రిగ్రెట్

1

నువ్వూ అదే అన్నాక
ఏదో లోపలిప్పుడు ఓ పేరు తెలియని భయం  మొదలౌతుంది..

ఎక్కడికైనా,
ఎవరూ నన్ను గమనించని చోటుకు  దూరంగా వెళ్లిపోవాలి అనిపిస్తుంది.

ఎంతకీ కావాల్సినంతగా నాకు నేను దొరకడం లేదని మెల్లగా అర్థమౌతోంది

బయటకి అడుగేయనివ్వని ఈ ఉక్కపోత మధ్యాహ్నాల్నీ,
నీ రెప్పల కింద కదలాడుతున్న ఆ ప్రశ్నల్ని చూస్తూ

ఆ సమయం సుదీర్ఘంగా అలాగే గడిపేస్తున్నాను.

ఎప్పటి నుంచి నేనిలా అనేది,
నీకు తెల్సని తెల్సినా

ఎవరి ముందరా ఏమీ బయటపడకుండా భరించడమే కదా!

ఇన్నాళ్లలో ఇవ్వడం పేరున నేర్చుకున్న అవ్యాజమైన ప్రేమ అంటే-

మిమ్మల్ని పలానా చోట చూశామని,
ఆరోజు ఈవెనింగ్ వాక్ లో ఒకరిద్దరు అన్నప్పటినుంచీ

రాత్రిళ్లు కలల్లో ఎవరో ముఖం  దాచుకున్న అపరిచితులు

అచ్చంగా నువ్వన్నట్లే, మీరు మారిపోయారూ అంటూ–

2

వైరి పక్షం

ఎదురౌతామనే ఆశతో దూరాల్ని మర్చిపోయి

ఒకరినొకరం  వెదుక్కుంటూ

నడిచిన దారులమీద ఇప్పుడు  కలగనే జ్ఞాపకాలు తప్ప,

అప్పుడూ అని చెప్పే తేదీలేవీ ఎంతకీ గుర్తు తెలియట్లేదు.

మెరిసే కళ్లలో మన సగం  నవ్వుల్ని

పదే పదే ఆరాధనగా వెలిగించుకోవడం తప్ప,

ఒక్కరోజైనా ఆగి,

ఇవీ అంటూ కలవరించడానికి

మన పేర్లు ఇటూ అటు మార్చుకున్న ఒక్క అద్భుతమూ జరగనేలేదు.

డియర్! ఒకరినొకరం  ధ్యానిస్తూ ఈక్షణం  దూరమైతే
తిరిగి ఎలా కలుసుకోవాలోనన్న తపనలో,
గుప్పిళ్లలో అప్పుడు చెప్పుకోవడానికి మనమేమి సంకేతాల్ని
రాసిపెట్టుకున్నామో,
చెమటతో తడిచిన ఈ చేతుల్లో
ఇప్పుడసలు గుర్తుగానైనా మిగిలి లేదు.

సగం  వసంతాలన్నీ కలల పరుగుల్లో మాయమైపోయాకా,

ఇక
ధైర్యంగా ముందడుగేస్తే తప్ప

ముందు జీవితం  లేదని తెలుసుకున్న ఇన్నేళ్ల తరువాతా…!

అరచేతులు
కలుపుకునేంత దగ్గరలో
ఇప్పుడెదురెదురుగా నిలబడితే, అదృష్టం చూశావా..!
నీ, నా గుప్పిళ్లలో ఎగురుతున్న ఈ జెండాలే వేరు వేరు.

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

సుపర్ణ మహి

అసలు పేరు మహేష్, ప్రొఫెషనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్. పుట్టింది, పెరిగిందీ ప్రకాశమ్ జిల్లా అద్దంకిలో. మధ్యలో ఆపేసిన చదువూ, మిత్రులూ, ఖాళీ సమయాల్లో కవిత్వమ్ చదవడానికీ, వ్రాయడానికీ కూడా కారణాలు.

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు కవితలు దేనికదే విభిన్న వ్యక్తీకరణ కలిగినవి,
    Too good expression mahi congrats

  • అభినందనలు మహీ. కవిత్వాన్ని తూచడమే కాదు, అనుభవించి పలవరించడమూ చాతకాదు నాకు. కానీ, రాసింది నువ్వు కదా!
    అది ఎప్పటికీ బాగుంటుంది.

  • చాలా బాగా రాశావు మహి , అభినందనలు

  • మరో సుతిమెత్తని అద్భుతం నీ నుండి.
    అభినందనలు మహీ !

  • “నవ్వుల్ని

    పదే పదే ఆరాధనగా వెలిగించుకోవడం” ఈ ప్రయోగం అద్భుతంగా పండింది మహీ!! మీ కవిత్వం చదవటం ఓ గొప్ప అనుభూతి

  • మహీ గారు, రిపీట్ వేల్యూ కవితలు, అభినందనలు!!

  • రెండు కవితలు బాగున్నాయి. అభినందనలు

  • బాగుంది రోజు రోజుకి మీ రచనా నైపుణ్యం కొత్త దారుల్లో పయనిస్తోంది.ఎప్పుడూ మీ రచన వసంతాన్ని కురిపిస్తుంది.

  • అచ్చంగా నువ్వన్నట్లే! మీరు మారిపోయారూ! మెరుసే కళ్లల్లో మనం సగం నవ్వుల్ని పదే పదే ఆరాధనగా వెలిగించుకోడం తప్పా..

    రెండుకవితలూ వేటికి వాటికవే బాగున్నాయ్ .విభిన్నం.అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు