రియలిస్టిక్ సినిమా…… నేటి అవసరం

” సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా ఉపయోగించుకో గలిగిన ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉంది.” అన్న శ్రీశ్రీ మాటల లోని వాస్తవాన్ని తారుమారు చేస్తున్న తరుణమిది. కాశ్మీరీఫైల్స్, కేరళాస్టోరీ, నిన్నమొన్నవచ్చిన ఆదిపురుష్ లాంటి సినిమాలు నిజాన్ని మభ్యపెట్టి ఒక వర్గం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిభావంతంగా నిర్మించబడ్డాయి. మహాకవి శ్రీశ్రీ అంటే గిట్టని వర్గమే తమ రాజకీయ ప్రయోజనాల కోసం బలమైన సినీ సాంస్కృతిక మాధ్యమాన్ని తమ స్వప్రయోజనాలకోసం ప్రతిభావంతంగా వాడుకుంటోంది ఈ ఎన్నికల వేళ. అధిక శాతం నిరక్షరాస్యులున్న సోవియట్ రష్యాలో లెనిన్ ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రచారానికి గొప్పగా వాడుకుంది. మన దేశంలో కూడా ఇదే జరుగుతోంది. కాకపోతే ప్రజలకోసం కాకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు సాధించడం కొరకు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో శివలక్ష్మి రాసిన “రియలిస్టిక్ సినిమా” అనే పుస్తకం రావడం సందర్భోచితం. నేటి అవసరం కూడా……

ఈనాడు సినీ పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సినిమాల రాశి పెరిగింది కానీ వాసి తగ్గింది. ప్రజలను చైతన్య పరిచే సినిమాలు అడపాదడపా మాత్రమే వస్తున్నాయి.  వాటిని గుర్తించే ప్రేక్షకులూ పెద్దగా లేరు. సినిమా నిరక్షరాస్యతను పోగొట్టే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావడం నేటి అవసరం. ఈ సమయంలో శివలక్ష్మి పుస్తకం ప్రాసంగికతను సంతరించుకుంటుంది. ఇందులో మొత్తం 29 సినిమాల సమీక్షలు ఉన్నాయి. వీటిలో కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలు కూడా ఉన్నాయి.

సామ్యవాద వాస్తవిక సినిమాకు మూలపురుషుడు అయిన ఐసెన్ స్టీన్ తీసిన మూడు సినిమాల గురించి ముందుగా చెప్పుకోవాలి.  Strik, Battleship Potemkin, October (ప్రపంచాన్ని గడ గడలాడించిన ఆ పది రోజులు) అనేవి. ఈ సినిమాలలో ప్రజలే నాయకులు. వాస్తవిక సంఘటనలే కథావస్తువులు. నేను ఇక్కడ ప్రత్యేకంగా సినిమాకథలను చెప్పదలచుకోలేదు. ఎందుకంటే…… ప్రతి సినిమాను శివలక్ష్మి వివరించిన తీరు పాఠకులు స్వయంగా చదివి తీరాల్సిందే……. తద్వారా ఆయా సినిమాలను తప్పకుండా చూడాలనే ఉత్సాహం కలుగుతుంది. ముందు తరాల విప్లవ చరిత్ర, సమూహాల కథ, మాంటేజ్ తాకిడి అనే మూడు గొప్ప లక్షణాలను STRIKE అనే మూకీ సినిమాలో దర్శకుడు ఐసెన్స్టీన్ ఆవిష్కరించాడు అంటుంది రచయిత్రి. ఫ్రెంచ్ భాషలో మాంటేజ్ అంటే ఆకర్షణ అని అర్థం. రెండు విరుద్ధ సంఘటనల మధ్య ఘర్షణ సృష్టించి తాను చెప్పదలచుకున్న మూడో విషయాన్ని ప్రేక్షకులకు స్ఫురింపజేయడమే మాంటేజ్ తాకిడి. Battleship potemkin  సినిమా వేలాది శ్రమజీవుల సామూహిక గాథ. ప్రిన్స్ పోటీమ్కిన్ అనే యుద్ధనౌకలో ఆధిపత్య, నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా నావికులు చేసిన తిరుగుబాటును చిత్రించిన రాజకీయ చిత్రం. ఈ సినిమా చూస్తున్నప్పుడు రోహిత్ వేముల ప్రపంచాన్ని చేసిన డిమాండ్స్ గుర్తొస్తాయి అంటుంది శివలక్ష్మి. దాదాపు ఈ సినిమా తీసి వంద ఏండ్లు గడిచినా ఈనాటికీ అధికారుల అమానుషత్వం కొనసాగుతూనే ఉన్నది. అక్టోబర్ సినిమాలో లెనిన్ గ్రాడ్ వీధులు , వింటర్ ప్యాలెస్ , స్మాల్నీ కారిడార్లు , నెవెస్కీ స్క్వేర్ లో ప్రవాహం లాగా వస్తున్న ప్రజాసమూహాలను చీమల బారుల్లాగా చిత్రీకరించిన విధానం 1917 అక్టోబర్ విప్లవాన్ని కళ్లముందు ఉంచుతుంది. ఈ సినిమాలో దర్శకుడు మేధో మాంటేజ్ ని ఉపయోగించి దేవుడు – దేశం అనే భావనలు ప్రజలను అణగదొక్కి ఉంచుతూ విప్లవం గురించి ఆలోచించకుండా చేస్తున్నాయనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తాడు. దాదాపు వంద ఏండ్ల కిందటి సినిమా ఇది.

The Red Detachment of Women, The Dawns Here Are Quiet, the Cranes Are Flying, Sophie Scholl – the final days, Jenin – Jenin, Rome – Open City మొదలైనవి యుద్ధాన్ని చిత్రీకరించిన సినిమా సమీక్షలు.

1930 లో చైనా దక్షిణ భూభాగంలోని హూనాన్ ద్వీపంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా మహిళలను యుద్ధ యోధులుగా మలచిన చిత్రం The Red Detachment of Women. వ్యక్తిగత కసిని వర్గ కసిగా మార్చుకుని ఎర్ర సైన్యం నాయకత్వ స్థాయికి ఎదుగుతుంది ఈ సినిమాలోని నాయిక. అప్పటి చైనా సమాజంలోని స్త్రీల దయనీయ పరిస్థితులతో పాటు బానిస వ్యవస్థ నిర్మూలన, భూసంస్కరణలు, ప్రజల మెరుగైన జీవితాల కోసం వర్గపోరాటమే ధ్యేయంగా ఎర్రసైన్యం పనిచేస్తుంది. మంచి సినిమా  జీవితం పట్ల ఉన్న భయాలను తొలగించి ప్రేక్షకులకు భరోసాను ఇవ్వాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళలకు తమ వ్యక్తిగత బాధలు చిన్నవిగా అనిపిస్తాయి.

యుద్ధం ప్రజల జీవితాలను ముఖ్యంగా స్త్రీల జీవితాలలోని కలలను, సర్వస్వాన్ని ఎలా నాశనం చేస్తుందో The Dawns here are Quiet అనే సినిమా చెపుతుంది. ఐదుగురు రెడ్ ఆర్మీ మహిళా సైనికుల జీవితాలను వారి పోరాటాలను కళ్లముందు ఉంచుతుంది. The Cranes are flying రెండో ప్రపంచ యుద్ధం క్రూర స్వభావాన్ని రష్యా ప్రజల మానసిక వేదనను ప్రేక్షకుల కళ్ళముందు ఉంచుతుంది. యుద్ధానికి ముందు తియ్యని కలలతో, బంగారు భవిష్యత్తుకి ప్రణాళికలు వేస్తూ ఉత్సాహంగా కాలం గడిపే ప్రేమ జంటలో యుద్ధసమయంలో ప్రియుడు చనిపోవడంతో ( వెరోనికా) అమ్మాయి ఒంటరిదవుతుంది. యుద్ధం తరువాత ఉన్న వాస్తవ పరిస్థితులను జీర్ణించుకొని దృఢమైన వ్యక్తిత్వంతో బలమైన స్త్రీగా ఎదిగిన తీరు ఈసినిమా చూస్తున్న మహిళా ప్రేక్షకులకు బోలెడంత భరోసానిస్తుంది. కానీ ఇలాంటి సినిమాలు చూసే అవకాశం అందిపుచ్చుకోకుండా  మహిళలు TV సీరియళ్లకు బలైపోతున్నారు. లేదంటే గుళ్లు, గోపురాలు, పూజలు, వ్రతాలు, వివిధ పారాయణంతో పవిత్రులమవుతున్నామనే భ్రమలో ఉన్నారు.

