రావిశాస్త్రి కథ “మొదటి నెల జీతం”

నలభైలనాటి మధ్యతరగతి ఆర్థికావసరాలని, ఆనాటి పరిస్థితులతోబాటు పేని ఒక హాస్యకోణంనుంచి ప్రదర్శించే ఈ కథానిక, ఆలోచించడానికి కూడా ప్రేరేపిస్తుంది.  

“జాస్మిన్” పేరుతో రావిశాస్త్రి గారు రాసిన కథ ఇది!

 

శ్చర్యం! ఈరోజుల్లో ప్రతి చిన్న పిల్లడూ స్కూల్‌ఫైనల్ పాసవుతున్నాడు. పన్నెండో యేటే ఇంటర్మీడియట్ చదువుతున్నవాళ్లున్నారు. పూర్వం పన్నెండేళ్ళ కొడుకులున్న పెద్దమనుష్యులు ఇంకా మెట్టెక్కలేకపోయేవారు. మొగవాళ్లేకాదు చిన్న చిన్న ఆడపిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. అధమం మెట్రిక్యులేషనైనా పాసవని పెళ్లికూతురు కనిపించదెక్కడా. గొప్పవాళ్లలో ఆ మాత్రం చదువులేని ఆడపిల్లకి పెళ్లి కానేకాదు.

ఇలాగ అతిసులభంగా అందరూ విద్యాపారంగతులవడం చూసి, జాతిలో తెలివితేటలు అభివృద్ధి చెందుతున్నాయని కొందరంటున్నారు. చాలామంది వొప్పుకుంటున్నారు. కాని రామయ్యని చూస్తే మనుష్యజాతియొక్క మేధాశక్తి నిజంగా పురోభివృద్ధి చెందుతోందని ఎవరూ అనుకోరు. రామయ్యకున్న తెలివెతేటలే ఆధారంగా తీసికుంటే మానవజాతి శిలాయుగందాటి ఏ రెండడుగులో, మహా అయితే మూడు తప్పటడుగులో వేసి ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది.

రామయ్యకి చదువు చెప్పిన మాస్టర్లంతా, అతనికి “తెలివి” అనే విలువైన వస్తువ భగవంతుడు ఏమరుపాటున ఇవ్వడం మర్చిపోయేడంటారు. అయితే జరిగినటువంటి ఈ పొరపాటుకి భగవంతుణ్ణి నిందించడానికి బదులు రామయ్యని చిన్నప్పట్నుంచీ ఇంట్లో పెద్దలూ, బడిలో పెద్దలూ అంతా నిందిచడం; తోచినప్పుడు తన్నడం కూడా జరిగించేవారు. ఈ నిందలూ, తన్నులూ భరించలేనప్పుడు తనని పుట్టించిన భగవంతుణ్ణి రామయ్య మాత్రం తిడుతూ ఉండేవాడు. అసాధారణ మేధాశక్తి ప్రసాదించనందుకు భగవంతుడతణ్ణి కఠీనపరీక్ష చేసి మెట్రిక్యులేషన్ పాస్ చేయించాడు. దేవుడిలా కఠినంగా పరీక్షించడంచేత రామయ్య మూడు సంవత్సరాలు స్కూలుఫైనల్ పరీక్షకి కూర్చొని మూడుసార్లూ తప్పేక మరి మూడు పర్యాయాలు మెట్రిక్యులేషన్ పరీక్షకి వెళ్ళి ఆఖరి సంవత్సరం కాని కృతకృత్యుడు కాలేకపోయేడు. తెలివితేటలివ్వడం మర్చిపోయిన విధాత రామయ్యకి ఓర్పూ పట్టుదలా కొంచెం హెచ్చు కోటా వేసి ఇచ్చేడు. “మొండిముండా కొడు కెలా గయితేనేం, సాధించేడయ్యా” అని అందరిచేతా మెప్పు పొందేడు రామయ్య.

గజనీమహమ్మదు భారతదేశంపైకి చాలా సార్లు దండెత్తేడట. రామయ్య కూడా ఏదో ఓ రకంగా దండయాత్రలు చెయ్యడంచేత అతణ్ణి గజనీతో సరిపోల్చుతారు కొంతమంది. సరిపోల్చడం సమంజసంగానే ఉంది. కాని ప్రతి దండయాత్రకీ రామయ్య పడ్డంత శ్రమపడవలసి వుంటే ఏ రెండుమూడుసార్లకన్నా గజనీమహమ్మదు భరతవర్షాన్ని బాధించి ఉండకపోవచ్చును. ఎన్ని శ్రమలైనా ఓర్చి పరీక్ష నెగ్గిన రామయ్య ఈ విషయంలో గజనీకన్న గట్టివాడనే చెప్పాలి.

పోలికలున్నప్పటికి, దండయాత్రల ఫలితాల్లో గజనీ మహమ్మదు విషయంలోనూ, రామయ్య విషయంలోనూ గొప్ప తేడా ఒకటున్నాది. సమరయాత్ర సాగించి గజనీమహమ్మదు కోట్లకొద్దీ ధనం కొల్లగొట్టుకుపోయేవాడు. రామయ్య కేసులో దండయాత్రలకయేది ఖర్చేకాని వచ్చే ఫలితం ఏమీ లేదు. ఒక్కొక్క యాత్ర చేసి గొప్పవాడయేడు మహమ్మద్ గజనీ; దండయాత్ర ఒక్కొక్కటీ చేసి బీదవాడయేడు రామయ్య.

అసలు డబ్బు విషయంలో రామయ్య ఎప్పుడూ గొప్పవాడు కాడు. ఎప్పుడూ బీదవాడయిన రామయ్యని దూరదూరంలో వున్న దరిద్రదేవత మెట్రిక్యులేషన్ పాసయేసరికి అమాంతంగా దగ్గరకొచ్చి కౌగలించుకుంది. ధనలక్ష్మి గాజుల గలగలారావమైనా ఎక్కడా వినిపించలేదు.

పరీక్ష పాసయేసరికి రామయ్య వయసు ప్రపంచంలో అందరితోబాటు ముదిరింది. అయితే సర్వీస్ కమిషన్‌కి కూర్చోడానికి ఇంకా టైముంది కూర్చోమని కొంతమంది సలహా ఇచ్చేరు. పరీక్షక్కూర్చుంటే మరింక పైకి ఎన్నటికీ తేలడని రామయ్యని బాగా ఎరిగినవాళ్లంతా తేల్చేరు.

“అయితే గుండె దిట్టం చేసుకుని మిల్ట్రీలో చేర్రా అబ్బాయీ, అన్నివిధాలా బావుంటుంది” అని వొహతనన్నాడు.

అవి యుద్ధపు రోజులు. రామయ్యలాంటి వాళ్లకి కూడా సైన్యంలో ప్రవేశం ఉండే రోజులవి. “ఈ సమయంలోనే వీడికి నాలుగు రాళ్లు సంపాదించ్డాని కవకాశం” అనుకున్నాడు రామయ్య తండ్రి. ఇంట్లో పెద్దలంతా సరేనంటే సరేనన్నారు. రామయ్య పెద్దల ఆశీర్వచనాలతో మిలిటరీ జీవితానికి ప్రయాణం కట్టేడు.

ఇంట్లో ఉన్న పెద్దలంతా ఏడుగురు. 1. తల్లి. 2. తండ్రి. 3. నాయనమ్మ. 4. పూర్వం సువాసనతో ఉండే అక్క. 5. ప్రస్తుతం సువాసనతో ఉండే అక్క. 6. పెద్దన్న. 7. చిన్నన్న. రామయ్య భారతసేనాబలానికి తన బలం చేర్చడానికి వెళ్లిన మర్నాడు రాత్రి భోజనా లయేక, వాకిట్లో, వెన్నెల్లో, కుక్కిమంచాలు వేసుక్కూర్చుని, పడుక్కుని, చేర్లబడి రామయ్య భావి ధనలాభం గురించి మాట్లాడుకుంటున్నారు. ధనలాభం గురించి మాట్లాడేటప్పుడుండే సహజమైన ఉత్సాహం ప్రస్తుతపు సంభాషణలో హెచ్చుగా ఉన్నాది.

“తిండీ బట్టా పోను నెలకీ అరవైరూపాయలిస్తారండీ వీడికి. బోలెడంత సొమ్ము! అందులోనూ మన రామిగాడి తెలివితేటలు చూసి. భగవంతుడి దయవల్ల ఏదో నాలుగురాళ్లు సంపాదించుకుని బైటపడితే, ఆ మీదట మళ్లీ ఉద్యోగం గవర్నమెంటు వాళ్లే వెదికి ఇప్పిస్తారట” అన్నాడు తండ్రి.

“అయితే జీతం అందగానే ఏమైనా ఇంటికి పమ్మించమని చెప్పేవా?” అనడిగింది నాయనమ్మ.

“చెప్పనూ, మొదటి నెల జీతం ఎలాగైనా పంపాలని గట్టిగా చెప్పేను. అటు తరవాత నెలల్లో కావాల్సొస్తే వాడి కవుసరం అయే దుంచుకుని మిగతాది పంపొచ్చునని కూడా అన్నాను. వాడికి మాత్రం తెలియదా ఏమితి, ఇక్కడ బోలెడు ఖర్చులున్నాయని”

“పాపం చదువులో అంటే ఆట్టే అదృష్టం లేకపోయింది కాని మిగతా విషయాలన్నీ వాడికి తెలుసునమ్మా” అన్నది తల్లి కొడుకు సుగుణాలు స్మరణకి తెచ్చుకుని.

“అయితే వచ్చే నెల అరవై రూపాయ లందు తాయన్న మాట మనకి” అంది పునిస్త్రీ అక్క.

“అందుతే సొమ్ముకి తగ్గ ఖర్చులేదూ? అరవై రూపాయలన్నమాటేమిటి, అరవై వేల రూపాయల ఖర్చుందనుకో” అన్నాడు తండ్రి, కూతురికేమీ అందులో భాగం అందదన్న భావం స్ఫురించేలాగ.

“ఎల్లుండి దీపావళికి మీ అల్లుడు కూడా వస్తారు కాబోలు. అన్ని ఖర్చుల్లోనూ ఇదో ఖర్చు” అన్నాది పునిస్త్రీ అక్క గడుసుగా.

ఇంతసేపూ పరధ్యానంగా ఉన్న చిన్నన్న హఠాత్తుగా అన్నాడు: “అయ్యో బావని రమ్మని రాసిన ఉత్తరం పోస్టు చెయ్యడం మర్చిపోయేను. రేపు వేస్తే టైముకి అందుతుందో అందదో”

పునిస్త్రీ అక్క దీపావళినాడు పొందవలసిన దాంపత్యానుభవాలు దూరంగా పోయేయని బాధపడ్డాది మనసులో.

“టైము కందుతే పండుక్కి బా వొస్తారని భయపడ్డావు కబోలు” అన్నాది కోపంతో.

“బావ రాకపోయినా పంచెలచాపు కొని పంపిస్తాంలే” అన్నాడు పెద్దన్న.

“నువ్వు మహా కొనీసేవు, ఆయన కట్టుకున్నారు. నాకో చీరగుడ్డైనా కొనివ్వలేక పోయేవు నువ్వింతవరకూ. ఏమైనా ఇస్తే ఆ రామిగాడే ఇంకా ఇవ్వాలి”

“ఈ నెల రామిగాడి జీతంలో ఏమీ కొనడానికి వీలుండ”దన్నాడు తండ్రి. ఈ వాక్యంతో సంభాషణలో కొంత వేడి తగ్గిన ట్టయింది. అణా అరువు పెట్టి తెచ్చిన చుట్టల్లో ఒకటి తీసి అంటించేడు తండ్రి.

“ఏం కొన్నా కొనకపోయినా వాడిది తాకట్టు పెట్టిన వెండిగిన్నె విడిపించకపోతే వీల్లేదండీ” అన్నాది తల్లి.

“చూద్దాం” అన్నాడు తండ్రి.

“అన్నట్టు కరణం దగ్గి రవేళ రూపాయి బదులు తెచ్చేను. ఇంకా ఇవ్వలేదే” అన్నాది పూర్వ సువాసిని. “ఆయనేం ఇమ్మనలేదుగాని, నే నవేళ తెస్తే పాలమనిషి కిచ్చేవు”

“ఏ పాలమనిషి?

“మన పాలమనిషి”

“నాకు జ్ఞాపకం లేదు స్మా”

“నువ్వు మర్చిపోతే కరణం మర్చిపోతాట్టే”

“కరణం అంటే జ్ఞాపకం ఒచ్చింది. వాడి తల్లి మొన్నే కాశీ వెళ్ళొచ్చిందిరా” అన్నాది నాయనమ్మ.

“డబ్బుంటే ఏ గంగలో కలవడానికైనా వెళ్ళొచ్చు”నన్నాడు పెద్దన్న.

“రామిగాడు సొమ్ము పంపిస్తే సింహాచలమైనా వెళ్ళిరావా”లన్నాది నాయనమ్మ.

“అక్కడంతా మిలిటరీవాళ్లున్నారు. ఇప్పుడు వెళ్లడం మంచిది కాదు”

“ముసలిముండని నన్నేం చేస్తార్రా వాళ్ళూ”

“నువ్వొక్కత్తెవే వెళ్తావా ఏమిటి, నేను మాత్రం రానూ” అన్నాది భర్తృవియోగిని.

“అన్నట్టు సింహాచలంలో చంటివాడికి పుట్టుజుత్తులు తీయించాలి” అన్నాది పునిస్త్రీ అక్క.

“ఏడాది నిండలేదు కదూ వాడికి. ఇంకా చాలా టైముంది. తీయించడానికి” అన్నారొకరు.

“పుట్టుజుత్తులు పోతే పోయిరి. నాకో గుడ్డముక్కైనా కొనివ్వవుట్రా” అని నాయనమ్మ మనుమడి తండ్రి నడిగింది.

పూర్వ సువాసిని అందుకుంది. “రెండేళ్ల క్రిందట కామోసు నాకీ సైనుపంచ కొన్నారు. ఎలా పేలిక లయిపోతోందో చూడు.”

“మీరేం కట్టుకున్నా ఎవడూ అడిగేవాడుండడు. నా చీరెలా ఉందో చూడండి అలుగ్గుడ్డలాగ” అంటూ వెన్నెల వెలుగులో చీరని సభాసదులకి చూపించింది పునిస్త్రీ అక్క.

“నీకేమే నెలకో చీర కొంటూనే ఉంటాడు నీ మొగుడు చక్కా. నాకెవడిస్తాడు. ఆ రామిగాడేమైనా కొంటే కట్టుకోవాలి. లేకపోతే ఇహ నిలా ఉండవలసిందే” అని భర్తృవిహీనురాలు ముందుకి వస్త్రవిహీనురాలుగా కూడా ఉండవలసి వస్తుందని వాపోయింది.

“ఫస్టు తారీకు రానీయండి. అన్నీ చూసుకుందాం” అన్నాడు తండ్రి కళ్లు మూసుకు పడుక్కుంటూ.

ఫస్టు తారీకు రాకుండానే విశాఖపట్నం నుంచి రామయ్య ఉత్తరం రాసేడు.

“ఇక్కడ మెడికల్ పరీక్ష చేసి నేను మిలిటరీకి పనికిరా ననీసేరు. అందుచేత ఈ వూళ్ళోనే వేరే ఏమైనా చూసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గిర దమ్మిడీ లేదు. ఈ ఉత్తరమే టెలిగ్రాంగా భావించి నాకు వెంటనే అధమం పాతిక రూపాయీలైనా పంపగోరుతున్నాను”.

ఆవేళ పొరుగింటివాళ్లతో నాయనమ్మ చెప్పింది.

“మా మనవడికి అక్కడేదో పరీక్ష చేసేరుటమ్మా. అదేం కర్మమో. పరీక్షల్లో ఎప్పుడూ వాడు తప్పడమే. నష్టజాతకానికి మనవేం చేస్తాం”

 

(ఆంధ్రపత్రిక 28 డిసెంబర్ 1949 సంచికలో మొదటిసారి ప్రచురితం)

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు