అభ్యుదయ కవిగా, శతాధిక గ్రంథకర్తగా, అనువాదకుడిగా, నాటక రచయితగా, జర్నలిస్టుగా శ్రీరెంటాల గోపాలకృష్ణ (1920-1995) తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు. పదహారో ఏట నుంచి డెబ్భై అయిదో ఏట కన్నుమూసే దాకా అరవై ఏళ్ళు నిరంతరాయంగా రెంటాల సాహితీ సేద్యం సాగించారు. అరుదైన ఆ అక్షర తపస్వి శత జయంతి జరపాలని ‘ ఛాయ’ సాహిత్య, సాంస్కృతిక సంస్థ, రెంటాల స్మరణోత్సవ సంఘం నిర్ణయించాయి. దాదాపు రెండు వందల పుస్తకాలు రచించిన శ్రీ రెంటాల గోపాలకృష్ణ సమగ్ర సాహిత్య జీవనకృషిని ఈ సందర్భంగా మరొక్కసారి స్మరించుకోవడానికి హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడాలో 2019 డిసెంబర్ 15, ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభ సభ జరగనుంది.
ప్రముఖ సాహిత్య విమర్శకుడు – ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కె. శ్రీనివాస్, కళాజీవి – ప్రతిష్ఠాత్మక ‘మా భూమి’ చిత్ర రూపకర్త బి. నరసింగ రావు, ప్రముఖ సాహిత్య – రాజకీయ విమర్శకుడు తెలకపల్లి రవి, ప్రముఖ కవి – కథకుడు అఫ్సర్, స్మరణోత్సవ సంఘం అధ్యక్షుడు – విమర్శకుడు కె.పి అశోక్ కుమార్, యువ విమర్శకుడు ఆదిత్య కొర్రపాటి సభలో ప్రసంగిస్తారు. అందరికీ సాదరపూర్వక ఆహ్వానం.
అభినందనలు!💐💐.సర్.
రెంటాల గోపాలకృష్ణ గురించి — డా||జయదేవ
‘ఎంత దూరమో, అంత దగ్గర!’
మా నాన్నగారి దగ్గర ర్యాక్‌ల నిండా వందల కొద్దీ పుస్తకాలు ఉండేవి.
కాళిదాసు నుంచి కార్ల్‌మార్క్స్ వరకు; బృహజ్జాతకం నుంచి బృహత్ స్తోత్ర రత్నాకరం దాకా; బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథలదాకా; ఇంకా సంగీతం, నృత్యం, నాటకం, జ్యోతిషం- తెలుగు, సంస్కృతం, ఇంగ్లిషు భాషలలోవి అరుదైనవి ఉండేవి.
నాకు ఊహ తెలిసే నాటికే నాన్నగారు – రెంటాల గోపాలకృష్ణ- పేరున్న రచయిత, జర్నలిస్టు. విజయవాడ సత్యనారాయణ పురంలో పురుషోత్తం వీథిలో అగిె్గపట్టె లాంటి అద్దింట్లో ఉండేవాళ్లం. నాన్నగారు కన్ను మూసే వరకు (ఆ ఇంట్లోనే, ఆ పుస్తకాల మధ్యనే) అరవై ఏళ్ల పాటు అలుపెరగక రచనా వ్యాసంగం సాగించారు.
కలం దించకుండా….
మేం ఎనిమిది మంది సంతానం. మా చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ల కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్నివేల పేజీలు రాశారో! 200 పుస్తకాలు లెక్క తేలతాయి. అందులో 150కి పైగా ప్రచురితాలే. పదహారో ఏట ‘రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలతో ఆయన రచనలు ప్రారంభించారు. అప్పుడే పార్వతీశ శతకం కూడా రాశారు. ‘నయాగరా’ (అనిసెట్టి పెళ్లికి మిత్రులు ఇచ్చిన కావ్య కానుక) కవులలో ఒకరైన నాటి నుంచి (మిగిలిన వారు బెల్లంకొండ, కుందుర్తి, ఏల్చూరి), ప్రభుత్వ నిషేధానికి గురైన ‘కల్పన’ కవితా సంకలనం సంపాదకత్వం రోజుల దాకా నాన్నగారి జీవిత మంతా కవిత్వం, రంగస్థలమే.
అయినా అలభ్యమే!
‘అమ్మా! ఉమా! రుమా! హిరోషిమా! విలపించకు…’ అంటూ హిరోషిమాపై బాంబు దాడి ఉదంతాన్ని వస్తువుగా తీసుకుని రాసిన కవిత అప్పట్లో ఎంతో మందిని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకుని 1952 ప్రాంతంలో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవితను ఆంగ్లంలోకి అనువదించి వినిపించారు. నాన్నగారు చివరి రోజుల్లో తన మూడో కవితా సంపుటి ‘శివధనువు’ ప్రచురించాలని ఎంతో తపిం చారు. భారమైనా ఆ సంపుటినీ, కొన్ని నాటకాలను మేమే ప్రచురించుకున్నాం. అభ్యుదయ కవిత్వంలో మైలురాయిగా నిలిచిన ‘సంఘర్షణ’, తెలంగాణ ప్రజా పోరాటం మీద దృష్టి పెట్టిన ‘సర్పయాగం’ కవితా సంపుటాలు. ‘శిక్ష’, ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’, ‘అంతా పెద్దలే’ వంటి నాటకాలు తొలి నాళ్లలో నాన్నగారికి గుర్తింపు తెచ్చాయి. 150 పుస్తకాలు అచ్చయినా సంస్కృత మూలంతో సహా తెనిగించిన ‘వాత్సాయన కామసూత్రాలు’ మినహా ఇప్పుడు మరేవీ లభ్యం కావడం లేదు.
ఆప్తమిత్రులు
నాన్నగారి ఆప్తమిత్రులనగానే అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యా రావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, గంగినేని వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య, చదలవాడ పిచ్చయ్య, ఉమా పబ్లిషర్స్ కాండూరి సుబ్రహ్మణ్యం, జయంతి పబ్లికేషన్స్ మువ్వల పెరుమాళ్లు వంటివారి పేర్లు ఠక్కున గుర్తుకొస్తాయి.
అభ్యుదయ రచయితల సంఘం తొలి రోజుల నుంచి, ప్రజా నాట్యమండలి ప్రభ వెలిగిపోతున్న కాలం వరకు; ప్రపంచ సాహిత్యం నుంచి అనువాదాల ప్రచురణ ఒక పరిశ్రమగా సాగిన కాలం వరకు వారంతా నాన్నగారి సహచరులు. మిక్కిలినేని, కె.వెంకటేశ్వరరావు, సుంకర కనకారావు, కోగంటి గోపాల కృష్ణయ్య, మోటూరి ఉదయం, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కేవీ రమణారెడ్డి, ఏటుకూరి, వీఆర్ బొమ్మారెడ్డి – ఒకరా ఇద్దరా ఆనాటి దిగ్గజాలంతా మా ఇంటికొచ్చినవారే.
బహుపాత్రాభినయం!
నేను కళ్లు తెరిచే సరికి ‘ఆంధ్రప్రభ’ సంపాదక వర్గం లో ఆయన ముఖ్యుడు. విలు వైన సంపాదకీయాలెన్నో రాసి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆరు దశాబ్దాల రచనా వ్యాసం గంలో నాలుగు దశాబ్దాల జీవితం పత్రికా రచనతోనే పెనవేసుకుని ఉంది. గుంటూరు నుంచి చల్లా జగన్నాథం సంపాదకత్వంలో వెలువడిన ‘దేశాభిమాని’తో పత్రికా రచయితగా ఆయన జీవితం ఆరం భమైంది. తరువాత వివిధ పత్రికలలో కొంత అనుభవం వచ్చిన తరువాత చదలవాడ పిచ్చయ్య ‘నవభారతి’ మాస పత్రికకు ఇన్‌చార్జ్ ఎడిటర్‌గా పనిచేశారు.
నీలంరాజు వెంకట శేషయ్య ఎడిటర్‌గా ఉన్న కాలంలో ఆంధ్రప్రభలో చేరి, 1980 వరకు వివిధ హోదాలలో బాధ్య తలు నిర్వర్తించారు. ఆయన సినిమా పేజీ ఎడిటరు. పొద్దున్నే గంభీరమైన సం పాదకీయం రాసిన నాన్నగారే, సాయంకాలం సినిమా వారి సభలో వాణిశ్రీ గురించీ ‘దసరాబుల్లోడు’లో ఆమెపై చిత్రీ కరించిన పాటలోని సొగసునీ చలోక్తులతో వివరించేవారు.
కలనేత
అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతీ మూలాల కలనేత మా నాన్నగారు. అరసం సభ్యునిగా కమ్యూనిజమే తారకమం త్రమని భావించినవారు. కాని విశ్వనాథ వారంటే గురుభావం. ‘నవభారతి’ పత్రిక కోసం వారింటికి వెళ్లి మధ్యాక్కరలు రాయించుకున్నారు. అనేకసార్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. కవిసమ్రాట్ అస్తమించినపుడు ‘ఆంధ్రప్రభ’లో ‘వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యు డు’ అన్న సంపాదకీయం రాశారు. శ్రీశ్రీ మానసికమైన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినపుడు విజయవాడలో ఆ గది దగ్గర కాపు ఉన్నది కూడా నాన్నగారే. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన ఇతర సిద్ధాంతాల వారి పట్ల వైమనస్యం సరికాదన్న విశాల దృక్పథం నాన్నగారిదని పిస్తుంది. అలాగే కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఆయన్ను చాలా మందిలాగే ఎంతో బాధించింది.
పాతతరం పెద్ద మనిషి నాన్నగారు. రావలసినంత గుర్తింపు రాలేదాయనకు. అమ్మ పర్వతవర్ధని ఆయనకు ఎప్పుడు గొప్ప అండ. కీర్తికాయంతో ఆయన చిరం జీవులై పదహారేళ్లవుతున్నా (జూలై 18, 1995) ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే మా అందరి గొంతులు పూడుకు పోతాయి. నా సోదరి (కల్పనా రెంటాల) మాటలే చెప్పాలని అనిపిస్తుంది –
‘నాన్నా, ఇవాల్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!’
– డాక్టర్ రెంటాల జయదేవ
” ఆర్య కథామాల ” by కె. చంద్రశేఖరన్, రెంటాల గోపాలకృష్ణ (అనువాదం )
https://archive.org/details/in.ernet.dli.2015.329517
ప్రాచీన భారత నాగరకతకు తేనగూడు లనదగు సంస్కృత పురాణాలలోని పదిహేను ఉత్తమ కధల రసపదనువాదాలు మీరు చదవవచ్చు. పవిత్రత, ధర్మనిరతి, త్యాగశీలం, భక్తి, పాతివ్రత్యం వంటి ఉదాత్త భారతీయాదర్శాలను యీ కధలు రమ్యంగా ప్రతిపాదిస్తున్నవి.
శ్రీ శుక్ర చరితం, కపోతోపాఖ్యానం, గురుభక్తి మహిమ ఆదిగాగల యీ కధలు ప్రపంచ సారస్వతం లో స్వదేశాలలో మానవులకు ఉదాత్తతామహనీయత లను గరపగల రసవత్కధలని ప్రశంసలు పొందినవి.
జాతీయభావోద్దీపితుడైన విద్వాంసుడు శ్రీ వి. కృష్ణస్వామి అయ్యర్ 1907 లో బహు పురాణాలలోని 41 గాధలను ఎన్ని ” ఆర్య చరిత్రం ” అనే సంపుటం గా ప్రకటించారు. అందులో ప్రజలకు ఎక్కువగా పరిచితములు కాని ఉత్తమ గాధలకు యధామూల సరళాను వాదాలివి.
ధన్యవాదాలు