మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
కూర్చునేందుకు కుర్చీలు లేవు.
ఎర్ర మట్టితో అలికిన నేలమీద బ్రతికే మేము
నునుపు బండల మీద కూర్చోవడం గౌరవం అనుకున్నాం.
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
చిరిగిన బ్యాగుల్లో
బ్రతుకును కుట్టించుకోవడానికి
అట్టలు లేని పుస్తకాల్ని మోసుకుంటూ పోతున్న మాకు
బడికెళ్లాడానికి కనీసం రోడ్లే లేవు
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
క్లాస్ అయ్యేదాకా ఉగ్గపట్టుకుని
ఒంటికొస్తే పోవడానికి టాయిలెట్లు లేవు
దాచుకున్న మూత్రం
రాళ్ళుగా అవతరిస్తుంది కడుపులో.
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
మద్యాహ్న భోజనంలో ఉడికీఉడకని అన్నం తిని
తాగేందుకు మంచినీళ్లు లేని స్కూలు మాది.
మోసుకొచ్చిన బ్యాగులో సగం బరువు నీళ్ళదే.
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
ఇంగ్షీషు టీచర్ లేకుండానే
పది ఎలా పాస్ అయ్యామో తెలీని
అమాయకత్వం మాది.
‘డిగ్రీ చదువుతున్నావు నాలుగు ఇంగ్లీషు ముక్కలు రావ’నే
వెక్కిరింతకు ఏమని సమాధానం చెప్పను
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
నా ఈడు పిల్లలంతా ఆడుకుంటుంటే
ఏడులో పెళ్లై
పదిహేడులో ఇద్దరి పిల్లలకు తల్లయి
బాల్యం కోల్పోయిన కథలూ ఉన్నాయి.
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ
పట్టు బట్టి పది చదివినా
ఊరు దాటలేదు మా చదువు
బాగా చదివినా ఇప్పుడు రావట్లేదంట కదా కొలువు?
ఐనా అక్షరాస్యత అంటే అ ఆ ఇ ఈ అని
ఇప్పుడిప్పుడే తెలిసింది.
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి
రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి.
*
Nice narration
మాకు రిజర్వేషన్లు ఉన్నాయి.మాకు రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి చాలా గొప్ప కవితా వాక్యం