సోఫీ స్కోల్ అనే 21 ఏండ్ల అమ్మాయి నాజీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచుతూ దొరికిపోయి Feb -22/ 1943 లో గిలిటిన్ మరణశిక్షకు గురైంది. విచారణలో స్థిరంగా ఆమె చేసిన రాజకీయ విశ్లేషణలు, సమాధానాలు నేటి యువతకు ఆదర్శం కావాలి. “మీ దేశానికి మద్దతు ఇవ్వడం మాత్రమే దేశభక్తి కాదు. దేశాధినేతలు ప్రజలకు హానిచేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు యువత తమ దేశ ప్రజల క్షేమం కోసం ఇది చాలా తప్పుడు నిర్ణయమని ప్రతిఘటించడం కూడా దేశభక్తే అని నిరూపిస్తుంది ఈ సినిమా. విశ్వవ్యాప్తంగా వర్తించే ప్రజాస్వామిక స్టేట్మెంట్ ఇది. సోషల్ మీడియా కేంద్రంగా ఒక రాజకీయ వర్గానికి మద్దతుగా జరుగుతున్న దేశభక్తి ప్రచారానికి ఈ సినిమా అడ్డుకట్ట.

“జెనిన్ జెనిన్” అనే డాక్యుమెంటరీ చిత్రం  పాలస్తీనాలోని జెనిన్ శరణార్థి శిబిరం మీద ఇజ్రాయెల్ సైన్యం చేసిన భయంకరమైన దాడిని చిత్రించింది. శతాబ్ద కాలంగా పాలస్తీనాలో చోటు చేసుకుంటున్న దౌర్జన్యాలను, మారణహోమాలను ప్రపంచానికి తెలియ చెప్పడానికి సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నారు అక్కడి దర్శక నిర్మాతలు.

Rome-open City సినిమాలో ఫాసిజం, విషాదం, ఇటాలియన్ నియో- రియలిజం పుట్టుకలున్నాయి అంటుంది శివలక్ష్మి. యుద్ధసమయాలలో ప్రజల జీవితాలలోని అనుభవాలు, అవరోధాలు, సర్దుకపోవడాలు, నిరసన ప్రతిఘటనలు ఈ సినిమాలో దృశ్యమానమవుతాయి.

“Your Name is Justine”, “Three Colors”, “Blue”, “Rashomon”, “Back to Yours Arms”, “The House”, “Changelling”- మొదలైన సినిమాలను రచయిత్రి మహిళల సమాంతర చిత్రాలుగా పేర్కొన్నది. Human Rights are Women Rights అన్నట్లుగా ఈ సినిమాలలో మానవ విలువలు, రక్తసంబంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, మానవ మనస్తత్వాలు తల్లీబిడ్డల, తండ్రీకూతుళ్ల ఆరాటాలు, తరాల అంతరాలు మొదలైన భావనలు చాలా సహజంగా చిత్రీకరించబడ్డాయి. వీటిల్లో స్త్రీల మీద జరిగే అన్యాయాలు, అణచివేతలూ ఉన్నాయి. Changeling అనే సినిమాలో పోలీసులు చూపించిన బాలుడు తప్పిపోయిన తన కొడుకు కాదనే నిజం చెప్పినందుకు మతిస్థిమితం లేని తల్లిగా నిర్ధారించి హింసకు గురిచేసినప్పుడు ప్రతి మాతృ హృదయం తల్లడిల్లి పోతుంది. ఎలాంటి సంఘటననైనా వ్యవస్థ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అందులో భాగంగా అమాయకులను నేరస్థులను చేస్తుంది. స్త్రీలు కష్టాలు ఎదురైనా అందులో కూరుకు పోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొని చాకచక్యంగా తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలని చెపుతుంది “My Name is Ki” అనే సినిమా.

అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి పూనుకొంటున్న కార్పొరేట్ శక్తులను ఎదిరిస్తూ అస్తిత్వ పోరాటం చేస్తున్న ఆదివాసీలు నిజమైన దేశభక్తులు. “Altiplano” చిత్రం పర్యావరణ విధ్వంసానికి పాలుపడుతున్న
శక్తుల వల్ల ఆదివాసీలు ఎంత మనోవేదనకు గురవుతూరో చర్చిస్తుంది.  Rashomon చిత్రాన్ని గురజాడ కన్యాశుల్కం నాటకంతో పోలుస్తుంది రచయిత్రి. సత్యజిత్ రే నిర్మించిన పథేర్ పాంచాలి సినిమాలోని ఇందిరా ఠాక్రూన్ పాత్ర మీద ప్రత్యేక వ్యాసం ఉంది. చునీబాలాదేవి ఈ పాత్రధారి. “నాకైతే ఆమె దేహంలోని లెక్కలేనన్ని ముడతల్లో స్త్రీజాతి తరతరాల అవస్థలన్నీ కనిపిస్తాయి. తన దయనీయమైన పరిస్థితి లోని విషాదాన్ని, వయసు వార్థక్యాన్ని తేలిగ్గా పక్కకి నెట్టేస్తుంది.” అంటూ ఆమె మీద తనకు ఉన్న ఇష్టాన్ని, ఆ పాత్ర గొప్పతనాన్ని చెప్తుంది శివలక్ష్మి.

“Dr. B. R. Ambedkar – untold Truth” అనే సినిమా అంబేడ్కర్ జీవితంలోని వాస్తవ సంఘటనలతో నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం. దర్శకుడు జబ్బార్ పటేల్ కళాత్మకంగా ఉన్నతమైన విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనిని చాలా భాషలలోనికి డబ్ చేశారు.

“Jashn – E – Azadi” అనే సినిమా కాశ్మీరీ విముక్తి పోరాటాలకు దిక్సూచి లాంటిది. ఇటీవల వచ్చిన “కాశ్మీరీఫైల్స్” సినిమా వచ్చిన సందర్భంలో సంజయ్ కాక్ నిర్మించిన ఈ సినిమాను ప్రజలు చూడగలిగితే వాస్తవాలు తెలియడమే కాకుండా ప్రత్యేకంగా ఒక వర్గం పనిగట్టుకొని అవాస్తవాలను తెరమీదకు తెచ్చిన విషయం ప్రజలకు అర్థమయ్యేది. ఇలాంటి సమాంతర సినిమాలను విశ్వవిద్యాలయాలు, ప్రజాసంస్థలు, మహిళాసంస్థలు ప్రదర్శిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది.

” ఒక శతాబ్దానికి ముందే అద్భుతమైన చిత్రాలను నిర్మించిన లబ్ధ ప్రతిష్టులైన ప్రపంచ రచయితల కథాకథన రైతుల్ని మన యువ రచయితలు అవగాహన చేసుకోవాలనీ అలాగే ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల నిర్మాణ శైలుల్ని యువ దర్శకులు అధ్యయనం చెయ్యాలనీ ఇప్పుడు సాధించినంత సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో “బ్యాటిల్ షిప్ పొటీమ్కిన్” లాంటి ప్రసిద్ధ చిత్రాల్లోని “ఒడెస్సా మెట్ల సీక్వెన్స్” లాంటి చిత్రీకరణలను మనవాళ్లు నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ వేదికలకు అవసరమైన సినిమా వ్యాకరణాలు, సినిమా ప్రమాణాలు యువ దర్శకులు నేర్చుకోవాలనీ పరిశీలించాలని నా కోరిక ” అని రచయిత్రి స్వయంగా చెప్పుకొంది. మన సినిమా పరిశ్రమ ప్రస్తుత వ్యాపార సంకెళ్లను తెంచుకొని, హీరోల కోసం కథలు రాయడం మానుకొని, ప్రజాసమూహాలను హీరోలను చేసే వాస్తవ సంఘటనలతో సినిమాలు నిర్మించడం నేటి మన సమాజానికి చాలా అవసరం. ఇందుకోసం చైతన్యం కలిగిన యువదర్శకులు ముందుకు వస్తారని ఆశిద్దాం.

రియలిస్టిక్ సినిమా వ్యాసాలు సరళమైన వాక్య నిర్మాణంతో సవివరంగా ఉన్నాయి. పాఠకులు వదిలిపెట్టకుండా ఒక్కసారిగా చదివేస్తారు. ఆ యా సినిమాల లింకులు వెతుక్కొని మరీ సినిమా చూసే ప్రయత్నం చేస్తారు.  సినిమా కథను వివరంగా వివరించింది శివలక్ష్మి. కథ చెప్పి సంతృప్తి పడలేదు. సినిమా ప్రత్యేకత, పాత్రచిత్రణ లాంటి అంశాలను విశ్లేషంచిన రచయిత్రి మరింత లోతుగా వెళ్లి అది ఏ భాషాచిత్రం? దాని దర్శక నిర్మాతలు, ప్రధాన పాత్రధారులైన నటీనటులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు, మొదలైన అన్ని అంశాలను చెప్పుకొచ్చింది. సినీ నిరక్షరాస్యతను పోగొట్టి, సినిమా దృక్కోణాన్ని సామాన్య ప్రేక్షకులకు అందించింది. ఏ సినిమా ఏ నవల ఆధారంగా నిర్మించబడింది? ఏ సినిమాలు ఏ వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించబడ్డాయి? లాంటి వివరాలు కూడా ఉన్నాయి. సందర్భానుసారంగా గ్రీకు సాహిత్య పరిచయం కనిపిస్తుంది. అనేక అంశాలతో పుస్తకాన్ని తీసుక రావడానికి శివలక్ష్మి చేసిన కృషి శ్లాఘనీయం.

*

గిరిజ పైడిమర్రి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది రివ్యూ. మారుతున్న కాలం తో పాటు కొత్త mediums ఉపయోగించుకోవడం ఎంతో అవసరం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు