాలంలో పోర్చుగల్ లో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన గేబ్రియల్, యూదు మతానికి చెందిన బెల్లా ప్రేమించుకుంటారు. యూరప్ నుండి యూదులను తరిమెస్తున్న కాలం అది. యేసు క్రీస్తును యూదులే చంపారాన్న నమ్మకం ఆ రోజుల్లో ప్రబలంగా ఉండటం వల్ల క్రైస్తవులు వారి పట్ల ద్వేషం కలిగి ఉండేవారు. స్పెయిన్ నుండి పారిపోయి వచ్చిన యూదులను పోర్చుగల్ రాజు మొదట్లో తమ దేశం లో ఉండటానికి అనుమతించినా తరువాత కొన్ని కారణాల రీత్యా వారిని క్రైస్తవంలోకి మారమంటాడు. యూదులు ఎక్కడ ఉన్నా వ్యాపారంలో బాగా రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందే గుణాన్ని కలిగి ఉంటారు. అదే వారి పాలిట శాపం అవుతుంది. వారి ఆర్థిక స్థితి ఇతరులకు కంటగింపుగా మారుతుంది. దానితో వారి పట్ల ద్వేషం మరింత పెరుగుతుంది. యూదుల తరిమివేత, వారి జీవన విధానాలతో పాటు 1506 లో లిస్బన్ లో జరిగిన యూదుల ఊచకోత గురించి పుస్తకంలో వివరంగా వర్ణించారు రచయిత.
అప్పటి సమాజంలో ఏర్పడిన ఉద్రిక్తతలకు గేబ్రియెల్ పేదరికం తోడయ్యి బెల్లా తో తన ప్రేమ ఫలించదు. భగ్న ప్రేమికుడు గేబ్రియెల్ ఎలాగయినా డబ్బు సంపాదించాలనే పట్టుదలతో భారతఖండానికి నౌకా ప్రయాణం చేయడానికి సిద్ధపడతాడు. అప్పటీకే ఇండియా నుండి సంపదను దోచుకొచ్చే పనిలో అనేక పడవలు వెళ్లి వస్తున్నాయి. అదే సమయంలో 1506 లో అల్బర్క్వర్క్ అనే సైన్యాధికారి తన సైన్యంతో ఇండియా మీదకు దండయాత్ర కొరకు బయలుదేరుతాడు. చదువొచ్చిన గేబ్రియెల్ ఆ నౌకల రోజువారీ వివరాలు రాసిపెట్టే రైటరుగా వారితో పాటు ప్రయాణమయ్యి, ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇండియా చేరతాడు. పడవ ప్రయాణాల్లో గడిచే భయంకర జీవితాన్ని చాలా వాస్తవికంగా వర్ణిస్తారు రచయిత. రెండేళ్ల ప్రయాణం తరవాత ఆకలికి ఓర్వలేక, సైన్యాన్ని వీడి గోవా రాజు శరణు కోరతాడు. అలా వచ్చిన వారినందరినీ గోవా రాజు ముస్లిం మతంలోకి మార్చుతాడు. గేబ్రియెల్ కూడా మతం మార్చుకుని అహ్మద్ ఖాన్ గా అవతరిస్తాడు. కొన్నాళ్ళకు
అల్బర్క్వర్క్ యుద్ధంలో గెలిచి గోవాను చేజిక్కించుకుంటాడు. క్రూరత్వానికి మారుపేరైన అల్బర్క్వర్క్ అహ్మద్ ఖాన్ తో సహా సైన్యాన్ని వీడిన వారందరి ముక్కు, చెవులు కోయిస్తాడు. అంతేకాదు 1510 లో, గోవాలో ఆరు వేలమంది ముస్లింల ఊచకోతకు కూడా అతనే సారధ్యం వహిస్తాడు.
ఇంకోవైపు విజయనగర సామ్రాజ్యం లోని తెంబకపురానికి చెందిన హంపమ్మను ద్వందయుద్ధ పోటీలో గెలుచుకున్న కేశవ ఎక్కువ కాలం బ్రతకడు. విజయనగరం మహారాజు పుత్రసౌఖ్యం కోసం ప్రాణత్యాగం చేస్తాడు. హంపమ్మ జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరికి అహ్మద్ ఖాన్ తో ముడి పడుతుంది. హంపమ్మ కథ ద్వారా విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్న పదహారవ శతాబ్దపు సమాజాన్ని సవివరంగా పరిచయం చేస్తుంది ఈ పుస్తకం. సమాజం మీద మతం ప్రభావం, పట్టు ఎంత బలంగా ఉండేదో అర్థం అవుతుంది. శైవులు వైష్ణవుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరిన కాలం అది. శైవుల క్షేత్రమైన తెంబకపురంలో కృష్ణదేవరాయలు వైష్ణవ దేవాలయం నిర్మించి ఆ ఊరి పేరును మార్చాలనుకుంటాడు. అక్కడ వ్యక్తమైన వ్యతిరేకత వల్ల పేరు మార్పును విరమించుకుంటాడు. కాని వైష్ణవ దేవాలయం మాత్రం ద్వంసం అయిపోతుంది.
ఆ సమాజంలో కులాచారాలు, సాంఘిక కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యం ఉండేది. కులాన్ని గురించి పుస్తకంలో చాలా వివరమైన చర్చే ఉంటుంది. ఇక్కడ ఒక సన్నివేశాన్ని ప్రస్తావించాలి. పోర్చుగల్ సైన్యం కొచ్చిన్ నుండి కొంతమంది మత్స్యకారులను అపహరించుకు పోయినప్పుడు ఆ రాజు అసలు ఖాతరు చేయడు. వారిలో ఒక మత్స్యకారుడు పోర్చుగల్ చేరి, వాళ్ళ భాష నేర్చుకుంటాడు. పోర్చుగల్ అధికార్లు అతన్ని దుబాశీగా పెట్టుకుని రాజుతో సంప్రదింపులకు వెళ్తే, నీచ కులస్తుడికి అక్కడ అడుగు పెట్టే అధికారం లేదని రాజు అతన్ని తన్ని తగిలేస్తాడు. నిజానికి పోర్చుగీస్ తెలిసిన ఆ మత్స్యకారుడి అవసరం రాజుకే ఎక్కువ ఉంది. కానీ అక్కడ కులానిదే పై చేయి అయ్యింది. భారత దేశంలో కులం ఎంత బలమైనదో పోర్చుగీస్ వలసవాదులకు అప్పుడు అర్ధం అయ్యింది. అలాగే హిందూధర్మ నియమాల ప్రకారం సముద్రాలు దాటకూడదు కాబట్టే అప్పట్లో భారతఖండంలోని రాజులు ఎంత బలవంతులైనా నౌకలు, నావికా దళాలు ఏర్పర్చుకోకపోవడంవల్ల వాణిజ్యంలో వెనకబడిపోయారని తెలుస్తుంది.
సతీ సహగమనం లాంటి ఆచారాలను, వాటిని పూజించే, ప్రేరేపించే సమాజమే కాక దాని క్రూరత్వాన్ని గుర్తించే ఆలోచనలను కూడా ఈ పుస్తకం చర్చిస్తుంది. హంపమ్మ సహగమన వేదిక నుండి పారిపోవడానికి సహాయ పడ్డవారు, అర్థం చేసుకున్న వారు ఆ కాలంలో కూడా లేకపోలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది.
అంతేకాదు అప్పట్లో చాలా ప్రముఖంగా ఉన్న దేవదాసీ వ్యవస్థ లోతుపాతులను కూడా ఈ కథ ప్రస్తావిస్తుంది. చదువు, సాహిత్యం, కళలలో ఎంతో ప్రావీణ్యం కలిగి స్వేచ్ఛా జీవితం గడుపుతున్న గుణసుందరిని చూసి హంపమ్మ ఈర్ష్య పడుతుంటే, తన జీవితంలోని చీకటి విషాదాలను గురించి వివరిస్తుంది గుణసుందరి. ఇంకా ఆ కాలం నాటి అనేక సాంప్రదాయ రీతులను ఆధునిక దృష్టికోణం నుండి కళ్ళకు కడుతుంది ఈ నవల.
కథ కల్పితమే అయినా ఈ పుస్తక రచన వెనక ఎంతో పరిశోధన ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నో వాస్తవ ఘటనలు, చారిత్రిక రచనలు, సాహిత్యం, పుస్తకాలు, నివేదికల ఆధారంగా ఈ రచన సాగింది. చరిత్రను ఆసక్తికరంగా చెప్పే ఇటువంటి కథనాలు చాల అవసరం. కథా కాలం నాటి సమాజాన్ని ఆవిష్కరించడంలో రచయిత పూర్తిగా సఫలీకృతం అయ్యారు.
*
Add comment