– కీ.శే. టి.ఎల్. కాంతారావు, ప్రముఖ సాహితీ విమర్శకుడు
(1980ల కాలంలో… ఆనాటి సమకాలీన సాహిత్య స్తబ్ధతలో ఒక సంచలనం ప్రముఖ సాహితీ విమర్శకుడు టి.ఎల్. కాంతారావు. ప్రగతిశీల వాదాన్ని అభిమానించడమే కాక, తన ముందు తరానికి చెందిన కవుల కృషిని ఆయన పునర్మూల్యాంకనం చేసిన తీరు వైవిధ్యంగా ఉండేది. గతంలో సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వివిధ ప్రసిద్ధ కవితా సంకలనాల్ని అలా పరిశీలిస్తూనే, తన సమకాలీన కవిత్వాన్ని విశ్లేషిస్తూ, దానితో పోల్చి చూపడం, గతానికీ వర్తమానానికీ వారధిగా నిలవడం – ఆ రోజుల్లో టి.ఎల్. చేస్తూ వచ్చిన విశిష్టకృషి. అలా రెంటాల గోపాలకృష్ణ కవిత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభిమానించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ – నిజామ్ వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రెంటాల రాయగా, తాను యుక్తవయసులో చదివి, స్ఫూర్తి పొందిన ‘సర్పయాగం’ కవితా సంపుటాన్ని అలాగే కొత్త తరానికి మరోసారి పరిచయం చేశారు. అప్పటికి అందుబాటులో లేనప్పటికీ, కష్టపడి సేకరించి మరీ దానిపై టి.ఎల్. కాంతారావు రాసిన కవితా విమర్శ వ్యాసం ఇది. అప్పట్లో ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక ఆదివారం అనుబంధంలో వారం వారం ఆయన నిర్వహించిన పాపులర్ సాహితీ విమర్శ కాలమ్ ‘కలాలు – సంకలనాలు’లో ఇది ప్రచురితమైంది. సాధారణంగా కనిపించే పత్రికల కాలమ్స్ కు భిన్నంగా, సీరియస్ సాహితీ పాఠకులు ప్రతి వారం ఇష్టంగా చదివేలా వచ్చిన ఆ కాలమ్‌లో భాగంగా, 1988 మార్చి 6వ తేదీ నాటి ‘ఆంధ్రప్రభ’లో ఇది ప్రచురితమైంది).
ప్రాచీనకాలం నుంచీ కవిత్వం ఎప్పుడూ ఉద్యమరూపంలోనే సాగింది. ఉద్యమం భావానికీ, రూపం శిల్పానికీ చెందినవని కొత్తగా చెప్పవలసిన పని లేదు. కనుక ఒక ప్రత్యేక కాలపరిధిలో వచ్చిన కవిత్వంలో వస్తు వైవిధ్యాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకొని కవిని అంచనా కట్టడం సరైన పద్ధతి కాదు. ఎందుకు ఇలా చెప్పవలసి వస్తోందంటే – అభ్యుదయ యుగాది నుంచీ వచ్చిన కవిత్వమంతా ఆకలికీ, ఆర్థికానికీ సంబంధించిన కవిత్వం కనుక ఆ ఆకలి తీరిపోగానే, ఆ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయిపోగానే ఆ కవిత్వం కూడా అయిపోతుందని చాలామంది జోస్యం చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు. అయితే, ఈ జోస్యం ఫలించదని వాళ్ళకూ తెలుసు. అది అభ్యుదయ కవిత్వమనే నిబద్ధ సాహిత్యం పట్ల వాళ్ళకున్న వ్యతిరేకతను ఈ రూపంలో బయటపెట్టడం మాత్రమే!
శ్రీశ్రీ తరువాత కవులే లేరా?
అభ్యుదయ సాహిత్యానికి జీవలక్షణాలైన వాటినన్నింటినీ ‘మహాప్రస్థాన’ గీతాల్లో శ్రీశ్రీ కవిత్వీకరించి ఉన్నాడు. ఏ సాహిత్య ఉద్యమానికైనా లక్ష్యంగానూ, లక్షణంగానూ మూలవిరాట్టు ఒకడు ఉంటాడు. అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి అలాంటి మూలవిరాట్టు – శ్రీశ్రీ. శ్రీశ్రీతో మొదలైన ఉద్యమం శ్రీశ్రీతో ఆగిపోలేదు. అట్లా అని అందరకూ తెలుసు. కానైతే విమర్శ వ్యాసాలు రాసేటప్పుడు శ్రీశ్రీ తరువాత ఏమీ లేనట్టుగా రాస్తారు. ఇట్లా రాయడంలో ఒక తిరకాసు ఉంది. వాళ్ళు అంతరాంతరాల్లో శ్రీశ్రీని అంగీకరించరు. బాహాటంగానే అంగీకరించకపోతే వారి అస్తిత్వమే ప్రశ్నార్థక మవుతుందని భయం.
శ్రీశ్రీ ‘మహాకవి’ అనే మాట తిరుగులేని సత్యమే! శ్రీశ్రీ తరువాత కవులే లేరనడం కూడా అంతటి తిరుగులేని అసత్యమే!! తరువాతి కవులు, అతని సమకాలంలోని కవులు… అతను చూపించిన మార్గంలో ప్రయాణించినా, ఎవరి వ్యక్తిత్వం వారిది. ప్రతిధ్వనులను ధ్వనులుగా గుర్తించం గదా? ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’ అన్నట్లుగానే – అభ్యుదయ కవితా కాలంలో కవిత్వ రహస్యం తెలిసిన కవులందరూ ఆ ఉద్యమానికి తోడ్పడినవాళ్ళే. అట్లాంటి కవులలో రెంటాల గోపాలకృష్ణ గారొకరు. ఆయన వెలువరించిన మొదటి కావ్యసంపుటి ‘సంఘర్షణ’. ఆ తరువాత వచ్చిన కవితా సంపుటి ‘సర్పయాగం’. ఇది 1957లో అచ్చుపడింది.
పౌరాణిక ప్రతీకల్లో రెంటాల కొత్త కోణం
ఈ కావ్యసంపుటి పేరు ‘సర్పయాగం’ అవటం వల్లనూ, దీంట్లో ఆయన ఉపయోగించిన కొన్ని పురాణ ప్రతీకల వల్లనూ స్పష్టం చెయ్యవలసిన అంశం ఒకటి ఉన్నది. ఆధునిక కవులపై ఉన్న సంప్రదాయ ప్రభావం బలీయమైనదని కొంతమంది చెబుతున్నారు. వారు అందుకు ఉపస్కారకంగా ఈ సంప్రదాయ ప్రతీకలను ఉదాహరిస్తున్నారు. ‘సర్పయాగం’ పౌరాణికమైన ప్రతీక. దీన్ని మనం ఇంకో కోణంలోంచి చూడాలి. ‘సర్పయాగం’ అనే తొలి ఖండికలో –
ఈ మహా యజ్ఞానికి ఆత్మ కర్త
సత్యం హోత
జ్ఞానం ఉద్గాత
చైతన్యం ఆయతనం
దయ, ధర్మం
క్రాంతి, శాంతి
ఋత్విక్కులు
భూదేవి మంటపం
ఆకాశం పాలవెల్లి
కాలం యూపస్తంభం
దరిద్రం యజ్ఞపశువు
ఆత్మ సంతాపం ఆజ్యం
త్యాగం హోమగుండం
-అంటూ అధ్వర్యులుగా పీడితుల్ని, తాడితుల్ని, కర్షకుల్ని, కార్మికుల్ని పేర్కొంటాడు. ఇక్కడ రెంటాల సంప్రదాయాన్ని ఏ దృష్టిలోంచి చూశాడు; అతని ప్రతీకలు ఏ మహదుద్దేశంతో ప్రయోగించబడినై అని ఆలోచించాలి. శ్రీశ్రీ దగ్గర నుంచి పేరుపొందిన పెద్ద కవులంతా సాహిత్య, సామాజిక సంప్రదాయాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నవారే. కాకపోతే, వారు తీసుకువచ్చిన తిరుగుబాటు జనామోదం పొంది, సంప్రదాయంగా పరిణమించి ఉండదు. పై పాదాల్లో రెంటాల ఉపయోగించిన వైదిక ప్రతీకలన్నీ వైదిక వ్యవస్థా విధ్వంసానికి ఉపయోగించినవే. కనుక వీటిని యాంటీ సింబల్స్ అన్నా తప్పు లేదు.
ఆ ఆశయం కోసమే…
ఆనాటి సర్పయాగం ఉద్దేశానికీ, ఈనాడు సర్పయాగం చేస్తానంటున్న రెంటాల వారి ఉద్దేశానికీ పోలికే లేదు. ఈనాటి సర్పాలు ఆర్థిక వ్యవస్థను, సంబంధాలను తమ గుప్పెట్లో పెట్టుకుని అసంఖ్యాక జనసందోహాన్ని చీకట్లోకి నెట్టేసినవాళ్ళు. వాళ్ళు దగ్ధమవుతున్న వెలుగులోంచి ఒక నూతన వ్యవస్థ పుడుతుంది. ఆ వ్యవస్థలో స్వార్థానికీ, ద్వేషానికీ, భేదానికీ స్థానం ఉండదు. అందుకనే నిరుపేద నుదుటి రాతను, అభాగ్యుని అరచేతి గీతను చెరిపేసే నవ్యగీతాన్ని రాస్తున్నానని రెంటాల వారు చెప్పారు. నుదుటి రాత, అరచేతి గీత ఒక వ్యవస్థలో మూఢత్వానికి నిదర్శనాలు. మూఢత్వం మూలంగా జడమైన జీవితంలోకి చైతన్యాన్ని ప్రసరింప చెయ్యటం అభ్యుదయ కవుల ఆశయం. కనుక వాళ్ళుపయోగించే ప్రతీకలు పౌరాణికమైనా, మరేమైనా – నూతన సంవిధానానికి, ఆశయానికి ఉపయోగపడటానికి మాత్రమేనని అంగీకరించాలి. సంప్రదాయం అంటే విశ్వాసంగా భావిస్తే – ఆ విశ్వాసాన్ని అపహాస్యం చెయ్యటానికో, ధ్వంసం చెయ్యటానికో ఉపయోగించే ప్రతీకను బట్టి సంప్రదాయకతను నిర్ణయించటం సాధ్యపడదు.
స్వేచ్ఛ అని అరిచే ఫ్యాక్టరీ కూతనై
ముష్కరుల శిరస్సులపై ఉల్కాపాతనై
దారిద్ర్యపు పక్షవాతానికి వాతనై
అబద్ధాలకోరు గుండెలో రంపపు కోతనై
వ్యర్థోపన్యాసాలిచ్చే
రాజకీయ వినాయకుల నోటికి మూతనై
ప్రజల నేతనై
నిరుపేదల దూతనై
శోకాబ్ధిలో ఈతనై
లంకా నిర్మూలనానికి సీతనై
భూ మాతనై
అన్న దాతనై
వస్తాను, వస్తాను
విజయాన్ని తెస్తాను
భాషాసారళ్యం సాధించారు!
ఈ పై కవిత్వ పాదాల్లో కూడా చాలా శబ్దాలు సంప్రదాయకమైనవే. అయితే, వీటిని కవి తన భావానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ప్రతిపదార్థం కాకుండా పూర్తిగా ఖండిక ఇచ్చే అనుభవం సామ్యవాద భావం. సామ్యవాద భావాన్ని వ్యాసరూపంలో చెప్పవచ్చు. దానికి కవిత్వపు తొడుగు ఎందుకు అని ప్రశ్నిస్తే – భారత, రామాయణాల్ని కథలుగా చెప్పవచ్చు, కానీ పద్యచట్రం దేనికి అని మరొకడు ప్రశ్నించవచ్చు.
రెంటాల ‘సర్పయాగం’లో సాధించింది భాషా సారళ్యం. కవిత్వ ప్రయోజనానికీ, కవిత్వ భాషకూ దగ్గర సంబంధం ఏర్పరిచాడు. కవిత్వాన్ని సామాన్యుడి దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఇదొక భాగం. రెంటాల మీద శ్రీశ్రీ ప్రభావం లేదా? అంటే ఉంది. అది ప్రత్యక్షం కాదు… పరోక్షం మాత్రమే! ఒక్కొక్కపుడు ఔచిత్యానికి దూరంగా శబ్దప్రయోగం చేస్తాడు రెంటాల. దానివల్ల ఆశించిన అర్థం ఒకటైతే, పాఠకుడికి విపరీతార్థ బోధ కలుగుతుంది. ఉదాహరణకు –
‘కడుపు కోసం నడిబజారులో సలాము కొట్టి
నృత్యం చేసే కన్నెపడుచు కాలిమువ్వనై’
ఇక్కడ ‘కడుపు’ అనే మాట కవి అర్థాన్ని బోధించదు. అట్లాగే కొన్ని సంప్రదాయ ప్రతీకలు పరిపూర్ణమైన అవగాహనకు దోహదం చెయ్యవు. ఏమైనా, రాష్ట్రోద్యమం దగ్గర్నుంచి, తెలంగాణా పోరాటం దగ్గర్నంచి, అభ్యుదయ కవిత్వాంశ అయిన విశ్వశాంతి వరకూ తన కవితా ప్రస్థానాన్ని సాగించినవాడు రెంటాల.
………………………….
Add comment