రుతువులు అలిగాయని పువ్వులు రాలేదు!

వి నామాల రవీంద్రసూరి “అనాహత” కవిత్వసంపుటితో సుపరిచితుడు. కరోనా తాండవం చేస్తున్న సందర్భంలోంచి తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సంబరాలను యాజ్జేసుకుంటూ ఇప్పటి పరిస్థితికి విలపిస్తూ రేపటిపై బెంగపడుతూనే ఒక ఆశావాద దృక్పథాన్ని ప్రదర్శించిన  కవితే “అప్పట్లో చాలా బాగుండేది”.
*
అప్పట్లో చాలా  బావుండేది
~
పిస్తోలు బిళ్ళలు మోగకుండానే ..,
ఒంటిమీద కొత్త బట్టల వాసన తగలకుండానే ..,
పొటాస్  వాసన పీల్చకుండానే ..,
రోల్ రోకలి చప్పుడు చెవుల్లో ,
గిల్లుమని మారు మోగకుండానే 
పొద్దుగుంజాల బయలెల్లింది బతుకమ్మ ..
కట్టంతా కట్టుబొట్టులతో 
మా ఊరు అందంతో కళకళ లాడేది 
ఏవి ..?అప్పట్లో పూసిన పువ్వులు 
ఏవి ..? ఆ రోజుల్లో  కురిసిన నవ్వులు 
ఎక్కడ ఆ కాలం బతుకమ్మలు ..
ఒక్కేసి పువ్వేసి చందమామ 
ఒక్క జాము ఆయే చందమామ 
మా ఊరి డొంకలా పాట బాట సాగుతుండేది 
నీటి పై పూల బతుకమ్మ తేలుతూండేది
ఎత్తు బతకమ్మ ఎవరిదో అని 
చేమంతి పూలతో రాసిన పేరుకోసం
నిక్కి నిక్కి చూసిన చూపులేవి ..?
మబ్బు ముంచుకొస్తుండగా 
వాయనాల వర్షం వచ్చేది 
ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు అయ్యాక 
నాలుగో రోజు నానబియ్యం పంచదార కోసం తండ్లాట 
అందమైన చేయి చుట్టూ 
ఎన్ని చేతులు యుద్ధం చేసేవో ..?
కాలం మహిమేమో కానీ 
ఎంగిలి పూలు అట్ట ఎల్లిపోగానే 
పెద్ద బతుకమ్మ వచ్చినట్టనిపించేది 
రుతువులు అలిగాయని పువ్వులు రాలేదు 
పువ్వులు లేవని ఆడపడుచుల ముఖాల్లో నవ్వులు లేవు 
ఎక్కడెక్కడో విసిరేయబడ్డ బతుకులు 
బతుకమ్మ కైనా కలుస్తాయనుకుంటే 
ఎవరి పాణాన్నివాళ్ళు గుండెకిందుగా 
నెట్టేసుకుంటున్నారు …
నేడన్నీప్లాస్టిక్ నవ్వులు 
ఇప్పుడంతా కాగితం బతుకమ్మలే…
మనిషి బంధాలనుండి విడిపడి 
బందించుకుంటున్నాడు 
తన నుండి తననే 
దూరంగా పారేసుకుంటున్నాడు 
ఎవడి బతుకు వాడు బతుకుతుంటే 
ఎవడి మెతుకు వాడు తింటుంటే 
గాలికెగిరిన కాగితం బతుకమ్మలా
బతుకు రెపరెప లాడడం తప్ప .
తంగేడు పువ్వల్లె తనువు పులకరించేదెప్పుడు 
ఆకులో పువ్వోలె అందరం హాయి గుండేదెప్పుడు
పోయి రా బతుకమ్మ పోయి రా ..వమ్మ 
పోయి ..పోయిన ఆ  సంబరాలను తీసుకు రావమ్మా ..
*
వర్తమానాన్ని ఒప్పుకోకపోవడం, రాజీపడి జీవించడం, గడిచిన గంజి బతుకుల్లోని మెతుకుల్ని దేవులాడడం, గతాన్ని నెమరేసుకోవడం(నోస్టాల్జియా)- అందరికవుల్లాగే సూరి సుత అదే బాటలో తారసపడుతడు. కవి తన మనోవేగంపై ఆధారపడి ఎన్ని డొంకల్లో మలుపులు తీసుకున్నడో పరిశీలిస్తే మనిషి ఆధునిక జీవితంలోని గందరగోళం ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. కవి ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు? దేన్ని పునాది చేసుకుని తర్కించుకుంటున్నాడు? ఏం ఆశించి కొనసాగుతున్నాడు? అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇప్పుడు లేని భద్రమైన జీవితాన్ని ఊహించడం అనే ఇరుసు మీద కవిత మొత్తం తిరగాడుతుంటుంది. కొన్ని కీ పాయింట్స్ ఆధారంగా చేసుకుని కవితానిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.
1. పొద్దుగుంజాల బయలెల్లింది బతుకమ్మ
2. మాఊరి డొంకలా పాట బాట సాగుతుండేది
3. అందమైన చేయి చుట్టూ ఎన్ని చేతులు యుద్ధం చేసేవో..!
4. రుతువులు అలిగాయని పువ్వులు రాలేదు
5. ఎవరి ప్రాణాన్ని వాళ్ళు గుండె కిందుగా నెట్టేసుకుంటున్నారు
మొత్తంగా కోల్పోయిన బాల్యం నిట్టూర్పులతో మొదలైన నోస్టాల్జియా కరోనా pandemic situation ని కలుపుకుని గిరిగీసుకున్న బతుకు ఛట్రంలోంచి తొంగిచూస్తూ ఆశావాదం ఎజెండాను ఎత్తిపట్టి చూపించడం కనిపిస్తుంది.
*
మన స్మృతిపథంపై ముద్రించుకున్న గాఢమైన అనుభవాలు మనల్ని వెంటాడుతుంటాయి. బైటకొచ్చే ఏదో ఒక మార్గం కోసం ఎదురుచూస్తుంటాయి. తమ అస్తిత్వాన్ని తిరిగి నిలుపుకోవాలని తహతహలాడుతుంటాయి. సృజనాత్మక సాహిత్యం వాటిని నోస్టాల్జియాగా రికిర్డ్ చేస్తుంటుంది. ఆధునిక మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడిగా చెప్పబడుతున్న ‘విలియం జేమ్స్’ స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపులపై కొన్ని సిద్ధాంతాలు రూపొందించాడు. ఇతనే కార్యకరణవాదానికి(functionalism) మూలపురుషుడు. జేమ్స్ నిర్మాణాత్మకతపై దృష్టి కేంద్రీకరించి, మానసిక సంఘటనలను అతిచిన్న అంశాలకు విరమించుకుని బదులుగా ఒక సంఘటన యొక్క సంపూర్ణతను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తనపై పర్యావరణ ప్రభావాన్ని తీసుకున్నాడు. ఇక్కడ కవితలోని వస్తువు దీన్ని బలపరుస్తుంది. బతుకమ్మ పూలపండుగ. పర్యావరణానికి సన్నిహిత సంబంధం వున్న పండుగ. “రుతువులు అలిగాయని పువ్వులు రాలేదు” అనడంలోని కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకుంటే కవిత్వసారం ఒంటపడుతుంది. అసమతుల్య పర్యావరణ స్థితిగతుల్ని అంచనావేసుకోగలిగితేనే పురాగ అర్థమవుతుంది. Eco-friendly జీవితాచరణను కొనసాగిస్తేనే తంగేడు పువ్వల్లె తనువు పులకరిస్తది.
*

బండారి రాజ్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ధన్యవాదాలు బండారి భయ్యా… నిజంగా నా అక్షరాల వెనుక ఉన్న అంతరార్ధాన్ని సారాంగ లో చెప్పడం నాకు చాలా సంతోషం కలిగింది.. మరోసారి మీకు థాంక్యూ….

  • నిజంగా ఈ వ్యాఖ్యానం
    నీ కవిత లోని ఏవి తల్లీ నిరుడు పూసిన బతుకమ్మ వైభవం అని ప్రశ్నిస్తూనే, నాటి ఆప్యాయతలు, బతుకమ్మ ఇంటినుండి బయలు దేరింది మొదలు ఆసాంతం ఒక జీవన వైచిత్రిలో వచ్చిన మార్పు, నీ కవితను కళ్ళకు కట్టినట్లు అభివర్ణించిన తీరు అధ్వితీయంగా ఉంది.ఊరు అందం, డొంకలో పాడిన పాటలు వాయనాలు, ప్రకృతి పులకరించినట్లు కురిసే జల్లులు,పువ్వులు లేవని ఆడపడుచుల ముఖాల్లో లేని నవ్వులు, మారిన ప్లాస్టిక్ జీవితపు చిహ్నాలు. కవి ఆందోళన అర్థవంతమైన గతకాలపు సంప్రదాయ గుర్తులు కళ్ళముందే కరిగి పోతుంటే, దైన్యంగా కాగితపు బతుకమ్మ లా మారిన జీవితపు లోగుట్టు పై చింత పడినట్టున్నాడు.
    తన తపననంతా తంగేడు పూవల్లే తనువు పులకరించేడెపుడని. నిజంగా బతుకమ్మ పండుగలా మారిన మనిషి బతుకు బాట కన్పించింది. మిత్రుడు రాజకుమార్ బాహుబలి లాగా బతుకమ్మ లోగుట్టు సమీక్ష చేసాడు. కవికి, సమీక్షకునికి జీవన వైచిత్రి అధ్వి తీయంగా అభివర్ణించినందుకు ధన్యవాదములు.😍😂👏👌🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు