సైకలంటే..హ్యాండిలు, రెండు టైర్లు, రెండు టీపులు, రెండు రిమ్ములు, సీటు, బెల్లు, మటకారేకులు, స్టాండు, వాల్టీపు, క్యారీబాక్సు, లైటు, డైనమో కాదు. అది వచ్చువయితే మన గుండెకాయల్లో ఎట్ల నిలబడిపోతాది. సైకలంటే.. ఎమోషన్. ఆరోతరగతిలోంచే నాకు సైకలంటే పిచ్చి. కాలేజీకి పోయేవాళ్లు అట్లాసు సైకల్లో పోతాండిరి. ఆడిపిల్లోల్లు లేడీసు సైకల్లో పోతాండిరి. సైకలు కొనాల్ల ఎట్లయినా అనుకుండేవాణ్ణి. ఇంట్లో లెక్కలేకుంటే.. అడగాలంటే భయపడేవాణ్ణి. సైకలు లేదని తగ్గునాకొడుకుదిరా నాబతుకు అనుకుంటాంటి. కొత్త సైకలు కొనుక్కుంటే ఎవరైనా చూడటానికి పోతాంటి. దావుంటి పోతాన్యా చూచ్చాంటి. ఇనాక్క.. అట్లాంటి సైకలు నేనెప్పుడు కొనుక్కుంటానని బాధపడ్తాంటి. కొత్తసైకలోళ్లను సూచినాక కోపంగా, అసూయగా ఉంటాండ. మా ఇంటికాడికి ఎవరన్నా పని పడో, మా నాయినతో కోళ్లను హలాలు చేయిచ్చుకోవటానికి వచ్చినప్పుడో.. గుడ్డలోళ్లు వచ్చినప్పుడో సైకలు కత చూచ్చాంటి. బెరీన బయటికి పోయి బెల్లు కొడతాంటి. గట్టిగున్యా .. బెల్లు కొడితేనే మనసు నిమ్మళంగా ఉండేది. దానికుండే డైనమో టైరుకి తగుల్తాంటే ఎట్ల లైటొచ్చాదని చూచ్చాంటి. వాళ్లేమో బీగమేచ్చాండ్రి. అడగలేక.. మాయమ్మనో, మా నాయిన్నో అడుగుతాంటి. *ఏంటికి కిందపడ్తావు* అంటాండిరి. ఎనకల టైరు రెండు రిమ్ముల మధ్య ఉండే బీగానికి అయ్యి టక్కా టక్కా అని కొట్టుకుంటాంటే సంతోషపడ్తాంటి. *వాళ్లేమో.. బ్బీ.. రిమ్ములు పోతాయి* అంటాండిరి.
తొమ్మిదోతరగతి అయిపోయినాక ఎండలకాలం సెలవల్లో మా నాయిన సెకళు కొనక్కచ్చినాడు. అది మా ఊర్లోని బజ్జగాని సైకలు. అది సెకండాండు సైకలు. టైర్లు కొత్తగానే ఉండాయి. రిమ్ములమీద ఇనపచుక్కలు, మోగని బెల్లు ఉండె. మంచు బాగలేదు దాన్నిచూసినాక. అది ల్యాక గతిలేదు. సీటు ఎత్తుమీదున్యా సైకలుమీద పాణంతో *సరేలే.. ఏదోకటి* అనుకుంటిని. గోలుగుండ్లు, చిల్లాకట్టె, గానాట, కట్టాట, ఆశ్వి, క్రికెట్.. ఆటలు వద్దనుకోని సైకల్తోనే ఎక్కవ ఉంటాంటి. పద్దన్నే లేచి నీళ్లచెంబుతో సైకలు కాడికిపోయి మెత్త టవాలు బట్టతో తుడుచ్చాంటి. వారానికోసారి ఆదివారం పూట.. సైకలు రిమ్ముల మీదుండే ఇనపచుక్కలను గరుకుపట్టాతో గీకుతాంటి. చైనుకి కొబ్బరినూనె ఏసినాక పెడలును తిప్పుతాంటి. మటకారేకులు ఊగలాడతాంటే.. స్కూల్‌డైవరో, సోనర్లో పట్టుకోని బిగిచ్చుకుంటాంటి. ఆ టయంలో సైకలంటే రథంబండి కంటే ఎక్కవ. కార్లు, జీపులు .. నా సైకలు ముందర దిగదీయటానికే అనుకుంటాంటి. మా బజారులోని రసూలవ్వ ఇంటికాడికి పోవాలన్యా.. పక్కబజారుకు పోవాలన్నా సైకలు తీచ్చాంటి. గడ్డి, చీక్కట్టెలను ఎనకాల క్యారీలో కడతాంటి. రెండు బిందెలను తాడుతో కట్టి.. క్యారీబాక్స్ మింద నీళ్లు పట్టకచ్చాంటి. పోంగ పోంగ సైకలు మా ఇంట్లో మంచయింది. సైకలు బెల్లు మోగకోకుంటే బాధయితాంటి. ఏరే వాళ్లతో కాకుండా.. సొంతంగా పంచర్లు ఏయడం నేర్చుకున్యా. సొలీషను, పాత టీపు, సోనర్ల కిట్ గూట్లో పెట్టుకోని చిన్న మెకానిక్కు అయినా.
ఇంటరుకు సైకల్లో సిమాపల్లె కాలేజీకి పోబడ్తిని. ఆ కాలం మల్లరాదులే. సైకలుతో ఇడదీయలేని బంధం నాది. సైకలే జీవితంగా బతికిన రోజులుండాయి. ఆడిపిల్లోల్లందరూ లేడీసు సైకల్లలో ముందు పోతాంటే.. మేం అర్ధకిలోమీటరు దూరంగా ఎనకల పోతాంటిమి. క్రికెటు ఉన్యప్పుడు మా ఊరి బస్సుకంటే స్పీడుగా ఇంటికి వచ్చాంటిమి. కాలేజీకాడ నుంచి ఇంటికొచ్చాంటే.. దావలో జొన్న చేను కనబడితే తియ్య చెరుకులు తుంచుకుంటాంటిమి. చెనక్కాయలు కనపచ్చే.. కాల్చుకోని తిని మళ్లా సైకలు ఎక్కుతాంటిమి. సైకల్లోనే సిమాపల్లెంతా తిరుగుతాంటి. సిమాపల్లెల్లో సైకలు మెకానిక్కు మాబూఅన్నతో పరిచయం పెట్టుకున్యా. సిమాపల్లె బోసు మలిగలో సరుకులు కొంటే.. సైకలు మింద పెట్టుకోని.. తాళ్లతో కట్టి మా ఊరికి తీసకపోతాంటి. నా పనులన్నీ సైకలే చేసేది. నా బరువే కాదు నాకవసరమైనేటివి సైకలే మోసేది. అందుకే నాకు.. అంత పిచ్చి సైకలంటే.
వి. రామాంజలు రెడ్డి, ఎస్.రామాంజలు, జె. రామాంజలు, చెర్లోపల్లె మల్లిఖార్జున రెడ్డి, అంకేనిపల్లె శీనివాసులు నా ఇంటరు సావాసగాళ్లు. సిమాపల్లె కాడనుంచి ఇంటికి వచ్చేప్పుడు నా సైకలు చానామాట్లు పంచరయితాండ. టీపు పగిలినా, రిమ్ము సొట్టబోయినా, మట్కా రేకులు బెండొచ్చినా. నా వెంటనే ఉండి.. నాకు తోడుగా వి. రామాంజలు రెడ్డి ఉంటాండ. బెరబెరా పంచరేసి పదినిమిషాల్లో ఎనకల టైరయినా గబక్కని టైరు రిమ్మల్లోకి ఎక్కిచ్చాండ. కోళ్లు యాలబడి తెగులొచ్చి కొట్టుకుంటాంటే.. మా నాయినతో హలాలు చేయిచ్చటానికి సైకలు క్యారీబాక్సుమీదనో, హ్యాండిల్‌కో కోడిని కట్టేసుకుంటాంటి. సంచిలో ఈలకత్తి పెట్టుకోని హ్యాండిల్‌కు తగిలిచ్చుకోని పోతాంటి. ఫలానా తోటలో మా నాయిన టాక్టరు సేద్యం సేచ్చాంటే.. అట్లనే సేన్లోకే సైకల్లో అదరాబాదరా తొక్కకపోతాంటి. కోడి కోయిచ్చుకోని వచ్చాంటి. అట్ల.. సైకలు మా ఇంటిమంచి మాద్దిరి అయినాది.
ఇంటరు కాలేజీ సిమాపల్లెలో చదివినా. డిగ్రీ పులిందలకు పోయేప్పుడు నిడెల్లకాడ ఉండే కాశీనాయిన కాడ చెట్లకు ఆనిచ్చి బీగమేసుకోని పులిందలకు పోతాంటి. డిగ్రీ అయిపోయినాక.. ఒక రోజు పొద్దన్నే మా ఇంటికాడికి బజ్జగాడు వచ్చినాడు.
కాఫీ తాగుతానాడు. మా నాయినతో యవారాలు చేచ్చానాడు.
సైకలు స్టాండు తీసినాడు. *ఏంటికీ* అన్యా. *మీనాయినతో మాట్లాడినానుప్పా. అమ్మేతప్పుడే. నీ చదువు అయిపోయినాక నా సైకలు నాకు కావల్ల*ని చెప్పినా అన్యాడు. నాకు తెలకుండా మా నాయిన మాట్లాడుకున్య ఆ మాట నాకు బాధయినాది. ఏడుపొచ్చింది. *పోనీలే ఇంట్లో ఏంటికి అడ్డం. ఎనిమిది నూర్లకు కొన్యాం. ఐదు నూర్లకు కొండబోయినాడు. వాడి సైకలే లే* అన్యాడు మా నాయిన. నాకు మెదడు ఆగిపోయినాది. మాటలు రాల. మూగనాకొడుకు మాద్దిరయినా. బయటికి తీసకచ్చినాక బజ్జ *సైకలు బాగుందిప్పా. దెబ్ద తిన్ల* అన్యాడు. *చెప్పినా కదా*నేను అనె మా నాయిన.
నా సైకలు పోతాందని నాకు ఏడుపొచ్చింది. మంచంతా బాధయినాది. సీటు మీద కూచ్చోని బజ్జగాడు పెడలు తొక్కినాడు నగుతా.
బెల్లు కొట్నాడు. నా గుండె ఝల్లుమన్యాది.
నేను బజారు తిరుక్కోని వచ్చి.. బెల్లు కొట్నా. రెడ్డన్నకు చెప్పినా. పాలప్యాకిట్టు, పెరుగు ప్యాకిట్టు తీసుకోని ఇంటి దావపట్నా. మంచాగక మళ్లా ఎనక్కి చూసినా. ఆ అట్లాసు సైకలే నా సైకలు మాద్దిరి కనపన్యాది.
bagundi sir…
Thanks Satish
చాలా బాగుందన్నా. ఎంతో మంచిగా రాసినవ్. చిన్నప్పుడు సైకిలు యాదకొచ్చె. ఆరోజుల ఎంతో బొగుండేవన్న. అనవసరఝగా పెద్దయిపోతిమి..
Thankive so much . Golden days