కథకు ఏ పేరు పెట్టాలి?… కథా ఇతివృత్తం ప్రతిబింబించే పేరు పెట్టాలా? కథా నేపథ్యానికి సంబంధించిన పేరు పెట్టాలా? కథలోని పాత్ర పేరే కథకూ సరిపోతుందా? కథలోని వస్తువే కథా శీర్షిక అవుతుందా? రచయిత కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో అదే శీర్షిక అవుతుందా? మరి అది ప్రతీకత్మకతతో ఉండాలా? నేరుగా సూచిస్తే సరిపోతుందా? క్యాచీగా ఉంటే మంచిదా? అలంకారాత్మకంగానా? భావాత్మకంగానా? ఏ భాషలో ఉండాలి?… కథకుడికి కథాశీర్షిక నిర్ణయించడం కత్తిమీద సామే. ఎందుకంటే, పాఠకులను ఆకర్షించే మొదటి ఆయుధం శీర్షికే. ఒక్కోసారి రచయిత శీర్షిక చుట్టూనే కథ అల్లొచ్చు. కథ రాసిన తర్వాత పేరు పెట్టొచ్చు. కథా గమనం మధ్యలో మంచి పేరు తట్టొచ్చు. మనిషి ఉనికికి పేరు ఎలాగో కథకూ అలానే. తెలుగు కథకులు ఎక్కువ కథలోని పాత్రల పేర్లు, పాత్రల స్వభావాన్ని తెలిపే పేర్లు, కథా వస్తువుకు సంబంధిచిన పేర్లను, ప్రతీకాత్మకంగానో, నేరుగానో కథకు పెడుతున్నారు. అవసరాన్ని బట్టి సాంకేతిక పదాలనూ శీర్షికలుగా వాడుతున్నారు.
కథలో వస్తువు ఒక్కోసారి అనేక సంఘటనలు, సన్నివేశాలుగా ఉండొచ్చు. అంతర్గత బంధం మాత్రం వాటిని దారంలా పట్టి ఉంచుతుంది. అయితే కొందరు రచయితలు కథను శకలాలుగా విభజించి, తార్కికమైన ఆలోచనలతో, ప్రతీకాత్మక వర్ణనలతో చిక్కని గాఢతతో చెప్తారు. చెప్పదలచుకున్న అంశంపై సంపూర్ణత్వం, భావావేశం, అంతర్లీన నిగూఢత కథను ఛేతనాఛేతనల మధ్య రచయితతో అలా రాయిస్తుంది. డా।। వి. చంద్రశేఖరరావువి “ఆకుపచ్చని దేశం”, “నల్లమిరియం చెట్టు” నవలలతోపాటు, “ద్రోహవృక్షం”, “చిట్టచివరి రేడియో నాటకం”, “ముగింపుకు ముందు” కథా సంపుటాలు వచ్చాయి. తన కాలపు నడకల్లోని గాయాలు, బాధలు, భయాలు, కలల్ని కథలుగా వాటిలో రికార్డు చేశారు. ఆ రికార్డుల్లోనిదే “నేనూ, పి.వి.శివం” కథ. రచయిత తనను, మరొక పాత్ర పేరును కలిపి శీర్షికగా పెట్టారు. ఈ శీర్షికే ఈ కథకు ఆయువు పట్టు.
“నేనూ, పి.వి. శివం” లో ప్రధాన పాత్రలు ఒకటి రచయిత, మరొకటి శివం అని ఇట్టే అర్థమైపోతుంది. కథ చదివే కొద్దీ శివం ప్రధాన పాత్రని తెలిసిపోతుంది. కానీ కథలో నేనూ (రచయిత), శివం వేరువేరు కాదు. ఒక్కరే. ఆ ఒక్కరు రచయితే. తాను చూసిన, అనుభవించి పలవరించిన రెండు తరాలకు, రెండు కాలలకు మధ్య ఉన్న చరిత్రకు, ఆలోచనలకు, మార్పులకు, జీవన విధానానికి, అభివృద్ధి దొంతర్లకు, సామాజిక సిద్ధాంతాలకు ప్రతీకలు మాత్రమే ఆ రెండు పాత్రలు. వాటి మధ్య సంఘర్షణలను, సంవేదనలను, దుఃఖాన్ని, కలలను, నీడలను, గాథలను కథాత్మకంగా రచయిత మలచిన విధానం అద్భుతం. ఆ అద్భుతాన్ని చూడాలంటే, తెలుసుకోవాలంటే, కాలగమన చక్రంలోని ఆ పొరలను విప్పాలంటే ఈ కథను తవ్వాల్సిందే. చంద్రశేఖరరావు తెరల దించిన కాలం వెనకున్న నిజాయితీ, విలువలతోపాటు వర్తమానంలోని స్వయంసంకల్పిత వస్తు వినిమయ ఆశల్లోని లోపాలను నిష్కర్షగా ఎత్తిచూపిన విధానం ఈ కథలో కనిపిస్తుంది.
ఈ కథ నాలుగు భాగాలు. ప్రతి భాగంలో శకలాలు… వాటిలో కథకుడు నేనూ, శివం మధ్య జరిగే సంభాషణ కన్నా ఒకరిపై మరొకరికున్న అభిప్రాయాలు, వాళ్ల అనుభవాలు, అనుభూతులు, వ్యక్తిత్వాతాలనే చెప్పాడు. అవే కథను నడిపిస్తాయి. మధ్యమధ్యలో వచ్చేపాత్రలూ, సన్నివేశాలు, సంఘటనలు శివాన్ని ఆదర్శీకరిస్తూ వాస్తవీకరిస్తాయి. ఇలా కథను తీర్చిదిద్దడంలోనే చంద్రశేఖరరావులోని కథకుడే కాదు కవి, శిల్పనిపుణుడు కూడా దర్శనమిస్తాడు. కథ ఎత్తుగడ నుంచి ముగింపు వరకు బిగిసడలని సంవిధానంతో ఆకట్టుకుంటుంది.
కథలోకి ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాదాసీదాగా లాక్కెళ్తాడు కథకుడు. అయితే శివం, నేను (రచయిత)ది తండ్రికొడుకుల బంధాన్ని మొదటే బయటపెట్టిన కథకుడు, “శివం లాంటి వాళ్లు కాలం చెల్లిన ఆదర్శాల కొయ్యగుర్రాలపై ఊరేగేవాళ్లని, సమాజానికి ఎక్సెస్ లగేజ”ని కొడుకు అభిప్రాయాన్ని చెప్పిస్తాడు. ఇక తండ్రి దృష్టిలో కొడుకు “ధనపిశాచి, ఫాలెన్ ఏంజెల్”. ఇద్దరికీ అసలు పడదు. కొడుకుది రియలెస్టేట్, కార్ల వ్యాపారం, కోట్ల టర్నోవర్. తండ్రి 1960లలో గుంటూరు మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా చేసి, కథాకాలం నాటికి సికింద్రాబాద్ దగ్గర బేకరీ పెట్టుకొని కేకులు అమ్ముకుంటూ బతుకుతుంటాడు. తప్పని పరిస్థితుల్లో కొడుకు తండ్రితో మూడు రోజులు కలిసి గడపాల్సి వస్తుంది. ఆ మూడురోజులు ఏం జరిగింది అనేదే ఈ కథ.
రెండు విరుద్ధ సమాజాలు, భావజాలాల మధ్య చంద్రశేఖరరావు కథను నడిపిన తీరుకు హాండ్సాఫ్ చెప్పకుండా ఉండలేం. 1960ల నాటి మనుషుల ఆదర్శాలకు, 2016 నాటి యువకుల వ్యక్తిత్వానికి మధ్య ఉన్న కత్తుల వంతెనమీద కథను సైద్ధాంతికంగా మలిచి మనల్ని దానిపై నడిపిస్తాడు.
సంఘర్షణాత్మక కథాగమనంలో తండ్రికి కొడుక్కి జరిగే మొదటి సంఘర్షణకు కారణం భాను. “నేను సెక్స్ వర్కర్ ను. ఫేమస్ ఏజ్ డు కస్టమర్స్ కు… మీ నాన్న నా హృదయాన్ని టచ్ చేశాడు…” అని కొడుకుతో చెప్తుంది. శివం ఆమెను “నా ఫ్రెండ్” అంటాడు. కొడుక్కు పట్టరాని కోపం వస్తుంది. “ఈ వయసులో ఇలాంటి బిచ్ లతో రిలేషన్ ఏంట”ని ప్రశ్నిస్తాడు. శివం తట్టుకోలేక “గెట్ లాస్ట్, నువ్వు ఒక మృగానివి” అంటాడు. ఈ సంఘటనతో కథకుడు పాఠకులను సమాజంలోని విలువలు, వృత్తి ప్రవృత్తులు, హృదయస్పందనలను మానవీయకోణంలోంచి ఆలోచించే అవకాశం కల్పిస్తాడు. కప్పుకున్న ముసుగుల్ని, ఆపాదించుకున్న నటనను గాలికెగరగొట్టస్తూ, మీరెటువైపు అని ప్రశ్న సంధిస్తాడు.
రెండో సంఘర్షణ ఆత్మహత్య చేసుకున్న కవి ఇంట్లో కనిపిస్తుంది. శివం కవి భార్యతో దుఃఖపుగాథను పంచుకుంటాడు. భాను కారియర్ పళ్లు ఫలహారాలు తెస్తే ఆమెకు ప్రేమగా తినిపిస్తాడు. ఆ రాత్రి భాను, శివం ఆ ఇంట్లోనే పడుకుంటారు. పొద్దున్నే ఆమెకు చెక్కు కూడా ఇస్తాడు శివం. కొడుక్కు ఆ ఇంటోని దుప్పి కొమ్ములు, దరువు, మట్టిబొమ్మలు… అన్నీ అడవి సెట్టింగ్ లా కనిపిస్తాయి. వాళ్ల సెంటిమెంట్ సినిమాటిక్ లా, ట్రాష్ లా అనిపిస్తుంది. అంతా యుద్ధవాతావరణంలా తోస్తుంది. ఇంట్లో పడుకోలేక రాత్రంతా టాక్సీలో కాలక్షేపం చేస్తాడు. ఈ సంఘర్షణలో బంధాల విలువ, ప్రేమాభిమానాలలో రెండు తరాల మధ్య వచ్చిన తేడాను కొడుకు, శివం పాత్రల ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తాడు రచయిత.
మరికొన్ని సంఘర్షణలు హనుమయ్యను కలవడానికి అమరావతి దగ్గరున్న వృద్ధాశ్రమానికి వెళ్లేటప్పుడు కనిపిస్తాయి. బస్ లో భూమిపుత్రికలా ఉన్న ఒకామె, ఆమె కొడుకు ఉంటారు. కొడుకు సెల ఫోన్ లో “భూమి మనదిరో, ఈ భూమి మనదిరో” అనే గద్దర్ పాట పెట్టి చిందులేస్తుంటాడు. ఆ పాటకు కొడుకు ఉలిక్కిపడితే, శివం ఆమెతో మాటలు కలపడానకి ప్రయత్నిస్తాడు. మరోచోట నదిలో గేదెలు మునిగి స్నానం చేస్తుంటే శివం వాటివైపు పచ్చగడ్డి విసురుతాడు. కొడుకు నీళ్లుతాగి బిస్ లరీ బాటిల్ ను వాటివైపు విసిరేస్తాడు. అది ఓ గేదె కొమ్ముకు తగులుతుంది. ఆ గేదె కొమ్ముల విదిల్చి హూంకరిస్తుంది. మిగిలిన గేదెలు పైకిలేస్తే, దాడి చేయడానికి వస్తున్నాయని భయంగా అరుస్తాడు కొడుకు. ఇంకోచోట భూమిపుత్రిక, ఆమె కొడుకు బస్టాండ్ గేటు ఎదురుగా షామియానాలో ప్రభుత్వం తమ భూమి పట్టా లాక్కొన్నారని దర్నా చేస్తూ కనిపిస్తారు. శివం వెళ్లి ఆమె పక్కన కూర్చుని మాట్లాడుతాడు. పోలీసులు షామియానా పీకేయడానికి ప్రయత్నిస్తుండగా నదిలో ఉన్న ఎద్దుల గుంపు మహాక్రోధంతో సమస్తాన్ని ధ్వంసం చేయడానికన్నట్లు రోడ్లపై బుసలు కొడుతూ రొడ్లపై పరుగెడుతాయి. జనాలందరూ భయకంపితులవుతారు. ఈ సంఘటన కొడుకను చాలాకాలం వెంటాడుతుంది. ఈ మూడు సంఘర్షణాత్మక సంఘటనల వెనుక అమరావతి రైతుల పోరాటం (రాజధాని నిర్మాణానికై ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుంటున్న సందర్భం), పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టీక్ భూతం, ఉద్యమాల ఆశలు కనిపిస్తాయి. వాటిని రెండు తరాలకు ప్రాతనిధ్యం వహిస్తున్న కొడుకు, శివం పాత్రలు చూసే దృక్పథంలోని వైవిధ్యాన్ని తెలియజేశారు. ఇలా చంద్రశేఖరరావు ప్రతి సంఘర్షణ వెనుక సామాజిక చలన సూత్రాలను, నర్మగర్భితమైన సత్యాన్ని శిల్పంలో నేర్పుగా పొదిగారు.
శివం అవార్డు పంక్షన్ ను మరికొన్ని సంఘర్షణలతో నింపాడు రచయిత. శివం గతకాలపు పోరాటాల వైభవాన్ని తలచుకుని, మిత్రులను కలిసి ఆనందం పొదుంతాడు. పాటలు, జానపద నాట్యాలతో హాలంతా వెలిగి పోతుంది. శివం స్టేజ్ పై శివం “మిత్రులారా, నా కామ్రేడ్స్, నాతోపాటు మధుర స్వప్నాన్ని కంటున్న నేస్తాల్లారా” అని ఉద్వేగంతో మాట్లాడుతూ సొమ్మసిల్లిపోతాడు. రోడ్ వెంట తిరుగుతూ బజ్జీలు తిని, గతాన్ని నెమరు వేసుకొని, బార్ లో మద్యం తాగుతూ, పాటలు పాడుతూ, భాను గజల్ ను ఎంజాయ్ చేస్తాడు. కానీ కొడుక్కి అదంతా నచ్చదు. “మనుషులు ఇంత ఉత్సాహంగా, ఆనందంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఈ రాత్రితో నా బాధ్యత తీరిపోతుంద”ని తనకుతాను నచ్చజెప్పుకుంటాడు. తండ్రి భానును “తనతో హైదరాబాద్ వచ్చెయ్” అని పిలవడం నచ్చక “నీకేమైనా మతిపోయిందా… ఇలాంటి దాన్ని” అని క్వశ్చన్ చేస్తాడు. “గెట్ లాస్ట్ ఫ్రం దిస్ ప్లేస్” అని తండ్రితో తిట్లు తింటాడు. వీటి వెనుక తండ్రిని బాధ్యత అనుకునే కొడుకు, మనుషుల్ని అక్కున జేర్చుకుని, వాళ్ల కష్టాలను తనవిగా భావించే తండ్రి కనిపిస్తారు. సమాజాన్ని మార్చాలనుకుని సిద్ధాంతాలు, ఉద్యమాలతో కలలగన్న పాతతరం, సంతోషం అంటే ఏమిటో తెలియక తికమకపడుతూ సంపాదన, కూడబెట్టడమే లక్ష్యం అనుకున్న నేటితరం ఉన్నారు. ఇలా సంఘర్షణలతో కథను నడిపి జీవన సౌందర్యం తాలూకూ అనుభూతల పర్వాలను బేరీజు వేసే పనిని పాఠకులకే వదిలేశాడు చంద్రశేఖరరావు.
ఇక కథలో చివరి సంఘర్షణాత్మక సంఘటన కొడుకు చేసే యాక్సిడెంట్. సారాతాగి తూలుతూ వచ్చి కారను ఢీకొట్టిన 50 ఏళ్ల వ్యక్తిని “ఎవరూ చూడలేదు వదిలేసి వెళ్దాం” అంటాడు కొడుకు. శివం అతడిని హాస్పిటల్ లో చేర్చి స్పృహ వచ్చిందాకా వెయిట్ చేసి, డాక్టర్ భరోసా ఇచ్చాక బల్దేరేలా చేస్తాడు. యాక్సిడెంట్ అయిన వ్యక్తిపై కొడుకు చెయ్యి వేసి, “నేను హాస్పిటల్లో చేర్పించాను” అని చెప్తాడు. అతడు కొడుకు ముఖంపై ఉమ్మి, చొక్కా చింపుతాడు. కొడుకు భయంతో కొయ్యబారిపోతాడు. దాన్ని చూసిన శివం“ఇదేదో భవిష్యత్ సూచికలా ఉంది” అంటాడు. కొడుకు ముఖం అవమానంతో ఎర్రబడుతంది. సమకాలీన సమాజానికి ప్రతీకైన కొడుకు ముఖంపై ఉమ్మి వేయించి కథలోని అన్ని సంఘర్షణలకు తనదైన తుది తీర్పు ఇచ్చేస్తాడు కథకుడు.
పాత్రల ఆలోచనల్లోని సంఘర్షణలను సన్నివేశాలుగా, సంఘటనలుగా మార్చడం అంతసులభం కాదు, అదీ తండ్రి, కొడుకులను పాత్రలుగా మలచి. రెండు విరుద్ధ భావాలను ఒకే వరలో చేర్చి “పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో చరిత్ర పుట్టింద”న్న కవి మాటలను కథగా చేశారేమో చంద్రశేఖరరావు అనిపిస్తుంది. అమరావతి రైతుల భూ పోరాటానికి, భూమి పుత్రిక పాత్ర చెప్పే మేకపిల్ల కథ ప్రతీకాత్మకం. “మేకపిల్లలాంటి గుంటూరు పులిలా మారడానికి ప్రయత్నిస్తుంది. కథలో పులులు లేవు కాని, రియలెస్టేట్ వ్యాపారం చేసేవారు, బిల్డర్లు ఉన్నారు.” అని క్లూ కూడా ఇస్తారు రచయిత.
ఎక్కడా ఉద్వేగం తగ్గని కథనం, పాత్రలమ మధ్య పొసగని బాధ్యతాయుతమైన భావజాలం, శకలాలుగా కనిపించే సన్నివేశాలు, కాలం మిగిల్చిన గుర్తులు, వర్తమానంలోని లొసుగులు, మనసు పొరలను కప్పివేసిన వ్యాపార సంస్కృతి… ఇలా ఎన్నో విషయాలను ఈ కథలో సంఘర్షణాత్మక పాత్రల శిల్పంతో కవితాత్మకంగా చెక్కారు చంద్రశేఖరరావు. కొడుకు, శివం రెండు పాత్రలు కావు. అతడిలోని రెండు తరాల మధ్య నెలకొన్న సంఘర్షణలు. అఛేతనలో దాగిన అపరిచిత, పరిచిత స్వరాలు. కథ కూడా అనుభవాల్లా సాగుతుంది. చంద్రశేఖరరావులాంటి విలక్షణ కథా శిల్పాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్ర పరిణామ గతుల్ని పోగేసుకోవాలి. అప్పుడే ఇలాంటి కథల మోనోలాగ్స్ రహస్యాలను విప్పొచ్చు.
******
నేనూ, పి.వి.శివం
-డా|| వి. చంద్రశేఖరరావు
పదకొండు గంటలకి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న,’ అంటూ మొదలు పెట్టింది ఫోన్‌లోని అమ్మాయి. ‘పి.వి. శివం,’ అన్నాను నేను. ఈ పి.వి.శివాలు ప్రత్యేకమైన కేటగిరి మనుషులు. కాలం చెల్లిన ఆదర్శాల కొయ్యగుర్రాలపై ఇప్పటికీ ఊరేగుతుం టారు. ప్రతీదీ వ్యాపారమైన కాలంలో వీళ్లు సమా జానికి ఎక్సెస్ లగేజి లాంటివాళ్లు.
‘‘ఆయన హాస్పిటల్లో ఉన్నారు, సెయింట్ జోసెఫ్‌లో.’’ మృదు వైన కంఠస్వరం.
‘‘ఎవరు,’’ అన్నాను నేను. ఎవరి గురించి అయినా వివరాలు తెలీ కుండా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం ఇష్టంలేదు నాకు. అవన్నీ నా రూల్స్ ఆఫ్ ది గేవ్‌ు.
గుంటూరులో ఒక పౌర సన్మానం కోసం వచ్చాడు పి.వి. శివం. అరవైల్లో గుంటూరు మున్సిపాలిటీకి వైస్ ఛైర్మన్‌గా చేశాడు ఆయన. నగరానికి ఎన్నో అద్భుతాలు చేసిన మనిషిగా చెప్పుకుంటారు. టౌన్ డెవెలప్‌మెంట్ కోసం తన భూమిని సైతం అమ్మాడు అని చెప్పు కుంటారు.
రాత్రి అమ్మ ఫోన్ చేసింది. ‘ఆయనకి తోడుగా వెళ్లు. నెల క్రితమే స్ట్రోక్ వచ్చిన మనిషి,’ అంది. ట్రైన్లో కానీ, దిగిన తరువాత కానీ, ఆయన నాతో రావడానికి ఇష్టపడలేదు. తన ట్రాలీ బ్యాగ్‌ను తానే లాక్కుంటూ ఒక్కడే టాక్సీలో హోటల్‌కి వెళ్లాడు. ఆయన దిగిన అదే హోటల్‌లో నేను ఇంకో రూములో చేరాను. ధనపిశాచి, ఫాలెన్ ఏంజెల్ అంటూ నా గురించి అందరికీ చెప్తాడు ఆయన.
రియల్ ఎస్టేట్, కార్ల వ్యాపారం- కోట్ల టర్నోవర్ నాది. నాలుగు కార్లు, జూబ్లీ హిల్స్‌లో పెద్ద బంగ్లా. ఈయన మాత్రం నాకు దూరంగా సికింద్రాబాద్, మారుమూల ప్రాంతంలో ఒక బేకరీ పెట్టుకొని కేకులు అమ్ముకొని బ్రతుకు తుంటాడు. పేరుకి బేకరీయే కాని… దాని నిండా వందలాది పుస్తకాలు. కేకులు తింటూ, టీ తాగుతూ ఒక పుస్తకాన్ని చదువుతూ ఆయనలాగే కాలం విలువ తెలియనివాళ్లు అక్కడ మూగుతుంటారు. సాయంకాలం వేళ ఈయన లాంటి ఓల్డ్ టైమర్స్ అక్కడ చేరుతారు. ఒక కాలపు కలల గురించి, వినియోగం లేని సమాజ సూత్రాల గురించి మాట్లాడుకుంటూ, మళ్లీ ఒక గొప్ప కాలం వస్తుంది, ఈ స్వప్నం నిజం అవుతుంది అంటూ తీర్మానించుకొని…
హాస్పిటల్ బయట ఒక చురుకు కళ్ల అమ్మాయి, ‘‘నేను భాను,’’ అంటూ చేయి చాపింది. హలో అంటూ లోపలికి నడిచాను.
నీరసంగా ఉన్నాడు ఆ మనిషి. తెల్లటి గుబురు గడ్డం, తలపై మిగిలిన కొద్దిగా తెల్లజుట్టుతో శిశువుల ముఖంలో కనబడే గొప్ప సౌందర్యం ఆయన ముఖంలో… ఫుట్‌బాల్ మ్యాచ్లు, కోరీÄ బుక్‌స్టాల్స్, ఛాయి బిస్కట్లు, ట్యాంక్ బండ్ పై రన్నింగ్ రేసు, వుండుండి ఒక్క సారిగా శ్రీశ్రీ అనే కవి రాసిన కవితలను పెద్దగా పాడటం, మిత్రు లందరి మధ్య, ‘వీడు నా లెనిన్’ అంటూ నన్ను పరిచయం చెయ్యటం.
‘‘ఏమైంది,’’ అన్నాను, ఆ మెరుపు కళ్ల అమ్మాయితో.
‘‘ఉదయం మా ఇంటికి వచ్చాడు. హనుమయ్య మాస్టారు ఇంటికి తీసుకువెళ్లమని మెట్లు దిగుతూ జారిపడ్డాడు.’’
హఠాత్తుగా ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, ‘‘మీరు ఏం చేస్తుంటారు?’’ అన్నాను.
చురుకుగా గంభీరంగా నా వైపు చూస్తూ, ‘‘ఐ యావ్‌ు ఎ సెక్స్ వర్కర్,’’ అంది.
‘‘జోక్ చేస్తున్నారా?’’ అన్నాను.
ఆ అమ్మాయి నిర్లిప్తంగా చూసింది. ‘‘ఐ ఆవ్‌ు ఫేమస్ విత్ ఏజెడ్ కస్టమర్స్. కానీ ఈ పెద్దాయన, హి టచ్డ్ మై హార్ట్,’’ అంది ఎటువైపో చూస్తూ.
ఆ అమ్మాయి బయటకి వెళ్లిన సమయంలో ఆయన దగ్గరికి వెళ్లి, ‘‘ఏమిటిది ఇట్లాంటి మనిషితో,’’ అన్నాను నిరసనగా.
‘‘ఆ అమ్మాయి నా ఫ్రెండ్,’’ అన్నాడు పి.వి. శివం.
‘‘ఇట్లాంటి బిచ్‌తో,’’ ఉక్రోషం పట్టలేక పెద్దగా అరిచాను.
కళ్లలో నిప్పులు రాలుస్తూ ఈడ్చి నా చెంపపై కొట్టాడు పి.వి. శివం. ‘‘గెట్ లాస్ట్, నువ్వు ఒక మృగానివి,’’ అంటూ బయటకి చేయి చూపించాడు. ఆరోజు అంతా హాస్పిటల్ మెట్లమీదే గడిపాను.
2
ఆ మరుసటి రోజు ఆయన్ని తీసుకొని హోటల్‌కి వెళ్లాను. కానీ ఆయనతో పాటు తన గదిలో ఉండడానికి ఒప్పుకోలేదు. మధ్యాహ్నం, ‘‘కాస్త విస్కీ తాగాలని ఉంది,’’ అని కోరాడు. రెండు మూడు పెగ్గుల తర్వాత బిగుసుకున్న తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. ఆయన జ్ఞాపకాలను ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాడు. యూనివర్సిటీ రోజులు, అమ్మతో పరిచయం, పేలవమైన శ్రీశ్రీ మార్కు కవితలు.
‘‘అప్పట్లో సోవియట్ సాహిత్యం గురించి మాట్లాడుకోవటం ఎంతో ఇష్టంగా ఉండేది. మీ అమ్మకి గోర్కి అంటే ఇష్టం. నాకు మాత్రం చెహోవ్, దోస్తావ్ యెస్కీ అంటేనే ఇష్టం. మీ అమ్మ ఎప్పుడూ ఒక గోర్కి పుస్తకంతోనే ప్రత్యక్షం అయేది. మీ అమ్మను నేను ఇష్టంగా నటాషా అని పిలుచుకునేవాడిని.’’ ఆయన మరో రెండు పెగ్గులు తీసుకున్నాడు. గాఢమైన తాత్వికగాథలా మారిపోయాడు. చిన్న చిన్న శకలాలుగా అక్కడ ఇక్కడ పడివున్న దృశ్యాలన్నీ బయటకి తీస్తున్నాడు.
‘‘ఇది నా ముఖం, ఇది నా పోరాటం. ఇదిగో ఇక్కడ పరిచిన ఇదంతా నా జీవితం. ఇదిగో బహుశా ఇదే నా మరణం. ఎందుకు ఎట్లా ఎప్పుడు అని ఎనలైజ్ చేసుకోలేదు. X ష్ట్రaఙవ అశ్‌ీ శ్రీఱఙవస ఱఅ ఙaఱఅ,ఁ అట్లా కబుర్లు చెబుతూ మంచంపైన పడిపోయాడు ఆయన.
రాత్రి పది గంటల సమయంలో తలుపు మీద శబ్దం. ‘‘ఒక చోటకి వెళ్లాలిరా,’’ అంటూ నాకు ఆర్డర్ వేసి బయటకు నడిచాడు. ఎక్కడికి అన్నట్లుగా చూశాను. ‘‘ఆత్మహత్య చేసుకున్న ఒక కవి ఇంటికి వెళ్దాం,’’ అని అన్నాడు. నాకు చిరాకు వేసింది.
‘‘వాడికి మనకి సంబంధం ఏమిటి. వాడెవడో సూసైడ్ చేసు కుంటే మనం ఎందుకు వెళ్లటం,’’ అని అన్నాను.
పి.వి. శివం నాకేసి జుగుప్సగా చూసి ఒక్కడే హోటల్ బయటకి నడిచాడు. విధిలేక నేను ఆయన వెంట నడిచాను.
ఒకే గది ఇల్లు. ఆత్మహత్య చేసుకున్న రాజు అనే కవిది. ఒక అమాయకమైన పల్లెటూరి మనిషి బయటకు వచ్చింది ఎవరు, ఏమి కావాలి అంటూ. పి.వి. శివం లోపలికి నడుస్తూ ప్రేమగా ఆ పిల్ల తల నిమిరాడు. లోపలికి వెళ్లి ఒక చిన్న బల్లపై కూర్చున్నాడు. ఆవిడ పేరు రేణుకాదేవి. చూస్తుండగానే పి.వి. శివం, ఆ అమ్మాయితో ఒక దుఃఖపు గాథను పంచుకోవటం మొదలుపెట్టాడు.
ఆ చిన్న గదిలో ఉండాలి అంటే నాకు అనీజీగా ఉంది. ఇల్లు కాదు, మినేచర్ అడవిలా ఉంది. దుప్పి కొమ్ములు, పలచటి దరువు, మట్టిబొమ్మలు, భీకరంగా చూసే అడవి దేవతల రూపాలు… అదేదో పురాణకాలపు సెట్టింగ్‌లాగా ఉంది. ఆ చనిపోయిన మనిషి భార్య మరీ అమాయకురాలిలా పల్లెటూరు దేవతలా ఉంది. రెండు ఏళ్ల కొడుకు ఒక మూలన పడుకొని వున్నాడు. కనపడని మరణం ఏదో నన్ను భయానికి గురి చేసింది. ఆ ఆత్మహత్య చేసుకున్న మనిషి మళ్లీ ప్రత్యక్షం అవుతాడేమో అనిపించింది. ఉరుములు, మెరుపులు, ఆకాశం చీలిపోవటం, ఎరుపు రంగు కలలు, సమాధులు చీల్చుకొని డప్పులు కొమ్ముబూరా, ఒక యుద్ధనాదంతో అతను మళ్లీ ప్రత్యక్షం కాబోతున్నాడు అనిపించింది. గంట గడిచినాక ఆయన మెరుపు కళ్ల భానుకి ఫోన్ చేశాడు. భాను పొడవాటి కారియర్, పళ్లు ఫలహారాలతో ప్రత్యక్షం అయ్యింది. ఆ దృశ్యం నాకు ఎందుకో సినిమాటిక్‌గా అనిపిం చింది. పి.వి. శివం అన్నం ముద్దలు కలిపి ఆ అమ్మాయికి తినిపిం చడం, నిద్రలేపి పసివాడికి రెండు ముద్దలు తిన్పించడం- ఇదంతా ఒక సెంటిమెంటల్ ట్రాష్‌గా అనిపించింది. ఈ రాత్రికి ఇక్కడే పడు కుందాం అంటూ ఆయన డిక్లేర్ చేశాడు. పి.వి. శివం, భాను అక్కడే ఆ ఇరుకు గదిలో పడుకున్నారు. నేను బయట టాక్సీలో కాలక్షేపం చేశాను. నా లాజిక్‌కి ఏ మాత్రం అందని మనిషి ఈ పి.వి. శివం. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ నుంచి బయలుదేరుతూ వెళ్లే ముందు ఒక చెక్కును ఆ ఆడమనిషి చేతుల్లో పెట్టాడు.
పొద్దున్నే పి.వి. శివం అమరావతి వెళ్దామంటూ బయలుదేర దీశాడు. ఆయన చిన్ననాటి మిత్రుడు హనుమయ్య ఆచూకి తెలిసిందని, అమరావతిలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో వున్నాడని భాను కనిపెట్టింది. ఇన్నోవా కారు కోసం మిత్రుడికి ఫోన్ చేశాను. వద్దు, బస్‌కి వెళ్దామంటూ మొండికేశాడు. బస్టాండులో భాను ఎదురు చూస్తుంది. బస్సంతా ఖాళీగా ఉంది. బస్‌లో ఒక నడికారు ఆడమనిషి. ఆడమనిషి ఒళ్లో కూర్చున్న నాలుగేళ్ల ఆమె కొడుకు. నల్ల బంగారంలా ఉదయపు ఎండలో ఆడమనిషి మిలమిలలాడుతోంది. పొలాల్లో తరచుగా ఎదురయ్యే భూమిపుత్రికలా ఉంది. చేతులు బలంగా ఇనుప చేతుల్లా ఉన్నాయి. రష్యన్ కథలో కనపడే పాత్రలా ఉందావిడ. ఉదయమే కానీ ఉక్కపోస్తుంది. ఆమె నల్లటి రగ్గు కప్పుకొని ఉంది.
పి.వి. శివం పలకరింపుగా, ‘‘ఇంత ఉక్కపోతలో కూడా రగ్గు కప్పుకున్నావే,’’ అన్నాడు. ఆమె పట్టించుకోకుండా బస్సు బయటకి చూస్తుంది. ‘‘సెప్టెంబరు నెలలో కూడా ఇంత ఉక్కగా ఉందే,’’ అన్నాడు పి.వి. శివం ఆమె వైపు చూస్తూ.
ఆమెను గట్టిగా కరుచుకుని కూర్చున్న పిల్లవాడు లేచి వాళ్లమ్మ సంచిలోంచి సెల్‌ఫోన్ తీశాడు. పాట పెట్టు అంటూ సెల్‌ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు. ఆమె తన ఒంటి మీద రగ్గును పిల్లవాడి చుట్టూ కప్పి సెల్‌ఫోన్ నొక్కింది. ‘భూమి మనదిరో, ఈ భూమి మనదిరో…’ గద్దరు పాట పెద్దగా వినపడింది. కుర్రవాడు లేచి పాటకు అనుగుణం గా చిందులేస్తున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను. పి.వి. శివం మరొకసారి ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నించాడు, ఆమె పట్టించు కోలేదు. కుర్రవాడు ఇంకా గద్దరు పాటకు చిందులేస్తునే వున్నాడు. ఆమె తన బొడ్డులో ఉన్న గుడ్డసంచి బయటకు తీసింది.
‘‘ఏదైనా ఉద్యమంలో పని చేస్తున్నావా?’’ అన్నాడు పి.వి. శివం.
ఆమె పట్టించుకోలేదు. గుడ్డ సంచిలోంచి ఆకు, వక్క బయటకు తీసి దానికి కొంచెం పొగాకు ముక్కను కలిపి దానిని నోట్లో వేసుకుంది. కిటికీలోంచి బయటకు చూస్తూ తూ అంటూ ఊసింది పెద్ద శబ్దంతో. ఆమె ముఖంలో ఏదో కోపం, కసి, నిరసన తోచాయి. అన్నివైపుల నుంచి ఉదయపు ఎండ. బస్సులో మేం ముగ్గురం, ఆడ మనిషి, పిల్లవాడు తప్ప ఇంకెవరు ఎక్కలేదు. కండక్టర్ బస్ ఎక్కాడు. తన సీట్లో కూర్చుని టిక్కెట్ తీసుకోండి అని అరిచాడు. పిల్లవాడు వెళ్లి 50 నోటు ఇచ్చి రెండు టిక్కెట్లు అన్నాడు. సీటు క్రింద ఉన్న గొర్రెపిల్లకి కూడా తీసుకో అన్నాడు కండక్టర్. సీటు క్రింద బుజ్జి గొర్రెపిల్ల ఇప్పుడే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినట్లు లేతగా పచ్చిగా ముద్దుగా, ముదురు గోధుమ రంగులో వుంది. సీటు క్రింద సన్నటి త్రాడుతో కట్టేశారు దాన్ని. దానికి కూడా టిక్కెట్ ఇచ్చాడు కండక్టర్. ఇప్పుడు ఆ తల్లి ఒడిలో కుర్రాడు. కుర్రవాడి ఒడిలో గొర్రెపిల్ల.
బస్ బయలుదేరింది. విశాలమైన రోడ్లు, లేటెస్టు కార్లు, పొలిటీ షియన్ల కటౌట్లు, గుంటూరు తన రూపం మార్చుకుంటుంది. రోడ్డు పొడవునా కొత్త కొత్త అపార్టుమెంట్లు, మాల్స్, మేకపిల్లలాంటి గుంటూరు పులిలా మారటానికి ప్రయత్నిస్తుంది.
కిటికీని ఆనుకొని పి.వి. శివం కునుకు తీస్తున్నాడు. బస్‌లో తల్లి, కొడుకుల కబుర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. పిల్లవాడు హఠాత్తుగా వాళ్ల అమ్మను మేకపిల్ల కథ చెప్పమన్నాడు. ఆ తల్లి పెద్దగా ఆలోచించకుండానే కథను మొదలుపెట్టింది. ఒక మేక, కాదు వందకు పైగా వున్నాయి. మేకల చుట్టూ ఇనుప కంచ వేశారు. పచ్చటి నేల. మిలమిల మెరుస్తున్న అటుప్రక్క కొండల దాకా పెరిగిన ఆకు పచ్చని నేల. ఆ ప్రదేశానికి వెళ్తే ఆ మేకలు మనవైపే చూస్తున్నట్లుం టాయి. ఆ మేకలు ఆ కంచలో ఎప్పటి నుండి వున్నాయో తెలియదు కాని అక్కడంతా ఉచ్చ కంపు, మేకల పెంటికల వాసన.
ఆ మేకలు పెద్దగా చప్పుడు చేయవు, అరవవు, అటూ ఇటూ పరిగెత్తవు. వాటికి కాపలాగా ఎవరూ ఉండరు. పొద్దున్నే గడ్డిపరకలను నములుతూ కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే మేకల కాళ్లకు నైలాన్ తాళ్లు కట్టి వుంటాయి. అవి చాలా పొడుగు తాళ్లు. మేకల కళ్లన్నీ దిగులుగా ఉంటాయి. ఏమిటీ- బ్రతుకు అన్నట్లుగా వుంటాయి.
ఆడమనిషి గొంతు ఖంగుమని మ్రోగుతుంది. ఈ కథ, ఈ బస్ ప్రయాణం- ఇదంతా విసుగ్గా వుంది నాకు. పి.వి. శివం మీద చెప్పలేని కోపం వేసింది. రోడ్డు పొడవునా కొత్తకొత్త నిర్మాణాలు. ఆ నిర్మాణాలు చూస్తే ఆశగా వుంది. కొత్త వ్యాపారాలు కొత్త అవకాశాలు భవిష్యత్ అంతా ఇక్కడే వున్నట్లనిపిస్తుంది. రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే 50 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. అవన్నీ రైతులు దగ్గర కొన్న భూములు. అవి గవర్నమెంటుకిచ్చి పూలింగ్‌లో కలిపి, రేపు కోట్ల మీద లాభాలొస్తాయి. ఆడమనిషి మేకల కథ చెబుతూనే వుంది. కథలో పులులు లేవు కాని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, బిల్డర్లు ఉన్నారు. ఆకుపచ్చ నేల మాయమైంది. బోను లాంటి కాంక్రీట్ ఇళ్లు. ఆ బోనులో మేకలు. వాటికి ప్రత్యేకమైన ఆహారం. బోనులోని మేకలు ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. అవి పారిపోయాయో కబేళాకి వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడక్కడ ఒక్క మేకే వుంది. అది బోనులో నుంచి బయటికి వచ్చి బిక్కు బిక్కుమంటూ చూస్తుంది. ఆడమనిషి కథ కొనసాగుతునే వుంది. వినే మూడ్ లేక నా సెల్‌ఫోన్‌లో పాటలు ఆన్ చేశాను.
పి.వి. శివం నిద్దర లేచినట్లున్నాడు, ఆ అమ్మాయితో కబుర్లు మొదలుపెట్టాడు.
అమరావతిని చూస్తూనే నాలో ఏదో హుషారు. ఇన్వెస్టర్ల స్వర్గం అక్కడ రాబోతుంది. అటూ ఇటూ ఎటు చూసినా అవకాశాలే. బస్ దిగుతూనే పి.వి. శివం ఆటోను పిలిచాడు. నేను కారులో వెళ్దామంటూ నసిగాను. బయట భయంకరమైన ఉక్కపోతా, ఎండా, శరీరమంతా చెమటలు. వృద్ధాశ్రమం ఊరి చివర నది ఒడ్డున వుంది. ఆటో దిగి అటువైపు నడుస్తుంటే నదిలో ఈదుతున్న నల్లటి గేదెలు, దున్నలు కనిపించాయి. తొమ్మిదో పదో వుంటాయి. నీటిలో మునిగి, స్నానం చేస్తున్నాయి. వాటి కొమ్ములు, ముట్టె మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిలో నుంచి ఒకటి పైకి లేచి, అద్భుతమైన దృశ్యం. నల్లటి రాతి గేదెలా వుంది. భాను, శివం వాటివైపు నడిచారు. నది ఒడ్డున అడవి పూలచెట్లు ఏపుగా పెరిగున్నాయి. భాను ఆ గేదెవైపు వెళ్లి దేవతా మూర్తి ముందు తల వంచి నిలబడినట్లుగా క్రింద కూర్చొని రెండు చేతులు వాటి వైపు చాచి. పి.వి. శివం గట్టు పైన ఉన్న పచ్చగడ్డిని వాటిపై విసిరాడు.
పది గంటలయింది. ఎండ వేడి తట్టుకోలేనట్లుగా ఉంది. నా చేతిలోని బిస్‌లరీ బాటిల్‌లో నీళ్లు తాగి ఆ బాటిల్‌ని గేదెలవైపు విసిరాను. అది వెళ్లి ఒక గేదె కొమ్మును తాకింది.
అప్పటివరకు నీళ్లలో పడుకుని స్నానం చేస్తున్న ఆ గేదె ఒక్కటీ ఒక్కసారిగా పైకి లేచింది. తల విదిల్చి వాడియైన కొమ్మును కదిలిస్తూ హుంకరించింది. మిగిలిన గేదెలు కూడా నీళ్లలోంచి పైకి లేచాయి. మాపైకి దాడి చేయబోతున్నట్లుగా అన్నీ ఒక్కసారిగా ఒడ్డువైపు కదిలాయి. భయంగా అరిచాను. పి.వి. శివం, భాను ఆశ్రమం వైపు నడుస్తున్నారు. వెళుతూ వెళుతూ భాను వెనక్కి తిరిగి నావైపు చూసింది. ఆ ముఖంలో వుంది వెక్కిరింతా? జాలా?
పి.వి. శివం వెతుకుతున్న హనుమయ్య ఇప్పుడా వృద్ధాశ్రమంలో లేడు. ‘‘ఈ మధ్యకాలంలో చుట్టుప్రక్కల ఊళ్ల నుంచి ముసలి రైతులు కూడా వచ్చి ఆశ్రమంలో చేరుతున్నారు. వచ్చే విరాళాలు తగ్గిపోయాయి. అందుకే కొంతమందిని వాళ్ల ఇళ్లకు పంపాము. వాళ్లలో ఈ హనుమయ్య ఒకడు,’’ అంటూ ఆశ్రమం మేనేజరు చెప్పాడు. పి.వి. శివం ముఖంలో చెప్పలేని నిరుత్సాహం. చాలాసేపు ఆలోచించి తన సంచీలో నుంచి చెక్ బుక్ తీసి ఐదు లక్షల విరాళం ఆశ్రమం పేరుతో రాశారు.
‘‘హనుమయ్య మాస్టారుని వెనక్కి ఆశ్రమంలోకి పిలిపించండి. వాళ్లు మహానుభావులు. వాళ్లని అట్లా అనాథలుగా వదిలివేయద్దు,’’ అంటూ మేనేజరు వైపు చేతులు జోడించాడు.
తిరిగి బస్టాండ్ చేరాము. బస్టాండ్ గేటు ఎదురుగా ఒక షామియానా. టార్పాలిన్ పట్టాలతో వేసిన షామియానా. ఉదయం బస్‌లో కనబడ్డ ఆడమనిషి, ఆమె కొడుకు కూర్చుని వున్నారు. ప్రభుత్వం లాక్కున్న పట్టా నెంబరు 56/82ను తిరిగి ఇచ్చేయాలి అంటూ ఒక బ్యానర్ వుంది ఆ టెంట్‌లో. పి.వి. శివం షామియానా వైపు నడిచాడు. కాసేపు ఆమె పక్కనే మౌనంగా కూర్చున్నాడు. పిల్లవాడు సెల్‌ఫోన్ నొక్కి ఉద్యమం పాట వినిపిస్తున్నాడు.
పి.వి. శివం ఆ ఆడమనిషితో మాట్లాడుతుండగా ఎదురైన ఒక దృశ్యం నన్ను భయభ్రాంతుడను చేసింది. భయానకమైన కలలా నన్నాదృశ్యం చాన్నాళ్లపాటు వెంటాడింది.
వి.ఐ.పి. ఎవడో ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు, ముందు ఓ నాలుగు, వెనుక ఓ నాలుగు కార్లు. పోలీసులు హడావుడి చేస్తున్నారు అన్ని వాహనాలను ఆపి. వాళ్ల కళ్లు రోడ్డు ప్రక్కన వున్న శిబిరం పైన పడ్డాయి. పదిమంది పోలీసులు శిబిరాన్ని చుట్టుముట్టి కర్రలనీ, టార్పాలిన్‌ను పీకి వేస్తుండగా ఆ ఆడమనిషి రుద్రకాళికలా మారి పెద్దగా అరుస్తూ, కేకలు వేస్తూ వాళ్లను ప్రతిఘటించింది. సరిగ్గా అప్పుడే ఆ సంఘటన జరిగింది. భయం గొలిపే ఒక దృశ్యం రోడ్డుపై ప్రత్యక్షమైంది. నది నీళ్లలో నిద్రిస్తూ సేదదీరుతున్న మహిషాల గుంపు, ఎవరో వాటిపై దాడి చేసి వెంటాడి రెచ్చగొట్టినట్లుగా మహా క్రోధంతో ఒక యుద్ధోన్మాదంతో రోడ్డుపై పరిగెడుతున్నాయి. ఆ దృశ్యమంతా ఒక యుద్ధ సన్నివేశాన్ని గుర్తు చేసింది. రోడ్డు పైన మనుషులందరూ భయంతో అటు ఇటు పరిగెట్టారు. కొమ్ముల ఆయుధాలతో ఆ మహిషాలు సమస్తాన్ని ధ్వంసం చేయటానికి వస్తున్నట్లుగా దూరం నుంచి చూస్తే రోడ్డుపై అవి మాత్రమే మహాక్రోధంతో బుసలు కొడుతూ. ఆ దృశ్యం చాలారోజులపాటు నన్ను వెంటాడింది.
3
ఆదివారం సాయంకాలం అవార్డు ఫంక్షన్. వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం. గుంపులు గుంపులుగా ఈ పి.వి. శివం లాంటి ఓల్డ్ టైమర్స్ ఆ సభకు వచ్చారు. బయట చిన్న చిన్న సమూహాలుగా చీలిపోయి గతకాలపు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. హోటల్ నుంచి బయలు దేరుతున్న ఆయన ముఖం చుట్టూ ఒక కాంతి వలయం కనపడ సాగింది. సాయంకాలపు లేత ఎండ, శీతాకాలపు చల్లని గాలి, ఎండిన ఆకులపై పాదాల చప్పుళ్లు.
‘‘ఈ రోడ్లు అన్నీ నాతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి,’’ అన్నాడు పి.వి. శివం.
కారు వెనుక భాను, ఆమె ఎనిమిదేళ్ల కొడుకు ఉండడం నాకు నచ్చలేదు. ఈ ఒక్కరాత్రి గడిపేస్తే చాలు, ఈయన గురించి నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. సంవత్సరాలన్నీ కళ్ల ముందే కదులుతున్నట్టుగా వుంది. మనుషులు అందరూ వెనక్కు గతంలోకి అదృశ్యం అవుతూ మళ్లీ ప్రత్యక్షం అవుతూ… ఈ వీధులలో నేను జీవించాను. ఎ.సి. కాలేజీలో బి.ఎ. చేసిన రోజులు. ప్రొద్దున్నే సైకిల్ పై న్యూస్‌పేపర్లు ఇచ్చి రావటం. సాయంకాలం కవిత్వమో, నవలో పదిమంది కూర్చొని చర్చించుకోవటం. జీవితం అంటే మనుషుల మంచితనమే అని గాఢంగా నమ్మిన రోజులు. భీకరమైన సింహం లాంటి కాలానికి రొమ్ము చూపి నిలిపిన రోజులు. పి.వి. శివం కళ్లలో సన్నటి నీటి తెర.
ఫంక్షన్ హాల్‌కి చేరుతూనే వందలమంది ఆయన చుట్టూ మూగారు. ఆయనని భుజాల పైకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్లారు. పి.వి. జిందాబాద్ అంటూ పెద్ద పెద్ద నినాదాలు. బయట డప్పుల నాదాలు, శ్రావ్యమైన సన్నాయి పాటలు. అదేదో ప్రత్యేకమైన దేశంలా ఉంది. మనుషులు ఇంత ఉత్సాహంగా ఆనందంగా వుండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన రెండురోజులుగా వెతుకుతున్న హనుమయ్య మాస్టారుగారి మనవడు ఆ సభకు వచ్చాడు. తాతయ్య రాసిన పుస్తకాలు అంటూ హనుమయ్య మాస్టారి కవిత్వ సంకలనాలు ఆ కుర్రాడు పి.వి. శివంకి ఇచ్చాడు. అపురూప మైన ఆస్తిలా వాటిని గుండెలపైన హత్తుకున్నాడు. పి.వి. శివం కళ్లలో నీరు. ఆ తరువాత మొదలైంది ఒక గొప్ప వేడుక. ఎవరెవరో మాట్లాడారు. రాసుకొచ్చిన ఉపన్యాసాలు కావు అవి. గుండెల్లో నుంచి ఉబికిన ఉద్వేగాల గాథలు అవి. చివరగా పి.వి. శివంను పట్టు శాలువా, గజమాలతో సన్మానించారు. పి.వి. శివం దేవతల మనిషిగా వెలిగిపోయాడు. ఆత్రంగా పట్టలేని ఆనందంతో గొంతు విప్పి మాట్లాడ బోయి, ‘మిత్రులారా, నా కామ్రేడ్స్, నాతోపాటు ఒక మధురస్వప్నాన్ని కంటున్న నేస్తాల్లారా,’ అంటూ మాట్లాడుతూ హఠాత్తుగా తట్టుకోలేని ఉద్వేగాల రాపిడికి నేలపై కూలిపోయాడు పి.వి. శివం.
స్టేజివైపు పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆయన మిత్రుడయిన డాక్టర్ ఒకాయన టెస్ట్ చేసి ప్రమాదం లేదు అని సర్టిఫై చేశారు. పి.వి. శివంని స్టేజిపై నుంచి కిందకి తీసుకొని వచ్చారు. ఆ తరువాత గంట సేపు పైగా బృందగానాలు, జానపద నాట్యాలు, పాటలు… ఆ హాలంతా గొప్ప ఆనందంతో వెలిగిపోతున్న దేవతల రాజ్యంలా ఉంది. సభ ముగిసింది.
ఒక్కొక్కరి దగ్గరికి నన్ను తీసుకువెళ్లి పరిచయం చేస్తున్నాడు పి.వి. శివం. ఈయన వాసుదేవరావు, మెడికల్ కాలేజి ప్రొఫెసర్, ఈయన లంక నారాయణ, గ్రంథాలయ ఉద్యమ నాయకుడు. అట్లా ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళ్లాడు. ఒక మనిషిని చూడగానే ఆగిపోయి, ‘రా రా,’ అంటూ నన్ను లాక్కొని వెళ్లాడు.
‘‘ఈయన పులుపుల సార్, నాలో జ్ఞానదీపాలని వెలిగించిన దేవుడు.’’
ఆ మనిషి కాస్త అపరిచితంగా గుర్తుపట్టనట్టుగా నా వైపు చూశాడు. ‘‘సర్, నేను వాళ్ల అబ్బాయిని, ఆయన చనిపోయి ఇరవై ఏళ్లు కావస్తోంది,’’ అన్నాడు.
ఆడిటోరియం నుంచి బయటపడ్డాక, ‘‘అట్లా పేవ్‌మెంట్ మీద నడుద్దాం,’’ అన్నాడు. ఈ మురికి పేవ్‌మెంట్ల మీద ఏంటి అని ముఖం చిట్లించుకున్నాను. ఈరోజు పి.వి. శివంది, అతను ఏమి అడిగినా కాదనకూడదు అనుకుంటూ అతని వెనక నడవటం మొదలు పెట్టాను. మాతో పాటు భాను, ఆమె కొడుకు.
లీలామహల్ సెంటర్ దగ్గరికి వచ్చినాక, ‘‘ఇక్కడ బజ్జీలు బాగుంటాయి తిందాం?’’ అన్నాడు. నూనె కారుతూ ఉన్న ఆ బజ్జీలు ముట్టుకునే సాహసం చేయలేదు నేను. కాస్త దూరం వెళ్లాక, ‘‘ఇక్కడ టీ బాగుంటుంది,’’ అని ఒకచోట ఆగాడు. వాళ్లు ముగ్గురు అమృత పానంలా ఆ టీని తాగుతున్నారు. పేవ్ మెంట్లపైన నడవటం కూడా ఎంతో బాగుంటుంది అన్నాడు పి.వి. శివం.
బ్రహ్మాండమైన వెలుగు, ఎటు చూసినా మానవ సమ్మేళనం, వాళ్లందరూ మనల్ని రాసుకోవటం, మన లోపల నుంచి వెళ్తున్నట్లుగా. మనం నడుస్తుంటే మన పాదాల కింద గత సంవత్సరాలు అన్నీ ఒక్కొక్క జ్ఞాపకాన్నే చెప్పుకుంటూ.
పదకొండు గంటలు దాటినాక, ‘‘ఏదైనా బారుకు తీసుకెళ్లు,’’ అన్నాడు ఆయన. రెండు మూడు పెగ్గుల తరువాత ఆయన ఒక పాటని ఎత్తుకున్నాడు, జానపద గీతం. ‘బండిరా పొగ బండిరా…’ అంటూ, బారు మెల్లగా ఖాళీ అవుతుంది. లోపల పదిమంది కూడా లేరు. భాను ఒడిలో పిల్లవాడు నిద్రపోతున్నాడు. భాను మెల్లగా గొంతు విప్పింది. ఉర్దూ పాట. గజల్‌లాంటిదే. చాలా దుఃఖం ఉందా పాటలో… గొప్ప సుఖం కూడా ఆ పాటలో ఉంది. ‘మరో పాట మరో పాట,’ అంటూ భాను తోటి పది పాటలు దాక పాడించుకున్నాడు. ఆ పాటల మాధుర్యంలో తడిచి పి.వి. శివం చలించిపోయాడు.
‘‘నా తల్లి, నాతో హైదరాబాద్ వచ్చెయ్ రా. నా బేకరీలో పని చేద్దువుగాని,’’ అన్నాడు. ఆ అమ్మాయి ‘సరే’ అంటూ తల ఊపింది.
నాకు చిర్రెత్తుకొచ్చింది. ఈ మనిషికి సెనిలిటీ వచ్చింది. ఎక్క డెక్కడి లంపెన్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడు అనుకొని ఒక్క సారిగా, ‘‘నీకు ఏమైనా మతిపోయిందా,’’ అని అరిచాను. ‘‘ఇలాంటి దాన్ని,’’ అని. నా అరుపులకు బారు అంతా ఉలిక్కిపడింది. భాను ముఖం తెల్లగా పాలిపోయింది.
పి.వి. శివం ముఖంలో ఎరుపు, కోపం. నా వైపు వేలు చూపించి, ‘‘ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రం దిస్ ప్లేస్,’’ అని అజ్ఞాపించాడు.
4
వేకువజామున ఐదుగంటలకు తిరిగి హైదరాబాదు ప్రయాణం అయ్యాము, భాను ఆయనను ప్రేమగా హగ్ చేసుకుంది. తను చేసిన ఖీర్ చిన్న బాక్సులో పెట్టి ఆయనకి ఇచ్చింది. ఒక చెక్కు ఆ అమ్మాయికి ఇచ్చినట్లు నాకు అనుమానం. మెరుపు కళ్లతో ఆ అమ్మాయి గుడ్‌బై చెప్తుండగా కారు ముందుకు కదిలింది.
సన్నగా వెలుగులు మొలుస్తున్న సమయానికి మేము సత్తెనపల్లి దాటాము. ఒక పల్లెటూరుని దాటుతుండగా, నడికారు మనిషి రోడ్ దాటుతూ కనిపించాడు, ‘‘జాగ్రత్త స్లో చేసుకో,’’ అన్నాడు పి.వి. శివం. ఆ మనిషి తాగి ఉన్నాడేమో తూలుతూ నడుస్తున్నాడు. హఠాత్తుగా మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. వేగంగా వస్తున్న కారును స్లో చేసి అతని పక్కన నుంచి వెళ్తుండగా అతను కారువైపు కదిలాడు. కారు బ్రేక్ వేశాను. కానీ అతను తూలి కారు బాయ్‌నెట్ తగిలి రోడ్ పై పడ్డాడు. సన్నటి మూలుగు. పి.వి. శివం అతని వైపు పరిగెత్తాడు. అతన్ని పైకి లేపి నుదుటిపై కారుతున్న రక్తంపై కర్చీపు పెట్టి అతన్ని రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు క్రిందకు తీసుకువెళ్లాడు.
రోడ్డు నిర్మానుష్యంగా వుంది. దూరంగా పొడవాటి యూకలిప్టస్ చెట్లు. ఆ చెట్లకు అవతల ఇరవైయో ముప్పయ్యో రేకుల షెడ్లు. ‘‘ఆ ఇళ్లలోని మనిషి అయ్యుం టాడు,’’ అన్నాడు పి.వి. శివం. రోడ్డు పని చేసే కార్మికుడై వుంటాడు అని కూడా అన్నాడు. 50 ఏళ్ల వయస్సుంటుంది అతనికి. అతని దగ్గర సారాయి వాసన గుప్పు మంటుంది.
‘‘వెళ్లిపోదాం ఎవరూ చూసినట్లు లేదు,’’ అన్నాను నేను. ‘‘మన తప్పేమీ లేదుకదా,’’ అని కూడా అన్నాను. పి.వి. శివం ఒప్పుకోలేదు. ‘‘ఏదైనా హాస్పిటల్‌లో చేర్చి వెళ్దాం,’’ అని పట్టుపట్టాడు. ఆ ఊరి పొలిమేర దాటినాక పిడుగురాళ్ల దగ్గరలో నర్సింగ్ హోవ్‌ు కనబడింది. పాతకాలపు బిల్డింగ్. ఆ మనిషిని అందులో చేర్చాము డాక్టరు లేడు. నర్సు ఒక్కతే వుంది. ‘‘ఇక వెళ్లాం పద,’’ అన్నాను. ‘‘లేదు నేను రాను. ఇక్కడే వుంటాను. డాక్టరు వచ్చేదాక, ఆ మనిషికి ఏమీ ప్రమాదం లేదు అని తెలిసేదాక కదిలేదు లేదు,’’ అన్నాడు పి.వి. శివం.
రెండు గంటల తరువాత డాక్టర్ వచ్చాడు. ఎక్స్-రే, స్కానింగ్ పరీక్షలు చకచకా జరిగిపోయాయి. అతనికింకా స్పృహ రాలేదు. సాయంత్రందాకా చూద్దామన్నాడు డాక్టర్. మందులు, సెలైన్ పెట్టాడా మనిషికి. ఆ మనిషి దగ్గరే చాలాసేపు కూర్చున్నాడు పి.వి. శివం. ఎండిపోయి ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ మనిషి శరీరంలో పెరిగిన గడ్డం, దువ్వని జుట్టు, శపించబడిన మనిషిలా వున్నాడు.
‘‘వీడా రెడ్డిగూడెంలో వుంటాడు తాగుబోతు వెధవ. వాడి ఇంట్లో వాళ్లను పిలిచి ఒక వెయ్యి పారేస్తే వాళ్లే ఊరుకుంటారు,’’ అంది నర్సు. పి.వి. శివం ఆమెకేసి కోపంగా చూశాడు.
12 గంటలకు డాక్టర్ మళ్లీ వచ్చాడు. ఆ డాక్టర్ కూడా పి.వి. శివంలాగా ఆదర్శాల కాలం మనిషి. పేషంట్స్ ఎవరూ లేరంటూ ఆ గదిలోనే పి.వి. శివంతో పాటు కూర్చున్నాడు. హెడ్ ఇంజరీల గురించి వాటి లక్షణాల గురించి ఒక పాఠంలా వివరిస్తున్నాడు. నాలుగు గంటలకు ఆ మనిషికి స్పృహ వచ్చింది. మూలుగుతూ అటు ఇటు కదిలాడు. డాక్టర్ మరి ఇంకేమీ పర్వాలేదు అన్నట్టుగా నిట్టూర్చాడు. స్పృహ వచ్చినాక ఆ మనిషి పెద్దగా కేకలు వేశాడు. ఎర్రనైన కళ్లు. ముఖమంతా కోపం.
‘‘ఈడే ఈ నా కొడుకే నన్ను కారుతో గుద్దింది,’’ అంటూ నావైపు చూస్తూ పెద్దగా అరిచాడు.
నేను అతని దగ్గరగా వెళ్లి అతని తలపై చెయ్యి వేసి, ‘‘హాస్పిటల్లో చేర్పించాను,’’ అన్నాను.
హఠాత్తుగా ఆ మనిషి రౌద్రమూర్తిలా అయి కాండ్రించి నా ముఖంపై ఊసి చెయ్యి పైకెత్తి నా గొంతువైపు చాచి, మహా కోపంతో నా చొక్కాని పట్టుకొని లాగాడు. నా చొక్కా పర్రుమంటూ చినిగింది. కొయ్యబారిపోయాను. భయంతో కోపంతో అక్కడి నుంచి బయటకు నడిచాను. నా వెనుకనే పి.వి. శివం కూడా నడిచాడు.
డాక్టర్‌కి థాంక్స్ చెప్పి హాస్పిటల్ బిల్లులన్నీ కట్టి వచ్చి కార్లో కూర్చున్నాడు పి.వి. శివం.
కారు స్టార్ట్ చేసినాక, ‘‘ఇదేదే భవిష్యసూచికలా వుంది కదా,’’ అన్నాడు పి.వి. శివం.
నా ముఖం ఇంకా అవమానంతో ఎర్రబడే వుంది.
చినుకు మాసపత్రిక, నవంబర్ 2016
బాగా విశ్లేషించారు
పాత్రల సంఘర్షణను తెరపై విపులంగా చిత్రించినట్లుగా ఉంది మీ వ్యాసం ధన్యవాదాలు.
బాగుంది రవీంద్రా.
మంచి విశ్లేషణ చేశావు. ముఖ్యంగా చంద్రశేఖర రావు గారి కథను ఎంపిక చేసుకుని సార్ ను మరొకసారి గుర్తుచేశావు . సార్ తో ముఖాముఖంగా పరిచయం ఉన్నవారెవరూ వారిని అంత త్వరగా మర్చిపోలేరు. సార్ కథల్లో సుందరం, మాలతి వంటి పాత్రలు లేనివి అతి తక్కువ. వాటిలో నువ్వు ఎంపిక చేసుకున్న “నేను – పి.శివం” ఒకటి అనుకుంటా. రెండు తరాల మధ్య అంతరాన్ని అత్యంత ఉత్కంఠతో చెప్పారు. సారు కథా సంపుటాలు నువ్వు చెప్పిన వాటికన్నా ముందు జీవని, లెనిన్ ప్లేస్, మాయలాంతరు సంపుటాలతో పాటు ఐదు హంసలు నవల కూడా వచ్చింది.
ధన్యవాదాలతో –
విశ్లేషణ బాగుంది. చంద్ర శేఖర రావు గారు లేని లోటు తెలుగు కథలో బాగా కనిపిస్తోంది