రెండు అరబిక్ కవితలు

దున్యా మిఖాయిల్( Dunya Mikhail) ఇరాకి అమెరికన్ కవయిత్రి. 1965లో ఇరాక్‌లో జన్మించారు. జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు, ఇరాక్ అధికారుల నుండి బెదిరింపులను ఎదుర్కొన్నారు. మొదట జోర్డాన్‌కు, తర్వాత అమెరికాకు ఆశ్రయం కోసం వెళ్లిపోయారు. 2001లో, ఆమెకు UN హ్యూమన్ రైట్స్ అవార్డ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, 2013లో క్రెస్జ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ లభించింది. ఆమె ప్రస్తుతం మిచిగాన్‌లో నివసిస్తున్నారు. ఓక్లాండ్ విశ్వవిద్యాలయంలో అరబిక్ సాహిత్య బోధకురాలిగా పనిచేస్తున్నారు. The War Works Hard, Diary of a Wave Outside the Sea, The Iraqi Nights, The Theory of Absence, The Beekeeper: Rescuing the Stolen Women of Iraq, The Bird Tattoo ఇవి దున్యా మిఖాయిల్ రచనలు.
అరబిక్ మూలం: దున్యా మిఖాయిల్
ఆంగ్లానువాదం: కరీమ్ జేమ్స్ అబు-జీద్
తెలుగానువాదం: రమేశ్ కార్తీక్ నాయక్
***
 1
రెండో జీవితం
 ఈ జీవితం తర్వాత
మనం మొదటి జీవితంలో
నేర్చుకున్నది అన్వయించుకోవడానికి
మనకి రెండో జీవితం కావాల్సి ఉంటుంది
ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు చేస్తూనే ఉంటాం
దాన్ని మర్చిపోవడానికి రెండో జీవితం కావాల్సి ఉంటుంది
 బయలుదేరిన వారి కోసం నిరీక్షిస్తూ
ఝుంకారాలు చేస్తుంటాం
 పూర్తి పాట కోసం రెండో జీవితం కావాల్సిందే
 మేము యుద్ధానికి వెళ్తాం
అక్కడ సైమన్* చెప్పిన ప్రతిదీ చేస్తాం
కానీ ప్రేమ కోసమయితే కచ్చితంగా
రెండో జీవితం అవసరం.
 జైలు జీవితాన్ని పూర్తి చేయడానికి
మాకు కొంత సమయం కావాలి
అప్పుడు గాని మేము
రెండో జీవితంలో స్వేచ్ఛగా జీవించలేము
 మేము ఒక కొత్త భాషను నేర్చుకుంటాం
 ఆ భాషను అభ్యసించడానికి రెండో జీవితం కావాలి
 మేము కవిత్వం రాసి నిష్క్రమిస్తాము
 కానీ విమర్శకుల అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి
మాకు రెండో జీవితం కావాలి
 అక్కడ ఇక్కడ అంటూ కాకుండా
ఎక్కడపడితే అక్కడ తిరుగుతూనే ఉంటాం
అన్ని చోట్లను చుట్టేస్తాం
ఆ జ్ఞాపకాలను ఫోటోలుగా బంధించడానికి
మాకు రెండో జీవితం కావాలి
ఆవేదన కొంత సమయాన్ని తీసుకుంటుంది
బాధ లేకుండా జీవించడం నేర్చుకోవాలి
నేర్చుకునేందుకు రెండో జీవితం కావాలి.
*సైమన్ : Beast/ యుద్ధం అధికారి.
****
2
కన్నీళ్లు
వివిధ ఆకారాల గాజు సీసాల్లో
కన్నీళ్లనుంచి విక్రయించే దుకాణంలో
నేను పని చేస్తున్నాను
రుమాలును ఉపయోగించే
సమయమేరుగని జనాలతో
ఆ ప్రదేశం ఎప్పుడు కిక్కిరిసి ఉంటుంది
 రంగులేని కన్నీళ్లను కొనేందుకు
 ప్రతిరోజు ఓ మహిళ విక్రేత వస్తుంది,
ఆమెతోనే ఈ కొనుగోలు మొదలవుతుంది.
ఆ కన్నీళ్లు ఆమె కోసమో మరి ఇంకెవరి కోసమో?
విక్రేత సంఖ్య : 2
భూమిపై కొండ చర్యలు విరిగిపడిన
తన మాతృ దేశాన్ని మాత్రం ఎప్పటికీ వదిలిపోనని
ఓసారి ఎప్పుడో అతను అనుకున్నాడు.
విక్రేత సంఖ్య: 3
వరదలో కుటుంబాన్నంత కోల్పోయి
వరద నుండి తప్పించుకున్న వృద్ధురాలు
తన మనవడితో అక్కడికి వస్తుంది
విక్రేత సంఖ్య: 4
 వరుసలో ఉన్న చివరి మహిళ
 తను కొన్న సీసాను తిరిగి ఇచ్చేయాలని వచ్చింది
 తను ఆ సీసాను ముట్టిందే లేదని
 తన మిత్రురాలు తనని వదిలి పోయాక
 తనకు కన్నీళ్లు నిండిన సీసాతోనే పని ఉంటుందని అనుకుందట
కానీ ఆ సమయంలో ఆమె నిలకడన కోల్పోయి
రెండు పార్కింగ్ స్థలాల మధ్య రాకపోకలు సాగించిందట
 సూర్యుడు ప్రపంచపు ఇంకో సగం కోసం వీడ్కోలు పలికాడు
 ఇల్లు చేరే సమయం ఇది:
మనమందరం ఇప్పుడు దుఃఖధారను కోల్పోయాం.
*

రమేష్ కార్తిక్ నాయక్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు