వాళ్లిధ్దరూ ఉన్నట్లుండి ఎదురు పడ్డట్టపుడు ఆమె అనుకుంది
ఇదేదో ఏప్రిల్ ప్రేమ రివిజన్ లా ఉందీ అని.
ఆమెకు తెలుసు
తన తప్పు
సముద్రమేమీ గుటకలు మింగదనీ తెలుసు
అపుడు బీచ్ లో ఇద్దరూ ఉన్నపుడు
సముద్రమంత తడీ అతని తన పెదవుల మధ్య ఉన్నదనీ స్పష్టంగా గుర్తు
అక్కడే బిగి కౌగిలిలో నేను నిజమయ్యానా అని ఉబ్బి తబ్బబయిన
అప్పటి మోహ స్వప్నం ఆమె కళ్ళలోకే కరిగిపోయింది
ఇప్పటి ఏప్రిల్ మొన్నే మళ్ళీ వెళ్ళిపోయింది
ఆమె కళ్ళు పశ్చాత్తాపపు తలుపులు
అతనిని చూసి వాటిని మూసేసుకోబోయింది
వాటిని అతను ప్రశ్నలతో తడుతూ ఉన్నాడు
అంత ప్రేమేంటి ఇంత అపరిచితమేంటి
ఇక్కడా అనుకుంటున్నాడు భారంగా
అతనా , లేక అతనితో ప్రేమ కవితా
దిగులేసినపుడు తెరిచిన పుస్తకంలోని వాక్యంలా
అలా తారసపడతావేమీ అని సుత్తి మెత్తగా ఆమె తిట్టుకుంటుంది
వేలి కొసతో వేలికొసే మీటాడతను అపుడు
ఏప్రిల్ వెళ్ళిపోయినా
ఆమెకు ఇపుడు ఊపిరాడదు
ఆమె అప్రయత్నంగా ప్రేమ రివిజన్ చేస్తూనే ఉంది
మిట్ట మధ్యాహ్నం ఒంటరి గదిలో అపుడు అతనలా దగ్గరకు వచ్చినపుడు
రాత్రి ఆకాశంలో రావల్సిన నక్షత్రాలన్నింటినీ
ముందే తన కళ్ళలోకి పోగు చేసుకుని ఉన్నాడని
గుర్తు చేసుకుంటుంది
కానీ కొన్ని ప్రేమకథలు నడిచిపోతాయి సాక్ష్యాలు లేకుండా
ఆమె ఆ భరోసాతో అతనిని కళ్ళెత్తి చూద్దామనుకుంటుంది
ఇఫ్పటి ఏప్రిల్ లో
అతనికి ఆమె పరిమళం ప్రేమ యాష్ ట్రేలా ఉందనీ తెలుస్తుంది.
అతనికి తెలియదు కానీ ఆమెకో చిట్కా తెలుసు
పక్కనే ఉన్న పూల గుత్తులు తెలుపువీ, ఎరుపువీ, పసుపువీ
వాటి రంగులు ఎంత అందంగా ఉంటాయో
ప్రేమంత బాధగాను ఉంటాయనీ
తమను చూసే వారి చూపు మనసులోని బాధను పంచుకుంటాయనీ తెలుసు.
ఆమె అతనని కాకుండా వాటినే తదేకంగా చూస్తుంటుంది
అతనేమో అమె పశ్చాత్తాపపు కళ్ళ తలుపులు బద్దలు కొడుతూ ఉంటాడు
ఆమె అతనికి చెప్పాలనుకుంటుంది
బాధ పంచుకునే అందమైన రంగుల పూలో, ప్రేమ పూలో, పూల ప్రేమలో
రెండో మూడో రోజులకు తప్పకుండా వాడిపోయి నిష్క్రమిస్తాయని
సాక్ష్యం లేని ప్రేమ
గుండెలో వాడిపోయి ఖాళీ అయిపోయినట్లుగా.
అతనేమో మూగగా చెబుతాడు
అయితేనేం
ప్రేమ మళ్ళీ రివిజన్ కు రాదా ఏమిటీ అని.
*
చిత్రం: సత్యా బిరుదరాజు
సాక్ష్యం లేని ప్రేమ గుండెలో వాడి ఎండిపోయిన ట్లుగా…