రాష్ట్ర విభజనానంతరం బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. కడప రిమ్స్‌లో అప్పటి వరకు ఏ జర్మనీ నుంచో దిగుమతి చేసుకుంటున్న యాంటీ హీమోఫిలిక్ ఫాక్టర్ల స్థానంలోనే రిలయన్స్ వారి అమూల్య ఉత్పాదన సరఫరా మొదలైంది. ఈ ఐ.వి. ఫాక్టర్లు అవసరమైనవాళ్ళకు మొదట్లో మెడికల్ ఐసీయూలోనే ఎక్కించేవాళ్ళు. తర్వాత ఆ పనిని ఐ.పి. బ్లాక్ పక్కనే ఉన్న రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అప్పగించారు.
ఒకసారి నేను యథాప్రకారం ఎమ్. ఐసీయూలో ప్రిస్స్క్రిప్షన్ రాయించుకుని అక్కణ్నుంచి బ్లడ్ బ్యాంకుకు పోయి చూపించాక, అక్కడి సిస్టర్లలో ఒకామె ఫాక్టర్ వయల్స్ తెచ్చి తోటి సిస్టర్లతో చలాకీగా కబుర్లు చెప్తూ, నీడిల్‌తో నరం దొరికించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అదేమో రెండు మూడు సార్లు గుచ్చినా చిక్కిన దాఖలా కనబడలేదు. తానెంతో అలవోకగా చేసుకుపోవలసిన అంతోటి చిన్న పనికి అన్ని విఫల యత్నాలు చెయ్యాల్సిరావడం తన అనుభవానికి, వృత్తి నైపుణ్యానికి సవాలుగాను, తనకు అవమానంగాను భావించినట్లుంది.
“దబ్బలాలట్టాటి సూదులైతే ఏమో అనుకోవచ్చు. ఇంత సన్న సూదులు గూడా ఇట్ట సతాయిస్చే ఎట్టా?” అని, ఆ సూదిని పక్కన పెట్టి ఇంకో సూదితో ఇట్లా గుచ్చగానే అట్లా నీడిల్లో నుంచి ట్యూబులోకి రక్తం వచ్చేసింది. అంటే అంతసేపూ మొదటి సూదితో నరానికి సరిగానే గుచ్చుతున్నా రక్తం మాత్రం నీడిల్లోకి రావడం లేదు. లోపం ఆమె నైపుణ్యానిది కాదు, మొదట వాడిన సూదిది. అవి జగద్విఖ్యాత రిలయన్స్ వారి నీడిల్స్. వాటి మూలంగానే ఆ సిస్టర్లోని వృత్తినైపుణ్యంతోబాటు ఆమె వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం నాకు తెలిశాయి.
అదే ఎమ్. ఐసీయూలోనైతే ఆ ఒక్క పనికోసం రెండు చేతులమీదా నరం కనిపించిన చోటల్లా తూట్లు పొడిచిపారేసి, ఒకపక్క రక్తపాతాలై, వేసుకున్న బట్టల మీద, బెడ్ షీట్ మీద, నేల మీద చిందిన రక్తపు మరకల సాక్షిగా నరం కోసం గుచ్చిన సూదితో చర్మం కింద ఇంకా కెలుకుతూనే ఉండే అనుభవాలున్నాయి. ఒకే ఆసుపత్రిలో రెండు విభాగాల మధ్య ఎంత తేడా!
సరే, బ్లడ్ బ్యాంకులో పని ముగించుకుని, అక్కడి నుంచి బయలుదేరి, తిరిగి ఐ.పి. బ్లాకులోని మెడికల్ ఐసీయూలో అడుగుపెట్టి నేరుగా కౌంటర్ దగ్గరికి పోయి, వచ్చిన పని గురించి క్లుప్తంగా “ఫాక్టర్ 8” అని చెప్పి కేస్ షీటు, డైట్ షీటు టేబుల్ మీద పెట్టాను. సంతకం పెట్టి, అవి రెండూ ఆ కౌంటర్లో ఇచ్చేస్తే నా పనైపోతుంది. కౌంటర్లో ఉన్నామె వాటిని అందుకుంటూ చాలా క్యాజువల్ గా “వేయిచ్చుకున్నారా?” అని అడిగి, సమాధానం కోసం ఎదురుచూడకుండా “ఇక్కడ సంతకం పెట్టండి” అని కేస్ షీటులో ఒక పేజీ తెరిచి, పెన్నుతో గుర్తుపెట్టి తిరిగి నా దగ్గరికి జరిపింది.
అంతకుముందు కొన్నిసార్లు పైనేముందో చూడకుండానే గుడ్డిగా సంతకం పెట్టి ఇచ్చేసిన నేను ఆరోజు మాత్రం అసలు ఏమని సంతకం చేయించుకుంటున్నారో చూద్దామని చదివి, ఆశ్చర్యపోయాను. పేషెంటును నేనే కాబట్టి అక్కడ సంతకం పెడితే “నేను ఆస్పత్రి నుంచి అనుమతి లేకుండా పారిపోతున్నాను, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే నాదే పూర్తి బాధ్యత” అని అర్థం వచ్చేలా ఉంది.
“ఇదేందమ్మా, ఈడెందుకు బెట్టాల?” అని అడిగాను. ఆమె నిమ్మలంగా “డాక్టర్ మిమ్మల్ను డిశ్చార్జ్ చేసినారా?” అనడిగింది. “లే-దూ” అన్నాను. నేనసలు ఇన్-పేషెంటుగా చేరితేగదా డిశ్చార్జ్ కావడానికి? ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు. “అందుకే! అక్కడ సంతకం పెట్టండి.”
నేను, నాలాంటి మరికొందరు ఇట్లా రిమ్స్ ఎం.ఐసీయూ నుంచి బహిరంగంగా “పారిపోవడం” తరచూ జరిగేదే. అదట్లా పక్కనబెడితే, ఏదో మాటవరసకు సంతకం అంటారుగానీ నాలాంటోడు నిజంగా సంతకం పెట్టిస్తే అస్సలొప్పుకోరు. ఆ సంగత్తెలీక మొదటిసారి నిజంగానే సంతకం చేసిచ్చాను. ఆ సంతకం చదవబోయి, వీలుకాక తెల్లబోయి “నేన్జెయ్యమనింది సంతకం” అని చిరాకుపడిందొకావిడ. “అది సంతకమే” అని నేనూ స్పష్టంగానే చెప్పాను.
“ఇది యేమన్నా అర్తమైతందా? ఇట్టరాస్చే పేరెట్టా తెలిసేది?”
“అమ్మా, అది నా సంతకమే. పాస్‍పోర్టులోనూ పాన్ కార్డులోను కూడా నా సంతకం అట్లనే ఉంటాది. అసలు సంతకం ఉద్దేశమే అది (అర్థం కాకుండా ఉండడం కాదు. ఒకే పేరు, ఒకే చేతివ్రాత ఉన్నవాళ్ళ సంతకాలు కూడా ఒకేలా ఉండకపోవడం). నా పేరు మీకు అర్థమయ్యేటట్లు రాసిమ్మని చెప్పండి, రాసిస్తా. దానికి సంతకమని మాత్రం పేరుబెట్టద్దు” అని నా జేబులో ఉన్న కరెన్సీ నోట్లలో దువ్వూరి సుబ్బారావు సంతకమున్న నోట్లున్నాయేమో, “సంతకమంటే ఇదిగో చూడండి ఇట్లుంటాది” అని చూపిద్దామని మహా ఉబలాటపడ్డాను. సమయానికి దొరకలేదు. ఆయన ఇంగ్లీషు సంతకంలో ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా ఉండదు. ఒక గీత మాత్రముంటాదంతే.
నేను డాక్టర్ను కాదు. కానీ చేతిరాత విషయంలో ఏ డాక్టరూ నాకు సాటిరారు. నేను రాసే తెలుగు ఇంగ్లీషులాగ, ఇంగ్లీషు ఉర్దూలాగ ఉంటాయి. ఇక నేను రాసే హిందీ “హిందీ-చీనీ భాయ్ భాయ్” నినాదానికి సరికొత్త నిదర్శనంగా నిలుస్తుంది.
నా చేతిరాతను చదివి అర్థం చేసుకోవడం ఆమె విధినిర్వహణలో భాగం కావడం విధివిలాసం అని భావించి, ఆమెకు అర్థం కావడం కోసం విడి అక్షరాల్లో Trivikram అని పేర్రాసి, దాన్ని చదివి అర్థంచేసుకోవలసి వచ్చిన ఆవిడ ప్రారబ్ధానికి జాలిపడి, పక్కన బ్రాకెట్లో అదే పేరు ఇంకొకసారి బ్లాక్ లెటర్స్‌లో (TRIVIKRAM) అని రాసి ఇచ్చాను.
యథాప్రకారం “ఏం పేరూ…?” అని అడుగుతూ తీసుకుని చదవబోయింది. ‘అన్నిసార్లు రాసింది మీ ఇంటరాగేషన్లో నోరిప్పి చెప్పడానికా?’ అని నేను మెదలకుండా నిట్రాయిలా నిలబడ్డాను. కాసేపు దీక్షగా చూశాక ఆమే నోరువిప్పి “త్రివిక్రమ్!” అని విజయగర్వంతో ప్రకటించి, ఆ వెంటనే సీరియస్‍గా “డైరెక్టరా?” అని అడిగింది.
ఊహించని ప్రశ్నేమీ కాదుగానీ బొత్తిగా ఊహించని సందర్భం. రోజూ వేల సంఖ్యలో రోగులొచ్చే ఒక ప్రభుత్వాసుపత్రి(రిమ్స్)లో మెడికల్ ఐసీయూలో నిరంతరం చావుబతుకుల మధ్య పోరాటంలో వంటిమీద స్పృహలేకుండా పడి ఉండే రోగులు – దిగులుదిగులుగా, గుబులుగుబులుగా వాళ్లను అంటిపెట్టుకుని ఉండే అటెండెంట్లు; లేదంటే బాధ తట్టుకోలేక ఐసీయూ కప్పెగిరిపోయేటట్లు “ఓయమ్మ, ఓ నాయన” అని కేకలేసే పేషంట్లు – వాళ్ళను అనునయిస్తూనో గదమాయించి అంతకంటే గట్టిగా కేకలేస్తూనో ఉండే అటెండెంట్లు; పేషెంటెవరైనా చనిపోతేనో, ఇక లభంలేదని డాక్టరు చెప్తేనో, లేక ఎవరూ చెప్పకుండానే అర్థమైతేనో గొల్లుమని ఏడ్చే కుటుంబసభ్యుల మధ్య ఆమాత్రం సరసభాషణానికి చోటివ్వడం గొప్ప సంగతే.
ఏమనాలో వెంటనే తోచకపోయినా క్షణం తర్వాత తేరుకుని “నాది ఒరిజినల్ పేరండీ” అన్నాను. ఆమె చివుక్కున తలెత్తి “ఆయనదీ ఒరిజినలే” అనేసింది సీరియస్‌గా. నేనూ అంతే సీరియస్‌గా “ఆయన అసలుపేరు శ్రీనివాస్. నన్నడక్కుండా నా పేరు తీసకబొయ్యి కలం పేరుగా పెట్టుకున్నాడు” అని చెప్పేసి, అక్కడ నా పని (ఆమెకు అర్థమయ్యేటట్లు ‘సంతకం’ చేసి ఇవ్వడం) పూర్తయింది కాబట్టి వెనక్కి తిరిగి వాకిలి దాకా వచ్చేవరకు ఐసీయూ రిసెప్షన్ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది.
అప్పటిదాకా ఉగ్గబట్టుకునుందేమో నేను వాకిలిమీద చెయ్యేసి తెరుచుకుని బయటికి అడుగు పెట్టేటప్పుడు ఒక్కసారిగాఆమె ఉన్న కౌంటరు దగ్గర మొదలై, ఎమ్మైసీయూలో అన్నివైపులా అలలు అలలుగా ఆమె నవ్వు వ్యాపించింది. నేను అడుగు బయటికి పెట్టబోతూ ఆ అలజడికి తల వెనక్కి తిప్పి చూసేసరికి ఒక నవ్వుతెర నా మొహాన్నీ ఆక్రమించింది.
లోకంలో ఉన్న డాక్టర్లు, ఆస్పత్రుల్లోని ఇతర స్టాఫ్ అందరికీ ఆ మాత్రం సెన్సాఫ్ హ్యూమరుంటే వేరే చికిత్స, మందులు అవసరం లేకుండానే రోగాలు సగం తగ్గిపోతాయి. దానివల్ల ప్రైవేటు ఆస్పత్రులకు నష్టమేమో గానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే అందరికీ లాభమే.
_______________________
కథనం బాగుంది… మొత్తం మీద రచయిత వారికి, నుర్సులమ్మకు” ఎదో ఏదో ఐనది”…అన్నట్లు ఉందే